ఖండవల్లి లక్ష్మీరంజనం (Khandavalli Lakshmiranjanam)

Share
పేరు (ఆంగ్లం)Khandavalli Lakshmiranjanam
పేరు (తెలుగు)ఖండవల్లి లక్ష్మీరంజనం
కలం పేరు
తల్లిపేరుసీతమ్మ
తండ్రి పేరుసూర్యనారాయణ
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ3/1/1908
మరణం6/18/1986
పుట్టిన ఊరుతూర్పు గోదావరి జిల్లా పెదపూడి గ్రామం
విద్యార్హతలుతెలుగు, సంస్కృతాలలో ఎం.ఎ. పరీక్షలో మద్రాసు ప్రెసిడెన్సీలో సర్వ ప్రథములుగా ఉత్తీర్ణులయ్యారు.
వృత్తిఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అధ్యాపకులు
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం, ప్రాచీన
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము, ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి పుస్తకం ని సోదరుడు ఖండవల్లి బాలేందు శేఖరం తో కలసి తెలుగులోను మరియు ఇంగ్లీషులోను రచించిన అమూల్యమైన గ్రంథం.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలువీరి కాలంలో తెలుగు శాఖ బాగా అభివృద్ధి చెంది, తెలుగు ఎం.ఎ. చదివే విద్యార్ధుల సంఖ్య పెరిగి, 1952 నుండి తెలుగులో పి.హెచ్.డి. పట్టాలకు పరిశోధన ప్రారంభమైంది. వీరు ఆంధ్ర మహాభారతం పరిశోధన ప్రతిని ఎనిమిది సంపుటాలుగా తెలుగు శాఖ పక్షాన ప్రకటించారు. తన ఇంటిలోనే వేదపాఠశాలను 1980లో స్థాపించి సర్వ వర్ణాల వారికి తానే వేదాన్ని బోధించరు. ఆంధ్ర రచయితల సంఘానికి 1957లో అధ్యక్షులై అనేక గ్రంథాలను ముద్రించారు. వీరు ఇంగ్లీషు, తెలుగు భాషలలో శరవేగంగా రాసేవారు. మద్రాసు మెయిల్, దక్కన్ క్రానికల్, భారతి, కృష్ణా, స్రవంతి మొదలైన పత్రికలలో అనేకమైన వ్యాసాలు ప్రకటించారు. కొమర్రాజు లక్ష్మణరావు గారి విజ్ఞాన సర్వస్వం ముద్రించడంలో వీరు విశిష్టమైన కృషిచేశారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఖండవల్లి లక్ష్మీరంజనం
సంగ్రహ నమూనా రచనసాహిత్య భాషగా తెలుగు పూర్వ యుగాల్లో సాహిత్య ప్రయోజనాలకూ లౌకిక ప్రయోజనాలకూ వాడబడే భాషలు స్ఫుటమైన భేదం కలిగి ఉండేవి. ఇరవయ్యో శతాబ్దంలో సాహిత్యకుల దృష్టిపథం మారింది. కావ్య భాష కూడా నిత్య వ్యవహారంలో ఉండే భాష లాగే ఉండాలనే భావము ఇప్పుడు దృఢపడుతూంది.

ఖండవల్లి లక్ష్మీరంజనం

సాహిత్య భాషగా తెలుగు పూర్వ యుగాల్లో సాహిత్య ప్రయోజనాలకూ లౌకిక ప్రయోజనాలకూ వాడబడే భాషలు స్ఫుటమైన భేదం కలిగి ఉండేవి. ఇరవయ్యో శతాబ్దంలో సాహిత్యకుల దృష్టిపథం మారింది. కావ్య భాష కూడా నిత్య వ్యవహారంలో ఉండే భాష లాగే ఉండాలనే భావము ఇప్పుడు దృఢపడుతూంది. ఇటువంటి ఉద్దేశం పందొమ్మిదవ శతాబ్ది చివర భాగంలోనే సాహిత్య చింతకులలో తలయెత్తింది. దానిపై పెక్కు వివాదాలు చెలరేగాయి. క్రమంగా శిష్ట వ్యావహారికమే సాహిత్య భాషగా స్థానం పొందాలని చాలామంది రచయితలు భావింపజొచ్చారు. పూర్వయుగాల్లో దీనికి భిన్నంగా భావించేవారు. వారి ఆలోచనా పరంపర ఇట్లా ఉండేది. “సాహిత్యమనగా రసప్రపంచము. రసము పరబ్రహ్మ స్వరూపము. రసోవైసం: అని ఉపనిషత్తు చెప్పుతూంది. బ్రహ్మ స్వరూపమైన రసాన్ని ప్రస్తరించే సాహిత్య భాష, ప్రతిపాద్యమైన వస్తువు ఔత్కృష్టాన్ని బట్టి కేవల లౌకిక వ్యవహారము ప్రయోజనముగా గల భాష కంటె కొంత భిన్నమై, విలక్షణమై, ఉదాత్తమైనదిగా ఉండాలి” ఇది ప్రాచీనుల దృష్టిపథము ఆధునికులైనా దీనిని బొత్తిగా కాదనడం లేదు. విపణి వీథిలో కొనుగోళ్ళకు అమ్మకాలకూ వాడే భాషకాని, విశృంఖలంగా మాట్లాడేటప్పుడు ప్రయోగించే పద స్వరూపాన్ని కాని, పదజాలాన్ని కాని యథాతథంగా సాహిత్యంలో వాడవచ్చునని నేటి కాలపు సాహిత్యకులు కూడా అనడం లేదు. అందుచేతనే కావ్యాల్లో వాడే భాష ‘శిష్టవ్యావహారికం’గా ఉండాలని వారు కూడా అంటున్నారు. పూర్వులకూ వీరికి భేదం ఎక్కడ అంటే వ్యవహారంలో ఉండే పదజాలాన్నీ, పదస్వరూపాన్నీ సాహిత్యంలో సుతరామూ వాడకూడదని వారు నియమం పెట్టుకోలేదు. అయితే ప్రాచీనులు మాత్రం ఇటువంటి ప్రతిషేధం పెట్టుకున్నారా? పెట్టుకుంటే వారి రచనలు లోకానికి ఎట్లు ఉపాదేయము లయ్యెడివి. వారు రచించిన పురాణాలను, కావ్యాలనూ లోకం ఎట్లా గ్రహించేది” ఎట్లా ఆస్వాదించేది? లోకంతో మాకు పనిలేదు. మా ఇష్టము వచ్చినట్లు మేము వ్రాసుకుంటాము. లోకులకు అర్ధం అయినా అవక పోయినా వారు ఆస్వాదించినా ఆస్వాదించక పోయినా, మా త్రోవ మాది, అనే ధోరణిలో ప్రాచీనులు కావ్యజాలం సృష్టించారనే వాదన ఎంత మాత్రమూ గ్రాహ్యమైనది కాదు. అట్లా తలపోయడం ప్రాచీనులకు మహాపచారం చెయ్యడమే అవుతుంది. ఎందుకంటే పూర్వమహాకవులెవరు చెప్పినా లోక ప్రయోజనం కోసం. జగద్ధితం కోసం కావ్యం వ్రాస్తున్నామన్నారే కాని స్వాత్మానందం కోసం, లోకాన్ని నిర్లక్ష్యం చేసి కావ్యరచన చేస్తున్నామని ఎక్కడా ఎవరూ అనలేదు. భవభూతి వంటి మహాకవి ఏదో ఒక సందర్భంలో సమకాలికుల దుర్విమర్శలకు చిరాకుపడి ఈ లోకంతో నాకేమిపని అని ఘూర్ణిల్లి యుండవచ్చును.
“యేనామకేచి దిహన: ప్రథయంత్యవజ్ఞామ్|
జానంతితే కిమపి, తాన్ర్పతి నైషయత్న:|
ఉత్పత్స్యతే మమతు కోపి సమానధర్మా|
కాలోహ్యయం నిరవధి ర్విపులాచ పృథ్వీ||”
‘ మా యొక్క ఆజ్ఞతను ప్రకటించడానికి కొందరు పూనుకో వచ్చును. అయితే వారికిమాత్రం ఏమి అధికంగా తెలుసును? నా యీ ప్రయత్నము వారి నుద్దేశించినది కాదు. నాతో సమానమైన భావాలూ చిత్తవృత్తీ కలవ్యక్తి భవిష్యత్తులో జన్మించకపోవడు. కాలము అనంతమైనది. ఈ పృథ్వీమండలం విస్తారమైనది.’ సమాన ధర్మం కలవారినిగూర్చి ఈ నాటకరచన చెయ్యబడుతూందని ఈషత్కోపంతో కవి పలికాడు. అంతమాత్రంచేత భవభూతి లోకాన్ని నిర్లక్ష్యం చేసి తనకు ఇష్టంవచ్చినట్లు సాహిత్య సృష్టి చేశాడని అనవచ్చునా: కవి కూడా మనవ మాత్రుడే. అతనికీ రాగద్వేషాలు ఉన్నాయి. ఆశానిరాశలు ఉంటాయి అని సరిపుచ్చుకోవాలి. విపరీతభాష్యాలు చెయ్యడం న్యాయం కాదు.
తెలుగు కవీంద్రుడైన చేమకూర వెంకటకవి కూడా సమకాలికుల విమర్శకులకు ఇట్లాగే నొచ్చుకున్నాడు. ‘ఏగతి రచియించిరేని సమకాలమువారలు మెచ్చరే గదా అని బాధ ప్రకటించాడు. ఇంతమాత్రంచేత చేమకూర వెంకటకవి లోకాన్ని నిర్లక్షం చేసి వ్రాశాడాని అనడం ధర్మమవుతుందా. శ్రీనాథమహాకవి శృంగార నైషధంలో అన్నాడు.
” పనిపడి నారికేళ ఫలపాకమునం జవియైన భట్టహ
ర్షుని కవితానిగుంభములు సోమరిపోతులు కొందఱయ్యలౌ
నని కొనియాడనేర రదియట్టిద లేజవరాలు చెక్కు మీ
టిన వసవల్పు బాలకుఁడు డెందమునం గ్వలగంగ నేర్చునే:|”
దీనినిబట్టి ప్రౌఢ కవిత్వాన్ని మెచ్చలేనివారిని శ్రీనాథుడు సోమరిపోతులు. వసవల్చు బాలకులు అవి ఈసడించినాడని విమర్శించడం న్యాయమా? ఏసందర్భంలో మహాకవి ఈ యుపమానం ప్రయోగించాడో సావధానంగా పరిశీలించాలి. అసలీభావం శ్రీహర్షనైషధంలోనే ఉంది. శ్రీనాథుడు అనువాదం మాత్రమే చేశాడు. అయినా శ్రీనాథుడు తక్కువతిన్నవాడేమి కాదు. ఆగ్రహంవస్తే ప్రత్యర్థులైన పండితుల్ని విదలించేవాడే. రాజమహేంద్రవర పండితుల్ని గూర్చి భీమేశ్వరపురాణంలో అంటాడు.
“బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు
శాంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము
కూప మండూకములవోలె కొంచెమెఱిగి
పండితమ్మన్యులైన వైతండికులకు.”
అందుచేత ఆయా కవులు ఈషత్కోపావిష్టులై చెప్పిన మాటలను గాక వారు సావధాన చిత్తంతో ప్రకటిమంచిన భావాన్నే వారి హృదయావిష్కరణానికి మూలంగా గ్రహించాలి.
మెత్తంమ్మీద ప్రాచీనులు సాహిత్య భాషకూ వ్యవహారంలోని భాషకూ కొంత అంతరం ఉండాలని నమ్మినవారే. ఆ యంతరము ఎంత దూరమైనది, ఎంత గహనమైనది అనే విషయంలోనే అభిప్రాయ భేదాలకు అవకాశం కలిగింది. సాహిత్యభాషకూ జన వ్యవహార భాషకూ మధ్య ఉండే వ్యవధానం ఉండీఉండనట్లు ఉండాలని తల పోశారు నన్నయ తిక్కనాది మహాకవులు. అది ఇంకా కొంచెం గంభీరంగా ఉండాలంటారు నాచన సోమన శ్రీనాథాదులు. జాసుతెనుగే కావ్యభాషగా ఉండాలంటారు పాల్కురికి సోమనాథాదులు. ఆ యంతరం గహనంగా, పెద్ద అఖాతంగా కూడా ఉండవచ్చును అనుకొన్నారు ప్రబంధ కవులు. ఈ యవాంతరం బొత్తిగా ఉండకూడదంటారు ఆధునికులు. వారు వారు భావించిన దానికి ఆచరణలో అనుష్ఠించిన దానికీ వ్యత్యాసాలు కనబడుతూంటాయి. ఎందుచేతనంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం వేరు. ఒక మహా కావ్యంలో ఆద్యంతమూ దానిని అమలు పెట్టడం వేరు. ఏటికి అడ్డం పడిన గజీతగాడు ఒక్కటే ఈత పద్ధతిని పాటించాలనే నియమం ఏమి ఉంది. ఉన్నా కాని అది ఆచరణ సాధ్యమా. ఒకప్పుడతడు బారీత ఈదుతాడు. ఒకప్పుడు కుక్కవలె నిలువీత ఈదుతాడు. ఒకప్పుడు తెడ్డీత ఈదుతాడు. మరీ ఆయాసం వస్తే వెల్లకిలబడి తోసుకుపోతాడు. అవతలి ఒడ్డు చేరడమే పరమ లక్ష్యమని మిగిలిన చిన్నచిన్న నియమాలు మహాజలరాశి తరణంలో లెక్కకు రావు ఒక చిన్న కావ్యమో ఖండికయో అయితే చిన్న చిన్న నియమాలు పెట్టుకొని కొంత సంయమనం పాటించవచ్చును. కవి దృష్టి దీనిమీదనే నిబద్ధమై ఉంటుంది గనుక. అదే అష్టాదశ పర్వ నిర్వహణ సంభృతమైన మహా రచన అయితే చిన్న చిన్న నియమాలు సాధ్యామూకావు; ఆవశ్యకమూ కావు. అందుచేతనే నన్నయ భట్టారకుడన్నాడు:
“బుద్ధి బాహు విక్రమున దుర్గమార్థ జల
గౌరవ భారత భారతీ సముద్రము దరియంగ
నీదను విధాతృనికైనను నేరబోలునే”.
మహారచన చేసేటప్పుడు మరొక జటిల సమస్య తలయెత్తుతూంది. మహా కావ్య రచనకు కావలసిన ముడి సరుకు అంటే పదజాలం అంతా, నిత్య వ్యవహారంలో ఉన్నదా? లేదు. తెలుగులో ఇంకా తక్కువ. దీనికి చారిత్రక కారణాలు ఉన్నాయనుకోండి. మన పూర్వ కవులు తెలుగును పెరగనివ్వవలసినంతగా స్వతంత్రంగా పెరగనిచ్చినట్లు లేదు. వారు విస్తారంగా సంస్కృతాభిమానం కలవారవడంచేత అపారంగా లభిస్తూన్న గీర్వాణ పదజాలాన్ని తెలుగులోకి దిగుమతి చేసుకొని తత్సమ భాషాభి ముఖంగా పయనించారు. నన్నయనాడో, అంతకు పూర్వమో, శివకవుల జానుతెనుగు ఉద్యమం తలయెత్తి ఉంటే తెలుగు సాహిత్య భాషా స్వరూపం మరొక విధంగా ఉండియుండ వచ్చును. బహుశా తమిళం లాగే మన భాష కూడ విస్తారంగా తన కాళ్ళ మీద తాను నిలకడ కలిగియుండును. సంస్కృత సహాయం లేకుండా వర్ద్ధిల్లియుండును. కాని అట్లా జరగలేదు. జాను తెనుగు అను పేరుతో సంస్కృత భూయిష్టం కాని దేశ భాషను వ్రాయాలని ఉద్దేశించిన శివకవులు కూడా సంస్కృత ప్రాబల్యాన్ని త్రోసిరాజు అనలేక పోయారు. వారు కూడా సంస్కృత బాహుళ్యాన్ని నిరసిస్తూనే దీర్ఘ సమాస భూయిష్టమైన శైలిని తమ కావ్యాల్లో ఆదరించారు. భాషా విప్లవవాదియైన పాల్కురికి సోమనాథుడు గీర్వాణ భాషా శృంఖలాన్ని వదిలించుకోలేక పోయాడు. అనగా కాలానికే తెలుగు భాషమీద సంస్కృత ప్రభావం స్థిరపడి పోయిందని విశదమవుతూంది. ముందు ముందు దీనిని యింకా చర్చిద్దాం.

———–

You may also like...