పేరు (ఆంగ్లం) | Sthanapati Rukhminamma |
పేరు (తెలుగు) | స్థానాపతి రుక్మిణమ్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | గరుడమ్మ |
తండ్రి పేరు | పురుషోత్తమరావు |
జీవిత భాగస్వామి పేరు | సత్యనారాయణ |
పుట్టినతేదీ | 9/28/1915 |
మరణం | – |
పుట్టిన ఊరు | నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | రచయిత్రి, పండితురాలు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | పూలమాల (కవితా ఖండికలు) -1933, దయ్యాలు (కథలు) -1937, నీలాటి రేవు (కథలు), యుక్తిమాల (కథలు), దూతఘటోత్కచము (నాటిక)-1940, వత్సరాజు (నాటిక)-1947, చారుదత్త (నాటిక), దేవీ భాగవత మహాపురాణం (వచనం), దేవుడు -1938, గోలోకం (వచన పురాణం), సప్తశతి (పద్యాలు), కాదంబిని (కావ్యము) -1950 |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | స్థానాపతి రుక్మిణమ్మ ప్రముఖ సంస్కృతాంధ్ర పండితురాలు మరియు రచయిత్రి. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | స్థానాపతి రుక్మిణమ్మ ఉపన్యాసము |
సంగ్రహ నమూనా రచన | మహాశయులారా, ఈ రోజున మీరు నాయెడల చూపిన గౌరవాదరాభిమానములకు కృతజ్ఞురాలను. ‘అసూర్యం పశ్యా రాజదారాః’ అన్నట్లు రాజుల ఇల్లాండ్రు ఎండకన్నెరుగరు. అలాగే విప్రుల ఇల్లాండ్రు కూడా హోమవేదికలుదాటి రుగరు. అంతమాత్రాన వారిలో జ్ఞానజ్యోతి ప్రకాశించి బయల్వెడలి తరులకు దారి చూపింపకపోలేదు. అఖండమూ, అవ్యక్తమూ ఆయువున్న ప్రకృతి రెండు విధములై – స్త్రీ పురుషరూపమున విభజింపబడినప్పుడే, అనాది అయిన అవిద్య పరమాత్మ ప్రతిబింబరూపమైన జీవుని ఆక్రమించిన నాడే స్త్రీ పురుషులు రెండు చక్రములు. ఆ రెండును తుల్యములే. బింబ ప్రతిబింబములు తుల్యరూపములే. కాని – నిపుణముగా పరిశోధించి చూచినచో ఒకదాని కొకటి విపర్యస్తమై యుండును. ఇట్టిదే స్త్రీ పురుషుల భేదాభేదము. |
స్థానాపతి రుక్మిణమ్మ
ఉపన్యాసము
మహాశయులారా,
ఈ రోజున మీరు నాయెడల చూపిన గౌరవాదరాభిమానములకు కృతజ్ఞురాలను.
‘అసూర్యం పశ్యా రాజదారాః’ అన్నట్లు రాజుల ఇల్లాండ్రు ఎండకన్నెరుగరు. అలాగే విప్రుల ఇల్లాండ్రు కూడా హోమవేదికలుదాటి రుగరు. అంతమాత్రాన వారిలో జ్ఞానజ్యోతి ప్రకాశించి బయల్వెడలి తరులకు దారి చూపింపకపోలేదు. అఖండమూ, అవ్యక్తమూ ఆయువున్న ప్రకృతి రెండు విధములై – స్త్రీ పురుషరూపమున విభజింపబడినప్పుడే, అనాది అయిన అవిద్య పరమాత్మ ప్రతిబింబరూపమైన జీవుని ఆక్రమించిన నాడే స్త్రీ పురుషులు రెండు చక్రములు. ఆ రెండును తుల్యములే. బింబ ప్రతిబింబములు తుల్యరూపములే. కాని – నిపుణముగా పరిశోధించి చూచినచో ఒకదాని కొకటి విపర్యస్తమై యుండును. ఇట్టిదే స్త్రీ పురుషుల భేదాభేదము.
కాలక్రమమున నాగరికతలచే దైనిక కార్యక్రమమువలన స్త్రీ పురుష మానసిక శారీరకపు వృత్తులయందు మరికొంత భేదమేర్పడినది. వైషమ్యముగాని, వైమత్యముగాని ప్రకృతి సిద్ధమును, స్వాభావికమునుగాదు. నేటి పాశ్చాత్యదేశములలోను, మన భారతదేశములో కొన్ని యెడలను ప్రశంసింపబడుచున్న ఫెమినిష్టు మూమెంటు అనగా స్త్రీలకు పురుష సాహాయ్య మవసరములేకయే ప్రాధాన్యమును, ప్రతిష్ఠయు సంపాదించు ప్రయత్నము కొన్ని కృత్రిమములయిన పరిసర ప్రభావములచేతను, కొందరి వ్యక్తుల గుణవిశేషములచేతను ఏర్పడుచున్నవి. కాని సర్వజీవి సామరస్య సూత్రము మాత్రము స్త్రీ పురుషుల సహకారోద్యమముపైని ఆధారపడి యున్నది.
ఆంధ్రవజ్ఞ్మయమునకు ఆదిమజ్యోతి అయిన నన్నయభట్టు.
‘‘శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషుయే
లోకానాం స్థితి మావహస్త్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం,
తే వేదత్రయ మూర్తయ స్త్రీ పురుషాస్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్త మాంబుజభవ శ్రీకంధరాశ్ర్శేయసే’’
అనుశ్లోకమున త్రిపురుషాత్మకమైన ఈవ్యక్తసృష్టియందు వారు వక్షోముఖాంగములయందు శ్రీవాణీ గిరిజలను ధరించినట్లు అనాదియై సంప్రదాయ సిద్ధమైన, భారతీయ వైజ్ఞానిక దృష్టిని వర్ణించియున్నాడు.
‘‘యత్రనార్యస్తు పూజ్యంతే – రమంతే తత్రదేవతాః….’’
అని అభియుక్తి. ఇట్లు పవిత్రస్వభావములతో నిర్మింపబడినది భారతీయ గార్హస్థ్యము.
వరుసతో ధర్మార్థకామమోక్షములకు సమభాగిని భార్య – ‘‘సగృహం గృహ మిత్యాహుః గృహిణీ గృహముచ్యతే’’ అనువాక్యము ననుసరించి గృహిణియే గృహపతి – గృహమందామెయే ‘సమ్రాజ్ఞి’ ‘మాతృదేవోభవ’ అను భారతీయాచార్య సందేశము మన ధర్మమునకు స్వాభావికము. యక్షప్రశ్నములలో – ప్రతుయత్తరముగా ధర్మరాజు.
‘‘తల్లి వేఁగుసువ్వె ధరణికంటెను నాక సంబుకంటెఁ బొడవు జనకుఁడరయ
గాడ్పుకంటె మనసు గడు శీఘ్రగతి తృణోత్కరముకంటెఁ జింతగరము తఱచు’’
అనెను. ఇట్టి సంప్రదాయము కలిగిన భారత స్త్రీలు ఇంటిదీపములు.
వారిలో కొందరు కార్యరంగమున, రాజకీయాంగణమున, సమరభూమిని, సాచివ్యస్థానమున ప్రసిద్ధినొందిరి. ఇట్లుపొందుట తమకు స్వాభావికమై పురుషునితో సమముగా పంచుకున్న ప్రకృతి శక్తులు సమయమువచ్చిన ఉద్దీప్తములయి వికసింపగలవని నిరూపింపనవునేగాని ఆత్మస్వరూప విజృంభణ మాత్ర ఫలకములుగావు. శక్తిస్వరూపిణి అయిన దేవి వీరవిహారముసల్ప విజృంభించినపట్ల హరిహర బ్రహ్మాదులు అల్లాడిరి.
నేటి విద్యుత్ ప్రవాహ యంత్రములయందు శక్తి – స్వాభావిక సారణులయందు ప్రవహించునంత కాలము ప్రపంచవృత్తి సాగుచునే యుండును. ఎక్కడైన నొక్కచోట కట్టతెగినచో జ్వాలమాలాకు వితమై ప్రళయమేర్పడుటగాని చలనము స్తంభించుటగాని జరుగును. ఇదిశక్తి; ఇదియే స్త్రీస్వరూపము.
ఇక కావ్యజగత్తున స్త్రీకిగల స్థానమేమి? కావ్యము కాంతా సమ్మితమని కోవిదులందురు. ‘కాంతా సమ్మిత తయా పదేశముజే’ అని మమ్మటుడు, ఈ కాంతా సమ్మితత్వము వరి నుండి బయలు దేరినది? కాంతల నుండియా? కాంతులనుండియా? కాంతల స్వాభావిక కాంతుల నుండియే అని నా సమాధానము. అప్రయత్నలబ్ధమైన పరేంగితావగాహనము, అశిక్షిత పటుత్వము, స్త్రీ సహజ శక్తియని పురుష పుంగవులు చాటుచున్నారు. కావున – కావ్యమార్గమును కాంతలనుండి కాంతులెరింగి కవిచంద్రులయి విలసిల్లిరి. చంద్రున కిదియేశోభ. కాని – తమకు స్వాభావికమైన శక్తిని తమ కాంతులకునర్పించి ఉపసర్జనీ భూతలయి లోకపోషణ చేయునట్టి త్యాగపరాయణులూ, ఉపకారపారీణలూ అయి స్త్రీలు ప్రకాశించుచున్నారు. కావ్యరచనమున ఆంధ్ర వాజ్ఞ్మయములో స్త్రీలు చేసినకృషి అల్పము, కాని – అధమముకాదు రామాయణము, వేంకటాచల మాహాత్మ్యము మున్నగు గ్రంథములు స్త్రీ సామర్థ్యమునకు తార్కాణములు.
పెద్దలయిన మీరు ప్పుడు నన్ను, నాయోగ్యతను గోరంత కొండంతలుచేసి స్వర్ణకంకణ ప్రధాణమున సమ్మానించియున్నారు. సభాముఖమున ప్రసంగింపవలసినదిగా ఆదేశించినారు. ఏమిచెప్పవలెను? ఇల్లాలినై – మదీయభర్తృపాదసేవా పరతంత్రనై – శిశుపోషణ చేసుకొనుచు నిరంతర గార్హస్థ్యక్రియా సంపాద జంబాల పటలమున మునింగి ఏదో ఉబుసుపోకకు కొన్ని గ్రంథములను చదువుకొంటిని. పండితుడు, ప్రేమమూర్తి అయిన నా జీవితస్వామి దయవలన నాల్గుమాటలాడ నేర్చితిని. పెద్దలయిన పండితుల సన్నిధిని వారి వాగమృత ప్రవాహమున నాల్గుపుడిసెళ్లు జ్ఞానామృతముద్రాని పెద్దల మనస్సులు రంజింపచేయు చిలుకపలుకులు పలుక నేర్చితిని. అవి – పెద్దల మనస్సుల కుల్లాసము కలిగించుగాక.
నాకును – ఈ కంకణ ప్రదానమునకును – సభ్యులయిన తమకును – సామాన్యమయిన అనుబంధము కావ్యరూపమే – గావున దానిని గురించి రెండు మాటలు చెప్పదలచుకున్నాను.
అనాదిగా మనకున్నవి వేదములు, వానికన్న గురుతరములయిన కావ్యములు లేవని ఎల్లరంగీకరించినదియే.
‘కవిం కవీనాం’ అని బ్రహ్మనుగూర్చి వ్యవహారము, అనగా కవులలో ఉత్తమకవి, తన్ముఖనిరతమైనవాక్కు కావ్యముగాక వేరొండెట్లగును? అట్టి వేదమునకు ప్రభు సమ్మితమనుపేరు కేవల ప్రాయోవాదము. కాంతా సమ్మితములయి మంజు స్వరూపములయిన అర్థవాదాత్మక రచనలు వేదముల నిండి యున్నవి. తరువాత నావేదమే రామాయణ రూపమున లోకమున ప్రవహించినది. ‘‘వేదః ప్రాచేత సాదాసీ, త్సాక్షాద్రామాయణాత్మనా’’ అని చెప్పబడుచున్నది. రామాయణముకంటె గొప్ప కావ్యమేది? ఈ ఆది కావ్యము తరువాత ‘‘భారతః పంచమోవేదః’’ అను మహాకావ్యము పుట్టినది. పైవాని ఛాయలుగానే ఏకదేశములై రఘువంశాదులు బయలుదేరినవి. వాని అనంతవమున పాకవిశేష సంపన్నములయిన నైషధాదులు విద్వదౌషధములై వెలసినవి. ఇట్లు వెలసిన సంస్కృత కావ్య ప్రవాహమే ప్రాకృతభాషలలో రూపాంతరితమై వెలసినది. పైచరిత్రవలన తేటపడు అంశమొక్కటియే. కావ్యస్వరూపము, కావ్యమార్గము, కావ్యపరమార్థము అనునవి మూడును ఆదినుండియు నొక్క రూపముననే యున్నవి. దేశ కాలభాషా భేదములు వీని స్వత్వమును మార్చలేవు. స్త్రీ రూపము – స్త్రీ ప్రకృతి – లోకమున స్త్రీ వలనకలుగు ఉపకృతియు – దేశకాల వ్యక్తి భేదములవలన ఎట్లు మారక అచంచలమైయున్నవో – అట్లే కావ్యమును ఉన్నదని నిశ్చిదని నిశ్చితమగుచున్నది.
ఇట్టి కావోయదంతమున సంపాదించునదేమి? ఒకటే – లోక కల్యాణము, వ్యక్త్యానందము, విజ్ఞానసిద్ధి. అట్లే స్త్రీ ప్రకృతివలనను సిద్ధించునది – పైత్రితయమే.
మాతృస్వరూపమున బిడ్డలను విజ్ఞానసిద్ధి కలుగుచేయునది స్త్రీ, ప్రణయనీ రూపమున ప్రియునకు హితబోధ చేయునది స్త్రీ. కావున విజ్ఞానసిద్ధి స్త్రీ రూపమున కలుగుచున్నదన్న విషయం నిర్వివాదమైనది. మొదటి రెంటినిగూర్చి వివరింపనక్కరలేదు.
ఇట్టి కావ్యములు రచించుటయన్న సులభముకాదు, ప్రతిభ సహజముగా నుండవలెను. వ్యుత్పత్తి సంపాదింపవలెను. అభ్యాస మలవడవలెను. అటులనే ప్రతిభలేని వానిని, పాండిత్యహీనుని ఎవ్వరును ఒల్లరు. అవ్యుత్పన్నుని అతివలు ఆదరింపరు; అనభ్యస్తుని సరకుగొనరు. సనాతనుడైన ఈశ్వరుడు తపస్సుచేతనే శక్తిని సాధించెనని పురాణ ప్రసిద్ధము.
ఇంతవరకు చెప్పనేర్చినవి చెప్పితిని, చిన్నచిన్న పద్యకావ్యములు అల్లితిని, సభలలో పండితులాదరించిరి. జీవితమున ముక్తి ప్రదమని ఎంచి దేవీభాగవత మనువదించి స్త్రీలోకమున కర్పించితిని. స్త్రీకి గార్హస్థ్యమున శిశుసంరక్షణ, సకల సంతోష ప్రదాయకమని తెలుసుకొంటిని, ఆంధ్ర స్త్రీ లోకమున కిదియే పరమార్థమని అనుభవ పూర్వకముగ మనవిచేయుచున్నాను.
———–