మల్లాది రామకృష్ణశాస్త్రి (Malladi Ramakrishna Sastry)

Share
పేరు (ఆంగ్లం)Malladi Ramakrishna Sastry
పేరు (తెలుగు)మల్లాది రామకృష్ణశాస్త్రి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1905
మరణం1/1/1965
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెతెలుగు భాషకి ఆభరణం
స్వీయ రచనలునవలలు : కృష్ణాతీరం, తేజోమూర్తులు, క్షేత్రయ్య
సినీ సాహిత్యం: ‍ బాలరాజు (1948), చిన్న కోడలు (1952) (గీత రచయితగా తొలిచిత్రం), కన్యాశుల్కం (1955) (గీత రచయిత), రేచుక్క (1955) (గీత రచయిత)
చిరంజీవులు (1956) (గీత రచయిత), కార్తవరాయని కథ (1958) (గీత రచయిత),
జయభేరి (1959) (గీత రచయిత), తల్లి బిడ్డ (1963) (గీత రచయిత), జ్ఞానేశ్వర్ (1963) (గీత రచయిత), దేశద్రోహులు (1964) (గీత రచయిత), రహస్యం (1967) (గీత రచయిత), వీరాంజనేయ (1968) (గీత రచయిత), అత్తగారు కొత్తకోడలు (1968) (గీత రచయిత)
నాటికలు: గోపీదేవి, కేళీగోపాలం, బాల, అ ఇ ఉ ఱ్,సేఫ్టీ రేజర్
ఇతర రచనలుhttp://pustakam.net/?p=4881(పుస్తకం)
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమల్లాది రామకృష్ణశాస్త్రి
అంగరక్ష
సంగ్రహ నమూనా రచనకోడి మేలుకుంది, కొక్కురోకోఁ అనంగానే, వాడ మేలుకుంది.
వాడకట్టు జనానికి వంటిబద్ధకం, కంటిబద్ధకం వదిలే వేళకు, గోపురంలో గూడు మేలుకుంది, గువ్వ మేలుకుంది.
ఆలయంలో అయ్య మేలుకొలుపులకుగాను, అర్చకుడు ఓ రూపాజీవ సరసను మేలుకున్నాడు. స్నానం అయిందనిపించుకున్నాడు. విసుగ్గా విభూతి, కొట్టొచ్చినట్టు కుంకుమా, పెట్టుకున్నాడు.

మల్లాది రామకృష్ణశాస్త్రి
అంగరక్ష

కోడి మేలుకుంది, కొక్కురోకోఁ అనంగానే, వాడ మేలుకుంది.
వాడకట్టు జనానికి వంటిబద్ధకం, కంటిబద్ధకం వదిలే వేళకు, గోపురంలో గూడు మేలుకుంది, గువ్వ మేలుకుంది.
ఆలయంలో అయ్య మేలుకొలుపులకుగాను, అర్చకుడు ఓ రూపాజీవ సరసను మేలుకున్నాడు. స్నానం అయిందనిపించుకున్నాడు. విసుగ్గా విభూతి, కొట్టొచ్చినట్టు కుంకుమా, పెట్టుకున్నాడు. ఇన్ని పూవులూ, అన్ని దళాలూ, పట్టుకున్నాడు. తలపట్లుగా, ఆలయం తలుపు నెట్టాడు. సిగపట్లుగా, చీకటింట శ్రీవారిని సమీపించాడు. మూతి ముడుచుకునే, జ్యోతి వెలిగించాడు. ఆపద తరుముకొచ్చినట్టు అర్చన అయిందనిపించాడు. పూలూ పత్రి, అలవాటుగా గురి తప్పకుండా గిరవాటు వేశాడు. పంచపాత్ర తలబొప్పి కొట్టేట్టు ఉద్ధరణె తాటించాడు, ఆ చేత్తోనే, ఆరతి రవాకు తిప్పాడు. మంత్రపుష్పం విసిరేయబోతూ, అకస్మాత్తుగా అవసర నైవేద్యం మాట జ్ఞాపకం వచ్చి ఒక్క పటిక బెల్లంగడ్డ తీసి, పళ్లెంలో, ఖంగున పడేసి, చేతి కందిన నారికేళం పగలేసి, వెరసి అన్నింటిమీదుగా, చేయి చూపించి, మరో ఉద్ధరణ్ణెడు ఉదకం ఆరివాణంలో రాల్చి, అంతసేపూ గొణుక్కుంటూన్న మంత్రం ఆపి సుతారంగా, మునివేళ్ళతో చెంపలు వేసుకుని, మొత్తానికి మొక్కు తీర్చుకున్నట్లు పూజ ముగించి, నివేదన మూట కట్టుకుని, తిడుతూన్నంత దేదీప్యమానంగా, ‘భక్తి తప్పినా ఫలం తప్పరాదు’ అనే ముక్క, బండ ఎత్తినంత బరువుగా నోటికొద్దీ ఊరిమీదికి గిరవాటు వేసి, ‘అది, ఎవడికి తగిలితే మనకేం’ అన్నట్టు చేతులు దులిపేసుకున్నాడు.
నిన్నరాత్రి పక్కా ఝామున్నర పాటు పాటలూ పద్యాలతో, పరుండబెట్టి, శ్లోకాలూ స్తోత్రాలూ చదివి, పవ్విళింపు సేవచేసి, నామాల మాల ఏకరువు పెడుతూ, నానా విధి శక్త్యుపచార, భక్త్యుపచారములూ చేసి, కునికిపాట్లతో ఉయ్యాల ఊపి, ఎట్టకేలకు ఒంటరిగా వదిలి పెట్టిన ఉత్సవ విగ్రహాలు, వేసిన పక్క చెరగకుండా, చేసిన అలంకారాలు చెదరకుండా, బుద్ధిమంతనపు పిల్లలకు మల్లే, పుస్తకాలల్లే ఎదురు బదురుగా, ఒంటి రెక్కమీద, అలా పరుండే ఉన్నారు.
వారి అతీ గతీ, మళ్ళీ అసురసంధ్యవేళకుగాని – పట్టించుకోవలసిన అగత్యం లేదు –
అదీ ఆనవయత – ఉత్సవ విగ్రహాలకు మేలుకొలుపులు అంటూ లేవు, పవళింపు సేవకే, వారు బరిమీదికి వస్తారు. యీలోగా వాటికి పులికాపు చేయడం, అనగా, పాత్ర సామగ్రితోబాటు, తొలిచి తుడవడం, ఏ కుర్రవాడో కానిచ్చి వేస్తాడు. అందుకు, అర్చకుడు స్వయంగా చేయి చేసుకోనక్కరలేదు. అదీ ఆచారం.
అక్షంతలు, పిచ్చికలు ఏరుకు తినేస్తాయి. అదే వాటికి, ప్రసాదం. కువకువమంటూ, కిచకిచ మంటూ దేవర చిత్తానికి రా – వాటి సేవే సేవ.
అలాటి సేవలందుకుంటూ గుడిలో దేవర, తరతరాలుగా, చెక్కు చెదరకుండా, వెలసి, ఉండగా, ఊరికి ఉద్ధరింపుకాని కోవెలా, కోవిలకేసి చూడని కోటా, ఉన్న చోటనే ఉంటూండగా,
కోటలో, తరతరాలుగా, పరివారము బలసి కొలువగా, తినికూర్చునేవారి సేవ అందుకుంటూ బ్రతుకంతా, పవలంత తీరికగా, ఏ రేయి, వేసీవేయని వేడుకగా, వేసటగా, అదే, ఆ వినుకలే తమ ఏలంబడిలో ఉంటూన్న ప్రజలకు మహాప్రసాదంగా, ఆలన చేయడం తమ ఘనతకు తగనిదాయెనని, కేవలం ఒక్క పాలన మటుకే, సేవకుల భుజ స్కంధాలచేత చేయిస్తూ, తిట్లువెదజల్లి దీవెనలుగొంటూ, పానుపుమీద పాదాలూ స్వయంశక్తిని క్రిందనైనా మోపకుండా, హయాములు వెలుగొందుతూండగా, నారూ నీరూ కోరని పంట, అరక దున్నని సేద్యంగా, మడక దున్నని వ్యవసాయంగా, కీర్తి చంద్రికలు గాదెల కెత్తించిన వారై, అన్నదాతా అని పిలిపించుకున్న వారై, ఉండగా, ఉండగా –వీరి హయాములో, అనగా నిన్న మొన్న ప్రాయానికి వచ్చిన బాబాజీ బుచ్చితిమ్మ బహద్దరువారైనటువంటి బుచ్చినాయనగారి హయాములో, అప్పటికి గడచిన అన్ని రోజులలోనూ, ఎన్నికైన, ఒకానొక, సమయాన, అనగా, యీ చైత్ర శుద్ధ మంగళవారం, దుర్ముహూర్తం గుమ్మంవదలే, ఉదయాన-
నగారా నౌబత్తులు, మ్రోగంగా మాంచి నిదురలోఉన్న సువారం దొరలు, కాచుకుని ఉన్న పడిగాపులవాండ్లు, ‘దేవా, యిటుయిటు’ అని, వారి చేయందుకుని, చెవిదగ్గిరసా, మనవి చేయంగా, వారి మీసము వారు దువ్వుకున్నవారై, కనులు స్వయం కృషితో తెరచి, ఎదుట చూడక ఎటో చూస్తూ, ఎవడినీ కానట్టు, ఏ గోడమీది బల్లినో పలుకరించినట్టు, కొరమారిన గొంతును, ఏ చేతులో సవరించినట్లు, అదోమాదిరి అలవాటైన ధ్వనులు కాయంగా, చిత్తము చిత్తమనేందుకే, తల్లి గర్భంలోంచి, చేతులు కట్టుకుని, ‘తుమాల’నెత్తికి సుట్టుకుని పుట్టినవాళ్ళు, ఎవడికి వాడు, కోట ఏ మూలో అంటుకున్నదన్నంత గొంతుతో, నాయనా, నాయనా, అనుకుంటూ, ఒకడు నడుంపట్టి మరిద్దరు లేవనెత్తి కూర్చుండబెట్టి, పిక్కలుపట్టి, పాదాలు చాచి, వెన్ను చాచి, మక్కెలు గుద్ది, వారు ఆవలించంగా, చిటికెలు వేసి, ‘ఏలిన వారు నిదుర లేచారు’ అని మనవి చెప్పుకోంగా, వాక్యానికి, నిత్యకృత్యపు బూతొకటి కలిపి, పూర్తి చేసి, వాళ్ళచేత చిత్తం – చిత్తం అనిపించుకుని, ఉత్తర క్షణంలో, పంచాంగ శ్రవణానికి బాసిపట్టు వేయించుకున్న వారు కాగా,
కాలం నాడు, పాత హవేలీలో, విజయం చేస్తూన్న వారైన గిరిజాల ప్రభువులకు, ఏవేళకు ఆ వెన్నెల పడుతూ, వయసంతా, ఒక్క పొద్దులుండని కాలక్షేపం చేసి, అక్కడి నిధులూ నిక్షేపాలూ, చిత్తము వచ్చిన వారిని గుత్తకొనడంలో, నోటి సాయం చేతి సాయంతో కొల్లపోగా, రక్తి రగిలి రగిలి, చిగురుకు, చెక్కు చెదిరీ చెదరక గోడలూ గొబ్బెలూ మట్టుకు మిగులంగా, ఆ తగులాటం తనకేల అని, వాటి పాపానికి వాటిని వదిలి, తన పుణ్యాన తానుపోతూ, ముక్తికి ఏనాటికీ లోటు లేనేలేదు కనుక, లోకసాజంగా, ఒక్క కన్ను భుక్తిమీద ఉంచి, యిప్పటికి, వెనుకటి మంచే అనిపించుకుంటూన్న మాణిక్యం.
ఎన్నడో తానూ ఓ బాలా కుమారే గనుక, అప్పటిపాటగా, పైట సర్దుకుంటూ, కుచ్చెళ్ళు దిద్దుకుంటూ, ముచ్చటి చూపులు చూసుకుంటూ, పిలువనంపి వారన్నంత చనవుతో వచ్చి, పలుకరించి పరిహాసం పట్టేరన్నంత బింకంతో, అట్టి ఒక్క కులుకు కులికి, అలవోకగా, బరాబరులు చేసినదై, ఎదుట రేవిణీమీదనున్న వారి వాలకం ఓరకంట కనిపెడుతూ ఉండంగా, వారు సెలవిచ్చారు గదా.
‘‘పానకమా – పాయసమా’’
అంతలో మాణిక్యం మనవులు సెలవారబోసింది గదా.
‘‘…పానకమంత పలచనకాదు, పాయసమయంత చిక్కనకాదు – కొంచెం కుడీ ఎడం – పచ్చి జామకాదు – పండుమామిడి కాదు. యిప్పుడిప్పుడే దోరకు వస్తూంది. అరగారగా, అనుభవించేందుకు మమ్మేలినవారికి, ఏ వేళనైనా, అదుపులేదు, అభ్యంతరం లేదు కాని, కాని, అద్ధాన్నపు బ్రతుకులూ, అల్పబుద్ధులూనూ.
అయ్యో పాపమని ఆదరించపోతే, అణాకాసు రూఫాయ్ బిళ్లల్లే మోగలేదేమందిట, వెనకటికో ఏబ్రాసి.
‘‘చిత్తగించండి, బాబూ’’ ఎంత కాయకం వచ్చినా ఎద్దు – ఏడు మాడలు పలుకుతుందా?
తులమెత్తుకు – తుల మెత్తూ బంగారం – మేలిమి కావాలట. దీనిముత్తవముల్లె తమరి దగ్గిర దాచబెట్టినట్టు’’
ఊపిచూసినా – ఉహుఁ మొగ్గందే! చిన్న మెత్తు తగ్గదట! ఆశాపాతకం తిరిపానికొచ్చామా, దేవురించొచ్చామా, ఒళ్ళిచ్చుకుంటున్నామ్ ఒక్కధరైతే ఖరారందామనుకున్నామ్. తూగలేకపోతే ఒగ్గేసెయమను – అనేసిందయ్యా.
ఏలినవారు – చల్లగా ఉండగా, మరో తలకుమాసిన లక్ష్మీపుత్రుడు, తగుదునమ్మా అని, ముందుకు రాగలడా బజానా యివ్వగలడా? ఒకవేళ, యిచ్చి పుచ్చుకోడాలంటూ వచ్చినాయే అనుకుందాం – యీ ధర్మప్రభువులకు కాకుండా కవ్వేసి అరాయించుకోగలడా?
ఏడబుట్టి, ఏడ పెరిగినావే, దగిసీ, యీ అయ్య అనంగా, కోటిలో ఎన్నికైన మగరాయుడు కాడటే –
‘‘కావాలెనని సుంత కనుసైగ చేసితే –
రావద్ద వొద్దికకు రంభ చెల్లెలైన
నీవు గామంటేను నిన్ను మించిన దొకతె –
ఈ సీమ దొరకదేమే ఏమేవ్’’
మమ్మేలినవారి మీదనేకదా, వెనుకటికి నాడు, సారంగపాణి అయ్యవారు పదంకట్టి పాడింది – అలాటి పరువున్న వారి, పాదాల నీడ పడిఉండటం, కట్టినకోక కట్టక, పెట్టిన సొమ్ము పెట్టక, ఏడువారాల పున్నెమూ ఏకపానుపుచేసి, ఏలుకోమంటే, ఏలిన వారు ఆలకిస్తే, అద్గదీ ఫలంపాటు కానీ, పరిగేరుకు తింటే అదో బతుకా. యింత మదుపు, యింత మక్కువ నీకు ఎక్కడ దొరికేనే?
సీమదొరసానులంతటివారు పనిగట్టుకు పడవెక్కివచ్చి, బెదురూ బెరుకూ లేకుండా, చెట్టంత మొగుడు ఎదరుండగా, వీరి చేతికి చేయందించి, మీద చెయ్యేయించుకుని, వారి బాసలో వీరితోబాటు డ్యాన్సులాడేవారే – చూసినవారు యిప్పటికీ చెప్పుకుంటారు. అది కలియుగవైకుంఠంటే! అలాటి వారే మా అయ్యవారు! ఛప్పన్న దేశాలవాళ్ల సరసాలూ ఎక్కాలప్పగించినట్టప్పగించేరే.
ఆసి నీ ఉబ్బు తబ్బిబ్బు కానూ సొమ్ము శాశ్వతం కాదే అమ్మ – మీయమ్మ మాట వినకే – అలాటి ప్రాపకం మళ్ళీ రమ్మంటే రాదే” అని, ఆ పింజెకానాను నయానాభయానా గట్టిగా కదలేశాను కాని, బాబూ, దాని తల్లి గోరుమద్దలోనే ఏదో మంత్రం మదుపూబెట్టినట్టుంది. అది, మెట్టు దిగలా పైగా, అంటుంది కదా, నాకో పదొచ్చెనో, నీకో పరకిచ్చేనుపలుకుంటే పరగడుపేలనే వదినా – వట్టి చేతులూపుకుంటూ వచ్చి, వారికి అప్పనంగా వరగబెడితే, నాకేం ముట్టాను నీకేం గిట్టాను?… యిలా గిల్లికజ్జాకు వచ్చింది బాబూ, మళ్ళీ జన్మకది మాయదారి ఒంటరి మగనాలుకానూ.
మీ గులాపుదానికి అంత అక్కరే వచ్చి, అంత అవసరమే వచ్చినా, దాని పక్కనలుగుడు సొత్తుకు చేజాస్తానా? యిచ్చే ప్రభువులున్నారు. రాజాంగంగా పుచ్చుకుంటాను- పుచ్చుకుంటూనే ఉన్నాను!
అంతేకదా మరి రివాజు.
యిచ్చే యీడున యిచ్చుకోవాలి. పుచ్చుకొనే తీరున పుచ్చుకోవాలి.
నిన్నగాక మొన్న కళ్ళు తెరిచిన యీ బొడిపెలకు మచ్చికలూ తెలియవ్, మర్మాలు తెలియవ్ – పోనీండి బాబూ, అది కాకపోతే మానె, దాని అక్కకూతురు మరొక్కతె అనువుకొచ్చేను. రేపో మాపో, మంచి పొద్దు వేళకు నేను వెంటబెట్టుకొచ్చేను.
మాంచి వద్దికా వనరూ ఉన్న దాన్ని, దిద్ది తీసుకొస్తాను. హస్తార్పితం చేస్తాను. ఆపైన అంటారా –
అడిగించుకునే అలవాటుందా, యీ అందాల బాబుకు? ‘అద్దిరా సుద్ది’ అని అద్దాల మేడకు వచ్చినదాన్ని వట్టి చేతుల్తో పంపివేస్తారా, యీ వైభోగ వసంతరాయలు నిద్దురలోనైనా, నిలువునీటు మానని, యీ మానినీ మన్మధులు మాచేత పేద అరుపులరిపిస్తారా? కలలో మాట.
ఎదట ఉన్నవారు, ఎప్పటి కప్పుడు పెళ్ళికొడుకులే! మమ్మేలేవారు, ఊరుకూ వాడకూ బాలాకుమారులే!
మీ సిరిగల పాదాలకు మ్రొక్కి, మరులిచ్చే చూపులకు సొక్కి, మా కందని చెక్కిలి ఓరకంట నొక్కి, మీ దివ్యరూపమే మనసులో కాగిట బట్టి –
ఏ విరి బోణికైన వెన్నుడవై,
ఏ మోహినికైన, ఈశ్వరుడవై,
ఈవీ ఠీవీ వెదజలులకుంటూ,
వెన్నెలంత వేడుకతో, విలసిల్లాల
లని విన్నవించుకుంటున్న దాననై’
సెలవు పుచ్చుకుంటున్నాను బాబూ….మరి, నాకు సెలవిప్పించండి బాబూ,
వేగిరం సెలవిప్పిస్తే వెంటనే తిరిగి వచ్చి, మరో ముచ్చట సానుకూలం జేస్తాను బాబూ తమరి చేతిమీదుగా సెలవు పుచ్చుకుని కదిలిపోతాను బాబూ.
దొరవారు పలుకలేదు. చేతులు కట్టుకున్న దాని వంకకు జూసి, తల ఎగర వేసినారు. వాడు, పిడికిలి డమరుకమల్లె ఆడించగా, మాణిక్యము, దొరవారి సన్నిధినుంచి కదలంగా – యిక పండిత గోష్టి ప్రారంభమైంది.
…పంజరంలో పెరుగుతూన్న చిలుకను, దొరవారి సన్నిధిలో, అల్లంత దూరంలో ఉంచగా, వారు చేత ఫలమందుకుని, దానికందకుండా కవ్వించంగా, పులుగు స్వస్తి వాచకముగా, సంబోధన ప్రధమలతో, ప్రభువుల గుణగణాలు ఒక్క సహ్రసము పైగా, సంతచెప్పి వింత వింత తద్ధితలు పన్ని, లుగలుక్సమాసములు అల్లి, దండాన్వయముతో చెండాడి, దొరవారి తల్లి తోబుట్టువుల వీరవిహారములు ఒక్కొక్కరుక్కుగా, ఘన జటక్రమాలు గుప్పించి, శాంతిపన్నము ముమ్మారు రెట్టించి, దొరవారి మునివ్రేలు, ఒడిసిపట్టి ఆకలి నొక్కు నొక్కంగా, వారు తమ పాండిత్యము దాని మీద కురిపించంగా చిలుకతోబాటు సేవకులూ, ఱెక్కలు ఎగురవేస్తూ సంబరాలు పోగా –
ఆ తరుణాన, బాబాజీ బుచ్చి తిమ్మ బహదర్వారు వరఫ్ బుచ్చి నాయన, ముందు వర్తమాన మంపకుండా, దయచేసిన వారు కాగా –
దొరవారు దిగ్గున లేవబోయి, తాములేచి నిలుచున్నంత గౌరవాలు సేయంగా, సేయపోగా, వారిని వారించినవారై, ఏమని సెలవిచ్చినారంటేను –
‘‘తమరు, యిలా నిత్యానందులుగా ఉండటం –
తమ సన్నిధిలో, యీ వినోదాలు పొగడం –
తమతోబాటు సేవకులూ సంతోషాన ఉండటం…’’
‘‘మన పుణ్యం’’ ‘‘మన దేవాంశసంభూతులం కదా నాయనా’’ ‘‘చిత్తం, తల్లులు కన్నారు – దాదులు పెంచారు.
దేవతలం కనుక మనిషి బుద్ధులు మనకు నేర్పలేదు మనుష్యులను చేయలేదు మనం సంభూతులమా – బూతులమా సెలవీయండి-
మనం ఏనాడూ, అమ్మను అమ్మా అని పిలువలేదు. అమ్మచేతి గోరు మద్దలు తినలేదు, వారి చంక నెక్కలేదు అందుకనే మనకింత కసి, పక్షి చేత పలుగుచేత వారిని తిట్టించి, మనం పరమానంద పడతాం – చిత్తగించారూ!
ఈ ఉదయాన్నుంచీ – దేవతల రోజులు పోయినాయి, మనుష్యుల రోజులు వచ్చినాయ్ యిది, మనుష్యులూ, మానుషాలూ ఉండే కోట, దేవతలకు చోటు లేదు. తమకు దేవిడీమన్నానువారం తవ్వించేస్తున్నా. కోట పడగొట్టించేస్తున్నామ్. ఈ ఆట కట్టు నేను మనుష్యుల్లో మనిషి నౌతాను. తమరు దేవతలు కనుక ఏ దేవాలయానికో దయచేయవచ్చు’’ అనంగా,
‘‘మా, నాయనకు ఎవరిమీదనో కోపం వచ్చినట్లుంది.’’
‘‘నా మీద నాకే అది మీ మీది కొచ్చేనేమో – చెట్టుకు కట్టిస్తానో, చెంప పెట్టు పెట్టిస్తానో, కట్టుబట్టలతో గుమ్మం అవతలకు నెట్టిస్తానో – చెప్పలేం.
చేతికిందినమట్టుకు స్వీకరించి, విజయం చేయండి. నాయన అక్కడ నిలువలేదు.
దొరవారికి, మరి కాలు నిలువలేదు. సరివారితో మంతనాలు చేశారు. ఏలినవారి మాట సాగరాదనుకున్నారు.
దిక్పాలికులందరూ స్వర్గం విడిచిపోతే – దేవతల గతేంగాను ప్రభువులూ అని పరివారం మొరబెట్టుకోగా, మాంచిది, మే మెక్కడకు పోయేమురా – ఏలినవారికి ఏదో పీడ కలొచ్చింది. అంతే, కాని, యీ వెర్రి ఎంతసేపులే అని ఓదార్చినారు.
ఆ వెర్రి అట్టె నిలిచిపోయె – పోయి పోయి వేయి విధాలాయె. ఇక మనం కలుగజేసుకోవలెననుకున్నారు. సగౌరవంగా, కట్టివేయించి, గుట్టు చప్పుడు కాకుండా గట్టి చికిత్స చేయించవలెననుకున్నారు.
కాని, ఏలినవారు – ఏరీ-
మండలాధీశ్వరుల దగ్గిరికి పోయి వ్రాలారు. కరగ్రాహులు వీరి కరస్పర్శ చేసి, కూర్చుండవేసి, వరాలు విని, విని అర్థం కాని తనంలో, మాటల్లో ఉద్రేకం, ఆమనిషిలో ఉద్వేగం, వైభవంగా కాక వంటిగా రావడం, ‘మేము’ అన్న పలుకే లేకపోవడం – గమనించిన వారై, ‘‘జమీందారుగారూ’ మీ పెద్దలు బాహుబలంలో రాజ్యాలు సంపాదించినవారు. క్రింది తరాల వారు ప్రతాపంతో రాజ్యాలు చేసిన వారు. పరగణాలో ప్రజలకు దేవతలు మీరు. మామూలు మనుష్యులు కారు. ఎందుకో బెదిరినట్లున్నారు. భయం లేదు. మీకు సీమ ప్రభుత్వపు రక్షణ సర్వదా ఉండనే ఉన్నది. పోయి రాజ్యం చేసుకోండి’’ అన్నాడు. మీరు మహారాజులు మీకేమండి. అని మరీ మరీ అన్నాడు. నాయనకు, నిజానికి మతీ పోయింది. ‘‘నన్ను మీరన్నా మనిషిని చేయండి’’ అని వాపోయినాడు. చేయించినారు, చికిత్స –
పది కాలాలు గడిచినాయ్, బావుటాలు మారినాయ్ – దేశం అశోక చక్ర విహితమై, ధర్మం పాణిపాద రహితమై, గగనయానము కాగా – ఆనాటి రాజుసాలు వడుకు నూలు తెలి ఉడుపులు కట్టగా –
ఆనాటి విలాస విహారాలు, గీతాపారాయణ చేయగా, ఆనాటి నిద్ర లేని ముద్రాధికారం కుటీర పరిశ్రమ కాగా –
సాలెరాట్నం – సరకారు యిలాకా భవనాలకు ముఖ్యాలంకారం కాగా, ప్రజల మీదికి ప్రణాళికలు రాగా పరగణాలు చీలికలు కాగా, యిదే స్వాతంత్య్రంకాగా – నాయనకు విమోచన కలిగింది. విడుదల చేయించింది, ప్రభుత్వం.
కోటలేదు. కోట తాలుకు ఒక్క పిట్టలేదు. ప్రభువు వారి పెద్దలు చేసిన రాజ్యం, ప్రజలకు శ్రమదానమైంది.
మందిలో పడ్డారు నాయన- అది మాబాగే కాకపోయే – వెనుకటిజెమీందా రనేరు కొందరు – పాపం, వెర్రివాడనేరు కొందరు.
వీడూ మనతోబాటు మనిషే అనడు, అనలేదు ఒక్కడూ – నేనూ, మనిషినే నర్రా అని మరో వెర్రి నాయనకు –
దానికి, చికిత్స? ఊహూ మనిషిని మనిషిని చేయడం భగవంతుడికే చేతకాదు. ప్రభుత్వమేం చేయకలదు – పాపం సువారం ధొరవారున్నారే – వారు ఎలా కాలం గడుపుతున్నారంటావా, ఆ మాణిక్యం ఉందే, తిన్న విశ్వాసాన, తన పంచనుండనిచ్చి యింత కాచి పోస్తూన్నది. వారు, అదే ఠీవితో, అలనాటి రాజసంతో, నీమాజామాతో, ఓ కుక్కిమంచం మీద కూర్చున్నవారై, మతిలేదు కనుక మహారాజులల్లే, బ్రతుకుతున్నారు.
అబ్బాయ్ బాబాజీ బుచ్చితిమ్మబహద్దురున్నాడే, వారు… ఊహూఁ వాడు వీడే; ఆ బుచ్చయ్య.
ఒహరి నమ్మకా నమ్మకాలతో నాకు నిమిత్తం లేదు. యింతకాలానికి, నేనూ ఓమనిషినే అని, నామీద నాకు గట్టి నమ్మకం కలిగింది. వెర్రికి వేయి విధాలు. అందులో యిదొహటి అంటావా, అయితే మానెలే యీ తరహా నాకు ఆనందంగా ఉంది.
ఆఁ.. ఒక్క విషయం… ముఖ్య విషయం. నేచెప్పలేదు… నీవు అడగాలేదు. అదేమిటంటే…
ఒక్క ప్రశ్న… నేనే వేస్తాను. విప్పుతాను.
మా పుట కేమిటి? మా పెంపక మేమిటి?
మా నాయనగారు, వారి పెద్దలలాగానే, అన్ని అచ్చటలూ ముచ్చటలూ తీర్చుకుంటూ, ఓ కన్ను కోళ్లమీద, ఓ కన్ను జవరాళ్లమీదా, ఉంచి, ఎన్నడన్నా, ఠీవిగాను, ఏనుగో, గుర్రమో ఎక్కుతూ, తతిమ్మా వేళల్లో, బ్రతుకే పడకటిల్లుగా, జుట్టూకట్టూ, యథాలాభంగా చెరిగేందుకు యియ్యకొనే యిందువదనలు పందిరిమంచంగా, తోయజముఖుల తొలిప్రాయమే హంసతూలికాతల్పముగా, ఉవిదల ఉప్పొంగే ఉపబర్హణంగా, అలా అలా, వేదోక్తమైన పరిపూర్ణ ఆయుర్దాయము అనుభవించిన వారైనారనేది, జగద్వితమే.
నేనూ, అలాగే మెలగవలసిందే కదా? –
అబ్బాయ్, మా దాదులు, మాకు చిన్నితనంలోనే చిలిపితనం అలవాటు చేస్తారు. నూగుమీసాల వేళకు నూత్నమర్యాదలు అన్నీ సదరు సాముగరడీల క్రమాన తరఫీదు చేస్తారు. చవకబారుశృంగారం మాకు దూమెరుగు పెడతారు. సంసారి అయినవాడు కలలో అయినా తలవంచవలసిన అవకతవకలు, మాకు మర్దన చేస్తారు. ఆమత్నా మా సత్నా గతుకు మా బ్రతుకు అదే మా వరుస అలా క్రిందా మీదా పడుతూ, అదే స్వర్గమని భ్రమపడుతూ… నిత్య కృత్యాల్లో, ఏదో నిదురమత్తులో, ఆ పూటకు యింట విస్తరి వేస్తాం. ఒక్కొక్కప్పుడు వంశోద్ధారకుడు ఉద్భవిస్తాడు. అదీ, రాజసానికంగ రక్ష.
నేనూ ఆ తరహాను పుట్టినవాణ్ణే, అలా పెరిగిన వాణ్ణే. కాని, అనుక్షణం నన్ను వెంటాడి, నన్నాడించవలసిన ముసలీ నౌఖరుకు, మా గ్రహపాటున ముది ముప్పున, బుద్ధిమారింది. నాకు మంచి కథలు చెప్పాడు. మంచి తనం నేర్పాడు, మంచివాణ్ణి చేశాడు. మంచివాడనగా మామూలు మనిషిని మా పరిభాష అదీ గుడ్డిలో మెల్లలో లోతప్సీలు తెలియక, మా పరివారం, నన్ను పాన్పెక్కించాలని తంటాలు పడ్డది. యిక్కడ కోటలో చిన్న దొరవారు ఎదుగుతున్నారనగా, అక్కరకోసం, అక్కడక్కడ, కొన్ని పూలమొక్క లెదుగుతూంటాయి. వీళ్ళే, నిగా ఉంచి పెంచుతారు. అది అంతవరకూ చెల్లుతూ వచ్చింది.
కాలం ఖర్మం కలిసిరాగా, ఓనాడు, నన్ను, అల్లందుకు పెళ్ళి కొడుకును చేశారు. తగుబాటి మప్పారు. ఓ కుర్రదానిచేత, గులాబీలు నాకిప్పించారు. అలదాన్ని నా పాదసన్నిధిని కూచుండవేశారు. మీద పూవులు ద్రిమ్మరించారు.
‘‘గొజ్జంగిలా కొమరారి మల్లెలా మరులుపోయి, జాజిలా సరసాలిచ్చి సంపంగిలా, చెలువాల పరవళించి, పూజలే పురుషుడుగా, నోములే పూవుల మాలగా, యీ చిన్నది చేసుకున్న పుణ్యము పరిమళించాలి’’.
అని, ఆచేత ఆచేత దీవించిన వారై, నవ్వే నవ్వుకో వరహా, కులికే కులుకుకు ఓ మొహరీ, చొ. నేని కవిలుచుకునేందుకు తగినంత డబ్బు తలగడక్రింద ఉంచి, కొంగున కట్టేందుకు, జోడు రవ్వలిచ్చి, పై పైవాళ్లు వైదొలగంగా, ఒంటిపాటు చూసి, అక్ష్యది, ఓ కులుకు కులికి, నామీద మునివ్రేళ్ళ పన్నీరు చిలకంగా, దాని చెంప ఎగిరింది.
సంభాళించుకుని, మంచి గంధం అందుకుంది. మీది మీదికి వచ్చింది. పళ్లు రాలినంత పనైంది. మన దిదోతరహా సరసమనుకున్నంత వయారం పోయి, ఎడమచేయి, మెడమీదికి పోనిచ్చి, గడ్డం పట్టుకుని ముద్దులు కుడవబోయి, ఎగిరి అవతల పడ్డది.
ఆ పూటకు ఆ శృంగారం చెల్లు.
మరునాడూ, అదే తంతు, మరో శాల్తీ మార్చి, సాగించారు. పట్టుకు హూనం హూనం చేశాను. మళ్ళీ, ఎవళ్లూ మన జోలికి రాలేదు. అర్జునుడి శాపం మనకు తగిలిందనుకున్నారు. అంతతో, అరగడ తప్పింది.
పరగణాలో అంటే మనం కాపురం చేస్తున్న ఊరిలో ప్రజలు ఎలా బ్రతుకుతున్నారా అని ఓ రాత్రి ఒక్కణ్ణే, తిరగబోయినాను. కోవిలకు పోయినాను. అక్కడో ధూపం లేదు, దీపం లేదు. కళలేదు, కాంతి లేదు. చీకట్లో ఎవడో పడుకుని బీడీ కాలుస్తున్నాడు. పరదేశినని నన్నూ బబ్బోనిచ్చాడు. వాడివల్ల కొంతవైనం తెలిసింది. అర్చకుడున్నాడే వాడు హుటాహుటి సాని కొంపనించివచ్చి, స్వామివారిమీద యిన్ని నీళ్లు జల్లుతాడంట. చిన్న జమీందారుగారికి, యుక్తవయసు వచ్చింది గనుక, వారిని పానుపెక్కించేందుకు ప్రజలదగ్గిర, డబ్బు దండుకున్నారట. చెప్పి చెప్పి యీ రాచరికాలు తుడిచిపెట్టుకుపోతేకాని, దేశం బాగుపడదు అనేశాడు. పారజూడగా, నాకూ అలాగే అనిపించింది. మేం ప్రభుత్వం చేసేది ప్రజల ఘోషకా? వాళ్ళ సొమ్ము మాభోగాలకా? అనిపించింది.
మనుష్యులమీద పశువులు ప్రభుత్వం చేయడమా అనిపించింది. మొత్తం ఛీ అనిపించింది. కలగజేసుకున్నాను. మల్లాగుల్లాలు పడ్డాను. మనిషినైనాను. ప్రజలకు మా బాధ తప్పింది. ఔనా!
మీరు పెట్టిన బాధలో బాధలా హింసబెట్టేందుకు నూతనవిధాన, పథకాలూ ప్రణాళికలూ వచ్చి పడటం లేదా అంటావా –అది, పరమాణువు పరిష్కరించాల్సిన సమస్య. నేను, యిన్నాళ్ళకు ఓ మనిషిని, అదే నాకంగరక్ష.

———–

You may also like...