పేరు (ఆంగ్లం) | Tirumala Ramachandra |
పేరు (తెలుగు) | తిరుమల రామచంద్ర |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 6/17/1913 |
మరణం | – |
పుట్టిన ఊరు | అనంతపురం జిల్లా ధర్మవరం తాలూకా రేగటిపల్లె |
విద్యార్హతలు | తెలుగు,సంస్కృతాలలో విద్వాన్ గా హిందీలో ప్రభాకరగా పట్టాలు పొందారు. |
వృత్తి | ద్వితీయ ప్రపంచ యుద్ధ కాలంలో సైన్యంలో హవల్దార్ గుమాస్తాగా ఆప్ఘనిస్థాన్, బెలూచిస్థాన్, సరిహద్దుల్లో పనిచేశారు. |
తెలిసిన ఇతర భాషలు | న్నడ, తమిళ, సంస్కృత, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త. |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మన లిపి-పుట్టుపూర్వోత్తరాలు, నుడి నానుడి, సాహితీ సుగతుని స్వగతం, గాధా సప్తసతిలో తెలుగు పదాలు, తెలుగు పత్రికల సాహిత్య చరిత్ర, హంపీ నుంచి హరప్పా దాక |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | పత్రకార శిరోమణి, కళాసరస్వతి, మహామహోపాధ్యాయ |
ఇతర వివరాలు | వేటూరి ప్రభాకర శాస్త్రికి ఏకలవ్య శిష్యునిగా చెప్పుకుంటున్న తిరుమల రామచంద్ర విద్వాన్ విశ్వం వంటి సహాధ్యాయులతో పనిచేశారు. అనంతరం ఢిల్లీ వచ్చి డెయిలీ టెలిగ్రాఫ్ ఆంగ్ల పత్రికలో చేరి పాత్రికేయ వృత్తిలో స్థిరపడ్డారు. 1944 లో పత్రికా రంగంలో పనిచేశారు. తొలుత తెలంగాణా పత్రికలో పనిచేసి తర్వాత మీజాన్ లో చేరి ఆ పత్రిక సంపాదకుడు అడవి బాపిరాజు శిష్యరికంలో రాటుదేలారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | తిరుమల రామచంద్ర ‘హంపి నుంచి హారప్పా దాక’ …స్వీయ చరిత్ర |
సంగ్రహ నమూనా రచన | “చలంతి గిరయః కామం యుగాంత పవనాహతాః క్రుచ్చ్రే పి న చలత్వేవ ధీరాణా నిశ్చలం మనః “ (ప్రళయ కాలంలో పెనుగాలులు వీచినప్పుడు పర్వతాలు కూడా చంలించిపోతాయి . కాని ఎంతటి కష్ట కాలంలోనూ ధీరుల మనస్సు చలించనే చలించదు. ) |
తిరుమల రామచంద్ర
‘హంపి నుంచి హారప్పా దాక’ …స్వీయ చరిత్ర
“చలంతి గిరయః కామం
యుగాంత పవనాహతాః
క్రుచ్చ్రే పి న చలత్వేవ
ధీరాణా నిశ్చలం మనః “
(ప్రళయ కాలంలో పెనుగాలులు వీచినప్పుడు పర్వతాలు కూడా చంలించిపోతాయి . కాని ఎంతటి కష్ట కాలంలోనూ ధీరుల మనస్సు చలించనే చలించదు. )
మాకు బళ్లారి , అనంతపురం జిల్లాలలో శిష్య సంచారం ఉండేది . మా నాయనగారు శిష్య సంచారం వెళ్ళడం నేను చూడలేదు . గాని , మా తాతగారు వెళ్ళడం నాకు తెలుసు . ఒకటి రెండుసార్లు నేనూ ఆయన వెంట వెళ్లాను . ఆ సంచారం హడావుడి చాల ఉండేది . శిష్యులు విశేష కార్యాలకు , ఏమైనా ఆస్తిపాస్తుల తగాదా పరిష్కారాలకు మా తాతగారిని పిలిపించేవారు . ఆయన అట్టహాసంతో బయలు దేరేవారు .
మాకు ఒక మామూలు వ్యవసాయ ఎడ్ల బండి , ఒక ఒంటెద్దు బండి , ఒక పెట్టె బండి ఉండేవి . దొడ్లో నాలుగు దుక్కి ఎడ్లు , నాలుగు ఆవులూ ఉండేవి . పెట్టె బండికి కట్టే మైసూర్ ఎడ్లు , పొడుగాటి మోరలు ఒక దానివైపు మరొకటిగా వంపు దిరిగిన అందమైన కొమ్ములు , కొమ్ముల కొనకు ఇత్తడి పొన్నులు . ప్రయాణ సమయంలో మెడలో గజ్జెలు గంటల పట్టెడ , తెల్లటి దేహంతో చాల అందంగా ఉండేవి . మహా వేగంగా వెళ్ళేవి . పెట్టె బండిలో ఇప్పటి జీపులోలాగ నాలుగు వైపులా కూర్చోడానికి బల్లల అమరిక , అడుగున గడ్డి , తౌడు , పొట్టు వేసే భోషాణం వంటి పెట్టె , అవసరమైతే పడుకోవడానికి బళ్ల కూర్చు , గట్టి కప్పు , ఎదుట రెండు లాంతర్లు పెట్టడానికి ఇత్తడి చట్రాలు , తోలే వాడికి కూర్చోవడానికి బల్ల .
ఈ విధంగా గుర్రపు బగ్గీలానే ఉండేది . ఆరేడుగురు తాపీగా కూర్చోవచ్చు . మధ్యన ఒకరిద్దరు పడుకోవచ్చు . బండికి రెండు వైపులా తలుపులున్న రెండడుగుల కిటికీలు . ముందొక కిటికీ , వెనుక తలుపు మూసినా గాలి రావడానికి తలుపులకు పై భాగాన కిటికీలు . ఎంతో ముచ్చటగా వుండేది . ముందు వెండి డవాల్ బంట్రోతు నడిచేవాడు . డవాల్ పై “శ్రీ మద్రాజాధి రాజ పరమేశ్వర విజయనగర సార్వభౌమ గురుస్వామిగళు “ అని కన్నడంలో బిరుదావళి మాకే .ఎక్కడికి వెళ్ళినా , ఏ దేవాలయంలోనో – హనుమంతుని దేవాలయంలో విడిది ఏర్పాటయ్యేది . మా వెంట ఒకరు మా బంధువులలోని వారు సహాయంగా వచ్చేవారు . ఆయనే వంట , వడ్డన చేసేవారు . మా అమ్మ వెంట వెళ్లేట్లయితే ఆమె వంటా వడ్డన చేసేది . మేము సంచారంలో ఉన్నన్నినాళ్ళూ , దినమూ శిష్యులకు ప్రసాదంగా పిండి వంటలు వండాలి బొబ్బట్లు , పూర్ణ కుడుములు , వడలు , అతి రసాలు , పులి హోరా , చక్కెర పొంగలి , ఉప్పు పొంగలి , దధ్యోదనం మొదలయినవి . పచ్చళ్ళు చిప్పలలో పెట్టి వాసెన కట్టి , పట్టు గుడ్డగాని , ధావళి వంటి నార గుడ్డ గాని చుట్టి వెంట తీసుకొని వెళ్లే వారు . ఎక్కువ రోజులు ఉండవలసి వస్తే .
ఒక మారు ‘నారాయణ దేవరకెరే “ అనే గ్రామానికి మా తాతగారి వెంట సంచారం వెళ్లాను పెట్టె బండిలో . నాకు ఆరేళ్లుంటాయి . నారాయణ దేవరకెరే కమలాపురానికి దాదాపు 25 మైళ్లు దూరంలో ఉందని జ్ఞాపకం . ఇలాంటి ప్రయాణాలకు రాత్రి భోజనం చేసి బయలుదేరడం , ఎడ్లు ఎంత నెమ్మదిగా నడిచినా తెల్లవారుజాముకు గమ్యం చేరుకోవడం మామూలు . రాత్రి ప్రయాణం గనుక అయితే ఆరిపోయిన దివిటీలు కూడా దగ్గర ఉంచుకొనే వారు . క్రూర మృగాలు ఏమైనా వస్తే అంటించి బెదర గొట్టడానికి . ఒకటి రెండు బల్లెలు , బండిలో అడుగున పడేసి పెట్టేవారు . ఆ పద్ధతిలోనే మా నారాయణ దేవరకెరే ప్రయాణం ప్రారంభమైంది .
ఆ దారి ఆ కాలంలో దట్టమైన అడవి . మంచి కంకర బాట . తారు ఇంకా రాలేదు . మేము భోజనం ముగించుకొని దాదాపు తొమ్మిది గంటలకు బయలుదేరి ఉంటాయి . ఒంటి గంటకో , రెండు గంటలకో , దారిలో ఉన్నాము . రెండు వైపులా కీకారణ్యం , మా బండి వెంట మరి రెండు మూడు బండ్లు వస్తున్నాయి . నేను బండిలో నిద్రపోతున్నాను . అకస్మాత్తుగా నాకు మెలకువ వచ్చింది . మా తాతగారు నన్ను పట్టుకున్నారు . మా సహాయకులు కంగారు పడుతున్నారు . నాకు బాగా జ్ఞాపకం ఆ సంఘటన . పెద్ద పులి దారికి అడ్డంగాపడుకుంది . మా అమ్మ పులి , గోవు , పులి గొల్ల పిల్ల వాడు కథలో చెప్పినట్లు అచ్చంగా అట్టే ఉంది . దారి అంతా ఆక్రమించుకుంది . దానిని దాటిపోవడానికి వీలు లేదు . హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంది . తల ఎత్తి గంభీరంగా చూస్తున్నది . రెండు కళ్లూ మా బండి దీపాల కన్నా ఎర్రగా వెలిగిపోతున్నాయి . మాకూ దానికీ దూరం దాదాపు ఇరవై గజాలు . మా బండి మొదట్లో నడుస్తుంది . గనుక మా బండి ఆగగానే వెనుక వచ్చే మూడు నాలుగు బండ్లు తోలే వాళ్లు దిగి మా బండి వైపు వచ్చారు . పులి కళ్ళు జ్యోతుల్లాగ వెలుగుతున్నాయి . మా బండి దీపం వెలుతురులో దాని పచ్చని నల్లని చారాల ఒళ్లు మసకమసకగా కనిపిస్తూంది . బళ్ల వాళ్లు అల్లరి చేయబోయేరు . అల్లరికి పులి ప్రాణ భయంతో మన మీద పడితే …? ఒక దూకుతో మా బండిని అది అందుకోగలదు .
మా తాతగారు చాలా తెలివిగలవారు . సమయస్ఫూర్తి మన స్థైర్యం గల వారు . అల్లరి చేయ వద్దన్నారు . కాగడాలు వెలిగించమన్నారు. క్రూరమృగాలు నిప్పు చూస్తే భయపడతాయి . వాటిపైన దాని చేస్తే గాని , సందేహం కలిగితే గాని అవి ఎదురు దాడి చేతాయి . అందులోను పులి , సింహం వంటివి ఎదుట పోట్లాడక వెనుక వాటుగా దెబ్బ తీస్తాయి . ఎదుటి నుంచి ఎవరైనా వస్తే తప్ప మాకు రక్షణ లేదు . పులి ప్రశాంతంగా చూస్తూనే ఉంది . బండి వాళ్లు ఎడ్లను కూడా బలమైనవి . వాటి నొసలు విప్పి వేయమన్నారు . ఎడ్ల నన్నిటిని మా బండి ముందుకు తోలుకొని రమ్మన్నారు . వాటికి కూడా ప్రాణ భయమే !కాని , వాటిలో ఒక గుణం ఉంది . సాధ్యమయినంత వరకు ఆత్మ రక్షణకు ప్రయత్నిస్తాయి . ఎదిరి బలం ఎక్కువగా ఉన్నప్పుడు పారిపోవడమో , పోరాడుతూ చావడమో తప్పదు !
ఎనిమిది ఎడ్లూ మా బండి ముందుకు వచ్చాయి . ఆత్మ రక్షణ కోసం సహజంగానే వ్యూహం పన్నాయి . అర్ధ చంద్రాకారంగా నిలబడ్డాయి . తలలు కొద్దిగా పంచి బుసలు కొడుతూ కొమ్మలు చూపోతూ , చూస్తున్నాయి . పులి శరీరం కొద్దిగా కదిలింది . ఇంతలో కాగడాలు ముట్టించి జనం పక్కగా నిలబడ్డాయి . కేకలు వేస్తే తక్కిన బళ్లలోని పిల్లలు , ఆడవాళ్లు భయపడతారని మా తాతగారు ఆజ్ఞాపించడం వల్ల మరణ భయంతో అంతా ప్రశాంతంగా జరుగుతోంది . పులిని రెచ్చగొట్టే ఏ పని జరగడం లేదు .
ఎడ్లు తమ పైకి పులి పాకితే పొడవడానికి సిద్ధంగా ఉన్నాయి . పులి లేచి నిలబండింది . కాని రోడ్డుకు అడ్డంగానే ఉంది . తోకను భయంకరంగా ఆదిస్తూంది . దాని అశక్తత , దురదృష్టం ఆ తోక విసుర్లలోనే వ్యక్తమవుతోంది . ఎదుట అటూ ఇటూ కాగడాలు , మోహరించిన ఎడ్లు .
పులి ఇటే చూస్తుంది . కాగడాల వెలుగులో దాని ప్రతి చలనమూ కనిపిస్తూంది . అటు పక్కకు గాని ఎదురుగా గాని తల తిప్పనైనా తిప్పడం లేదు . చెవులను మాత్రం ఆడిస్తూంది . దాని కోపమంతా తోక కదలికతోనే కనిపిస్తున్నట్లుగా ఉంది . తోకతో పాటు చూస్తే రోడ్డంతా అదే నిలబడినట్టు కనిపించింది . దాదాపు అరగంట గడిచింది . పులి యిక్ ఊరక ఉండలేక ఒకసారి గాండ్రించింది . ఆ నిశ్శబ్ద నిశీధిలో ఆ గాండ్రింపు ప్రతి ధ్వనించింది . నేను ఉలిక్కి పడ్డాను . మా తాతగారు , సహాయకులు నన్ను పట్టుకున్నారు. ఎడ్లు మరింత చురుకుగా చూస్తూ ఏ మాత్రమూ సందు లేక నిలబడి బుసలు కొడుతున్నాయి . ఆ గాండ్రిం పునకు ఒకటి రెండు ఎడ్లు మూత్ర విసర్జన చేసినట్టు గుర్తు . అయినా కొమ్ముల అర్ధ వలయం నుంచి వెనుకకు తగ్గ లేదు .
ఒక గంట గడిచింది . ఎదుటి నుంచి రెండు వస్తున్నట్లు చప్పుడయింది . పులి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ పక్కన అడవిలోకి వెళ్లిపోయింది . ఎడ్లు మాత్రం చాలా సేపు అట్లాగే నిలబడ్డాయి . పక్క నుంచి దెబ్బ తీస్తుందేమో నని కొమ్ములు మారుస్తూ , పులి వాసన దూరమయ్యే వరకూ అవి సహజ స్థితికి రాలేదు . రాత్రి రెండు దాటి వుంటుంది . అలజడి తగ్గింది .
మా తాతగారు బండి దిగి మా బండి ఎడ్ల వీపులు నిమురుతూ మూపులు తట్టారు . అవి గోముగా మోరలు ఎత్తి మా తాతగారి వైపు జరిగాయి . ఆయన వాటి గంగ డొల్లను తడుముతూ ముద్దు చేశారు . ఎంత ముచ్చటయిన దృశ్యం ! నా కోసం తాతగారు అంత వరకు బండి దిగలేదు . నేనూ దిగి వాటి ముందు నిలబడ్డాను . అవి నా చేతులు నాకుతూ ఉంటె నేను భయంతో , ఆనందంతో ఏదో చెప్పరాని ఆవేశంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాను .
ఎడ్లను మళ్లీ బండ్లకు కట్టారు . దివిటీలు మాత్రం ఆర్పలేదు . కొందరు దివిటీలతో కొంత దూరం బండ్ల వెంట నడిచారు . సూర్యోదయానికి గాని మేము నారాయణ దేవరెకే చేరలేకపోయాము .
మా తాతగారి వ్యూహ రచనా చతురత , మనసూ నిబ్బరం శిష్యులు విన్నారు . ఆయనపై వారికి గౌరవం ఇనుమడించిందని వారి మాటలు , చేతల వల్ల నేను గ్రహించాను . అందరూ నన్ను “సన్న సామేరు (చిన్న స్వాములు ) అదృష్టవంతులు “ అన్నారు . విడ్డూర మేమిటంటే కష్ట పడింది నేను తప్ప అందరూ . కాని నేను అదృష్టవంతుణ్ణి !!
“బహూనా మల్ప సారాణాం
సమవాయో దురత్యయః
త్రునై ర్విధీ యతే రాజ్జుహ
బధ్యతే తేన దంతినః “
(బలహీనులయినా చాల మంది ఐక్యమత్యంతో కలిసికట్టుగా వుంటే , వారిని జయించడం కష్టం , గడ్డు పోచలతో తాడు పెనుతారు . ఆ తాడుతోనే ఏనుగులను కటి వేస్తారు . )
సేకరణ : ‘హంపి నుంచి హారప్పా దాక’ …స్వీయ చరిత్ర
———–