పేరు (ఆంగ్లం) | Utukuri Lakshmi Kanthamma |
పేరు (తెలుగు) | ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ |
కలం పేరు | కృష్ణకుమారి అనే పేరుతో సాహిత్య వ్యాసాలు,పద్యాలు వ్రాసారు. |
తల్లిపేరు | నాళం సుశీలమ్మ |
తండ్రి పేరు | నాళం కృష్ణారావు |
జీవిత భాగస్వామి పేరు | ఊటుకూరి హయగ్రీవ గుప్త |
పుట్టినతేదీ | 12/21/1917 |
మరణం | 12/1/1996 |
పుట్టిన ఊరు | ఏలూరు |
విద్యార్హతలు | ఉభయ భాషా ప్రవీణ – సంస్కృతం, తెలుగు |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం, ఆంగ్లము, హింది |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఆంధ్ర కవయిత్రులు, కాంతి శిఖరాలు, కన్యకమ్మ నివాళి, ఒక చిన్న దివ్వె, సాహితీ రుద్రమ, సరస్వతి సామ్రాజ్య వైభవం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | ఆంధ్ర యూనివర్సిటీ నుండి 1976 లో కళాప్రపూర్ణ, ఆంధ్ర సరస్వతి, ధర్మ ప్రచార భారతి, సంగీత సాహిత్య కళానిధి, విద్వత్కవయిత్రి |
ఇతర వివరాలు | ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు మొలక, విద్వత్ కవయిత్రి అని కూడా అనేవారు. కనకాభిషేకం, గజారోహణం లాంటి సన్మానాలు లక్ష్మీకాంతమ్మ గారికి మాత్రమే జరిగాయి. సాహితీ రుద్రమ అని ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ అయిన దేవులపల్లి రామానుజ రావు గారిచే అనిపించుకున్నారు. గాంధీ గారి ఆదేశాలను అనుసరించి స్త్రీల నుండి బంగారు ఆభరణాలను సేకరించి సమర్పించారు. గాంధీ గారు భుజం తట్టి అభినందించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఊటుకూరి లక్ష్మి కాన్తమ్మ ఆంధ్ర కవయిత్రులు |
సంగ్రహ నమూనా రచన | మధురాతి మధుర మగు ఆంధ్రసారస్వతవాహినిని కమ్మని కవితా మరందములు చిందించిన కవయిత్రులు పూచిన పొందమ్ములై పరిమళించుచున్నారు . ఆమె నలువరాణికి చానలు ఉపాయనముగ పచరించిన తొలి పూజా పద్మము . ఆమె భారతీసతి మంజులపద రాజీవములకడ మోకరిలిన మొదటి పూజారిణి . ఆమె వాగ్దేవీ సంసద్భవనమున ఆంధ్రకవయిత్రీ ప్రాతినిథ్యము నంగీకరించిన ప్రధమాస్థాని |
ఊటుకూరి లక్ష్మి కాన్తమ్మ
ఆంధ్ర కవయిత్రులు
ప్రాచీనాంధ్ర కవిత్వము – తొలి తరము
చానమ , ప్రోలమ
మధురాతి మధుర మగు ఆంధ్రసారస్వతవాహినిని కమ్మని కవితా మరందములు చిందించిన కవయిత్రులు పూచిన పొందమ్ములై పరిమళించుచున్నారు .
ఆమె నలువరాణికి చానలు ఉపాయనముగ పచరించిన తొలి పూజా పద్మము .
ఆమె భారతీసతి మంజులపద రాజీవములకడ మోకరిలిన మొదటి పూజారిణి .
ఆమె వాగ్దేవీ సంసద్భవనమున ఆంధ్రకవయిత్రీ ప్రాతినిథ్యము నంగీకరించిన ప్రధమాస్థాని .
ఆమె సుందరాంధ్ర మహిళా వాజ్మయాంబబరమున నుదయించిన తొలితార . అపూజ్యురాలు చానమాంబ . అది పదమూడవ శతాబ్దము .
పూజ్యుడు నన్నపార్యుడు బీజావాస మొనర్చు , కవి బ్రహ్మ తిక్కనార్యుడు ప్రోది సేసి తెలుగు సారస్వత శాఖని ఆంధ్రావళి మోదముం బొరయునట్లు అమృత ఫలములు గాయించినాడు . కవి లోకమున కాతడు నిజముగ విధాతయే. నిర్మాణ రహస్య మేమో , మహిళా లోకము నను ఆ కవి వర్యుని కుటుంబము ననే ప్రధముగ చానల మోమున సరస్వతి యావిర్భవించినది.
చానమ రణ తిక్కన యని రాణ కెక్కిన ఖడ్గ తిక్కనార్యుని కుల కాంత . తెలుగుల కవి బ్రహ్మకు వావికి వదినగారు . కరుణామయ దృశ్యముచే కంపితమై కఱిగిపోయిన ఆదికవి వాల్మీకి ఋషిసత్తముని హృదయ సాగరము నుండి పొంగులు వారుచు కవితారంగములు కురంగలించినట్లే . రణ క్షేత్రమునుండి పరీభూతుడై పగరకు వెన్నిచ్చి పారి వచ్చిన పతిని గాంచి వచ్చినతోడనె , ఉమ్మలికము చెందిన వీరపత్ని చానమాంబాహృదయాంతరాళాము నుండి పై కుబికిన శౌర్యాగ్ని విస్ఫులింగములో యనునట్లు . చటులార్భటితో సరస్వతి చానమాంబా ముఖ కందము నుండి వెడలి చర్రున సాక్షత్కరించినది .
ఆ కందమె స్త్రీ సారస్వత సృష్టికి మూల కంద మయినది .
పగరకు వెన్నిచ్చినచో ,
నగరే నిను మగతనంపునాయకు లెందున్ ?
ముగు రాడువార మైతిమి ;
వగ పేటికి జలక మాడ వచ్చిన చోటన్ ?
ఓహో ! ఏమి యా వాగ్దేవి వీరరసావతరణ ప్రాభము ! మచ్చున కైనను వ్యర్ధ పదము కానరాదు . భావనకై యగచాట్లు గాని , పదములకై తడబాట్లు గాని , యతి ప్రాసల కొరకై మతి మాలిన యవస్థలు కాని యేమియు గానంబడవు . అవమానము చేతను , ఆక్రోశము చేతను ఉత్తప్తమైన హృదయము నుండి సూటిగ వెల్వడిన కైత యిట్లుండక ఎట్లుండును ? అగును . మఱీ నాధుడు విజయలక్ష్మీసనాధుడై నేత్ర పర్వముగా దిరిగి వచ్చినచో , ఆంద్ర లక్ష్మికిని , విజయ తేజో విరాజమాన మగు భావావేశ మును మది పదిలపఱుచుకొని యా పుణ్యముహర్త మెపుడెపుడా యని యెదురుచూచు సతి యెదకు భండనము నుండి పారివచ్చిన పతి దేవుని ప్రాణముల తీపి సహ్యమాన మగునా ? ఆ యా వేశమే ఉత్తాలతాలతరంగి తమై కట్టలు త్రెంచుకొని హృదయపుటంచుల దాటి పెల్లుబికి వెల్లి విరిసినది .
చానమాంబ చక్కని కవితాత్మ గల కాంత యని యా కందమె చాటుచున్నది . ఆమె కావ్య సూనముల గ్రుచ్చి వాగ్దేవి కంఠహారముగ నలంకరించు నవకాషమె యుండిన , మనమును మేరలు లేని కావ్య పఠనానందము నొంద గల మహాభాగ్యము నంది యుందుము . కాని యేమి లాభము ? అట్టి నోము నోచమైతిమి .
ఇంతియె కాదు – ‘ఇదం బ్రహ్మ్యం .ఇదం క్షాత్త్రం ‘అన్నట్లు కవి తిక్కన , ఖడ్గ తిక్కనను తెనుగు ప్రజకు కాన్క లిచ్చిన ముదుసలి ప్రోలమ కడు పెంత బంగారపు గనియొ కాంచితిరా ? ఒక వంక వీర రస తరంగితమహా సాగర మాతల్లి గర్భాసీమ . ఆ గర్భశుక్తి ముక్తా ఫలమో రణ తిక్కన ! ఒక వంక గమ్మన వలచు కవితా కర్పూర సౌరభ్య సంవాసిత మా చల్లని తల్లి గర్భాసీమ . ఆ తల్లి కడుపు పొందమ్మిని పొట మరించిన మరంద బిందువే కవి తిక్కన .
ఒకపరి శౌర్య రసము చేపి చన్గుడిపిన వీర ప్రసవ యామె . ఒకపరి పొత్తిళ్ళ పసి బాలునకు కవితార సామృతము పాలిచ్చి పెంచిన డా తెల్గుల భాగ్యరాశి . తిరిగి వచ్చిన సుతుం గాంచి యామె ఏ మన్నదో చూడుడు .
అసదృశముగ నరి వీరుల
పస మీరగ గెలువ లేక పంద క్రియ , నీ
వసి వైచి తిరిగి వచ్చిన
పసులున్ విరిగినవి తిక్క పాలున్ విరిగెన్ “.
పలుకులా యివి ! గరళపుములుకులు గాని ! ఆ కుటుంబ మెంత గౌరవార్హమో ! అత్త కవియిత్రి ! కోడలు కవయిత్రి ! కుమారుడు కవిబ్రహ్మ ! యిం కేమి కావలయును ఆ కుటుంబమునకు , అట్టి కుటుంబమును గన్న తెల్గు దాత్రికిని ?
ఈ యాడువారి ప్రతాపాగ్ని చ్చటుల ధాటి కోహటించ లేకయే కదా , ఖడ్గ తిక్కన రణసీమకు మగుడి వెడలి యద్భుతముగ నరివీరుల కసిమసంగి విజయలక్ష్మిని చేపట్టినాడు !
స్వదేశమునకు సమరవిజయమును సముపార్జించిన యా కవయిత్రుల తేజో లేఖని యాంధ్ర దేశమున నేటికిని నజరామారకీర్తులతో శోభిల్లుచున్నది .
ఇది స్త్రీ వాజ్మయరంగాలంకరణము సవరించిన ప్రారంభయుగము .
—— ఇది ప్రారంభము ———
సంస్కృత మహా కావ్య కర్త్రి
3 . గంగాదేవి – మధురా విజయము
విద్యా నగర సామ్రాజ్య మహా పీఠమును మలిచిన మహా శిల్పులు సంగ వంశరాజుల శక్తి సామర్ద్యముల నేల నాలుగు దెసలకును సారించిన స్వర్ణయుగ మది ! అందు 1370 సంవత్సర ప్రాంతమున రాజ్య మేలిన మూడవరాజు కంపరాయలు పుట్టువు తోడన స్వీయప్రతామున పరివంధుల నాసాంతము కంపింపజేయు సార్ధకనాము డని దేవేరి గంగాదేవిచే సంస్కృత కావ్యమున ప్రాభవ వర్ణనము లొందిన వసివాళ్వాడని వన్నెకాడు .
గంగాదేవి విద్యా నగర సామ్రాజ్యమునకె కాదు , వాద్యా ప్రాజ్య సామ్రాజ్యమునకు పట్ట మహీషియె . కవికులగురు వాగు కాళిదా సంతటి వాని నాదర్శముగ గైకొని , ఒక్కొక్కచో నాతని కవితలకును మెఱుగులు దిద్దజాలిన గల మెలత యామె . చిత్తగించెదరా ? యామె
యుపమా చిత్రము :-
సనయన్ మహతీం సేనాం
వ్యరుచ ద్వీరకుంజరః
పయోదమాలా మాక్షరన్
పౌరస్త్య ఇవ మారుతః
[ వీరకుంజరుడైన ఆ కంప భూదవుడు మేఘమాలను గొనిపోవు తూరుపుపయ్యెరావలె గొప్ప సేనను వెంట నిడికొని పోవుచున్నాడు ] అని వర్ణించినది . ఈమె యీ శ్లోకమునకు ఆధార భూత మగు కాళిదాస శ్లోక మీ విధముగ నున్నది .
స సేనం మహతీం కర్ష న్
పూర్వ సాగర గామినీమ్
బభౌ హరజటాభ్రష్టాం
గంగామివ భగీరధః
(తూర్పు సముద్రము వరకు వ్యాపించియున్న తన సేనను హరజటా జూటము నుండి “భ్రష్ట “ యగు గంగను గొనిపోవు భగీరధుని వలె రఘు మహారాజు తీసికొనిపోవుచుండెను .)
కాళిదాసు ఈ శ్లోకమున రఘు వంతటి వాణి సేయు భ్రష్ట యైన గంగతో ౯భ్రశ్త ‘పదము నుపయోగించి ఉపమించెను . ఈ వర్ణనమునకును , మన గంగాదేవి యుపమకును భేద మారసితి రా ? ఆమె యెంత లలిత మగు ఉపమ నుపయోగించి విధేయి వస్తువున కెంత సురుచిరత్వము నాపాదించినదో ! స్త్రీ హృదయ సౌకుమార్య మట్టిదే కదా ! ఇది యే కాదు – ఈమె ఉపమ లన్నియు నిట్లు విశిష్టము లైనవే . ప్రకృతి మనో హరత్వ మీమె కావ్యమునం దెల్లెడను పాదుకొని యున్నది .
ఉన్నతమైన ఈ రమణీయ భావ కల్పనతో పరిచయపడిన గంగాదేవి కవితానిస్తుల సంపదకు హృదయ సీమల నెంత యున్నతస్తాన మిత్తురో చదువరులు ! కావ్య రచనము ఆదయ భాష యగు సంస్కృతము ! కావ్య వస్తువు వలచి వలపించుకున్న వల్లభుని విజయ యాత్రాభివర్ణనము !! నిర్వహణము అష్టాదశ వర్ణనాలక్షణ లక్షిత మగు మహా కావ్యము !!! శైలి సులభ సుందర మగు ద్రాక్షా పాకము !! ఆదర్శము మహా కవికావ్యార్ధ నిస్తుల సంపద !! ఇక కావ్యము గుణ వత్తరము , రసో దంచితము ననుటకు సందియ మేమి ?
మన కావ్య వస్తువును ఖ్యాతము , కల్పితము ఉభయము నని ముత్తెఱుగుల విభజింపవచ్చును . అందీ కావ్య వస్తువు ఖ్యతము . సాధారణముగ మన సంస్కృతాంధ్ర కావ్యములకు పురాణాదుల నుండి యితి వృత్తము గైకొని దానిని స్వకపోలకల్పనముతో పెంపొందించి ప్రబంధము గావింతురు . కాని ఉపజ్ఞామహిత యగు గగాదేవి మాత్ర మట్లుగాక , తన జీవన ప్రభుని వీర గాధలె కావ్య వస్తువుగా గొని క్రొత్త బాట వెలయించి , కవి పుంగవులకును నాదర్శము చూపినది . దైవ ప్రార్ధనతో కావ్యారంభము , కవిస్తుతి , కవి నింద , విద్యానగర వర్ణనములను గావించినది . బుక్క రాయల దేవేరి “దెవాయి “. ఆ దంపతులకు ‘కంపన , సంగన , కుమారా కంప ‘ లను మువ్వురు కొడుకులు . అందు కడకొట్టువాడు కుమార కంపన మన కావ్య నేత . మొదట సమస్త వస్తు సంపూర్ణయు , నిర్మల సరఃపరిపూరితయు , రమణీయ సౌధ సముత్తంగ మదగజ సంశోభితయు .
సేకరణ: ఆంధ్ర కవయిత్రులు
———–