ఎల్లాప్రగడ సీతాకుమారి (Yellapragada Sitakumari)

Share
పేరు (ఆంగ్లం)Yellapragada Sitakumari)
పేరు (తెలుగు)ఎల్లాప్రగడ సీతాకుమారి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరునారాయణరావు
పుట్టినతేదీ1/1/1911
మరణం
పుట్టిన ఊరుబాపట్ల
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెస్త్రీజన సేవకు రాలైన విదుషీ మణి-యల్లాప్రగడ సీతాకుమారి

 

స్వీయ రచనలుపునిస్త్రీ పునర్వివాహం – ఆంధ్రప్రతిక – ఈశ్వర సంవత్సరాది 1937, ”ఈ రాధేనా?” – భారతి – జూలై 1938, ఆ వీణ – ఆంధ్రకేసరి – 1940
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుసీతాకుమారి నిజామాంధ్ర మహాసభలలో చురుకుగా పాల్గొన్నారు. సీతాకుమారి నిజామాంధ్ర మహాసభలలో చురుకుగా పాల్గొన్నారు. ఆంధ్రమహిళా సభలను నిర్వహించారు. మూడవ, పదకొండవ ఆంధ్రమహిళా సభలకు అధ్యక్షతా స్థానాన్ని అలంకరించారు.జాతీయోద్యమ కాలం లో హైదరాబాద్ లో ఖాదీ వస్త్రాల అమ్మకం , ప్రచారం విస్తృతంగా చేశారు. 1934నిజాం రాష్ట్ర ఆంద్ర మహాసభకు అధ్యక్షత వహించారు. హైదరాబాద్ లో ఆంద్ర యువతీ మండలి స్థాపనలో భాగస్వాములయ్యారు .”ఆంద్ర” అనే మాటను తెలంగాణా ప్రాంతం లో విస్తృతంగా ప్రచారం చేయటానికి విస్తృత ప్రయత్నం చేశారు. చిక్కడ పల్లి “ప్రమదావనం” స్తాపకురాలై ప్రమదల సేవలో చొరవ చూపారు .
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికయల్లాప్రగడ సీతాకుమారి
పునిస్త్రీ పునర్వివాహం
సంగ్రహ నమూనా రచన‘పిరకబడ్డకొద్దీ సంఘం మరీ తొక్కి పడుతుంది. రేపు నీకొచ్చే కష్టనష్టాల కేమన్నా ఈసంఘం బాధ్యతవహిస్తుందా?’’
ఆ రోజుల్లో సుధా నేనూ కలిసి చదువుకుంటుండేవాళ్లం. సుధ మా క్లాసులోకల్లా చురుకైంది. చాలా మందిపిల్లలు స్నేహితంగాఉండి కూడా పోట్లాడుకుంటూ ఉంటారు. కాని నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు సుధా నేనూ ఎప్పుడూ పోట్లాడుకునేవాళ్లం గాదు

యల్లాప్రగడ సీతాకుమారి
పునిస్త్రీ పునర్వివాహం

‘‘పిరకబడ్డకొద్దీ సంఘం మరీ తొక్కి పడుతుంది. రేపు నీకొచ్చే కష్టనష్టాల కేమన్నా ఈసంఘం బాధ్యతవహిస్తుందా?’’
ఆ రోజుల్లో సుధా నేనూ కలిసి చదువుకుంటుండేవాళ్లం. సుధ మా క్లాసులోకల్లా చురుకైంది. చాలా మందిపిల్లలు స్నేహితంగాఉండి కూడా పోట్లాడుకుంటూ ఉంటారు. కాని నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు సుధా నేనూ ఎప్పుడూ పోట్లాడుకునేవాళ్లం గాదు.
ఆ యేడు నాకు పెళ్లిచెయ్యాలని నాన్నగారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పదమూడోఏడు వెళ్లకుండానే చెయ్యాలని అమ్మగోల కాని ఏం లాభం? ఎక్కడికివెళ్లినా వేలమీదఉంది లెక్క? వెతగ్గా వెతగ్గా, తిరగ్గా తిరగ్గా హైదరాబాదులో ఒక సంబంధం కుదిరింది. విధుశేఖరం ‘‘డాక్టరుపరీక్ష’’కు చదువుతున్నాడు. తండ్రికి పి.డబుల్ యు.డి. ఆఫీసులో పెద్ద ఎక్కౌంటెంటు పని. వేరే కొంత ఆస్తికూడా ఉందిట. కట్నం రెండువేలు.
నాకు చాలా కష్టంవేసింది. ఏమంటే నాకు అవయవాల్లో కుంటీ, గుడ్డీ మీలేదు. ఇప్పుడు ఫోర్తుఫారం చదువుతూ ఉన్నాను. కొద్దిగా సంగీతం వచ్చును. ఇంటిపనులు కొన్ని చేతవును. ఏవిధంగానూ గృహనిర్వహణానికి అనర్హురాలిని కానప్పుడు రెండు వేలు ఇస్తేనేగాని పెండ్లికాని కర్మం నా కెందుకొచ్చిందో తెలీదు. పైగా నాన్నగారు ఎలాగూ రెండువేలివ్వలేనప్పుడు ఈసంబంధం ఎందుకు కుదిర్చిందీగూడ తెలీదు.
సాయంకాలం సుధావాళ్లింటికి వెళ్లాను. మాటలసందర్భంలో సుధ ‘‘ఏం, ఇంకా మీవాళ్లు నీపెళ్లి ప్రయత్నంలోనే ఉన్నారా?’’ అని అడిగింది.
‘‘ఆ, ఇప్పుడో సంబంధం కుదిరింది. కట్నం రెండువేలు’’.
‘‘ఆఁ అలాగా మరి మీకిష్టమేనా?’’
‘‘నాకిష్టంలేదుగాని మావాళ్లకు నా ఇష్టంతో పనిలేదు.’’
‘‘పోనీ, ఇప్పుడేంతొందరొచ్చింది, ఇంకా కొన్నాళ్లు చదువుకోరాదూ? అప్పుడు మూడుపాళ్లు కట్నాలేమీ ఇవ్వకుండానే సంబంధంకుదరవచ్చు.’’
‘‘ఆఁ అందరికీ మీనాన్నగారి లాటి ధైర్యం ఉండొద్దూ?’’
‘‘కాదు మధూ, పిరికబడ్డకొద్ది సంఘం మరీ తొక్కిపడుతుంది. రేపు నీకొచ్చే కష్టనష్టాలకేమన్నా ఈ సంఘం బాధ్యతవహిస్తుందా?’’
ఆ రాత్రంతా సుధమాటలే నాతల్లో మెదులుతూ ఉన్నయి. ఒకసారి, మర్నాడు ఎలాగైనా నాకీ పెండ్లివద్దనీ, సుధలాగా ఇంకొంతకాలం చదువుకుంటానని మావాళ్లతో చెప్పవలెననుకున్నాను. కాని అంతలోనే మళ్లీ ‘‘ఏమో, తీరానిశ్చయమైన పెళ్లమానేస్తారా?’’ అనిపించి చెప్పడానికి వెనక్కుతీశాను. సంఘాన్నెదురించలేని మానాన్నగారి పిరికితనమే నాలోగూడ కనిపించిందేమో.
సరి. వివాహకాలం వచ్చింది, కట్నం ఇచ్చేసమయం వచ్చింది. నాన్నగారు విధు తండ్రిని లోపలికి తీసుకుపోయి ‘‘బావగారూ, సమయానికి డబ్బు తటస్థపడలేదు. ఇస్తా ఇస్తాననిచెప్పి ఓ వెధవ సమయానికి ముఖం తప్పించాడు. ఇప్పుడైనా ముంచుకుపోయిందేమీలేదు. ఎలాగూ మాపొలంలో కొంత దీని క్రింద అమ్మవలెననుకుంటున్నాను. కనుక పొలం మీకే వ్రాసి ఇస్తాను. ఇప్పుడు మాత్రం శుభకార్యం జరుగనియ్యండి’’ అంటూ చెప్పారు. విధుతండ్రి తెలివైనవాడే కాని హైదరాబాదువాడు కనుక మా నిజస్థితి తెలియక ఈవిషయంలో మాత్రం బోల్తాపడ్డాడు. పెండ్లి సక్రమంగానే జరిగిపోయింది.
పెళ్లయినతరువాత నాన్నగారి కేమీ ఆస్తిలేదనీ, తమని మోసపుచ్చారని విధుతండ్రికి తెలిసిపోయింది. దానితో ఆయనకు ఏదో పెద్దపరాభవం జరిగినట్లు ఎక్కడలేని కోపం వచ్చింది. అక్కడితో నా చరిత్రలో విషాదఘట్టం ప్రారంభం అయింది. ఇక వాళ్లెవరూ మాఊరు రావటంకాని, వీళ్లెవరు వెళ్లినా మాట్లాడ్డంగాని లేకుండా నిలిచిపోయినయి.
ఒకరోజు సాయంకాలం సుధ మాఇంటికి వచ్చింది.
‘‘ఏం మధూ, ఈ ఏటితో నీకు మెట్రిక్ అయిపోతుందిగదా, ఇకముందేమిచేస్తావు?’’
నేను కొంచెం నిరుత్సాహంతో ‘‘ఏమో సుధా, ఇక మానివేస్తాను’’ అన్నాను. సుధ మామూలుగా కులాసాగానూ, ఉత్సాహంగానూ ఉన్నది కాని నాకుమాత్రం అప్పుడే ఈ నిరుత్సాహం ఎక్కడినుంచి వచ్చిందో ‘‘ఐతే నీవేం చేస్తావు మరి?’’
‘‘హైదరాబాదులో మా మామయ్యగారి ఇంట్లో ఉండి మెడికల్ కోర్సు చదువుతాను.’’
‘‘పెండ్లి విషయం ఏమన్నా ప్రయత్నిస్తున్నారా?’’
‘‘లేదు. ఇప్పుడైతే ఎంతలేదన్నా కాస్త మంచి సంబంధం కావాలంటే రెండు మూడు వేలన్నా కావాలి. డబ్బుపెట్టి చదువుకుంటే తర్వాత కట్నంలేకుండా సంబంధమూ వస్తుంది, నాకు చదువూ ఉంటుంది. అందుకని నాన్నగారు ఎలాగైనా కష్టపడి నాకు డక్టరు చదువు చెప్పిస్తానంటున్నారు.’’
రెండేళ్లు గడిచిపోయినయి, నన్ను తీసికెళ్లమని నాన్నగారు ఎంతమంది చేత కబురుచేసినా ‘పొలం ఇవ్వండి లాభంలే‘దని విధుతండ్రి చెపుతూవచ్చాడు. చివరకు ఒకరోజున మా నాన్నగారు నన్ను తీసుకొని హైదరాబాదు వెళ్లారు. కాని విధుతండ్రి మా నాన్నగారిని తీవ్రంగా దూషించి, మోసకారుల పిల్ల మాకు వద్దని మమ్మల్ని పంపివేశాడు. నాకు మటుకు ప్రత్యేకంగా విధు ఉద్దేశం ఎలా ఉంటుందో కనుక్కోవలెననిపించిందిగాని, దురదృష్టం, విధు ఆరోజున ఊళ్లో లేడట. స్కూలుపిల్లలతో ‘విహారం’ వెళ్లాడట.
ఇక నేను శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండవలసి వచ్చింది. ఈ రోజుల్లో, నాలాటి వ్యర్థజీవినుల కథలు ఏమైనా దొరకగానే వాళ్లేంచేసేవాళ్లోనని చదువుతూ ఉండేదాన్ని. అందులో చాలామంది రకరకాల విషాలు త్రాగి మరణిస్తుండేవాళ్లు. మరికొందరు దాసీలల్లే ఉంటామనీ, ఉండనిస్తేనే చాలనీ భర్తకు ఉత్తరాలు వ్రాస్తుండేవాళ్లు. కాని ఇవేవీ నాకు మంచి దనిపించలేదు. ఏమాత్రమూ ఇష్టంలేని విధుదగ్గర ఏడుస్తూపడి ఉండేకంటే చనిపోవటమే నయమేమోననిపించింది. కాని ఏవిషం తింటే నిర్బాధాకరంగా మరణిస్తానో తెలీదు. పైగా నాకా విషాలు ఎవరమ్ముతారు? పోనీ, నాటుపద్ధతులున్నాయి. చీర ముట్టించుకోనీ, నూతిలోపడి మోస్తరు. అమ్మబాబో! ఛా, కాకపోయినా సమానంగా వ్యర్థజీవులమైన మా ఇద్దరిలో విధు హాయిగా కులాసాగా తిరుగుతూ చదువుకుంటూ ఉంటే నాకీ చచ్చిపోయే కర్మం ఏవచ్చిందీ?
కాని సంఘం ఈ పక్షపాతపు గుడ్డిసంఘం విధు నేమో అనడంలేదు కాని ‘‘ఫలానావారమ్మాయిని మగడు వదిలిపెట్టాట్ట, విన్నారా’’ అంటూ నన్నే చెప్పుకునేవాళ్లు. పోనియ్యి, ఈ సంఘంతో నాకేమి లెక్క? సుధ చెప్పినట్లు నా కష్టనష్టాలకీ సంఘం ఏమన్నా పూచి పడుతుందా?
కాని నా స్థితికి ఇప్పుడు నాన్నగారు గూడ విచారించ సాగారు. అనవసరంగా తొందరపడి, ఎక్కువలకు పోయి, మోసంచేసి చేసిన నా వివాహం ఈ విధంగా ఫలించినందుకు చాలా క్రుంగిపోయినారు.
మరి రెండేళ్లయింది. ఇంతలో కొద్దిజీతాలవాళ్ల కొంపలు తీసే ‘‘రిట్రెంచిమెంటు’’ భయంకరాకారంతో వచ్చిపడ్డది. నాన్నగారింకా బాగా నౌకరీ చేయగలిగేఉన్నా, సర్వీసుఅయిపోయిందని పెన్షనుపుచ్చుకోమన్నారు. కాని ఇదివరకు జీతమంతా వస్తేనే కష్టంగా జరుపుకొనే స్థితిలో ఈసగంజీతంతో ఇల్లుగడవటం ఎంతో కష్టంగా ఉంది. ఇంతేకాక చేతికి వచ్చిన మగపిల్లలు కూడా లేరు.
ఎవరికయినా కష్టా లెక్కువవుతూన్న కొద్ది ధైర్యం, సాహసం ఎక్కువవుతాయి. అలాగే ఇప్పుడు నాకు కూడ ధైర్యంకలిగి, ఎలాగన్నా కష్టపడి వీళ్లను పోషించాలి అని నిశ్చయం చేసుకున్నాను.
ప్రయత్నం చేస్తే ఫలం ఉండకపోదు. మా ఊళ్లోనే బాలికపాఠశాలలో ఒకటీచరుపని ఖాళీవచ్చింది. హింధూస్త్రీని కనుక నాకా ఉద్యోగం ఎక్కువప్రయాస లేకుండానే దొరికిపోయింది. గత్యంతరం లేక నాన్నగారేమీ అడ్డుచెప్పలేదు. ఇప్పుడు నాజీతం, నాన్నగారి పెన్షనూ కలుపుకొని హాయిగా జీవిస్తున్నాం.
వేసంకాలంలో సుధ వచ్చిందని తెలిసి ఒకరోజున చూడ్డానికి వెళ్లాను.
‘‘ఏంసుధా, ఇంకా ఎన్నాళ్లుంది చదువు?’’
సుధ ఉత్సాహంగా ‘‘ఇంకో డాదైతే ఎం.బి.బి.ఎస్. డిగ్రీవస్తుంది’’.
‘‘సుధా, నీకు తెలీదేమో, ఈమధ్య నేను పెళ్లిచేసుకున్నాను’’ అని అంది.
‘‘అదేమిటి, చదువు పూర్తయేదాకా చేసుకోనన్నావుగదూ? వరుడెవరు?’’
‘‘హైదరాబాదులోనే ఉంటాడు, విధుశేఖరం అని….’’
నేను అదిరిపడి ‘‘విధుశేఖరమా? ఏ విధుశేఖరం?’’ అనానను.
‘‘లక్ష్మీప్రసాదంగారని, ఆయనకొడుకు, మా కాలేజీలోనే మెడికల్ కోర్సు చదువుతున్నాడు’’
కొంచెం సర్దుకొని ‘‘అలాగా? కట్నంఏమైనా ఇచ్చారా?’’అనానను.
‘‘లేదు, విధుతండ్రిమాత్రం కట్నమో అన్నాట్ట. కాని ఈ ఏడవగానే నాకేదో పెద్దనౌకరీ దొరుకుతుందని చెప్పేటప్పటికి సరేనని వప్పుకున్నాట్ట.’’
ఇక అక్కడ నిలవలేకపోయాను. ‘‘కొంచెం పనుంది సుధా, రేపు మళ్లీ వస్తాను.’’
‘‘తప్పకుండావస్తావుకదూ?’’
ఇంటికి పోయి గదిలో పడుకున్నాను. నాపర్వావయవాల్లో నుంచీ పొగలువస్తున్నట్టనిపించింది. ‘‘విధు పెళ్లిచేసుకున్నాడు. ఎవర్ని?’’ సుధను, మరి నేనో? విధూ నావాడు ఎప్పుడూ కాలేదు. నేనూ అతనిదానిన కాలేదు. కాని మా కిద్దరికీ సంఘం ఓసంబంధం అంటగట్టింది. ఇప్పుడు విధు ఆ సంబంధాన్ని తెంచుకొని వేరే పెండ్లిచేసుకున్నాడు. నేనేంగావాలో ఆలోచించనన్నాలేదు. మరి దీనికి ప్రతిక్రియ ఏంచేస్తాను? ఎలాగన్నా, విధు వదిలిపెట్టినాగాని నాకేమీ నష్టంకలగలేదని అతనూ, అతని తండ్రీ తెలుసుకునేటట్లు చేస్తే నా ఆత్మతృప్తిపడి మనసు కుదుటబడుతుంది. కాని ఈసంఘం మగవాళ్లకిచ్చిన అతిచనువువల్ల విధు గబిక్కిన పెండ్లి చేసుక్కూచున్నాడు. మరి నేనో…
మర్నాడు సాయంత్రం సుధను కలుసుకున్నాను.
‘‘సుధా, నీకు తెలీదీమో, నేను పెళ్లిచేసుకోబోతున్నాను.’’
‘‘అదేమిటీ, నీకు పెళ్లయిందికాదూ?’’
‘‘అవును, ఆరేళ్లక్రింద. కాని నేను అతన్ని వదిలివేశాను.’’
‘‘వదిలిపెట్టావా? ఎందుకని?’’
‘‘వినగలిగితే కంగారుపడకుండా విను. ఇప్పుడు నీభర్తఅయిన విధుశేఖరాన్నే నేను చేసుకున్నది. కాని మా నాన్నగారు ఇస్తానన్నకట్నం ఇవ్వలేకపోవటంచేత విధుతండ్రినన్ను వాళ్లిఇంటికి రానివ్వలేదు.’’
‘‘ఏమిటీ, ఎంతపనిజరిగింది విధుకు ఇదివరకే పెండ్లయినసంగతి నా కిదివరకు తెలియదు. ఇలా నన్ను మోసంచేసి పెళ్లిచేసుకున్నాడా విధు?’’
‘‘సుధా, ఐతే ఒకసంగతి నీవు విధును పెళ్లిచేసుకున్నందుకు నాకేమీ కష్టంగాలేదు. ఏమంటే, ఎలాగూ అతనికీ నాకూ కలియదు. స్థితికి మించిన సంబంధాలకు పోతే ఎప్పుడూ ఇలానో జరుగుతుంటుంది.’’
‘‘కాని, మధూ, విధుమాత్రం చాలా మంచివాడు. అతనిలా చేస్తాడని నేనుకోలేదు. కాని ఇందులో అతని తప్పెక్కువ ఉండదనుకుంటాను. అంతా అతనితండ్రి కుట్ర అనుకుంటాను.’’
‘‘కావచ్చును; కాని విధుకు నామీద ఇష్టం ఉంటే ఎలాగైనా స్వతంత్రించి తీసుకుపోయేవాడే. ఇంతకూ అతనికొరకు నేనుగూడ ఎక్కువగా వాంఛించిందీ లేదు. హాయిగా ఇక్కడ టీచరుపని చేస్తూ స్వతంత్రంగా బతుకుతూఉన్నాను.’’
‘‘మరి ఇప్పుడు నీ వెవర్ని పెళ్లి చేసుకోబోతున్నావు?’’
‘‘ఈ ఊళ్లోనే మాపక్క ఇంటిభగీరథాన్ని. అతను చాలా తెలివైనవాడూ, బుద్ధిమంతుడూ కూడాను. కాని తండ్రి చచిచపోయిన ఆస్తి ఏమీ లేకపోవడంచేత త్వరలోనే చదువు చాలించి ఈ వూళ్లోనే టీచరుగా ఉంటున్నాడు అంచాత కట్నాలిచ్చే మంచిసంబంధాలేమీ దొరకడంలేదు. కనుక అతన్ని నేను చేసుకుంటే సరిపోతుంది.’’
‘‘బాగానే ఉంది. కాని – కాని, మధూ, ఇప్పటి హిందూలాప్రకారం, పేరుకుమాత్రమే నీకు భర్తఅయినా, విధు ఉండగా నీవు వివాహంచేసుకోడానికి వీలులేదు.’’
నాకు వళ్లు మండిపోయింది. ’’వీలులేదూ? పెళ్లిలోకూడా అతనిముఖం తిన్నగా చూళ్లేదు నేను. అలాటి విధు శాశ్వతంగా నన్ను వదిలిపెట్టి వేరే పెళ్లిచేసుకొని సుఖపడుతూ ఉంటే నేను మాత్రం పెళ్లిచేసుకోడానికి వీల్లేదా? మరేం చెయ్యడానికి వీలుంటుందో?’’
సుధ తాపీగా ‘‘భరణంకోసం అతనిమీద దావావెయ్యవచ్చును.’’ అంది.
‘‘అతనిడబ్బు నాకవసరంలేదు. డబ్బుకోసం నేను పెళ్లిచేసుకోలేదు. నాపొట్ట నేనుపోసుకొని ముసలివాళ్లయిన మా అమ్మనూ, నాన్నగారినీ గూడా పోషించుకోగలుగుతున్నాను. కాని కాని, సుధా, నాకు తోడునీడగా ఉండడానికి, అతని కష్టసుఖాల్లో నేనూ – నా కష్టసుఖాలోల అతనూ బాధ్యతవహించడానికి ఇప్పుడిప్పుడు నాకు పెళ్లి అవసరం అనిపిస్తున్నది. ఏం లాభం, నేను వితంతువుకంటే గూడ అధమం అయిపోయాను.’’
సుధ చాలాసేపు నిశ్శబ్దంగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఆమె ముఖంలో అనేకభావాలు కనుపించాయి. చివరకు ప్రశాంతంగా, ‘‘మధూ, నాకు తెలిసినంతమట్టుకు విధుశేఖరానికి నీమీద ద్వేషంగాని, ఈర్ష్యకాని లేదనుకుంటాను. ఇంతేకాక స్నేహితురాలివైన నేనే నీ సౌఖ్యజీవనానికి అడ్డుపడ్డం మరీ హృదయవిదారకాంగా ఉంది. ఏమైతేనేమి, జరిగిందేమో జరిగిపోయింది. ఇప్పుడైనా నీవు సంఘాన్నెదురించి మళ్లీ పెళ్లి చేసుకుంటాననడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈశలవల్లో ఇక్కడే గడుపుదామని విధుకూడ ఇవ్వాళోరేపో ఈ వూరొస్తాడు కనుక నే నెలాగైనా విధుదగ్గిరనుంచి నీకు వివాహానికి అనుజ్ఞాపత్రం తీసుకొని ఇస్తాను. అతను తప్పకుండా ఇస్తాడని నాకు నమ్మకం ఉంది.’’ అంది.
సుధ ఔదార్యానికి నాకు చాలా తృప్తికలిగింది. ‘‘నీ ఆలోచనబాగానే ఉన్నది సుధా నేను మళ్లీ రేపుకలుస్తాను’’అని ఇంటికి వచ్చాను.
ఆరాత్రి కూడ నాపని ఆలోచించడమే అయింది. ‘‘విధు అనుజ్ఞఇస్తే కాని నేను పెళ్లిచేసుకోకూడదా? ఎంత దురవస్థ పోనీ, పెళ్లిమాని ఇలాగే ఉంటే? ఏం లాభం, ఏం గొప్ప? అలాటివాళ్లెంతమందో ఆంధ్రదేశంలో వాళ్లల్లో నేనూ ఒక దాన్ని. ఇప్పటికి ఎలాగో ఈ అనుజ్ఞతోనే పెళ్లి చేసుకుంటే సంఘానికి ఒక ఆదర్శం చూపించినదాన్నవుతానేమో’’. రెండురోజుల లోచనా ఫలితంగా ఈ నిశ్చయానికి రాగలిగాను. కాని అప్పుడే నాలో ఈ శపథంకూడా చేసుకున్నాను ‘‘ఎలాగైనా ప్రయత్నించి నా జన్మలో స్త్రీలకు గూడ భర్త ఉండగానే పునర్వివాహాధికారం వచ్చేటట్లు చెయ్యాలని, లేదా పురుషులకీ ఆ అధికారం తీసివేయించాలని.’’
రెండు రోజుల తర్వాత సుధను కలుసుకున్నాను. సుధ ఉత్సాహంతోనూ, ఆనందంతోనూ బయటికి వచ్చి నన్ను లోపలికి తీసుకువెళ్లింది.
నేనూ సుధా హాల్లో కూచోని మాట్లాడుతూ ఉండగా లోపలినుంచి విధుశేఖరంవచ్చి, నన్ను చూడగానే మందహాసంతో హైదరాబాదు పద్ధతిగా ‘‘నమస్కారం’’ అంటూ వేరొక కుర్చీలో కూర్చున్నాడు. నాకు అతని ప్రవర్తనకు ఆశ్చర్యం వేశింది. ఇప్పుడు విరోధంగా మాట్లాడాలో, స్నేహంగా మాట్లాడాలోగూడ తెలీలేదు. అంతలో అతనే ముందుగా మాట్లాడ్డం మొదలెట్టాడు. ‘‘మీ విషయంలో చాలా పొరపాటు జరిగింది. ఈమధ్య మీసంగతే నాకు తెలియలేదు.’’
ఏమనాలో తెలీక ‘‘అలాగా’’ అన్నాను.
ఇంతలో సుధఅందుకోని చూచావా, మధూ, వాళ్ల నాన్నగారు తప్పంతా మీదేనన్నారట’’
ఆశ్చర్యంతో ‘‘ఎలా’’ అన్నాను.
విధు అందుకోని ‘‘ఎన్నిసార్లు పిల్లనుపంపమని కబురుచేసినా నిన్ను పంపలేదని, ఇస్తానన్నకట్నం ఇవ్వకపోగా పిల్లనుగూడ పంపటం లేదని చెప్పి నన్ను వేరేపెళ్లి చేసుకోమన్నారు’’ అన్నాడు. నేను కొంచెం గొంతు సవరించుకొని ‘‘సరీగానే ఉంది. మా నాన్నగారిమీద ఆయన కసి తీర్చుకున్నారు’’ అన్నాను. సుధ అందుకొని, ‘‘కాని, మధూ నీమీద కసితీర్చుకోవలెననే ఉద్దేశ్యం విధుకేమీలేదు. నిన్న నేను చెప్పగానే అనుజ్ఞాపత్రం వ్రాసిఇచ్చారు’’అంది.
విధు చిరునవ్వుతో ‘‘ఇందులో మాలాభం కూడ కొంత ఉంది’’ అన్నాడు.
‘‘ఏమిటదీ?’’
‘‘నీవు వేరేపెళ్లి చేసుకుంటే నామూలాన ఒక స్త్రీ జీవితం పాడయిపోయిందనే విచారం నాకుండదు. మనోవర్తి ఇవ్వవలసి వచ్చిందినే కష్టం మానాన్నగారికి ఉండదు.’’
లోపలినుంచి ‘టీ’ వచ్చింది. అందరం టీ తసుకుంటూ ‘‘సుధా, సాధ్యమైనంతత్వరగా బహుశా, పైవారంలోనే చేసుకుంటాను. తప్పకుండా వస్తావుకాదూ?’’ అంటూ విధువైపు తిరిగి ‘‘ఇక్కడే ఉంటారు కనుక మీరుగూడ సుధతోటి ఆ వేళకు….’’
‘‘ఓ, తప్పకుండా…’’
సుధదగ్గిరినుంచి అనుజ్ఞాపత్రం తీసుకొని వెళ్లిపోయినాను.
‘‘ఇక్కడే ఉంటాను కనుక మీరు గూడ సుధతోటి ఆ…’’
భగీరధంతో నావివాహం సక్రమంగా జరిగిపోయింది. ఇంట్లో ఎవరూ అడ్డుచెప్పలేదు. మా ఆదర్శవివాహాన్ని ప్రకటిస్తూ పత్రికలన్నీ నన్ను ‘‘పునిస్త్రీ పునర్వివాహాన్ని వెలువరించిన ప్రథమాంధ్ర స్త్రీ’’ నంటూ పొగుడుతూ వ్రాశాయి.

———–

You may also like...