దేశాయి రామచంద్రరావు (Desai Ramachandrarao)

Share
పేరు (ఆంగ్లం)Desai Ramachandrarao
పేరు (తెలుగు)దేశాయి రామచంద్రరావు
కలం పేరు
తల్లిపేరుసుబ్బమ్మ
తండ్రి పేరుదేశాయి వెంకటనారాయణరావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1900
మరణం1/15/1958
పుట్టిన ఊరుమరూరు బండమీదపల్లె (అనంతపురం జిల్లా)
విద్యార్హతలు
వృత్తికరణము
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుచెయిన్ సర్వే గణిత సూత్రతపద్యావళి, మనఃప్రబోధము, కరణీక రాజఠీవి, కాలమహిమ, కర్షకౌన్నత్యము, దరిద్రాష్టకము, సీతాలక్ష్మణ పరిదేవనము, యమునితో ముచ్చటలు, ఏడ్పుమహిమ, గాంధీతాత మున్నగు శీర్షికలక్రింద ఎన్నోపద్యములు, గేయములు వ్రాయబడినవి.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికదేశాయి రామచంద్రరావు
సంగ్రహ నమూనా రచనవెలుగుకురాక, అజ్ఞాతముగా నుండిపోయిన ఎంతోమంది రాయలసీమ కవులలో బండమీదపల్లె కరణము రామచంద్రరావు గారు ఒకరు.
శ్రీ రామచంద్రరావుగారు కరణముగా ప్రజల యొక్క ప్రభుత్వోద్యోగుల యొక్క ఆదరాభిమానముల చూరగొన్న వారు. ఒక వంక వృత్తి పరమైన బాధ్యతల నిర్వహించుచు, మరొకవంక సాహిత్యసేవ గావించినారు.

దేశాయి రామచంద్రరావు

వెలుగుకురాక, అజ్ఞాతముగా నుండిపోయిన ఎంతోమంది రాయలసీమ కవులలో బండమీదపల్లె కరణము రామచంద్రరావు గారు ఒకరు.
శ్రీ రామచంద్రరావుగారు కరణముగా ప్రజల యొక్క ప్రభుత్వోద్యోగుల యొక్క ఆదరాభిమానముల చూరగొన్న వారు. ఒక వంక వృత్తి పరమైన బాధ్యతల నిర్వహించుచు, మరొకవంక సాహిత్యసేవ గావించినారు.
వీరికి స్వంత గ్రంథాలయము కలదు. విలువైన గ్రంథముల నెన్నింటినోకొని, విమర్శనాదృష్టితో వానిని పఠించినారు. కరణము లెక్కలు వ్రాయుట ముగియగానే గ్రంథముల చేతబట్టుటే వీరి పని. రాత్రి రెండు గంటలైనను పొత్తమును, పెన్సిలును విడుచుటలేదు.
పద్యరచన యందును, పద్యపఠనము నందును వీరిదొక ప్రత్యేకశైలి. శ్రీరామచంద్రరావుగారికి సాహిత్యమునందే గాక, సంగీతము నందును పరిచయము గలదు. వీరు మధుర కంఠముతో శ్రావ్యముగ పురాణపఠనము గావించుచు, శ్రోతలను ముగ్ధుల గావించెడివారు.
శ్రీమాన్ పప్పూర రామాచార్యులవారు, శ్రీ కల్లూరు సుబ్బరావుగారు, శ్రీ మరూరు లక్ష్మీనరసప్పగారు వీరి పురాణపఠనమును, కవిత్వమును చాల మెచ్చుకొన్నారు.
శ్రీ రామచంద్రరావుగారు పాదుకా పట్టాభిషేకము, చిత్రనళీయము, విషాదసారంగధర, గయోపాఖ్యానము, నరకాసురవధ మున్నగు నాటకములలో ప్రధానపాత్రల ధరించి ఉత్తమ నటుడుగా పేరు పొందినారు. హరికథల కొన్నిటిని గానము చేసినారు.
శ్రీరామచంద్రరావుగారు కరణాలకు, సర్వేయర్లు కాగోరువారికి ఉపయుక్తమగు రీతిగా ‘‘చెయిన్ సర్వే గణిత సూత్రతపద్యావళి’’ అను గ్రంథమును రచించినారు. అది ముద్రింపబడినది. ‘‘శ్రీకృష్ణగారడి’’ యను నాటకము అముద్రితము. వీరు రచించిన ‘‘ప్రద్యుమ్నాభ్యుదయము’’ అను నాటకము అసంపూర్తిగా నిలిచిపోయినది.
వీరి ‘‘పరిమళపేటిక’’ ఒక ఖండకావ్యమునందు మనఃప్రబోధము, కరణీక రాజఠీవి, కాలమహిమ, కర్షకౌన్నత్యము, దరిద్రాష్టకము, సీతాలక్ష్మణ పరిదేవనము, యమునితో ముచ్చటలు, ఏడ్పుమహిమ, గాంధీతాత మున్నగు శీర్షికలక్రింద ఎన్నోపద్యములు, గేయములు వ్రాయబడినవి. ఇందలి పద్యములు కొన్ని ఆంధ్ర గ్రామపాలన, సారథి, విజయవాణి, సాధన పత్రికలలో ప్రకటింపబడినవి.
మచ్చునకీ పద్యములు చూడుడు
మ. మనసా చంచలమై చెలంగు పధియున్ ‘‘మా’’ మైత్రితో నొప్పెడు
న్వినుమా మన్మథ-మత్స్య-మర్కట-మరున్మేఘో-మనో-మానినీ
యనగా మామదిరామధువ్రత సమాఖ్యల్ దాల్చి; పూర్వంపు నీ
చనవున్ గాంచుట దక్కువాని కొదవెన్ చాంచల్య భావంబులున్
ఉ. ఎప్పటి కంటె నేదయిన నింత జపంబొనరింప గూరుచు
న్నప్పుడు పుట్టు నీకు దెవులక్కట యొక్క నిమేషమేని గుప్
చప్పున నుండ; వేమిటివొ చచ్చియుజావని యూహలన్నినీ
కప్పుడె పుట్టుచుండు; సమయంబిక లేదొకొ పాపిచిత్తమా
కర్షకౌన్నత్యము.
సీ. బలరామునకు జూడ హలముమారతమె కాని
పసరంబు భూమి లే దసలు కృషికి;
పశుపతి కన్ననో పశువొక్కటియె కాని
భూమియు నాగలి పొసగలేదు;
కమలేశునకుభూమి కల దింతయే కాని
హల వృషభ విభి యమరలేదు;
మగు రెకమైనను ముగియదు నేద్యంబు
రెండవ యెద్దు లే కుండు కతన;
గీ. ఇట్టి దారిద్ర్యపు సమాజ మెట్లు సాటి
హల వృషభయుగ్మ విశ్వంభరాగత ప్ర
కర్షవైభవ వ్యవసాయ కలితుడవగు
కర్షకా నీకు? లేరు నీకంటె ఘనులు.
నిత్య సంతోషిగా, నిర్మల హృదయుడుగా, నిరతాన్న దాతగా, అజాత శ్రతువుగా రాణించిన కరణము శ్రీదేశాయి రామచంద్రరావు గారు జీవితము నంతయు గ్రంథ పఠనమునకు, సాహిత్యదేవకు ధారవోసి 58వ ఏట స్వర్గస్థులైరి. వీరు అజ్ఞాతముగా నుండుటకు కారణము కరణీకమే.

రాయలసీమ రచయితల నుండి…

———–

You may also like...