ములుగూరు గురుమూర్తి (Mulugooru Gurumurthy)

Share
పేరు (ఆంగ్లం)Mulugooru Gurumurthy
పేరు (తెలుగు)ములుగూరు గురుమూర్తి
కలం పేరు
తల్లిపేరురంగమాంబ
తండ్రి పేరులక్ష్మీనారాయణప్ప
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1897
మరణం12/17/1979
పుట్టిన ఊరుములుగూరు, హిందూపురం తా. అనంతపురం జిల్లా
విద్యార్హతలుసెకండరీగ్రేడు ట్రయినింగు పరీక్షలో ఉత్తీర్ణులైరి.
వృత్తిప్రధానోపాధ్యాయులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుజానకీ వల్లభ శతకము , స్వామి రామదాసు ముక్తావళి, ఆత్మ రామాయణము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులులలితకవి , కవితాశారద
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికములుగూరు గురుమూర్తి
సంగ్రహ నమూనా రచనశ్రీ లక్ష్మీనారాయణప్పగారికి కవిగారు జ్యేష్ఠులు, వీరు అతిధులనాదరించు స్వభావము కలవారు. నిరాడంబరులు, కవిపండితులపై ఈ కుటుంబమునకు గౌరవము కలదు. కవిగారు హిందూపురములో మాధ్యమిక విద్యపూర్తి చేసిరి తరువాత చిత్తూరు జిల్లా మదనపల్లె థియసాఫికల్ హైస్కూలులో యస్.యస్.యల్.సి., ముగించిరి. 1919-20 సంవత్సరములలో అనంతపురం సెకండరీగ్రేడు ట్రయినింగు పరీక్షలో ఉత్తీర్ణులైరి. 1921 సం. నుండి 1953 వరకు హిందూపురము మునిసిపల్ హైస్కూలులో సెకెండరీగ్రేడు టీచరుగా పనిచేసిరి.

ములుగూరు గురుమూర్తి

శ్రీ లక్ష్మీనారాయణప్పగారికి కవిగారు జ్యేష్ఠులు, వీరు అతిధులనాదరించు స్వభావము కలవారు. నిరాడంబరులు, కవిపండితులపై ఈ కుటుంబమునకు గౌరవము కలదు. కవిగారు హిందూపురములో మాధ్యమిక విద్యపూర్తి చేసిరి తరువాత చిత్తూరు జిల్లా మదనపల్లె థియసాఫికల్ హైస్కూలులో యస్.యస్.యల్.సి., ముగించిరి. 1919-20 సంవత్సరములలో అనంతపురం సెకండరీగ్రేడు ట్రయినింగు పరీక్షలో ఉత్తీర్ణులైరి. 1921 సం. నుండి 1953 వరకు హిందూపురము మునిసిపల్ హైస్కూలులో సెకెండరీగ్రేడు టీచరుగా పనిచేసిరి. తదుపరి 1953వ సంవత్సరము నుండి 1961వ సంవత్సరము వరకు శ్రీ శారద విద్యానిలయమను హైయర్ లిమెంటరీ స్కూలులో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిరి. వీరి క్రింద తర్ఫీతైన వారిప్పుడు గొప్ప, గొప్ప పదవులందున్నారు.
వీరికి ‘లలితకవి’ ‘కవితాశారద’ అను బిరుదులు కలవు. కవిగారు శ్రీరామభక్తులు, స్వామి రామదాసు శిష్యులు. వీరు రచించిన జానకీ వల్లభ శతకము ,స్వామి రామదాసు ముక్తావళి, ఆత్మ రామాయణము మొదలైన గ్రంథములే వీరి భగవద్భక్తకి నిదర్శనములు. వీరికి శ్రీరామచంద్రునిపై భక్తి కుదురుట కొక నిదర్శనము కలదు. ‘శ్రీ జానకీవల్లభశతకము’న కవిగారిట్లు వ్రాసుకొన్నారు.
‘‘నా మనుమడు మూరేండ్ల బాలుడు జ్వర బాధితుడై పరుపు బట్టుటయు, నే నొకనాడా బాలుని యొద్ద యుండి వాని సంకను భజన కొఱకై యలంకరింపబడి యుండిన శ్రీకోదండ రాముల పటము వంకను పలుమారు జూచుట తటస్థించెను.
అంతటితో నాలో నొక భావోద్రేకము కలిగెను. ఆ యుద్రేక తీవ్రతతో నా భావము లన్నియు పద్యములుగా మారినవి. సగము ముగియునప్పటికి బాలుని స్థితి విషమించి నిరాశ జనించెను. నేభయపడి వ్రాత సాగించుటయా, మానుటయా, యని శంకించితిని. ఏమైనను గానీ యని శ్రీరామునిపై భారము వేసి రచన సాగించితిని. రచన ముందుకు నడచిన కొలది బాలుడు దినక్రమేణ ఆరోగ్యమును బొందుచు శతకము భూర్తి యగునప్పటికి సంపూర్ణ ఆరోగ్యమును బొంది బ్రతికెను. అప్పటినుండియు నాలో శ్రీరామునిపై భక్తి కుదిరినది’’ వారి జానకీ వల్లభ శతకము నందిట్లున్నది.
మ. కవితల్ సెప్పగ నాత్మనెంచి కథలన్ గల్పింపగాలేదు; య
య్యవి నీవై పలుకంగ జేసితిగదయ్యా కాదె? నీ యిచ్చ యో
నవలావణ్య విలాస రూప బువిలో నాపుణ్య మెంతో గదే
భవ దూరం బొనరించి కాచితివి, దేవా జానకీవల్లభా
తదుపరి వీరి ఆంధ్రానువాదము ‘మానసప్రబోధ రత్నరాశి’. దీనిని శ్రీ సమర్థ రామదాసు గారు మహారాష్ట్ర భాషలో రచించిరి. ఈకృతిని కవి గారు తమ షష్ఠిపూర్తి శాంతి మహోత్సవ పూజా పుష్పముగా వ్రాసి ప్రకటించిరి. అందలి భామినీ షట్సదు లిట్లున్నవి.
ఎట్టి కార్యమొనర్చు చున్నను
గట్టిగా శ్రీరామనామము
పట్టుదలతో స్మరియించు చుండును భావ నులరంగన్
అట్టి నియమము సడల జేయకు
యెట్టి సంకటములు రావె
ప్పట్టున వేకువననే మనసా? పలుకు రామకథల్
కలియుగంబున మనుజు లెల్లరు
నిలను కర్మాచరణ నొల్లక
ఫలములన్ వెసగోరి ధర్మము సలుప నెంత్రు మదిన్
తలప భూతములందు నెప్పుడు
నిలుపలేరు దయార్ద్ర దృష్టిని
సులభమైనను రామనామము దలపరే మనసా
వీరి కావ్యములలో ‘ఆత్మరామాయణ’ మొక బృహద్గ్రంథరాజము. ‘నేను కవిని గాను, కవినని చెప్పుకొను సాహసము నాకడలేదు. కవిని గానలయునను యుబలాటముతో చేసిన ప్రబల ప్రయత్నమెప్పుడును లేదు’’. అల్పజ్ఞుడనని ఇందు చెప్పుకొన్నారే గాని, శ్రీ గురుమూర్తి గా రెందులోను తీసిపోరు. ఇది వారి నిగర్వమునకు నిదర్శనము. ఆత్మరామాయణమునకు మూలము ఒక వచన గ్రంథము. దీనిని కవిగారికి శ్రీకరణము సూరప్పగారు అందించి సులభశైలిలో పద్యకావ్యముగా వ్రాయుమని కోరిరి. శ్రీరామచంద్రుడే తననిట్లు ప్రేరేపించినట్లు భావించి కవిగారు వ్రాయపూనిరి. భక్తి పరులైన కవిగారికి తెలుగు భాగవతముపై గల గాడాభిమాన మీ ‘ఆత్మారామాయణము’ లో నటనట కానబడును. జనక మహారాజు కొలువు కూటమున ఏర్పాటు చేయబడిన సీతా స్వయంవరమునకు శ్రీరామచంద్రుడు సోదర సమేతుడై విశ్వామిత్రుల వారు ముందు నడువగా పురవీధులందు రాజఠీవితో నడచి వచ్చుటను చూచి సౌధాగ్రంబుల జేరిన మగువలు తమలో తామిట్లనుకొనిరి.
సీ. వీడటే తాటక విగత జీవిగ జేసి
మునుల గాచిన యట్టి మనుజవిభుడు
వీడటే మారీచు బీచమడంచిన
భుజబలోన్నతుడైన భూరి యశుడు
వీడటే రాతిని వింతయౌ నాతిగా
సలిపి దీవించిన సత్యమూర్తి
వీడటే హరివిల్లు విదళించి మేటిగా
విశ్వకీర్తిని గొన్న వీరనరుడు
వీడటే సీతకు వేడ్క గొల్పెడు నట్టి
ప్రణయగీతిని బాడు భావజుండు
తే. ననుచు, సౌధాగ్రతములనుండి యతివ లెల్ల
జారు తరమూర్తి విశ్వ ప్రశస్త కీర్తి
బరిణయంబున మనసీత కరము బట్టు
భానువంశాబ్ద సోముడు భద్ర కరుడు.
ఈ రీతిగా మృదుమధురముగా, అతి లలితముగా సాగినదీ కవిత్వము. కవిగారికి పేరు ప్రతిష్టలను సాహిత్య సీమయందొక గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టిన రచన ఇదియే. వీరి రచనలను బట్టియే వీరికి ‘లలితకవి’యను బిరుదమును రాయలసీమ కళాపరిషత్తు వారొసంగి సత్కరించిరి. శ్రీకూడ్లీ శృంగేరి పీఠాధిపతులు ‘వితావిశారద’యను బిరుదము నిచ్చి ఆవీర్వదించిరి.
లలితకవిగారు కవులేకాదు, సంగీత కళాకోవిదులు కూడ. తంబూర వాయించుచు ‘యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలి’గా హనుమంతుడే పగిది యుండెనో, అట్లే పెక్కు శ్రీరామ కార్యములందు పాల్గొనిరి. ఒకసారి వీరు శ్రీ మద్వాల్మీకి రామాయణ ప్రవచన సందర్భముగా ‘శ్రీహనుమత్సేవ’యను ఇతిహాసమును విని మనసున ఉత్సాహపడి రామభక్తుని స్మరించు భాగ్యము కూడ కల్గించి నందులకానందపడుచు, ఆ కథను పెంచి పెద్దదిగా పద్యములలో వ్రాసి ముద్రించిరి. వీరి ‘శ్రీహనుమత్సేవ’ ఆత్మరామాయణము వలెనే బహుముఖములుగా ప్రశంస పొందినది. శ్రీరామపట్టాభిషేకానంతరము కూడా హనుమంతుడు శ్రీరామసేవను వదలలేదు. అతని సేవ సోదరులకు, బంధు మిత్రులకు తుదకు కట్టుకొన్న భార్యకు కూడ కంటికి ప్రాయమైనది. వారెట్లో హనుమంతుని రాముని సేవ నుండి దూరము చేసిరి. అప్పుడు హనుమంతుడిట్లు తపించినాడు.
కం. కనుమూసిన, గనుదెఱచిన
గనులకు బండుగను సేయు కరుణానిధి నా
కనులకు గనిపింపడు నా
కనులుండియు నేమిఫలము కలుగును నాకున్
గీ. ఎందు బోవుదు? నాకిపుడేది మార్గ
మెటుల నా ప్రభు దర్శనమే బడయదు?
నేలపై బడ్డ చేపనై నిలువ వలసె
రామ యదియేమి? నా యపరాధమయ్య
సరళముగా వ్రాయుట నేర్చిన వారెంతటి విషయమునైనను అతి మణోహరముగానే వ్రాయుదురునుట కిది నిదర్శనము. శ్రీ గురుమూర్తిగారు సంఘ సేవా పరాయణులు. కీ.శే. కల్లూరు సుబ్బారావు గారితో బాటు రాజకీయ రంగమున కొన్నాళ్లు విహరించిరి. వీరు జాతీయ భావములు గల వారు. వీరి కిద్దరు కుమారులు. ఒకరు శ్రీనారాయణరావు గారు, రెండవ వారు శ్రీ రామమూర్తి గారు. వీరికి పలువురు మనుమలు, మునిమనుములున్నారు. కవిగారు తమ 82వ యేట తనువును చారించి శ్రీరామ పదసన్నిధిని చేరుకొన్న శ్రీరామభక్తులు.

రాయలసీమ రచయితల నుండి….

 

———–

You may also like...