పేరు (ఆంగ్లం) | Manuru Ramarao |
పేరు (తెలుగు) | మణూరు రామరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | వెంకమ్మ |
తండ్రి పేరు | మణూరు నారణప్ప |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 4/21/1908 |
మరణం | – |
పుట్టిన ఊరు | మధూడి మడకశిర తా. అనంతపురము జిల్లా |
విద్యార్హతలు | ఎస్.ఎస్.ఎల్.సి. |
వృత్తి | ఆంధ్రపండితులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | రామశతకము, ముక్తాక్షరగ్రతస్త రామాయణము-1936, శ్రీ ఆదినారాయణస్వామి చరిత్ర-1940, లీలారంగనాధము-1952, స్వాతంత్ర్య విజయము-1957. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | మణూరు రామరావు |
సంగ్రహ నమూనా రచన | వీరి పూర్వీకులు, అనంతపురము జిల్లా, పెనుకొండ తాలూక చిన్న మణుతూరుగ్రామములో ఉండిరి. కరణీకము చేయుచుండిరి. వీరి పితామహుని కాలములోనే ఆవూరు విడిచి మడకశిరా తాల్లూకు మణూరు చేరిరి. వీరితండ్రిగారుపాధ్యాయులుగా నుండిరి. ఈ కవిగారు కూడ ఉపాధ్యాయ వృత్తినే చేబట్టరి. ఈ కవిగారు 8వ, తరగతివఱకే చదివి, తరువాత స్వయంకృషితో SSLC ముగించి, తర్వాత విద్వా పరీక్ష ప్యాసై, 1949 నుండి 1963 వఱకు హిందూపురము మహాత్మాగాంధి హైస్కూలులో ఆంధ్రపండితులుగా పనిచేసి విరమించిరి. |
మణూరు రామరావు
వీరి పూర్వీకులు, అనంతపురము జిల్లా, పెనుకొండ తాలూక చిన్న మణుతూరుగ్రామములో ఉండిరి. కరణీకము చేయుచుండిరి. వీరి పితామహుని కాలములోనే ఆవూరు విడిచి మడకశిరా తాల్లూకు మణూరు చేరిరి. వీరితండ్రిగారుపాధ్యాయులుగా నుండిరి. ఈ కవిగారు కూడ ఉపాధ్యాయ వృత్తినే చేబట్టరి. ఈ కవిగారు 8వ, తరగతివఱకే చదివి, తరువాత స్వయంకృషితో SSLC ముగించి, తర్వాత విద్వా పరీక్ష ప్యాసై, 1949 నుండి 1963 వఱకు హిందూపురము మహాత్మాగాంధి హైస్కూలులో ఆంధ్రపండితులుగా పనిచేసి విరమించిరి.
విరామ సమయములో కూడా, వీరు కాలమును సద్వినియోగము చేయుచున్నారు. తన వద్దకు వచ్చుచున్న విద్యార్థులకు విద్యాదానము చేయుచున్నారు.
హిందూపురము తా. దాని గ్రామములు కవులకు, పుట్టినండ్లుగా వెలసినవి. కల్లూరు, కగ్గల్లు, మణేసముద్రము, కోడిపల్లి, కిరికెర, బేవినహళ్ళి, కొండాపురము మొదలైన గ్రామములలో కవులుద్భవించినారు. మణూరు మలుగూరు కవులుకూడి ప్రసిద్ధులు. సంగీత సాహిత్య సరస్వతులు కీ.శే. రొద్దము రాజారావుగారు, హిందూపురములో ప్లీడరుగావుండి, ఆంధ్రసాహిత్య సంగీతములకు, చేయూతనొసంగిరి. శ్రీకృష్ణదేవరాయ వర్థంతుల నెఱపి, సాహిత్య సంగీతసభలను ప్రోత్సహించినారు, కీ.శే. కల్లూరి సుబ్బరావుగారి జీవితములో, ఏటేట వసంతోత్సవముల జరిపి అనేక కవి పండితులను పిలిపించి వారిచే సాహిత్యోపన్యాసముల నిప్పించి వారిని ఘనముగా సత్కరించినారు. ఈ సందర్భమునందే మణూరువారికి కవితారామవసంత బిరుదమును శ్రీ జనమంచి వారిచ్చిరి.
శ్రీ మణూరు రామారావుగారు ఈ క్రింది గ్రంథముల రచించినారు. 1) రామశతకము 2) ముక్తాక్షరగ్రతస్త రామాయణము-1936, 3) శ్రీ ఆదినారాయణస్వామి చరిత్ర-1940, 4) లీలారంగనాధము-1952, 5) స్వాతంత్ర్య విజయము-1957.
శ్రీ ఆదినారాయణస్వామి చరిత్ర :
‘ఇది యొక స్థలపురాణము. ఇందుఁబేరొకన్న కూర్మగిరి నిపు‘డాది నారాయణ కొండ’ యందురు. ఇయ్యది మైసూరు రాజ్యమున ‘‘గుడిబండ’’ కుత్తరమున నాఱుమైళ్ళ దూరమున యల్లోడను గ్రామము చెంత గలదు. ఇద్ధరాధరంబుపై వేంచేసియుండు శ్రీమన్నారాయణుండు భక్తఫల ప్రదాతయని చాలాకాలమునుండియు లోకమున సువ్యక్తము. ప్రతి మాఘమాసమునను మూఁడవ రవి వాసరమున నిద్దేవునకు రథోత్సవాదుల నతిశ్రద్ధమెయి నచటి భక్తలోకము జరుపుట సర్వజన విదితము. ఈ జాతరకు దూరదేవమునుండి భక్తులు పెక్కురరుదెంతురు. ఏతదుత్సవ వినోదములనుఁ జూడవలయుఁ గాని చెప్పినఁ జప్పిడిగానుండును.’
కవిగారు తమ విన్నపము నండిట్లు వ్రాసుకొన్నారు.
ఈ గ్రంథమునకుఁ దొలుత నన్నుఁబ్రేరేపించినవారు వీరాపురములో నుండు వే బ. శ్రీ పంచాంగం వెంకప్పగారు. వారు ‘‘శ్రీకూర్మాద్రి పురాణ’’మున యక్షగానముగా నున్న యొక కృతిని నాకొసఁగిరి దానిని రచించిన వారు హంసనముద్రము నందుండిన కీ.శే. సూరప్పగారు మఱియు ‘యల్లోడు’ గ్రామనివాసులైన శ్రీయుత లక్ష్మీనరసప్పగారును, ఆదిశేషప్పగారును, నాయందభిమానముంచి ‘‘శ్రీ ఆదినారాయణస్వామి స్థల పురాణ’’మను కదథనిచ్చి నాకుత్సాహముఁ గల్పించిరి. ఆకథ కన్నడభాషలో సంగ్రహముగా వచనరూపమున వారి పెద్దలచే వ్రాయబడినది. ఈ గ్రంథమున కంగములుగాఁ గొన్ని విషఫయములను గుడిబండ నివాసులైన వే.బ్ర. శ్రీనరశింహభట్లుగారును, కంచిసముద్రం దాసా లక్ష్మయ్యశ్రేష్ఠిగారును దెలియఁజేసిరి.
ఈ యాధారములఁ బురస్కరించుకొని, శ్రీ ఆదినారాయణస్వామి యనుగ్రహమునను, పెద్దల యాశీర్వచన ప్రభావమునను, శ్రీ ఆదినారాయణ చరిత్రంబను విక్కావ్యంబు రచియింపగలిగిరి.
ఇందలి పద్యములు కొన్ని
కూర్మముని ప్రత్యక్షమగుట
కం. గిరిగహనసీమ ధరణీ
సురదంపతు లట్టులున్న చోటికి వచ్చె
సరగునఁ గూర్మము నీశుఁడు
పరమాదరచిత్తుఁడార్త బాంధవుఁడగుచు
సీ. దీర్ఘ జటాచ్ఛటల్ దిగజాఱి తెల్లనై
నెలిమిడి పూతతో నియ్యమంద
బ్రహ్మతేజంబున భాసిల్లు ముఖమున
శాంతరస స్ఫూర్తి సందడింప
యోగదండము చంక నొప్పుగా వలచేతఁ
బూను కమండలం బును రహింప
రుదురాకపేరులు కుదురుగా శోభింప
మునివేషమెంతయు పొసఁగుచుండ
ఆ. నఱుఁగుదెంచు నతని నబ్బురంబునఁజూచి
నతియుఁ బతియుఁ దమకు స్వాంతమందు
నొక్కవింతగాఁగ నుల్లపిల్లెడు భక్తి
తోడ నిల్చి కేలుఁ దోయి మోడ్చి
సీ. సత్యాగ్రహంబను సాధనంబు ధరించి
స్వచ్చంద సైనికుల్ సంభ్రమింపఁ
బ్రాణంబు లెదురొడ్డి పట్టు వీడకనిల్చి
రాజాజ్ఞ నెదిరి దు ర్వార భంగి
బార్డోలిజయము చేపట్టి దేశమునందు
నధికారులకు నధి కారివగుచు
శిక్షల నన్నింటి శిరసావహించి కా
రాగారముల నుండి త్యాగమహిమఁ
గీ. జూపి శత్రువులకు నెల్ల జోద్యమడర
శాంతిపద్ధతి సమరంబు సాగఁచేసి
దేశమున వారి యాజ్ఞకు దిక్కు లేక
దిగులు గూర్చితిగాదె గాంధీమహాత్మ
వీరి కృతులలో ‘శ్రీలీలారంగనాధము’ ఎన్నదగిన కావ్యము. దీనిని కవిగారు ప్రబంధపక్కీలో వ్రాసిరి. ఇది ఒక స్థలపురాణ గ్రంథము. హిందూపురం తాలూకా ‘శిరివరమ’ను గ్రామమున వెలసియున్న శ్రీరంగనాథస్వామి భక్తులలో అగ్రగణ్యులైన ఆ గ్రామ పూర్వపు కరణీక వంశస్థుల కథ కూడ యిందు చొప్పించబడినది. ఈ గ్రంథము కవిపండితుల ప్రశంసల నందుకొన్నది. కవిగారి రచనా వైఖరెట్లు సాగినదో, చూడుడు.
చం. చనిచని కాంచిరంతట విశాల మహీరుహ నాటికా ని గూ
హనమున మోహనాంగియగు వంగన కౌగిట మల్లసిల్లుచు
దన ఘనతా విశేషమున దారొకను పేరిమి జూపు రాజన
దనరుచు నున్న భూభృదవతంసము నున్నత శృంగ రమ్యము
ఉ. ఏమిది నీదులీల మహినింతటి భీకరమైన కాటకం
బీమెయి జుట్టుముట్టి తనయేడెతర జూసి గ్రసించు బ్రాణుల
స్వామి భరింపరాని దురవస్థలకుం గుఱియైతి మీ మహా
క్షామము దీర్చిప్రోవవె విశాల దయామయ రంగనాయకా
ప్రబంధ వైఖరిలో సూర్యోదయ, చంద్రోదయ, ఋతువర్ణనలతో, మూడు ఆశ్వాసములుగా వ్రాయబడిన ఈ కృతి వారి సాహిత్య కృషికి మకుటాయమానము.
ముక్తాక్షరగ్రస్త రామాయణము (1936)
పద్యము యొక్క, కడపటి అక్షరముతో, రెండవపద్యము ప్రారంమగును. రెండవ పద్యము యొక్క చివరి అక్షరముతో, మూడవ పద్యము ప్రారంభమగును. ఇట్లే చివరి వఱకు ఈ రామాయణమును 274 పద్యములతో సంగ్రహముగా, ముగించినారు.
సీతాపహరణమైన తర్వాత, శ్రీరాముడు తమ్మునితో గూడి, అరణ్యమున సంచరించుచు, సీతకై ఇట్లు వాపోయినాడు.
సీ. దౌర్భాగ్యుఁడైన నా తన్విని గానరే
తరులార యో లతా తరుణులార
దీనుండనైన, నామానినిఁగానరే
హరులార కరులార రురువులార
రాముండనైన, నా, రామనుఁగానరే
నదులార యో ఘన నగములార
మతిహీనుఁడన నా సతి నెందుఁగానరే
పక్షిగణము లార యక్షులార
గీ. హరిణమా సీత జాడల నరయలేదె
శారికా కానవైతివే జనక తనయ
పికము భూజాత కంరంబు వినగ లేదె
జనకసుత పల్కువినవొ యెందును, శుకేశ
ఈ కవిగారు శ్రీరామభక్తులు. శ్రీరామకోటి వ్రాసి తరించినారు సభ్యులు. సుగుణ సంపన్నులు, ఆధ్యాత్మిక చింతతో విశ్రాంతిగా హిందూ పురము నందు కాలము గడుపుచున్నారు.
రాయలసీమ రచయితల నుండి….
———–