పేరు (ఆంగ్లం) | Pala Venkatasubbaiah |
పేరు (తెలుగు) | పాలా వేంకటసుబ్బయ్య |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/11/1913 |
మరణం | – |
పుట్టిన ఊరు | రైల్వే కోడూరు – కడపజిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | మద్రాసు శాసనసభకు ఎన్నికై 10 సంవత్సరములు శాసనసభ్యులుగా పనిచేసిరి. |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అనిల సందేశము, భాగ్యమతి, గోలకొండ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | మధుర కవి |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పాలా వేంకటసుబ్బయ్య మధురకవి |
సంగ్రహ నమూనా రచన | మధురకవిగా పేరుపొందిన శ్రీ పాలా వేంకటసుబ్బయ్యగారిని గూర్చి కడప మండలములో తెలియని వారుండరు. శ్రీ సుబ్బయ్యగారు సాహితీక్షేత్రకర్షక కవులే కాదు, ప్రజాసేవకులు కూడా. 1951లో వీరు మద్రాసు శాసనసభకు ఎన్నికై 10 సంవత్సరములు శాసనసభ్యులుగా పనిచేసిరి. తదుపరి వీరిసాహితీ గురువులుగా శ్రీ వేదం వేంకటకృష్ణశర్మగారు భాసిల్లిరి. ప్రభుత్వ సహకారశాఖలో కొన్నినాళ్లు ఉద్యోగము చేసిరి. |
పాలా వేంకటసుబ్బయ్య
మధురకవి
మధురకవిగా పేరుపొందిన శ్రీ పాలా వేంకటసుబ్బయ్యగారిని గూర్చి కడప మండలములో తెలియని వారుండరు. శ్రీ సుబ్బయ్యగారు సాహితీక్షేత్రకర్షక కవులే కాదు, ప్రజాసేవకులు కూడా. 1951లో వీరు మద్రాసు శాసనసభకు ఎన్నికై 10 సంవత్సరములు శాసనసభ్యులుగా పనిచేసిరి. తదుపరి వీరిసాహితీ గురువులుగా శ్రీ వేదం వేంకటకృష్ణశర్మగారు భాసిల్లిరి. ప్రభుత్వ సహకారశాఖలో కొన్నినాళ్లు ఉద్యోగము చేసిరి.
శ్రీ సుబ్బయ్యగారు నిరంతర అధ్యయనశాలురు. చిన్నతనమునందే శతకములను వ్రాయుచుండిరి. శ్రీ వేదం వేంకటకృష్ణశర్మగారి వద్ద కవితా రహస్యముల నెన్నింటినో తెలుసుకొని వీరి గురువరేణ్యులు వీరిని గూర్చి ఇట్లు వ్రాసిరి.
‘‘చింరజీవి పాలా వెంకటసుబ్బయ్య నా శిష్యుడు. నావద్ద చదువుకొన్నాడు. అట్టి యెడ, విద్యా సముపార్జనయందు చొఱవ చూపు చుండిన కొలది మంది విద్యార్థులలో, నీతడగ్రగణ్యుడు నామట్టునకు నాతని విశేషము, గ్రహణాసక్తి, జ్ఞాన సంపాదనాభిరుచి గాంచి మున్ముందీతడు, పేరు పెంపులతో ప్రకాశింపగలడని యువ్విళ్ళూరు చుండెడివాడను. ఈతని ధారణాశక్తి అనుపమానము. పూవుపుట్టగనే దాని పరిమళము నలుదెశల వ్యాపించునుగదా’’
వీరు సాహితీక్షేత్రమున, పండించని ఫలవృక్షములు లేవు. లెక్కించినచో వీరి రచనలు కడప మండలమందలి ఫలవృక్షములకు మించినవనియే, చెప్పవచ్చును. వీరి రచనలలో నలుబదికిపైగా పద్యకావ్యములు, పదిగద్యకృతులు, ఎనిమిది నవలలు, నాలుగునాటకములు, రెండు కథాసంపుటములు, మరెన్నియో ఖండికలున్నవి. వీరి కృతులన్నియు మేల్బంతులే. ద్రాక్షాపాకములే.
ఈ కవిగారు పాశ్చాత్య సాహిత్య వినువీధులందు సహితము విహరించి కొన్ని ఆంగ్లకృతులను కూడా చక్కగా రచించిరి. సంస్కృతభాషను చక్కగానేర్చి కాళిదాసు ‘శాకుంతలము’ను గంగాదేవి రచించిన ‘మధురావిజయము’ను తెలుగులోని కనువదించి, తమ ఉభయ భాషాపాండిత్యమును చాటిరి. వీరి రచనలను పరిశీలించినపుడు వీరి హృదయమెంత, సున్నితమైనదో మన కవగతముకాగలదు. వీరి భావనలు సహితము మహోన్నతములవియే చెప్పవచ్చును.
కఱవుకాటక ప్రాంతమైన రాయలసీమకు వర్షమిమ్మని కథానాయికయైన భూదేవి కథానాయకుడగు మేఘునకు వర్తమానమును పంపినది. ఆ వార్తాహరుడు వాయుదేవుడు. ప్రకృతి సిద్ధముగా, మేఘములు చల్లని గాలి తాకిడుల వల్లనే వర్షించు చున్నవి. మేఘుని వర్షమువల్లనే భూదేవి హర్షించుచున్నది. నిండు జవ్వనివలె శోభిల్లుచున్నది. ఈ అద్భుతమైన భావన కవిగారి హృదయమున తళుక్కున మెఱసి ‘అనిల సందేశ’మను కావ్యముగా అవతరించినది. భార్య భూదేవి, భర్త మేఘునకిట్లు సందేశము అనిలుని ద్వారా పంపు చున్నది.
సీ. కోటానుకోట్లు నీకొమరులు నిలుపున
గూలిపోయిరనుమ, కూడులేక,
లక్షోప లక్షలు భిక్షాధికారులై
దుఃఖాన గుములుచుఁ దూలిరనుము,
వేలకు వేలు వస్త్రాలకు హీనులై
చింపి పాత్రలనె కైపేసి రనుమ,
పచ్చని వల్వ నిప్పచ్చరంబున వీదు
దయితయు మాలిన్య ధామయనును,
తీ.గీ. నిలిచి కనువిచ్చి యొకమారు నిండుకూర్మిఁ
జూడఁదలపెట్టి ప్రేమంపుఁ జుట్ట మనయి
సత్వరంబుగ రాకున్న సర్వసృష్టి
కాలసర్పవిషజ్వాలఁగ్రాగు ననుమ
ఈ ‘అనిల సందేశము’ క్షామ పాత్రమునకు దర్పణము పట్టిన ఒక దృశ్యకావ్యమనియే చెప్పవచ్చును. తదుపరి వీరి ఖండకాస్యమగు ‘‘మనరైతు’’నందుకూడ రైతు కష్టములను ప్రభుత్వమురైతునకు తలపెట్టిన సహాయ సహకార పథకములను, వాటి నుపయోగించు కొనవలసిన విధానములను వివరముగా ఇందు చొప్పించిరి. సహకార సంఘములు రైతుల పాలిటి కల్పవృక్షములుగా కవిగారిట్లు వర్ణించిరి.
ఉ. క్షామముఁబారదోలు, ధనకాంక్షఁగృషీవళులన్ విపత్తునన్
బాయెడు వడ్డి వర్తకులఁ బ్రక్కకుదోలు, విచారభూతమౌ
లేమిడి మక్కడించు, పరుడీకొనజాలు ధనంబునిచ్చు, పో
రాముల పోరుమాన్పు నవురా సహకారము మిందేదిల
ప్రజాసేవకులుగా పేరు తెచ్చుకొనిన ఈ కవివరేణ్యులకు ప్రజల యెడనే కాక ప్రజానాయకుల యెడను అమిత గౌరవ భావములున్నవి. భారత స్వాతంత్ర్య సముపార్జనకు ప్రాణము లొడ్డిన మహాత్మునియెడ వీరి కమితమైన భక్తి విశ్వాసములు కలవు. వారు గాంధిజీ మరణానంతరము వ్రాసిన పద్యములలో మచ్చున కొక్కటిందు ఉదహరించబడినది. వరి పరితాప మెట్లున్నదో చూడుడు.
సీ. సంసార సుఖముల – సర్వంబు విడనాడి
మానవసేవకై – మనియె నెవరు?
మృష్టాన్నములువీడి – మెకపాలు, ఫలాలు
కృషికుల కొఱకు భక్షించె నెవరు?
ఒలునిండ వస్త్రంబు – గలుగని వాడయి
పేదల కొఱకు జీవించె నెవరు?
ఆస్తిపాస్తులు లేక – నందందు భిక్షంబు
హరిజన నిధికిగా – నడిగె నెవరు?
గీ. విధివిరామము లేకఁ గా – వించి కృషిని
దాస్యయోచనమును గొన్న – దక్షులెవరు?
అట్టిజాతీయపిత దివి కరిగె మనల
దుఃఖసాగర మందున – ద్రోసికడకు
వీరి చారిత్రాత్మక కావ్యములలో ‘‘భాగ్యమతి’’, ‘విజయ వివేకానందము’ బహుళ ప్రచారము ఆదరణ పొందిన గ్రంధరాజములు. భాగ్యనగర నిర్మాణ కథావస్తువితి వృత్తముగా గలది, ‘భాగ్యమతి’ కావ్యము. ‘గోలకొండ’ యువరాజు ఒక సాధారణ నర్తకిని ప్రేమించుట, అది సహించని నవాబతనిని కోటలో బంధించుట, ఒకనాటి అర్థరాత్రి సమయమున వరదతో పొంగి పొరలుచున్న మూసీనదిని ఎవరికినీ తెలియక దాటి ఆవలి గట్టున గల తనప్రియురాలిని యువరాజు కలుసుకొనుట, ఇందు మనోజ్ఞముగా వర్ణింపబడినది.
తదుపరి వీరి ‘విజయ వివేకానందము’ ఎన్నదగిన ఆధ్యాత్మిక తత్త్వప్రభోధ కావ్యము. ‘ఇందలి పద్యములు సావలుదీరిన జాతిరత్నముల వంటివి ఇందెక్కడగాని చెత్తపదములు, ఊతకఱ్ఱలు, బెండు ముక్కలు వ్యర్థ దీర్ఘ సమాసములు కాగడా పెట్టి వెతికినను కానరావు. కథ చారిత్రాత్మక మగుటచే అనవసరమగు ఉత్ర్పేక్షలు లేవు. ఈ కావ్యము చిరంతరానందస్వామి, విరచిత గద్యకావ్యమునకు పద్యకృతి, ఈ కధను వ్రాయుటలో కవిగారి అభిప్రాయ మిట్లున్నది.
తే. కాళరాత్రికి చంద్రుని – కాంతికరణి
వాడు తీవకు వర్షసం – పాత మట్లు
దర్మమడుగంట – బ్రజలకు – ధర్మమిడగ
నమఈత తుల్యంబు గాదె నీ – యమలగాధ.
ఈ దివ్యగాధ భారతీయులకేగాదు, మానవాళికే అమృతతుల్యము. ఇందు వివేకానందు నిజననము – విద్యాభ్యాసము, మానసిక పరివర్తనము వివాహము గురుదర్శనము మున్నగు విషయములన్నియు విపులీకరించబడినవి నరేంద్రుని తల్లి కుమారునికిట్లు బోధ చేయుచున్నది.
తే. ‘‘ప్రాణభయము వాటిల్లిన – పలుకబోకు
మెపుడసత్యము, విడువకు మే యనువున
నైన మంచి యుద్దేశము – నందఱియెడ’’
దయ బ్రకటనసేయుమ పుత్ర తలగ కెపుడు
నరేంద్రుడు రామకృష్ణుని దర్శనము చేసుకొన్నాడు. అతని కృపకు పాత్రుడైనాడు, రామకృష్ట పరమహంసకు కూడ నరేంద్రునిపై విశ్వాసమంకురించినది. నరేంద్రుడు వివేకానందుడైనాడు. అప్పుడు పరమహంస నరేంద్రునిట్లు ప్రశంసించు చున్నాడు.
అష్టదళపద్మమొకడు, పెంపారనొకడు
షోడశ దళపద్మమగును – జూడనితడు
మహివి జను సహస్రదళప-ద్మంబునాగ
శిష్యవరులార యీతని చెలిమి గనుడు
ఈ పూర్వభాగపు కృతిని శ్రీ నీలం సంజీవరెడ్డిగారి అంకితము గైకొనిరి. ఈ వివేకానందపు ఉత్తరభాగము వెలువడినదో లేదో తెలియదు. ఈ కవిగారి కృతుల కన్నింటిని శ్రీ జి. జాషువా కవిగారు మెచ్చి తమ అమూల్యాభిప్రాయముల నిచ్చిరి.
ఈ కవిగారిని 1955 సెప్పెంబరులో కడపయందు సన్మానించి మధుర కవి అను బిరుదొసంగిరి. ఢిల్లీ ఆంధ్ర సంఘమువారు ‘‘కవిరాజహంస’’యను బిరుదునిచిచ సత్కరించిరి. శ్రీ సుబ్బయ్యగారు ‘‘కలభాషిణి’’, ‘‘శ్రీశైలప్రభ’’ పత్రికలకు నిర్వాహకులుగాను, సంపాదకులుగాను వ్యవహరించిరి. వీరు ‘‘కవిరాజహంస’’ గ్రంథమాలను స్థాపించి తమకృతుల నెన్నింటినో తెలుగులోనికి దెచ్చిరి. వీరి కృషి ఆచంద్రతారార్కముగా నిలిచిపోగలదు. కడప మండల కవిరత్నములలోను, సాహిత్యచరిత్రలోను అగ్రశ్రేణి కవులుగా వీరు పేరెన్నిక గనిరి. పరమేశ్వరుడు వీరికి చిరాయురారోగ్యాభివృద్ధుల ననుగ్రహించు గాక.
రాయలసీమ రచయితల నుండి….
———–