తలమర్ల కళానిధి (Talamarla Kalanidhi)

Share
పేరు (ఆంగ్లం)Talamarla Kalanidhi
పేరు (తెలుగు)తలమర్ల కళానిధి
కలం పేరు
తల్లిపేరుఓబమ్మ
తండ్రి పేరుఓబన్న
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1915
మరణం
పుట్టిన ఊరుఅనంతపురం జిల్లా, కొత్తచెరువు మండలానికి చెందిన తలమర్ల గ్రామం
విద్యార్హతలువిద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడైనారు.
వృత్తితెలుగు పండితులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశ్రీరామాయణనిధి (వాల్మీకి రామాయణానికి వచనానువాదం), దక్షిణేశ్వర భాగవతము (రామకృష్ణ పరమహంస జీవితగాథ మంజరీ ద్విపదలో), ఆత్మకథ, కబీరు సూక్తినిధి (తేటగీతుల్లో కబీరు సూక్తులు), వర్ణాంతర వివాహాలు (నాటకము), హరిజనోద్ధరణ (నాటకము), కళాసౌధము[4] (ఖండకావ్య సంపుటి), నవనాథ చరిత్ర, మధుకణములు (శ్రీ కృష్ణకర్ణామృతమునకు తెలుగు అనువాదము వచనం), కథానిధి (కథాసంపుటి)
ప్రేమపూజ (కథాసంపుటి), మణిమనోహరులు (కథాసంపుటి)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులులలితకవికోకిల, విద్యారత్న
ఇతర వివరాలుతలమర్ల కళానిధి పేరుతో సాహిత్యలోకానికి పరిచయమైన ఈ కవి అసలు పేరు కొల్లప్ప
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికతలమర్ల కళానిధి
లలిత కవికోకిల – విద్యారత్న విద్వాన్
సంగ్రహ నమూనా రచన‘‘శారదా నన్నేల వరియించితో
ఓ సుభాషిణీ సుగుణాంబుధీ నన్నేల వరియించితో?
కొఱగాని కులమని, తెలిసితెలిసీ, కోరి నన్నేల వరయించితో
భారతీ నన్నేల వరియించితో?
మంజుల వీణా నాదముతో, నాయిలు సేరితి వనుచు
ఆడిపోసుకొను యీర్ష్యాలోకమున కదనొసగీ
నన్నేల వరియించితో – శారదా నన్నేల వరియించితో’’

తలమర్ల కళానిధి
లలిత కవికోకిల – విద్యారత్న విద్వాన్

‘‘శారదా నన్నేల వరియించితో
ఓ సుభాషిణీ సుగుణాంబుధీ నన్నేల వరియించితో?
కొఱగాని కులమని, తెలిసితెలిసీ, కోరి నన్నేల వరయించితో
భారతీ నన్నేల వరియించితో?
మంజుల వీణా నాదముతో, నాయిలు సేరితి వనుచు
ఆడిపోసుకొను యీర్ష్యాలోకమున కదనొసగీ
నన్నేల వరియించితో – శారదా నన్నేల వరియించితో’’
(గేయ సుమమాల)

అని వాణికడ తనమనసులోని ఆవేదనను తెలుపకొన్న కవికోకిల, మరెవ్వరో కాదు; గతమున ‘శ్రీ కొల్లప్ప’ నామధేయుడుగా నుండి, నేడు సాహితీ లోకమున ‘కళానిధి’గా వ్యవహరింపబడుచున్నవారే, శ్రీ శారదా మాత వరించుటకు కులముతో పనిలేదు. ఆమెకు సద్గుణ సంపన్నుడవసరము. అట్టివారిని జిహ్వాగ్రమున ఆమె యిలుగట్టుకొని వసించును. అతనికొక ఘనకీర్తినే తెచ్చిపెట్టును. శ్రీ కళానిధి నేడామె వరప్రసాదమున బహుగ్రంథ కర్తయై సాహితీప్రక్రియ లన్నింటియందును సిద్ధహస్తులైరి.
తలమర్ల గ్రామము కవికుమారులకు నిలయము, ఇక్కడ పుట్టిన శ్రీ బెళ్లూరి, శ్రీ వేదాంత నరసింహారెడ్డి మొదలైన కవులు ప్రకృతి సౌందర్యోపాసకులై కవితలల్లిరి. కళానిధిగారుకూడ వీరి సాంగత్యమున ప్రభావితులై తొలుత భావగేయములను వ్రాసిరి. తదుపరి వచన రచనలు వ్రాయతలపెట్టి – కథలు, కథానికలు, నాటకములు, బాలసాహిత్యములు వ్రాసిరి. ఇహపరదాయకమగు రామాయణకథను ‘శ్రీ రామాయణనిధి’గా వచనము నందును, శ్రీ రామకృష్ణ పరమహంస దివ్యచరితమును ‘దక్షిణేశ్వర భాగవతము’గా మంజరీ ద్వీపదలో రెండు సంపుటములుగా వ్రాసి ముద్రించి ధన్యులైరి. వీరిరచనల యందిది తలమానకము. ఇది కవి పండితుల ప్రశంసలనందుకొన్న గ్రంథరాజము. దీని ముద్రణకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి సహాయము లభించినది. ఇందలి రచనా విధానము పాఠకుల మనసులనెట్లు నాకట్టు కొనుచున్నదో చూడుడు. రామకృష్టుని భూతదయనిట్లు అభివర్ణించిరి.
ఒకనాడు నైవేద్య మొప్పారు నట్లు
కాశిక కర్చించు వేళలో నొక్క
మార్జాల మరుదెంచె మాయవ్మాయవు మనుచు
మాతను జేరంగ మమత లూరుచును;
గురుదేవు డద్దాని కొమరార గాంచి
అమ్మరో ఆహార మవసర మనుచు
త్వరపడు చుంటినా కరుణాలవాల
ఇదిగొ తినుమనుచు హృదయంబు బొంగ
పిల్లికా యన్నంబు ప్రియమార బెట్టె.
తమకుగల సంస్కృత పరిచచయముతో శ్రీ కళానిధిగారు శ్రీ లీలాశుకునిచే రచింపబడిన శ్రీ కృష్ణకర్ణామృతము’ నందలి ప్రతిశ్లోకమునకు ‘మధుకణము’లను పేర చక్కని వచనరచనము భావయుక్తముగా వివరముగా సర్వుల కర్థమగునట్లు వ్రాసిరి. శ్రీశంకరాచార్యుల విరచితంబగు శివానందల హరి – సౌందర్యలహరులను కూడ సులభతరమగు వచనములను వ్రాసిరి. హిందూ, ముస్లిం మతముల మధ్య అనుసంధాన హేతువుగా నిలిచిన కబీరు దాసు సూక్తులను ‘కబీరుసూక్తి నిధి, పేర తేట గీతపద్యములు వ్రాసిరి. కబీరు తన ‘సాఖీ’లో మనుజునకు చూపిన ఆనందసామ్రాజ్య తత్వమును కళానిధి గారిట్లు పద్యములలో వ్రాసిరి.
ఆకసము నంటుచెట్టుకు నందరాని
ఏ చిటారు కొమ్మలలోనొ ఇంపులొలుక
ఫలము ఫలియించె – దానిని భవ్యమలర
తినగ నోచిన పక్షులు గనగ నరుదు.
అరుదుగానుండు నాపండు అమరమూర్తి
అదియె ముక్తియు జీవంబు నదియె మిగుల
సంతసంబొన గూర్చెడు సంబరమును
అదియె, ఆనంద సామ్రాజ్య మగును జగతి.
వీరి కథలు ప్రేమపూజ, మణిమనోహరులు, కథానిధి మొదలగు సంపుటములుగా వెలువడినవి. అట్లే ‘హరిజనోద్ధరణ’ – ‘వర్ణాంతర వివాహాలు’ మొదలగు నాటకములు వ్రాసిరి.
హైయ్యర్ గ్రేడు ఉపాధ్యాయవృత్తిలో ప్రవేశించిన శ్రీ కళినిధిగారు స్వయంకృషితో 1915 లో విద్వాన్లో ఉత్తీర్ణతపొంది, అనంతపురమునందు తెలుగు పండితులుగా పనిచేసి, 1970 లో రిటైరై విశ్రాంతి తీసుకొనుచున్నారు. 1965లో శ్రీ సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులవారు వీరి కవితను మెచ్చి ‘లలితకవికోకిల’ అను బిరుదము నిచ్చిరి. 1970లో శ్రీ వేంకటేశ్వర ఆనందస్వాములవారు ‘విద్యారత్న’ బిరుదమిచ్చిరి.
మొదటినుండియు బీదతనముతోనే జీవితమును గడుపుకొనుచు వచ్చిన కళినిధిగారు నిరాడంబరులు, సుగుణసంపన్నులు, పెద్దలయెడ గౌరవభావము కలవారు. అనంతపురమునందు మహాదాతలుగా పేరెన్నికగన్న శ్రీయుతులు జూగప్ప – ఎద్దీరప్ప – గొంగడిరామప్ప-టి. కోదండరామయ్య మున్నగువారందరు వీరికృతుల ముద్రణకు సహాయపడిరి. వీరి కృతులన్నియు ముద్రితములే. మంచిమనిషిగా, విలువగల విద్వన్మణిగా పేరుదెచ్చుకొన్న కవితానిధి మనకళానిధి. వజ్రము మట్టిలోనున్నను రాశిలోనున్నను దాని విలువ తరగనిది. పద్మము బురదలో పుట్టినంతమాత్రమున అది శ్రీమన్నారాయణుని పదకమలము జేరలేదా? పూర్వజన్మ సుకృతముతో శ్రీవాణి అనుగ్రహమున సంపాదించిన కవిత్వముతో శ్రీ కళానిధిగారు ఇహపర సుఖములకు దోహదకరములగు ఉత్తమ సద్గ్రంథములను వ్రాసి జన్మను సార్థకము చేసుకొనిరి. వీరికి భగవంతుడు ఆయురారోగ్య భాగ్యములిచ్చి కాపాడుగాక.

ఇతని సుగుణాన్ని నిరూపించే సంఘటన ఒకటి

ఆ రోజుల్లో పల్లెల్లో అక్షరాస్యతని వ్యాపింపచేయటం కోసం, ప్రైవేటు మేనేజ్‌మెంట్లు నిర్వహించే ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల్నీ, ప్రాథమికోన్నత పాఠశాలల్నీ, ప్రభుత్వం గ్రాంటులిచ్చి ప్రోత్సహించేది. ఆ గ్రాంటుసొమ్ము ఎంతో తెలుసా? 1 నుండి 5వ తరగతి వరకూ ఉండే ప్రాథమిక పాఠశాలకి నెలకి 5 రూపాయలు. 6, 7, 8 తరగతులు కూడా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల అయితే, నెలకి 15 రూపాయలు. అంతే, ప్రభుత్వం అందించే సాయం. మరి, స్కూలుకి కావలసిన కుర్చీలూ, బెంచీలూ, బల్లలూ, రిజిష్టర్లూ, మ్యాపులూ, తెల్ల కాగితాలూ, చాక్`పీసులూ, ఇవి కాక, బిల్డింగ్ అద్దె, టీచర్ల జీతాలు – వీటన్నింటికీ డబ్బు కావాలి కదా – అది అంతా మేనేజ్‌మెంట్ వారే, ఊళ్లో ప్రజల విరాళాల ద్వారానో, విద్యార్థులు చెల్లించే స్కూలు ఫీజుల ద్వారానో సమకూర్చుకోవాలి. విద్యార్థుల దగ్గర్నుంచి ఫీజు, ఎట్టి పరిస్థితిలోనూ నెలకి అర్థ రూపాయి మించకుండా, అదైనా స్కూళ్ళ ఇన్‌స్పెక్టరు వారి అనుజ్ఞ లేకుండా వసూలు చెయ్యకూడదు – ఇదీ ఆనాటి ఎయిడెడ్ పాఠశాల పరిస్థితి. ఆ పాఠశాల మేనేజ్‌మెంట్ల దుస్థితీను. అటువంటి ప్రాథమిక పాఠశాల మేనేజ్‌మెంట్ అధిపతిగా తలమర్ల కళానిధి ఉండేవాడు. అప్పటికాయన వయస్సు ఇరవై నిండలేదు. అంతే కాదు, ఆయన ఎనిమిదవ క్లాసు వరకే చచువుకొని టీచర్ ట్రైనింగ్ అయ్యాడు. అలా ఎనిమిదవ క్లాసు మాత్రమే పాసయి టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళని హయ్యర్‌గ్రేడ్ టీచర్లనే వారు. అలా కాకుండా మెట్రిక్యులేషన్ పేసయి, టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్లని సెకండరీ గ్రేడ్ టీచర్లనే వారు. తలమర్ల వారు అప్పట్లో హయ్యర్‌ గ్రేడ్ టీచర్ మాత్రమే! బెళ్లూరి శ్రీనివాసమూర్తి మాత్రం సెకండరీ గ్రేడ్. అంటే బెళ్లూరి ఓ మెట్టు ఎక్కువ. అనగా 6, 7, 8 తరగతులకి పాఠం చెప్పే అర్హత వుంది ఆయనకి. అలా తనకంటే ఎక్కువ అర్హత ఉన్న తన మిత్రుడు బెళ్లూరి శ్రీనివాసమూర్తిని, ప్రాథమికోన్నత పాఠశాలగా ఎదిగి, తన మేనేజ్‌మెంట్ లోనే ఉన్నత పాఠశాలకి హెడ్‌మాస్టర్‌గా చెయ్యడమే కాకుండా, శ్రీనివాసమూర్తి తమ్ముడికీ, తండ్రిగారికీ, ఇద్దరికీ కూడా తన పాఠశాలలో టీచర్ ఉద్యోగాలిచ్చాడు తలమర్ల కళానిధి. మైత్రిపట్ల ఆయనకి ఉన్న అభిమానం అది. కాని శ్రీనివాసమూర్తి తండ్రి అయిన హనుమంతరావుగారికి, ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ప్రాథమికోన్నత పాఠశాల స్థాయికి ఎదిగిన ఆ పాఠశాల మేనేజ్‌మెంట్‌ని, తలమర్ల కళానిధి నుంచి తప్పించి తను చేజిక్కించుకోవాలనే చెడు తలంపు వచ్చింది. దాంతో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పై అధికార్లకి ఫిర్యాదులు చేశాడు. ఊళ్ళో కొందరిని తలమర్లపైకి ఉసిగొల్పాడు. లెక్కలు సరిగా లేవని తప్పుడు ప్రచారం చేశాడు. ఆయన ఎన్ని రకాల దుష్ర్పచారం చేసినా తలమర్ల కళానిధి కలత చెందలేదు. తన మిత్రుడైన శ్రీనివాసమూర్తి కూడా ఆ కుట్రలో కలిసి అందులో భాగస్వామి అయ్యాడే అని బాధపడ్డాడు. దాంతో ఎన్నో ఏళ్ళుగా వర్ధిల్లుతూన్న బెళ్ళూరి, తలమర్లల స్నేహానికి గ్రహణం పట్టింది. ఇద్దరి మధ్యామాటలూ, పలకరింపులూ అదృశ్యం అయ్యాయి. ఇద్దర్లో, ఏ ఒక్కరు సంస్కారి కాకపోయినా, ఆ విరామం వైషమ్యానికీ, వైషమ్యం విరోధానికి దారితీసేది. కాని ఇద్దరూ సంస్కారులు – ముభావంగా ఒకరికొకరు దూరంగా ఉండిపోయారు. పరస్పరం దూషించుకోలేదు. తగవులాడుకోలేదు. తర్వాత కొన్ని నెలలకి బెళ్లూరి విద్వాన్ పరీక్షకి కూర్చోవలసి వచ్చింది. అందుకాయనకో సర్టిఫికెట్ కావలసి వచ్చింది. బోనఫైడ్ టీచర్‌గా పనిచేసినట్లు. ఆ సర్టిఫికెట్ ఎవరుఇవ్వాలి? తను పనిచేసింది తలమర్ల స్కూల్లో, అందువల్ల ఆయన ఇవ్వాలి సర్టిఫికేట్. కాని ఇంత జరిగాక ఇస్తారా? సరాసరి తలమర్ల దగ్గరికి వెళ్ళి తలవంచుకొని కన్నీరు కారుస్తూ నిలబడ్డాడు బెళ్లూరి. తలమర్ల కళవళపడి ‘ఏవిటిది స్వామీ?’ అనడిగాడు. ‘నీకు ద్రోహం చేశాను. మా నాన్నగారితో కలిసి నీపై కుట్రపన్నాను. దుష్ర్పచారం చేశాను. ఇప్పుడు క్షమించి బోనఫైడ్ టీచర్ సర్టిఫికేట్ నాకు ఎలా ఇస్తావు? ఇవ్వవు నాకు తెలుసు’ అన్నాడు. ‘ఎందుకివ్వను? ఇస్తాను. మన స్నేహానికి మధ్యలో ఏదో మబ్బుపట్టింది. ఇప్పుడు తొలిగిపోయింది ‘ అంటూ కౌగిలించుకొని, సర్టిఫికెట్ మీద సంతకం చేసి మిత్రుని భవిష్యత్తుకి బంగారుబాట వేశాడు తలమర్ల.

రాయలసీమ రచయితల నుండి……

———–

You may also like...