చౌళూరు రామరావు (Chowluru Ramarao)

Share
పేరు (ఆంగ్లం)Chowluru Ramarao
పేరు (తెలుగు)చౌళూరు రామరావు
కలం పేరు
తల్లిపేరునరసమ్మ
తండ్రి పేరుసి. మధ్వరావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ3/28/1916
మరణం
పుట్టిన ఊరుచౌళూరు, హిందూపురం తాలూకా, అనంతపురం జిల్లా
విద్యార్హతలు
వృత్తిపాఠశాలల తనఖీ అధికారి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకన్నడ గ్రంథములైన ‘‘గీతాంజలి’’ – ‘‘తత్త్వాంజలి’’ – ‘‘విశ్వేశవాణి’’ అనువదించి, ముద్రించిరి.
శ్రీ వాదిరాజులచరిత్ర, శ్రీ రాఘవేంద్రస్వాముల చరిత్ర
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికచౌళూరు రామరావు
సంగ్రహ నమూనా రచనతెలుగు సాహిత్యంలో అనువాదం ఒక విశిష్ట ప్రక్రియ. అనువాదకుడు ఈ ప్రక్రియ ద్వారా ఇరుభాషలలోని సాహిత్య మాధుర్యాన్ని పాఠకలోకానికి అందివ్వగలుగుతున్నాడు. కన్నడ భాషనుండి ఇప్పటికే ఎన్నో గ్రంథాలు తెనుగులోనికి అనువాదింపబడియున్నాయి. ఈ అనువాద ప్రక్రియ ఎక్కువగా, కన్నడరాష్ట్రమునకు చేరువగాను, కన్నడరాష్ట్రముతో ఎక్కువగా సన్నిహిత సంబంధాలు కలిగిన పొరుగురాష్ట్రాల రచయితలు కొందరు తమ భాషలోనికి రత్నాలవంటి కన్నడ రచనలను అనువదించి ‘‘కన్నడకస్తూరి’’ని గుబాళింపజేసిరి. అట్లే ‘‘తెలుగు తీపి’’ని కూడ కర్ణాటకులు గ్రహించినారు.

చౌళూరు రామరావు

తెలుగు సాహిత్యంలో అనువాదం ఒక విశిష్ట ప్రక్రియ. అనువాదకుడు ఈ ప్రక్రియ ద్వారా ఇరుభాషలలోని సాహిత్య మాధుర్యాన్ని పాఠకలోకానికి అందివ్వగలుగుతున్నాడు. కన్నడ భాషనుండి ఇప్పటికే ఎన్నో గ్రంథాలు తెనుగులోనికి అనువాదింపబడియున్నాయి. ఈ అనువాద ప్రక్రియ ఎక్కువగా, కన్నడరాష్ట్రమునకు చేరువగాను, కన్నడరాష్ట్రముతో ఎక్కువగా సన్నిహిత సంబంధాలు కలిగిన పొరుగురాష్ట్రాల రచయితలు కొందరు తమ భాషలోనికి రత్నాలవంటి కన్నడ రచనలను అనువదించి ‘‘కన్నడకస్తూరి’’ని గుబాళింపజేసిరి. అట్లే ‘‘తెలుగు తీపి’’ని కూడ కర్ణాటకులు గ్రహించినారు.
ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పుట్టి పెరిగిన వారికీ రెండు భాషలపైనా అవ్యాజమైన ప్రేమానురాగాలు సహజముగా ఏర్పడును. కన్నడ, తెలుగుభాషా శారదలు, వారిండ్లలో సతము నాట్య మాడుచుండుదురు. అట్టి సరిహద్దు ప్రాంతపుపల్లె, చౌళూరు. ఇది అనంతపురం జిల్లా, హిందూపురం తాలూకాలో వున్న గ్రామము. ఈ పల్లెలోని రైతులు కొందరు నేటికి తమ భూములశిస్తులు కొంతభాగము కర్ణాటక ప్రభుత్వ ఖజనాకు, మరి కొంతభాగము హిందూపురం లూకా ఖజానాకు కట్టుచున్నారు. ఇట్టి చౌళూరు గ్రామములో ఒక సదాచార పరాయణుల యింట పుట్టినవారు శ్రీ రామారావుగారు.
శ్రీ చౌళూరు రామరావు చిన్నతనము నుండి ఆంధ్ర, కన్నడ రాజ్య రమామణుల యిండ్ల నాడిపాడిన విద్యాఖని. తండ్రి చౌళూరు మధ్వరావుగారు పేరుమోసిన ఉపాధ్యాయులు. నలువది సంవత్సరముల కాలము చౌళూరులో అవిచ్ఛిన్నముగా ఉపాధ్యాయవృత్తి నవలంబించి ఖ్యాతి నార్జించినవారు. వీరి ప్రథమ సంతానమే మన రామరావుగారు.
సి. రామరావుగారు హిందూపురం తాలుకాలో (అనంతపురం జిల్లా) 1934 నుండి సుమారు పదేండ్లకాలము ఉపాధ్యాయులుగా పనిచేసి, తదుపరి సుమారు 20 సంవత్సరముల కాలం ప్రాథమిక పాఠశాలల తనఖీ అధికారిగా (స్కూల్ ఇన్ స్పెక్టర్) పనిచేసి 1971లో పదవీ విరమణ పొందిరి. ఉద్యోగ విరమణానంతరము సమాజహిత కార్యక్రమములందు విరివిగా పాల్గొనసాగిరి.
శ్రీ రామరావు మంచివక్తగా జిల్లాలో పేరు గడించిరి. వీరి ఉపన్యాసములు శ్రోతలను మంత్రముగ్ధుల గావించును. చక్కటి హాస్యప్రియులు. చమత్కారముతో కూడిన ఉపన్యాస ప్రసంగములు గావించుట వీరికి పుట్టుకతో అబ్బిన విద్య. సమయస్ఫూర్తి, నేర్పరితనము. సహజ సంస్కరణాభిలాష కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడడం వీరికున్న సహజ గుణాలు.
ఉడిపి పేజావర స్వాములైన శ్రీ విశ్వేశ తీర్థ శ్రీపాదులవారికి వీరు ప్రియుశిష్యులై వారి వెంట ఆంధ్ర ప్రాంతములు తిరుగుచూ వారిచ్చు కన్నడ ఉపన్యాసములను అతి చక్కగా, సరళముగా, మధురముగా హాస్యాన్ని అక్కడక్కడ జోడిస్తూ అనువదించేవారు. అప్పుడే వీరికి స్వామిజీవారి కన్నడ రచనలను తెలుగులోనికి అనువదింపవలెననెడి ఒక గొప్ప ఆలోచన కలిగినది. స్వామి కృపవల్లనూ, వారి అనుగ్రహమువల్లనూ వారి రచనలను, ఉపన్యాసములను తెనుగునకనువదించి ధన్యులయిరి.
చౌళూరు రామరావుగారు తొలుత స్వామిజీవారి, ‘‘గీతాసారోద్ధార’’మను కన్నడ బృహద్గ్రంథమును తెనుగులోనికి అనువదించిరి. ఆ అనువాదము నెల్లరూ మెచ్చిరి. కొందరు దానిని తెలుగు గ్రంథముగానే లెక్కించిరి. అందలి విషయము లెల్లరకు సుబోధకములు. స్వామిజీవారు దానిని ముద్రించి ఆంధ్రదేశ మెల్లెడలా విస్తృత ప్రచారము గావించిరి. అప్పటి నుండి రామారావుగారికి స్వామిజీ రచనలపై గురుత్వ మేర్పడివారి కన్నడ గ్రంథములైన ‘‘గీతాంజలి’’ – ‘‘తత్త్వాంజలి’’ – ‘‘విశ్వేశవాణి’’ అనువదించి, ముద్రించిరి. ‘‘వాదిరాజులచరిత్ర’’ ‘‘శ్రీ రాఘవేంద్రస్వాముల చరిత్ర’’ స్వతంత్రముగా రచించి, ముద్రించిరి.
‘‘గీతాసారోద్ధార’’ మందు శ్రీ విశ్వేశతీర్థ శ్రీపాదుల వారు హుబ్బళ్ళిలో చాతుర్మాసకాలమున భగవద్గీతను గూర్చి యిచ్చిన నలువది ఉపన్యాసములు కలవు. ఆ గ్రంథమిప్పటికి మూడు పునర్ముద్రణములు పొందినది. అందుకు కారణము అనువాద మందలి సౌందర్యశైలి. దీనిని చదువరులు మిక్కిలి మెచ్చుకొనిరి. తదుపరి శ్రీ స్వామివారి శ్రేష్ఠ వ్యాఖ్యానము నుండి స్వారస్యకరములైన భాగములనేరి ‘‘గీతాంజలి’’ కూర్చబడినది. ఒక్కసారి చదివిన చాలు చిరకాలము జ్ఞాపక ముండుటకు వీలైన సులభశైలితో ‘‘గీతాంజలి’’ వ్రాయబడినది.
‘‘వాదిరాజుల’’వారు మాధ్వ యతిశ్రేష్ఠులు. సజీవముగ బృందావన ప్రవేశము గావించిన తొలి మాధ్వయతీంద్రులు వీరు. రెండవవారు శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వాములవారు. వాది రాజులవారి తమ జీవితకాలములో చేసిన పనులు. చూపిన మహిమలు. సంపాదించిన తపశ్శక్తి అపారములు. అనూహ్యములు. ఇంతటి మహిమాన్వితులు లోకోపకారులగు శ్రీ వాది రాజులవారి దివ్యచరిత్ర చాలమంది ఆంధ్రులకు తెలియదు. ఆలోటును తీర్చనెంచి శ్రీరామరావు వాదిరాజులవారి ప్రేరణతో అనేక కన్నడ గ్రంథములను పరిశీలించి తెనుగున వచన రూపమున ‘‘శ్రీ వాదిరాజులచరిత్ర’’ అను పేర పుస్తకమును ప్రచురించిరి. శ్రీ వాదిరాజులవారికి శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపమున ప్రత్యక్షమై వీరు సమర్పించు నైవేద్యమును ప్రతి రోజు ఆరగించి పోవుచుండిరట. అట్టి మహనీయుని చరిత్ర అతి సులభశైలిలో తెనుగుభాషలో రామరావుగారు రచించి ధన్యులైరి.
‘‘శ్రీ విశ్వేశవాణి’’ పేజావరు స్వాములవారి ప్రసంగాలలోని ‘‘ఆణిముత్యాలు’’. ఈ ప్రసంగములు సామాన్యులకు ధర్మాచరణయందు శ్రద్ధాసక్తులను కలిగించి వచ్చునని అనువాదకులు యోచించి వాటిని క్రోడీకరించిరి. అందలి ఒక ఆణిముత్యము నుదహరించుచున్నాము.
‘‘గృహము భవనమని పరిగణింప బడవలెనన్న అచ్చట భగవద్భక్తి – భగవద్భజన మున్నగునవి జరుగుచుండవలెను. ఇట్లు భగవత్ సంపర్కములేనిచో అది ‘‘భ’’ కారము పోగొట్టుకొన్న ‘‘వన’’ మనిపించుకొనును. అచట నివసించువారు భవనవాసులైన మానవులగుటకు బదులు వనవాసులైన పశువులే అగుదురు’’ ఇట్టి జ్ఞానోపదేశమును గావించు సూక్తు లిందు పెక్కు కలవు.
శ్రీ చౌళూరు రామరావుగారు అనువాదకర్త లేకాక సంఘసేవాకర్తలు కూడ. హిందూపురం తా. బ్రాహ్మణ సంఘమును స్థాపించి, దాని కధ్యక్షులై పేద బ్రాహ్మణ వర్గమునకు చెందిన విద్యార్థులకు అన్నివిధములా సహకారములనందించిరి. అట్లే హిందూపురం లేపాక్షి పట్టణములందు శ్రీ చింతలపాటి బాపిరాజు ధర్మసంస్థ – చిననిండ్రకొలను వారిచే ఓరియంటల్ హైస్కూలు. కళాశాలలు స్థాపింపబడుటకు వీరెంతయో శ్రమించి విద్యావ్యాప్తికై కృషిచేసిరి. విశ్వహిందూపరిషత్ కార్య్రకమములందు విరివిగా పాల్గొనుచుందురు. హిందూపురంనందలి శ్రీరాఘవేంద్ర స్వామి మఠస్థాపనకు వీరు చేసిన సేవ అపారము. కీ.శే. పద్మశ్రీ కల్లూరు సుబ్బారావుగారికి వీరు కొన్ని ఏండ్లు అంతరంగిక కార్యదర్శిగా వ్యవహరించిరి.
వయసు ముదిరినకొద్ది వీరిలో ఉత్సాహ మినుమడించి యువకులవలె సహజసేవ కుద్యుక్తులగుచుందురు. ఇట్టి డెబ్బది ఏండ్ల నవయువకునకు భగవంతుడు ఆయురారోగ్య భాగ్యములనిచ్చి సర్వదా కాపాడుగాత.

రాయలసీమ రచయితల నుండి…..

———–

You may also like...