వెంపటి నాగభూషణం (Vempati Nagbhushanam)

Share
పేరు (ఆంగ్లం)Vempati Nagbhushanam
పేరు (తెలుగు)వెంపటి నాగభూషణం
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅతని గూర్చి, ఆద్యంతాలు, ఇంటి విషయాలు, ఇర్వురు భార్యలు,ఉద్యోగ ప్రయత్నం, ఊదా చీరె, ఎండమావులు, కత్తిరింపు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవెంపటి నాగభూషణం
కాళ్లచప్పుడు
సంగ్రహ నమూనా రచనఅప్పుడప్పుడు వినబడేది కాళ్లచప్పుడు. పగ లేమీ వినబడేదికాదు. రాత్రిళ్లే చప్పుడవుతూండేది. ఎవరో గబగబా బంగాళాతోటలోంచి నడిచివచ్చి మెట్టెక్కుతున్నట్టుగా, ఆదుర్దాతో తలుపు తెరిచి చూచేది, ఆ అమ్మాయి. కాని ఎన్ని మారులుచూచినా మోసమే. ఎవ్వరూ కనబడేవారు గాదు. ‘‘చిత్రంగా వుందే’’అని వూర్కునేది.

వెంపటి నాగభూషణం
కాళ్లచప్పుడు

అప్పుడప్పుడు వినబడేది కాళ్లచప్పుడు. పగ లేమీ వినబడేదికాదు. రాత్రిళ్లే చప్పుడవుతూండేది. ఎవరో గబగబా బంగాళాతోటలోంచి నడిచివచ్చి మెట్టెక్కుతున్నట్టుగా, ఆదుర్దాతో తలుపు తెరిచి చూచేది, ఆ అమ్మాయి. కాని ఎన్ని మారులుచూచినా మోసమే. ఎవ్వరూ కనబడేవారు గాదు. ‘‘చిత్రంగా వుందే’’అని వూర్కునేది.
ఎంత ధైర్యంగా వున్నా పగటిపూట ఆవిషయం తల్చుకుంటే, గుండె తల్లడిల్లేది. బంగళాకంతకు తను, ఒక ముసలమ్మ తప్ప ఎవ్వరూ లేరు. ముసలమ్మకు తన ధోరణేమో, తనేమో తప్ప యితరవిషయాలు అర్థంకావు; వాటినిగూర్చి విచారించదుగూడాను. అందుచేత ఆ అమ్మాయి వొంటరిగానే ఉన్నట్టు భావించేది. అందులో పగలంతా ఎట్లాగో అట్లా కాలయాపనవుతుంది. కాని రాత్రి వొంటరిగా పడుకుంటే ఎన్నోఆలోచనలు తోస్తాయి. ఎన్నో విషయాలు జ్ఞప్తికి వస్తాయి. ఎన్నోభావాలు పొడచూపుతై. అవి అట్లావుండగా, అప్పుడప్పుడు కాళ్లచప్పుడు చూచేసరికి ఎవ్వరూ ఉండరు. ఇక ఆ అమ్మాయి అపరిమితమైన భయం చెందేదంటే అసంభవమేమీ లేదు.
కాని కొన్నాళ్ల కది అలవాటైపోయింది కాళ్లచప్పుడు. ఆ అమ్మాయికి రాత్రిపూటలందు కలిగే అనుభవాలలో అదొకటైంది. అయినా కొన్నాళ్లదాకా అర్థం చేసుకోలేదు. చివరకు గ్రహించింది తన వొంటరి తనాన్ని పారద్రోలి, కాపలాయుండేటందుకు అతను రాత్రులందు ఆయాప్రాంతాల తారుమారాడుతున్నాడు కాబోలని. బ్రతికున్నపుడు అతనామెను ఎంతగానో ప్రేమించేవాడు. ఎంతగానో ఆదరించేవాడు. పంచప్రాణాలు ఆమెమీద ఆధారంచేసుకుని జీవించాడు. ఆ అమ్మాయిని తన హృదయరాజ్ఞిగ గౌరవించేవాడు. అట్లా చేసేవాడంటే ఆశ్చర్యం మేమీ లేదు; అతనొక కవి; ఆనందవాటికలో స్వైరవిహారంచేస్తూ రమ్యగీతిక లాలపించేకవి. అందుచేత అత నా అమ్మాయిని మల్లెపువ్వల్లే చూచుకొనేవాడంటే, అదతని స్వలాభానికే అయివుంటుంది. ఆ అమ్మాయి నొక మంచి గంధపు మంజూషగా భావించేవాడు. ఆమెను చూచి ఉత్సాహంపొందేవాడు.
ఆవిధంగా ఆఅమ్మాయి అతని భావోత్కర్షానికి మూలకారణమైనదంటే, ఆవిడదికూడా కొంతప్రయత్నం వున్నదన్నమాటే. అతని వుద్దేశ్యం గమనించి, అతనికి వ్యుత్పన్నురాలుగా వుండాలని ప్రయత్నించేది. ఏవిధంగా సంచరిస్తే అతని మనోవీధిలో భావవీచికలు వీచేవో ఆ విధంగానే సంచరించేది ఆపిల్ల.
అట్లా ఒకరిలో ఒకరు విలీనమైపోయి రాయంచలల్లె జీవితపథల్లో విహారంచేసేవారు. స్వచ్ఛమైనప్రేమవారిది; నిర్మలమైన వాత్సల్యం వారిది;
అనుకోనిదే తటస్థించింది ఆపద. కల్లోనైనా వారనుకోలేదు అట్లా జరుగుతుందని. తెలిసివుంటే ఏంచేసేవారో మన మూహించలేం. కాని పర్యవసానమేమీటంటే అతను ఆకస్మికంగా చనిపోయాడు. అంతటి కవి, అంతటి ప్రియుడు, మరణించాడు. అతను, ఆఅమ్మాయి కలిసి సంతోషింతో నిర్మించే ఆనందమాల పూర్తిగాకమునుపే పెరిగిపోయింది.
తనలో ఒకభాగం విడిపోయినట్లుగా విలపించింది. అంతా శూన్యంగా కన్పించింది. ఆఅమ్మాయికి. భావి జీవితమంతా పెద్ద వారాన్నిధిరూపం దాల్చి ఆమెముందు కన్పించింది.
ఇక ఆఅమ్మాయికి మరోలోకం లేదు; మరో ఆసక్తిలేదు; మరోధోరణిలేదు; అంతాగతించిన ప్రియుని స్మరణలో సమసిపోయింది. ఎప్పుడూ అతన్ని గూర్చి విచారంచేది; కళ్లు చిల్లిపడ్డాయేమో యన్నట్లుగా ఏడ్చేది; విధిని నిందించేది; దేవుణ్ణి దూరేది. ఒకప్పుడు తనంతటి అదృష్టవంతురాలు, సౌఖ్యవంతురాలు లేదని ఆనందించింది. ఇప్పుడంతా మాయమైపోయింది. ఒక్కతే జీవితం గడపాలిసివచ్చింది. అది ఆమెకు భయం.
అదీగాకుండా, అంత పెద్దబంగళాకు ఆమె ఒక్కతే, ఊరికి, దూరంగావుండి, శాంతవాతావరణ ముంటేనే గాని కవితాధోరణి రాదనే నమ్మికతో అతను ఊరికి బయట అందమైన బంగాళా కట్టించాడు. దాన్ని అందంగా అలంకరించాడు. అందులో తను, ఆఅమ్మాయి అందంగా కాలం గడిపేవారు. అందులోనే యిప్పుడా అమ్మాయి వొంటరిగా వుండవలసివచ్చేసరికి కష్టమైంది. కొంత ధైర్యం తెచ్చుకుని ఉంటూంటే అప్పుడప్పుడు రాత్రిసమయాల్లో కాళ్ల చప్పుడు వినబడేది. తనప్రియుడు తనని చూడ్డానికో, తనకు తోడుండడానికో వస్తున్నాడని సమన్వయంచేసుకొని ఆ చప్పుడికి అలవాటుపడ్డది ఆ అమ్మాయి.
ఇదంతా యింట్లోవుండే ముసలమ్మకు లేశమైనా తెలియదు.
కాలం జరిగిపోయింది. ఉషస్సులు, ఉగాదులు తరలిపోయినై, బంగాళాలోని చెట్లు యథాప్రకారంగానే చిగురుస్తున్నై. మామూలుగానే సూర్యుడు తన బంగారుకాంతితో బంగాళాని ముంచి వేస్తున్నాడు.
అంతకంతకు అతన్ని గూర్చే తలపోయడమే తగ్గించింది. ఇంకా కొన్ని నెలలు జరిగినతర్వాత స్మరించడమే మానేసింది. తన మామూలుధోరణిప్రకారం సంగీతం, సాహిత్యం కృషిజేసేది. రాత్రి అడుగులచప్పుడు వినిపించేదికాదు. ఆ అమ్మాయిదృష్టిలో అది అంతరించింది. అతనే అంతరించినప్పుడు, యిక అదా మిగిలేది?
కేవలం చిన్నపిల్ల ఆ అమ్మాయి. పద్ధెనిమిదేండ్లు నిండాలేవు. దురదృష్టంవల్ల జీవనభారం విరుచుకు మీద బడ్డదిగాని లేకపోతో ఆనందవ్రేంఖలో ఊగుతుండవలసిన పిల్ల.
ఆనాడు లోపలంతా ఉక్కావుండడంచేత కాస్త చల్లగాలి పోసుకుందామని బంగాళా ముందుతోటలో పచారుచేస్తోంది. వెన్నెలకెరటాలు తోటనంతా ముంచి వేస్తున్నై. నడుస్తూ ఆమె చంద్రకాంతపువ్వులు చెండు గ్రుచ్చుతోంది…. తటాలున తల పైకెత్తి చూచింది… గేటు తెరచినట్టుగా శబ్దమైంది. నిదానించి చూచింది…
‘‘…. వున్నాడా?’’ అన్నాడు ఆ వచ్చినతను.
ఆ అమ్మాయి తెల్లబోయింది.
‘‘…..వున్నాడా?’’ అన్నాడతను మళ్లీ…. తెల్లనిసూట్ వేసుకున్నాడు. చేతులో చిన్నపోర్టుమాంటోవుంది. నడుస్తూ బంగాళా వరాండామెట్లు సమీపించాడు.
‘‘కూర్చోండి’’…. అని ఆ అమ్మాయి కొంచెం వెనక్కి వెళ్లింది.
పోర్టుమాంటో ప్రక్కనపెట్టి, సోఫాలో కూర్చుని సిగరెట్ ముట్టిస్తూ ‘‘క్షమించండి’’ అన్నాడు.
‘‘పరవాలేదు. ఎక్కడినుంచి రావడం? ఎందుకు ….?’’
‘‘నేను, అతను చిన్నప్పటినుంచి స్నేహితులం. నేను అతనిపెళ్లిక్కూడా వచ్చాను, మీకు జ్ఞాపకంలేదూ? అప్పుడే చూచా మిమ్మల్ని. మళ్లీ చూడలేదు. అతను మాత్రం ఏడాదిక్రింద కాంగ్రెస్లో కనబడ్డాడు. ఇప్పడీవూరు పనుండీవచ్చి, యితనుండగా మరొకచోటబసచేయడమెందుకని సరాసరి యిక్కడికే వచ్చాను… ఏంజేస్తున్నాడు. బయటికి వెళ్లాడా?’’ అన్నాడు ఒక్కగుక్కలో.
ఆ అమ్మాయి చలించింది. పూర్వమంతా ఒక్కమారు తళుక్కుమని మెరసింది, ఆమె హృద్వీధిలో. ఏమీచెప్పలేక నిలబడిపోయింది. ఇంతలో నిప్పుపుల్లగీసి రిస్టువాచివంక చూచాడు అతను. ఆ కాంతిలో అతని ముకం తళతళ్లాడింది. కళ్లకు పాన్సునేజోడు వుంది. పాతికేళ్లుండవచ్చు నతనికి.
‘‘లోపలికి వెళ్లి విశ్రమించవచ్చు. ప్రయాణం బడలిక….’’ అన్నది.
‘‘అత నేడీ, యిప్పడు వస్తాడా?’’
‘’అదిగో అల్లా వెళ్లవచ్చు. ఆగదిలోకి పదండి…’’
అతనికేమీ అర్థమైందికాదు. అతనిమాట ఎన్నిమారులు అడిగినా తటస్థంగా వుండి మాట మార్చివేస్తోంది. ఆమె అతనిభార్యని అతనికి గుర్తుంది. సరేననుకొని యింట్లోకి ప్రవేశించాడు. హాల్లో పెద్ద లామింగ్టనులైటు వెలుగుతోంది. కుర్చీలు, సోఫాలు, బల్లలు అన్ని పూలతో నిండివున్నాయి. ఆహాలు దాటి లోపలిహాల్లో ప్రవేశించి కుడివైపునున్న గది జేరాడు. లోపల వాషింగ్టనులాంపు ఉన్నది. గదిఅంతా సువాసనమయం. ఒకప్రక్కను దోమతెర దిగవేసిన పందిరిమంచం ఉన్నది. మధ్య చిన్న టీపాయ్ మీద రాధాకృష్ణులు రాతివిగ్రహం ఉన్నది.
సూటువిప్పి, పైజామస్ తొడుక్కున్నాడు మిత్రుడు. ఎదురుగావున్న అద్దంలో చూసుకుంటూండగా ఆ అమ్మాయి ప్రవేశించింది. తెల్లని సిల్కు చీర కట్టుకుంది. బోడిస్ తొడుక్కుంది. సంచీజడవేసి చివర రిబ్బనుతో కట్టేసింది. మెళ్లో ఒక్కలాంగ్ చైన్ మాత్రం వున్నది. దీపంకాంతిలో ఆమెముఖం మెరసింది. మిత్రుడు వెనక్కు తిరిగి చూచాడు. పూర్వం ఆమెను పెండ్లికిచూచినదానికీ యిప్పటికీ చాలా వ్యత్యాసం వున్నది. నిలువెల్ల చూచాడు.
ఇంతలో ముసలమ్మ ‘టీ’ ట్రే తెచ్చి అక్కడ బల్లమీదపెట్టి వెళ్లిపోయింది. రెండుకుర్చీలు దగ్గరగా లాగింది ఆ అమ్మాయి. ఒకదాంట్లో తను కూర్చుంది. రెండో దాంట్లో అతన్ని కూర్చోమన్నది. అతను కూర్చున్నాడు.
‘‘పుచ్చుకోండి’’ అని అన్నది చిరునవ్వుతో
‘‘అతనేడీ?’’
‘‘పుచ్చుకోండి, చల్లారిపోతుంది’’
‘‘అతను….?’’
‘‘వస్తారు, కానీండి’’
ఇద్దరూ టీ పూర్తిచేశారు, ఒకరివంక ఒకరు చూచుకుంటూ.
‘‘మిమ్మల్ని చూసి రెండేండ్లయింది…’’ అన్నాడు మెల్లగా.
ఆమె సిగ్గుపడ్డది. బుగ్గలు ఎర్రబారినై. ‘‘కావచ్చు’’ అన్నది కోమలంగా.
‘‘అప్పు డింత అందం….’’
‘‘అయితే మీరు ఏమి చేస్తూంటారు?’’
‘‘మొన్ననే ప్రాక్టిసు పెట్టాను, మెడ్రాసులో‘‘
‘‘మెడ్రాసులోనా?’’
‘‘అవును. బీచి అది హాయిగా వుంటుంది.’’
‘‘అవును, నిజమే. ఎవరోరుంటున్నారు, అక్కడ?’’
‘‘ప్రస్తుతం నేను, వంటవాడు, పెండ్లిఅయేదాకా’’ అన్నాడు చిరునవ్వుతో.
ఆమె నవ్వింది.
ముసలమ్మ వచ్చి భోజనానికి రమ్మంది. ఇద్దరూ లేచివెళ్లారు.
భోజనంచేస్తూ ‘‘అతనేడీ?’’అన్నాడు.
‘‘వస్తారులెండి, కానీండి’’ అన్నది ఆ అమ్మాయి.
రాత్రి గడిచిపోయింది. తెల్లవారు కాఫీ త్రాగుతూ ‘‘అతనేడీ?’’అన్నాడు.
‘‘వస్తారు, కానీండి’’ అన్నది మామూలుగా
అతిథిమిత్రుడు వచ్చి నాలుగురోజులైంది. ‘‘అతనేడీ’’ అని అడుగుతూనే ఉన్నాడు. ‘‘వస్తారు లెండీ’’ అని ప్రత్యుత్తరమిస్తూనే ఉన్నది.
‘‘చాలా వింతగా ఉన్నదే’’ అనుకునేవాడతడు.
ఆమె అట్లాగే అనుకునేది
సాయంకాలం ‘టీ’ త్రాగి యిద్దరూ గదిలోనే కూర్చున్నారు. వరాండాలోనికి తెరుచుకున్న ద్వారానికి లేసుతెర వ్రేలాడుతోంది. బయట అంతచీకటిగా లేకపోయినా, లోపల చాలాచీకటిగా వున్నది. అయినా, దీపం మాట వారిద్దరిలో ఒక్కరూ అనుకోలేదు. ఏదో ఆలోచనలో బడ్డారు. తటాలున అన్నది ఆ అమ్మాయి. ‘‘మరి, మరి, మీకు వొంటరిగావుండడం కష్టంగాలేదూ, మెడ్రాసులో?’’
అట్లా అడుగుతుందని అతడనుకోలేదు. ఏమిచెప్పడానికీ తోచిందికాదు; అయినా చెప్పకతప్పదు.
‘‘నిజమే. ఉంటుంది. ఆ అనుభవం ప్రస్తుతం మీకుకూడా వున్నట్టుందే?’’అన్నాడు సమాధానంగా.
‘‘అయితేయిద్దరం కలిసి వొంటరితనాన్ని…’’
గభాలున గదిలో ప్రవేశించి గాలికెరటం ఆ మాటల్ని చెదరివేసింది.
‘‘ఏమిటి, అంటారు?’’అన్నాడు.
‘‘ఇద్దరు కలిసి… చప్పుడు, చప్పుడు… వచ్చాడు, వచ్చాడు.’’…. అని అవ్యక్తంగా కేకలేస్తూ భయంతో అతన్ని గట్టిగాపట్టుకుంది.
అతని కేమీ తోచిందికాదు. శరణార్థియైన ఆ అమ్మాయిని అతను కౌగిట్లో గట్టిగా దాచిపెట్టి ‘‘భయంలేదు. ఏదోచప్పుడు. ఏమీలేదు’’ అన్నాడు.
‘‘కాళ్ల చప్పుడు, కాళ్ల చప్పుడు వచ్చాడు, వచ్చాడు.’’ అన్నది రుద్ధస్వరముతో.
అతను నాలుగువైపులా చూచాడు. నాలుగు మూలలా పరికించాడు. ఎవ్వరూ లేరు. కాళ్లూలేవు; చప్పుడూ లేదు.
‘‘ఎవ్వరూ లేరు. వీధిలో పొయ్యేవాళ్ల కాళ్ల చప్పుడు, బహుశః. భయం లేదు.’’ అంటూ ఆమెభుజాన్ని నిమిరాడు.
ఆమె తల అతని వక్షస్థలంమీద ఆనుకుంది. చేత్తో కళ్లుమూసుకున్నది.
ఇంతలో ముసలమ్మ లైటు తెచ్చి అక్కడ పెట్టి వెళ్లిపోయింది. వీళ్లని గమనించనేలేదు.
లైటు వెల్తురు చూచి ఆ అమ్మాయి గభాలున అతని కౌగిట్లోంచి లేచి పెడముఖం పెట్టి నిలబడ్డది. వెండ్రుకలన్నీ చెదరినై. చీర నలిగింది.
‘‘ఎవ్వరూ లేరు. చూడు’’ అంటూ అత నామె చెయ్యి పట్టుకుని వరాండాలోకి పోయి చూచాడు. ఎవ్వరూ లేరు. ఆమె కళ్లల్లో బెదురింకా తగ్గలేదు.
ఆ అమ్మాయి వరాండా పిట్టగోడ నానుకుని నిల్చున్నది. అతనామెప్రక్కగా నిలబడ్డాడు. మెట్లదగ్గరున్న ద్రాక్షపందిరిలోనుంచి వెన్నెల వారిమీద పడుతోంది.
‘‘ఎందు కంతభయం… ఎవరు వచ్చారని?’’
‘‘అతను, అతను….’’ అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకుంది. తిరిగి బెదిరిపోతుందేమోనని అతడామెను రెండుచేతుల్తో పట్టుకున్నాడు. ఆ అమ్మాయిగూడా తన రెండుచేతుల్తో అతన్ని పెనవైచింది. మరి అయిదునిమిషాలవరకు అదే ఫోజు.
ఆ అమ్మాయికి యిక కాళ్ల చప్పుడూ వినబడలేదు.

———–

You may also like...