పేరు (ఆంగ్లం) | V.D.Prasadrao |
పేరు (తెలుగు) | వి డి ప్రసాదరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అనపోతు, కొత్త నీరొచ్చి, జై జవాన్, బికారి, మధ్యరకం, రత్నమాణిక్యాలు, విలయము, వెయిటర్ సర్వర్, సులోచన |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | ఉత్తమ నవల, కథ, నాటక రచయిత |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వి.డి. ప్రసాదరావు మధ్యరకం |
సంగ్రహ నమూనా రచన | చెరువుగట్టంబడే చుట్టూ తిరిగి మళ్ళీ ఇంటికే పోదామనుకుంటున్నాడు. పొద్దు పూర్తిగా వాలలేదు. ఆ పల్లెటూళ్లో వాళ్ళింటికెళ్ళినా, ఏమీ తోచేటట్టు లేదు. అక్కయ్యమాట తీసేయలేకా, సెలవులకు అమ్మా నాన్నా దగ్గిరే కాకుండా ఎక్కడికన్నా వెళ్లాలన్న ఉబలాటంవల్లా ఆ పల్లెటూరు వచ్చాడు. పొద్దున్నే బావ ఊళ్లోకి పోయాడు. అక్కయ్యతో కాసేపు మాట్లాడాడుగాని, ఎంతసేపటికీ పొద్దుపోయినట్టే కనబడలేదు. వీథి అరుగుమీద చాప లేదు. |
వి.డి. ప్రసాదరావు
మధ్యరకం
చెరువుగట్టంబడే చుట్టూ తిరిగి మళ్ళీ ఇంటికే పోదామనుకుంటున్నాడు. పొద్దు పూర్తిగా వాలలేదు. ఆ పల్లెటూళ్లో వాళ్ళింటికెళ్ళినా, ఏమీ తోచేటట్టు లేదు. అక్కయ్యమాట తీసేయలేకా, సెలవులకు అమ్మా నాన్నా దగ్గిరే కాకుండా ఎక్కడికన్నా వెళ్లాలన్న ఉబలాటంవల్లా ఆ పల్లెటూరు వచ్చాడు. పొద్దున్నే బావ ఊళ్లోకి పోయాడు. అక్కయ్యతో కాసేపు మాట్లాడాడుగాని, ఎంతసేపటికీ పొద్దుపోయినట్టే కనబడలేదు. వీథి అరుగుమీద చాప లేదు. అలికి ముగ్గులెట్టి శుభ్రంగా ఉనాన తెచ్చుకొన్న రెండు తెల్లలాగూలూ మాసిపోతాయేమోనని కూలబడలేక ఒక చింకిరిచదర వేసుకొని కాసేపు కూర్చొన్నాడు. నేలమీదకంటే చదరమీదే ఎక్కువ మట్టి ఉంది. గేదెలను తోలుకొంటూ బుడ్డపంచె కట్టుకొని, కాపుకుఱ్ఱాడు చుట్టముక్క పీల్చుకుంటూ కఱ్ఱబుజాన్ని అడ్డంగా రెండు చేతుల వెనక్కు పెట్టుకొని, చుట్ట నోట్లోంచి తియ్యకుండా, వింతమృగాన్ని చూస్తున్నట్టు చూసి, ‘‘ఏ ఊరూ?’’ అని ప్రశ్న పారేశాడు. కాపు కుఱ్ఱాడి తల సగంపొయ్యి కొట్టించినట్లుండి వెనకపిలక గాలికి ఎగురుతూంది. ఆ కుఱ్ఱాడితో మాట్లాడడానికి కూడా నిస్సాకారంతోచి, ఆ కుఱ్ఱాడి నిర్లక్ష్యానికి తన నిరసన మౌనంతో జవాబిచ్చుకొని తృప్తిపడ్డాను.
‘‘ఉలకడేం’’ అని వెగటునవ్వు నవ్వి గేదెలకుఱ్ఱాడు ముందుకు సాగిపోయాడు.
ఆ తర్వాత ఇంకేకుఱ్ఱాళ్ళనీ పలకరించలేక సాయంత్రందాకా ఇంటిపట్టున గోళ్ళుగిల్లుకుంటూ కూర్చుని, సాయంత్రం చెరువుగట్టుకే బయలుదేరాడు. ఒక్కరోజుకే విసుగెత్తుతూంది. అక్కడక్కడ తన యీడు కుఱ్ఱాళ్ళు కనబడ్డా, చొక్కాలేని రకాలేతప్ప తను మాట్లాడించతగ్గ అర్హత ఉన్నవాడొకడూ కనబడలేదు.
‘‘ఒహోయ్’’
ఇందాకా పలకరించిన కుఱ్ఱాడూ, మరి నలుగురు తన ఈడు వాళ్ళూ పంటబోదె కావతల కూర్చుని పులిజూదం ఆడుకొంటున్నారు. బోదెకాలవ అంత పెద్దది కాకపోయినా నడుందాకా దిగబడే నీళ్లూ బురదా ఉన్నాయి. ఒక్కటే తాటిపట్ట ఒకచోట ఇటు నుంచి అటుకు ఉందిగాని, బురద జారుడుగానే ఉన్నట్లుంది.
అటూ ఇటూ పోటానికి తోచక అక్కడే వాళ్ళను చూస్తూ నిలబడ్డాడు.
‘‘నులుసుండా యేం, తాటిపట్టమీం చిటు రా.’’
‘‘కాలు జార్తాడేస్’’ అంటూ ఇంకొకడు వెటకారంగా అందర్నీ నవ్వించాడు.
పైకి పౌరుషంగా, లోపల వణుకుతూనే తాటిపట్టమీద బయలుదేరాడు. చివరికొచ్చాక కాలు జారింది. బిగిసిన బురదలో జారేలోపల కకుఱ్ఱాడు ముందుకొచ్చి చెయ్యి ఆసరాయిచ్చి సులువుగా గట్టుకు లాగాడు.
‘‘ఏఊరంటే ఇందాకా పలికావుకా వేం’’ అన్నాడు మొదటి కుఱ్ఱాడు.
పదిఏళ్ళ యీడున ఉన్న నల్గురు సాటికుఱ్ఱాళ్లతోనూ, ఎంత విభేదమనిపించినా, ఎంత తనకు తక్కువనిపించినా, మాట్లాడకుండా కలవకుండా, ఎంతసేపు బిగబట్టుకు కూర్చోటం సాధ్యంకాదు.
‘‘బస్తీనుంచా ఏం సదూతుండావ్?’’
‘‘ఫిఫ్తస్టాండర్డు’’
‘‘అంటే’’
ఈ అజ్ఞానులముందర మళ్ళీ గర్వం సంతోషంగా తలచూపింది. ఒక ఏడాది ఎక్కువేసి ఆరోక్లాసన్నాడు.
తనకు చెయ్యందించిన కుఱ్ఱాడు జునపాలజుట్టూ, నవ్వుమొగంతో ‘‘నన్నూ పైయేడు ఫస్టుఫారంలో ఏయిత్తా నన్నాడు తమ్మన్నగారు మానాన్నతో. ఇనసేపటరు ఒచ్చినప్పుడు కోతల్లో ఉంటే మా నాన్నను పిలిసి ఆయేల నన్ను బడికంపబమన్నాడు. పైయేడు బస్తీలో ఫస్టుఫారంలో చేర్పిస్తానంటే నాన్న కాశపుట్టింది. బస్తీ పంపిస్తానన్నాడు.’’
తక్కినవాళ్ళకంటే ఆకుఱ్ఱాడు కొంచెం దగ్గిరనిపించాడు.
‘‘తమ్మన్నగారు మాబావే. ఆయనకు బడిఉందా?’’
‘‘నీకే తెల్దూ ఎల్లా తెలుత్తుంది లే, ఏడాదికి మొత్తంరోజులన్నీ కలిపి ఓ నెల మమ్మల్ని బడికి తోలుకెళ్తాడు. ఇనస్పేటరు వచ్చినపుడు హంగామా సేత్తాడు. అందరం పేసేగా’’
‘‘రంగా మనమినిపెంటు చదివి అప్పుడే అయిదేళ్ళయిందిగాదురా’’
జునపాలకుఱ్ఱాడు నవ్వి ‘‘ఆ’’ అన్నాడు.
కబుర్లోంచి తిండిమీదికి ఏవబడ్డది. ‘‘ఒరేయ్, తోపులో మామిడి కాయలు కోసుకొందారి పదండ్రా. నాగయ్యా, సాంబారు కారం తెచ్చావా?’’
వాళ్ళంతా చెట్లెక్కుతోంటే చేతకాక క్రిందే నిలబడిపోయాడు.
కాయలు తింటంలోగూడా వాళ్ళకు లచ్చయిపోయాడు. కారం నోరుమండింది గుడ్లు ఎఱ్ఱబడేస్తూంది. ఊరికే తింటానికి పళ్ళు పులిసిపోతున్నాయి. వాళ్ళు రెండువిధాలా సునాయాసంగా తినేయగల్గుతున్నారు.
రంగడు ఇతని కవళిక కనిపెట్టి, ‘‘నోరు మండుతూందా?’’ అన్నాడు.
‘‘చెరువులో నీళ్ళు లేనట్టున్నాయే?’’ అని బిక్కమొగంతో అడిగాడు.
‘‘ఇయితిని నీళ్ళు తాగకూడదు. అప్పన్నా, కత్తితెచ్చావురా, రెండు గెలలు కోద్దాం.’’
రంగడు తాటి చెట్టెక్కి ముంజెలు కోసి ఇస్తున్నాడు.
పిలకకుఱ్ఱాడు ఎగతాళిగా ‘‘ఆతల సెట్టెక్కుతావా? సిన్నదేగా‘‘ అన్నాడు.
ఉడుకుమోతుతనంతో మాటరాలేదు.
ముంజెకాయ తన ఒకకన్ను తినేలోపల వాల్ళు రెండు రెండు కాయలు లాగేస్తున్నారు.
నీళ్ళు నోట్లోకిరాకుండా పెదవులనిండా అంటుకొంటూ బుగ్గలనిండా జిగురు అంటుతూంది.
‘‘అల్లా కాదు తినేది’’ అని చిరునవ్వుతో రంగడు బొటనవేలూ, నోరూకలిపి ముంజెలు తింటానికి ఉపయోగించాల్సిన వీలు నేర్పాడు. రెండుమూడు కాయలుమించి తనలేకపోయాడు.
బావ ఇంకెవరితోనో ఆదోవనే ఇంటికి వస్తున్నాడు.
పిల్లలలో గౌరవం రాకపోయినా, బావతో వస్తూన్న పెద్ద ఆసామీలు తమ్మన్నగారి బావమరిదిని, బస్తీకుఱ్ఱాడిని మన్ననగా చూచి, తమ పిల్లలకు ‘‘వాణ్నిచూసి బుద్ది తెచ్చుకోండిరా’’ అంటంలో తన మనస్సుకు మళ్ళీ కొంచెం స్థాయిచిక్కి తన ప్రతిష్ట తనకు నిల్చినట్లుంది.
స్కూళ్ళు తెరిచారు. క్లాసులో చివరి బెంచీలో కీకిరిబాకిరిగా ఉన్న జునపాలు ముడిగా పేర్చుకొని, కాలిని తెల్లకంటె, ముతకలాగూ చొక్కాలు, చెవిపోగులతో రంగడు కూర్చుని ఉన్నాడు. ‘‘సత్యం’’ అని ముందుబెంచీలో ఉన్న తనను కేకవేశాడు.
స్కూలు తెరిచి మొదటిగంటకూ మూడోగంటకూమధ్య సమయం. క్లాసంతా గింగిరిలెత్తుతూ అల్లరిగా ఉంది. తనపక్క ఉన్న కుఱ్ఱాళ్ళు పల్లెటూరి రంగణ్ణి వెటకారం మొదలుపెట్టారు. వెనక బెంచీలదాకా ఒకటే అల్లరి పాకింది. తను రంగణ్ణి రిగున్నట్టు చిరునవ్వు నవ్వటానికి కూడా గుండె చాలలేదు.
రంగడు మొగం ముడుచుకొని కుంచుకుపోయాడు. ఆనాడు పల్లెటూళ్లో ఈ కుఱ్ఱాడికి లొచ్చయానన్న ఉక్రోషం ఏమైనా మిగిలి ఉండి ప్రేరేపించేదేమో తెలియకుండానో, తక్కని కుఱ్ఱాళ్ళు అల్లరి చేస్తూంటే, ఎదురు నడవటానికి దైర్యం చాలకనో తనూ వాళ్ళతో పాటే అయాడు.
మూడోగంటతో రంగడికి కొద్ది పీడ తగ్గింది కాని, ఆ బస్తీ మాస్టరుకూడా తన తెలివితేటలన్నీ రంగడిమీదే ఒలకపోసుకొని కుఱ్ఱాళ్ళ అభిమానం సంపాదించుకొన్నాడు.
ఆనాడు పల్లెటికుఱ్ఱాళ్ళందరిలోకి తనయందు సుహృద్భావం చూపించింది రంగడేనని మనస్సు కెలకేసింది. సాయంత్రం రంగణ్ణి ఒంటరిగా పలకరించాడు. రంగడిని తను ముందు చూడలేదనే, అల్లరి చేసినవాళ్ళల్లో తను లేననే అబద్ధపు సాకులు చెప్పుకొన్నాడు. రంగడికి నదిలో మునుగుతుంటే గడ్డిపరక అందినట్టయి, ఇందాకా ఆగడ్డి పరకకూడా తన్ను తోసేసిందన్నమాట మరిచిపోయి, పసిగుండెలో కలస్నేహవాంఛతో నిర్మలినంగా పొత్తుకలుపుకొన్నాడు. ఆకుఱ్ఱాళ్ళమధ్య ఎల్లాఎల్లా ఉండాలో అన్నీ రంగడికి బోధచేశాడు. కాని ఆ బోధలకంటే కూడా రంగడిలోనే ఉన్న సహజబలారే రాను రాను తక్కినవాళ్ళు అతనిచుట్టూ చేరేటట్టే చేస్తూవచ్చాయి. ఈ స్కూలుఆటల్లో మొదట్లో కొత్తదనం వల్ల రూల్సు తెలియని రంగడి ఆట ఎబ్బెట్టుగావుండేది. కాని చలాకీతనం బైటపడి, ఆటల రూల్సు సర్వసాధారణంగా అలవాటుపడేటప్పటికి రంగడే తనకంటే నయమనిపించుకొని అల్లరిచేసిన కుఱ్ఱాళ్ళే అభినందనం చేసేస్థితికి వచ్చాడు.
తనలోమాత్రం మొదటినుంచీ ఉన్న సామాన్యత్వమే మిగిలిపోయింది.
ఎవళ్ళైనా మంచి దుస్తులు, కాస్త శుభ్రంగా దువ్విన తలా, ఫాషన్లమీద మోజూ చూపిచ్చేటప్పటికి తనూ తనతోపాటు కుఱ్ఱాళ్ళూ వాడిని కాకిగోల చేసి వదిలిపెట్టేవాళ్ళు. తన ఊళ్ళోనే చిన్నప్పటినుంచి తనతో చదువుకుంటూవస్తూన్న కుఱ్ఱాళ్ళందరిదీ ఆ తత్వమే. ఈ పల్లెటూళ్ళనుంచి వచ్చిన కుఱ్ఱాళ్ళే ఆ మాట్లమోజులు చూపించేవాళ్ళు. రంగడుకూడా అల్లాగే అయి మళ్ళీ తమలో అల్లరి పడేటప్పటికి, తన మనస్సకు మళ్ళీ కొంత ఆత్మవిశ్వాసం చిక్కింది. కాని దొంగచాటుగా వాళ్ళల్లో ప్రతివాడూ, తనకూ ఆ దుస్తులుంటే బాగుండునని కోరుకుంటూన్నట్లే ఉండేది.
పట్టభద్రత్వము తప్ప మరేజీవిత భద్రత్వమూ ప్రసాదింపలేని బస్తీ వదిలి మహాపట్టణానికి పొట్ట చేత్తో పుచ్చుకొని వచ్చాడు. రైలు దిగినప్పటినుంచీ, కూలీలదగ్గరనుంచీ, తన పల్లెటూళ్ళ వాళ్లంటే కూడా చూపించలేనంత నిరసనాన్ని చూపిస్తున్నారు. తన్ను మోసం చేసి, అల్లా చేసినవాళ్ళుకూడా తను మోసపడ్డ అర్భకత్వానికి, చీడపురుగును చూసినట్లు చూస్తున్నారు.
రంగడు కనపడ్డాడు. రంగ డనుకోలేదు. ఆశ్చర్యంతో తెల్లబోయి చూశాడు.
రంగడు ‘‘హల్లో ఎప్పుడు వచ్చావు’’ అన్నాడు.
ఆదరణా, నిరాదరణాకూడా లేవుమాటలో. పల్లెటి రంగడికి, బస్తీ రంగడికి, ఈ రంగడికి పోలికే కనబడటం లేదు. కాని ఆ కాస్త ఆశ్రయం వదులుకోలేక మాటలకు పాకులాడాడు. జనం రద్దీలో రంగడిని తోసుకొంటూ వచ్చిన ఒక సూటువాలా, రంగడికి వెంటనే క్షమాపణ చెప్పుకొని మళ్లీ కదుల్తూ వత్తడిలో తనను తోసేస్తూ క్షమాపణచెప్పాల్సింది పోయి తీవ్రంగాచూస్తూ సాగిపోయాడు. రంగడిది గమనించటమే లేదు.
కాఫీ తాగటానికి రంగడు పిలిచాడు. హోటల్లో ప్రవేశిస్తూంటేనే ‘‘అటు గాదు ఇటు’’ అని రంగడు దోవచెప్పాడు.
తినటంలో, త్రాగాటంలో, నగడవటంలో సన్నసన్నగా రంగడు నిషేధాలూ, అనుసరణీయాలూ, చెప్పాడు. బస్తీలో మొట్టమొదట తనకు శిష్యుడు, ఈనాడు తనకు పట్టణంలో పాఠాలు చెప్పుతున్నాడు. లోపల ఆశిక్తక్రోధము కుమిలిస్తూంది. ఆ పాఠాలు క్షణ క్షణగండాలుగా ఉన్నాయి.
‘‘మళ్ళీ కనపడతా, అన్నట్టు ఎక్కడదిగావు?’’
నీ రూముకు వస్తా నన్నధైర్యం చాలకపోయింది. చివరికి సమయం దాటిపోతోందని కక్కూర్తిగా గతికాడు.
‘‘రేపు ఇంటర్వ్యూకి వెళ్లాలి. అంతవరకూ నీ గదికి వస్తాను.’’
ఇంటర్వ్యూకి తను తెచ్చుకొన్న లాగూ, కోటూ విడివిడిని తొడుక్కుంటే చీదరించుకొని రంగడు తన సూటు తీసియిచ్చాడు. నఖశిఖపర్యంతమూ ఎరుపు తయారయింది. సాయంత్రం ఇంటర్వ్యూ అనగానే బ్రతికి బైటపడి రంగడిని కలుసుకొన్నాడు. సినిమాకు బయలుదేరారు.
స్త్రీ పురుషులు కలిసి కూర్చున్న సీట్లలో సూటంటే అమరింది కాని కూర్చొనేతీరూ స్థాయీ చిక్కలేదు. బి.ఎ. చదివిన ఇంగ్లీషు ఉన్నా, సినిమాలో ఒక్క ముక్క అర్థంకాలేదు. హాస్యదృశ్యం వచ్చినప్పుడు తన నవ్వు ఆ తరగతికంతకూ వెకిలిగా బైటపడ్డది.
మలుపుములుపునా పట్టణం మక్కెలువిరగగొట్టింది. ఒక్క నాటితో పట్ణం పెరుచెప్తే బీభత్సంకొల్పింది. ఆ అదురులో రంగడితో పోల్చుకొనిచూస్తే అతనికీ తనకూ హస్తిమళకాంతరం కనబడ్డది. పల్లెటికుఱ్ఱాడు జీర్ణం చేసుకొన్న పట్టణం తనకు బస్తీలో పుట్టిపెరిగినవాడికి కొరకుడేపక పళ్ళు విరిగేటట్టయింది.
రంగడు పుట్టింది పల్లెఅయినా, తక్కువతరగతిలో పుట్టినా, పల్లెకుండే స్తోమతతో జన్మించాడు. తరగతితర్వాత తరగతిగా మెట్లెక్కే అభ్యాసంలో జన్మించాడు. తను పుట్టిన బస్తీతరగతికి, మెట్టు ఎక్కగల దార్ఢ్యమే లేదు. ఉన్న స్థాయే ఉత్తమమనుకొని క్రిందికి చూసి ఈసడించటం తప్ప పైకిఎక్కడానికి బలంగాని తాహత్గాని కలగలేదు. కొత్త వాతావరణాలను జీర్ణంచేసుకొని వాట్లల్లో జీర్ణమవగల స్వభావమే కనబడలేదు. ఆనాడు పల్లెకీ పనికిరాలేదు, ఈనాడు పట్టణానికీ పనికిరాలేదు.
ఉండలేక ఊరుమొగం పట్టాడు. స్టేషనులో కూలీ మొదట అడిగినకూలీ ధరమార్చి డబ్బిచ్చాక పేచీపెట్టాడు. చివరికి రైలుకదిలాక ‘‘పోడా గోంగూరై’’ అని ఈసడించాడు. వళ్ళంతా కుళ్ళిపోయి నట్లయింది.
ఇంటికి చేరి నిట్టూర్పు విడిచాడు.
పోరుగమ్మతో తన భార్య సగర్వంగా ‘‘మా ఆయన పట్టణం వెళ్ళివచ్చా’’రని చెప్పుకుంటూంది. ఇరుగావిడ ఆశ్చర్యవిభ్రమాలు తన లోపలి దుఃఖానికి బైటసంతోషాన్ని పూతపూశాయి.
———–