పాలగుమ్మి పద్మరాజు (Palagummi Padmaraju)

Share
పేరు (ఆంగ్లం)Palagummi Padmaraju
పేరు (తెలుగు)పాలగుమ్మి పద్మరాజు
కలం పేరుపాలగుమ్మి
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ6/24/1915
మరణం2/17/1983
పుట్టిన ఊరుపశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలములోని తిరుపతిపురం
విద్యార్హతలుM.Sc.
వృత్తిలెక్చరర్
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునవలలు: బతికిన కాలేజి, నల్లరేగడి, రామరాజ్యానికి రహదారి, రెండో అశోకుడి మూన్నాళ్ళ పాలన

కథా సంపుటాలు: గాలివాన, పడవ ప్రయాణం, ఎదురుచూసిన ముహూర్తం

సినిమా మాటలు: బంగారు పాప (1954), భక్త శబరి (1957), భక్త శబరి (1960); * Shanti Nivasam (1960), బికారి రాముడు (1961), బంగారు పంజరం (1965), రంగుల రాట్నం (1966), శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976), సర్దార్ పాపారాయుడు (1980)
ఇతర రచనలుhttp://www.teluguone.com/sahityam/single.php?content_id=632 (గాలివాన)
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుకేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ఇతర వివరాలుప్రముఖ తెలుగు రచయిత, ప్రపంచ కథానికల పోటీలో రెండో బహుమతి పొందిన గాలివాన కథా రచయిత.హేతువాది .ఎం.ఎన్.రాయ్ భావాల ప్రచారకుడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపాలగుమ్మి పద్మరాజు
ఉద్వేగాలు
సంగ్రహ నమూనా రచనఉద్వేగాలు అంటే నాకు చాలా అసహ్యం. ఏమీ కారణం లేకపోయినా ఏడవగలగడం ఒక గొప్పతనమేమోగాని, సంఘమర్యాదకీ, నాగరికతకీ తగినదిమాత్రంకాదు. పెద్దవాళ్లెవరేనా కంటనీరు పెట్టుకొని ఏడిచారంటే నాకు రోత. నాకేగాదు, నాగరికత అంటే తెలిసిన ప్రతివాడికీని. హరిశ్చంద్రనాటకంలో కూర్చుంటేవేషాలు వేసేవాళ్లు సరిగా ఏడవలేకపోయినా, మనకి అటూ ఇటూ కూర్చున్నవాళ్లు ముక్కులు చీదుకుంటూ, గొంతులు సవరించుకొంటూ కళ్లనీళ్ళు తుడుచుకోవటం చూసినప్పుడల్లా ‘అరెరే ఏమిటీ మూఢత్వం?’ అనుకుంటాను.

ఉద్వేగాలు

ఉద్వేగాలు అంటే నాకు చాలా అసహ్యం. ఏమీ కారణం లేకపోయినా ఏడవగలగడం ఒక గొప్పతనమేమోగాని, సంఘమర్యాదకీ, నాగరికతకీ తగినదిమాత్రంకాదు. పెద్దవాళ్లెవరేనా కంటనీరు పెట్టుకొని ఏడిచారంటే నాకు రోత. నాకేగాదు, నాగరికత అంటే తెలిసిన ప్రతివాడికీని. హరిశ్చంద్రనాటకంలో కూర్చుంటేవేషాలు వేసేవాళ్లు సరిగా ఏడవలేకపోయినా, మనకి అటూ ఇటూ కూర్చున్నవాళ్లు ముక్కులు చీదుకుంటూ, గొంతులు సవరించుకొంటూ కళ్లనీళ్ళు తుడుచుకోవటం చూసినప్పుడల్లా ‘అరెరే ఏమిటీ మూఢత్వం?’ అనుకుంటాను. పరామర్శకి వెళ్ళే పెద్దమనుష్యులంతా తేలికగా కళ్ళనీళ్ళు తెప్పించుకుని కష్టమంతా తమదయినట్టుగా నటించగలగడం చాలా కష్టమేమోగాని, అది సభ్యత ఎంతమాత్రం కాదని నా నిశ్చితాభిప్రాయం.
నాకు ముప్ఫయిఏళ్ళ క్రిందట మాట జ్ఞాపకం వస్తోంది. మా చెల్లెల్ని అప్పుడు శేషి అనేవాళ్ళం. దానికి అయిదో ఏడు. నాకు తొమ్మిది. మా అమ్మగారింటి దగ్గర మాకిద్దరికీ బాగా అలవాటు. మా అమ్మ లేకపోయినా ఒకటి రెండు వారాలు మా అమ్మ దగ్గర శేషి ఉంటూఉండేది. మా అమ్మా నాన్నా కాశీరామేశ్వరాలు యాత్రవెడుతూ, ఉండగలమనే ధైర్యం మీద శేషినీ, నన్నూ అమ్మమ్మగారింటి దగ్గర వదిలి వెళ్ళిపోయారు.
అప్పుడు మా శేషి చాలా చలాకీగా ఉండేది. అది అంటే అందరికీ ముద్దు. అంతా దాన్నే ఎత్తుకునేవారు. అంచేత నాకు కొంచెం ఈర్ష్యగా ఉండేది. దానిమీద నాకు అధికారం ఉందని నిరూపించుకోవడానికి అప్పుడప్పుడు కొంచెం కేకలు వేసేవాడిని. దానికి కోపం వస్తే, ‘రాజిగాలి జత్తుందను’ అనేది. నేను కొంతసేపు జవాబు చెపకుండా కూర్చుంటే దగ్గరగా వచ్చి, ‘ఉంతానులే, నన్నెప్పులూ అల్లా అనకేం మరి?’ అని సమాధానపడేది.
దాని మాటలు అందరికీ నవ్వువచ్చేవి. ఒకనాడు గదిలోకి ముందు మా అత్తయ్య వెళ్ళింది. తరువాత మామయ్యవెళ్లాడు. తలుపు దగ్గరగా వేసుకుంటున్నాడు. అప్పుడు మా అమ్మమ్మ పక్కనే పడుకున్న శేషి ముఖం అదోమోస్తరుగాపెట్టి అందిగదా, ‘‘ఛీ అసయ్యమమ్మా ఎవరేనాన గదులో తలుపేసుకు పరుకుంతారేంతి ఛీ’’ అని. మామయ్య వెంటనే తలుపుతెరిచి, పక పక నవ్వి, దాన్ని ఎత్తుకుని గదిలోకి వెళ్ళాడు మా అత్తయ్య దానికో పాట నేర్పింది.
‘అలంకరించుకోవే కోడలా అత్తవారింటికి పోవాలి.’
అసలు పాట ముద్దుగా ఉన్నా లేకపోయినా మా చెల్లి భాషలో అది రూపాంతరం పొంది ఎంతో ముద్దుగా ఉండేది. మేము అమ్మమ్మగారింటిదగ్గర ఉన్నప్పుడు పక్క ఇంట్లో ఒక అమ్మాయికి కార్యమయింది. మేమంతా భోజనానికి వెళ్ళాము. నాలుగోనాడు ఆ అమ్మాయి అత్తవారింటికి వెళ్ళేనాడు మా వాళ్ళంతా చూడ్డానికి వెడుతూంటే నేనూ, శేషీ కూడా వెళ్ళాము. ఆ అమ్మాయి ఒకగదిలో చీర కట్టుకుంటోంది. శేషి ఆడుతూ పాడుతూ అక్కడికి వెళ్ళిపాడింది.
‘అలంకరించుకోవే కోడలా అత్తవారింటికి పోవాలి.’
ఆపాట అర్థం దాని కసలు తెలియదు. కానీ పాపం ఆ అమ్మాయి కళ్ళనీరు పెట్టుకుంది.
ఎవరూ లేకుండా ఆడుకుంటున్నప్పుడల్లా ఈపాటే అది పాడుకుంటూ ఉండేది. గంతులువేస్తూ పువ్వులుకోసుకునేటప్పుడూ, మట్టితో ఇల్లు కట్టుకునేటప్పుడూ అదే పాట.
‘అలంకరించుకోవే కోడలా అత్తవారింటికి పోవాలి.’
కాని చివరికి శేషి అత్తవారింటికిపోయే నాటికి ఈ పాట దానికి జ్ఞాపకం లేదు.
శేషి అమ్మకోసం బెంగపెట్టుకున్నా అభిమానంచేత పైకి చెప్పేది కాదు. ఒక నాడు నేను అన్నాను ‘శేషి అమ్మకోసం బెంగపెట్టుకుందోయి’ అని.
దానికి రోషం వచ్చింది. ‘ఎదవా నువ్వే బెంగత్తుకున్నావు’ అని ఏడుపు మొదలుపెట్టింది. ఆనాడే మొదలు దానికి జ్వరం. అది ఓపిక ఉన్నంతవరకూ తిని, తిరగడం మాత్రం మానలేదు. ఆ రోజు నుంచి అది అట్టే ఎవరితోటీ మాట్లాడేది కాదు.
ఒకనాడది మట్టితో ఇల్లు కడుతూ తనలో తను అనుకుంటోంది, ‘ఇదిఅమ్మకీ, ఇదినాకూ, ఇదినాన్నకీ, ఇది అన్నయ్యకీ, ఛీ ఇది అన్నయ్యకిలేదు. నన్ను బెంగెత్తుకున్నానన్నాడు, నేను బెంగెత్తుకున్నానేంతి?’
దాని కళ్ళలోకి ఏడుపు వచ్చేసింది. వెంటనే ఆ ఇల్లు కాలితో తన్నిపారేసి గొంతుఎత్తి పాడింది. ‘అలంకరించుకోవే కోడలా అత్తవారింటికి పోవాలి.’
కాని ఏడుపాగలేదు. కళ్ళు నులుపుకుంటూ వెనక్కి తరిగితే నేను కనబడ్డాను. మళ్ళీ అభిమానపడి, ‘అలంకరించుకోవే కోడలా…’ శక్తికొలదీ గొంతుఎత్తి పాడింది.
‘అన్నయ్యా మనం మానూరెల్లిపోతాం కదూ?’
‘అమ్మా, నాన్నా వచ్చాకాను,’ అన్నాను నేను.
‘వచ్చేకేలే’ అంది.
మరునాడు అది మంచం మీదనుంచి లేవలేదు. మా అమ్మమ్మ చాలా భయపడింది. నిద్రలో అప్పుడప్పుడు పలవరింతలు. మానాన్నకి తంతి ఇచ్చారు.
రెండురోజులు శేషి కళ్ళు విప్పలేదు. మూడవనాడు మధ్యాహ్నం కొంచెం తెలివి వచ్చి నాలుగు పక్కలా కలియచూసింది. తను అనుకున్నదేదో కనబడనట్టుగా ఊపిరి విడిచి మళ్ళీ పడుకుంది. మా అమ్మమ్మ దగ్గరగావెళ్ళి, ‘ఎల్లా ఉందమ్మా?’ అంది.
‘‘మా ఊరే బాగుంతుంది మీ ఊరు కంతే,’’ అంది శేషి.
‘అమ్మ వస్తుందీ, బెంగ పెట్టుకోకు తల్లీ నీకు ఎంచక్కా ఎన్నో తెస్తాడు నాన్న. అన్నయ్య కొక్కటీ ఇవ్వకేం?
‘మా అమ్మ వచ్చాకాను మా ఊరెల్లిపోతాంగాదూ?’
‘అల్లాగేతల్లీ’
‘అన్నయ్యే బెంగెత్తుకున్నాలు. నేను బెంగెత్తుకోలేదు.’
‘అవునమ్మా నువ్వు బంగారుతల్లివి.
ఇంతలో మా అమ్మ తలుపు తెరుచుకొని ఒక గాలివానలా వచ్చిపడింది. శేషి మా అమ్మ బుజంమీదికి ఒక్క ఎగురు ఎగిరింది. ఇద్దరూ చాలాసేపు మాట్లాడలేకుండా ఏడిచారు.
‘‘నా తల్లి నొక్కత్తిని వదిలి వెళ్లిపోయానమ్మా నా తల్లివి’ అంది మా అమ్మ కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ.
శేషి వెక్కి వెక్కి ఏడుస్తూ ‘అన్నయ్య నన్ను బెంగెత్తుకున్నా వన్నాలు.’ అంది.
‘కొడదాంలే అమ్మా అన్నయ్యని అని సముదాయించింది మా అమ్మ.
నాకు మా అమ్మమీద చాలా కోపం వచ్చింది. మా శేషి ఏడిచిందంటే చిన్న పిల్ల. మా అమ్మ ఎందుకు ఏడవాలి అయినా నేను మాత్రం బెంగెట్టుకోలేదూ.
మా అమ్మ బుజ్జగించినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. మా శేషి మాత్రం ఆనాడే సుఖంగా పాడింది. ‘అలంకరించుకోవే కోడలా అత్తవారింటికి పోవాలి.’
పెళ్ళి అయిన తరవాత మా శేషి శేషు అయింది. బావ అల్లాగే పిలిచేవాడు దాన్ని. దాని అదృష్టం మంచి కుటుంబంలో పడడమే కాదు, మంచి మొగుడుకూడా దొరికాడు.
మాబావ ఆవేళ ఇంగ్లాండు వెడతాడు బారిష్టరు పరీక్షకి, కాని బారిష్టరం అప్పటికి. ఇప్పటికీ మా శేషుకి ఏమిటో తెలియదు. అదేదో ఉద్యోగమనుకునేది.
నేనూ మా బావా గదిలో కూర్చున్నాము. గబుక్కున తలుపు తోసుకుని ‘నల్లవాడే, గొల్ల పిల్లవాడే’ అంటూ పాడుకుంటూ వచ్చింది శేషు. బావగదిలో ఉన్నట్టుగా అది ఎరగదు. అందువల్ల నాలిక కరుచుకుని పాట మానేసింది. మా బావ అన్నాడు.
‘అబ్బా ఎంత భయం నటిస్తున్నావు?’
‘అయితే పోనీయండి మానివెయ్యనే మానివెయ్యను’ మళ్లీ పాడింది. ‘నల్లవాడే గొల్ల పిల్లవాడే.’
బావ పకపక మనినవ్వాడు. అందుకు కారణం ఉందికూడా. బావ నల్లగా ఉంటాడు. నాకూ నవ్వువచ్చింది. శేషు సిగ్గువచ్చి మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది.
మేం సావిడిలోనుంచి భోజనాలకి పోతూంటే ప్రక్కగదిలో మళ్ళీ అదేపాట. నెమ్మదిగా తనలో తను పాడుకొంటూంది. నేను తలుపు తొయ్యబొయ్యాను. కాని మా బావ నాచెయ్యిపట్టుకు ఆపి కొంతసేపు విన్నాడు.
భోజనాలయి అంతా సావిడిలో కూర్చున్నాము. బావ మంచంమీద వెల్లకిలా పడుకున్నాడు. మా అందరి ముకాలుదీనంగా ఉన్నాయి. బావ ఆవేళ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎన్నాళ్ళకో.
ఒక కుర్చీలో బావకి కనబడకుండా కూర్చుని తమలపాకులకి ఈనెలు తీస్తోంది శేషు. పాడుకుంటోంది.
‘నల్లవాడే గొల్ల పిల్లవాడే.’
బావ తదేకదీక్షతో వింటున్నాడు. కానీ తనాపాట పాడుతున్నట్టుగా అది ఎరగదు. కళ్ళు దీనంగా ఆలోచిస్తున్నాయి. పెదవులు ఏడవడానికి సంకోచిస్తున్నాయి. ఊర్పుతో ముక్కుకొంచెం అదురుతోంది.
ఇంతలో మా చిన్నతమ్ముడు అందుకున్నాడు. ‘నల్లవాడే గొల్ల పిల్లవాడే’.
శేషుకి అప్పటికి తెలిసింది. తనాపాట పాడుతన్నట్టుగా. వెంటనే ముఖం ఎత్తి చూసింది ఎవరన్నా కనిపెడుతున్నారా అన్నట్టు. మాతమ్ముణ్ణి దగ్గరగా పిలిచి ప్రోత్సహించింది.
‘పాడరా తమ్ముడూ.’
‘నువ్వే పాడరాదూ’ సరదాగా వుంటే. ఇందాకటినుంచీ పాడుతున్నావుగా అన్నాడు బావ.
శేషు లేచి తమలపాకులు బావచేతికిచ్చి చిరునవ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది లోపలికి.
బావా, నేనూ, ఉళ్ళోచుట్టాలని చూడ్డానికి వెళ్ళి, మూడు గంటలకి యింటికి తిరిగి వచ్చాము. శేషుగొంతు గట్టగా వినపడుతోంది. ‘నల్లవాడే గొల్ల పిల్లవాడే’.
గొంతుకు సాఫీగా లేదు. గట్టిగా పాడిన కొద్దీ జంకుతోంది. బావ గదిగుమ్మంలోకి వెళ్ళి నిలబడ్డాడు. ఆమె కళ్ళలో నీళ్ళు తుడుచుకోడానికి సావకాశం లేకపోయింది.
మాబావ ఎంతో సానుభూతితో చిరునవ్వునవ్వబోతూ కొంతసేపు అల్లా నిలబడ్డాడు.
నేనూ, శేషూ. బావని సాగనంపడానికి స్టేషనికి వెళ్ళాము. రైలు రావడానికి ఇంకా పావుగంట వ్యవధి ఉంది. ఎ వరమూ ఎమీ మాట్లాడకుండా నిలబడ్డాము.
బావే అన్నాడు చివరికి, ‘నేను యింకో పావుగంటలో రైలులో ఉంటాను?’
‘మీ తాళంచెవులో పాపం?’ అంది శేషు.
బావ జేబు తడుముకొని ‘ఒహో నువ్వుతీశావా? ఏమిటి?’ అన్నాడు.
‘ఇదీ బాగానే ఉంది. నేనేం ఎరుగుదును?’
కానీ అదేతీసినట్టుగా చెప్పడంలో తెలిసిపోయింది. బావ రెట్టించి అడుగలేదు.
రైలువచ్చి ఆగింది. సామాను రైలులో ఎక్కింది. శేషుని చూస్తే నాకు గుండెలు దడ, దడా కొట్టుకున్నాయి. కొంచెం ముఖం క్రిందికి వంచింది. పెదవులు సగం విప్పి ఉన్నాయి. వేలిగోటితో మునిపంటిని నొక్కుతూ నిలబడింది. కళ్ళలో నీటి బిందువులు ఇంక చెక్కులమీదికి జారడమే తరువాయి. వాటిని తుడుచుకుంటే, తను ఏడుస్తోన్నట్టు అందరికీ తెలిసిపోతుందని అల్లాగే నిలబడింది.
బావ దగ్గరగా వెళ్ళాడు. శేషు తలఎత్తలేదు.
‘వెడుతున్నాను,’ అన్నాడు.
శేషు తాళం చెవులగుత్తి బావ చేతులో పెట్టింది. బావ ఆ చేతిని తనచేతిలోకి తీసుకున్నాడు.
‘ఛీ ఏడవకు. ఎందుకేడుస్తావు?’ అన్నాడు.
శేషు లేదన్నట్టుగా తల ఊపింది. కాని కన్నీటిని తుడుచుకోలేదు.
‘ఇదుగో, ఇల్లాచూడు – నే వెళ్ళిరానా?’
శేషు సరేనన్నట్టు తల వూపింది. బావ శేషువీపుమీద ఒకసారి నిమిరి, ఒక నిట్టూర్పువిడిచి రైలు ఎక్కాడు.
ఇంక మా శేషుకి అభిమానమంతా పోయి, ముఖం ఎత్తి రైలువేపు చూస్తూ మనసారా ఏడ్చింది. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? నేను ఊరుకో పెట్టటానికి వీల్లేనిపరిస్థితి అది. అసలు అటువంటి పరిస్థితులంటేనే నాకు అసహ్యం. ముఖం చిట్లింది. మా శేషుని ఊరుకోబెట్టే బాధ్యత ప్రకృతికి వదిలేసి ఇంకో ప్రక్కకు తిరిగి చూస్తూ నిలబడ్డాను.
శేషు తరవాత శేషప్ప అయింది. ఈలోగా చాలా మార్పులు జరిగాయి. శేషప్ప అదృష్టం తలక్రిందులయింది. మా బావ చాలా చిన్నవయసులోనే పోయాడు. ఆమెకు ఒక ఆడపిల్ల. డబ్బుకి లోటులేదు. మాబావ అట్టే సంపాదించేదాకా బతక్కపోయినా అసలు వాళ్ళ స్థితిగతులు మంచివి. బావ పోయిన తరువాత శేషప్ప మా దగ్గరే ఉంటూవచ్చింది. మా మేనకోడలికి ఒక మంచి సంబంధం చూచి పెళ్ళిచేశాం. కుర్రవాడు బి.ఏ.ప్యాసయాడు. స్థితిగతులు చెప్పుకోతగ్గవి కాకపోయినా లోటులేని సందర్భం. కార్యంకూడా అయిపోయింది. అతను బి.ఎల్. చదివి ఉద్దేశ్యంతో కాపరం మద్రాసులో పెట్టదలుచుకున్నాడు. ఇంకొక వారం రోజులకి అతను మద్రాసు వెడతాడనగా నేను స్వయంగా అతన్ని మా యింటికి తీసుకువచ్చాను.
మాఊరి వారందరికీ పదోసారి శేషప్ప తన అల్లుణ్ణి చూపించి అంటూ వచ్చింది, ‘మా అల్లుడండీ. మద్రాసులో కలట్రీ చదవటానికి వెడుతున్నాడు’ బి.ఏ. అయిన తరవాత ఏది చదివినా కలట్రీ అనే దాని నమ్మకం. అల్లుడు తనలోతను నవ్వుకుని ఊరుకునేవాడు.
నేనుమాత్రం మందలిస్తూ అన్నాను. ‘ఒసే కలట్రీ ఏమిటీ అదంత తేరగా ఉందనుకుంటున్నావు?’ అల్లుణ్ణి గురించి అంతా తెలిసిపోయేటట్టు గొప్ప చెప్పుకోవడం సభ్యతకాదని నా భయమేమో
‘‘ఆరి నీ యమ్మకడుపు బంగారంగానూ, మరి నాకా పరీక్షలు ఏవో తెలియవురా.’’ మా శేషప్పమాత్రం పకపక నవ్వింది.
కూతుర్ని దగ్గరగా తీసుకొని బుజ్జగిస్తూ అంది. ‘‘మా తల్లి ఏం కష్టపడుతుందో చెన్నపట్టణంలో మాటాతెలియదు మంతీ తెలియదు గావును.’’
అల్లుడి ఎదుట కూతుర్ని అల్లా బుజ్జగించడం నాకు ఎందుకో నచ్చలేదు. ‘‘మరేం ఫరవాలేదు. నీకుమల్లే వెర్రిబాగుల్దికాదు అది,’’ అన్నాను.
‘ఆరి నీయమ్మకడుపు బంగారంగానూ, దానికేం తెలుసురా పాపం’
తను ‘‘పెద్దదనీ, పైకి ఏడవకూడదనే సంగతి దానికీ కొంతవరకూ తెలుసును. ఆదివారం రోజుల్లోను చాటుగా ఎన్నోసార్లు కళ్ళు తుడుచుకోడం నేను చూశాను. కాని అల్లుడుచూస్తే అమర్యాద అని నా అనుమానం. ఆమె ఏడుపు నటనకాదని నాకు తెలిసినా నాగరికత వాంఛించే ఇతరుల ఎదుట అది వెకిలితనంగా నటనగాఅగుపడి పోతుందేమోనని నాభయం, శేషప్ప చివరదాకా తననికూడా అల్లుడు మద్రాసు రమ్మంటాడేమోనని మహా ఆశపడింది.
వెళ్ళేవాడు మేమంతా భోజనాలు అయాక సావిడిలో కూర్చున్నాము. అల్లుడు పత్రిక చదువుతున్నాడు కుర్చీలో కూర్చుని.
‘ఏమోయి ఏవో రోడ్లమీద నడిచేబళ్లు ఉంటాయట గదూ?’ అంది అల్లుణ్ణి ఉద్దేశించి.
‘ట్రాములాండీ?’ అన్నాడు.
‘రోడ్డుమీదయితే ఎల్లా ఎక్కుతారవి?’
‘వెళ్ళిచూస్తేనేగాని అర్థంకాదు’ అన్నాను నేను.
‘పోనీ నేనూవెడతాను’, అల్లుడుమాత్రం వినబడనట్టు పత్రిక చదువుతున్నాడు.
అల్లుడికి వినబడకుండా నేను మందలించబోయాను.
‘అటువంటి ఉద్దేశ్యాలు మనసులో ఉన్నా పైకి తేలిపోవడం మంచిదికాదు.’
‘ఆరి నీయమ్మ కడుపు బంగారంగానూ, ఇందులో తప్పేముందిరా?’
మా మేనకోడలు గదిలోకి రాబోయి, మొగుణ్ణిచూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోబోయింది.
‘రాఅమ్మా’ ఇలావచ్చి కూర్చోవచ్చు? అదివచ్చి శేషప్ప పక్కన కూర్చుంది.
‘మాతల్లి ఈవేళ వెళ్ళిపోతుంది’ ఒకసారి ముక్కు పైకి ఎగపీల్చుకుంది. కళ్ళలో నలకపడ్డట్టు నటించి కళ్ళు తుడుచుకుంది.
‘మళ్ళీ శలవుల్లో తప్పకుండా వచ్చెయ్యండోయ్’. అంది అల్లుణ్ణుద్దేశించి.
‘అల్లాగేలెండి’ అన్నాడు అల్లుడు పత్రిక చదువుతూనే.
శేషప్పకళ్లు ఈసారి నీళ్ళతో నిండిపోయాయి. మేము ఏమీ అనుకోకుండా ఉంటే బోరుమని ఏడిచేదే అల్లుడి ముఖానికి పత్రిక అడ్డుఉంది. శేషప్పముఖం పక్కకి తిప్పుకుని కళ్ళు తుడుచుకుంది. ‘పేపరు విశేషాలేమిటోయి?’ అంది. అనవసరపు ప్రశ్న.
కొంగు పరుచుకొని ప్రక్కకి తిరిగి పడుకొంది. ఈ సారి అది ఎంత దాచుకోడానికి ప్రయత్నించినా దుఃఖం ఆగలేదు అల్లా పడుకుని ఉండగానే ఆమెకు ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు. నేను ఉన్నంతసేపూ అది ఏడుస్తూనే ఉందనుకున్నాను. రైలు వేళ దాకా అది అల్లాగే నిద్దరపోయింది.
నేను లేపాను. ‘ఆరి నీయమ్మకడుపు బంగారంగానూ’ అంటూ కళ్ళు నులుపుకుంటూ లేచింది. రైలు వేళయిందని చెప్పాను. ఆమాట కొంతసేపటి వరకు దానికి అర్థంకాలేదు.
బండి వచ్చింది. సామానంతా బండిలో పెట్టుకున్నాడు బండివాడు. అల్లుడువెళ్ళి అవతల బండిదగ్గర నిలబడ్డాడు. మా మేనకోడలు అడుగులో అడుగు వేసుకుంటూ తల్లిదగ్గరకు వచ్చింది.
‘అయ్యోతల్లీ వెళ్ళిపోతున్నావా అమ్మా?’
శేషప్పబావురుమంది. అల్లుడు ఎదురుగా ఉన్నాడన్న సంగతి పూర్తిగా మరిచిపోయింది. వెక్కి వెక్కి చిన్న పిల్లలా ఏడిచింది. ఇంక రైలువేళ దాటిపోతుందని అల్లుడు తొందరపెట్టిన మీదట కూతుర్ని రైలులో ఎక్కనిచ్చింది. బండి వెళ్ళిపోయినా అది ఏడుపుమాత్రం మానలేదు.
అయితే అప్పుడప్పుడు నాకో ప్రశ్నవస్తూ ఉంటుంది. మనసులో విచారాన్నంత పయికి వదిలివేయడం తప్పా? దానికి మనసులో ఒకటే సమాధానం. తప్పు కాకపోయినా సభ్యతకాదు. అయితే అటు వంటి పరిస్థితులో నేను ఏం చెయ్యాలి? దానికిమాత్రం నా మనసులో సమాధానం లేదు.

(1968-11-10 యువ దీపావళి ప్రచురణ)

———–

You may also like...