పేరు (ఆంగ్లం) | Shrirangam Srinivasarao |
పేరు (తెలుగు) | శ్రీరంగం శ్రీనివాసరావు |
కలం పేరు | శ్రీ శ్రీ |
తల్లిపేరు | అప్పలకొండ |
తండ్రి పేరు | పూడిపెద్ది వెంకటరమణయ్య |
జీవిత భాగస్వామి పేరు | వెంకట రమణమ్మ , సరోజ |
పుట్టినతేదీ | ఏప్రిల్ 30, 1910 |
మరణం | జూన్ 15, 1983, మద్రాసు |
పుట్టిన ఊరు | విశాఖపట్నం |
విద్యార్హతలు | బి.ఎ. (జంతుశాస్త్రము) |
వృత్తి | సినిమా పాటల రచయిత |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ప్రభవ – ప్రచురణ: కవితా సమితి, వైజాగ్ – 1928 |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి “రాజా లక్ష్మీ ఫౌండేషను” అవార్డు |
పొందిన బిరుదులు / అవార్డులు | మహాకవి |
ఇతర వివరాలు | ప్రజ (ప్రశ్నలు జవాబులు) – ప్రచురణ: విరసం – 1990 తెలుగువీర లేవరా (సినిమా పాటలు)- ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1996 విశాలాంధ్రలో ప్రజారాజ్యం – ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 1999 ఉక్కు పిడికిలి, అగ్నిజ్వాల – ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001 ఖబర్దార్ సంఘ శత్రువు లారా – ప్రచురణ: విశాలాంధ్రా పబ్లిషర్స్, హైదరాబాదు- 2001 ప్రముఖ సినిమా పాటలు[మార్చు] మనసున మనసై (డాక్టర్ చక్రవర్తి) హలో హలో ఓ అమ్మాయి (ఇద్దరు మిత్రులు) నా హృదయంలో నిదురించే చెలి (ఆరాధన) తెలుగువీర లేవరా (అల్లూరి సీతారామరాజు) పాడవోయి భారతీయుడా (వెలుగు నీడలు) |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | శ్రీరంగం శ్రీనివాసరావు మహా ప్రస్థానం |
సంగ్రహ నమూనా రచన | మరో ప్రపంచం , కదం త్రొక్కుతూ , |
శ్రీరంగం శ్రీనివాసరావు
మహా ప్రస్థానం
మరో ప్రపంచం ,
మరో ప్రపంచం ,
మరో ప్రపంచం పిలిచింది !
పదండి ముందుకు ,
పదండి త్రోసుకు !
పోదాం , పోదాం పైపైకి !
కదం త్రొక్కుతూ ,
పదం పాడుతూ
హృదంతరాళం గర్జిస్తూ –
పదండి పోదాం ,
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం ?
దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు !
బాటలు నడచీ ,
పేటలు కడచీ ,
కోటలన్నిటిని దాటండీ !
నదీ నదాలూ ,
అడవులు , కొండలు ,
ఎడారులూ మన కడ్డంకి ?
పదండి ముందుకు !
పదండి త్రోసుకు !
పోదాం పోదాం పైపైకి !
ఎముకలు క్రుళ్ళిన ,
వయస్సు మళ్ళిన
సోదరులారా ! చావండి !
నెత్తురు మండే ,
శక్తుల నిండే ,
సైనికులారా ! రారండి !
“హరోం ! హరోం హర !
హర !హర !హర! హర!
హరోం హరా !“ అని కదలండి !
మరో ప్రపంచం
ధరిత్రినిండా నిండింది !
పదండి ముందుకు !
పడండి త్రోసుకు !
ప్రభంజనంవలె హోరెత్తండీ !
భావ వేగమున ప్రసరించండీ !
వర్షుకాభ్రముల ప్రళయ ఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి !
పదండి ,
పదండి ,
పదండి ముందుకు !
కనబడలేదా మరో ప్రపంచపు
కణకణ మండే త్రేతాగ్ని ?
ఎగిరి, ఎగిరి , ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరువులు!
తిరిగి , తిరిగి ,తిరిగి సముద్రాల్
జలప్రళయ నాట్యం చేస్తున్నవి !
సలసల క్రాగే చమురా ? కాదిది
ఉష్ణ రక్త కాసారం !
శివ సముద్రమూ ,
నయాగరా వలె
ఉరకండీ ! ఉరకండీ ముందుకు !
పదండి ముందుకు !
పడండి త్రోసుకు !
మరో ప్రపంచపు కంచు నగారా
విరామ మెరుగక మ్రోగింది !
త్రాచులవలెనూ ,
రేచులవలెనూ ,
ధనంజయునిలా సాగండి !
కనబడలేదా మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధగధగలు ,
ఎర్ర బావుటా నిగనిగలు ,
హోమజ్వాలల భుగభుగలు ?
12 -04 -1934
ఋక్కులు
కుక్కపిల్లా , అగ్గిపిల్లా , సబ్బుబిళ్ళా –
హీనంగా చూడకు దేన్నీ !
కవితామయ మేనోయ్ అన్నీ !
రొట్టెముక్కా , అరటితొక్కా , బల్లచెక్కా –
నీ వేపే చూస్తూ ఉంటాయ్ !
తమ లోతు కనుక్కోమంటాయ్ !
తలుపు గొళ్ళెం , హారతి పళ్ళెం ,గుర్రపు కళ్ళెం –
కాదేదీ కవిత కనర్హం !
ఔనౌను శిల్ప మనర్ఘం !
ఉండాలోయ్ కవితావేశం !
కానీవోయ్ రస నిర్దేశం !
దొరకదటోయ్ శోభాలేశం !
కళ్ళంటూ ఉంటే చూసి ,
వాక్కుంటే వ్రాసీ !
ప్రపంచమొక పద్మవ్యూహం !
కవిత్వమొక తీరని దాహం !
– 14 – 04 -1934
సేకరణ : మహాప్రస్థానం కవితా సంపుటి నుంచి .
———–