పేరు (ఆంగ్లం) | Vempati Sachidananda Sharma |
పేరు (తెలుగు) | వెంపటి సచ్చిదానందశర్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అభ్యాగతులు, తారాబలం, పల్లెపట్టులు, తోడు నీడ, మిత్రద్రోహి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వెంపటి సచ్చిదానందశర్మ అభ్యాగతులు |
సంగ్రహ నమూనా రచన | ‘‘ఊ… అప్పుడు వాళ్లేంచేశారు?’’ అన్నాడు విశ్వనాథం ఉండపట్టలేక, వాసు సంభాషణ రసపట్టులో ఆపుచేసి తిండిధోరణిలో పడేసరికి. సుందర్రావు, నేను, శ్రీ రామ్మూర్తి, నాగభూషణం… అంతా సరైన ప్రశ్న వేశావన్నట్టు సమాధానం కోసం వాసువైపు నోరుతెరుచుకు చూస్తున్నాం. విశ్వనాథం ఆ ప్రశ్నే వేసి ఉండకపోతే మాలో ఎవరైనా అదే ప్రశ్నే వేసిఉండేవాళ్ళం. అసలు, వాసు ఎంత చమత్కారి కాకపోతే విషయాన్ని అంత క్లైమాక్సులో వదులుతాడు? అందుకనే తరుచు అంటూ ఉంటాం. వాసూ అదృష్టవశాత్తు ఏదో ఒక వాసి గ్రహబలం తక్కువై నువ్విలా ఉన్నావు కాని, కాకపోతే కర్మం కాలి నువ్వోగొప్ప రచయితవయేవాడివిరా’’ అని. |
వెంపటి సచ్చిదానందశర్మ
అభ్యాగతులు
‘‘ఊ… అప్పుడు వాళ్లేంచేశారు?’’ అన్నాడు విశ్వనాథం ఉండపట్టలేక, వాసు సంభాషణ రసపట్టులో ఆపుచేసి తిండిధోరణిలో పడేసరికి.
సుందర్రావు, నేను, శ్రీ రామ్మూర్తి, నాగభూషణం… అంతా సరైన ప్రశ్న వేశావన్నట్టు సమాధానం కోసం వాసువైపు నోరుతెరుచుకు చూస్తున్నాం. విశ్వనాథం ఆ ప్రశ్నే వేసి ఉండకపోతే మాలో ఎవరైనా అదే ప్రశ్నే వేసిఉండేవాళ్ళం. అసలు, వాసు ఎంత చమత్కారి కాకపోతే విషయాన్ని అంత క్లైమాక్సులో వదులుతాడు? అందుకనే తరుచు అంటూ ఉంటాం. వాసూ అదృష్టవశాత్తు ఏదో ఒక వాసి గ్రహబలం తక్కువై నువ్విలా ఉన్నావు కాని, కాకపోతే కర్మం కాలి నువ్వోగొప్ప రచయితవయేవాడివిరా’’ అని.
అట్లు తయారయి వచ్చే లోపల కాలక్షేపానికి తెప్పించిన పకోడీలు ఎంగిలిపడ్డాం. శ్రీరామ్మూర్తి నాలికతో నోటిని శుభ్రంచేసుకుంటున్నాడు. నాగభూషణం గఱ్ఱుమని ఒక తేపుతేపాడు. ఇంతలో సర్వరు పళ్ళు ఒకదానిమీద ఒకటి దొంతరగా అమర్చుకొచ్చి మాటేబులు ముందు ఠపీమని ఆగి ‘‘క్లిక్’’ అని అరిచేడు కీచు గొంతుకతో బల్లలు తుడిచేవాడికి వీలుగా సుందర్రావు ఒక వైపుకు ఒదిగాడు. సర్వరు పళ్ళాలన్నీ అందరిముందూ అమర్చి వెళ్ళిపోయాడు. వాసు ఒక గ్లాసు మంచినీళ్ళతో పూర్వాధ్యాయానికి భరతవాక్యం, నూతినాధ్యాయానికి నాందీ పాడాడు.
‘‘ఆ తరవాత ఏమయిందో చెప్పావుకావు…’’ అని జ్ఞాపకం చేశాడు నాగభూషణం.
‘‘ఆ ఎంతవరకు చెప్పాను?’’ అన్నాడు వాసు, ఆ విషయాలన్నీ తిండి అడుగున పడిపోయినట్టు.
‘‘బిల్లు ఎవరి కందితే వాళ్ళిస్తాం. కిందపడెయ్యమన్నారు, సర్వరు పడేశాడు అంతవరకు.’’
‘‘ఇంకేముంది ఇద్దరూ కుర్చీలమీంచి దూకారు ఆ బిల్లు నేనిస్తానంటే నేనిస్తానని అలా వాళ్ళిద్దరూ ఎంగిలాకులమీదికి కుక్కల్లాగా బిల్లుమీదికి ఎగబడుతుంటే సర్వరు అవతలగా నిలబడికుస్తీపందెం చూస్తున్నట్టు కులాసాగా చూస్తున్నాడు. చివరికి ఆ హేమా హేమీల్లో ఒకడు బిల్లు పుచ్చుకుని కౌంటరు ముందుకి నడిచాడు. రెండోవాడు కూడా లేచి నిలబడి కౌంటరుదగ్గిరికి పోతున్నవాడి కండువాపుచ్చుకుని వెనక్కి లాగుతూ ‘యహే నేనిస్తానుండు డబ్బు’ అంటున్నాడు. కౌంటరుదగ్గర మాత్రం ఎంత హంగామా అయింది? అందులో ఎవడూ డబ్బివ్వడు, రెండోవాణ్ణి ఇవ్వనివ్వడు. హోటల్లో కూర్చున్న వాళ్ళంతా ఆ పల్లెటూరి మర్యాదలు వినోదంగా చూశారు. ఇంతకూ ఎవరు డబ్బివ్వటమనే విషయం ఏ వేళకూ తేలక పోయేసరికి మేనేజరుకి ఒళ్ళు మండి ‘ఎప్పుడూ హోటలుకి వచ్చిన మొహాలల్లే లేవే’ అని తిట్లకి లంకించుకున్నాడు. ఆనాలుగూ పడింతరవాత అందులో ఒకడు తగ్గి రెండోవాణ్ణి బిలు చెల్లించనిచ్చాడు. అంతా అయిపోయి మెట్లు దిగుతూకూడా ఇదే సంభాషణ డబ్బు నేనిచ్చేవాణ్ణంటే నేనిచ్చేవాణ్ణిని వెధవ మర్యాదలు చూచే సరికి నాకో కటనిపించింది. ఇలా నేనిస్తానంటే నేనిస్తానంటున్న వాళ్ళు కాస్తా, నువ్వియ్యమంటే నువ్వియ్యమనటానికి ఎన్నోరోజులు పట్టదనుకున్నాను.’’
ఇక్కడ మీరొక్క విషయం గమనించాలి. వాసు రియలిస్టు కాకపోయినట్టయితే వాళ్ళిద్దరూ తవరకు హోటలు మొహం చూడని పల్లెటూరి మనుష్యులని చెప్పే శ్రద్ధ తీసుకుని ఉండేవాడు కాదు. అంతే కాదు ఇప్పుడు చెప్పిన విషయాన్నే ఇంకా బిలవలు పలవలుగా అల్లి… వాళ్ళు బిల్లుకోసం తల్నులాడుకోవటంలో బల్లమీద ఉన్న కప్పులు పగలకొట్టారనీ, మరికొన్ని కప్పుల్లో ఉన్న కాఫీ తింటున్న వాళ్ళమీద ఒలికిందనీ, వాళ్లూ, మానేజరూ… అంతాపోగై ఇద్దరినీ తలొక నాలుగూ ఉతికి తిన్న డబ్బులు కక్కించి మరీ బయటకి పంపారనీ ఇలా తన సామర్థ్యం కొద్దీ ఊహాగానం చేసి ఉండేవాడు. ఇంకా నేను మా పార్వతిగాడి విషయం గట్టిగా చెప్ల్పలేనుకాని, వాసు మాత్రం అంతతెలివి తక్కువవాడు కాడు.
ఈలోగా మేము అట్టుతో మూడవపట్టుగా కాస్త ఉప్మాకూడా నంజుకుని కాఫీ దాహం పుచ్చుకుంటున్నాం. సర్వరునోటి కెక్కని బిల్లు తయారు చెయ్యటానికి సతమత మౌతున్నాడు. నేను గబగబా వేడి వేడి కాఫీ గొంతులో పోసుకుని చెయ్యి కడుక్కోటానికి అవతలికి వెళ్ళాను. ఈలోగా ప్రతివాళ్లూ గ్లాసులు కిందపెట్టి బయలుదేరారు. నేను మళ్ళా నా కుర్చీ దగ్గిరికి చేరుకునేసరికి వాసు నొచ్చకుంటున్నట్టు, ‘‘ఛా పాపం. ఇవ్వాళ కూడా సుందర్రావునే బిల్లుబరువు మొయ్యమనటం దారుణం’’ అన్నాడు వేడి వేడి కాఫీ ఊదుకుంటూ తాగుతున్న సుందర్రావు చేతికి సర్వరు బిల్లు అందించేసరికి.
‘‘ఆ బిల్లిలా తేవోయ్’’ అంటూ సుందర్రావు చేతులోనుంచి బిల్లు అందుకోబోయాడు శ్రీరామ్మూర్తి.
‘‘అయిందీ ఇందాకటినుంచీ నే వినిపించిన నాటకమంతా ఇప్పుడు మళ్లీ మీరొకసారి ఆడేట్టున్నారే. కానియ్యండి… ఇదో కాలక్షేపం’’ అని అందర్నీ నవ్వించాడు వాసు ఒకసారి. ఒక క్షణం ఆగి మళ్ళీ ‘‘ఆపాటి కాస్త లౌక్యమన్నా తెలీకపోతే ఎలారా? కాఫీ అంతసేపు తాగితే బిల్లు మీదపడక ఏ మౌతుంది?’’ అన్నాడు మర్మం లేకుండా.
‘‘అఁహఁ… అంతమాత్రానికే ఫరవాలేదు లేరా’’ అని తన అమాయకతని ఋజువుపర్చుకున్నాడు సుందర్రావు.
అంతా బయలుదేరాం. సుందర్రావు లాగూ జేబులోకి చెయ్యి పోనిస్తూ కౌంటరుముందు ఆగిపోయాడు. మేమాం గుమ్మందిగి రోడ్డు ప్రక్కన నిలబడ్డాం. ఇంతలో శ్రీరామ్మూర్తి ఒక ఉదాత్తభావాన్ని వెల్లడిస్తూన్నట్టు, ‘‘అస్మదాదులందరికీ నెలలో చేతికి డబ్బోచ్చిన మొదటివారం అంతా ఆర్థికసమృద్ధి, రెండో వారం అంతా సాధారణ ఆర్థిక పరిస్థితులు, మూడోవారం ఆర్థికమాంద్యం, నాలుగోవారం క్షామం’’ అన్నాడు.
మాలో ఈ విషయాన్ని కాదనగలవాడు ఎవడూ లేడు కాకపోతే నెలలో మొదటి వారంలో మాత్రం ఆర్థిక సమృద్ధితో ఉన్నవాడెవడని విచారించేవాళ్లే కాని, ఉన్న విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి చెపుతున్నాడని అనతగ్గవాళ్ళం ఎవరమూ కాము. అందువల్ల ఎవరిమాటకు వాళ్ళం బాగా చెప్పావన్నట్టు విని ఊరుకున్నాం.
ఇంతలో విశ్వనాథం అందుకుని ‘‘పార్వతిగాడు నీ మాటలు విని ఉంటే వెంటనే పీక పట్టుకునేవాడు. ‘నెల మొదటివారంలో నైనా ఆర్థిక సమృద్ధిగా ఉండగా ఎన్నడైనా నన్నుచూశావా? ఎందుకు వెధవగొప్పలు?’ అని’’ అన్నాడు.
‘‘అన్నట్టు నిన్నా, ఇవ్వాళ్ళా పార్వతి అయిపేలేడేం? ఏమైనట్టు?’’ అన్నాడు నాగభూషణం.
‘‘మరేం భయంలా… ఇందాకనేవాడు, వెంకటశాస్త్రి కలిసి కనిపించారు. ఊళ్ళోనే ఉన్నాడు’’ అన్నాడు వాసు పార్వతిని గురించి అంత ఆశ్చర్యం అనవసరమన్నట్టు.
పార్వతీశం, వాసులమధ్య ఒక విధమైన ఈర్ష్య మొదటినుంచీ ఉంటూనేఉంది. దానికి కారణం వాళ్లిద్దరికీ చాలా విషయాల్లో పోలిక ఉండటం అనుకుంటాను. మిగతా విషయాలన్నీ అలా ఉంచి చమత్కారంగా మాట్లాడటంలో ఒకణ్ణి మంచినవాడు ఒకడు. అందువల్ల మాటల్లో ఒకణ్ణి కడు చిత్తుచెయ్యాలనీ ఇద్దరూ ప్రయత్నించేవాళ్లు. ఈ ప్రత్యర్థిభావం వాళ్లిద్దరిమద్యా ఉండటం గమనించి మా పార్కు సమావేశాల్లో వాళ్ళిద్దరినీ ఉసికొలిపి అంతా వింటూ కూర్చునేవాళ్లం.
‘‘వెంకటశాస్త్రికూడా నిన్న పార్కుకి రాలేదు కదూ?’’ అన్నాడు సుందర్రావు.
‘‘ఉఁ హుఁ…’’ అన్నాడు నాగభూషణం.
‘‘వాళ్ళేదో చాలా హడావిడిగా తిరుగుతున్నారోయ్. ఏదో వుంది… పార్కుకి వచ్చేందుకు వ్యవధి చిక్కటం లేదేమో. ఈ ఉన్న నలుగురిలోనూ ఎన్ని క్లిక్కులు’’ అన్నాడు వాసు.
మాటలుసందట్లో తెలియకుండానే పార్కు చేరుకున్నాం. మేము రోజు కూర్చునేచోటుకి మలుపు తిరగగానే ‘‘అడుగో పార్వతి’’ అన్నాడు శ్రీరామ్మూర్తి అంత దూరాన్నుంచే గుర్తుపట్టి.
పార్వతి వంచిన తల ఎత్తకుండా ఏదో పరిక్ష్గా చూస్తూన్నాడు. క్రమంగా దగ్గిరకి వచ్చి చూతుముకదా డబ్బు. కొన్ని నోట్లు, కొన్ని రూపాయలు, కొంత చిల్లర… అంతా లెక్క పెట్టుకుంటున్నాడు.
పార్వతిగాణ్ణి అలా అంత డబ్బుతో చూచేసరికి మాలో ప్రతిఒక్కరం నిర్ఘాంతపోయాం. పైగా అది నెలచివరివారం. సాధారణంగా ప్రతివాళ్లూ అందులో ముఖ్యంగా పార్వతి ఎంత తగ్గించి చెప్పాలన్నా, నిస్సందేహంగా ‘‘క్షామం’’తో బాధపడవలసిన కాలం. అలాటిది వాడు అంత పచ్చగా కనబడితే ఎవరికళ్లు కుట్టవు?
పార్వతి డబ్బు లెక్క పెట్టటం పూర్తిచేసి, పర్సులో చిందరవందరగా కుక్కేసుకుంటూ ‘‘హారి వీడిదుంప తెగా’’ అన్నాడు తెల్లమొహం పెట్టి.
వాసు పర్సులో కుక్కుతున్న నోట్లపై పొకసారి చూసి ‘‘ఇంకేం? రెండురోజులనుంచీ వీడు ఊరికే కనపడకుండా ఉండటంలేదన్నమాట అసలిప్పుడు వీడు వెంకటశాస్త్రి కోసం ఎదురు చూస్తున్నాడేమో నఱ్ఱా’’ అని అంటించాడు.
పార్వతి ఇంకా అలాగే మొహం వేళ్లాడేసి చూస్తుండేసరికి ‘‘వెంకటశాస్త్రి రాలే దేరా?’’ అన్నాను.
పార్వతి కాస్సేపటికి తెప్పిరిల్లి ఒకసారి గుటకు మంగి ‘‘ఇం కెందు కొస్తాడు? ఆరి వీడి దుంపతెగ ఇందుకన్నమాట… ఆదరాబాదరా జారుకున్నాడు’’ అన్నాడు నోరు వెళ్లబెట్టి ఇందాకటిమాదిరిగానే.
నేను మాత్రం ఇవాళ కాలక్షేపం బాగానే జరుగుతుందని తాపీగా కూర్చున్నాను.
పార్వతి ఏ వేళకీ తెమిల్చి చెప్పకుండా ఇంకా అలాగే చూస్తూండేసరికి శ్రీరామ్మూర్తి ‘‘ఏం జరిగిందో చెప్పరా మిటలా తెల్లమొహం వేసుకుచూస్తావ్? ఏమైందేమిటి?’’ అన్నాడు.
‘‘డబ్బేమైనా కాజేశాడేరా?’’ అన్నాడు నాగభూషణం.
పార్వతి నెమ్మదిగా కోలుకుని ‘‘పూర్తిగా కాజెయ్యటం కాదనుకో… చివరికి డబ్బుపోయే, శనీ పట్టెనని పెట్టి పోషిస్తున్న దాతలాగా ఎన్నితిట్టాడురా వీడిమొహం తగలెయ్య’’ అన్నాడు.
———–