పేరు (ఆంగ్లం) | Suryadevara Sanjeevadev |
పేరు (తెలుగు) | సూర్యదేవర సంజీవ దేవ్ |
కలం పేరు | – |
తల్లిపేరు | వెంకాయమ్మ |
తండ్రి పేరు | రామ దేవా రాయ |
జీవిత భాగస్వామి పేరు | సులోచన |
పుట్టినతేదీ | 7/3/1924 |
మరణం | 8/25/1999 |
పుట్టిన ఊరు | మంగళగిరి, తెనాలికి మధ్యన గల తుమ్మపూడి |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఫ్రెంచ్, జపానీస్, ఎస్పరాంటో అనే కృత్రిమ అంతర్జాతీయ భాషలో కూడా ఈయనకు ప్రవేశం ఉంది. |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తెగిన జ్ఞాపకాలు. ఇతని రచనలలో ప్రాచుర్యం పొందినది, రసరేఖలు, కాంతిమయి దీప్తి ధార, రూపారూపాలు, సమీక్షా రేఖలు, బయో సింఫోనీ (ఆంగ్లంలో) మొదలైనవి ఉన్నాయి. భారతీయ చిత్రకళ – సి.శివరామమూర్తి ఆంగ్ల రచనకు సంజీవదేవ్ అనువాదం. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | ప్రముఖ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. తన స్వీయ చరిత్రను తెగిన జ్ఞాపకాలు పేరిట రచించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | సూర్యదేవర సంజీవ దేవ్ |
సంగ్రహ నమూనా రచన | అమెరికా సందర్శించే యాత్రికులెవరైనా న్యూయార్క్ నగరంలో అప్ టౌన్ లో 107 వ వీధిలోకి వెడితే నికొలస్ రోరిక్ మ్యూజియం కనిపిస్తుంది. అందులో సంజీవదేవ్ కు రష్యన్ చిత్రకారుడు రోరిక్ కు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు భద్రపరిచారు. లోగడ ఈ మ్యూజియంను సందర్శించినవారిలో మిత్రుడు చలసాని ప్రసాద్ ఉన్నారు. ఆయన ఆసక్తిని వెతుక్కుంటూ వచ్చిన ధోరణిని గమనించిన మ్యూజియం డైరెక్టర్ ఆయనకు ప్రత్యేకంగా ‘ఆర్ట్ పిక్చర్స్’ పుస్తకాన్ని బహూకరించారు. |
సూర్యదేవర సంజీవ దేవ్
అమెరికా సందర్శించే యాత్రికులెవరైనా న్యూయార్క్ నగరంలో అప్ టౌన్ లో 107 వ వీధిలోకి వెడితే నికొలస్ రోరిక్ మ్యూజియం కనిపిస్తుంది. అందులో సంజీవదేవ్ కు రష్యన్ చిత్రకారుడు రోరిక్ కు జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు భద్రపరిచారు. లోగడ ఈ మ్యూజియంను సందర్శించినవారిలో మిత్రుడు చలసాని ప్రసాద్ ఉన్నారు. ఆయన ఆసక్తిని వెతుక్కుంటూ వచ్చిన ధోరణిని గమనించిన మ్యూజియం డైరెక్టర్ ఆయనకు ప్రత్యేకంగా ‘ఆర్ట్ పిక్చర్స్’ పుస్తకాన్ని బహూకరించారు. సంజీవదేవ్ చివరి రోజులలో ఈ ఉత్తర ప్రత్యుత్తరాలను మ్యూజియంకు బహూకరించమని నేను కోరాను. ఆయన ఒక పట్టాన ఒప్పుకోలేదు. నేను పట్టు వదలక నేడు ‘మిసిమి’ సంపాదకుడుగా ఉన్న వల్లభనేని అశ్వనీకుమార్ ను తుమ్మపూడి పంపించాను. అమెరికా నుండి సంజీవదేవ్ కు ఫోన్ చేసి ఆ ఉత్తరాలు నికొలస్ రోరిక్ మ్యూజియంలో ఉంటే వాటికి భవిష్యత్తు ఉంటుందని, సరైన చోటికి చేరినట్లుంటుందని నచ్చచెప్పాను. ఆయన ఆ ఉత్తరాలను కుమార్ కు అప్పగించగా అవి భద్రంగా మ్యూజియంకు చేర్చారు. ఎంతో సంతోషించాను.
జీవిత చివరి దశలో కులు వాలీలో స్థిరపడిన నికొలస్ రోరిక్ ను కలిసి కొన్నాళ్ళు ఆయనతో గడిపిన సంజీవదేవ్ ప్రకృతిని ఆయనతో కలిసి ఆస్వాదించి, కబుర్లు చెప్పుకుని పరస్పరం చిత్రాలు వేసుకున్నారు. కళాకారుడుగా సంజీవదేవ్ కు అది గొప్ప అనుభూతి.
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా తుమ్మపూడి గ్రామంలో పుట్టి, చిన్నతనంలో కొన్నాళ్ళు కృష్ణాజిల్లాలో బంధువుల దగ్గర పెరిగిన సంజీవదేవ్ చదువులో స్కూలు దాటి పోలేదు. పిన్న వయసులోనే ఉత్తరాది సాహస పర్యటన చేసి అనేక అనుభవాలతో తిరిగి వచ్చారు. ఆయనలోని ప్రతిభను పసిగట్టిన నార్ల వెంకటేశ్వరరావు ఆంధ్ర ప్రభ సంపాదకుడుగా సంజీవదేవ్ రచనలను, జీవితాన్ని దినపత్రికలో ప్రచురించి ప్రజలకు అందించారు. అంచెలంచెలుగా జీవిత అనుభవాలను రాసిన సంజీవదేవ్ ‘గతంలోకి’, ‘స్మృతిబింబాలు’, ‘తెగిన జ్ఞాపకాలు’ అంటూ గ్రంథస్తం చేశారు. బెంగాలీ ప్రభావం మరికొంత హిందీ ప్రభావం ఆయనపై ఉన్నా, రచనలలో కొత్తరకమైన తెలుగుదనాన్ని చూపారు. వాక్య నిర్మాణం, పదప్రయోగాలలో వినూత్నత కనిపిస్తుంది.
సంజీవదేవ్ కు విస్తృత పరిచయాలున్నాయి. రాహుల్ సాంకృత్యాయన్, అసిత్ కుమార్ హల్దార్, భగవాన్ దాస్ (లెన్స్ లైన్ పత్రిక సంపాదకుడు), దేవులపల్లి కృష్ణశాస్త్రి, బెజవాడ గోపాలరెడ్డి, ఆచంట జానకిరామ్, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య వంటివారి పరిచయాలతో చాంతాడంత జాబితా తయారవుతుంది. ఆయన లేఖారాక్షసుడు. ఎవరిదగ్గర నుంచైనా ఉత్తరం వచ్చిందే తడవుగా సమాధానాలు రాసి పోస్టు చేసేవారు. కొందరికి తాను గీసిన బొమ్మలు కూడా జతపరిచేవారు. ఆ లేఖలన్నీ చాలావరకూ గ్రంథాలలో తొంగిచూశాయి. సంజీవదేవ్ చేత పీఠికలు రాయించుకున్నవారు చలం దగ్గర నుండి తపస్వి వరకు ఎందరో ఉన్నారు. సంజీవదేవ్ మాత్రం తుమ్మపూడి గ్రామం వదలలేదు. పెద్దా చిన్నా అందరూ ఆయన దగ్గరకే వచ్చేవారు. కొందరు రోజుల తరబడి ఆయన భార్య సులోచన ఆతిథ్యం స్వీకరిస్తూ ఇంట్లోనే ఆయన చెప్పేవి వింటూ ఆనందించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు ఒక దశలో డాక్టరేట్ డిగ్రీ ఇవ్వబోగా సంజీవదేవ్ నిరాకరించారు. అప్పుడు డిలిట్ డిగ్రీ ఇవ్వగా ఆయన స్వీకరించారు.
కీ.శే. శ్రీ సూర్యదేవర సంజీవ దేవ్ గారు ఇదివరలో వ్రాసిన 3 పుస్తకాలు – 1.తెగిన జ్ఞాపకాలు,2.స్మృతి బింబాలు,3.గతం లోకి.. అనే వాటిని మూడింటిని కలిపి “తుమ్మపూడి” ( సంజీవ దేవ్ గారి స్వగ్రామం) పేరుమీదుగా ఆయన ‘స్వీయ చరిత్ర’ను ‘రాజాచంద్ర ఫొండేషన్ – తిరుపతి’ వారు మార్చి 2011 లో ఒకే పుస్తకంగా పునర్ముద్రించారు. నేను గతవారం తణుకు వెళ్ళినప్పుడు మిత్రులు మన్నె వెంకటేశ్వరరావు గారు చదవమని కాప్లిమెంటరీ కాపీని ఇచ్చారు. స్వీయ చరిత్రలను చదవటం నాకిది వఱకు అలవాటు లేని పని. కథలూ నవలలే కాని స్వీయ చరిత్రల్ని ఎక్కువగా చదవలేదు. చదువుదామని మొదలుపెట్టిన తఱువాత ఆ పుస్తకం లోని శైలి నన్ను ఆపకుండా చదివించేలా చేసింది. నాలుగైదు రోజుల్లో పూర్తి చెయ్యగలిగాను. పూర్తి చెయ్యగానే మన పుస్తకం.నెట్ వారితో పంచుకుందామని అనిపించి ఈ పుస్తక పరిచయాన్ని వ్రాయటం మొదలుపెట్టాను.
‘తెగిన జ్ఞాపకాలు’–ఇవి 70 వ్యాసాలు (1951 వరకు). ‘స్మృతి బింబాలు’–ఇవి 52 వ్యాసాలు (1951 తరువాతవి). ‘గతం లోకి ..’-(1965 వరకూ) ఇవి 51 వ్యాసాలు. 1965 తరువాతి వారి జీవితంలోని విశేషాలు అలభ్యం. వారు వ్రాసారో లేదో తెలియదు. ఈ వ్యాసాలన్నీ పూర్వం ఆంధ్రజ్యోతి దినపత్రికలో వారం వారం ఆదివారం అనుబంధంగా ప్రచురించబడినవే. మొదటిది ‘తెగిన జ్ఞాపకాలు’ , మూడవది ‘గతం లోకి’ ఈ రెండూ ఘటనా ప్రధానమైనవనీ, రెండవదైన ‘స్మృతిబింబాలు’ ఆలోచనా ప్రధానమైనవనీ పేర్కొన్నారు. కానీ మూడు పుస్తకాలలోని వ్యాసాలూ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి చదువుతుంటే ఒకే జీవిత చరిత్రను వరసగా చదివి ఆనందిస్తున్నట్లుగా అనిపించింది.
ఇందులో ఉన్నవన్నీ ఒక్కొక్కటీ మూడు నాలుగు పేజీలలో వ్రాయబడిన వ్యాసాలు. ఇవి చదవటం వలన మనకు మన ముందు జనరేషనులోని అనేకమంది ప్రసిద్ధ వ్యక్తులతో పరిచయం జరుగుతుంది. సంజీవ దేవ్ గారు తమ పాఠశాల చదువుని 6వ తరగతి తోనే ఆపివేసినా స్వంతంగా బహుశ్రమతో ఆంగ్ల, బెంగాలీ, హిందీ, సంస్కృత, ప్రెంచి మొదలగు భాషలలో బాగా కృషి చేసారు. ఆయన మంచి ఉపన్యాసకుడు,కవి,వ్యాసకర్త,లేఖకుడు,చిత్రకారుడూ,ఫొటోగ్రాఫరూ కూడా. ఈ పుస్తకం చదువుతుంటే ఉత్తరాలు వ్రాయటం అనే కళను మనం దాదాపుగా మర్చిపోయామని అనిపించి చాలా బాధ కలిగింది. ఈ పుస్తకం నిండా ఆయన తన స్నేహితులు, పరిచయస్థులు, పండితులతో జఱిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వారితో ఆయన వివిధ సందర్భాలలో పంచుకున్న కవిత్వరీతులూ వారి వ్యాసాలూ మనల్ని చాలా చాలా ఆనందపరుస్తాయి. ఆంగ్లం లోనూ, తెలుగులోనూ కూడా ఆయన వ్యాసాలు, పద్య కవిత్వమూ వ్రాస్తుండేవారు.
ఆయన జీవితంలో తారసపడిన, ఆయన మీద ప్రభావం చూపిన పరిచయస్థులూ,పెద్దలూ, స్నేహితుల పేర్ల లిస్టును క్రింద పొందుపరుస్తున్నాను. వీరిలో ఎందరో ప్రముఖులు మనకు దర్శన మిస్తారు.
కాశీనాథుని నాగేశ్వరరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, జిడ్డు కృష్ణమూర్తి, అనీబిసెంటు, వెలిదండ్ల హనుమంతరావు, ప్రేమ్ చంద్, అసిత్ కుమార్ హాల్దార్,(రవీంద్రనాథ్ టాగోర్ మేనకోడలి కొడుకు), రవీంద్రనాథ టాగూర్, తల్లావజ్జల శివశంకరశాస్త్రి, ప్రొఫెసర్ రోనాల్డ్ నిక్సన్(కృష్ణప్రేమ), పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, నికోలస్ రోరిక్, అడవి బాపిరాజు, ప్రొఫెసర్ ఓ.సి. గంగూలీ, రాహుల్ సాంకృత్యాయన్, పండిత రామ్ నరేశ్ త్రిపాఠి, పిలకా గణపతిశాస్త్రి, బి.వి.నరసింహారావు, వరదా వెంకటరత్నం, గొర్రెపాటి వెంకటసుబ్బయ్య, ఆనంద కెంటిష్ కుమారస్వామి, వి. ఆర్ చిత్రా, శ్రీమతి మార్సెలా హార్డీ, డా. పిట్టమండలం వెంకటాచలపతి, టంగుటూరి సూర్యకుమారి, డా.జి థామస్, దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, నోరి నరసింహశాస్త్రి, గోపీచంద్, జగ్గయ్య, నార్ల వెంకటేశ్వరరావు, మంజరీ ఈశ్వరన్, ఆచంట జానకిరామ్, ఆచంట శారదాదేవి, స్వామి పవిత్రానంద, కొత్తపల్లి వీరభద్రరావు, రోణంకి అప్పలస్వామి, పైడిరాజు, వింజమూరి శ్రీనివాసాచారి, జె.బి.యస్.హాల్డేన్, స్థానం నరసింహారావు, మాధవపెద్ది వెంకట్రామయ్య, పందిరి మల్లికార్జునరావు, నార్ల చిరంజీవి, కవిరావు, శార్వరి, శ్రీమతి అన్ మేరీ గ్రిప్ మన్, నందలాల్ బోసు, ముల్క రాజ్ ఆనంద్, ఆత్మారామ్, ప్రయాగ నరసింహశాస్త్రి, భగవాన్ దాస్, కోకా సుబ్బారావు, మునికన్నయ్య నాయుడు, శరత్ చంద్ర, గుడిపాటి వెంకటచలం, శ్రీమతి క్రిస్టినా, నేలనూతల శ్రీకృష్ణమూర్తి, నండూరి సుబ్బారావు, రాజా త్రియంబక రాజబహద్దూర్, యస్.వి. రామారావు, కృష్ణారెడ్డి, వేగుంట కనక రామబ్రహ్మం, రంధి సోమరాజు, నెమలికంటి సీతారామయ్య, ఆవుల గోపాలకృష్ణమూర్తి, విశ్వనాథ్ ముఖర్జీ, గవర్నర్ భీమసేన్ సచార్, చిట్టా బాల క్రిష్ణశాస్త్రి, డా.రంగనాయకమ్మ, డైరెక్టర్ వి. మధుసూదనరావు, డాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్, వసంతరావు వెంకటరావు, శివశంకరరావు, గౌరి నరసింహశాస్త్రి, సురభి నాగేశ్వరరావు, జగదీశ్ మిత్తల్, బీరేశ్వర్ సేన్, యస్.వి.రామారావు, బండి గోపాలరెడ్డి(బంగోరె), కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం, డా.వి.యస్.క్రిష్ణ, అమంచర్ల గోపాలరావు, పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, శ్రీవాత్సవ(యండమూరి సత్యనారాయణ), యామినీ కృష్ణమూర్తి, తుమ్మల సీతారామమూర్తి, మొక్కపాటి కృష్ణమూర్తి, ఐ.వి.యస్.అచ్యుతవల్లి, భుజంగరాయశర్మ, కాశీ కృష్ణమాచార్యులు, బాల సరస్వతి, వెంపటి చినసత్యనారాయణ, లింగం వీరభద్రయ్య, బుచ్చిబాబు దంపతులు, అమరేంద్ర, నాజర్, సి.వి.యన్. ధన్, డాక్టర్ ముల్క్ రాజ్ ఆనంద్, డాక్టర్ నీహార్ రంజన్ రాయ్, లేడీ రాణీ ముఖర్జీ, కాళోజీ, ఖలీల్ జిబ్రాన్, వేణుగోపాలరావు, కొండముది శ్రీరామచంద్రమూర్తి, ముత్తేవి లక్ష్మణదాసు, జానకీ జాని, సామవేదం జానకీరామ శర్మ, వెలమాటి శ్రీమన్నారాయణమూర్తి, వెలమాటి పద్మనాభం, డా. సి.నారాయణరెడ్డి, వకుళాభరణం రామకృష్ణమాచార్యులు, జి.డి.నాయుడు, మొదలైన మహానుభావులు ఎంతో మంది మనకు ఈ పుస్తకం ద్వారా పరిచయం అవుతారు.
సంజీవ దేవ్ గారు వారి పరిచయస్థులతోనూ, స్నేహితులతోనూ విరివిగా ఉత్తర ప్రత్యుత్తరాలు నడపేవారు. మన టైములో మనం ఆ ప్రక్రియనే పూర్తిగా మర్చిపోయామనిపిస్తుంది. ఎస్పరాంటో భాష అని ఒక ప్రపంచజనులందరికీ ఉపయోగపడే భాషను గూర్చి కొంత వివరణను ఇచ్చారు సంజీవదేవ్. దీనిలో ఒకే వ్యాకరణ నియమం అపవాదాలు లేకుండా సర్వత్రా వినియోగపడుతుంది. మొత్తం 16 వ్యాకరణసూత్రాలతో ఈ భాషను నేర్చుకోవచ్చు. ఈ భాషను అభ్యసించటం చాలా సులభం. ఈ భాషను డాక్టర్ జామెన్ హోవ్ అనే రష్యన్ లిథుయేనియన్ సృష్టించాడట.
సంజీవ్ దేవ్ గారు వ్రాసిన పుస్తకాలు 1. రసరేఖలు, 2.సంజీవ దేవ్ లేఖలు
శ్రీమతి మాలతీ చందూర్ గారు ఒకచోట గ్రంధపఠనం అభ్యాసం చెయ్యాలనుకొనేవారికి ఓ సలహా ఇచ్చారు. అదేమిటంటే మనం ఏదైనా ఓ పుస్తకం చదివినప్పుడు ఆ రచయిత తన పుస్తకంలో ఉదాహరించిన గ్రంథాలను ఓ చోట రాసిపెట్టుకొని ఉంచుకుంటే మన తర్వాతి జీవితకాలంలో ఆ గ్రంథాలు మనకు తారసపడినప్పుడు చదువుకోవచ్చునూ అని. ఎందుకంటే ఏ రచయితా తన గ్రంథంలో సాధారణంగా తన కంటే గొప్పవారి రచనలనే ఉదాహరిస్తూ ఉంటాడు. అందుచేత మనకు మంచి పుస్తకాలు చదివే సౌకర్యం కలుగుతుంది అని. సంజీవ దేవ్ గారు కూడా తన పుస్తకంలో చాలా గ్రంథాలను ఉదాహరించి ఉన్నారు. అవి మన పాఠకుల సౌకర్యార్థం ఇక్కడ ఇస్తున్నాను.
The Golden Book of Tagore —Ravendranath Tagore
- Mystic India – Smt. Sas Brunner
- Art and Meditation – అనాగరిక గోవింద(జర్మన్ భిక్షువు)
- The Cultural Heritage of India (3 volumes)
- గీత గోవిందం (సంస్కృతం) – జయదేవుడ
- Saint Serjious – Shibayev
- Grey Eminence – Aldous Huxley
- Love Poems in Hindi – O.C Ganguly
- హంపి పిలుపు – గొర్రెపాటి వెంకట సుబ్బయ్య
- Travel Dairy of a Philosopher – Count Herman Kezar Ling
———–