పేరు (ఆంగ్లం) | Ponaka Kanakamma |
పేరు (తెలుగు) | పొణకా కనకమ్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | కమ్మమ్మ |
తండ్రి పేరు | మరువూరు కొండారెడ్డి |
జీవిత భాగస్వామి పేరు | పొణకా సుబ్బరామి రెడ్డి |
పుట్టినతేదీ | 6/10/1892 |
మరణం | 9/15/1963 |
పుట్టిన ఊరు | మినగల్లు, ఆంధ్ర ప్రదేశ్ |
విద్యార్హతలు | – |
వృత్తి | సంఘ సంస్కర్త |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | జ్ఞాననేత్రము, ఆరాధన, నైవేద్యము-గీత, రమణగీత, శ్రీరమణ గురుస్తవము, ఆంధ్రస్త్రీలు వీటిలో కొన్ని అముద్రితములు అలభ్యములు. కనకపుష్యరాగం (పొణకా కనకమ్మ స్వీయచరిత్ర) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | 1955లో గృహలక్ష్మి స్వర్ణకంకణము స్వీకరించారు. |
ఇతర వివరాలు | సుప్రసిద్ద సంఘసేవిక. ఈమె నెల్లూరు పట్టణంలో గల కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు. గొప్ప సంఘ సంస్కర్త ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారిలో మహిళలే ఎక్కువ. అటువంటి మహిళలలో చెప్పుకోదగ్గ వ్యక్తి కనకమ్మ గారు. తనతో పాటు తన కుటుంబము మొత్తం సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా చేసింది. ఖద్దరు ప్రచారం చేసింది. నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది. రాజకీయరంగంలో వీరికి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మగారి సహకారం లభించింది. 1930 లో సత్యాగ్రహసందర్భంలో జైలుకు వెళ్ళారు. కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పొణకా కనకమ్మ |
సంగ్రహ నమూనా రచన | కొన్నాళ్ళక్రితం ముదిగంటి సుజాతారెడ్డిగారి ఆత్మకథను పరిచయం చేస్తూ తెలుగులో స్త్రీల ఆత్మకథలు తక్కువ అన్నాను. వారం తిరక్కుండానే ఇంకో ఇద్దరు మహిళల ఆత్మకథలు పుస్తకాలుగా వచ్చాయని తెలిసింది. అప్పుడే శిలాలోలిత గారు తమ బ్లాగులో పొణకా కనకమ్మగారి స్వీయచరిత్రను పరిచయం చేశారు. ఆ పుస్తకం విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లో దొరికింది. సంపన్న, సంప్రదాయ కుటుంబంలో ఆ కాలంలో పుట్టి పెరిగిన కనకమ్మగారు రచయిత్రిగా, స్వాతంత్ర్యపోరాటయోధురాలిగా, మహిళావిద్యావేత్తగా తన జీవితాన్ని గడపిన క్రమం చాలా ఆశ్చర్యకరం. |
పొణకా కనకమ్మ
కొన్నాళ్ళక్రితం ముదిగంటి సుజాతారెడ్డిగారి ఆత్మకథను పరిచయం చేస్తూ తెలుగులో స్త్రీల ఆత్మకథలు తక్కువ అన్నాను. వారం తిరక్కుండానే ఇంకో ఇద్దరు మహిళల ఆత్మకథలు పుస్తకాలుగా వచ్చాయని తెలిసింది. అప్పుడే శిలాలోలిత గారు తమ బ్లాగులో పొణకా కనకమ్మగారి స్వీయచరిత్రను పరిచయం చేశారు. ఆ పుస్తకం విజయవాడ బుక్ ఎగ్జిబిషన్లో దొరికింది. సంపన్న, సంప్రదాయ కుటుంబంలో ఆ కాలంలో పుట్టి పెరిగిన కనకమ్మగారు రచయిత్రిగా, స్వాతంత్ర్యపోరాటయోధురాలిగా, మహిళావిద్యావేత్తగా తన జీవితాన్ని గడపిన క్రమం చాలా ఆశ్చర్యకరం.
“తెలుగునాట ఆడవాళ్ళు స్వీయచరిత్ర వ్రాసుకోవడము ఎక్కడైనా ఉండవచ్చును కానీ, అంతగా లేదు. ఆ భాగ్యము నాకు లభించినందుకు గర్వపడుచున్నాను.స్త్రీలకు సమర్థత లేక కాదుకానీ వారు బయట సంచరిటము తక్కువ” అంటూ తన స్వీయచరిత్రను కనకమ్మగారు 1959 జనవరి15న మొదలుబెట్టి 1960 సెప్టెంబరు 20న ముగించినా, ఏ కారణాలచేతో కాని, 2011 వరకూ అముద్రితంగానే ఉండిపోయింది. నెల్లూరులో విశ్రాంతజీవనం గడుపుతున్న డాక్టర్ కాళిదాసు పురుషోత్తం గారు పనిగట్టుకొని ఈ వ్రాతప్రతిని సంపాదించి, సంస్కరించి, కనకమ్మగారి గురించి ఇతర విషయాలను సేకరించి శ్రద్ధగా ప్రచురించారు.
కనకమ్మగారు 1892 జూన్ 10వతేదీన నెల్లూరుజిల్లా మినగల్లులో పుట్టారు. మడమనూరులో, పోట్లపూడిలో పెరిగారు. తండ్రి మరుపూరు కొండారెడ్డి, అమ్మ కామమ్మ. తాతలు కోడెల వ్యాపారులు. పడమటి బేరగాండ్రు ఇల్లంతా కంబళ్ళు పరచి వాటి మీద వెండిరూపాయలు కుప్పలు కుప్పలుగా పోసుకొని లెక్కపెట్టుకునేవారట. మేనమామ పొణకా సుబ్బరామిరెడ్డిగారితో ఆమెకు తొమ్మిదవ ఏట వివాహమయ్యింది. పోట్లపూడిలోనే కాపురం. జిల్లాలోని పెద్ద కుటుంబాలలో ఒకటి. 800 ఎకరాల పొలం; 500 ఆవులుండేవట. కోడెదూడల మీద సంవత్సరానికి పదివేలరూపాయల ఆదాయం, 20,30 వేల రూపాయల ధాన్యం రాబడి. వారి అవ్వ మరణించినప్పుడు పదిపుట్ల అన్నప్రదానము చేశారట; వచ్చినవారికి “త్రాగటానికి నీరుపోసే అవకాశము లేక వీధులలో కాలువలు త్రవ్వి నీరు పారించినారు”. అన్నప్రదానము చేయుటలో సుబ్బరామిరెడ్డిగారికి పెట్టింది పేరు.
కనకమ్మ గారు చిన్నతనంలో చదువుకోలేదు. తర్వాత స్వయంకృషి వల్ల చదువుకున్నారు. క్రమంగా కావ్యాలు, సంస్కృతము, హిందీ నేర్చుకున్నారు. శశిరేఖ, హిందూసుందరి, అనసూయ పత్రికలకు పద్యాలు, వ్యాసాలు పంపేవారు, చెట్టునీడ ముచ్చట్లు పేర ఆమె హిందూసుందరిలో వ్రాసిన వ్యాసాలకు మంచి గుర్తింపు వచ్చింది.
పోట్లపూడిలో కనకమ్మగారు సోదరులు, మరదులు, నెల్లూరు రామానాయుడు (తర్వాత జమీన్‌రైతు పత్రిక సంపాదకుడిగా ప్రసిద్ధుడు), మరికొందరితో కలసి 1913లో సుజనరంజనీ సమాజం స్థాపించి గ్రంథాలయము, సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. రాయప్రోలు సుబ్బారావు, దువ్వూరి రామిరెడ్డి వంటివారు సమాజ కార్యక్రమాలకు వచ్చేవారు. నెమ్మదిగా సమాజంలోకి రాజకీయ భావాలు వచ్చాయి. మద్రాసునుంచి రివాల్వరులు తెప్పించి వాటిని పేల్చడం ప్రాక్టీసు కూడా చేశారు. వెన్నెలకంటి రాఘవయ్యగారు పూనాలో తిలక్‌నీ, మద్రాసులో చిదంబరం పిళ్ళేని కలసివచ్చారు. స్వదేశీ వస్త్రాలు ధరించటం, హరిజనవాడల్లో సేవాకార్యక్రమాలు చేయడం మొదలుబెట్టారు. 1917లో నెల్లూరులో జరిగిన ఆంధ్రమహాసభలో ఆంధ్రరాష్ట్ర తీర్మానం చేశారు. నెమ్మదిగా ఆ ప్రాంతంలో జాతీయోద్యమంలో కనకమ్మగారి పాత్ర పెరగటం మొదలయ్యింది. పెద్దపెద్ద నాయకులందరూ వారి ఇంటనే బస చేసేవారు. గాంధీజీ, బిపిన్‌చంద్రపాల్, రాజేంద్రప్రసాద్, ప్రకాశం పంతులు, కాశీనాధుని నాగేశ్వరరావు వంటి జాతీయ, రాష్ట్రీయ నాయకులు వారి ఆతిథ్యం స్వీకరించిన వారే. గోగినేని రంగా, బెజవాడ గోపాలరెడ్డి, దుర్గాబాయి దేశముఖ్ వంటివారు సన్నిహితంగా ఉండేవారు.
ఈ కార్యక్రమాలలో నెమ్మదిగా ఆస్తులు తరగటం ప్రారంభమయింది. వెంకటగిరి రాజాతో ఇబ్బందులు మొదలయ్యాయి. వారి కుటుంబం జమీందారుకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది. ఆ పోరాటంలో భాగంగానే జమీన్‌రైతు పత్రిక ఆవిర్భవించింది. ఇతరులు కూడా మోసం చేశారు. నివాసం పోట్లపూడినుంచి, పిడూరుకూ, అక్కడి ఆస్థీ పోయాక నెల్లూరుకూ మారింది. మోసం చేసినవారిగురించి, తర్వాత రోజుల్లో ఇబ్బందులు పెట్టిన వారి గురించి అవసరమైనదానికన్నా తక్కువ పరుషంగా మాట్లాడారు ఈ ఆత్మకథలోలో. ఆత్మస్థుతీ, పరనిందా రెండూ తక్కువే. పిడూరులో జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లంతా కాలిపోయి భారీనష్టం జరిగింది. పుస్తకాల బీరువా (కొన్ని అముద్రిత పుస్తకాలతో సహా) కాలిపోయింది. ఇల్లు పోయినదానికన్నా పుస్తకాల బీరువా పోయినందుకు ఎక్కువ బాధపడ్డాను అని అన్నారు కనకమ్మ గారు.
కనకమ్మగారు నెల్లూరు స్త్రీల కాంగ్రెస్ సంస్థను స్థాపించి స్వాతంత్ర్యపోరాటంలో అనేక ఉద్యమాలు నిర్వహించారు. రెండుసార్లు జైలుకు కూడా వెళ్ళారు. గాంధీజీ వచ్చినప్పుడు ఆమె, ఆమె కుమార్తె వెంకటసుబ్బమ్మ తమ వంటిపై నగలన్నీ కాంగ్రెస్ నిధికి ఇచ్చారు. 1934లో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్‌కు ఉపాధ్యక్షులుగా ఎన్నికయిన మొదటి మహిళ కనకమ్మ గారు.
కనకమ్మగారి కుమార్తె చిన్న వయస్సులో మరణించారు. రమణ మహర్షి, ఆయన శిష్యుడు రామయోగుల దగ్గర కనకమ్మగారు దుఃఖోపశమనమనం పొందారు. వారి ఆశ్రమాలలో చాలాకాలం ఉన్నారు. ఆధ్యాత్మిక పుస్తకాలు రచించారు.
ఆడపిల్లలకోసం ప్రత్యేకంగా కస్తూరి విద్యాలయం స్థాపించారు. గాంధీజీ ఈ స్కూలు భవనానికి శంకుస్థాపన చేశారు. కుల మత వివక్ష లేకుండా ఆడపిల్లలకు హాస్టల్ వసతి కల్పించి చదువు చెప్పించేవారు. ప్రభుత్వగ్రాంటులులేకుండా, జాతీయోద్యమంలో భాగంగా, ఆదర్శపాఠశాలగా నడిపారు. ఆమె జైలుకు వెళ్ళినప్పుడు పాఠశాల మూత పడిపోయింది. మళ్ళీ 1944లో పాఠశాలను తిరిగి ప్రారంభించారు. తర్వాత బాలికలకోసం ఒక పారిశ్రామిక పాఠశాలను కూడా మొదలుబెట్టారు. వీటి నిర్వహణకోసం నిధులను ఆమే నాటక ప్రదర్శనలు నిర్వహించి, ఇతరత్రా కష్టపడి సంపాదించేవారు. కస్తూరి విద్యాలయ నిర్వహణనుంచి ఆమెను తప్పించటం ఆమె చరమాంకంలో విషాదఘట్టం. ఆరోగ్యం క్షీణించి, ఇబ్బందులు పడుతూనే స్వీయచరిత్రను ముగించి, 1963 సెప్టెంబరు 15న మరణించారు.
ఈ పుస్తకం చదువుతుంటే ఆరోజుల్లో ఆంధ్రదేశంలో హేమాహేమీలు అనదగ్గ వారందరితోనూ కనకమ్మగారికి సన్నిహిత పరిచయాలున్నట్టు తెలుస్తుంది. కాశీనాథుని, రాయప్రోలు, దువ్వూరి రామిరెడ్డి, వెన్నెలకంటి రాఘవయ్య, సి.ఆర్.రెడ్డి, మోటూరి సత్యనారాయణ, రంగా, నార్ల వంటివారితో మొదలుబెట్టి, సినిమానటులవరకూ అందరూ ఆమెకు పరిచయమే.
ఆవిడ చాలా కథలు, వ్యాసాలు, పద్యాలు వ్రాశారట (కొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి). ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మతో కలసి జంట కవిత్వం చెప్పేవారట. కనకమ్మగారిని 1955లో గృహలక్ష్మి స్వర్ణకంకణంతో సత్కరించారు. అంతకు ముందే 1939లో గృహలక్ష్మి స్వర్ణకంకణ ప్రదానోత్సవ సభలో ఆమె చేసిన అధ్యక్షోపన్యాసం చదువుతున్నప్పుడు, ఆమె విషయ పరిజ్ఞానానికి, ఆధునిక ఆలోచనావిధానానికి ఆశ్చర్యం వేస్తూంది.
నెల్లూరు రాజకీయ సాంఘిక చరిత్రతో ఇంతగా ముడివడ్డ పొణకా కనకమ్మగార్ని నెల్లూరు పట్టణం ఎందుకో మరచిపోయింది. పొణకా కనకమ్మ బాలికల పాఠశాల మాత్రమే నెల్లూరులో ఆవిడ జ్ఞాపకం. ముప్పై ఏళ్ళ క్రితం తయారుచేసిన ఆమె కాంస్యవిగ్రహం ఇప్పటికీ ప్రతిష్టించకుండా ఏదో స్కూల్లో మూల గదిలో ఉందట.
ఈ పుస్తకానికి సంపాదకత్వం వహించిన డా. కాళిదాసు పురుషోత్తం గారు విపులమైన ముందు మాట వ్రాశారు. ఈ జీవిత చరిత్రలొ ప్రస్థావించబడ్డ వారి వివరాలు అధోజ్ఙాపికలలో తెలపటానికి ప్రయత్నించారు. ఇందాక చెప్పిన కనకమ్మ గారి అధ్యక్షోపన్యాసమే కాక ఆమె గురించి ఇతరులు (గోగినేని రంగా, భారతీ రంగా, వెన్నెలకంటి రాఘవయ్య వగైరాలు) వ్రాసిన వ్యాసాలను చేర్చారు. వీటికితోడు, పెన్నేపల్లి గోపాలకృష్ణగారు ధర్మాగ్రహంతో వ్రాసిన పరిచయమూ ఉంది. 15 పుటలకుపైగా ఫొటోలు ఉన్నాయి – గాంధీజీ నెల్లూరు పర్యటన ఫొటఓలతో సహా (పాత పొటోల నాణ్యత అంత బాగోలేదనేది వేరే విషయం). పుస్తకం అందంగా ముద్రించబడింది. అచ్చు తప్పులు దాదాపుగా లేనట్లే. ఈ పుస్తకం వ్రాతప్రతి సంపాదించటమే కాక, సంపాదకులు నిర్వర్తించవలసిన బాధ్యతలని నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహించిన డా. పురుషోత్తం గారికి నమస్కారాలు, అభినందనలు, కృతజ్ఙతలు.
నేను పుట్టిపెరిగిన చాటపర్రుకు కనకమ్మ గారు, అవసాన దశలో ఉన్న ఆమె మిత్రురాలు, గాంధీజీ అనుచరురాలు మాగంటి అన్నపూర్ణాదేవిని చూడడానికి వచ్చారని తెలిసి కొద్దిగా ఆనందం వేసింది. అన్నపూర్ణమ్మగారి తల్లి కలగర పిచ్చమ్మ గారు కనకమ్మగారు ఒకే సమయంలో కన్ననూరు జైలులో ఉన్నారు.
చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారు తప్పకుండా చదవవలసిన పుస్తకం.
తెలుగు నారీమణులలో కనకమ్మగారు కనకపుష్యరాగమే!
జంపాల చౌదరి
స్వతంత్ర భారతావని కోసం అసువులుబాసినవారిలో ఎందరో మహానుభావులు ఉన్నారు. పురుషులతో పాటు మహిళలు కూడా సమానంగా పోరాట పటిమను ప్రదర్శించారు. గతించిన కాలం వలే వారందరినీ మరచిపోతున్నాం. కాని ఆ త్యాగధనుల త్యాగంతో నేడు మనదేశం సూర్యుని వలే వెలుగొందుతుంది. వారి పోరాటం నేటి తరానికి ఆదర్శం. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారిని స్మరించుకోవటం మన కనీస ధర్మం. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా నుంచి తొలి మహిళా స్వాతంత్ర పోరాట యోధురాలిగా చరిత్ర పుటల్లో నిలిచిన పోనక కనకమ్మ గురించి ఎంతమందికి తెలుసు అంటే నేటి తరానికి తెలియదు. కాని ఆమె జ్ఞాపకంగా నిలిచిన కస్తూరిదేవి విద్యాలయం వద్దకు వెళితే ఆమె పోరాట జీవితం కళ్లముందు కదలాడుతుంది. ఆ రోజుల్లోనే ఆడపిల్లల చదువుకోసం, వారి ఆర్థిక స్వాతంత్య్రం కోసం ఆమె కృషి చేశారు. ఎంతోమంది ఆడపిల్లలు ఈ విద్యాలయంలో చదువుకుని ఉన్నతలుగా ఎదిగారు.
నెల్లూరులోని మినగల్లు గ్రామంలో మరుపూరు కొండారెడ్డి, కమ్మమ్మ దంపతులకు కనకమ్మ 1892లో జన్మించారు. పుట్టింది పెద్ద భూస్వామ్య కుటుంబంలోనే. కాని చిన్నతనం నుంచి ఆ గ్రామంలోని హరిజనుల కోసం ఆమె పాటుపడ్డారు. మహాత్మాగాంధీ అనుచరురాలిగా పేరొందిన కనకమ్మ 1913లో ‘సుజన రంజని సమాజం’ ఏర్పాటుచేసి హరిజనోద్ధరణకు కృషిచేశారు. 1921 ఏప్రిల్ 7వ తేదీన గాంధీజీ పల్లెపాడు గ్రామంలో ‘పినకాని సత్యాగ్రహ ఆశ్రమం’ ఏర్పాటుచేయగా దానికి 13 ఎకరాల భూమిని ఇచ్చారు. అంతేకాదు గాంధీజీ పిలుపునందుకుని సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలోనూ పాల్గొన్నారు. రాయవెల్లూరు జైలులో బ్రిటిషువారు ఆమెకు జైలుశిక్ష విధించినా వెరవక అనుభవించారు. నెల్లూరులో కనకమ్మ చేస్తున్న స్వాతంత్య్ర ఉద్యమం గురించి తెలుసుకున్న బిపిన్ చంద్రపాల్ 1907లో నెల్లూరు సందర్శించి ఆశీర్వదించారు.
ఆరోజుల్లోనే బాలికా విద్య ప్రాధాన్యతను గుర్తించిన కనకమ్మ నెల్లూరులో కస్తూరిదేవి విద్యాలయాన్ని స్థాపించారు. ఈ పాఠశాల భవనానికి 1929లో గాంధీజీ పునాదిరాయి వేశారు. ఈ విద్యాలయం 23 ఎకరాల భూమిని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కొన్నాళ్లు పనిచేసిన కనకమ్మ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేశారు.
రమణమహర్షి భక్తురాలు
కనకమ్మ రమణ మహర్షి భక్తురాలు. కనకమ్మ ఏకైక కుమార్తె వెంకటసుబ్బమ్మ కూడా రచయిత్రి, సామాజిక కార్యకర్త. బిడ్డి మరణానంతరం కూడా కుంగిపోకుండా కనకమ్మ తన సేవాకార్యక్రమాలను కొనసాగించారు. జమీన్ రైతు అనే తెలుగు వార పత్రికను స్థాపించి జమీన్ రైతు ఉద్యమానికి తోడ్పాటునందించారు. ఈ ఉద్యమంలోనే ఆమె తన ఆస్థినంతంటిని పోగొట్టుకున్నారు. అయినప్పటికీ తల్లి బాటలో నడిచిన వెంకట సుబ్బమ్మ మహిళల కోసం ఇండ్రస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్‌ను నెలకొల్పి మహిళలకు ఉపాధి శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు కృషిచేశారు. కనకమ్మ కోసం ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు, రచయితలు వచ్చేవారు. వారితో ఆ ఇంట దేశభక్తి ఉప్పొంగేది. పేరు కోసం కాకుండా దేశభక్తితో తన సేవా కార్యక్రమాలను చనిపోయేవరకు కొనసాగించిన కనకమ్మను మరో దేశభక్తురాలు దుర్గ్భాయి దేశ్‌ముఖ్ చేతుల మీదుగా స్వర్ణకంకణ సన్మానాన్ని అందుకున్నారు. ఇలా చిరుప్రాయం నుంచే దేశ సేవలో అడుగుపెట్టి కడవరకు అదే బాటలో పయనించిన కనకమ్మ 2011 సెప్టెంబర్ 15న కన్నుమూశారు. ఈనాడు నెల్లూరులో ఆమె గురించి తెలుసుకోవాలంటే ఆడపిల్లల విద్య కోసం ఆమె స్థాపించిన కస్తూరీదేవి పాఠశాల జ్ఞాపకంగా మిగిలింది. *
ఆరోజుల్లోనే బాలికా విద్య ప్రాధాన్యతను గుర్తించిన కనకమ్మ నెల్లూరులో కస్తూరిదేవి విద్యాలయాన్ని స్థాపించారు. ఈ పాఠశాల భవనానికి 1929లో గాంధీజీ పునాదిరాయి వేశారు. ఈ విద్యాలయం 23 ఎకరాల భూమిని ఇచ్చారు.
———–