పేరు (ఆంగ్లం) | Janamanchi Ramakrishna |
పేరు (తెలుగు) | జనమంచి రామకృష్ణ |
కలం పేరు | |
తల్లిపేరు | |
తండ్రి పేరు | |
జీవిత భాగస్వామి పేరు | |
పుట్టినతేదీ | |
మరణం | |
పుట్టిన ఊరు | |
విద్యార్హతలు | |
వృత్తి | మదరాసు కేంద్రంలో స్టాఫ్ ఆర్టిస్టు |
తెలిసిన ఇతర భాషలు | |
చిరునామా | |
ఈ-మెయిల్ | |
ఫోను | |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | |
స్వీయ రచనలు | కథలు: అద్దము, అర్హత, ఆతిథ్యము, గేదె పోయింది, పూలబాసలు |
ఇతర రచనలు | |
ఈ-పుస్తకాల వివరాలు | |
పొందిన బిరుదులు / అవార్డులు | |
ఇతర వివరాలు | |
స్ఫూర్తి | |
నమూనా రచన శీర్షిక | జనమంచి రామకృష్ణ గేదె పోయింది |
సంగ్రహ నమూనా రచన | ‘‘అయ్యగారూ మన గేదె ఇంటికి రాలేదు, బాబూ ఎతికి ఎతికి ఆఖరికి ఇంటికొచ్చేసిందేమో నని గొడ్లసాల్లో సూస్తే సినబోయి ఉంది, బాబయ్యా’’ అంటూ మంత్రిగారి పాలేరాడు వెంకన్నభోరున ఏడుస్తూ నిలబడ్డడు. ‘‘దాన్ని అంటిపెట్టుకునే ఉండరా అని ఎన్నిసార్లు చెప్పినా వినవుగా ఎక్కడికి పోయిందో ఏమో. దేవుళ్ళనీ, మనుషులనీ ఎత్తుకు పోతూన్న వాళ్ళు పశువుల్ని వదులుతారా? అందులో మన గేదె మీద ఎందరు కళ్ళెశారని.’’ ‘‘బాబూ రావుడు లేడండీ?’’ |
జనమంచి రామకృష్ణ
గేదె పోయింది
‘‘అయ్యగారూ మన గేదె ఇంటికి రాలేదు, బాబూ ఎతికి ఎతికి ఆఖరికి ఇంటికొచ్చేసిందేమో నని గొడ్లసాల్లో సూస్తే సినబోయి ఉంది, బాబయ్యా’’ అంటూ మంత్రిగారి పాలేరాడు వెంకన్నభోరున ఏడుస్తూ నిలబడ్డడు.
‘‘దాన్ని అంటిపెట్టుకునే ఉండరా అని ఎన్నిసార్లు చెప్పినా వినవుగా ఎక్కడికి పోయిందో ఏమో. దేవుళ్ళనీ, మనుషులనీ ఎత్తుకు పోతూన్న వాళ్ళు పశువుల్ని వదులుతారా? అందులో మన గేదె మీద ఎందరు కళ్ళెశారని.’’
‘‘బాబూ రావుడు లేడండీ?’’
‘‘ఎవడోలే భీముడు. ఏమైంది? వాడి మీద అనుమానమా? చెప్పరా? పోలీసులకి ఫోను చేసి వెధవని బొక్కలో తోయిస్తా.’’
‘‘కాదు, బాబయ్యా ఆడి రెండు మేకపిల్లల్ని ఎవరో వచ్చి నిమిట్లో ఆటోలో ఎక్కించుకు పారిపోయార్ట.’’
‘‘మన గేదె మేకపిల్ల కాదు గదరా ఆటోలో ఎక్కించుకు పోవడానికి?… వెంకన్నా పార్థసారధిని ఇలా రమ్మను.’’
‘‘సిత్తం, బాబయ్యా.’’
‘‘ఏం లేదు, పార్థసారదీ మేత కెళ్లిన మన గేదె ఇంటి కింతవరకూ రాలేదని పాలేరాడు నెత్తీ నోరూ బాదుకుని ఏడుస్తున్నాడు. పోలీసులకి ఫోను చెయ్యి తర్వాత. రేడియో స్టేషను డైరెక్టరుకి మన గేదె తప్పిపోయినట్లు చెప్తూ వివరాలన్న ఇయ్యి. రేడియోలో వెంటనే జరుగుతూన్న కార్యక్రమాన్ని ఆపి ఈ ప్రకటన చేయించమను.’’
‘‘ఎస్, సార్.’’
మంత్రిగారి పి.ఎ. పార్థసారధి రేడియో స్టేషను డైరెక్టరుకి ఫోనుచేసి గేదె వివరాలు ఇచ్చాడు.
‘‘ఆకాశవాణి ఒక ముఖ్య ప్రకటన మన మంత్రిగారి గేదె పోయింది. మేతకి వెళ్ళిన గేదె తిరిగి సాయంత్రానికి ఇల్లు చేరుకోలేదు. పాలేరాళ్ళూ, కార్యదర్శులూ, పశు సంవర్ధక శాఖ వారూ, మంత్రిగారి ఆశ్రీతులూ, హితులూ, శ్రేయోభిలాషులూ అందరూ పలుమూలలా గాలించారు. ప్రయోజనం లేకపోయింది. మంత్రిగారు పనులన్నీ మానుకుని ఒకసారి బెంగతో, మరొక సారి ఉగ్రరూపంలో ఉన్నారు. పోయిన గేదె వివరాలు : పొట్టిగా, కురచగా ఉంటుంది. గచ్చకాయ కళ్ళు. వాడి కొమ్ములు. తోక అంత పొట్టీ కాదు, పొడుగూ కాదు. తోక చివర వెంట్రుకల కుచ్చు తెల్ల తెల్లగా ఉంటుంది. మాంచి ఠీవిగా నడుస్తుంది. ఆచూకీ తెలిసినా, పట్టుకు తీసుకొచ్చి అప్పజెప్పినా మంత్రిగారు తృణమో పణమో ముట్టచెబుతారు… ప్రకటన సమాప్తం. తర్వాత కార్యక్రమం వెంటనే ప్రారంభమవుతుంది.’’
పార్థసారథికి దూరదర్శన్ కేంద్రం డైరెక్టరు దగ్గిరినించి ఫోనొచ్చింది.
‘‘ఎస్ అవునండి. పార్థసారధినే. బాగున్నారా, డైరెక్టరుగారూ.’’
‘‘నేను బాగానే ఉన్నాను సరే. ఇప్పుడే రేడియోలో ఒక విషాద వార్త విన్నాడు. ఏమిటి? మంత్రిగారి గేదె పోయిందట. ఎలా పోయిందండి? మంత్రిగారి గేదెను ఎవరు దొంగిలించి ఉంటారు?’’
‘‘అదే తెలియడం లేదు. పోలీసులు కూడా నిద్రాహారాలు లేకుండా గాలిస్తున్నారు.’’
‘‘ఒక పని చేస్తే మంచిదండి. రేడియోలో గేదె వివరాలు చెప్పించారనుకోండి. దూరదర్శన్‌లో గేదె ఫోటో చూపిస్తూ వివరాలు చెప్పడమే కాకుండా, మంత్రిగారు స్వయంగా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తే బాగుంటుందనుకుంటాను. మంత్రిగారికి ఈ సలహా ఇచ్చి చూడండి. ఆయన ‘వూఁ’ అంటే నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను.’’
‘‘సరే. మీది మంచి సూచనండి, డైరెక్టరు గారూ. మీకెందుకు? మీరు అన్ని ఏర్పాట్లూ చేయించండి. నేను మంత్రిగారిని తీసుకొస్తా.’’
పార్థసారధి మంత్రిగారి దగ్గరి కెళ్ళి దూరదర్శన్ డైరెక్డరు చేసిన సూచన విన్నవించుకున్నాడు. మంత్రిగారి వదనార విందంలో మందహాసం తళుక్కుమంది.
‘‘పార్థసారధీ నాకు తోచనేలేదుస్మా. దూరదర్శన్‌తో మన గేదె కలర్ ఫోటో చూపిద్దాము నడు.’’
మంత్రిగారి పి.ఎ. పార్థసారధితో దూరదర్శన్ కేంద్రానికి వెళ్ళగానే దూరదర్శన్ సిబ్బంది స్వాగతం పలుకుతూ ఎక్కడలేని సానుభూతి ప్రకటించారు.
‘‘ఈ నాటి కార్యక్రమాలు ప్రారంభమయే ముందు, వారి గేదె పోయిన సందర్భంలో మంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి సందేశ మిస్తారు.’’
‘‘మిత్రులారా మేము చాలా విచారగ్రస్తులమై ఉన్నాము. మా ముద్దుల గేదె మామూలుగా ఉదయమే మేతకు వెళ్ళింది. ఇంతవరకూ ఇల్లు చేరలేదు. దానికీ మాలాగా, మీలాగా టి.వి. చూడడం అలవాటు. దానికోసం ప్రత్యేకంగా గొడ్లసాలలో ఒక టి.వి. సెట్టును అమర్చాము కూడా. దూరదర్శన్ కార్యక్రమాలు జనరంజకమే కాకుండా పశురంజకంగా ఉంటున్నాయంటే దూరదర్శన్ అధికారులను మన మెంతైనా అభినందించాల్సిందే.
అసలు విషయాని కొద్దాము. ఇందాకా విన్న వించుకున్నాను విషాద వార్త మా గేదె తప్పిపోయింది. ఇది ప్రతిపక్షం వాళ్ళు కక్షతో చేసినవో. అంతగా వారికి మాపై, మా పార్టీపై కక్ష ఉంటే మేము బలాబలాలు చూసుకుందుకు సంసిద్ధులమై ఉన్నాము. ఒక నోరు లేని జంతువు మీద పగ సాధించడం చేతకానితనమే అంటాము. ఇదిగో ఈ కలర్ ఫోటోలో ఉన్నదే మా గేదె. ఎనౌన్సరూ గేదె గురించి నాతో పరిచయం కానీ…’’
‘‘నమస్కారం, మంత్రిగారూ.’’
‘‘వూఁ.’’
‘‘తమ గేదె పోయినందుక దూరదర్శన్ కేంద్రం తరపున మా సానుభూతి.’’
‘‘దూరదర్శన్ ప్రేక్షకులకు మా గేదె వివరాలు చెప్పండి.’’
‘‘ఈ ఫోటోలో కనిపిస్తున్నదే మన మంత్రిగారి గేదె. కలర్లో ఎంత అందంగా ఉందో చూశారా. అందుకే మన కేంద్ర మంత్రిగారు కలర్ టి.వి. వల్ల…’’
‘‘నాకు టైమవుతూంది. గేదె గురించి వివరాలు త్వరగా వర్ణించవయ్యా.’’
‘‘ ఫోటోలో ఉన్న గేదె మన మంత్రిగారిది… మంత్రిగారూ కర్రతో గేదె కళ్ళు చూపించండి.’’
మంత్రిగారు గేదె కళ్ళు చూపించగానే ‘‘అవి మంత్రిగారి గేదె కళ్ళు. అవి గచ్చకాయ రంగు కళ్ళు.. ఆఁ అడక్కుండానే మంత్రిగారు దయతో కొమ్ములు చూపిస్తున్నారు. చూశారా ఆ కొమ్ములు ఎంత వాడిగా ఉన్నాయో. అయినా మంత్రిగారి గేదె పరమ సాధువు. ఇక… తోక… అంత పొడుగూ కాదు, అంత పొట్టీ కాదు. తోక చివరి వెంట్రుకల కుచ్చు తెల్లతెల్లగా ఉంటుంది. మంత్రి గారి గేదె మాంచి ఠీవిగా ఉంటుంది. పొట్టిగా, కురచగా ఉంటుంది. అయ్యా మంత్రిగారూ పాలు…’’
‘‘ఏడు లీటర్లిస్తుంది.’’
‘‘మంత్రిగారి గేదె ఏడులీటర్ల పాలు ఇస్తుంది…’’
‘‘మహాజనులారా గేదె గురించి ఆచూకీ తెలిపినా, పట్టి తెచ్చి ఇచ్చినా మేము మంచి పారితోషికమిస్తాము.’’
ఇంతలో ఎవరో సౌంజ్ఞ చేయగానే ఎనౌన్సరు లోపలికెళ్ళి చీటీ తెచ్చి మంత్రి గారికి సమర్పించాడు. మంత్రిగారు చదువుకుని చికాకుపడ్డారు.
‘‘క్షమించాలి మంత్రిగారూ. గేదె దొరికిన సమాచారమా?’’
విసుక్కుంటూ, ‘‘కాదు. ఏముంది మీటింగుకి టైమైందని. అవును, రెండు గంటలాలస్యమైంది. అంతేగా. గేదెపోయి నేను విచారంలో ఉంటే మీటింగుకి ఆలస్యమైందని ఎందుకలా ఇదైపోతారో… అబ్బాయ్, ఎనౌన్సరూ వస్తా జైహింద్.’’
పి.ఎ. ను వెంట తీసుకుని మంత్రిగారు మీటింగుకి వెళ్ళారు.
‘‘మహాజనులారా త్వరగా రావాలనే అనుకున్నాను, ప్రయత్నించాను కూడా. తీరా బయల్లేదరబోతూండగా మా పాలేరాడు బాబూ మన గేదె మేత కెళ్ళి తిరిగి ఇంటికి రాలేదయ్యా’ అని భోరున ఏడుస్తూ నా కాళ్ళమీద పడ్డాడు. ఆ విషాద కారణం వల్ల రావడానికి కొంచెం ఆలస్యమైంది.
ఇకపోతే వికలాంగుల సంవత్సరం పురస్కరించుకుని ఎన్నొ రకాలుగా వికలాంగులకు పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ఎంతో కృషి సలుపుతుంది.
‘‘ఇది పురాణ కాలక్షేపం కాదు. చెక్కభజనలు చేయడానికి మన మిక్కడ సమావేశ మవలేదు. ప్రభుత్వ పరిపాన విధానాల గురించీ, బలహీన వర్గాల, పేద సాదల, అల్ప సంఖ్యాకుల ఉద్ధరణ గురించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము. క్లిష్టమైన పథకాలకు చర్చల ద్వారా రూపకల్పన చేయడానికి సమావేశమైనాము అని తమకు ప్రతిపక్షసభ్యులకు హెచ్చరిక చేస్తున్నాము.’’
‘‘ప్రభుత్వం వారు చేసే వాగ్ధానాలు ప్రతినిత్యం సభల్లో, సమావేశాల్లో వింటున్నాము. ఇప్పుడు మహా భారత గాథలోని ఉత్తర గోగ్రహణం కథ ప్రస్తుత పరిస్థితుల కన్వయించేలా కొంచెం మార్చి చెబుతాను. సావధానంగా వినమని గౌరవనీయ సభ్యులను కోరుతున్నాను. నే చెప్పే ముచ్చటైన కథలో గోవు బదులు గేదె ఉంటుంది. అది గోగ్రహణమైతే ఇది మహిషీ గ్రహణం’’ అని పరంధామయ్య అనగానే చప్పట్లు మిన్నుముట్టాయి.
‘‘సభాపతీ మన మంత్రిగారి పూర్వ గాథ బట్ట బయలైంది. ఆయన మంత్రి కాకపూర్వం పాలిచ్చే పశువులను మందీ మార్బలంతో దొంగిలించేవారు.’’
‘‘ఎవరు? ఎవరు’’ అంటూ సభ్యలు కోపంగా ప్రశ్నల వర్షం కురిపించారు.
‘‘కాస్త ఓపిక పట్టండి ఆ అద్భుతమైన అర్హతతో వారు ఈ వేళ మంత్రి అయి కూర్చున్నారు. ఈ మహా మంత్రులు తమ గేదె పోయిందని ఒక బక్కచిక్కిన అల్పసంఖ్యాక వర్గానికి చెందిన సత్తార్ సాయిబు గేదెను తమదని వారి గొడ్ల పాకలో కట్టించుకున్నారు. వాడు ఏడుస్తూ, నెత్తీ నోరూ బాదుకుంటూ చేసిన ఫిర్యాదు ఎవరూ ఖాతరు చేయలేదు. ఎవరు ఖాతరు చేస్తారు చెప్పండ. కంచే చేను మేస్తే కాపేమి చేయగలడు? లాగ మన ప్రభుత్వం వారు అపారమైన సేవ చేస్తున్నారు.’’ అని పరంధామయ్య గ్లాసుడు మంచినీళ్ళు తాగాడు.
‘‘పేరు చెప్పకుండా సభనే అపఖ్యాతి పాలు చేయడం మంచిదికా’’దని సభాపతి హెచ్చరించారు.
‘‘గేదె సొంత విషయం. సొంత విషయాలను సభలో చర్చించడానికి వీలు లేదు. నేను అభ్యంతరం చెబుతున్నాను’’ అని పాలకపక్ష సభ్యుడు అభ్యంతరం లేవదీశాడు.
‘‘కొంతకాలం క్రితం ఒక పోలీసు ఉన్నతాధికారి రిటైరయేముందు తన తరవాత చార్జి తీసుకునే ఆఫీసరుకి జాగ్రతత్తగా ఉండమని ప్రస్తుతం మంత్రిగా ఉంటూన్న ఆయన గురించి హితవు నలుపు తెలుపులో పెట్టి పదవీ విరమణ చేశారు.’’
‘‘సిగ్గు సిగ్గు ఎవరామంత్రి’’ అని ప్రతిపక్ష సభ్యులు కేకలు పెట్టారు.
‘‘డౌన్ డౌన్ ప్రతిపక్షం.’’
‘‘ఈ విషయం ప్రివిలేజస్ కమిటీకి రెఫర్ చేయాలి. పరంధామయ్యగారు ఆ మంత్రి పేరు చెప్పాలి.’’
‘‘సభాపతి అనుమతిస్తే తప్పక ఆయన నామధేయం విన్నవించుకుంటాను.’’
సభాసతికూడా పరంధామయ్య పైన ఆగ్రహం చెందారు.
‘‘ఆధారాలు లేకుండా పేరు చెప్పకుండా ఇంత తీవ్రమైన అపవాదు వేయడానికి నేను అభ్యంతరం చెబుతున్నాను.’’
‘‘అయ్యా, సభాపతీ ఆ పోలీసు స్టేషను రికార్డులో ఉన్నవివరాలు ఇలా ఉన్నాయి. ఫలానా వ్యక్తి చాలా పేరు మోసిన పశువుల దొంగ ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు. మంత్రి కావడం వల్ల పశువల దొంగతనాలను గురించి ఇప్పుడెక్కువగా ఫిర్యాదులు రావడం లేదు. ఈయన మంత్రి అవడం ఆ విధంగా మంచిదే. అయినా కూడా ఈ మనిషి మీద ఒక కన్ను వేసి ఉంచాల్సిందే.
పాలక పక్ష సభ్యులు ఆ మంత్రి పేరు చెప్పి తీరాలని పట్టు పట్టారు.
పరంధామయ్య ‘‘సభాపతీ, ఈ కార్యకలాపాల అనంతరం నేను తమ ఛాంబరుకు వచ్చి అన్ని విషయాలూ విన్నవించుకుంటాను’’ అన్నాడు.
సభాపతి నవ్వుతూ ‘‘ఈ లోకోక్తి విన్నారా. నేను కటి గుణమేం మామ వినురా సుమతీ’’ అన్నారు.
———–