కొమ్మూరి పద్మావతీదేవి (Kommuri Padmavathi Devi)

Share
పేరు (ఆంగ్లం)Kommuri Padmavathi Devi
పేరు (తెలుగు)కొమ్మూరి పద్మావతీదేవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరుకొమ్మూరి వెంకటరామయ్య
పుట్టినతేదీ7/7/1908
మరణం5/9/1970
పుట్టిన ఊరుచెన్నై
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకథలు: అనుకోని సంఘటన, అపోహ, అయిదు గంటలు, ఆ రోజు దీపావళి, ఆఫీసు హోదా , ఉమ
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకొమ్మూరి పద్మావతీదేవి
మా పెద్దమ్మ
సంగ్రహ నమూనా రచన
ఇంట్లో పిల్లలకీ, మనవలకీ, మనవరాళ్లకీ, అల్లుళ్లకీ, మరుదులకీ, తోడికోడళ్లకీ – ఒకరేమిటి, బంధువులందరికీ, ఆమెను తెలిసిన అందరికీ పెద్దమ్మ!
భర్త పిలిచేది కూడా పెద్దమ్మ అనే!
ఆమె పేరులోనే విశేషం ఉంది! పేరులోనే కాదు, ”పెద్దమ్మా!” అని పిలవగానే ఆమె పలికే ధ్వనిలో, ఆ గొంతుకలో అంతకన్న విశేషం ఉంది.

కొమ్మూరి పద్మావతీదేవి
మా పెద్దమ్మ

ఇంట్లో పిల్లలకీ, మనవలకీ, మనవరాళ్లకీ, అల్లుళ్లకీ, మరుదులకీ, తోడికోడళ్లకీ – ఒకరేమిటి, బంధువులందరికీ, ఆమెను తెలిసిన అందరికీ పెద్దమ్మ!
భర్త పిలిచేది కూడా పెద్దమ్మ అనే!
ఆమె పేరులోనే విశేషం ఉంది! పేరులోనే కాదు, ”పెద్దమ్మా!” అని పిలవగానే ఆమె పలికే ధ్వనిలో, ఆ గొంతుకలో అంతకన్న విశేషం ఉంది.
ఆమె చేసే ప్రతి పనిలోనూ ఆ విశేషమే ఉంది.
పిన్నమ్మ పెద్దమ్మల కన్నా ఎక్కువైన ఏదో తెలియని ప్రేమబంధము ఈమెలో కనిపిస్తుంది , నాకే కాదు, ఆడపిల్లలందరికీ. ఇంటికెవరైనా వచ్చారా అంటే, అతి ఆప్యాయంగా, ఎంతో దగ్గరగా తీసుకుని పలకరిస్తుంది మా పెద్దమ్మ.
ఎవరైనా సరే, జాతిబేధమనే ఆలోచనే ఉండదామెకు- అదీ చిత్రం.
పన్నెండేళ్ల క్రిందట మొట్టమొదటిసారి ఈమెని చూశాను. ముఖ్య పరిచయం లేనివారి యింటికి ఎప్పుడూ, ఎక్కడికీ కదలని నేను వెళ్లడం!
జంకుతూ నాలుగు పక్కలా చూశాను, రైలు ఆగగానే. నాకోసం స్టేషన్‌కి వచ్చింది పెద్దమ్మ. ఆమెను చూడగానే పోయింది నా భయమంతా!
బంగళా ముందు కారు ఆగగానే జంకుతూ పెద్దమ్మ వెనక నడిచాను. ఆ పెద్ద బంగళా, అందులో ఉన్న ఆ జనమూ, కొత్త ముఖాల చూడగానే నాకు కలవరం కలిగింది. ఆ యింటి యజమానురాలు మా పెద్దమ్మ అని తెలియగానే, మా అమ్మ దగ్గర ఉన్నంత స్వాతంత్య్రం, సంతోషం కలిగాయి.
పన్నెండేళ్లనుంచీ పరిచయం ఉన్న పెద్దమ్మ ముఖంలో ఒక్కసారైనా కోపం గాని, విసుగు గాని, నేను చూడలేదు. ఎవ్వరూ ఎప్పుడూ చూసి ఉండరు.
ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడే కళ్లతో కొంగు సవరించుకుంటూ, పలకరిస్తుంది మా పెద్దమ్మ. అనేకసార్లు ఇరుగుపొరుగు ఆడగుంపు పెద్దమ్మ చూట్టూ చేరి, అనేక విషయాలు చర్చించేవారు. మంచీ, చెడ, ఏ విషయం గాని యేమీ తెలియనట్లుగా – ఆ పెద్ద కళ్లతో నలుగుర్నీ పరికించటం తప్ప ఇంకేమీ చూసి ఎరగను.
ఒకసారి గావును, అడిగాను :
”ఏం పెద్దమ్మ! ఏ పక్కా వాదనలో మాట్లాడవేం?” అని
సమాధానంగా నవ్వుతూ, ”నాకేం తెలుసు? ఏం మాట్లాడను?” అంది.
ఇదే గావును, నిండుకుండ తొణకదు అంటారు, అనుకున్నాను మనస్సులో.
పెద్దమ్మ మాట్లాడకపోయినా ఆమెలో ఏదో గొప్పతనం ఉంది.
ఓసారి ఒక బీదరాలు వచ్చింది, అన్నానికని. శూద్రది. అప్పటికే ఇంట్లో ఉన్నారు పదిమంది. వారుకాక, వారానికి వచ్చే పిల్లలు నలుగురు. ఆ బీదరాలు అడిగిందే తడవుగా, పెద్దమ్మకి ఆదరణ కలిగింది.
ఇంట్లో ఎవరన్నా, ”ఎందుకమ్మా యింతమందీ?” అన్నారా, ”మనకి దేవుడిచ్చింది వీళ్లకివ్వడానికే” అని పెద్దమ్మ జవాబు చెప్పేది. పండుగలు వచ్చాయంటే బీదవారనే భావం లేకుండా, ఇంటివారితో సమానంగా అందరికీ ఒకటే పండుగ. అదే మా పెద్దమ్మలో గొప్ప మరి!
ఓ యిల్లాలు మాటల్లో ఎవరో అమ్మాయిని దూషించింది- నడత మంచిది కాదని! పెద్దమ్మ దగ్గిర!!
దూషణ అంటే పెద్దమ్మకి గిట్టదని ఆమెకు తెలీదు. నేనూ వింతగా వింటున్నాను. ఆ మాటలు మధ్యలోనే ఆపి, ”ఆడపిల్లల్ని అలా అనరాదమ్మా!” అంది.
”అందరూ ఒకటేనా?” అంది, ఆ యిల్లాలు.
”మనకీ ఉన్నారు ఆడపిల్లలు! ముందు సంగతులు మనం చూశామా?” అని పెద్దమ్మ జవాబు!
ఇద్దరు ఆడపిల్లల తల్లి మా పెద్దమ్మ, అలా అనగానే ఆ యిల్లాలు మాట పెగలక తెల్లబోయింది.
ఉషని కడుపుతో ఉన్న ఏడో నెలలో మా అమ్మనైనా చూడాలనిపించలేదు. పురుడు వచ్చేలోగా ఏమవుతానో అనుకుంటూ పెద్దమ్మ కోసం వెళ్లాను. తీరా వెళ్లాక, రక్తపు వాంతులతో మంచం పట్టాను. ఆ స్థితిలో మా పెద్దమ్మ నన్ను చంటిపిల్లని చూసినంత జాగ్రత్తగా కనిపెట్టి, తిరిగి ప్రాణం నిలబెట్టింది. ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోయాక చేతిలో కప్పు తీసుకుని పెద్దమ్మ నా మంచం దగ్గిర నిలబడింది.
ఏమీ మింగలేని స్థితిలో ఉన్న నాకు ధైర్యం చెప్పి, నోరు తెరవమంది. ”రొట్టె పెరుగులో నానవేసి తెచ్చాను. వెన్నలాగా ఉంటుంది,” అంటూ నాకు అందించింది.
మరికొన్ని రోజులకి రైలుకి వెళ్లేముందు, కళ్లనీళ్లతో, ”పెద్దమ్మా, వెళ్లి వస్తాను,” అన్నాను. నా మాట విననట్లు గానే లోపలికి వెళ్లి, రెండు చీరలూ, రవికలూ, కుంకం అవీ తెచ్చి నా చేతిలో పెట్టింది పెద్దమ్మ. ”ఇవి మూర ఎక్కువ. తొమ్మిది గజాలు. మీవేపు బాలింతలు చీరకొంగే నడుముకి కడతారట కద?” అంది.
కళ్లనీళ్లతో తలెత్తి ఆమెను చూశాను. ”మళ్లీ వస్తానో రానో!” అన్నాను, జంకుతూ.
”ఎందుకు రావూ? ఈసారి పిల్లతో వస్తావు!” అంది.
గంట కొట్టినట్లుగా, ఖంగుమనే గొంతుకతో జవాబిచ్చింది. ఆ మాటే తలుచుకుంటూ వెళ్లాను. ఆమె ఆశీర్వాదంతో మూడు నెలలకే మళ్లా పిల్లతో కూడా వెళ్లాను.
మా ఉషకి పెద్దమ్మ పెట్టిన పేరు సుభద్ర!
రెండేళ్ల క్రిందట మా పిల్లలకి ముగ్గురికి టైఫాయిడు వచ్చింది. నరకయాతన అనుభవించాను. ముగ్గుగరిలో ఎవరో ఒకరు నన్ను విడిచి వెళ్లిపోతారనే బాధతో కృశించి కృంగిపోయేదాన్ని. ఎంత మందో తెలిసినవాళ్లు వచ్చి, ధైర్యం చెప్పేవారు… తలవని తలంపుగా పోష్టువాడు ఒక ఉత్తరం ఇచ్చాడు. నా ఆలోచన్లకీ బాధలకీ, విచారంగా ఉన్నా ఉత్తరం చూడక తప్పలేదు. సంతోషంతో చదివాను, చాలా సార్లు, పెద్దమ్మ వ్రాసింది!
చిన్నపిల్లలు ‘అ ఆలు’ నేర్చుకునే కొత్తలో, వాళ్ల వ్రాతలో ఉండే అమాయకత్వం పెద్దమ్మ వ్రాతలో ఉంది. అక్షరాల్లోనే కాదు, వ్రాసే ఉద్దేశం కూడా అమాయకంగా ఉంది.
”పిల్లలకి తగ్గుతుంది, భయపడకండి. త్వరలోనే మీ అందర్నీ చూస్తాను,” ఇంతే ఆ ఉత్తరంలో ఉంది.
ఆ ‘తగ్గుతుంది’ అనే అక్షరాలు నాకు పెద్దవిగా, భూతద్దం పెట్టుకు వస్తే కంటి మీదికి ఎలా వస్తున్నట్లుంటాయె అలా వచ్చి నా మనస్సులో హత్తుకుపోయాయి. ఆమె సందేశం నాకేదో శాంతి, నెమ్మది కలిగించింది. రెండు నెలలుగా బాధపడు తన్న పిల్లలు – అందులో అరగంటకే ఏమవుతాడో అనుకుంటున్న పిల్లవాడు – అందరూ తేరుకున్నారు.
పెద్దమ్మ కళ్లనీళ్లు ఒక్కసారి చూశాను. అదీ రెండేళ్ల క్రితం –
తల్లీ తండ్రీ లేని బీదపిల్లవాడిని ఇంట్లో పెట్టుకు పెంచింది, పెద్దమ్మ. పదేళ్లవాడు, వీధులవెంట తిరుగుతున్నవాడు, జాతి తెలీనివాడు, వాడికి చదువూ, సంగీతమూ కన్న కొడుక్కన్నా ఎక్కువగా చెప్పించింది. వాడి పేరు శ్రీనివాసు ముద్దుగా ‘సీనా’ అని పిలిచేది. పిలిచిందే తడవుగా ‘పెద్దమ్మా వస్తీ’ అని వాడు దూకేవాడు. చాలా తెలివిగా చదువుకోవడమే కాక, చక్కని కంఠంతో పాడి, అందర్నీ మత్తెక్కించి, ఆ మత్తు పోకముందే శీనుడు వెళ్లిపోయాడు.
అప్పుడే మా పెద్దమ్మ కళ్లంట నీళ్లు వచ్చాయి. పిల్లల విషయంలో విసుగూ, కోపమూ లేని స్త్రీలు చాలా అరుదు – ఏదో ఒకటన్నా ఉండి తీరుతుంది. మా పెద్దమ్మలో మచ్చుకైనా ఆ రెండు కనబడవు. మనవల, మనవరాళ్లూ ఎంత మారాం చేసినా, అల్లరి చేసినా, ఏదో ఉపాయంగా వాళ్లని సమాధానపరిచే నేర్పు పెద్దమ్మకే ఉంది. తల్లుల్ని కన్నతల్లి కనక, అంత నేర్పు ఆమెకు.
హరిజన సేవకీ, అతిథి సత్కారానికీ, ఆంధ్ర జనాదరణకీ, ఆమె భర్తకి కుడిచెయ్యిగా నిలిచి, ముందంజ వేసిన గొప్ప స్త్రీమూర్తి. ఉదార మాతృమూర్తి. భర్త సేవ, బంధువు లని ఆదరించడం, దేవుడి గదిలో ప్రతిరోజూ దీపం పెట్టడం – ఇవీ మా పెద్దమ్మ దినచర్యలు. బంధువులకీ, భర్తకీ, ఎవరికి ఎటువంటి భోజనం కావాలో, అన్నివిధాలా అందరికీ సమకూర్చే నేర్పు ఈమె సొత్తు. వయసు యభైమూడు, ఎంత ఓపిక మా పెద్దమ్మకి! పెద్దమ్మ చేసిన పిండివంటలు, చట్నీపొడి, చారు, మరపునకు రానివి.
చిత్రం! వంటలో ఉన్నంత నేర్పు గొప్ప కార్యాలు నిర్వహించటంలో కూడా ఆమెకుంది.
స్త్రీలు నాటక రంగంలో ప్రవేశించాలని ముందు దారి తీసినది ఈమే. స్త్రీలే స్త్రీ పాత్రలు ధరించాలనే పట్టుదలతో ఉన్న భర్త సంకల్పానికి, ముందుగా మా పెద్దమ్మ దారిచూపింది. మా అందరికీ ఆదర్శంగా, నాటకం కోసమని ప్రత్యేకంగా తెలుగ, కన్నడం చదవడం నేర్చుకుని, పట్టిన పట్టు సాధించి, అనేక నాటకాలలో పాల్గొంది మా పెద్దమ్మ. మొట్టమొదటి ‘సావిత్రి’లో సత్య వంతుడి తల్లి పాత్ర ధరించింది. సత్య వంతుడి వేషం ఆమె భర్త వేశారు. ‘సుభద్ర’ లో బలరాముని భార్య రేవతి పాత్ర ధరించేది. అర్జునుడిగా ఆమె భర్త నటించేవారు.
ఇలాగే అనేక నాటకాలలో – కన్నడంలో, తెలుగులో మా అందరికీ చేయూతనిచ్చి, ఆదర్శంగా భర్తకి ముందు నిలిచి ముందంజ వేసిన ధీరురాలు, మా పెద్దమ్మ.
దేవుళ్లకి మొక్కుకున్నామని ఎవరైనా అంటే, ”మనలో లేడ? మన ఇంట్లో ఉన్న దేవుడు చాలడ?” అంటుంది.
మా పెద్దమ్మ అసలు పేరు కృష్ణమ్మ.
మా పెద్దమ్మ మీ అందరికీ తెలిసిన రావు బహదూర్‌ శ్రీ బళ్లారి రాఘవాచార్యులు గారి భార్య!
* * *
కొ. పద్మావతీదేవి (1908 జూలై, 7 – 1970 మే, 9)
‘పొగడదండ’ కథాసంపుటి నుంచి, రచనాకాలం 1940-45

———–

You may also like...