దేవులపల్లి రామానుజరావు (Devulapalli Ramanujarao)

Share
పేరు (ఆంగ్లం)Devulapalli Ramanujarao
పేరు (తెలుగు)దేవులపల్లి రామానుజరావు
కలం పేరు
తల్లిపేరుఆండాళ్ళమ్మ
తండ్రి పేరువేంకట చలపతిరావు,
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ8/25/1917
మరణం
పుట్టిన ఊరువరంగల్లు పట్టణ సమీపాన ఉన్న దేశాయి పేట గ్రామం
విద్యార్హతలుమద్రాసు విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు. తరువాత నాగ్పూర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ ఎల్ బి పట్టా సాదించేరు
వృత్తిఉస్మానియా యూనివర్సిటిలోనూ అనేక పదవులను నిర్వహించారు.
తెలిసిన ఇతర భాషలుఇంగ్లిషు, తెలుగు, ఉర్దూ భాషా ప్రవీణుడు, మంచి పాండిత్యం కలవాడు;
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసారస్వత నవనీతం
తెలుగు సీమలో సాంస్కృతిక పునర్జీవనము
తెలంగాణాలో జాతీయోధ్యమాలు
నా రాడియో ప్రశంగాలు
ఉపన్యాస తోరణము
వేగుచుక్కలు
తెనుగు సాహితీ
తెలుగు దేశము
యాబై సంవత్సరాల జ్ఞాపకాలు (1929 నుండి 1979 వరకు)
తలపుల దుమారము
పంచవర్ష ప్రణాళికలు
బంకించంద్ర చఠర్జీ జీవితము
హైద్రాబాదులో స్వాతంత్యోధ్యమం
మన దేశం – తెలుగు సీమ
జవాహర్లాల్ నెహ్రూ
గౌతమ బుద్ధుడు
కావ్యమాల
ఇతర రచనలుసంపాదకీయం వహించిన రచనలు:
శోభ సాహిత్య మాస పత్రిక
గోల్కొండ దిన పత్రిక (1948-1964)
గురజాడ శతవార్షికోత్సవ సంచిక (1962-64)
రవీంద్రనాధ్ ఠాగూర్ శత వార్షికోత్సవ సంచిక
తెలుగు మహా సభల ప్రత్యేక సంచిక (1981)
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు1990 లో ఆంధ్ర ప్రదేశ్ సారస్వత విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
ఇతర వివరాలుఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి, శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భషా నిలయం, కేంద్ర సాహిత్య అకాడమీలలో మూడు దశాబ్ధాలకు పైగా ప్రగాడ అనుభందాలేర్పరచుకుని తెనుగు భాషా, రచనల పరివ్యాప్తికి మిక్కిలి కృషి చేశారు. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా పనిచేశారు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికదేవులపల్లి రామానుజరావు

తెలంగాణములో ఆంధ్రోద్యమము తెలంగాణలో జాతీయోద్యమాలు
సంగ్రహ నమూనా రచనఆంధ్రభాషకు అజ్ఞాతవాసము
ఆంధ్రోద్యమ ప్రారంభము
మేలుకొలిపిన సంఘటన
ఆంధ్ర జనసంఘము ఆదర్శములు

డా॥ దేవులపల్లి రామానుజరావు

తెలంగాణములో ఆంధ్రోద్యమము తెలంగాణలో జాతీయోద్యమాలు

ఆంధ్రభాషకు అజ్ఞాతవాసము
ఆంధ్రోద్యమ ప్రారంభము
మేలుకొలిపిన సంఘటన
ఆంధ్ర జనసంఘము ఆదర్శములు
ఉన్నత ఆశయాలు
ఉద్ధృత ప్రచారము
అండగా నిలిచిన పత్రికలు
ఆంధ్ర మహాసభ అవతరణ సహజ పరిణామము – ఆలియావర్జంగ్‌ అనుమానాలు రానురాను రాజకీయాలు
ఓరుగల్లు మహాసభ – చీలికలు
మహాసభలు – అధ్యక్షులు
నూతన అధ్యాయము

ఆంధ్రభాషకు అజ్ఞాతవాసము:

రెండునూర్ల పాతిక సంవత్సరాల ఆసఫ్జాహి పరిపాలన ఫలితముగ హైద్రాబాదు రాష్ట్రములో ఆంధ్రుడు తౌరక్యాంధ్రుడైనాడు. అతనికి అరబ్బీ, ఫారసీ భాషలలో అక్షరాభ్యాసము కావించు దుస్థితి కలిగినది. ఉర్దూ భాషయే రాజభాష; మరియు ప్రాథమికదశనుండి విశ్వవిద్యాలయదశ వరకు బోధనా భాష అయినందున ఆంధ్రభాషకు కొన్ని శతాబ్దాల అజ్ఞాతవాసము ప్రాప్తించినది. ఈ కాలమున ఆంధ్రుడు అన్ని రంగములందు వెనుకబడినాడు. పరిపాలనా రంగమున అతనికి తగిన స్థానము లభింపలేదు. పరదా, వరశుల్కము మొదలైన సాంఘిక దురాచారాలు ప్రబలి యుండెను. తెలుగు రైతు పన్నుల భారముతో క్రుంగి, దరిద్రదేవత పాదాల క్రింద నలిగి పోయెను. చదువుకున్న వారి సంఖ్య నూటికి మూడింటి వరకు దిగజారెను. తెలంగాణమున పాఠశాలలు, కళాశాలలు చాలా కొద్దిగా నుండెను. ఇట్టి పరిస్థితులలో ప్రారంభమయినది ఆంధ్రోద్యమము. ఆంధ్రోద్యమ ప్రారంభము హైదరాబాదు నగరమున 1-9-1901 వ సంవత్సరమున స్వర్గీయ కొమర్రాజు వెంకటలక్ష్మణరావు ప్రోత్సాహముతో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయము స్థాపితమైనది. ఈ ప్రయత్నమున లక్ష్మణరావు గారి సహచరులుగా నిలిచి పని చేసినవారు మునగాల రాజాగారు, స్వర్గీయ రావిచెట్టు రంగారావుగారు. కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయమును తెలంగాణమందేకాక, సకలాంధ్రమందును మొట్టమొదటి గ్రంథాలయముగా పేర్కొనవచ్చును. తెలంగాణమున హనుమకొండ, వరంగల్‌ మొదలయిన పట్టణాలలో 1901 నుండి 1910 వరకు మరికొన్ని గ్రంథాలయాలు లక్ష్మణరావుగారి ప్రోత్సాహమున స్థాపితమయినవి. ఈ కాలముననే విజ్ఞానచంద్రికా గ్రంథమండలి కూడ హైదరాబాదులో స్థాపితమైనది. విజ్ఞాన చంద్రికా గ్రంథమండలిని ఆంధ్ర- తెలంగాణాల మధ్య దృఢమైన సాంస్కృతిక బంధనముగా ఏర్పాటు గావించిన లక్ష్మణరావుగారే విశాలాంధ్ర ఉద్యమానికి కూడ పునాదులు వేసిరని చెప్పవచ్చును. హైదరాబాదులో ఆంధ్రోద్యమము యీ విధముగా యీ శతాబ్ద ప్రారంభమున వైజ్ఞానికోద్యమముగా ప్రారంభమయి, క్రమక్రమముగ రాజకీయోద్యమముగ పరిణమించినది. ఆనాడు గ్రంథాలయోద్యమముద్వారా తెలంగాణమును ప్రబోధించిన వారిలో కీ॥శే॥ ఆదిపూడి సోమనాథరావు, కీ॥శే॥మైలవరపు నరసింహశాస్త్రి గారలను ప్రత్యేకముగ స్మరించ వలసి యున్నది. శేషాద్రిరమణ కవుల “నిజాంరాష్ట్ర ప్రశంస” అను ఖండ కావ్యమును ప్రత్యేకముగ పేర్కొన వలసి యున్నది.

మేలుకొలిపిన సంఘటన :

ఇరువది సంవత్సరాల గ్రంథాలయోద్యమము తెలంగాణాను కొంత మేల్కొలిపినది. ఇట్టి సందర్భంలో 1921వ సంవత్సరమున హైదరాబాదు నగరమున సుప్రసిద్ధ మహారాష్ట్ర విద్వాంసుడైన కర్వే పండితుని అధ్యక్షతన జరిగిన సంఘసంస్కరణ సభలలో అప్పుడు హైదరాబాదులో న్యాయవాదులుగా నుండిన ఆలంపల్లి వెంకటరామారావుగారు తమ ఉపన్యాసమును తెలుగులో ప్రారంభించగా, సభ్యులు చప్పట్లతో హేళన గావించిన సంఘటన చరిత్ర నిర్మాణమునకు కారణ భూతమైనది. ఈ సంఘటనను అవమానముగ భావించిన ఆంధ్రులు ఆనాటి రాత్రి కీ॥శే॥ టేకుమాల రంగారావుగారి ఇంటిలో సమావేశమై, ఆంధ్ర జనసంఘమును స్థాపించిరి. ఇది ఆంధ్రోద్యమ చరిత్రలో మహత్తరమైన సంఘటన. ఆంధ్ర జనసంఘ స్థాపన గావించిన సమావేశములో బూర్గుల రామకృష్ణారావు, పద్మవిభూషణ మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలయిన పెద్దలు పాల్గొనియుండిరి. ఈ ఆంధ్ర జనకేంద్ర సంఘము తత్క్షణమే తన పనిని ప్రారంభించి, నూరుగురు సభ్యులను చేర్పించి 4-4-1922 నాడు కొండా వెంకటరంగారెడ్డిగారి అధ్యక్షతన సమావేశమును ఏర్పాటు కావించి, చిత్తునియమావళి నామోదించి కార్యనిర్వాహక వర్గమును ఎన్నుకొనుట జరిగినది. ఆనాటి కార్యనిర్వాహకవర్గమునకు కీ॥ శే॥ బారిస్టరు రాజగోపాలరెడ్డిగారు అధ్యక్షులుగను, మాడపాటి హనుమంతరావు పంతులుగారు కార్యదర్శిగాను ఎన్నుకొనబడిరి.

ఆంధ్ర జనసంఘము ఆదర్శములు

ఈ సంఘమునకు నిజాంరాష్ట్రాంధ్ర జనసంఘమని పేరు.
నిజాం రాష్ట్రము నందలి ఆంధ్రుల యందు పరస్పర సానుభూతిని కలిగించి, వారి అభివృద్ధికై ప్రయత్నించుట యీ సంఘము ఉద్దేశము.
ఈ రాజ్యములోని ఆంధ్రులకొరకు సంఘములను, సంస్థలను స్థాపించుట, ఉన్నవానికి సహాయము చేయుట, ఉపన్యాస సభలను సమావేశపరుచుట మున్నగు కార్యముల వలన పై ఉద్దేశములు నెరవేర్చబడును.
ఈ రాజ్యములోని ప్రతి ఆంధ్ర వ్యక్తియు, పదునెనిమిది వత్సరములకన్న మించిన వయస్సు కలిగి, చదువను, వ్రాయను నేర్చినచో యీ సంఘమున సభాసదుడు కావచ్చును.

ఉన్నత ఆశయాలు :

ఈ ఆంధ్రజన కేంద్ర సంఘము స్థాపితమైన సంవత్సరము తరువాత అనగా 1923వ సంవత్సరమున ఒక ఉపనియమావళి సిద్ధము చేయబడి, అందులో జిల్లాలలోను, కేంద్రమునందును ఆంధ్రజన సంఘము నెరవేర్చవలసిన విధులు యీ విధముగా నిర్ణయింప బడినవి:
అ. గ్రంథాలయములను స్థాపించుట, పఠన మందిరములను, పాఠశాలలను స్థాపించుట.
ఆ. విద్యార్థులకు సహాయము, ప్రోత్సాహము చేయుట.
ఇ. విద్వాంసులను గౌరవించుట.
ఈ. తాళపత్ర గ్రంథములను, శాసనముల ప్రతులను సంపాదించుట, పరిశోధించుట.
ఉ. కరపత్ర మూలమునను, లఘుపుస్తక మూలమునను విజ్ఞానము వ్యాపింపజేయుట.
ఊ. ఆంధ్రభాషా ప్రచారమునకై వలయు ప్రయత్నములు జరుపుట.
ఋ. వ్యాయామములను, కళలను ప్రోత్సాహపరచుట.
ౠ. అనాథలగు వారికి అత్యవసరమగు సహాయము చేయుట.

ఉద్ధృత ప్రచారము :

ఈ ఆదర్శములను, సాధనములను గమనించినపుడు యీ సంస్థ నిజాం రాష్ట్ర వాసులైన స్త్రీ పురుషులకు మాత్రమే పరిమితమయినటుల స్పష్టమగుచున్నది. తరువాత నగర ఆంధ్ర జనసంఘ కార్యకర్తల పర్యటన, ప్రచార, ప్రబోధ ఫలితముగ జిల్లాలలో ఆంధ్ర జనసంఘములు స్థాపితమైనవి. 1-4-1923 నాడు యీ విధముగ స్థాపితమయిన హైదరాబాదు, సికింద్రాబాదు, వరంగల్లు, ఖమ్మం, హుజూరాబాదు ప్రతినిధులు హనుమకొండలో సమావేశమై, ఆంధ్రజన కేంద్ర సంఘ నియమావళి నంగీకరించిరి.

ఈ విధముగ ఏర్పడిన కేంద్ర సంఘము మొదటి సమావేశము 27-7-1923 నాడు హైదరాబాదులో ఏర్పాటు జరిగి, ఆంధ్ర జనకేంద్ర సంఘములు చేయవలసిన కార్యములను నిర్ణయించిరి. ఈ కార్యములను పరిశీలించినపుడు ఆంధ్రజన సంఘముల కార్యక్షేత్రము విద్య, వైజ్ఞానిక, వర్తక, వ్యాయామాది సమస్యలకు మాత్రమే పరిమితమై యుండి, రాజకీయాలకు దూరముగా నుండినట్లు స్పష్టము కాగలదు. తరువాత కేంద్ర సంఘ సమావేశాలు నల్లగొండ, మధిర, సూర్యాపేట, జోగిపేట, దేవరకొండ, ఖమ్మం, సిరిసిళ్ళలో మొత్తం ఎనిమిది సమావేశాలు జరిగినవి. ఈ కాలమున ఆంధ్ర జనకేంద్ర సంఘము కార్యక్రమమును పరిశీలించినపుడు విద్యార్థులను ప్రోత్సహించుట, గ్రంథాలయములను స్థాపించుట, గ్రంథాలయ సభలను నిర్వహించుట, వర్తక సంఘములను స్థాపించుట, వర్తక సమస్యలను గూర్చిన లఘు పుస్తకములను ప్రచురించుట, వెట్టి చాకిరి మొదలగు సామాజిక సమస్యలను గూర్చి ప్రబోధము గావించి తీర్మానాలు చేయుట, పాఠశాలల స్థాపనను గూర్చిన సమస్యలను చర్చించుట, ప్రచారకార్యక్రమమును నిర్వహించుట ప్రధానముగ గన్పట్టు చున్నది. మధిర, సూర్యాపేటలో ఈ కేంద్ర సంఘ సమావేశాలతో పాటు రెందు గ్రంథాలయ సభలు కూడ జరిగినవి. తాళపత్ర గ్రంథ సేకరణను గూర్చి యీ సంఘము ప్రత్యేక శ్రద్ధను వహించి, ఒక ఆంధ్ర పరిశోధక సంఘమును కూడ స్థాపించినది. ఇదియే లక్ష్మణరాయ పరిశోధక మండలి. ఈ మండలి, విశేషించి మండలియొక్క కార్యదర్శి ఆదిరాజు వీరభద్రరావుగారు తెలంగాణమందలి శాసనములను సేకరించి ప్రకటించుటలో ప్రశంసనీయమయిన కృషిని గావించిరి.

అండగా నిలిచిన పత్రికలు :

ఈ కాలమున ఆంధ్రోద్యమమునకు అండగా నిల్చిన “నీలగిరి” (స్థాపితము 24-8-1922 నల్లగొండ), “తెలుగు పత్రిక” (స్థాపితము 27-8-1922 మానుకోట తాలూకా) అను వారపత్రికలను ప్రత్యేకముగ ప్రశంసించవలసి యున్నది. 10-5-1926 నాడు ఆంధ్రోద్యమమునకు పెట్టని కోటగా “గోలకొండ” పత్రిక ప్రారంభమైనది. ఆంధ్రోద్యమ వ్యాప్తికి, వికాసమునకు ఈ పత్రికలు మిక్కిలి తోడ్పడినవి. ఆంధ్రజన సంఘము కేవలము రాజకీయేతర సమస్యలనే తీసుకొన్నప్పటికినీ ఈ సభల సందర్భమున ప్రభుత్వము యొక్క వ్యవసాయ, పశుచికిత్స, సహకార, వైద్యశాలల ప్రదర్శనాలు ఏర్పాటు చేసినప్పటికిని, ఇతర విధములుగ ప్రభుత్వముతో సహకరించుటకు ప్రయత్నించినప్పటికిని, ప్రభుత్వమునకు మాత్రము ఇందులో ఏవో రాజకీయాలు ఇమిడి యున్నవను అనుమానము అప్పుడప్పుడు కలుగుచుండెను. ఈ అనుమానముతో సభలకు అనుమతి నిచ్చుటయందు ప్రతిబంధకములు కల్పించబడినవి. అప్పుడు హైదరాబాదులో నుండిన వాగ్బంధన శాసనము యొక్క ప్రతిబంధకములను గూడ యెదుర్కొన వలసి వచ్చెను. ఈ వాగ్బంధన శాసన ప్రయోగము వలన ప్రభుత్వము అనుమతిలేక సమావేశాలు జరుపుట గాని, పత్రికలు నడుపుటగాని సాధ్యముగాని పరిస్థితి యేర్పడి యుండెను. ఈ అనుమతి సాధారణముగా దొరుకుచుండెడిది కాదు. విశ్వప్రయత్నము గావించ వలసి వచ్చెడిది. ఇట్టి ప్రతికూల పరిస్థితులలో ఈ ఆంధ్రోద్యమ నౌకను బహు జాగ్రత్తగా నడిపిన గౌరవము మాడపాటి హనుమంతరావు పంతులుగారికి చెందుచున్నది. క్రమక్రమముగ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనప్పటికినీ, ప్రజల కష్ట నిష్ఠురములను గూర్చి ఈ సభలు శ్రద్ధ వహించక తప్పలేదయ్యెను. అందుచేత తిప్పర్తి, సూర్యాపేట మున్నగుచోట్ల రైతుల కష్ట సుఖములను విచారించుటకు రైతు సంఘములు స్థాపించుట కూడ జరిగెను. మొత్తముమీద 1930వ సంవత్సరము వరకు అనగా మొదటి ఎనిమిది సంవత్సరాల కాలము ఆంధ్ర సంస్కృతిని, ఆంధ్ర భాషను కాపాడుటకు కృషి సల్పుటయే ఆంధ్రోద్యమము యొక్క ఆశయమయి యుండెను. ఈ కాలమున స్త్రీల సభలను ఏర్పాటుచేసి మహిళలలో ప్రచారము చేయు కార్యక్రమము నిర్వహించుట జరిగినది. ఆనాడు మహిళా ప్రబోధము గావించిన వారిలో చాట్రాతి లక్ష్మీ నరసమ్మగారిని ప్రత్యేకముగ పేర్కొన వలసి యున్నది.

———–

You may also like...