పేరు (ఆంగ్లం) | Kolavennu Ramakoteeswararao |
పేరు (తెలుగు) | కోలవెన్ను రామకోటీశ్వరరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | రుక్మిణమ్మ |
తండ్రి పేరు | వియ్యన్న పంతులు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 10/22/1894 |
మరణం | మే 19,1970 |
పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా నరసారావుపేట |
విద్యార్హతలు | – |
వృత్తి | పాత్రికేయులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఇంగ్లీషు అనువాదాల ద్వారా, ఇతర రాష్ట్రాల వారికి పరిచయం చేసేవారు. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు సంపాదకులు. వీరు బందరు నుండి వెలువడిన త్రివేణి అనే సాంస్కృతిక పత్రికను సుమారు నాలుగు దశాబ్దాలు నిర్వహించేరు . |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కోలవెన్ను రామకోటీశ్వరరావు |
సంగ్రహ నమూనా రచన | న్యాయశాస్త్ర పట్టభద్రులై, కొన్నాళ్ళు న్యాయవాదిగా పనిచేసి, పిదప జాతీయోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. బందరు జాతీయ కళాశాలలో మొదట ఉపాధ్యాయులుగా, తరువాత ప్రిన్సిపాల్ గాను పనిచేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం లోను, 1940లో వ్యక్తి సత్యాగ్రహంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని చెరశాలకు వెళ్ళారు. |
కోలవెన్ను రామకోటీశ్వరరావు
న్యాయశాస్త్ర పట్టభద్రులై, కొన్నాళ్ళు న్యాయవాదిగా పనిచేసి, పిదప జాతీయోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. బందరు జాతీయ కళాశాలలో మొదట ఉపాధ్యాయులుగా, తరువాత ప్రిన్సిపాల్ గాను పనిచేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం లోను, 1940లో వ్యక్తి సత్యాగ్రహంలోను, క్విట్ ఇండియా ఉద్యమంలోను పాల్గొని చెరశాలకు వెళ్ళారు.
భారత దేశంలో వివిధ రాష్ట్రాల భాషా సాహిత్యాలను, ఇంగ్లీషు అనువాదాల ద్వారా, ఇతర రాష్ట్రాల వారికి పరిచయం చెయ్యటం, భారత జాతీయ జీవనంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని నిరూపించటం త్రివేణి ధ్యేయంగా ఉండేది. 1928లో మొదలయిన త్రివేణిలో రాధాకృష్ణన్, రాజాజీ, నెహ్రూ మొదలైన నాయకులు త్రివేణి లో రచనలు చేసేవారు. మహాత్మా గాంధీ 1934లో బందరు వచ్చినప్పుడు, త్రివేణి బాగుందని మెచ్చుకున్నారు.
నాకు బాగా గుర్తు. నర్సారావుపేట కాలేజీ లో పని చేస్తున్న రోజులు. 1961 ఆగస్టు లో ఒక ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో దాదాపు ఒక గంట, మంచి వాననే చెప్పొచ్చు,ఏకధాటిగా కురిసి వెలిసిపోయింది. సాయంత్రం వాన తరవాత వచ్చే ఎండ సౌందర్యం ఎవరికి తెలియదు ! భూమి,ఆకాశం అంతా బాగా పండిన నారింజపండు రంగులో అదో అందమైన లోకంలా మెరిసిపోయింది. ఆ రోజుల్లో వాన కురిసిన తరవాత నర్సారావుపేట వీధుల్లో తిరగాలంటే చికాకు గానే ఉండేది. కానీ స్టేషన్ రోడ్డు మాత్రం కాదు.అది ఒక్కటే ఆ పట్టణం మొత్తం మీద సిమెంట్ రోడ్డు.ఆ రోడ్డు నానుకునే గొప్ప మేధావి,ప్రఖ్యాత సంపాదకులు (త్రివేణి),గొప్ప సత్పురుషులు ,స్వాతంత్ర్య సమర యోధులు శ్రీ కోలవెన్ను రామకోటీశ్వరరావు గారి ఇల్లు ఉండేది.వారిని కలవటానికనే అంతకు నాలుగైదురోజులనుండి నిర్ణయం.
ఆంధ్రా యూనివర్శిటీ నుండి చదువు ముగించుకుని రాగానే నర్శారావుపేట ఎస్సెస్ అండ్ ఎన్ కాలేజ్ లో ఆంగ్ల శాఖ లో అధ్యాపక వృత్తిలో చేరటం జరిగింది.ఏదో రాయాలి,బాగా రాయాలి,ముఖ్యంగా క్రిస్టఫర్ ఫ్రై లా హై సౌండింగ్ గా రాయాలని ఒకే తపన. యూనివర్శిటీలో “ ది లేడీ ఈజ్ నాట్ ఫర్ బర్నింగ్” మా పాఠ్య గ్రంధం. ,ఆ పొయటిక్ డ్రామాని ఎన్ని సార్లు చదవటం జరిగిందో చెప్పలేను. అలా వ్రాయాలని . అదెంత కష్టమో తెలియకపోలేదు.కానీ తపన వీడలేదు ,పట్టుదల సడలలేదు,అర్హతానర్హతల గురించి మీమాంస చేయలేదు. “ఎ షాకింగ్ సూయిసైడ్ “ అనే టైటిల్ తో ఒక ఏకాంకిక నాటిక వ్రాసాను, ఆ మహా రచయితలా ఏ కొద్దిగా వ్రాసినా చాలునని. టైపులో ( ఆ రోజులలో కంప్యూటర్లు ఉండేవి కాదుకదా) 27 పేజీలు వచ్చింది. దాని మీద అభిప్రాయం చెప్పటానికి ఆంగ్ల భాషలో నిష్ణాతుడు,గొప్ప సాహితీ పరుడు,సహృదయుడు అయిన వ్యక్తి కోసం బాగానే వాకబు చేసాను. కలిసిన అయిదారుగురు వ్యక్తులూ ఒకే ఒక వ్యక్తి పేరు చెప్పటం ఆశ్చర్యం,ఆనందం కలిగించింది.వారే శ్రీ కోలవెన్ను రామకోటీశ్వరరావు గారు.
ఆ ఆహ్లాదకరమైన సాయంత్రం వారి ఇంటికి వెళ్ళాను. అదే వారిని నేను మొదటిసారి చూడటం.వరండాలో వాలుకుర్చీలో విశ్రాంతిగా కూర్చుని ఉన్నారు.వెళ్ళి నమస్కారం చేయగానే ,ముఖమంతా పరచుకున్న చిరునవ్వుతో దిగ్గున కుర్చీ లోంచి లేచి కరచాలనం చేసి సాదరంగా తనకు ఎదురుగా ఉన్న కేన్ చైర్ లో కూర్చోవలసిందిగా ఎంతో సున్నితంగా,మర్యాదగా,ఆప్యాయతతో అన్నారు.నన్ను నేను పరిచయం చేసుకుని టైప్ స్క్రిప్ట్ వారిచేతికి ఇచ్చాను. విషయం చెప్పాను.వారు ఏదో గిఫ్ట్ ను మర్యాదగా తీసుకున్నట్లు చిరునవ్వుతో తీసుకుని రెండురోజులతర్వాత మరలా కలవమన్నారు.నేను వారి దగ్గర సెలవు తీసుకుని వస్తుంటే ,మెయిన్ గేట్ దనకా సాదరంగా సాగనంపారు.
వారి తీరు ,వారి మాట తీరు,నాలాంటి చిన్న వాడి యెడల కూడా వారు చూపించిన మర్యాద,మన్నన,ఆప్యాయత నిస్వార్ధమైన మానవీయత వారి యెడల నాకు అపారమైన గౌరవాన్ని ,ఒక చార్మ్ ని కలిగించాయి. ఆ రెండురోజులూ గొప్ప ఉత్కంఠతతో ,పెద్ద అలజడితో గడిపాను. కారణం అంతటి మేధావి ,ఆంగ్ల భాషా కోవిదుడు నేను వ్రాసిన దానిమీద ఏమి తీర్పు చెబుతారోనని.కొద్దిగా పౌండింగ్ హార్ట్ తోనే,వారు చెప్పినట్లుగా కలిసాను.అదే చిరునవ్వుతో,ఆప్యాయతతో స్వాగతం పలికారు.చాలా గొప్ప ఇంగ్లీషులో ,చెరగని చిరునవ్వుతో ,కారుణ్యంతో నిండిన కళ్ళతో నేను రాసిన దాని మీద గుణదోషపరిశీలన చేసారు.ఉత్సాహ పరిచారు. ప్రతి పంక్తి నిర్దుష్టంగా చదివినట్లు దాని మీద వారు వ్రాసిన వ్యాఖ్యలు సలహాలు,సవరణలు నా హృదయాన్ని ఆర్ద్రం చేసాయి.కారణం వారి కంటి చూపు సరిగా లేదని వారు చదివే తీరులో తెలిసింది .గ్లకోమా తో వారు బాధపడుతున్నారు. చదవటం,వ్రాయటం వారి కండ్లు ఉన్న పరిస్థితులలో ఎంత బాధాకరమో నాకు అర్ధమయ్యింది. నేను వారిని కష్టపెట్టానేమోనని నాకు బాధ వేసింది.నా అదృష్టమనుకుంటాను,వారు నన్ను ఇష్టపడ్డారు. తాను దాదాపు ఏమీ చదవలేని స్థితిలో ఉన్నానని,ఏమీ చదవకుండా ఉండటం కేవలం ఒక వెజిటేటివ్ ఎగ్జిస్టెన్స్ లానే ఉంటుందని చెబుతూ ,నాకేమాత్రం ఇబ్బంది లేకపోతే వీలున్నప్పుడల్లా ,వీలుంటే తరచుగా సాయంత్రాల్లో వచ్చి ఏదో ఒకటి,సాహిత్యమో ,చరిత్రనో,తత్వశాస్త్రమో ,తర్కశాస్త్రమో ఏదో ఒకటి వీటికి సంబంధించి ఒక పుస్తకం చదివి వినిపించమని అడిగినారు.నేను, అంతటి మేధావికి,ప్రతిభావంతునికి అన్నిటినీ మించి అంతటి సాహితీ తత్పరునికి,దేశసేవానిరతునికి ,ఇలా చదివి వినిపించటం ఒక మహద్భాగ్యంగా భావించాను.సంతోషంతో నా సంసిధ్ధతను మహా వినయంగా తెలియజేసాను.
కొన్ని సంవత్సరాలు వారికి అలా చదివి వినిపించే గొప్ప సంతోషం నాకు కలిగింది.ఎంత ఏకాగ్రతతో వినేవారో,ఎంతటి విమర్శనాత్మకంగా దాని గురించి ఆలోచించేవారో ,ఎంతటి తులనాత్మకంగా దానిని అన్వయించేవారో.పాపం,పూర్తిగా కండ్లు మూసుకునే వినేవారు.దాదాపు చదివే వన్నీ ఇంగ్లీషు పుస్తకాలే .ఒకసారి బ్రిటిష్ హిస్టరీ లో ఎనిమిదవ హెన్రీ పరిపాలన మీద చాప్టర్ చదవటం జరిగింది.అతని పరిపాలన ఎంత రక్తసిక్తంగా,కుటిల రాజకీయభరితంగా ,చర్చికీ, రాజ్యానికీ నిత్యసంఘర్షణలతో ఎంత ప్రబలమైన అశాంతితో గడిచిందో ఆ గ్రంధం పేర్కొనటం జరిగింది .వారు కండ్లు మూసుకునే గొప్ప ఫ్లూయెంట్ ఇంగ్లీషులో,ఎనిమిదవ హెన్రీ కి సమకాలికుడైన శ్రీ కృష్ణ దేవరాయల పరిపాలనలో ప్రజలు ఎంత సుఖశాంతులతో ,సిరిసంపదలతో జీవించారో,సాహిత్య కళా రంగాలలో గొప్ప పునరుజ్జీవనం ఎలా పరిఢవిల్లిందో ,తులనాత్మకంగా విశ్లేషిస్తూ ,కండ్లు మూసుకునే ఉన్నా కొట్టొచ్చినట్టు కనబడే దేశీయాభిమానపు వెలుగుతో అభిభాషించారు.ఆ వయస్సులో కూడా, ప్రపంచ చరిత్రలో ఎవరికి ఎవరు సమకాలికులో,ఆయా కాలాల లక్షణాలు ,పురోగతి ,సామాజిక ,ఆర్ధిక ,రాజకీయ పరిస్థితులనాకళింపు చేసికొని తులనాత్మకంగా విశ్లేషించే ప్రజ్ఞ ,పాండిత్యం,మెమరీ పవర్ నన్ను అబ్బురపరచాయి.వారింట్లో చాలా పెద్ద పర్సనల్ లైబ్రరీ ఉండేది,ఆంగ్లంలో ,తెలుగులో దాదాపు లేని పుస్తకమంటూ ఉండేదికాదు.
వ్యక్తిసత్యాగ్రహంలో పాల్గొంటూ ,స్వాతంత్ర్య సమరంలో సైనికునిలా పోరాడుతూ కూడా 1928లో “త్రివేణి” త్రైమాసిక పత్రికను స్థాపించారు. త్రివేణి కళలకు,సాహిత్యానికీ,చరిత్రకూ,సంస్కృతికీ ,వాటి వికాసానికీ సేవలందించటం ప్రధాన లక్ష్యంగా స్థాపించబడింది. భారతీయ భాషలలో వెలువడుతున్న సృజనాత్మక సాహిత్యాన్ని ఇంగ్లీషులో వ్యక్తీకరించి భారతీయ సాంస్కృతిక సౌందర్యాన్ని ,ఔన్నత్యాన్ని ,పునరుజ్జీవనాన్ని అన్ని భాషలవారి ,అన్ని ప్రాంతాలవారి అవగాహనలోకి తీసుకురావాలనేది ప్రధాన ధ్యేయం .తన్మూలకంగా భారతీయులలో సాంస్కృతిక ఏకతా భావం పెంపొందించే దిశగా ఈ ప్రయత్నం సాగుతుంది. ఇలాంటి మంచి పని ఇప్పుడు సాహిత్య అకాడమీలు చేయాలని ప్రయత్నిస్తున్నవి.భారతదేశం లో కానీ లేదా మరొక చోట కానీ ఉన్నతాదర్శాల అస్తిత్వానికి ,వ్యాప్తికి ప్రాధాన్యత నిచ్చే అన్ని ప్రయత్నాలకూ ,ఉద్యమాలకూ ఈ పత్రిక బాసటగా నిలచి వాటి వ్యక్తీకరణ మాధ్యమంగా పనిచేస్తుంది. ఉన్నతాదర్శాలుగల వ్యక్తులను ఒకటిగా చేర్చి వారి ఆత్మౌన్నత్యానికి దోహదపడుతుంది, వారిమధ్య సోదరభావం పెంపొందిస్తుంది. సత్య, సౌందర్యాల యెడల నిబద్ధత కలిగిన వారు ప్రేమతో ,సంతోషంతో అందించే సహాయ సహకారాలను స్వీకరిస్తుంది. ఈలక్ష్యమే శ్రీ కోలవెన్ను గారి అందమైన ఆంగ్లంలో –
“Triveni is devoted to Art, Literature, and History. It’s main function is to interpret the Indian Renaissance in it’s manifold aspects. Triveni seeks to draw together cultured men and women in all lands and establish a fellow ship of the spirit. All movements that make for Idealism , in India as well as elsewhere, receive particular attention in these columns. We count upon the willing and joyous cooperation of all lovers of the Beautiful and the True “
ఇంకా భక్తిభావంతో ప్రార్ధన రూపంలో అంటారు :
“May this votive offering prove acceptable to Him who is the source of the Triveni- the triple stream of Love, Wisdom and Power.”
వారు త్రివేణి గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు,బాధపడుతూ ఉండేవారు. మొదటి నుండి ఆ పత్రిక నడపడం లో ఆర్ధిక ఇబ్బందులు ఉండేవట.వేరేవారి ద్వారా నేను తెలిసికొన్న విషయం వారి స్వంత ఆస్తిపాస్తులనమ్మి త్రివేణిని కొనసాగించిన రోజులున్నాయట. ఈ విషయం వారు నాకు ఎప్పుడూ చెప్పలేదు.వారు బాధ పడేది పత్రిక స్థాయి క్రమక్రమంగా క్షీణిస్తున్నదని కూడా. ఫత్రికను 1928 లో స్థాపించినదాదిగా మహామహుల రచనలతో దేశంలోనే సాహితీ సాంస్కృతిక పత్రికలకు తలమానికంగా ఉండేదని తలచుకుని సంతోషపడుతూనే ఆ తరువాత సంభవించిన క్షీణతకు నిర్వేదం చెందేవారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారూ,కె.ఎం.మున్షీ గారు,రాజాజీ గారూ తరచు త్రివేణికి వ్రాయటానికి సంతోషపడేవారు.నెహ్రూ గారి లాంటి అసమాన రచయిత ఒకసారి శ్రీ కోలవెన్ను గారికి జాబు వ్రాసారట, తాను ఒక ఆర్టికిల్ పంపితే ప్రచురిస్తారా అని.దానికి శ్రీ కోలవెన్నుగారు మర్యాదగానే,గౌరవభావం తోనే జాబు వ్రాస్తూ దాని ప్రచురణసాధ్యాసాధ్యాలను పరిశీలించటానికి మొదట పంపించాలి గదా అంటూ ,తప్పనిసరిగా ఆర్టికిల్ పంపమని కోరారట.ఈ విషయం కూడా నాకెప్పుడూ శ్రీ కోలవెన్ను గారు చెప్పలేదు.
సంపాదకధర్మమూ,బాధ్యత ,నిజాయితీ ,అంకితభావాలే పత్రికా నిర్వహణలో వారిని నడిపించాయి. రాగద్వేషాలకు,వ్యక్తుల పేరు ప్రతిష్టలకు స్వార్ధప్రయోజనాలకు పత్రిక నడిపే విషయంలో ఏ మాత్రం ప్రాధాన్యత నివ్వలేదు. రైటానరబుల్ శ్రీనివాస శాస్త్రి గారి లాంటి ఉధ్ధండ ఆంగ్లభాషా కోవిదుడు పంపిన వ్యాసంలోని ఒక పదబంధ ప్రయోగంతో విభేదించి దానిని తీసివేయగల సత్తా, ధైర్యము ,నిర్మొహమాటము ,అంకితభావం ఉన్న గొప్ప వ్యక్తి శ్రీ రామకోటీశ్వరరావు గారు.
శ్రీ కోలవెన్ను గారు గొప్ప నిగర్వి .తనను గురించి ,తనగొప్పతనం గురించి ఇంప్లైడ్ గా కూడా ఎప్పుడూ చెప్పటం నాకు వారితో ఉన్న పది పన్నెండేళ్ళ పరిచయంలో జరగలేదు.స్వోత్కర్ష లేదు.పరనింద లేదు.ప్రొఫెసర్ ఐ.వి. చలపతిరావుగారు “ఇండియన్ రెనైజన్స్” లో వారి మీద వ్రాసిన వ్యాసం చదివినతర్వాత నేను తెలిసికొన్న విషయం,మనం గొప్ప సంపాదకులనే వారిలో చాలామంది వారి దగ్గర పని చేసి తర్ఫీదు అయినవారో ,వారిని మార్గదర్శకులుగా తీసుకుని వారి శిక్షణా సహాయం పొంది సంపాదకరంగంలో ఎదిగిన వారో,వారిని గురుభావంతో గౌరవించి తమను తాము సంపాదకులుగా మలచుకున్నవారో అయిఉండటం. నాకు చాలా సంతోషం వేసింది.అలాంటివారిలో ఎం.చలపతిరావు గారు,మంజరి ఈశ్వరన్ గారు,వసుధ చక్రవర్తి గారు,ఎ.ఎస్.రామన్ గారు,సి.ఎల్.ఆర్.శాస్త్రి గారి లాంటి ప్రఖ్యాత సంపాదకులుండటం గొప్ప విషయం.ప్రొఫెసర్ చలపతిరావు గారి ఆకర్షణీయమైన మాటల్లో ,
These stalwarts “were either his admiring apprentices or devoted disciples.”
శ్రీ కోలవెన్ను వారిది ఎంత గొప్పతనం,ఎంత గొప్ప గుణం,ఎంత గొప్ప సంస్కారం !
తరచుగా చెబుతుంటేవారు, వారికి పత్రికా నిర్వహణలో పూర్తి సహకారమందించిన ప్రజ్ఞావంతులైన మంచి స్నేహితులను గురించి.వారిలో ముఖ్యంగా ప్రొఫెసర్ కె.చంద్రశేఖరన్ గారి గురించి ఎంతో ప్రేమతో చెబుతుండేవారు.చాలాకాలం బెంగుళూరు నుండి త్రివేణి వెలువడేది.కొద్దికాలం మద్రాసు నుండి.ఆతర్వాత ఎక్కువకాలం మచిలీపట్నం నుండి వెలువడేది. పాపం,ఎందరో తన మిత్రులు పోయారని,తాను మాత్రం మిగిలినానని ఒకరకమైన దిగులుతో అంటూ ఉండేవారు.ఆంగ్ల భాషలో నిష్ణాతులు ,రచనా పాటవం కలిగినవారిని ఎడ్వైజరీ బోర్డులో పెట్టుకునేవారు.ప్రొఫెసర్ కె.చంద్రశేఖరన్ గారు,డాక్టర్ .డి.ఆంజనేయులు గారు,ప్రొఫెసర్ కె .విశ్వనాధం గారు,ఎం.పి.పండిట్ గారు ,ఆ తర్వాత గంగాధర గాడ్గిల్ గారు ,ప్రేమా నందకుమారుగారు మొదలైనవారు.
శ్రీ కోలవెన్ను వారు పత్రిక స్థాపించినదాదిగా నలభై సంవత్సరాలు సంపాదకులుగా మహోన్నత స్థాయిలొ త్రివేణిని నిర్వహించారు.వారి కంటి చూపు తగ్గి ఆర్ధిక ఇబ్బందులు పెరిగి పత్రిక నడపటం కష్టమైనపుడు పత్రికా నిర్వహణ బాధ్యతలను డాక్టర్ భావరాజు నరసింహారావు గారికి అప్పజెప్పారు.వారు ఇరవైఐదు సంవత్సరాలు సంపాదకులుగా పత్రికను సమర్ధవంతంగా నడిపారు. ఆ తర్వాత వారు పత్రికా నిర్వహణ బాధ్యతలను పండితులు,ఆంగ్లభాషా కోవిదులు,ప్రఖ్యాత రచయిత ,రాజీవ్ గాంధి ప్రతిభాపురస్కార గ్రహీత ప్రొఫెసర్ ఐ.వి.చలపతిరావు గారికి అందజేసారు. ప్రొఫెసర్ ఐ.వి.చలపతిరావు గారు గత ఇరవై సంవత్సరాలుగా చీఫ్ ఎడిటర్ గా పత్రికను చక్కగా నడుపుతూ త్రివేణి పూర్వవైభవం సంతరించుకునేటట్లుగా చేసారు. వారి ఆధ్వర్యం లో ఒక క్రొత్త పునరుజ్జీవనం త్రివేణిలో ప్రవేశించింది .త్రివేణి ఫౌండేషన్ ఏర్పాటయింది. ఇబ్బడి ముబ్బడిగా చందాదారుల సంఖ్య పెరిగింది.ఎందరో గొప్ప వితరణ పరులు పెద్ద మొత్తాలలో డొనేషన్లు అందజేస్తున్నారు.ప్రొఫెసర్ ఐ.వి.చలపతిరావు గారి రచనా కౌశల్యానికి ,అంకితభావానికి ప్రొఫెసర్ శ్రీధరమూర్తి గారి నిర్వహణ సామర్ధ్యం తోడైంది. 1928లో స్థాపింపబడిన త్రివేణి పత్రిక క్రమ క్రమంగా సిల్వర్ జూబిలీ,గోల్డెన్ జూబిలీ,డైమండ్ జూబ్లీ,ప్లాటినం జూబ్లీ విజయోత్సవాలను జరుపుకుంది. అంతేకాకుండా సహస్రచంద్రదర్శన మహోత్సవాలు జరుపుకుంది.ఇది భారతీయులందరికీ గర్వ కారణం. శ్రీ కోలవెన్ను వారి ఆశలను ,ఆశయాలను ప్రతిబింబిస్తూ ప్రొఫెసర్ ఐ.వి.చలపతిరావు గారి ఆదర్శవంతమయిన చీఫ్ ఎడిటర్షిప్ క్రింద భారతదేశం లోని వివిధ సాహితీ,సాంస్కృతిక,కళా సాంప్రదాయాలు త్రివేణిలో సంగమించగా తల్లినదిలా హుందాగా,అందంగా ముందుకు, మున్ముందుకు సాగుతుంది.
———–