కొంపెల్ల జనార్ధనరావు (Kompalla Janardhanarao)

Share
పేరు (ఆంగ్లం)Kompalla Janardhanarao
పేరు (తెలుగు)కొంపెల్ల జనార్ధనరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1907
మరణం6/23/1937
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునాటికలు : తాన్ సేన్, ‘తెలుగు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుచండ ప్రచండ శిలాభినవ కొక్కొండ
ఇతర వివరాలుప్రముఖ భావకవి మరియు నాటక రచయిత.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకొంపెల్ల జనార్ధనరావు
సంగ్రహ నమూనా రచనప్రముఖ భావకవి మరియు నాటక రచయిత. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటాన్ని ఇతనికి అంకితమిచ్చాడు. విశాఖపట్నం లోని ‘కవితా సమితి’ ద్వారా పురిపండా అప్పలస్వామి సాహచర్యంతో మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రేరణతో భారతి పత్రికలో చేరాడు. భారతి, ఆంధ్రపత్రిక, సుభాషిణి మొదలైన పత్రికలలో దాదాపు 25 కవితా ఖండికలను భావ కవితారీతిలో ప్రచురించాడు. 1934 డిసెంబరు లో ఉదయిని అనే ద్వైమాసిక సాహిత్య పత్రికను వెలువరించడం ప్రారంభించాడు.

కొంపెల్ల జనార్ధనరావు

ప్రముఖ భావకవి మరియు నాటక రచయిత. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటాన్ని ఇతనికి అంకితమిచ్చాడు. విశాఖపట్నం లోని ‘కవితా సమితి’ ద్వారా పురిపండా అప్పలస్వామి సాహచర్యంతో మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రేరణతో భారతి పత్రికలో చేరాడు. భారతి, ఆంధ్రపత్రిక, సుభాషిణి మొదలైన పత్రికలలో దాదాపు 25 కవితా ఖండికలను భావ కవితారీతిలో ప్రచురించాడు. 1934 డిసెంబరు లో ఉదయిని అనే ద్వైమాసిక సాహిత్య పత్రికను వెలువరించడం ప్రారంభించాడు. ఇతడు ‘తాన్ సేన్’ మరియు ‘తెలుగు’ అనే నాటికలు రచించాడు. ఉదయిని అనే సాహితీ పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఉదయిని సాహిత్య పత్రికను ఆయన ఆరు సంచికల కన్నా వెలువరించలేకపోయారు. సాహిత్యానికి ప్రజాభిమానం సంపాదించాలన్న గొప్ప ఆశయంతో అహర్నిశలు పనిచేసి పత్రికను కొనమని వాడవాడలా బిచ్చమెత్తారు. అప్పటి కొత్త కవులు నవ్యసాహిత్యపరిషత్ తరఫున స్థాపించుకున్న ప్రతిభ అనే సాహిత్య పత్రిక సాహిత్యపరుల అభిమానం చూరగొనడంతో ఉదయిని పత్రిక మరింత దెబ్బతింది. ఈ క్రమంలో ఆయన చేసిన శారీరిక, మానసిక శ్రమ వల్ల అనారోగ్యం దాపురించింది. ముద్రణ ఖర్చులు కొంపెల్ల ఇవ్వలేకపోవడంతో ముద్రాపకుడు ఉదయిని ఏడో సంచికను చిత్తుకాగితాలుగా అమ్మేశారు. ఈ అఘాతం తట్టుకోలేక, అనారోగ్యం తీవ్రమై క్షయ వ్యాధితో దుర్భర దారిద్ర్యంలో దీనస్థితిలో కొంపెల్ల మరణించారు.

1928లో శ్రీశ్రీ రచించిన ప్రభవను కొంపెల్ల సమీక్షిస్తూ తీవ్రంగా వ్యతిరేక విమర్శలు చేశారు. విచిత్రంగా ఆ విమర్శల వల్లనే కలిసి వీరిద్దరు మంచి మిత్రులయ్యారు. అప్పటి నుంచి 1937లో కొంపెల్ల మరణించేవరకూ వారిద్దరి స్నేహం కొనసాగింది. శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని అంకితమిస్తూ ఇతని గురించి కొంపెల్ల జనార్ధనరావు కోసం అనే కవిత రాశారు.[1] శ్రీశ్రీకి, కొంపెల్లకు ఏ రకమైన భావసారూప్యత లేకున్నా వారి మధ్య స్నేహం మాత్రం చాలా చక్కగా కలిసిపోవడం విశేషం. పైగా మహాప్రస్థాన కావ్యానికి ఏమాత్రం సంబంధం లేని భావాలు కలిగిన కొంపెల్లకు అతని మరణం, అందులోనూ సాహిత్య పత్రికలు వర్థిల్లాలన్న మహదాశయంతో మరణించడం వంటివి శ్రీశ్రీని కదిలించాయి. కొంపెల్ల ఉదయిని దెబ్బతినడానికి కారణమైన ప్రతిభ పత్రిక సంపాదకవర్గంలో ఒకరైన శ్రీశ్రీ పరోక్షంగా తన వల్ల జరిగినదానికి బాధ కూడా కలిసి మహాప్రస్థానం కొంపెల్లకు అంకితం చేయించివుంటుందని శ్రీశ్రీ చరిత్రకారుడు బూదరాజు రాధాకృష్ణ అభిప్రాయం.
మహాప్రస్థానం అంకితం చేస్తూ అంకితం కవితను మహాప్రస్థానంలో ప్రచురించారు. అందులో అనాదరణతో అలక్ష్యంతో సాహితీ ప్రపంచం ఒక్కణ్ణీ చేసి వేధించి బాధిస్తే వెక్కివెక్కి ఏడుస్తూ దొంగలంజకొడుకు లసలే మెసలే ఈ ధూర్తలోకంలో నిలబడజాలక, తలవంచుకుని వెళ్ళిపోయావా నేస్తం అని రాసుకున్నారు. తామిద్దరూ ఎక్కడెక్కడ ఎలా కలిసి తిరిగారో సాహిత్యమే సమస్తమనుకుని ఎలా కష్టాలు పడ్డారో స్మరించుకున్నాడు. కొంపెల్ల మరణిస్తే ఆరేడుగురు తప్ప మరెవరూ దు:ఖించలేదన్నారు. నీవేమైపోయినా మా బురఖా మేం తగిలించుకున్నాం. మా కాళ్ళకు డెక్కలు మొలిచాయి. మా నెత్తికి కొమ్ములలాగే అంటూ నిందించుకున్నారు. నిన్న వదిలిన పోరాటం నేడు, అందుకొనక తప్పదు. నిన్ను ఆవాహన చేసి కదనశంఖం పూరిస్తున్న నాలో ఆవేశించమని ఆయనను కోరాడు.
కొంపెల్ల జనార్ధనరావు సంప్రదాయవాది. ప్రవర్తనలో పరమ సనాతనుడు. సాహిత్యం పట్ల అత్యంత ప్రేమ కలిగిన వ్యక్తి. తన అనారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా సాహిత్యసేవ చేసి నడివయస్సు కూడా రాకుండానే మరణించారు

కొంపెల్ల జనార్ధనరావు కోసం

తలవంచుకు వెళ్లిపోయావా నేస్తం!
సెలవంటూ ఈ లోకాన్ని వదిలి…
తలపోసిన వేవీ కొనసాగకపోగా,
పరివేదన బరువు బరువు కాగా,
అటు చూస్తే, ఇటు చూస్తే ఎవరూ
చిరునవ్వూ, చేయూతా ఇవ్వక-
మురికితనం కరకుతనం నీ
సుకుమారపు హృదయానికి గాయం చేస్తే-
అటుపోతే, ఇటుపోతే అంతా
అనాదరణతో, అలక్ష్యంతో చూసి
ఒక్కణ్ణీ చేసి వేధించారని, బాధించారని,
వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్లిపోయావా, నేస్తం!
తలవంచుకు వెళ్లిపోయావా, నేస్తం!
దొంగలంజకొడుకు లసలే మెసలే ఈ
ధూర్తలోకంలో నిలబడజాలక
తలవంచుకునే వెళ్లిపోయావా, నేస్తం!
చిరునవ్వులనే పరిచేషన చేస్తూ…
అడుగడుగునా పొడచూపే
అనేకానేక శతృవులతో,
పొంచి చీకట్లో కరవజూసే
వంచకాల ఈ లోకంతో పొసగక
అంచితానంత శాంత సామ్రాజ్యం
దేన్ని వెతుక్కుంటూ వెళ్లావోయ్‌, నేస్తం!
ఎంత అన్యాయం చేశావోయ్‌, నేస్తం!
ఎన్ని ఆశలు నీమీద పెట్టుకుని,
ఎన్ని కలలు నీచుట్టూ పోగు చేసుకుని…
అన్నీ తన్నివేశావా, నేస్తం!
ఎంత దారుణం చేశావయ్యా, నేస్తం!
బరంపురంలో మనం ఇంకా
నిన్నగాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది!
కాకినాడ నవ్యసాహిత్య పరిషత్తును
కలకలలాడించిన నీ నవ్వు
కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే!
విశాఖపట్టణం వీధుల్లో మనం
‘ఉదయిని’ సంచికలు పట్టుకుని తిరగడం
జ్ఞాపకం ఉందా?
చెన్న పట్టణపు సముద్రతీరంలో మనం
అన్నీ పిచికగూళ్లేనా కట్టింది?
సాహిత్యమే సమస్తమూ అనుకుని
ఆకలీ నిద్రా లేక,
ఎక్కడ ఉన్నామో, ఎక్కడకు పోతామో తెలియని
ఆవేశంతో,
చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ
ఎక్కడకో పోతూన్న మనల్ని
రెక్కపట్టి నిలబెట్టి లోకం
ఎన్నెన్ని దుస్సహ దృశ్యాలు చూపించి,
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి,
కలలకు పొగలనూ, కాటుకలనూ కప్పి,
శపించిందో, శఠించిందో మనల్ని:
తుదకు నిన్ను విషనాగురలలోనికి లాగి,
వూపిరితిత్తులను కొలిమితిత్తులుగా చేసి,
మా కళ్లల్లో గంధక జ్వాలలు,
గుండెలలో గుగ్గిలపు ధూమం వేసి,
మాదారిలో ప్రశ్నార్థ చిహ్నాల
బ్రహ్మ చెముడు డొంకలు కప్పి,
తలచుకున్నప్పుడల్లా,
తనువులో, అణువణువులో
సంవర్త భయంకర
ఝంఝూ పవనం రేగిస్తూ
ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను:
ఎంత మోసగించిందయ్యా మమ్ము:
ఎవరు దుఃఖించారులే, నేస్తం! నువ్వు చనిపోతే,
ఏదో నేనూ, ఆరుగురు స్నేహితులూ తప్ప!
ఆకాశం పడిపోకుండానే ఉంది!
ఆఫీసులకు సెలవు లేదు!
సారాదుకాణాల వ్యవహారం
సజావుగానే సాగింది!
సానుభూతి సభలలో ఎవరూ
సాశ్రు నేత్రాలు ప్రదర్శించలేదులే నీకోసం!
ఎవరి పనులలో వాళ్లు!
ఎవరి తొందరలో వాళ్లు!
ఎవరికి కావాలి, నేస్తం!
ఎమయిపోతేనేం నువ్వు!
ఎవ్వరూ నిన్ను స్మరించడం లేదులే!
ఎవరికి కావాలి, నేస్తం! నువ్వు
కాగితం మీద ఒకమాటకు బలి అయితే,
కనబడని వూహ నిన్ను కబళిస్తే,
అందని రెక్క నిన్ను మంత్రిస్తే! నియంత్రిస్తే!
ఎవరికి కావాలి నీ నేస్తం?
ఎమయి పోతేనేం నువు?
మా బురద రోజూ హాజరు!
మా బురఖా మేం తగిలించుకున్నాం!
మా కాళ్లకు డెక్కలు మొలిచాయి,
మా నెత్తికి కొమ్ముల లాగే!
మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు!
లేదు నేస్తం, లేదు!
నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు!
నిరుత్సాహాన్ని జయించడం
నీ వల్లనే నేర్చుకుంటున్నాము!
ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు
భయం లేదులే అయినప్పటికీ
నీ సాహసం ఒక ఉదాహరణ!
నీ జీవితమే ఒరవడి!
నిన్న వదిలిన పోరాటం
నేడు అందుకొనక తప్పదు!
కావున ఈ నిరాశామయలోకంలో
కదనశంఖం పూరిస్తున్నాను!
ఇక్కడ నిలబడి నిన్ను
ఇవాళ ఆవాహనం చేస్తున్నాను!
అందుకో ఈ చాచిన హస్తం!
ఆవేశించు నాలో!
ఇలా చూడు నీ కోసం
ఇదే నా మహాప్రస్థానం!

 

———–

You may also like...