పేరు (ఆంగ్లం) | Muddamshetty Hanumanthrao |
పేరు (తెలుగు) | ముద్దంశెట్టి హనుమంతరావు |
కలం పేరు | ముద్దంశెట్టి |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కథలు : అంతరార్థం, అంతర్మథనం, అతకని ఆంతర్యాలు, అతి తెలివి, అనుకోని అదృష్టం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ముద్దంశెట్టి హనుమంతరావు అంతరార్థం |
సంగ్రహ నమూనా రచన | వేడివేడిగా వున్న ‘టీ’ ని వూదుకుంటూ త్రాగుతున్నాడు కూర్మారావు. ‘‘మీ అమ్మని యిక్కడికి తీసుకొచ్చీ మావాఁ…’’ మెల్లగా అంది కూనమ్మ. భార్య యిలా అనడం, ఒక్కసారి ఆశ్చర్యం కలిగించింది కూర్మారావుకి ఆమెకేసి అదోలా చూశాడు. ‘తాను కలగనడం లేదుకదా…’ అనుకున్నాడు క్షణంపాటు. కలకాదని, త్రాగుతున్న వేడి ‘టీ’ గుర్తు చేసింది. |
ముద్దంశెట్టి హనుమంతరావు
అంతరార్థం
వేడివేడిగా వున్న ‘టీ’ ని వూదుకుంటూ త్రాగుతున్నాడు కూర్మారావు.
‘‘మీ అమ్మని యిక్కడికి తీసుకొచ్చీ మావాఁ…’’ మెల్లగా అంది కూనమ్మ.
భార్య యిలా అనడం, ఒక్కసారి ఆశ్చర్యం కలిగించింది కూర్మారావుకి ఆమెకేసి అదోలా చూశాడు. ‘తాను కలగనడం లేదుకదా…’ అనుకున్నాడు క్షణంపాటు. కలకాదని, త్రాగుతున్న వేడి ‘టీ’ గుర్తు చేసింది.
కూర్మారావు అంతగా ఆశ్చర్యపోడానికి కారనం లేకపోలేదు. ఇప్పటికి అయిదేళ్లయ్యింది ` తానీ వూరొచ్చి… తనకి పెళ్ళయి; ఒక్కరోజు కూడా అత్తవిషయం కూనమ్మ ప్రస్తావించలేదు సరిగదా, యెప్పుడైనా ఆమె ప్రస్తావనవస్తే ఛర్రున ఒంటికాలు మీద లేచేది. అటువంటి కూనమ్మ, అత్తని తీసుకురమ్మని చెప్తూ వుండటం, ఆశ్చర్యం కలిగించక మరేమవుతుంది?
‘‘ఏటే కూనా, యియ్యాల అర్ధంతరంగా నీలో మార్పొచ్చీసిందేటి? ఆఁ….’’ అన్నాడు సూటిగా ఆమె మొహంలోకి చూసి.
‘‘నీకు యేలాకోలంగా వుంటాది గాని, నాను సెప్పినట్లు సెయ్యిమావాఁ నేనేం సెప్పినా, యేం సేసినా, దానికేదో అర్ధముంటాది…’’ కాస్తంత విసుగ్గా అంది కూనమ్మ.
కూర్మారావు, టీ త్రాగడం ముగించి, గ్లాసుని పెళ్లాం చేతికందించాడు.
‘‘అలసిసయం యేటో నాతో సెప్పకూడదేటి? ఇన్నిరోజులూ మా అమ్మ మీద లేనిపేమ, యిప్పుడొచ్చీసినాదేటి?’’ అన్నాడు.
కూనమ్మ, మొహం చిటించుకుంది. మొగుడెప్పుడూ యిలా నిలదీసి అడిగిన రోజు యింతవరకూ లేదు. ఈ రోజేవిఁటి చెప్పా యిలా అడుగుతున్నాడు?… అని మనసులో అనుకుంది.
‘‘అబ్బబ్బ నీతో యిదే సిక్కు మావాఁ…. అన్నింటికీ రాల తీస్తావు. నానేం సేసినా, మన మంచికి, మన పిల్లల మంచికే సేత్తానుకదా’’ విసుగ్గా అంది.
‘‘ఏటే మంచి? నేను తెల్సుకోకూడదేటి?’’
‘‘మీ అమ్మ బాగా డబ్బు యెనకేసిందట వడ్డీలకి అప్పులిస్తందట కూడా. ఆమెని మనం తీసుకొచ్చి కొద్దిరోజులాదరించినా మనుకో లోకమా మెచ్చకుంటుంది… మీ అమ్మ మురిసిపోద్ది. ఆమెని మెప్పించి, మనసు మార్చి ఆమె దగ్గరున్న డబ్బు చేజిక్కించుకున్నామనుకో సక్కా ఓ దుకాణం పెట్టుకోవచ్చు. దాంతో మనం పెద్దోలమై పోవచ్చు. మన అదురుస్తవేం మారిపోది’’ అంటూ తన మనసులోని మాట చెప్పింది కూనమ్మ.
పెళ్లాం ఆలోచన బాగా నచ్చింది కూర్మారావుకి…
‘‘అదా సంగతి? నీ బుర్ర మా గొప్పపదునెందే కూనమ్మా. సరే ఎల్లి తీసుకొత్తాలే’’ అన్నాడు.
కూనమ్మ, తృప్తిగా ముసి ముసిగా నవ్వుకుంది. ఆమె మెదడులో యేవేవో ఆలోచనలు అప్పుడే స్వైరవిహారం చేస్తున్నాయ్.
కూర్మారావు తల్లి, ఎరకమ్మ. ఎరకమ్మ మొగుడు చనిపోయేసరికి, కూర్మారావు వయస్సు సుమారు పదిహేనేళ్లు. వాణ్ణి ఎరకమ్మ, ఆ యింటా, యీ యింట అంట్లుతోముకుని పెద్దవాణ్ణి చేసింది. ఆమె పన్జేస్తుండే ఓ ఇంటి యజమాని ధర్మమా అంటూ, కూర్మారావుకి పక్కవూరి ఫ్యాక్టరీలో ఓ చిన్న వుద్యోగం దొరికింది. ఉద్యోగం దొరగ్గానే, వాణ్ణో ఇంటివాణ్ణి చేసెయ్యాలనుకుంది, ఏరకమ్మ ఆ మరుసటి సంవత్సరమే కొడుక్కి పెళ్లి చేసింది.
కూనమ్మ సంసారానికి వచ్చిన తక్షణం ఆ ఇంటి వాతావరణమే మారిపోయింది. ఎరకమ్మని దూరంగానే వుంచింది. ‘నా’ అనే భావం, ఆమెలో బాగా జీర్ణించుకుపోయింది. ఫలితంగా, ఫ్యాక్టరీ వున్నవూళ్లోనే కాపురం పెట్టింది. ఎరకమ్మ గురించి ఆమె ఆలోచించన లేదు. ఆమె వున్నచోటరే వుండాలని తీర్మానించింది. అనుకోని యీ పరిణామానికి, రకమ్మ విచారించలేదు. కొడుకూ, కోడలు సుఖంగా జీవితాన్ని నడపడమే ఆమె కాంక్షించింది.
ఎరకమ్మ, యెప్పటిలానే అంట్లు తోముకుని, జీవితాన్ని గడుపుకొస్తుంది. తనపొట్ట పోషించుకోవడం, ఆమె కెప్పుడూ సమస్యకాలేదు. అయితే యెటొచ్చీ కొడుకూ, కోడలూ తన కళ్ల ముందు లేరనే బాధ మాత్రం మెని అప్పుడప్పుడూ కలవర పరుస్తూ వుండేది.
కొడుకు వచ్చి తనతోపాటు వచ్చేయమని ఆహ్వానించడం, ఎరకమ్మకి నిజంగా ఆశ్చర్యమే కలిగింది. ‘‘ఇన్నాళ్లూ లేనిది, హఠాత్తుగా కొడుకూ, కోడలులో యీ ఆప్యాయత యెలా వుట్టిపడింది’’ అన్నదే అర్థం కాని విషయమయ్యింది.
‘‘మీరు కులాసాగా వుంటే, అంతేసాలురా అయ్యా. నా నక్కడికి రావాలేటి చెప్పు. ఇక్క నాకు బాగానే వుందిగా’’ అంది ఎరకమ్మ.
‘‘అదంతా నాకు తెలవదు. మీ కోడలు నన్ను తీసుకొచ్చేయమంది అంతే’’ మారాం చేసినట్టుగా అన్నాడు, కూర్మారావు.
‘‘దానికి నామీద అంత ప్రేమ పుట్టేసిందేంటా?’’ అంది ఎరకమ్మ, అదోలా కొడుక్కేసి చూస్తూ.
కూర్మారావు లోలోన గతుక్కుమన్నా, వెంటనే సర్దుకున్నాడు.
‘‘అదేం మాటే అమ్మా? నువ్వంటే దానికి వల్లమాలిన అభిమానంవేనే… ఏటొచ్చీ నాను సంపాదిత్తంది, అందరికీ సాల్దని, యిన్నాళ్ళూ పిల్లేదు. మరింక నువ్వేమీ అడ్డు సెప్పకుండా బైలుదేరుమీ…’’ అన్నాడు కూర్మారావు, యింక వాదోపవాదాలు అనవసరమన్నట్టు.
కొడుకు అంత దీనిగ చెప్తుంటే, తాను వెళ్లకపోవడం, బాగుండదనిపించింది, ఎరకమ్మకి తాను కొడుకు దగ్గరి కెళ్లి పోతున్నట్టు అందరికీ చెప్పింది, యెంతో వుత్సాహంతో; వాళ్లూ ఆనందించారు. కొడుకు దగ్గరికి తల్లి వెళ్లిపోతూంటే; ఆనందించారూ మరి. అది తెగని బంధం.
కొడుకుతోపాటు బయలుదేరింది ఎరకమ్మ.
కూనమ్మ అత్తని చూడాంనే వుట్టి పడుతూన్న ఆప్యాయతతో, ముందుకొచ్చి ఆహ్వానించింది. తన కోడలు బాగా మారిపోయిందనుకున్న ఎరకమ్మ తృప్తిగా నవ్వుకుంది.
‘‘బాగున్నావే కూనా’’ కుశల ప్రశ్న వేసింది ఎరకమ్మ.
‘‘ఏదో యిట్లావున్నాం అత్తమ్మా నువ్వు మా దగ్గరనేకపోతే యేటోలా వుంటుంది. అందుకే మీ అబ్బాయికి సెప్పినాను, నిన్ను వెంటనే తీసుకొచ్చీమని…’’ అంటూ పీట తెచ్చివేసింది కూచోమన్నట్లు.
ఎరకమ్మ కూచుంది కూర్మారావు తల్లి పెట్లెవి లోపల పెట్టేశాడు.
‘‘ఇడిగోనే నీ మనవఁడు…’’ అంటూ చాపమీదున్న కొడుకుని తెచ్చి, తల్లకి అందించాడు కూర్మారావు.
ఎరకమ్మ వాత్సల్యపూరితంగా మనవుణ్ణి యెత్తుకుని, ముద్దుల వర్షం కురిపించింది. ‘‘ఒరే కూర్మం, నువ్వు తెచ్చి చూపించకపోయినా, యీణ్ణి చూడ్డానికి నానే వచ్చేసినాన్రా’’ అంది నిష్ఠూరంగా.
కూర్మారావు మరేం మాట్లాడలేదు. నిజమే యేం చెప్పగలడు?
‘‘లెగత్తమ్మా, అన్నం తిందువుగాని…’’ అంది కూనమ్మ.
‘‘తొందరేటి లేయే… అందరం ఒక్కసుట్టే తిందాం….’’ అనేసి, మనవణ్ణి ఆడిస్తూ కూచుంది ఎరకమ్మ.
కూర్మారావు వీధిలోకి వెళ్లాడు.
వారం రోజులు గడిచాయి.
ఓ రోజు రాత్రి భోజనాలయ్యాక ఎరకమ్మ, కూర్మారావు, కూనమ్మ బైట మంచం వేసుక్కూచున్నారు.
వాతావరణం నిశ్శబ్దంగా వుంది.
‘‘సెప్పు మావాఁ…’’ అంది కూనమ్మ
‘‘నువ్వే సెప్పు…’’ కూర్మారావు అన్నాడు.
ఆ చెప్పదల్చుకున్నదేమిటో ఎరకమ్మకి అర్థం కాలేదు.
‘‘ఏట్రా అది….?’’కొడుక్కేసి చూస్తూ అడిగింది, ఎరకమ్మ.
మొగుడు సరిగ్గా చెప్పలేడని, తనే అందుకొంది కూనమ్మ.
‘‘ఏం లేదత్తమ్మా మరేటంటే, మీ అబ్బయి యేదేనా దుకాణం పెడతానంటున్నాడు. తెచ్చకున్న జీతపురాళ్లు సాల్డంనేదు, రోజులు మండిపోతున్నాయిగదా ఓసిన్న ‘టీ’ దుకాణం పెట్టుకోవాలన్నా డబ్బుండాలి నువ్వో అయిదొందలు సాయం చేసినావంటే, కొన్నాళ్లుపోయాక, యిచ్చేత్తాం’’ అసలు విషయం వెల్లగక్కింది కూనమ్మ.
‘‘ఔనమ్మా నీ డబ్బు పువ్వుల్లో పెట్టి యిచ్చేత్తామే’’ భార్య మాటలకి తాళం వేశాడు కూర్మారావు.
ఎరకమ్మ, విస్తుపోయింది. ఆ చీకట్లో ఆమె ముఖ కవళికలు యెవ్వరూ గమనించలేదుగాని, ఆ ముఖంలో రంగులు మారినయ్. తన దగ్గర డబ్బెక్కడిది? అసలు తన దగ్గర డబ్బుందని యెవరు చెప్పారు?… అనుకుంది మనసులో ఇప్పుడామెకి అర్థమయ్యింది, తనని తీసుకురావడానికి గల కారణం యేమిటో… తనంటే యింత అభిమానాన్ని యెందుకు ఒలకబోస్తున్నారో… నిజంగా ఆమెకెంతో బాధ కలిగింది.
‘‘నా దగ్గిర డబ్బుందని యెవరు సెప్పినారు కూనా? అదీ అయిదొందలా? అయిదు రూపాయిల్లేవు… అయినా, నాకెట్లా వస్తుంది డబ్బు సెప్పు? పదిళ్లలో పనిసేసుకుంటన్నాగాబట్టి, పస్తుండకుండా గడిపేత్తన్నాను. కావాలంటే, నా పెట్టే సూసుకో’’ అంది ఎరకమ్మ, కనుబొమ్మలు ముడుస్తూ.
కూనమ్మ మొహం యర్రబడ్డం, ఎరకమ్మగాని, కూర్మారావుగాని ఆ చీకట్లో చూళ్లేదు. ‘‘అందరూ చెప్తుంటే ఔనేమో నన్కున్నా… అయినా, నువ్వెందుకిత్తావులే మాకు…’’ అనుకుని చిరబుర లాడుతూ లోపలికి వెళ్లిపోయింది కూనమ్మ.
కొంపేదో ముణిగిపోయినట్టుగా, కంగారుగా పెళ్లాం వెంట నడిచాడు కూర్మారావు. ఆ రాత్రి, ఎరకమ్మ ఆరుబైటే పడుకుంది. మనుషుల తత్త్వాలకి, డబ్బుకీ యెంత అవినాభావ సంబంధ ముందో అప్పుడర్థం చేసుకుందామె.
తెల్లవారింది.
ఎరకమ్మని పురుగును చూసినట్టు చూడ్డం ప్రారంభించింది కూనమ్మ. కూర్మారావు సంగతి చెప్పనవసరమే లేదు. పెళ్లాం చేతిలో కీలుబొమ్మ ఏం చెయ్యగలడు? ఇంక, ఇక్కడ ఒక్కక్షణం వుండబుద్ది పుట్టలేదు ఎరకమ్మకి.
‘‘ఓరయ్యా నానెల్లిపోతాన్రా’’ అంది కొడుకుతో.
‘‘మధ్యాహ్నం పన్నెండింటికొ బస్సుంది… ఎల్లిపో’’ అన్నాడు కూర్మారావు. కూనమ్మ వుండమనేం చెప్పలేదు.
ఎరకమ్మ, బరువుగా ఓ నిట్టూర్పు విడిచింది తాను డబ్బు తీసుకురాకపోవడం మంచిదే అయ్యింది లేకుంటే, రెంటికి చెడ్డ రేవడిలా తిరిగివెళ్లాల్సి వచ్చును. తాను గుడిసె వేసుకున్న యింటావిడ చెప్పిందే నిజమయ్యింది… అనుకుంది మనసులోనే.
‘‘వస్తాన్రా కూనా… వస్తానే…’’ అని యిద్దరిక చెప్పింది.
‘‘ఎల్లిరా…’’ అని కూర్మారావు అన్నాడు గాని, కూనమ్మ మౌనాం వుండిపోయింది.
‘‘చంటోడికి మంచి జుబ్బా యేదన్నా తీసుకోరా’’ అంటూ బొడ్లోంచి సంచి తీసి, అందులోంచి అయిదు రూపాయిలు తీసి కొడుక్కిచ్చింది.
ఆ మధ్యాహ్నం బస్సుకే వెళ్లిపోయింది ఎరకమ్మ. కొడకు, కోడలు తన పట్ల చూసిన ప్రవర్తనకి ఆమె హృదయం గాయపడింది. అయినా, యేంచెయ్యగలదు? నలుగురికీ చెప్పుకోలేదు. మనసులోనే మథపనడిందా తల్లి.
———–