పేరు (ఆంగ్లం) | Palla Durgaiah |
పేరు (తెలుగు) | పల్లా దుర్గయ్య |
కలం పేరు | |
తల్లిపేరు | నర్సమ్మ |
తండ్రి పేరు | పాపయ్య శాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 5/24/1919 |
మరణం | – |
పుట్టిన ఊరు | వరంగల్లు జిల్లా,హనుమకొండ మండలం, మడికొండ గ్రామం |
విద్యార్హతలు | ఎం.ఎ.,పి.హెచ్.డి |
వృత్తి | ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశారు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ప్రబంధ వాజ్మయ వికాసము (సిద్ధాంత గ్రంథము), గంగిరెద్దు (కావ్యము), పాలవెల్లి (ఖండకావ్య సంపుటి), పారిజాతాపహరణము, అల్లసాని పెద్దన (విమర్శ), చతుర వచోనిధి (విమర్శ), పెద్దన కవితావైభవం (యువభారతి ప్రచురణ), మాయరోగం (నాటకం), విక్రమార్క చరిత్ర (సంపాదకత్వం – ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పల్లా దుర్గయ్య దాగుడుమూతలు |
సంగ్రహ నమూనా రచన | మాగుడువడ్డ యీ భువన మంటప కేళి విహార లోలురై ఆగక వచ్చి మూగెడి యనంత జగజ్జనముల్ క్రమంబునన్ దాగుడుమూతలాడ, కనుదమ్ములు మూసెడి తల్లి యెవ్వరో? ఏగెడి వారిలోన దొర లెందరొ? చెల్లని దొంగ లెందరో? |
పల్లా దుర్గయ్య
దాగుడుమూతలు
మాగుడువడ్డ యీ భువన మంటప కేళి విహార లోలురై
ఆగక వచ్చి మూగెడి యనంత జగజ్జనముల్ క్రమంబునన్
దాగుడుమూతలాడ, కనుదమ్ములు మూసెడి తల్లి యెవ్వరో?
ఏగెడి వారిలోన దొర లెందరొ? చెల్లని దొంగ లెందరో?
ఏగెడివార లాడుకొని యేగ తదీయ పదాంక ముద్రితా
ధ్వాగమనేప్సులై యెదురుతాకుచు వచ్చు నవీనఖేలకుల్
మూగుదురప్పుడప్పుడె సముద్రతరంగములట్లు, క్రమ్మరన్
వేగమె విచ్చిపోవుదురు ఫేననముద్గత బుద్బుదక్రియన్
ప్రోగులు ప్రోగులై యిసుకపోసిన రాలని వాలకంబునన్
మూగిన మూకలో, నొకట ముందుకు వెన్కకు బారు వీరిలో
నాగతు లెందరో యిట ననాగతు లెందరొ, యిందులో నన
భ్యాగతు లెందరో యతిథులై చనుదెంచినవార లేందరో?
అక్కట నేలయీనినటు లంతట వింతగ నిండియుండి, యే
దిక్కున చూడ తామెయయి త్రిమ్మరునట్టి యుపిళ్లపుట్టలై
ఎక్కడనుండి యెక్కడకు నేగుచు యిక్కడి కేగుదెంచిరో
నిక్క మెఱింగి తెల్పు మహనీయులు యీ యిలలోన నెవ్వరో?
ఇక్కడ కూడినట్టి జను లెందరొ ముందర యిందు లేరు, ముం
దిక్కడ నున్నవార లిపు డెందరొ కానగరారు, చిన్నదై
చిక్కుల దుక్కియౌ కడు విచిత్రపు దాగుడుమూతలాటలో
నుక్కిరిబిక్కిరై నిలువనోడుచు నూడనిబాడియుండిరో?
ఆటకు రాకముందు దొర లందరు, మీదట దొంగలైనవా
రోటమి జెంది, కన్నుగవ లొక్కట మూయగబడ్డ పిమ్మటన్
నేటుగ బర్వుచుంద్రు, తమ నేరము లన్యుల నెత్తి రుద్దగా
చాటున నక్కియుండు దొరసంఘము భీతిని నిక్కిచూడగన్
అందరుగూడ తాము దొరలన్న యతార్థము విస్మరించి యీ
వందల వేలమంది, తమవారినె దొంగ లటంచు బల్కుచున్
నిందలు మోపుచున్ తమకు నేటుకువచ్చెడు దమ్ములేక, యి
బ్బందుల గొందిలో సణగి బాధలపాలగుచుందు రక్కటా!
రాత్రులయందు ప్రొద్దుల విరామములేక నిరంతరమ్ము నీ
సత్రములోపలన్ దిగి వెసన్ జనుటే పరిపాటి యయ్యు, నీ
ధాత్రియు దాగురింతలె, యథార్థమటంచు భ్రమించుటయే
చిత్రములోని చిత్రము విచిత్రపు దాగుడుమూతలాటలో!
క్రీడావేశము ముమ్మరమ్ముగొన స్వర్గీయస్థితిన్ వీడి, ని
ర్వ్రీడామానసులై పరస్పరజయశ్రీకాములై పోరు యీ
చూడాబద్ధ కిరీటఖేలకుల కిచ్చో వచ్చుచుం బోవుచో
జూడన్ గన్నులుమూయు ‘తల్లి’ యొకతే సూ! సాక్షియై నిల్చుబో!
(పాలవెల్లి ఖండకావ్య సంపుటి నుండి)
———–