పేరు (ఆంగ్లం) | Krovvidi Lakshmanna |
పేరు (తెలుగు) | క్రొవ్విడి లక్ష్మన్న |
కలం పేరు | |
తల్లిపేరు | |
తండ్రి పేరు | |
జీవిత భాగస్వామి పేరు | |
పుట్టినతేదీ | 1/1/1917 |
మరణం | |
పుట్టిన ఊరు | విజయనగరం |
విద్యార్హతలు | ఎం.ఎ, బి.ఎల్ |
వృత్తి | భారత ప్రభుత్వ కార్యాలయం, ఢిల్లీ లో 1942 ఉద్యోగం చేశారు |
తెలిసిన ఇతర భాషలు | ఇంగ్లీషు, సంస్కృతం, ఫ్రెంచి |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఆద్యంతాలు, ఉబలాటం, కాలం మారాలి (1965), తేనెపట్టు, పట్టు చొక్కా |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కొవ్విడి లక్ష్మన్న కొండవాడు |
సంగ్రహ నమూనా రచన | అబ్బో యీవాళా, నిన్ననా, ఆరేల్ల క్రితపు ముచ్చట అది. అయినా తలుచు కున్నప్పుడల్లా ఒల్లు ఝల్లుమంటూ ఉంటుంది. హఠాత్తుగా మమ్మలిన ‘‘సిబీ’’ వెళ్లమన్నారు. మోపులూ, స్కేళ్ళూ పుచ్చుకుని కార్యక్రమం ముపాయిదాగా వేసుకున్నాం ఓ గంటలో. తిరువేంద్రంనుంచి చెన్నపట్నం, అక్కణ్ణుంచి గ్రాండ్ ట్రంక్లో ఢిల్లీ, తరువాత రోహ్రీ, ఆపైన ‘‘సిబీ’’ని. ‘‘సిబీ’’నుంచి క్వెట్టా అంది పుచ్చకున్నట్టు ఉంటుంది. అక్కడే వచ్చి పడింది వ్యాసఘట్టం. |
కొవ్విడి లక్ష్మన్న
కొండవాడు
అబ్బో యీవాళా, నిన్ననా, ఆరేల్ల క్రితపు ముచ్చట అది. అయినా తలుచు కున్నప్పుడల్లా ఒల్లు ఝల్లుమంటూ ఉంటుంది.
హఠాత్తుగా మమ్మలిన ‘‘సిబీ’’ వెళ్లమన్నారు. మోపులూ, స్కేళ్ళూ పుచ్చుకుని కార్యక్రమం ముపాయిదాగా వేసుకున్నాం ఓ గంటలో. తిరువేంద్రంనుంచి చెన్నపట్నం, అక్కణ్ణుంచి గ్రాండ్ ట్రంక్లో ఢిల్లీ, తరువాత రోహ్రీ, ఆపైన ‘‘సిబీ’’ని. ‘‘సిబీ’’నుంచి క్వెట్టా అంది పుచ్చకున్నట్టు ఉంటుంది. అక్కడే వచ్చి పడింది వ్యాసఘట్టం.
ఇంకా లోపలికి జొచ్చుకుపోవాలి. ఆప్ఘన్ స్థానంలో మా స్థావరాలు పదిలపరుచుకోవాలి. మహాక్లిష్టపరిస్థితి. ఏమంటారా? అక్కడ అం కొండవాళ్లు, తురకవాళ్ళూను. ఒఠ్ఠి పశుప్రాయులు. శంకా సమాధానాలంటూ ఉండవు వాళ్ళకి. చెయ్యిచేసుకోవడమే గాని, నోరు చేసుకోవడం ఎన్నడూ ఎరగరు. అదైనా ఎక్కడో పొంచుండి అర్థరాత్రో అపరాత్రో మీద విరుచుకుపడతారు. ఒంటిగా ఆ ప్రదేశాల్లో తిరుగాడినవాడు తిరిగీ నిరపాయంగా శిబిరానికి చేరుకున్నాడంటే యముణ్ణి జయించాడన్నమాటే అందులోనూ మా జట్టులో ఒక సిక్కుగూడా ఉన్నాడు. ఆఠీనుజాకీలాగ మూరెడు బవిరిగెడ్డాం దిగదువ్వుకుని ‘‘అన్యమతస్థులని పరిమార్చడమే మోక్షప్రదమని నమ్ముతారు వాళ్ళు, జాగర్తసుమండీ’’ అన్న హెచ్చరికతో బయలుదేరేం. ఆ మాటలు నా చెవుల్లో గింగురమంటూనే ఉన్నాయి. సూట్లూ, బూట్లూ వేసుకోవడంవల్ల మేం కొంత కమ్ముకుపోగలం అని ధైర్యం చెప్పుకున్నా, యీ గెడ్డాపాయన దగ్గిరే వచ్చేది గొప్ప చిక్కు.
ఓనాడు ప్రొద్దున్నే లేచి వాళ్ళ చహరా కనిపెడదామని బయలుదేరేను. మేకలమందని తోలుకుపోతున్నాడు ఓ కుర్రవాడు. చిత్రంఏమిటా? వాడి చేతిలో చేపాటి కర్రకి బదులు తుపాకి ఉంది. తొడుక్కున్నది ఒక చెయ్యి లేని చొక్కా, వాడి తండ్రిదో పినతండ్రిదో కాకీనిక్కరూను. పదహారు పద్దెనిమిది ఏళ్ళకన్న ఎక్కువ ఉండవు. కాని మనిషి ఆజానుబాహు. ఆరు అడుగులపైన ఉంటాడు. దండలు కమ్మెచ్చులాగ ఉన్నాయి. బల్లపరుపుగా విశాలమయిన ఛాతీ, బొత్తాయిలు లేని ఆ చొక్కా తనకి చాలదని చెప్పక చెబుతోంది. నిక్కరు జేబులు ఎత్తుగా ఉన్నాయి.
ఇరవైగజాల దూరంలో ఉన్న నన్ను ఎలాగ పసికట్టేడో వేటకుక్కలాగ, గబుక్కున తిరిగి తుపాకీ యెత్తేడు. ఇంతట్లోకే నా దుస్తుల సరం జాంచూసి కాబోలు, ఎత్తిన తుపాకీ దింపేసేడు. సలాంచేసి తన దారిని పోబోయేడు. ‘‘ఏయ్’’ అని పిలిచేను.
వాడు తిరిగి నుంచున్నాడు.
‘‘తుపాకీ ఎక్కడిదీ’’ అని హుందాగా ప్రశ్నించాను.
‘‘నాదే’’
జవాబులో ఎంతమాత్రం కళవళం లేదు.
‘‘ఎందుకు పట్టుకెళుతున్నావు?’’
‘‘ఎందుకేమిటి? నిత్యం చూస్తూను.’’
మాట పెళుసుగా ఉందన్నమాటేగాని హృదయంలో ఏమీ కల్మషం లేదు. కాగా, నేను అక్కడ అధికారవర్గంలో వాణ్ణే నన్న భ్రమలో ఉన్నాడు. అసలుసంగతి ఎందుకు చెప్పాలీ? చెబితే ఏం కొంప ములుగుతుందో.
‘‘సరే, వెళ్లు’’
నిర్భయంగా ఎప్పటిలాగా నడక సాగించేడు వాడు. జేబులో రివాల్వరు భద్రంగా ఉన్న సంగతి నిశ్చయపరుచుకొని మరీ వెంటపడ్డాను, నేను.
అంతా కాలిబాటే, రోడ్డు కాదు. రాళ్ళూ రప్పలూ చిందరవందరగా ఉన్నాయి బాటమ్మట. త్వరగా కాళ్ళుపీకడం ఆరంభించేయి, నాగరికతా నాజూకు పెరిగిపోయి ఒఠ్ఠి ‘‘జపాను సరుకు’’ అయిపోయేం, రండికీ మొండికీ ఓర్చి పనిచెయ్యాలంటే మనవశమా?
వాడి ధర్మమా అని మరో పది గజాలలో మందని ప్రక్కకి గుట్టకేసి మళ్ళించి ఓబండరాతి మీద చతికిలబడ్డాడు. బతికేం భగవంతుడా అనుకుని నేనూ ఉన్నచోటే కూలబడ్డాను.
తుపాకీ ఓసారి చేతుల్లోకి తీసుకన్నాడు. పసిపాపని రెండు చేతులుతోటి ఎగరేసినట్టు అతి ఆప్యాయంగా ఆ ఆయుధాన్ని వాడు అరిచేతుల్లో ఉంచుకున్నాడు. అల్లల్లాడించేడు. నిశ్శబ్దంగా పెదిమెలు ప్రక్కకి పరిగెత్తేటట్టు దరహాసం చేసి, దాన్ని తుష్టహృదయంతో ప్రక్కని నిలుచోబెట్టేడు.
ఇంతట్లోకే ఒక చిన్న మేకపిల్ల అరిచింది. ఛటుక్కున తలయెత్తి చూసేడు. నేనూ అప్రయత్నంగా దృష్టి ఆవంకకే సారించేను. పోతుమేక ఒకటిదానిని కుమ్ముతోంది. ఒక్క దాటులో వెళ్లేడు. పోతుమేకడొక్కలో ఒక్క తాపుతన్ని, పిల్లని ముచ్చటగా రెండు చేతులతోను పొదివి పట్టుకుని ముట్ట్ని ఆఘ్రానించేడు, దాన్ని అలా చేతుల్లో యిముడ్చుకునే ఉల్లాసంగా వెర్రిగెంతులు వేసేడు. తరవాత భద్రంగా నేలకి దింపి, దాని వీపుతట్టేడు. అది గెంతులు వేస్తూ ‘‘మేమే’’ అని అరుస్తూ తల్లిదగ్గిరికి పోయి పొదుగులో మూతిపెట్టింది. వీడు దానివైపే రెప్పవెయ్యకుండా చూసేడు. హృదయం తెరుచుకునేటట్టుగా నవ్వి, పాలుత్రాగుతూన్న దాని దగ్గరే నిలుచున్నాడు, వీపు నిమురుతూను.
కొండవెధవదికూడా ఎంత జాలిగుండె
పదినిమిషాలు గడిచేయి. వాడు తిరిగివచ్చి బండరాతిమీద కూచున్నాడు. నిక్కరుజేబు లోకి చెయ్యిపెట్టి ఓ ‘‘పేకెట్టు’’పైకి తీసేడు. అది ఏమిటోనని బైనాక్యులర్సు పెట్టి చూతునూ? రొట్టెలు. మూడే మూడు రొట్టెలయినా ఒక్కొక్కటీ ఆంధ్రపత్రిక అంత ఉన్నాయి. వాటిని నెయ్యి నూనె ఏ వల్లకాడూలేదు. నిప్పులమీద కాల్చిన ఒఠ్ఠి పొడిరొట్టెలు. రెండు ఉల్లిపాయలు నంచుకుంటూ మూడు రొట్టెలూ తిన్నాడు. మంచినీళ్ళ ప్రసక్తే లేదు వాడికి; మనలాంటి వాళ్ళం అయితే అడుగు అడుగునా మెడబడి పోయి, గొంతుకు దిగక, మూడుచెంబుల నీళ్ళు ఖాళీచేసేవాళ్ళం. ఆరి పిడుగా, అనుకున్నాను. చప్పట్లు కొట్టినట్టు చేతులు దులుపుకుంటూ లేచి నిలబడ్డాడు. రెండో జేబులోంచి గుళ్ళు తీసి తుపాకి యెత్తి బారుగా అమర్చేడు.
నాకు కంగారు పుట్టింది. ఏం చేస్తాడు చెప్మా? ఏ అమాయిక జీవికి నూరేళ్ళూ నిండేయో? వీడినే రివాల్వరుతో కాల్చేస్తే? ఆ శబ్దానికి చుట్టుపట్ల వాళ్ళు ముట్టడించి నన్ను హతమార్చేస్తారు కాబోలు. కాకపోయినా ఒక్కడినీ బయలుదేరడం ఏమిటి, నా మొహం. ఇలాగ ఏదో తర్జనభర్జన చూస్తూనే ఉన్నాను.
వాడు ఓ మెట్లంగిరాయి పుచ్చుకున్నాడు కుడిచేత. తుపాకీ ఎడమచేతిలో వుంది. రాయి అంతరిక్షానికి రివ్వున విసిరేడు. రెప్పపాటు కాలంలో ఎడంచేతులో తుపాకి కుడిభుజం క్రిందికి వచ్చింది. గుండెకి ఆనుకుంది. ‘బారెలు’ క్రిందికి ఎడమచెయ్యి ప్రసరించింది. ఎడంకన్ను ముయ్యడం, కుడిది తెరవడం, కుడిచేతి చూపుడు వ్రేలితో ‘‘ట్రిగ్గరు’’ లాగడం క్షణకాలంలో సంభవించేయి. చెప్పడమే ఆలస్యం అవుతోంది అనుకోండి ఎగిరినరాయి ఆకాశంలోనే ఛిన్నాభిన్నం అయిపోయి తునకలుగా క్రిందపడింది.
ఏమి గురి ఎంతత్వరితం. రెప్పవెయ్యకుండా ఆశ్చర్యంతో బైనాకుయలర్సు దించకుండా అరగంటసేపు చూసేను. మన వేపు పశువులగుంటలు గోళీకాయలు ఆడుకుంటారు. వీళ్ళకి యిదీ పని శహబాసు ఇటువంటి నేర్పరులని మోసంచేతో, క్రౌర్యం చూపించో నాశనం చెయ్యడమా? ఏమి హృదయరహితమయిన పనీ ఇందులో ఎందుకు చెయ్యిచేసుకున్నానా అనిపించింది. వీళ్ళకే సరియియన సంస్కృతి కల్పించి, క్రమమయిన శిక్షణ యిచ్చినట్లయితే దేశమాతకి ఎంత చక్కటి అంగరక్ష ఏర్పడుతుందో గదా అని విస్తుపోయేపు. ఆలోచిస్తూన్న కొద్దీ కడుపు దేవుకుపోయింది. ఇంక నిలవలేక యింటిముఖం పట్టేను. ఆకలి, దాహం, చికాకున్నూ. నీరసించిపోతూన్నట్టు అనిపించింది.
ఎంత నడిచినా అంతు కనిపించదేం?
ఎవరో ప్రక్కనించే వెళుతూన్నట్టయింది.
‘‘క్వెట్టారహదారి యిక్కడికి ఎంతదూరం ఉంటుంది?’’ అని అడిగేను.
‘‘మీరు క్వెట్టారోడ్డు వదిలి అయిదుమైళ్ళు ఆఫ్ ఘన్ స్థానంలోకి వచ్చేరు.’’
‘‘చచ్చేన్రా భగవంతుడా’’
‘‘మీకు వచ్చి భయంలేదు. మా ఆతిథ్యం స్వకీరించి, కాస్త విశ్రమించి సాయంత్రం మీ యింటికి వెళుదురుగాని’’
భయం లేదని అతను అనడంతో నిజంగానే భయంవేసింది. తేరి బారి చూతునూ తురకవాడు.
‘‘అక్కర్లేదు. మీ ఆహ్వానానికి చాలా సంతోషం. నాదారిని నేను పోతాను’’ అన్నాను. బావిలోనుంచి వచ్చినట్టు వచ్చేయి ఆమాటలు పొడి ఆర్చుకుపోయిన నాగొంతుకలోంచి.
‘‘మీరు అలా అనడానికి వీలులేదు. అర్థించినవారికి అతిథిసత్కారాలు చెయ్యడం మా మతం. సంశయించకండి. రండి, పోదాం.
ఆ మాటలలో ఏమీ వక్రత లేదు.
ఇంటికి తీసుకుపోయేడు. నులకమంచం ఆసనం. రెండు పొడిరొట్టెలూ నాలుగు ముల్లంగి దుంపలూ, పింగాళీ గాలసునిండా మేకపాలూ పట్టుకొచ్చేడు. నాటు ఫేక్టరీలో తయారయిన మోటుతుపాకులు రెండు గోడని తగిల్చి ఉన్నాయి.వ టివేపు చూస్తూ, నెమ్మదిగా ఆతిథ్యం స్వీకరించేను. ఆతరవాత హుక్కా గొట్టాం ముందుంచేడు.
ఏమిటో యీ వింతవైఖరి.
ఆ సాయంత్రం పటాలం ఒకటి కొండ చరియలను ఆనుకుని పోతోంది. ఇంతలో ‘‘ఢా’’మ్మని తుపాకీ పేలినశబ్దం.
పటాలంలో ఒకడు బలిఅయి పడిపోయేడు.
దళనాయకుడికి పట్టరాని కోపం వచ్చింది. కొండకి యిరుప్రక్కలా గురిచేసి కాల్చమన్నాడు.
పావుగంటసేపు పటాలం మోషీనుగన్సు పేల్చింది. ఫలితంమాత్రం శూన్యం. చరియలో ఉంది పటాలం. పైనకొండమీద ఏ బండచాటున దాగున్నాడో ఆ కాల్చినవాడు. ఏ తుప్పచాటున పొంచిఉన్నాడో.
మళ్లీ ముందుకు సాగబోయింది పటాలం.
‘‘ఢాం, ఢాం, ఢాం’’ ముందున్న ముగ్గురూ పిట్టల్లాగ పడిపోయేరు. పటాలం నాయకుడు రుద్రుడయిపోయినాడు. కోపం, అవమానం అతన్ని చికాకుపరిచేయి. మళ్లీ ‘‘ఫైరు ఆర్డరు’’
అటునుంచిగూడా తుపాకీ ప్రేల్చిన చప్పుడు.
మరొక పదిమంది పటాలంలో ఆహుతి అయిపడిపోయేరు. కొండలోయ యుద్ధభూమి అయి ఊరుకుంది.
అంతలో కొండమీద తుప్పచాటున ఏదో కదిలినట్టయింది. ఆ చోటు గురిచూసి కాల్చేడు నాయకుడు. ‘‘ఢాం’’
ఈసారి గురితప్పలేదు. ఆ దెబ్బకి కొండమీద నుంచి దొర్లుకుంటూ వచ్చి పటాలం కాళ్లదగ్గిర పడ్డాడు ఒకడు. పడ్డ్డాడో లేదో స్ప్రింగు బొమ్మలాగ లేచి మరో ముగ్గుర్ని కాల్చేసేడు.
నాయకుడి ‘‘బేయెనెట్టు’’ డొక్కలో దూసుకునే దాకా వాడు ప్రాణాలు కోల్పోలేదు. అనువులు ’’బాసినా ఆయుధం మాత్రం రెడీగా హస్తభాగానిన అలంకరించే ఉంది. ఎవడో కాదు వాడు. వాడే, ఆపశువుల కాపరి కుర్రాడు.
ఒంటిమనిషి సర్వాయత్తమయిన ఒక పటాలాన్ని ఎదిరించి సుమారు రెండుగంటలసేపు నిరోధించేడు. పాతికమందినయినా బలిగొంటేనేగాని ప్రాణాలు త్యజించేడు కాదు. ఏమిపుణ్యం, ఎంత ధైర్యం, ఎంతటిసాహసం.
పటాలం నాయకుడే మెచ్చుకున్నాడు. మిలిటరీ ఆనర్సుతో ఆకొండవాడి అంత్యక్రియలు ముగిసేయి.
———–