పేరు (ఆంగ్లం) | Takkallapalli Papasaheb |
పేరు (తెలుగు) | తక్కళ్లపల్లి పాపాసాహేబు |
కలం పేరు | – |
తల్లిపేరు | ఫక్రుబీ |
తండ్రి పేరు | ఫక్రుద్దీన్ |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1928 |
మరణం | 1/1/1981 |
పుట్టిన ఊరు | అనంతపురం జిల్లాయాడికి మండలం కేశవరాయునిపేట గ్రామం |
విద్యార్హతలు | విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడయ్యారు. |
వృత్తి | రాజకీయాలు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అంబ, అవధి, కన్నీటి చుక్కలు, నా రాజకీయ జీవితానుభవాలు, పాపుసాబు మాట పైడిమూట ప్రేమవిలాపము, రస ఖండము, రాజ్యశ్రీ, రాణీ సంయుక్త శకుంతల, సత్యాన్వేషణ, విశ్వనాథ నాయకుడు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | మహాకవి |
ఇతర వివరాలు | అనంతపురం జిల్లా కీర్తి ప్రతిష్ఠలు పెంచిన జాతిరత్నాలలో తక్కళ్లపల్లి పాపాసాహేబు ఒక అనంత ఆణిముత్యం. గాంధీగారి స్ఫూర్తితో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీకి అంకితమై దేశానికి సేవ చేశారు. చిన్నతనం నుండి కవితాభ్యాసం చేసి పదికి పైగా కావ్యాలను వ్రాశారు. ఇతని అంబ కావ్యము ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి భాషాప్రవీణ పరీక్షకు పాఠ్యగ్రంథంగా ఉండేది. ఇతని రచనలపై విశ్వవిద్యాలయాలలో ఎం.ఫిల్., పి.హెచ్.డి. స్థాయిలలో పరిశోధనలు జరిగాయి. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | తక్కళ్లపల్లి పాపాసాహేబు |
సంగ్రహ నమూనా రచన | ప్రాణము పోవుచున్న దలవంచని పౌరుషసాహసాలు, వా గ్దానమొసంగి తప్పని యుదార గభీరగుణమ్ము, లొంగుటే గానని యాత్మగౌరవము, కంపము చెందని గట్టి చేవయున్ మానపరాయణత్వ మసమాన మఖండము నై విరాజిలున్ (సత్యాన్వేషణ నుండి) |
తక్కళ్లపల్లి పాపాసాహేబు
ముస్లిముగా పుట్టి ‘ఇస్లాం’ మతము నాదరించుచు, పరమతసహనముతో బాటు, పరమ దైవమును కీర్తించి ‘‘కులముతోనీకు బనియేమి? గుణము నగ్నిలో బరీక్షించి నిత్యనిరూఢి గనుమ’’అని ధీమాగా చెప్పుకొన్న యువక ముస్లిముకవి, మన పాపాసాహేబు, శ్రీ జోస్యము జనార్థనశాస్త్రిగారన్నట్లు ‘పాండత్య కవిత్వములకు జాతిమత విచక్షణ పనికిరాదు, పాపాసాహేబు మహమ్మదీయుడని పేరువలన తెలిపి కొనవలసినదేకాని, ఆతని భావములందును, భాషా సంస్కృతియందును, కవితా శైలియందును, చిక్కని తెనుగుదనము, చక్కని భారతీయ సంప్రదాయము జాలువాఱుచుండును. ఈ కవి స్వతంత్రభావములు కలవాడు. ఇతరు లేమనుకొందురో యను జంకుకొంకులు లేక తన మనోవీధిని స్ఫురించు భావములను వెలువరించు సాహసి’ శాస్త్రిగారి మాటలు అక్షరాల సత్యములే, శ్రీ పాపాసాహేబ్ గారి రచనలను పరీక్షించిన వారి స్వభావ స్వరూపములు ప్రత్యక్షముగా కాన్పించును.
శ్రీ పాపాసాహేబుగారి బాల్యమునందే కవితలల్లుట నేర్చిరి. స్వయంకృషితో సంస్కృతాంధ్రములో పరిచయము. ప్రవేశము సంపాదించుకొనిరి. యువతరమున కవిగారు రాజకీయములలోనికి ప్రవేశించి జీవితమంతయు విశ్వశాంతిదూత పూజ్యబాపూజీ హృదయ ప్రతిబింబమైన, పవిత్ర కాంగ్రెస్సు సంస్థకు అంకితమై దానిద్వారా మాతృదేశమునకు, మాతృభాషకు ఉడుతకుడుతా భక్తిగా శక్తికొలది సేవచేసిరి. అప్పటిలో కవిగారింట నిరంతరము ‘ఇనుపగజ్జెల తల్లి’ స్థిరనివాసము చేసికొన్నది. అయినను జంకక కొంకక, చెక్కుచెదరని భక్తివిశ్వాసములతో మొక్కవోని ఆత్మవిశ్వాసముతో మాతృదేశమునకు సేవచేసిరి. తుదకు వీరికి రాజకీయములలో లభించినది, నిరాశా నిస్పృహలే. 1964వ సం. నాటికి ప్రభుత్వము వీరిని గుర్తించి గౌరవించుట ఒక ఎన్నదగిన విషయము.
శ్రీ పాపాసాహేబు గారి మత్సాహపరచినది, భావోద్రేకమున ముంచెత్తినది, ఆనందపరచినది కవిత్వమేకాని వేరుకాదు. వీరు అవధి, శకుంతల రాణీసంయుక్త ప్రేమవిలాసము, అంబ, సత్యాన్వేషణ, రసఖండముమొదలగు గ్రంథములు వెలువరించిరి. రాణీసంయుక్త ఒక వీరోచిత కావ్యము. వీరి పద్యములందు సుదీర్ఘ సమాసములు విరివిగా కాననగును. అటనట కవి, తన మనోభావములనే పాత్రలచేత వెల్లడింపజేసిరి. ఈ క్రింది పద్యము చూడుడు.
సీ. కుటిల నీతిఖ్యాతి – కుండీ కృతోద్ధత
కౌటిల్య శేముషీ – పాటవుండు;
వరరాజకీయ సర్వస్వ సాగరయుగం
ధర సమ గురుకార్య కరణచణుడు;
గర్విత పరసంథి – గణహృదయగ్రంథి
విఘటన చటులోగ్ర – విక్రముండు;
ఆగ్రహానుగ్రహాద్యధికృత వ్యవహార
విరహిత మానస విక్రియుండు;
గీ. పూర్ణి మాబ్జ సన్నిభ – సముదీర్జకీర్తి
అచ్చుతాంఘ్రే సేవాతత్పరామవర్తి,
ధూత సంశ్రిత జనసంచ యాతతార్తి
దివ్యమూర్తి విస్ఫూర్తి పృథ్వీ విభుండు
తదుపరి వీరికావ్యము ‘అంబ’. ఇది అంద రెరిగిన భారత కథ. అంబ – భీష్ములిందు ముఖ్యపాత్రదారులు, అంబ ప్రతిజ్ఞపూనిన ఆడుది. ఆమె యెంతటి ఉద్రేకము కలదో అంతకుమించిన భావోద్రేకము కలవాడు మనకవి. కవి తనకున్న నూతనావేశముతో ఇందలి పాత్రల స్వరూప స్వభావ ములలో క్రొత్తదనమును నింపిరి. కాని యది అందరికీ రుచించునని చెప్పలేము, ఈ కావ్యముపై శ్రీ గడియారం వేంకటశేషశాస్త్రి గారిట్లు తమ అభిప్రాయమును తెల్పిరి.
‘కవిగారీ పొత్తమున అంబ నాదర్శయువతిగా ఉజ్జ్వలముగా చిత్రింపజూచిన యభిమానము గనంబడుచున్నది. ఇది మంచిదేకాని ఈయావేశములో భీష్ముడధికార దుర్విదగ్ధుడుగా రూపొందినాడు. కవిగారి యుద్దేశమేమైనను ఆంధ్రభారత పరిచిత భీష్ముని పోలిక లిందు చెదరిపోయినవి. పురాణకథా ప్రసిద్ధ మహాపురుషుల జీవితస్వభావముల నందించుటలో కవి మిగుల జాకరూకత వహించుట అత్యావశ్యకము. ఈ అంబకావ్యము శ్రీ వేంకటేశ్వరుని స్మరణతో ప్రారంభించుట కవిగారి పరమత దైవారాధన యెడగల విశ్వాసమునకొక పత్రీక. ఈ పొత్తమును ఆంధ్రవిశ్వవిద్యాలయమువారు ‘భాషా ప్రవీణ’ పరీక్ష్కు పార్యగ్రంధముగా నుంచుట ఎన్నదగిన విషయము’.
తదుపరి వీరి ‘శకుంతల’ కావ్యకధ పాఠకులకు సుపరిచితమైనదే, ‘సత్యాన్వేషణము’ కష్టజీవుల కన్నీటిగాధను తెల్పు రసమయ సాంఘిక యితివృత్తముతోకూడిన కావ్యము. ఇందు జాతీయములు సామెతలు లోకోక్తులు సంస్కృత న్యాయములు విరివిగావాడిరి. ఇందలి ఒక పద్యము చూడుడు.
ఉ. ప్రాణము పోవుచున్న దలవంచని పౌరుషసాహసాలు, వా
గ్ధానమొసంగి తప్పని యుదార గభీరగుణమ్ము, లొంగుటే
గానని యాత్మగౌరవము, కంపముచెందని గట్టి చేవయున్
మానపరాయణత్వ మనమాన మఖండము నై విరాజిలు.
కవిగారు పై గుణగణములనే కలగి యున్నారనుటలో సందేహములేదు. ఇట్టి ఈ మహాకవి గారికి భగవంతుడెట్టిలోటును కలిగించక ఆయురారోగ్య ఐశ్వర్యముల నిచ్చి కాపాడుగాత.
తన్నె వివాహమాడుట కెదన్ త్వరబొందెడు రుక్మిణిన్ మహా
పన్నత కుందు దాని మురభంజను డెత్తుక పోయినట్లు వే
గన్నరుదెమ్ము స్వామి నను గైకొని పోవగ వేచియుందు వే
గన్నుల నీదు రాకకయి కైరవ మిందుని కోస మట్టులన్
పరమ పవిత్రమైన మన భారతభూమి ప్రతిష్ఠ స్వార్థ త
త్పరమతి దుమ్ములో కలుపు తండ్రియెకాదు మరెవ్వరైననున్
స్థిర కరవాల ధారలను నిర్దయ గొంతులు కోతు, గొఱ్ఱెలం
గరణి దదసృగార్ద్ర శితఖడ్గము నిచ్చెద నీకు కాన్కగా
(రాణీసంయుక్త కావ్యం నుండి)
ప్రాణము పోవుచున్న దలవంచని పౌరుషసాహసాలు, వా
గ్దానమొసంగి తప్పని యుదార గభీరగుణమ్ము, లొంగుటే
గానని యాత్మగౌరవము, కంపము చెందని గట్టి చేవయున్
మానపరాయణత్వ మసమాన మఖండము నై విరాజిలున్
(సత్యాన్వేషణ నుండి)
యావజ్జీవము, మాతృదేశ భయదోద్యద్దాస్య నిర్మూలనా
భావోల్లాస వికాస చిత్తమున, దౌర్భాగ్యాభి పూత ప్రజా
సేవా దీక్షకు, ధారవోసిన దయాశ్రీసాంద్ర నిస్తంద్ర తే
జో విస్తార! జగత్పితా! కొనుమివే జోహారులర్పించెదన్
(మహాత్మాగాంధీ గురించి)
తురక కేమి తెలుసు పరమ వేదార్థమ
టంచు నెత్తి పొడుతు రవని సురులు
కన కబీరు తురక గాకేమి గరకయా
పాపుసాబు మాట పైడి మూట
(పాపుసాబు మాట పైడి మూట నుండి)
———–