పేరు (ఆంగ్లం) | Turaga Ramakavi |
పేరు (తెలుగు) | తురగా రామకవి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | తూర్పు గోదావరి జిల్లా లోని తుని |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నాగరఖండము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | తురగా రామకవి |
సంగ్రహ నమూనా రచన | ఇతడు నూరు నూటయేబది సంవత్సరముల క్రిందట నుండినట్టును, ఆడిదము సూరకవి తోడి సమకాలికు డయినట్టును ఎల్లవారును వాడుచున్నారు. వేములవాడ భీమకవి దరువాత దిట్టుకవిత్వమునం దీతనితో సమానుడు మరియొకడు లేడు. భీమకవివలెనే యిత డాడినమాట యెల్ల నగుచు వచ్చెననియు, అందుచే నెల్లవారు నీతనికి జడియుచు వచ్చిరనియు, చూపుట కనేక కథలు కల్పింపబడినవి. అందు గొన్నిటి నిం దుదాహరించుచున్నాను- 1. ఈకవి లేటవరపు పోతురాజను క్షత్రియుని యింటికి బోగా నతడు కవి కేమయిన నియ్యవలసివచ్చునని యింటనుండియు లేడనిపించెనట అప్పుడు రామకవి, |
తురగా రామకవి
ఇతడు నూరు నూటయేబది సంవత్సరముల క్రిందట నుండినట్టును, ఆడిదము సూరకవి తోడి సమకాలికు డయినట్టును ఎల్లవారును వాడుచున్నారు. వేములవాడ భీమకవి దరువాత దిట్టుకవిత్వమునం దీతనితో సమానుడు మరియొకడు లేడు. భీమకవివలెనే యిత డాడినమాట యెల్ల నగుచు వచ్చెననియు, అందుచే నెల్లవారు నీతనికి జడియుచు వచ్చిరనియు, చూపుట కనేక కథలు కల్పింపబడినవి. అందు గొన్నిటి నిం దుదాహరించుచున్నాను-
1. ఈకవి లేటవరపు పోతురాజను క్షత్రియుని యింటికి బోగా నతడు కవి కేమయిన నియ్యవలసివచ్చునని యింటనుండియు లేడనిపించెనట అప్పుడు రామకవి,
క. కూటికి గాకులు వెడలెడు| నేటావల మూకచేరి యేడువ దొడగెన్
గాటికి గట్టెలు చేరెను| లేటవరపు పోతరాజు లేడా లేడా?
అని ప్రశ్నవేయునప్పటికి బోతురాజు మృతుడయ్యెనట! దహన నిమిత్త మయి బంధువు లింటినుండి శవమును గొనిపోవనున్నప్పు డాతనిభార్యవచ్చి కవికాళ్ళమీద బడి పతిభిక్ష పెట్టుమని వేడుకోగా గరుణించి,
క. మేటి రఘురాముతమ్ముడు| పాటిగ సంజీవిచేత బ్రతికినరీతిన్
గాటికి బో నీ కేటికి| లేటవరపు పోతురాజ లెమ్మా రమ్మా.
అని కవి పిలువగానే మరల బ్రతికిలేచి పోతురాజు కటుకు మీదనుండి దిగివచ్చెనట!
2. ఈకవి బావయైన తల్లాప్రగడ సూర్యప్రకాశరావు ఉంగుటూరను స్వగ్రామమునం దొక పెద్దయిల్లు కట్టించి, దానిని జూపుటకయి కవిని లోపలికి దీసికొనిపోయి యొకగదిలో విడిచి బావమఱది పరియాచకమున కయి తాను మఱియొకచోట దాగియుండెనట. కవి యాయింట దిరిగి తిరిగి దారి కనుగొనలేక విసిగి,
గీ. అంగణము లెన్ని కేళీగృహంబు లెన్ని
యోడుబిళ్ల లయిండ్లెన్ని మేడ లెన్ని
కట్టె గాకేమి సూర్యప్రకాశరాయ
డుంగుటూ రిండ్ల రాకాసు లుండవచ్చు.
అనగానే కావుకావని యఱచుచు నింట నేమూలజూచినను దామే యయి పట్టపగలు పిశాచములు సంచరింప జొచ్చెనట.
3. పెద్దాపురపు సంస్థానాధీశ్వరులయిన శ్రీవత్సవాయి తిమ్మగజపతిమహారాజుగారి దర్శనార్థము పోయినప్పుడు రాజు కవికి దర్శన మియ్యకపోగా గోపించి,
క. అద్దిర శ్రీభూనీళలు |ముద్దియ లాహరికి గలరు మువురందులలో
బెద్దమ్మ నాట్య మాడును|దిద్దమ్మని వత్సవాయితిమ్మనియింటన్.
అని శపింపగానే రాజు రాజ్యమును బోగొట్టుకొని దరిద్రు డయ్యెనట!
4. రామకవి యిల్లు కట్టించుకొనునప్పుడు దారిని బోవువారి నందఱిని బిలిచి తనగోడకిటుక లందిండని నియమించుచుండెనట! ఒకనా డాదారిని అడిదము సూరకవి పోవుచున్నప్పు డాతనిని బిలిచి తక్కినవారి నడిగినట్లే యతనిని గొన్ని యిటుక లందిచ్చి పొమ్మని యడుగగా నతడు కోపించి రామకవి యని యెఱుగక,
“సూరకవితిట్టు కంసాలిసుత్తెపెట్టు”
అని పలికి పో బోయెనట| రామకవి యామాట విని కన్ను లెఱ్ఱచేసి బిగ్గఱగా,
“రామకవిబొబ్బ పెద్దపిరంగిదెబ్బ”
అని కేకవేసెనట. అంతట సూరకవి యతడు రామకవి యని తెలిసికొని కొన్నియిటుక లందిచ్చి మఱి వెడలిపోయెనట!
ఇవి యన్నియు గేవల కల్పితకథ లయి యుండవచ్చును. ఇటువంటి మహామహిమగలవా డన్న వేములవాడభీమకవి కోమటిపేర గృతిచేసి స్తుతించినట్లే యీరామకవియు గంసాలిపేర గృతిచేసి స్తుతులు చేసెను. ఈతడును నయ్యంకి బాలసరస్వతి యను మఱియొక కవియు గలిసి రచియించిన నాగరఖండమనెడి యైదాశ్వాసముల గ్రంథమొకటి కానబడుచున్నది. ఈయిద్దఱుకవులును దమగ్రంథముయొక్క యాశ్వాసాంతగద్యము నీప్రకారముగా వ్రాసికొనియున్నారు-
“ఇది శ్రీమద్దుర్గాదక్షిణామూర్తివరప్రసాదాసాది సారస్వత తురగా రామకవి వరాయ్యంకి బాలసరస్వతినామధేయ ప్రణీతంబైన శ్రీస్కాందంబను మహాపురాణమునందు సనత్కుమారసంహితను నాగరఖండము”
ఈనాగరఖండము ధవళేశ్వరపు మార్కండేయుడను స్వర్ణ కారకులజుని కంకితము చేయబడినది. ఈవిశ్వకర్మవంశజుడు బెజవాడకు బ్రభువుగా నుండిన ట్లీక్రిందిపద్యమువల్ల దెల్ల మగుచున్నది.
మ. రజతాగం బొకరాజమౌళికి వినిర్మాణంబు గావించి యి
చ్చె జగంబెన్నగ విశ్వకర్మ మును దా జిత్రంబు గా దిప్పు డీ
బెజవాడప్రభు డియ్య నెంతయును గల్పించున్ ధరిత్రిన్ మహా
రజతస్వర్ణగృహంబు లెప్పుడు బుధవ్రాతంబు మోదింపగన్.
ఈధవళేశ్వరపుమార్కండుడు మహమ్మదు కుతుపషాహి కాలములో నుండినట్టు నాగరఖండముయొక్క యవతారికలో నీక్రిందిపద్యమున జెప్పబడిది-
క. అతడు ప్రసిద్ధి వహించెన్
క్షితినగరజపతుల గెల్చి చెలగి జయశ్రీ
సతి జేకొనిన మహమ్మదు
కుతుపశ హాచంద్రునకును గుడుభుజమనగన్.
దీనినిబట్టి చూడగా గవి పదునాఱవశతాబ్దాంతమునందో పదునేడవశతాబ్దారంభమునందో యుండినట్టును, కవినిగూర్చి చెప్పెడి కథలన్నియు నబద్ధము లయినట్టును కనబడుచున్నవి. మహమ్మదుకుతుబుషాహి క్రీస్తుశకము 1581 వ సంవత్సరము మొదలుకొని 1611 వ సంవత్సరమువఱకును గోలకొండనవాబుగానుండి రాజ్యము చేసెను. కుతుబ్ షాహివంశము 1688 వ సంవత్సరములోనే నశించినది. నాగరఖండమునందు గొన్ని వ్యాకరణ విరుద్ధములగు ప్రయోగము లున్నను మొత్తముమీద గవిత్వము హృద్యముగానే యున్నది. నాగరఖండము నుండి కొన్నిపద్యము లిందుదాహరింపబడుచున్నవి-
ఉ. ప్రీతియొనర్ప నగ్గిరి నిరీక్షయొనర్ప దరీసరత్ప్రవం
తీతటజాతరూపధరణీరమణీయమణీసమగ్రమై
స్ఫీతసుధాంబుపూర సరసీరుహశీకరశీతలానిలా
న్వీతవిహార దేవతరుణీహరిణీకరిణీసమూహమై. [ఆ.1]
ఉ. ఆదికి నాదికారణ మహర్సతికోటిసమానతేజు డు
త్పాదితసర్వలోకుడును బ్రహ్మమునై తగు విశ్వకర్మ నా
నాదినిజాళిలోన భువనంబుల నెల్లను హేతుకార్యక
ర్త్రాదులు తానయై తగు యథార్థమునుమ్ము మయూరవాహనా. [ఆ.2]
ఉ. ఇచ్చిన నైదుసాధనము లింపుగ నైదుగురున్ ధరించి యు
ద్యచ్చరిత ప్రశస్తయజనాదిరతుల్ శివతత్వబోధులై
యచ్చెరు వంద జేసిరి సమస్తజగంబుల దత్క్షణంబునన్
హెచ్చినయాత్మవర్తనల నెన్నికగాగ సరోజబాంధవా. [ఆ.3]
చ. కమలజుకంటె మున్ను శశిఖండశిఖామణికంటెమున్ను శ్రీ
రమణునికంటెమున్నుగ విరాజిలు బోధకు డైనయట్టిబ్ర
హ్మముగ మహానుభావుడని యాత్మవివేకముచే నెఱుంగుమా
యమితపువిశ్వకర్మను మహాత్ముని లోకకృతిప్రవీణునిన్. [ఆ.4]
చ. కడక గనుంగొనంగ దొలుకారుమెఱుంగులు గ్రుమ్మరింపగా
నడుగిడ గల్లుగల్లు మను హంసకనాదము హంసరావమున్
దడబడ బద్మరాగసముదాయముదాపున నేపు చూసి యె
ల్లెడల బదాగ్రరాగరుచు లీనగ వచ్చెను గౌరి వేడుకన్. [ఆ.5]
ఆంధ్ర కవుల చరిత్రము నుండి……..
———–