పేరు (ఆంగ్లం) | Sarangu Tammayya |
పేరు (తెలుగు) | సారంగు తమ్మయ్య |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | వైజయంతీ విలాసము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | సారంగు తమ్మయ్య |
సంగ్రహ నమూనా రచన | ఉ. త మ్మనయంబు బ్రోచుటకు ధారుణిబంధులు బంధుపారిజా త మ్మన రామభక్తి గలతార్కికు లెల్లను వీనిదౌర చి త్త మ్మన జూపులం దనిసి ధార్మికు లీతని దెంతమంచివృ త్త మ్మన నాగిరిప్రభునితమ్మన మించె నుదంచితస్థితిన్. గీ. తమ్మమంత్రి గాంచె దిమ్మాయియందు నం దనుల శౌర్యసింహు నారసింహు జతురబుద్ధిచంద్రు సత్కళాగుణచంద్రు గిరిచమూవరేంద్రు గీర్తిసాంద్రు. |
సారంగు తమ్మయ్య
ఈప్రాంతములయందు సారంగువారు సాధారణముగా మాధ్వులుగా నున్నారు. ఈకవి తనవంశమును వర్ణించుచు,
ఉ. త మ్మనయంబు బ్రోచుటకు ధారుణిబంధులు బంధుపారిజా
త మ్మన రామభక్తి గలతార్కికు లెల్లను వీనిదౌర చి
త్త మ్మన జూపులం దనిసి ధార్మికు లీతని దెంతమంచివృ
త్త మ్మన నాగిరిప్రభునితమ్మన మించె నుదంచితస్థితిన్.
గీ. తమ్మమంత్రి గాంచె దిమ్మాయియందు నం
దనుల శౌర్యసింహు నారసింహు
జతురబుద్ధిచంద్రు సత్కళాగుణచంద్రు
గిరిచమూవరేంద్రు గీర్తిసాంద్రు.
తనతాతను రామభక్తునిగా జెప్పుటచేతను, అతనిభార్యను తిమ్మాయియని చెప్పుటచేతను కూడ నితడు మాధ్వవంశజు డేమోయని యూహింప దగియున్నను.
క. సారమతి యానృసింహుడు
వారాశిగభీరు డతులవై భవమున గౌ
రీరమణి నీశు డుంబలె
నారూడాన్వయ వరించె నక్కమసాధ్విన్.
అని తనతల్లిదండ్రులను పార్వతీపరమేశ్వరులతో బోల్చుట చేతను తనపూర్వుల కమాత్యాదిపదములను జేర్చుచు వచ్చుటచేతను కవి నియోగిబ్రాహ్మణుడని తోచుచున్నది. ఇత డాపస్తంబసూత్రుడు; భారద్వాజగోత్రుడు; నరసింహమంత్రిపుత్రుడు; సారంగు తమ్మయామాత్యపౌత్రుడు. ఈకవి వైజయంతివిలాస మనునాలుగాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. ఇందు విప్రనారాయణుడనెడి యాళ్వారుచరిత్రము వర్ణింపబడినందున, దీనికి విప్రనారాయణ చరిత్రమనియు నామాంతరము గలదు. ఈవిప్రనారాయణునికే తొండరడిప్పొడియాళ్వా రని యఱవపేరు. ఈపుస్తకమునందలి కవిత్వము మనోహరముగానే యుండునుగాని యందందు కవిత్రయమువారి ప్రయోగములకు విరుద్ధములయిన ప్రయోగములు కానబడుచున్నవి. కథయు మిక్కిలి యింపుగా నుండును. విప్రనారాయణుడను వైష్ణవబ్రహ్మచారి కావేరితీరమునందు శ్రీరంగ క్షేత్రమునందు వసించుచు మాధుకర వృత్తిచే జీవించుచు భక్తితో శ్రీరంగనాయకునకు తులసిమాలల నర్పించుచు కాలము గడుపుచుండెను.
శా. స్వాధ్వాయంబు బఠించు సాంగకముగా సంధ్యాద్యనుష్ఠానముల్
విధ్యుక్తక్రియ నాచరించు దఱితో వ్రేల్చుం బ్రపూతాత్ముడై
మధ్యేరంగశయానమూర్తి కిడు సమ్యద్భక్తి దోమాలికల్
మధ్యాహ్నంబున గుక్షి బిక్ష దనుపు న్మాధూకరప్రక్రియన్.
ఇట్లుండగా మధురవాణియు దేవదేవియు ననువేశ్య లక్కచెలియం డ్రిద్ద ఱాతనిని దేవాలయములో జూచి యాతనినిష్ఠ కద్భుతపడి భక్తితో మ్రొక్కగా నతడు వారిమ్రొక్కు గైగొనకపోయెను. అప్పుడు దేవదేవి యలిగి యప్పతో
ఉ. మ్రొక్కిన నెవ్వ రే మనడు; మో మటువెట్టుక చక్కబోయె; నీ
దిక్కును జూడడాయె; నొకదీవనమాటయు నాడడాయె; వీ
డెక్కడి వైష్ణవుండు ? మన మేటికి మ్రొక్కితిమమ్మ ? యక్కటా!
నెక్కొని వెఱ్ఱిబుద్ధి యయి నిద్దురవోయినవానికాళ్ళకున్.
అని యతని నిరాకరించి పలికెను. మధురవాణి చెల్లెలి నూరార్చుచు,
ఉ. చూచిన నేమి? నీవలను చూడకయుండిన నేమి? పూజ్యులం
జూచిన భక్తి మ్రొక్కుటయె శోభన; మీతడు బ్రాహ్మణుండు;ధా
త్రీచరులందు బ్రాహ్మణుండు దేవుడు; దేవుడు నీవు మ్రొక్కినన్
జూచునొ? పల్కునో? యటుల సుమ్మితడున్ నరసీరుహాననా!
అని శాంతచిత్తను జేసి యతనివై రాగ్యమును గొంత ప్రశంసించెను. అప్పు డప్పమాట లంగీకరింపక,
చ. ప్రకటజితేంద్రియుల్ ధర బరాశరకౌశికులంతవారు స్త్రీ
లకు వశు, లంతకంటె మిగులన్ దృడమౌమగకచ్చ బిగ్గ గ
ట్టుకొనగ నీత డెంత? శుకుడో? హనుమంతుడొ? భీష్ముడో? వినా
యకుడొ? తలంచుకో నరసిజాయతలోచన నెమ్మనంబునన్.
క. ఈనిష్ట లింతతారస | మైనందాకానెసూ! సదాచారి యటం
టే, నబ్బినదాకనె యగు,|మౌనిజనవిడంబనములు మనమెఱుగనివే?
క. ఇటువంటయ్యలె కారా
చిటుకు మనక యుండ సందెచీకటివేళన్
ఘట చేటీవిటులై యీ
కటకంబున దిరుగువారు? కంజదళాక్షీ!
గీ. నిర్జితేంద్రియుండు నిష్ఠాపరుం డంచు
నప్ప సారెసారె జెప్పెదీవు;
వీని బ్రతినచెఱిచి విటుజేసితెచ్చిన
గలదె పందె మనిన గాంతపలికె.
క. నీ వీవైష్ణపు విటునిం | గావించిన, లంజెతనపుగడ నే విడుతున్;
గావింప లేక యుండిన | నీవు న్విడిచెదవెయనిన నెలతుక యొప్పెన్.
చెల్లె లావీరవైష్ణవుని విటుని జేయవచ్చు ననియు, అప్ప యతని నట్లు చేసినయెడల తాను వేశ్యావృత్తిని విడిచెద ననియు వివాదపడిన మీదట దేవదేవి తా నావైష్ణవబ్రహ్మచారిని విటునిజేసి యింటికి దేలేకపోయినపక్షమున దాను వేశ్యావృత్తిని విడిచెదనని పంతము పలికి తనరత్నాభరణములను, కస్తూరీతిలకమునుదీసి తులసిపూసల పేరులును తిరుమణినామములును వేసి సానివేషము బాసి దాసరిసాని యయి తిన్నగా విప్రనారాయణు డున్న యారామమునకు బోయి యాతనికి నమస్కారము చేసి, హేయభాజనమయిన వేశ్యావృత్తిపై విరక్తి పొడమినట్టు నటించి,
గీ. * * హేయభాజన మెన్నిట నెన్నిచూడ
వేశ్యజన్మంబు జన్మమే విప్రవర్య
ఉ. ఒక్కని బిల్వనంపి, మఱియొక్కనిచేత బసిండిపట్టి, వే
ఱొక్కనియింటి కేగుచు, మఱొక్కని నానడుచక్కి నొక్క-
బొక్కికలంచి చూడ భ్రమబొంది విటుల్తెలియంగ లేరుగా
కెక్కడిసత్య మేడవల పెక్కడినేమము వారకాంతకున్?
గీ. అనఘ వేశ్యావిడంబవర్తనము లెన్న
నిసుకపాతఱ యీజోలి యేల త్రవ్వ?
నప్పడుపుగూటిపై నసహ్యత జనించి
నామనసు రోసినట్టిచందంబు వినుము.
* * * *
గీ. వారసతులైన యీసీమవారివలెనె
మోడిమానిసి నైన నేగోడు నెఱుగ;
జిహ్వ నాల్గచ్చరాలు నేర్చినకతాన
బడుపు గూటికి మనసు గొల్పక నిటైతి.
అని వేశ్యావృత్తిని నిందించుచు తియ్యనిమాటలుచెప్పి యాతని చెంత జేరి పరిచర్యచేయుచు దాస్యమిషమున మెల్ల మెల్లగా—-యుల్లము కలంప జొచ్చెను. ఇట్లు కొంతకాలము దాసురాలి—గలుగునప్పటికి,
శా. ఆవిప్రోత్తమువజ్రపంజరనిభంబై నిశ్చలంబైన స
ద్భావం బంగనసాహచర్యగుణసంపర్కంబునన్ లోహమై,
గ్రావంబై, దృడధారువై, తరుణవృక్షంబై ఫలప్రాయమై,
పూవై, తన్మకరందమై, కరగె బో బో నీళ్ళకుం బల్చనై.
విప్రనారాయణుని వజ్రకఠినమైన హృదయము దినదినక్రమమున గరగి నీటికంటెను బలుచనై దేవదేవి మనస్సులో నైక్యమయ్యెను. అంతట గురువే దాసురాలికి దాసుడయి పరిచర్యచేయ నపేక్షించి—-కొనగా మొట్టమొదట నాటక్కరివారాంగన,
గీ. నిడుదపట్టె తిరుమణియె వైష్ణవముగాని
మీర లాడుమాటతీరు చూడ
ననఘ నొసలు బత్తుడును నోరుతోడేల
టన్నరీతి తోచుచున్న దిపుడు.
అని నీతులు చెప్పియు,
క. ఓసతి భగవత్సేవకు|వాసి గణింపంగ భాగవతసేవయ;త
ద్దాసులకైంకర్యము గృప|జేసిన రంగేశ్వరునకు జేయుటెసుమ్మీ.
అని యాతనిచేత బతిమాలించుకొని భాగవత కైంకర్యము నంగీకరించి, తుద కాతని నింటిబంటునుజేసి తనయింటికే గొనివచ్చి పందెము గెలిచెను. ఇట్లావైష్ణవవటుని విటునిజేసి తెచ్చి యిల్లు చేర్చిన తరువాత వేశ్యమాత తగులుకొని
క. నవమదనునైన మెచ్చవు;|తవిలితి వీయఱవ; బోడితలకు వలచితో?
ధవళాక్షి|వీనివ్రేలుం |జెవులకు వలచితివొ? పిల్లసిగకు వలచితో?
అని కూతునకు బుద్ధిచెప్ప మొదలు పెట్టెను. తాను పట్టినప్రతిజ్ఞ నెఱవేఱినందున,
క. పెదయప్పయు నేనును బ
న్నిదమాడినపనికి నీతనిం దెచ్చితి నా
కొదవ యిటదీఱె నిక నీ
కొదవయె యున్నదన దల్లి కూతునకనియెన్.
కూతురును తల్లిమాటలకు సంతోషించి క్రొత్తయల్లుని నిల్లు వెడలింప దల్లిం బురికొల్పెను. ఆసన్నగైకొని వేశ్యమాత నూతన జామాతను జేరి, <poem>
సీ. నీపట్టెతిరుమణి నీతిరుచూర్ణంబు గణికకు వెండిబంగారులౌనె?
నీపుట్టగోచియు నీకావివేష్టముల్ వారకాంతకు బట్టుచీరలౌనె?
నీముష్టిగూడయు నీతులసిసరులు వేశ్యకు బండుగవేట లౌనె?
నీవేదశాస్త్రముల్ నీజపసంధ్యలు లంజెసానికి బౌ జులగము లౌనె?
పెట్టనోసితివా యెప్పటట్టె యుండు
పెట్టలేకున్న విచ్చేయు పెందలకడ
మొదల రోయింతులకు నొక్కముడుపె కాక
నీసదాచార మేలయ్య! దాసరయ్య!
అని కసరి సాగనంపగా నాభాగవతోత్తముడు వేశ్యాగృహము విడచి తనకుటీరముచేరి తనహృదయేశ్వరిని తలచి చింతిల్లుచు,
గీ. అతివ వైష్ణవమతరహస్యముల జాల
బరిచయము గన్న యట్టిప్రసన్నురాలు
శూద్రసంపర్కమున కేల చొచ్చుమరల?
నిచ్చటికి నెంతప్రొద్దైన వచ్చుగాక.
అని ప్రియురాలి గుణసంపత్తిని బ్రశంసించి యడియాసపడుచు,
గీ. తనకు నేమిత్రవ్వి తలకెత్తిరమరు లీ
యుర్విమనుజు లేమి యొసగరైరి?
నింగివారసతుల నిర్మాతృకల జేసి
పుడమి మాతృభూతముల సృజించె.
అని భూలోకమున వేశ్యలకు తల్లులను సృష్టించినందునకు బ్రహ్మదేవుని నిందించుచు పరితపింపజొచ్చెను. వేశ్యాసంపర్కమువలన నెట్టి దృడమనస్కులకును ననర్థములు వచ్చునని చూపుటకయి యింతవఱకు గల్పింపబడినకథ నీతిబోధకముగానే యున్నదికాని తరువాతి కథ మాత్రము నీతిబాహ్యముగా నున్నది. భక్తు డట్లు పరితపించుట చూచి భక్తజనార్తిహరు డగు రంగేశుడు శిష్యరూపము ధరించి
క. సారమణిఖచిత మగు బం
గారపు దనగిన్నె వారకామిని కొసగన్
శ్రీరంగదివ్యధామని
హారుడు స్వయమర్థచోరుడై కొనిపోయెన్.
తనగుడిలోని బంగారపుగిన్నెను గొనిపోయి తనగురు వగు విప్రనారాయణుడు పంపినట్లుగా వేశ్యమాతకు సమర్పించి తనభక్తునకు మరల వేశ్యతోడిపొత్తు సమకూర్చెనట!
చ. సతతము బ్రహ్మరుద్రసురసంయమిముఖ్యుల నాత్మమాయ మో
హితులుగ జేయుసామి వెలయింతిని మోహిత జేయలేక ప్రా
కృతజనునట్ల తాను దనగిన్నెనొసంగెను బంటుకోసమై
మతకరివేశ్యమాతవెడమాయ లజేయులు విష్ణుమాయకున్.
వేశ్యమాయలు విష్ణుమాయనుసహితము మించినవట! దేవాలయములోని స్వర్ణ పాత్రము మాయమగుటకనుగొని జియ్యరు రాజభటుల కెఱిగించి, వారు వేశ్యయింట గిన్నెపట్టుకొని విప్రనారాయణుని చోరునిగా దండితు జేయుటకయి కొనివచ్చినప్పు డాతని గుడివెడల నడవ బోవుచుండగా, శ్రీరంగేశుడు సాక్షాత్కరించి భక్తప్రమోద సంధానముకొఱకు తానే గిన్నెను వేశ్య కిచ్చితినని చెప్పి రాజభటులు పట్టుకొన్న స్వర్ణపాత్రమును మరల వేశ్యకిప్పించి భక్తునకు బ్రహ్మరథము పట్టించి జీవన్ముక్తి యొసంగెనట:
గీ. బ్రహ్మసభయెల్ల భక్తి నప్పరమవైష్ణ
వోత్తముని బ్రహ్మరథమున నునిచి పట్ట
ణమున నేగించి రధికసంభ్రమముమీఱ
జియ్య ముందఱికొమ్మునజేరి మోవ.
ఆహా! ఏమి యీబ్రాహ్మణోత్తముని భాగ్యము!
ఉ. చోరు డనంగ రా దొరులసొమ్ములు మ్రుచ్చిలినం బ్రపన్నునిన్
జారు డనంగ రాదు పెలుచం బరకాంతల గూడినన్, దురా
చారు డనంగ రాద యనిశంబును వేశ్యలతోరమించినన్,
బోరున మీర లాతనికి బూనుడు బ్రహ్మరథంబు వైష్ణవుల్.
ఇటువంటి సిద్ధాంతములే మనదేశములో నీతికిని మతమునకును గూడ నమిత మైన చెఱుపును గలుగజేయుచున్నవి. నీతిని విడిచినమత మెప్పుడును దేవునికి ప్రీతికరము కానేరదు. వై జయంతీ విలాసములోని,
చ. ఇనసమతేజులౌనృపులనెల్ల మహమ్మదుశాహియేలు, నీ
యెనుబదినాల్గుదుర్గముల నేలినయేలిక గోలకొండ ద
ద్ఘననగరస్థలిం గరణికం బొనరించుచు దమ్మమంత్రి యా
జనపతి రమ్ము పొమ్మన బ్రజ ల్జయవెట్ట గృహస్థు లౌననన్
అను పద్యమునుబట్టి యీతిమ్మకవి మహమ్మదుశాహి గోలకొండ నవాబుగా నుండిన 1581 వ సంవత్సరమునకును 1611 వ సంవత్సరమునకును మధ్యకాలములో వై జయంతీవిలాసమును రచియించిన ట్లీవఱకే తెనాలి రామకృష్ణకవి చరిత్రమునందు దెలుపబడినది. పయిపద్యములవలననే కవియొక్క కవిత్వరీతి తేటపడునుగనుక వేఱుగ బద్యముల నుదాహరింపవలసిన యావశ్యకము లేదు.
ఆంధ్ర కవుల చరిత్రము నుండి……..
———–