పేరు (ఆంగ్లం) | Devarakonda Balagangadhara Tilak |
పేరు (తెలుగు) | దేవరకొండ బాలగంగాధర తిలక్ |
కలం పేరు | తిలక్ |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 8/1/1921 |
మరణం | 7/1/1966 |
పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలుకా మండపాక గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | తెలుగు, ఇంగ్లీషు |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | కవితా సంపుటాలు: ప్రభాతము-సంధ్య, గోరువంకలు, కఠినోపనిషత్తు అమృతం కురిసిన రాత్రి కథానికా సంపుటాలు: తిలక్ కథలు, సుందరీ-సుబ్బారావు, ఊరి చివరి యిల్లు నాటకాలు: సుశీల పెళ్ళి, సుప్త శిల, సాలె పురుగు నాటిక : సుచిత్ర ప్రణయం, “తిలక్ లేఖలు”, “తిలక్ కథలు ” (కథా సంపుటం) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | తిలక్ కవితల సంపుటి ‘ అమృతం కురిసిన రాత్రి ‘ ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది. |
ఇతర వివరాలు | http://telugu.pratilipi.com/read?id=6035519383273472 |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | దేవరకొండ బాలగంగాధర తిలక్ |
సంగ్రహ నమూనా రచన | నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు అంటూ తన కవితా పరమార్థం చెప్పుకున్న, భావ కవులలో అభ్యుదయ కవీ, అభ్యుదయ కవులలో భావకవీ అయిన తిలక్ పూర్తి పేరు దేవరకొండ బాలగంగాధర తిలక్ . ఇతను కవి, కథకుడు, నాటక కర్త. సంకుచితమైన జాతి మతాల హద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు అంటూ బలమైన కంఠంతో విశ్వమానవ సౌభ్రాతృత్వానికి నిబద్ధుడై మానవతా కేతనాన్ని ఎగురవేయడమే ధ్యేయంగా, కరుణ కలికితురాయిగా తన అపురూపమైన అనుభూతుల్ని అక్షరబద్ధం చేస్తూ, అమృతమయమైన కవితా ఝురిని ప్రవహింపజేసిన కవితా తపస్వి దేవరకొండ బాలగంగాధర తిలక్ |
దేవరకొండ బాలగంగాధర తిలక్
అమృతం కురిసిన రాత్రి
నా కవిత్వం
ధాత్రి జనని గుండెలమీద
యుద్ధపు కొరకంచుల ఎర్రని రవ్వలు
మీరెవరైనా చూశారా? కన్నీరైనా విడిచారా?
నా కవిత్వం కాదొక తత్వం
మరి కాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం, సామ్యవాదం
కాదయ్యా అయోమయం, జరామయం.
గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ
జాజిపువ్వుల అత్తరు దీపాలూ
మంత్ర లోకపు మణి స్తంభాలూ
నా కవితా చందనశాలా సుందర చిత్ర విచిత్రాలు.
అగాధ బాధా పాథః పతంగాలూ
ధర్మవీరుల కృత రక్తనాళాలూ
త్యాగశక్తి ప్రేమరక్తి శాంతిసూక్తి
నా కళా కరవాల దగద్ధగ రవాలు
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తులవహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు
పిలుపు
ధాత్రీ జనని గుండె మీది
యుద్ధపు కొరకంచుల ఎర్రని రవ్వలు
మీ రెవరైనా చూశారా
కన్నీరైనా విడిచారా
కోటి కోటి సైనికుల ఊడిపడిన
కనుగ్రుడ్ల అద్దాలలో ప్రతిఫలించే నిజాలను
మీ రెపుడైనా చూశారా
కన్నీరైనా విడిచారా
దరిద్రుని నోరులేని కడుపు
తెరుచుకొన్న నాలుక బూడిదలో వ్రాసుకున్న మాటలు
మీరెపుడైనా చూశారా
కన్నీరైనా విడిచారా
కాలం విరిగిన బండి చక్రంలా కదలలేక పడిపోతే
మొండిచేతుల మానవత్వం తెల్లబోయిన దీనదృశ్యం
మీరెవరైనా చూశారా
కన్నీరైనా విడిచారా
ముడుచుకున్న కాగితపు గుండెలు చిరిగి పోకపోతే
అణచుకొన్న నల్లని మంటలు ఆకాశానికి రేగకముందే
మీరిపుడైనా మేల్కొంటారా
చీకటి తెరలను చీలుస్తారా
ప్రభాత విపంచిక పలికిస్తారా?
ఈ రాత్రి
ఈ రాత్రి
బరువుగా బరువుగా
బ్రతుకు కీళ్ళ సందులలోన
చీకటి కరేల్మని కదిలింది
ఈ రాత్రి
నిలువునా నిలువునా
పరచుకుని అవనిగుండె నెరదలలోని
వింత బాధల విప్పి చూపింది
ఈ రాత్రి
మూగతో సైగతో
మేలుకొన్న నిరాశతో మాటలాడాను
వాన కురిసిన రాత్రి
చినుకు చినుకుగ వాన కురిసినటు
నిశికి
సన్న చీకటి దోమ తెర కట్టినటు
చలి చలిగ గాలి
చెట్ల ఆకులదూరి కప్ప బెకబెకల తేలి
చూరులో నిదుర తూలి
గుండె కొసలకు మెల్లగా జారినటు
కప్పుకొని దళసరి దుప్పటిలో
వెచ్చవెచ్చని మనసులో పొరలివచ్చు
నిదురలో చినుకు రాలినటు
కలలు జారు సవ్వడి
ఆ రోజు సాయంత్ర మమ్మిన మల్లెపూలు
ఆమె సిగదాల్చి నవ్వినటు
నా యొడలు తగిలినటు
కాలమే కరిగినటు
ఆకసము వణికినటు
ఏదో అనిపించి సగము తెరచిన కనుల
కెదురుగా
గదిలోన దీపశిఖ కదలునీడల నడుమ
మదిలోన తొలి కోర్కె మసక నిద్దుర నడుమ
చినుకు చినుకుగ వాన కురిసినటునిశి
సన్న చీకటి దోమ తెర కట్టినటు
గదిలోన దీపశిఖ కదలు నీడల నడుమ
ఎర్రనై ఏకాంత సరస్సున విరిసిన
ఎర్రకలువ యటు
తీరని కోరికటు
తెరచిన విరహిణి నయనమటు
కదలు నీడల మధ్య గదిలోన దీపశిఖ
కదలు కలల బంగరు వలల
రంగురంగుల బొరుసు లాడించు చేప
చేపలకు తగిలి మెరిసిన నీరు
నీరువిడిచి చినుకు చినుకుగ వాన కురిసినటు
నిద్రవిడి చినుకు చినుకుగ వాన కురిసినటు
నిద్రవిడి మినుకు మినుకుగ స్పృహ మెరిసినటు
ఆ రోజులు
ఆ రోజుల్ని తలుచుకున్నప్పుడల్లా
ఆనందంలాంటి విచారం కలుగుతుంది
నేటి హేమంత శిధిల పత్రాలమధ్య నిలచి
నాటి వాసంత సమీర ప్రసారాల తలచి
ఇంతేగదా జీవితం అన్న చింత
ఇంతలోనే ముగిసిందన్న వంత
చెమ్మగిలే నా కళ్ళని ఎవరైనా చూస్తారేమో అని
చెదిరిన మనస్సుతో యిటు తిప్పుకుంటాను
పచ్చని పచ్చికల మధ్య
విచ్చిన తోటల మధ్య
వెచ్చని స్వప్నాల మధ్య
మచ్చికపడని పావురాల మధ్య
పరువానికి వచ్చిన ఆడపిల్లల మధ్య
పరుగెత్తే నిర్ఝరుల మధ్య
తెరలెత్తే మునిమాపుల మధ్య
ఇప్పటికీ చూడగలవు నా తొలి యౌవనపు గుర్తులు
ఇప్పటిక వినిపిస్తవి నాటి స్వప్న వంశీరవమ్ములు
కాలవ గట్టునున్న ఈ కడిమిచెట్టుకు తెలుసు
మనం చెప్పుకున్న రహస్యాలు
ఊరి చివరినున్న మామిడి తోపుకు తెలుసు
మనం కలలుగన్న ఆదర్శాలు
ఇంటి వెనుకనున్న ఎర్రగన్నేరుకు తెలుసు
చిక్కబడుతూన్న సంజె చీకట్ల చాలులో
కలసిన పెదవుల నిశ్వాసాలు
అందాన్ని చూసినప్పుడల్లా స్పందించిపోయాం
బాధను కని కరుణతో కన్నీరు విడిచాం
శత్రువెదురైతే కండలపైకి చొక్కా చేతులు మడిచాం
పారిజాతపు పువ్వుల్లాంటి నవ్వుల్ని విరజిమ్ముకుంటూ
ప్రతి వీధినీ ప్రతి యింటినీ ప్రతి గుండెనీ శోభింపచేశాం
అమాయకమైన కళ్ళతో బాధ్యతలు లేని బలంతో
స్వచ్ఛమైన స్వేచ్ఛతో ఉషఃకాంతివంటి ఊహతో
భవిష్య దభిముఖంగా సుఖంగా సాగిపోయాం
ఎన్ని రకాల రంగు రంగుల పువ్వుల మాలలు
కిటికీలకు మెరిసే గాజుగొట్టాల జాలరులు
నేలమీద మొఖముల్ తివాసీలు అత్తరు గుబాళింపులు
జవరాళ్ళ జవ్వాడే నడుములపై ఊగే వాల్జడలు
బాధ్యతలేని అధరాల చిటిలే నవ్వుల వైడూర్యాలు
ప్రతీ ఒక్క నిముషం ఒక్కొక్క ఒమార్ ఖయ్యాం
రుబాయత్ పద్యాలవంటి రోజులవి ఏవి ప్రియతమ్
చప్పుడు కాకుండా ఎవరు హరించారు మన పెన్నిధిని
నీతులు నియమాలు తాపత్రయాల కత్తుల బోనులో
నిలిచి నిలిచి తిరిగే ఎలుగుబంటివంటి మనం
డేగలాంటి ఆ చూపుని ఆ వుసురుని ఆ ఎత్తుని
మబ్బులాంటి ఆ పొగరుని మైకాన్ని స్వర్గ సామీప్యాన్ని
తిరిగి పొందలేమన్న సంగతి నాకు తెలుసు
కాని
నేటి హేమంత శైత్యానికి గడ్డకట్టుకున్న నా వెనుక
నాటి వాసంత విహారాల జాడలున్నవన్న తృప్తి
మాత్రం మిగిలి
ఒక్క జీవకణమైనా రగిలి
శాంతిని పొందుతుంది నా మనస్సు
నా భావి తరానికి పిలుస్తుంది
పవిత్రమైన వీని ఆశీస్సు
“అమృతం కురిసిన రాత్రి” గురించి –
“ఒక నిశార్ధ బాగంలో నక్షత్ర నివహగగనం
ఓరగా భూమ్మీదకు ఒంగి ఎదో రహస్యం చెప్తున్న వేళ
ఒంటరిగా నా గదిలో నేను మేల్కుని రాసుకుంటుంటాను”
ముందే తెలిసి ఉంటే ఆ అమృతం కురిసిన రాత్రి నేనూ మేల్కుని ఉందును కదా అనిపిస్తుంది ఈ వాక్యాలు చదివితే.
ఇంత మంచి పుస్తకం తెలుగులో ఉన్నందుకు మనందరికి కూసింత గర్వం గా కూడా అనిపించనూ వచ్చు.
“గాజు కెరటాల వెన్నెల సముద్రాలు
జాజి పువ్వుల అత్తరు దీపాలు”
తిలక్ వూహా ప్రపంచాన్ని మనకు ఆవిష్కరిస్తే
“చదల చుక్క
నెమలి రెక్క
అరటి మొక్క
ఆమె నొసటి కస్తూరి చుక్క”
ఆయన మనసులోని గాలి అలకే స్పందించే కవితాత్మకమైన సింప్లిసిటీ ని చూపిస్తాయి.
మన వూరి మీద, పల్లెటూరి మీద మనందరికి ఉండే సహజమైన మమకారం “పాడువోయిన వూరు” అనే కవితలో “ప్రాణం గల పాడే వేణువులీ ఇసుక రేణువులు”
అని చదివినప్పుడు మనసు పొరల్లో మళ్ళీ మేల్కొంటుంది.
“సి. ఐ.డి రిపోర్టు” అనే కవితలో సాధారణ మధ్య తరగతి గుమస్తా అతి సామాన్య జీవితాన్ని మనస్తత్వపరం గా కూడా విశ్లేషించటం ఎంతో సహజం గా ఉంటుంది.
ఈయన స్త్రీ లని మాత్రం వదిలారా! ఎంత చమత్కారి కాకపోతే
“నవలలు నవలలు రాసేస్తున్నారు
వర్ణనీయ వస్తువే తిరగబడి వర్ణిస్తుంటే
హత విధీ ఇది కలి కాలం, కలికి కాలం”
ఇలా అని ఒక గౌరవనీయ అభిప్రాయాన్ని ఇంత చిలిపిగా చెప్తారు.
“నీ ఒడి లో నా తల పెట్టుకుని అభ్యంగనావిష్కృత త్వదీయ
వినీల శిరోజ తమస్సముద్రాలు పొంగి నీ బుజాలు దాటి నా ముఖాన్ని కప్పి
ఒకటే ఒక స్వప్నాన్ని కంటున్న వేళ”
“నువ్వు లేవు నీ పాట ఉంది” అని ఆర్ద్రత ఒలికించి భావ కవిత మాత్రం గంభీరమైన భాషోద్వేగానికి లోనయ్యింది.
“మౌఢ్యం వల్ల బలాఢ్యులు
అవివేకం వల్ల అవినాశులు”
మూర్ఖత్వం లొని మొండితనాన్ని, మనకున్న కొన్ని నమ్మకాల్లోని అజ్ఞానాన్ని నిర్భయం గా నిర్మొహమాటం గా చెప్పిన మాటలవి.
విషాదానందాల్ని, భావ సంచలనాల్ని, సామాజిక వాస్తవాల్ని, మూర్తీభవించిన దైన్యాన్ని, హైన్యాన్ని, అవేశాల తీరాల్ని,
అలోచనల అంచుల్ని ఇంకా నేను గమనించలేని ఎన్నిటినో ఒక చోట కూర్చటమే కాకుండా వర్ధమాన కవిత కి సందేశాన్ని ఇవ్వటం కూడా మర్చిపోలేదు.
“నువ్వు చెప్పేదేదైనా నీదై ఉండాలి, నీలోంచి రావాలి, చించుకు రావాలి
మాటల్ని పేర్చటం కవిత కాదు” అని ఒక అద్భుతమైన అనుభూతిని, ఉన్నతమైన ఆలోచనా స్రవంతి ని మనకి మిగులుస్తుంది ఈ పుస్తకం.
-స్వాతికుమారి (“కల్హార” బ్లాగు నించి)
———–