పేరు (ఆంగ్లం) | Pingali Surnaryudu |
పేరు (తెలుగు) | పింగళి సూరనార్యుడు |
కలం పేరు | – |
తల్లిపేరు | యబ్బమ్మ |
తండ్రి పేరు | యమరన్న |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | రాఘవపాండవీయము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పింగళి సూరనార్యుడు |
పింగళి సూరనార్యుడు
పింగళిసూరన్న నియోగిబ్రాహ్మణుడు; ఆపస్తంబసూత్రుడు; గౌతమగోత్రుడు. ఈతనితాత సూరన్న; తండ్రి యమరన్న; తల్లి యబ్బమ్మ; అమలన్న, ఎర్రన్న తమ్ములు. విష్ణుపురాణమును రచియించిన వెన్నెలగంటి సూరన్న తరువాత నున్నందున, ఈతనిని పింగలి (వెనుకటి) సూరన్న యందురని యొకానొకరు చెప్పిరిగాని యది సరిగాదు. పింగలి యనునది ఈకవియొక్క గృహనామము. ఈతని పూర్వులును పింగలివారనియే చెప్పబడుచు వచ్చిరి. పింగలియనునది కృష్ణా మండలములోని యొకయూరు. కాబట్టి యీగ్రామనామమునుబట్టియే యీకవివంశమువారి కిటువంటిపేరు గలిగినది. ఈకవి ప్రభావతీప్రద్యుమునందు తనవంశమునకు మూలపురుషు డయిన గోంకనామాత్యుని వర్ణించుచు, ఆతనిని పింగళిపురాంకునిగా నీక్రిందిపద్యమునందు జెప్పియున్నాడు-
క. ఆగౌతమగోత్రంబున
సాగమనిధి పుట్టె గోంగ నామాత్యుడు స
ద్భోగక్షేత్రస్వామ్యస
మాగతి బింగళిపురాంకుడై యత డొప్పెన్.
ఈపింగళి గోంకనామాత్యుడే పేకియనుదానిని దాసినిగా నేలి నట్లీగ్రంథములోని యీక్రిందిపద్యమున జెప్పబడినది-
ఉ. పే ర్వెలయంగ నాఘనుడు పింగళలి గోంకబుథోత్తముండు గం
ధర్వ నొకర్తు బేకియనుదానిని దాసిగ నేలె యోగితా
గుర్వనుభావుడై నెఱపె గోపకుమారునిఖడ్గవర్ణనన్
బర్వపునిండునెన్నెలలపై నెఱిచూపెడుకీర్తిసంపదన్. ఈపింగళివారి పేకికథను జను లీప్రాంతములయం దిప్పుడు సహితము వాడుకగా చెప్పుకొనుచున్నారు. పింగళి గోంకనామాత్యు డొకనా డరణ్యములో సంచరించుచుండగా, ఆతని కొకసుందరమయిన పూస దొరకినదట. అతడాపూసను దెచ్చి తనపెట్టె లోవేసి దాచెనట. ఆదినమునందే పేకి యనుపేరుతో నొకతెవచ్చి వారియింట దాసిగా కుదిరి మిక్కిలి విశ్వాసముతో పనులు చేయ మొదలు పెట్టెనట. ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత గోంకనామాత్యుని భార్య గర్భవతియై ప్రసవసమయము సమీపించినప్పు డాపురిటింటిలో పేకిని కావలి పెట్టిరనియు, అది యా కావలియున్నదినములలో నొకనాటిరాత్రి తాను శయనించిన స్థలమునుండి లేవకయే నాలుకను దీర్ఘముగాచాచి దానితో దీప మెగసనద్రోచెననియు, అది చూచి యాతని భార్య భయపడి జరగిన వృత్తాంతమును మఱునాడు భర్తతో చెప్పెననియు, అందుమీద వారు దాని నేలాగుననైన వదల్చుకోవలెనని యెటువంటి యసాధ్యము లయినపనులు చెప్పినను పేకి వానినెల్ల నిమిషములో నిర్వహించుచు వచ్చెననియు, అందుమీద వారు దానిని వదల్చుకొను సాధనములేక కాశికిపోయి గంగతెమ్మని దానిని దూరదేశమునకు బంపి యది యింట లేని సమయమందు సమస్తసామగ్రితోను పొరుగూరికి లేచిపోయిరనియు, ఇంతలో పేకి కాశినుండి గంగతీసికొనివచ్చి యింటివారు పొరుగూరికి పోవునప్పు డింట దిగవిడచిపోయిన నలువు రెత్తలేని పెద్దరాతిరుబ్బు రోటిని నెత్తిమీద పెట్టుకొని యిది మఱచి వచ్చితిరని పొరుగూరికిపోయి వారికీ చేర్చినదనియు, అప్పుడు గోంకనామాత్యుడు నీవు మమ్మెట్లు విడిచెదవని దానిని మంచిమాటలతో నడుగగా నా డరణ్యములో దొరకిన పూస నిచ్చివేసినయెడల పోయెదనని యది చెప్పెననియు అంతట దానియభితమునుదీర్చి వారు దానిని పంపి వేసిరనియు, కథ చెప్పుచున్నారు. ఈకవి పూర్వులు మొట్టమొదట కృష్ణామండలములోనివారయినను, తరువాత దక్షిణదేశమునకు బోగా కృష్ణదేవరాయని యనంతరము నందు విజయనగరరాజ్యము చెడి యనేకులైన చిన్నచిన్న రాజుల యధీనమయి యున్నకాలములో నితడు కందనూలు (కర్నూలు) మండలములోని యాకువీడు, నంద్యాల, మొదలగుసంస్థానములలో జేరినట్టు కానబడుచున్నది. ఈతడు కృష్ణదేవరాయనియొక్క యాస్థానకవీశ్వరులయిన యష్టదిగ్గజములలో నొక్కడని కొందఱు చెప్పురు గాని యీకవి యాకాలమునందు గాని యాస్థానమునందుగాని యున్నట్టు నిదర్శనము లేవియు గానరావు. ఈసూరకవి పదునాఱవశతాబ్దమధ్యమునం దున్నట్లూహించుట కనేక నిదర్శనములు కనబడుచున్నవి. ఈ కవి రచించిన కళాపూర్ణోదయము నంద్యాల సంస్థానాధిపతియైన కృష్ణరాజున కంకితము చేయబడినది. ఈకృష్ణరా జార్వీటిబుక్కరాజుయొకా యాఱవ సంతతివా డయినట్లు కళాపూర్ణోదయములోని కృతిపతియొక్క వంశానువర్ణనమువలన స్పష్టముగా గానబడుచున్నది. ఆర్వీటి బుక్కరాజుయొక్క పెద్దకుమారుడు సింగరాజు; అతని పుత్రుడు నరసింగరాజు; ఆతని పుత్రుడు నారపరాజు; ఆతని పుత్రుడు నరసింగరాజు; ఆతనిపుత్రుడు కళాపూర్ణోదయము కృతినందిన కృష్ణరాజు. ఆర్వీటి బుక్కరాజు క్రీస్తుశకము 1473 వ సంవత్సరము మొదలుకొని 1481 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. అటుతరువాత వచ్చిన యతని సంతతివారు నలుగురు నొక్కొక్క రిరువదేసి సంవత్సరము లుండి రనుకొన్నపక్షమున, ఈకృష్ణరాజు క్రీస్తుశకము 1560 వ సంవత్సరప్రాంతముల నున్నట్లెంచవలసి యున్నది. ఈకృష్ణరాజు విజయనగరమును సదాశివదేవరాయలు పాలించుచుండిన కాలములో నంద్యాల రాజయి యున్నట్లు కానబడుచున్నది. కృష్ణదేవరాయల యనంతరమున 1530 వ సంవత్సరమున రాజ్యమునకు వచ్చిన యచ్యుతదేవరాయడు 1542 వ సంవ త్సరమునందు మృతినొందెను. ఆకాలమునందు సదాశివదేవరాయడు పసివాడయినందున సకలము తిమ్మయ రాజ్యమును దానాక్రమించుకొని కృష్ణదేవరాయల యల్లుడయిన రామరాజును రామరాజు తమ్ముడయిన తిరుమలదేవరాయని బట్టి చెఱలో బెట్టవలెనని ప్రయత్నింపగా వారిద్దఱును పెనుగొండకు పాఱిపోయి యక్కడ గొంతసైన్యమును గూర్చుకొని తరువాత కందనూలురాజు మొదలయినవారి సాహాయ్యమును బొంది విజయనగరము మీదకి దండెత్తివచ్చి సలకము తిమ్మయ నోడించి చంపి 1542 వ సంవత్సరమునకు సరియైన శుభకృత్ సంవత్సర జ్యేష్ఠమాసమునందు బాలుడయిన సదాశివరాయని సింహాసన మెక్కించిరి. ఈ కార్యమువలన రామరాజు సదాశివరాజ్య సంస్థాపకుడని పేరుపొంది, పేరునకు సదాశివరాయడే రాజయినను నిజమైన యధికారమునంతను దానే వహించి రాజ్యపరిపాలనము చేయుచుండి 1564 వ సంవత్సరమునందు మహమ్మదీయ రాష్ట్రముల వారిసేనతో తాలికోటవద్ద జరగిన యుద్ధమునందు జంపబడెను. అప్పుడు మహమ్మదీయ ప్రభువులు విజయనగరమునందు బ్రవేశించి యనేక క్రూరకృత్యములను జరపి రాజ్యమంతయు పాడుచేసి తమలో దమకు సంభవించిన కలహమువలన రాజ్యమును పూర్ణముగా నాక్రమించుకొనక వెడలిపోయిరి. తరువాత నయిదు సంవత్సరముల వఱకు రాజ్య మించుమించుగా నరాజకము కాగా నీలోపల1567 వ సంవత్సరప్రాంతమున సదాశివరాయడు స్వర్గస్థు డయ్యెను. ఆసంవత్సరమునందే తిరుమలదేవరాయడు విజయనగరమును విడచి పెనుగొండజేరి తానురాజునని ప్రకటించి ప్రమోదూత సంవత్సరములో ననగా 1569 వ సంవత్సరమున పెనుగొండరాజ్యమునందు స్థిరపడి 1572 వ సంవత్సరమునందు లోకాంతరగతు డయ్యెను. 1572 వ సంవత్సరమునకు సరియైన ఆంగిరస సంవత్సర వైశాఖశుద్ధదశమినా డాతనిపుత్రు డయిన శ్రీరంగరాయలు రాజ్యమునకు వచ్చి 1585 వ సంవత్సరము వఱకును రాజ్యముచేసి స్వర్గస్థు డయ్యెను. 1585 వ సంవత్సరమునకు సరియైన పార్థివసంవత్సర మాఖశుద్ధదశమినా డాతని తమ్ముడైన వేంకటరాయడు సింహాసనమునకు వచ్చినతోడనే తనరాజధానిని పెనుగొండనుండి చంద్రగిరికి మార్చి 1614 వ సంవత్సరము వఱకును రాజ్యముచేసి సంతాన హీనుడయి పరమపదమును బొందెను. నంద్యాల రాజైన కృష్ణరాజు సదాశివదేవరాయని కాలములోనివాడై నందున, అతని రాజ్యకాలము 1564 వ సంవత్సరమునకు లోపల నారంభమై యుండును. కాబట్టి పింగళి సూరన్న నంద్యాలసంస్థానము నందుండి కృష్ణరాజునకు గళాపూర్ణోదయము నంకితముచేసిన కల మించుమించుగా 1560 వ సంవత్సరప్రాంత మని చెప్పవచ్చును. ఈసదాశివదేవరాయ డచ్యుతదేవరాయని కుమారు డయినట్టు కొన్ని శిలాతామ్రశాసనములయందు జెప్పబడినదిగాని కృష్ణామండలములోని సత్తెనపల్లె తాలూకాలో దొరకిన శాలివాహనశకము 1482 సిద్ధార్థిసంవత్సరమునకు సరియైన హూణశకము 1560 వ సంవత్సరపు సదాశివరాయల తామ్రశాసనములో నతడు రంగరానకును తిమ్మాంబకును బుత్రు డయినట్టును రామరాజునకు మఱదియైనట్టును ఈక్రింద శ్లోకముచే జెప్పబడినది:-
“తిమ్మాంబావరగర్భమౌక్తికమణీ రంగక్షితీంద్రాత్మజ
అత్రాలంకరణేన పాలితమహాకర్ణాటరాజ్యశ్రియా
శౌర్యౌదార్యదయావతా స్వ భగినీభర్త్రా జగత్రాయిణా
రామాఖ్యప్రభుణా వ్యమాత్యతిలకై:క్దుప్తాభిషేకక్రమ:”
ఈ శ్లోకమునందలి రంగక్షీతీంద్రుడన్నది ప్రమాదజనితమేమో! నంద్యాలకృష్ణరాజు వేంకటపతిరాయల రాజ్యారంభదశలోను జీవించి యున్నాడట. అందుచేత నతడు 1585 వ సంవత్సరమునకు దరువాత కూడ నల్పకాలము రాజ్యమేలి యుండును.
మఱియును కళాపూర్ణోదయములో కృష్ణరాజు తాతయైన నారపరాజును వర్ణించుచో నతడు కుతుబ్మల్కును కొండవీటివద్ద నోడించినట్లీక్రింది పద్యమునందు జెప్పబడినది.
చ. వదలక యుత్కలేంద్రుని సవాయి బరీదు నడంచుదుర్జయున్
గుదుసనమల్క దల్లడిలగొట్టె మహాద్భుతసంగరంబులో
నెదిరిచి కొండవీటికడ నెవ్వరు సాటి విచిత్రశౌర్యసం
పదపస నారసింహవిభుపట్టికి నారనృపాలమౌళికిన్.
గోలకొండయందు కుతుబ్షావంశరాజ్య సంస్థాపకు డయిన యీ కుతుబ్ మల్కు క్రీస్తుశకము 1512 వ సంవత్సరము మొదలుకొని 1543 వ సంవత్సరమువఱకును గోలకొండయందు రాజ్యముచేసెను. కృష్ణదేవరాయని కాలములో కొండవీటివద్ద జరిగిన యీ యుద్ధము 1515 వ సంవత్సరమునందగుట చేత నాతనితో యుద్ధముచేసిన నారపరాజు మనుమడయిన కృష్ణరాజటు తరువాత ముప్పది నలువది సంవత్సరములైన పిమ్మట రాజ్యము చేసెననుట సత్యమునకు దూరమయి యుండదు. కాబట్టి దీనినిబట్టియు సూరకవి 1560 వ సంవత్సరప్రాంతముల యందున్నట్లు నిశ్చయింపవలసియున్నది. ఈవిషయమునే రాఘవపాండవీయములోని కృతిపతివంశానువర్ణనము నుండియు నొకవిధముగా నూహింపవచ్చును. రాఘవపాండవీయము కర్నూలు మండలములోని యాకువీటి సంస్థానాధిపతియైన పెదవెంకటాద్రి కంకితము చేయబడినది. ఆకువీడు కోవిలకుంటకు పడమట నాఱుకోసులదూరములో తుంగభద్రా తీరమునం దున్నది. అందు విరూపాక్షస్వామి దేవాలయమున్నది. ఈ వేంకటాద్రియొక్క తాతయైన యిమ్మరాజు రాజమహేంద్రవరమును జయించినట్లీ క్రిందిపద్యమువలన దెలియవచ్చుచున్నది:- క. రాజమహేంద్రవరాధిపు
రీజైత్రవిచిత్రముల బరిభ్రాజితుడై
యాజఘనుం డా యిమ్మ మ
హీజాని ప్రసిద్ధిగాంచె నెంతయు మహిమన్.
రాఘవపాండవీయ కృతిపతితాత యయిన యీ యిమ్మరాజును, కళాపూర్ణోదయ కృతిపతితాతైన నారపరాజును, కృష్ణదేవరాయని కాలములో నాతనికి లోబడిన సామంతరాజు లయి యుండి, ఆతనితో గలిసి సేనాధిపతులుగా మహమ్మదీయులు మొదలయిన వారితో యుద్ధముచేసిరని తెలియవచ్చుచున్నది. కృష్ణదేవరాయనికి సహాయులుగా నున్నవారిని వర్ణించిన కృష్ణరాజవిజయములోని యీక్రిందిపద్య మీసంగతిని కొంత స్థాపించుచున్నది:-
సీ. కోటలు దుర్గముల్ గొనుచు దో:పటుబలధాటిచే మించునార్వీటివారు
కంటకాహితకంఠలుంటనోద్ధతలీల దంటలైతగు తొరగంటివారు
నిర్భరంబుగ శత్రునికరంబు నడగించి ధీరులైమించు గొబ్బూరివారు
చాలదోర్బలలీల నరదారిసంఘంబు దూలించివెలయు నంద్యాలవారు
నాదిగా గల్గురాజులు మేదురగతి
దుళువదొరలును బోయలు దురుసుగాగ
బ్రతిదినంబును ఘోరమౌ రణ మొనర్ప
నిలిచి పోరాడె గజపతి బలము లపుడు.
1515 వ సంవత్సరమునందు కృష్ణదేవరాయలు రాజమహేంద్రవరమును జయించెను. కాబట్టి యిమ్మరా జాకాలమునం దాతనితో నుండి యుండును. దీనినిబట్టి చూచినను సూరనార్యునికాలము పయిని చెప్పబడినదే యయి యుండవలెను. ఈ యాకువీటిరాజులు విజయనగర రాజులకు లోబడినవా రయినందుకు నిదర్శనముగా రాఘవపాండవీయములో నుపోద్ఘాతములో నీ క్రిందివాక్యము కానబడుచున్నది: క. వడిగలతనాన నీగిని
విడిముడిపస బ్రాభవమున విజయనగరిలో
గడునెన్న నేర్వగల మేల్
నడకల బెదవేంకటాద్రి నరవరు డొప్పున్.
ఈ పద్యమునుబట్టి విజయనగరరాజ్యము చెడకముం దనగా 1564 వ సంవత్సరమునకు బూర్వమే రాఘవపాండవీయము రచియింపబడిన దగుట నిశ్చయము.
కృష్ణదేవరాయని కాలములోనున్న ధూర్జటికవియొక్క మనుమడయిన కుమారధూర్జటి కృష్ణరాజవిజయమును రచించెను. అతడు కృష్ణరాజవిజయములోని యీ రెండవపద్యమునందు,
సీ. జగదధిష్ఠానభాస్వజ్జ్యోతి యగువాడు
బ్రహ్మాదులదరు దురాయివాడు
చలిగట్టురాపట్టి సామేన గలవాడు
చిఱునవ్వువెన్నెలల్ చిలుకువాడు
వాడువీడనక యెవ్వనినైన బ్రోచువా
డఖిలదై వతగురుం డైనవాడు
లీలమై శూలంబు కేల బూనినవాడు
నలమేనిదొరతూపు గలుగువాడు
కలితపంపాతటంబున నిలుచువాడు
శ్రీవిరూపాక్షశివుడు రక్షించునెప్పు
డఖిలసద్గుణమణిపేటి యాకువీటి
చిన్న వేంకటరాయని చెలువుమీఱ.
అని వర్ణించిన యీ చినవేంకటరాయడు రాఘవపాండవీయములో వర్ణింపబడిన కృతిపతి తమ్ముడయిన చినవేంకటాద్రియే యయినపక్షమున, ఈ పద్యమును పయికాలమును స్థిర పఱుచుచున్నది. పింగళిసూరన్న కృష్ణదేవరాయనికాలములో నుండెనని యొకానొక రనుచున్నారు. ఆర్వీటి బుక్కరాజు ముమ్మనుమడైన యళియ రామరాజే 1564 వ సంవత్సరమువఱకు నుండినప్పుడు బుక్కరాజు ముమ్మనుమని మనుమడయి కళాపూర్ణోదయ కృతిపతియైన నంద్యాల కృష్ణరా జంతకుబూర్వమునం దుండెననుట పొసగనేర నందున వారిమాట విశ్వాసార్హమయినది కాదు. ఇతడు 1560 వ సంవత్సరమునకు లోపలనుండుట, తటస్థింపదు.
గ్రంధస్థములైన యీ నిదర్శనము లటుండగా మఱియొక కట్టుకథకూడ వాడుకలో నున్నది. ఈ సూరనార్యు డల్లసానిపెద్దన్న మనుమరాలిభర్త యనియు, చిన్నతనములో నితడు చదువులేక మూడుడై తిరుగుచుండుటచూచి యితనినిమాత్రమే కాక యీతని భార్యను సహితము మూడభర్త దొరకెనని యెల్లవారును పరిహసింపుచువచ్చిరనియు, అందుమీద సూరనకు రోషమువచ్చి దేశాంతరముపోయి చదువుకొని పండితుడై వచ్చి రాఘవపాండవీయమును చేయ నారంభించెననియు, అప్పుడా చిన్నది తనభర్తను వెంటబెట్టుకొని తాతగారియొద్దకు బోయి నీ మనుమడు రాఘవపాండవీయమును జేయు చున్నాడని చెప్పగా నతడందులోని పద్యము నొకదానిని చదువుమని యడిగెననియు, అందు మీద సూరన,
“తలపం జొప్పడి యొప్పె నప్పుడు”
అని పద్యమును జదువ నారంభింపగానే యల్లసానిపెద్దన్న “యింతలోనే నాలుగువిఱుపులా” యని యాక్షేపించె ననియు, తరువాత సూరన పై భాగము నందుకొని,
“…………..తదుద్యజ్జైత్రయాత్రాసము
త్కలికారింఖదసంఖ్యసంఖ్యజయవత్కంఖాణరింఖావిశృం ఖలసంఘాతధరాపరాగపటలాక్రాంతంబు మిన్నే రవ
ర్గళభేరీరవనిర్దళద్దగన రేఖా లేపపంకాకృతిన్.
అని చదువగా మెచ్చుకొనెననియు చెప్పుదురు. ఈ కథ యెట్టిదైనను సూరన కృష్ణదేవరాయని తరువాతికాలపువా డైనట్టు స్థిరపఱచు చున్నది. అల్లసాని పెద్దన కృష్ణదేవరాయని యనంతరమం దనగా 1530 వ సంవత్సరమునకు తరువాతకూడా జీవించియున్నందున, సూరనార్యు డల్లసాని పెద్దన్న మనుమరాలి మగడయినను కావచ్చును. కళాపూర్ణోదయమును రచింపకపూర్వమునం దీకవి యాకువీటిరాజుల వద్ద మొట్టమొదటనుండి రాఘవపాండవీయమును జేసి వారి కంకితము చేయుటచే రాఘవపాండవీయము నీకవి 1550 వ సంవత్సర ప్రాంతములయందు మంచి పడుచుతనములో రచియించియుండును. ఇంతకు బూర్వపుదైన గారుడపురాణము బాలకవిత్వ మగుటచే నశించినదేమో! తిక్కన సోమయాజికి తరువాత నింత ప్రౌడముగా కవిత్వము చెప్పిన తెనుగుకవి మఱియొకడు లేడు. ఈ సూరన కావ్యరచనయందు సర్వతోముఖ చాతుర్యము కలవాడు. ఈతని కవిత్వము మృదుపదగుంభితమై ద్రాక్షాపాకముగా నుండును. ప్రభావతీ ప్రద్యుమ్నములోని యీ క్రింది పద్యమువలన నితడు గరుడపురాణమును, రాఘవ పాండవీయమును, కళాపూర్ణోదయమును, ప్రభావతీ ప్రద్యుమ్నమును, మఱికొన్ని గ్రంథములును రచించినట్లు కానబడుచున్నది.
మ. జనముల్ మెచ్చగ మున్రచించితి సదంచద్వైఖరిన్ గారుడం
బును శ్రీరాఘవ పాండవీయము గళాపూర్ణోదయంబున్ మరిన్
దెనుగుంగబ్బము లెన్నియేనియును మత్పిత్రాదివంశాభివ
ర్ణన లేమిం బరితుష్టి నాకవి యొనర్పంజాల వత్యంబునన్.
ఇందు పేర్కొనబడినవానిలో గారుడపురాణము మాత్రము మాకు లభించినదికాదు. రాఘవపాండవీయము క్లిష్టార్థములు లేకుండ మృదుమధుర సులభపదములతో రామాయణభారతార్థములు వచ్చు నట్లుగా రచియింపబడిన శ్లేషకావ్యమును రచియించుట మఱియొకరికి సాధ్యముకాదు. ఈగ్రంథముయొక్క ప్రౌడిమను కృష్ణరాజు మెచ్చుకొన్నట్లుగా కవియే కళాపూర్ణోదయమునం దిట్లు చెప్పియున్నాడు-
మ. ఇటము న్గారుడసంహితాదికృతు లీవింపొందగా బెక్కొన
ర్చుట విన్నారము చెప్పనేల యవి సంస్తుత్యోభయశ్లేషసం
ఘటనన్ రాఘవపాండవీయకృతి శక్యంబే రచింపంగ నె
చ్చట నెవ్వారికి నీకె చెల్లె నది భాషాకావ్యముం జేయగన్.
కళాపూర్ణోదయము విచిత్ర మయినకల్పితకథను గలదై తెలుగు గ్రంథములలో నిరుపమానముగా నున్నది. సంస్కృతనాటకములలో మాత్ర మిటువంటి కథాచమత్కారము కానబడుచున్నదిగాని తెలుగులో నెక్కడను నింతవింతయైన కల్పితకథ మఱియొకటి కానరాదు. ఇది నాతికఠినమై మృదుమధుర శైలి గలదై యున్నది. ప్రభావతీ ప్రద్యుమ్నము చక్కని స్వభావోక్తులను గలదయి లలితఘటితమై కథాచమత్కృతి గలిగి చదువువారికి కర్ణరసాయనముగా నుండెడు ప్రౌడకావ్యము. ఈతడు రచియించిన పుస్తకములలో నిది కడపటి దగుటచే గవి దీనిని 1570 వ సంవత్సరప్రాంతముల యందు రచియించి యుండును. ఈకాలమునకే యీతడు వయసుమీఱినవా డగుటచేత దరువాత శీఘ్రకాలములోనే కీర్తిశేషు డయి యుండవచ్చును. ఈతని కవిత్వశైలి తెలియుటకై పైపుస్తకములనుండి రెండేసిపద్యముల నిందుదాహరించుచున్నాను.
రాఘవపాండవీయము
ఉ. హారిమృగవ్యనవ్యవిహితాదరు డాధరణీతలేశు డ
ధ్వార చితశ్రమాకలితుడై కడుమెచ్చె సురాపగాజలా సారసమాగమార్హ తమసారససారససారసౌరభో
దీరణకారణంబు నతిధీరసమీరకిశోరవారమున్. [ఆ.1]
చ. అలవి యెఱుంగలేక యితరాంగనలంబలె నన్నునిమ్మెయిం
గలచుట యుక్తమే యొదవుగాక భవత్కృతదుష్టచేష్టితం
బులకు ఫలంబు నే డొకటి పూర్ణముగా నుపభోగ్యమై కడుం
జలమున నెందు నీమగతనంబు కడంకల రూపుమాలుటల్. [ఆ.3]
కళాపూర్ణోదయము
శా. అమ్మా నీపలు కెల్ల నెంతయు నిజంబై యిప్డు గాన్పించె నే
నిమ్మాయావిప్రకార మి ట్లగుట యూహింపంగలే కొక్కయ
ర్ధమ్మున్ వీనికృపం గడింతునని యత్యంతాశ ప్రేరేపగా
నిమ్మాడ్కిం దెగివచ్చితిం దెరువులే దీపాటు దప్పింపగన్. [ఆ.4]
చ. అన నిక నేమి చెప్పుదు జనాధిప యాయతిముఖ్యు డంత నె
మ్మనమును బట్టలేక ప్రతిమన్ బిగియార గవుంగిలించె నిం
పొనరగ లేచివచ్చి కడ నొక్కమఱుంగున నప్డు సుగ్రహుం
డునికి యెఱుంగమిన్ నగియె నుండగలె కతడుం గికాకికన్. [ఆ.8]
ప్రభావత్రీద్యుమ్నము
ఉ. పాడిదొఱంగజన్నె యొకపట్టున గొల్చెదనంచు నెంతమా
టాడితి సర్వదైవతకులాధిప యోడలబండ్లువచ్చు బం
డ్లోడలవచ్చు నొండొరుల కొక్కొకచో వనువాదుటాలకుం
గూడుట యిష్టబంధులకు గ్రొత్తయె యిత్తఱి నింతయేటికిన్. [ఆ.1]
ఉ. వట్టిమఱుంగువెట్టి నొడువం బనిలే దదియెల్ల భేరిజో
కొట్టుటగాక నిన్గెలువగూడునె మాటల నీవుకంటి న
న్నట్టిశుభాంగు డీరమణియాసల కాస్పద మిప్పు డాతనిన్
గట్టిగ నన్వయాదికథనంబుగ దెల్పి యనుగ్రహింపవే. [ఆ.3]
ఆంధ్ర కవుల చరిత్రము నుండి…
———–