తెనాలి రామకృష్ణుడు (Tenali Ramakrishna)

Share
పేరు (ఆంగ్లం)Tenali Ramakrishna
పేరు (తెలుగు)తెనాలి రామకృష్ణుడు
కలం పేరు
తల్లిపేరులక్ష్మాంబ
తండ్రి పేరురామయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీసా.శ. 1514
మరణం1575
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునీలకంఠవిజయమను సంస్కృతగ్రంథము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులువికటకవి
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికతెనాలి రామకృష్ణుడు
సంగ్రహ నమూనా రచనఈతనికి మొట్టమొదట రామలింగ మని పేరనియు, ఆపేరుతో నితడు శివభక్తిపరాయణు డయి లింగపురాణమును తెనిగించెననియు, చెప్పుదురుగాని యిది యెంతవరకు నిజమో తెలియదు. ఈతనిచే నాంధ్రికరింపబడినదన్న లింగపురాణ మిప్పు డెక్కడను గానబడదు. అప్పకవి మొదలగువారు రచించిన లక్షణగ్రంథములలో నందలిపద్య మొక్కటియు నుదాహరింపబడి యుండకపోవుటచే పూర్వకాలము నందుసహితమట్టి గ్రంథ మున్నట్టు తోచదు. ఈకవి మొట్టమొదట శివభక్తు డయినను విష్ణుభక్తులగు చంద్రగిరిరాజులను సంతోషపెట్టుటకయి తరువాత విష్ణుభక్తు డయి వైష్ణవులను గురువులనుగా గైకొనె ననియు గూడ జెప్పుదురు. ఈకథ సత్యమైనను గావచ్చును. ఇతడు రచియించినట్టు చెప్పెడు చాటుపద్యములలో గొన్నిటిలో నీతనిపేరు రామలింగమని కానబడుచున్నది. అందొకపద్యము నిందుదాహరించుచున్నాను-

తెనాలి రామకృష్ణుడు

ఈతనికి మొట్టమొదట రామలింగ మని పేరనియు, ఆపేరుతో నితడు శివభక్తిపరాయణు డయి లింగపురాణమును తెనిగించెననియు, చెప్పుదురుగాని యిది యెంతవరకు నిజమో తెలియదు. ఈతనిచే నాంధ్రికరింపబడినదన్న లింగపురాణ మిప్పు డెక్కడను గానబడదు. అప్పకవి మొదలగువారు రచించిన లక్షణగ్రంథములలో నందలిపద్య మొక్కటియు నుదాహరింపబడి యుండకపోవుటచే పూర్వకాలము నందుసహితమట్టి గ్రంథ మున్నట్టు తోచదు. ఈకవి మొట్టమొదట శివభక్తు డయినను విష్ణుభక్తులగు చంద్రగిరిరాజులను సంతోషపెట్టుటకయి తరువాత విష్ణుభక్తు డయి వైష్ణవులను గురువులనుగా గైకొనె ననియు గూడ జెప్పుదురు. ఈకథ సత్యమైనను గావచ్చును. ఇతడు రచియించినట్టు చెప్పెడు చాటుపద్యములలో గొన్నిటిలో నీతనిపేరు రామలింగమని కానబడుచున్నది. అందొకపద్యము నిందుదాహరించుచున్నాను-


ఉ. లింగనిషిద్ధు గల్వలచెలింగని, మేచకకంధరుం ద్రిశూ
లింగని సంగతాళి లవలింగని, కర్దమదూషిత న్మృణా
లింగని, కృష్ణచేలుని హలింగని నీలకచన్ విధాతృనా
లింగని, రామలింగకవిలింగనికీర్తి హసించుదిక్కులన్. కూర్మపురాణమునందు రాజలింగకవి కవిస్తుతిచేయుచు “రంగనాథుని రామలింగకవిని” అని రామలింగనామమునే వాడియున్నాడు. ఈరామకృష్ణకవి గృష్ణామండలములోని తెనాలిగ్రామమునందు శాలివాహనశకము 1384 వ సంవత్సరమున ననగా క్రీస్తుశకమ 1462 వ సంవత్సరమున జనన మొందెననియు, ఈతనియింటిపే రీశ్వరప్రెగడవారనియు, పయికాలమును సూచించెడి యీతని జన్మపత్రికవలన నితడు మంచిలగ్నమున బుట్టినట్టు కానవచ్చుచున్నదనియు, అఱువదిసంవత్సరములక్రిందట తమదక్షిణహిందూస్థానకవిచరిత్రమునందు కానలి వేంకటరామస్వామిగారు వ్రాసియున్నారు. అయినను మన కీతనికాలమును గూర్చి యిప్పుడు దొరకిన నిదర్శనములనుబట్టి చూడగా పూర్వోక్తకాలము సరియైనదని నమ్ముటకు వలనుపడదు. రామకృష్ణకవి దని చెప్పబడెడు జన్మపత్ర మిటీవలివారిచేత సృష్టింప బడిన దయి యుండవలెను. అటుగాక యితడు పయిని జెప్పబడిన సంవత్సరమునందే జన్మించి యుండినపక్షమున, ఈకవి కృష్ణదేవరాయలు సింహాసనమునకు వచ్చునప్పటికే దాదాపుగా నేబదియేండ్ల ప్రాయము గలవా డయి యుండవలెను. రామకృష్ణకవి యప్పయదీక్షితుల వారితోను తిరుమల తాతాచార్యులతోను సమకాలికు డయి చంద్రగిరిరా జగు వేంకటపతిరాయల ప్రభుత్వకాలములో నుండినవా డయినట్లు కొన్నినిదర్శనములు కనబడుచున్నవి. ఈవేంకటపతిరాయలు వసుచరిత్రమును కృతినందిన తిరుమలదేవరాయల యనంతరమున తనరాజధానిని విజయనగరమునుండి చంద్రగిరికి మార్చుకొని క్రీస్తుశకము 1585 వ సంవత్సరము మొదలుకొని 1614 వ సంవత్సరమువఱకును రాజ్యము చేసినవాడు. కృష్ణరాయని మరణానంతరమున నేబదియైదుసంవత్సరములకు రాజ్యమునకు వచ్చిన వేంకటపతిరాజుయొక్క రాజ్యకాలములో నున్న రామకృష్ణకవి నిజముగా నొకవేళ కృష్ణదేవరాయల కాలములో గూడ నుండుటయే తట స్థించినపక్షమున, అత డప్పుడు బాలు డయియుండెవలెనుగాని జన్మపత్రమునందు జెప్పబడినప్రకారము వయసుమీఱినవా డయియుండ జాలడు. కాబట్టి యాజన్మపత్ర మెంతమాత్రమును విశ్వాసపాత్రమయినది కాదు. ఈ కాలవ్యత్యాసమును సరిపఱుచుట కయి కొంద ఱప్పయ్యదీక్షితులవారుకూడ కృష్ణదేవరాయలకాలమునాటివారే యని చెప్పుచున్నారు. అప్పయ్యదీక్షితులవారు మిక్కిలి వృద్ధు లగువఱకును జీవించినవా రగుటచేత బాల్యమున కృష్ణరాయని దినములలో నుండిన నుండవచ్చునుగాని యీసంస్కృత విద్వత్కవి వేంకటపతిరాయల యాస్థానమునందే యుండి ప్రసిద్ధు డయినవాడు. ఈదీక్షితులవారు కాంచీపురమునకు నలుబదిమైళ్ళ దూరములోనున్న యదెపోల మను నగ్రహారమున నీశ్వరాంశచేత నారాయణదీక్షితులకు పుత్రుడయి పుట్టెననియు, ఇతడు తనపండ్రెండవసంవత్సరమునాటికే వేదాధ్యయనము చేసి “శివార్చనచంద్రిక” “శివతత్త్వవివేకము”, “శివమణిదీపిక” “ఆత్మార్పణము” మొదలయిన శైవగ్రంథము లనేకములు చేసెననియు, వాదమునందు వేంకటపతిరాయలసంస్థానమున రాజగురువయిన తాతాచార్యుల నోడించి రజసమ్మానము పొందెననియు కావేరీతీరమునందనేక యాగములుచేసి యవసానదశయందు కాశీవాసము చేయవలెనని యఱువది యేండ్లు నిండినతరువాత ప్రయాణ మయిపోవుచుండగా త్రోవలో చిదంబర పురనివాసు లాతనిపోనీయక తమయూరనుండునట్లు ప్రార్థించి నిలిపినందున నపరకాశి యగు చిదంబరమునందుండి యందే దేహవియోగము నొందెననియు అతడు నూటికంటె నెక్కువపుస్తకములు రచించెననియు చెప్పుదురు. ఇప్పు డీమహాకవి రచించిన గ్రంథము లనేకములు నశించినవి. కువలయానందమనెడి యలంకారశాస్త్రము సుప్రసిద్ధమయి సర్వదేశములయందును వ్యాపించియున్నది. తనతండ్రికి గలిగిన గెలుపులను వర్ణించుచు నీలకంఠవిజయమను సంస్కృతగ్రంథమును జేసిన యయ్యదీక్షితు లప్పయదీక్షితులవారికి మేనల్లు డయి మధురరాజగు తిరుమలనాయకునియొద్ద మంత్రిగా నుండినందున, ఈతితుమలనాయకుడు మధురాపురము రాజధానిగా హూణశకము 1623 మొదలుకొని 1659 వ సంవత్సరమువఱకును పాండ్యదేశమును పాలించినందునను, ఆకాలమునుందుండిన యయ్యదీక్షితుల మేనమామయైన యప్పయ్యదీక్షితులవారు నూఱుసంవత్సరములక్రిందట కృష్ణదేవరాయలసభయందుండిరనుట నమ్మదగినదికాదు. అందుచేత దీక్షితులవారితోడిసమకాలికుడయిన రామకృష్ణకవియు కృష్ణరాయని యాస్థానమునందుండలేదనుట నిశ్చయము.
రామకృష్ణునిగూర్చి తాతాచార్యులవారితో సంబంధించినకథ లనేకములు చెప్పుచున్నారుగాన, దీక్షితులవారి చరిత్రమువలెనే యాచార్యులవారిచరిత్రమును మనకథతో నంతగా సంబంధించినది కాకపోయినను తాతాచార్యులవారినిగూర్చికూడ నిచ్చట గొంచెము వ్రాయుచున్నాను. ఈయనజన్మస్థలము కాంచీపురము; ఈతడు గొప్పవిద్వాంసుడును, సంస్కృతకవియు, ధర్మాత్ముడును అయి యుండెను. అప్పయ్యదీక్షితులవారు శివాంశచేత పుట్టిరని చెప్పినట్లే యితడు విష్ణ్వంశచేత గలిగెనని జనులు వాడుకొందురు. ఇతడు తనధనముతో బీదలకనేకవివాహములు చేయించినందున వీరివంశనామము తిరుమల వారయినను తరువాత కన్యాదానమువారని మాఱినది. ఈతడు గీర్వాణభాషలో “సాత్విక బ్రహ్మవిద్యావిలాసము” అనుగ్రంథమును జేసెను. ఇతడు చంద్రగిరిరాజులకు వంశగురువయి తఱుచుగా కాంచీనగరము నుండి చంద్రగిరికిబోయి వేంకటపతిరాయలసంస్థానమునందు వసించుటచేత, ఈయన కక్కడ రామకృష్ణకవితోడి సంబంధము కలుగుచు వచ్చెను. ఈతాతాచార్యులు మొట్టమొదట రామరాజు యొక్క రాజ్యాంతదశలో దలయెత్తి, వైష్ణవమతమునం దత్యంతాభినివేశము గలవాడయి తనశిష్యులయిన రాజులబలముచేత బలవంతముగా జనులను బట్టి చంక్రాంకణాదులు చేయుచువచ్చెను. అందుచేతనే “తాతాచార్యులవారిముద్ర భుజము తప్పినను వీపుతప్పదు” అనుసామెత నేటివఱకును వచ్చుచున్నది.
రామకృష్ణకవి యొక్క కాలమును నిర్ధారణము చేయుటకు దగిన యాధారములు కొన్ని తద్విరచితమైన పాండురంగమహాత్మ్యమునందే కనబడుచున్నవి. కవి యీక్రిందిపద్యములను కృతిపతియైన విరూరివేదాద్రియొక్క గురువునుగా కందాళ యప్పలాచార్యులవారిని వర్ణించి యున్నాడు.


సీ. వేదమార్గప్రతిష్ఠాదైవతజ్యేష్ఠు డభ్య స్తషడ్దర్శనార్థరాశి
యతిరాజరచితభాష్యగ్రంథనిర్ణేత యఖిలపురాణేతిహాసకర్త
బంధురదివ్యప్రబంధానుసంధాత పంచసంస్కారప్రపంచచణుడు
వాధూలమునిచంద్రవంశవర్ధనమూర్తి సకలదేశాచార్యనికరగురువు


పట్ట మేనుంగు శ్రీరంగపతికి నణ్ణ
గారిగర్భాంబురాశినీహారరశ్మి
సారసాహిత్యసర్వస్వశయ్యపేటి
యాళవందారు కందాళయప్పగారు.


వై జయంతీవిలాసమును రచియించిన సారంగు తమ్మకవియు నీకందాళ యప్పలాచార్యులవారినే తనగురువుగా విప్రనారాయణ చరిత్రముయొక్క ప్రథమశ్వాసమునం దీక్రిందిపద్యముచేత జెప్పియున్నాడు.


క. వందారు దాసజనతా
మందారు న్వేదశాస్త్రమహితప్రజ్ఞా
బృందారకగురు మద్గురు
గందాళాప్పలగురున్ జగద్ధితు గొలుతున్. పయిపద్యద్వయమునుబట్టి చూడగా రామకృష్ణకవియు తమ్మకవియు సమకాలీను లగుట స్పష్ట మగుచున్నది. వీరిలో తమ్మకవి తనవైజయంతీవిలాసమునందు తాను గోలకొండ కరణ మయినట్టును తనకాలము నందాదేశమును మహమ్మదుశాహి పాలముచేయుచుండినట్టును ప్రథమాశ్వాసములో నీక్రిందిపద్యమున జెప్పియున్నాడు.


చ. ఇనసమతేజులౌ నృపులనెల్ల మహమ్మదుశాహియేలు నీ
యెనుబదినాల్గుదుర్గముల నేలినయేలిక గోల్కొండ త
ద్ఘసనగరస్థలిన్ గరణికం బొనరించును దమ్మమంత్రి యా
జనపతి రమ్ము పొ మ్మన ప్రజ ల్జయపెట్ట గృహస్థు లౌననన్.


ఈమహమ్మదుశాహి నవాబుగానుండి గోలకొండరాజ్యమును క్రీస్తుశకము 1581 వ సంవత్సరము మొదలుకొని 1611 వ సంవత్సరమువఱకును పాలించినందున, ఈతని కాలమునందున్న తమ్మకవియు నాకాలమునందే జీవించియుండెను. తమ్మకవితోడి సమకాలికుడయిన రామకృష్ణకవియు నించుమించుగా నీకాలమునందే యనగా పదునాఱవ శతాబ్దాంతమునందును పదునేడవ శతాబ్దాదియందు నుండెననుటకు సందేహములేదు. కవియొక్క కాలనిర్ణయము చేయుటకు పాండురంగమాహాత్మ్యమునం దింకొకయాధారముకూడ కనబడుచున్నది. పాండురంగ మాహాత్మ్యమును కృతినందిన విరూరి వేదాద్రి యొక చిన్నజాగీరుదారయిన పెదసంగమరాజువద్ద ప్రధానిగా నుండెను. ఈవిషయము పాండురంగమాహాత్మ్యమునం దిట్లు చెప్పబడినది.


సీ. తనకులాచారవర్తన వైష్ణవాచారపర్యాయముల కొజ్జబంతియనగ
దనసూనృతముపురాతనసత్యనిధులయున్నతికి బునప్రతిష్ఠితముగా గ
దనబుద్ధి నీతిశాస్త్రరహస్యములు తెల్లముగ దెల్పువ్యాఖ్యానముద్రగాగ
దనవ్రాయుగంటంబుమొనవాడి విశ్వంభరాప్రజలకు బ్రాణరక్షగాగ వెలయు మంగయగురునభూవుభుని పెద్ద
సంగభూపాలమణి వ్రాయసప్రవర్తి
ప్రియయుతుం డైనరామానుజయసుతుండు
భద్రచారి విరూరి వర్దాద్రిశౌరి.


కృతినాయకు డైనవేదాద్రికి ఒరభువగుసంగరాజుయొక్క తండ్రి గురువరాజు సదాశివదేవరాయని రాజ్యకాలములో నుండి యాతని నలన శాలివాహనశకము 1465 వ సంవత్సరమునం దనగా హూణశకము 1545 వ సంవత్సరమునందు దేవుని నిమిత్తము నాలుగుగ్రామములు సంపాదించినట్టు మెకంజీదొరవారు సమకూర్చి చెన్నపురిలో ప్రాగ్దేశలిఖితపుస్తక నిలయమునం దుంచిన స్థానిక చరిత్రమువలన దెలియవచ్చుచున్నది. మంగయకొడుకైన గురువరాజును మంగయతమ్మునిగా జెప్పిన యాచరిత్ర మెంత నమ్మవచ్చునో యాలోచనీయముగా నున్నది. ఈకాలమును బట్టిచూచినను గురువరాజుకొడుకయిన సంగభూపాలుడు పదునాఱవ శతాబ్దముయొక్క కడపటి భాగమునందు రాజ్యము చేసినట్టే యూహింపదగియున్నది. ఆతని యాశ్రితు డగుటచేత రామకృష్ణకవియు 1560-70 సంవత్సరప్రాంతమునుండి కవియై యుండవచ్చును. కవి పాండురంగమహాత్మ్యమును వేదాద్రి కంకితము చేయునప్పటికే వేదాద్రికి కొడుకులు మొదలయినవారు కలిగియున్నట్లీపద్యము వలన దెలియవచ్చుచున్నది.


క.సోదరులు సుతులు సతులును
నేదోదితమార్గచర్య వినయము నయమున్
శ్రీదాంపత్యము నెసగగ
వేదాద్రిమహాప్రధాని వెలయుం గృతులన్.


రెట్టమతమును రచియించిన యయ్యలరాజు అయ్యలభాస్కరుల కాలమునుబట్టి చూడగా రామకృష్ణు డింకను దరువాతివాడని తెలి యవచ్చుచున్నది. పాండురంగ మాహాత్మ్యకృతిపతియగు విరూరి వేదాద్రి కాశ్రయుడగు పెదసంగభూపాలుని మేనల్లునికి రెట్టమతము నంకితమొనర్చిన యాకవులు తమకాలము నీక్రిందిపద్యముచే దెలిసికొనియున్నారు.


సీ. కలియుగప్రథమభాగమునాల్గువేలయెన్మిదినూర్లపైని డెబ్బదియునొకటి
శాలివాహనశకసమలిలవేయునార్నూటతొంబదిరెండు రూడిగా గ
బ్రభ వాదిగతములు పరగ నిర్వదిమూడు నేండ్లయ్యె నెంతయు నెన్నబుధులు
అట్టికాలంబున నయ్యల భాస్కర కవివర్యు లలరాజక మలహితుని


యాజ్ఞ బూర్వోక్త రెట్టమతాఖ్యకావ్య
మునునొనర్చిరి యాచంద్రముగను గీర్తి
వక్తృశ్రోతలకునుగల్గ వసుధమీద
నలయహోబల నృహరికి నర్పణముగ


సంగభూపాలుని యనుగ్రహవలన వేదాద్రిసంపదల నొందినట్లు


గీ. గుఱుతుగలరాజు మంగయ గురువరాజు
పుత్రు బెదసంగభూపాలుశత్రుజైత్రు
భానుసమతేజు విద్యావధానభోజు
గొల్చి వేదాద్రి నిత్యాలక్ష్ముల దలిర్చు.


ఇత్యాది పాండురంగమాహాత్మ్యములోని పద్యములు చెప్పుచున్నవి. పెదసంగభూపాలుడు గురువరాజుయొక్క తొమ్మండ్రుపుత్రులలో జ్యేష్ఠుడు. ఈతని తమ్ములనామము లాగ్రంథమునందు జెప్పబడి యుండకపోవుటచేత గ్రంథరచనకాలమునకు వారు బాలురనియు సంగభూపాలుడు యౌవనదశయం దుండినవా డనియు స్ఫురించుచున్నది. పెదసంగభూపాలుని తమ్ములనుగూర్చి రెట్టమతములో గృతిపతియొక్క తండ్రి యగుపెదతిమ్మరాజును వర్ణించుసందర్భమున నిట్లు చెప్పబడినది. గీ. అట్టి పెదతిమ్మరాజు ధైర్యాద్రిరాజు
మంగవిభుగుర్వశౌరియనుగు గూతు
సంగనాశిరోమణి బాపసంగమాఖ్య
బ్రేమవరియించె విభవాభిరాము డగుచు.


క. గుణనిధి యగుతత్కన్యా
మణిజనకుంబోధజనకు మంజులభాషా
ఫణివరు రణవిజయార్జును
బ్రణుతింప దరంబె గురువపార్ధివనర్యున్.


సీ. పృథులవిక్రమశాలి పెదసంగనృపతియు సత్యసంధుడు చినసంగరాజు
ధర్మగుణాడ్యుండుతమ్మభూపాలుండురుచిరకీర్తిధనుండు రుద్రఘనుడు
ప్రథనాంగణకిరీటి బసవనరేంద్రుండుస్థిరభాగ్యనిధి పెద చిట్టఘనుడు
సింధుగాంభీర్యుండు చినచిట్టవర్యుండు సతతధన్యుడు పొట్టిసంగశౌరి


కలితతేజుండు పాపసంగప్రభుండు
ననగ బరగినతొమ్మండ్రు తనయవరుల
గాంచి విజయసంశీలుడై మించె నౌర
మంగరాజన్యగురువసమ్రాడ్వరుండు.


క. ఆగురువరాజవరునకు|ద్యాగసముద్రునకు నల్లుడయి వెలసె ధరా
భాగధురంధరతను నా | భాగుడు పెదతిమ్మరాజు ప్రజలు నుతింపన్.


కృతిపతితల్లియు మంగయగురువ రాజుకూతురు నైన పాపసంగమాంబ పెదసంగభూపాలాదులగు తొమ్మండ్రుకును జెల్లె లయియుండ వచ్చును. అట్లయినచో నీమె సంగభూపాలునికంటె నిరువది యిరువదియైదేండ్ల చిన్నది కావచ్చును. కృతిపతియైన వేంకటరా జీమెయేడుగురుపుత్రులలో మూడవవాడు. కాబట్టి యితడు తల్లి కించుమించుగా నిరువదియైదువత్సరములప్రాయమునందు జనించి యుండ వచ్చును. అందుచే నీవేంకటరాజు తనమేనమామ యగు పెదసంగ భూపాలునికంటె నేబదియేండ్లు చిన్నవాడగుట యసంభవము కానేరదు. రెట్టమతమునందు కృతిపతియొక్క విక్రమధురంధరులైన యేడుగురు కొడుకులు వర్ణింపబడుటయేకాక కృతిపతియొక్క కొడగొట్టు తమ్మునిపుత్రులుసహిత మేవురు బాహుబలశాలులయి నట్లు వర్ణింపబడియున్నారు. అందుచేత నతడీగ్రంథమును గృతినందినకాలమున కనగా 1769 వ సంవత్సరమునాటికి మిక్కిలి వృద్ధు డయి యుండవలెను. అతని కప్పు డెనుబదిసంవత్సరములవయ స్సుండె ననుకొందము. అట్లనుకొన్నను పాండురంగమాహాత్మ్యము రచియింపబడినకాలము 1650 వ సంవత్సరమునకంటె బూర్వమయి యుండదు. అప్పటికి రామకృష్ణుడు వృద్ధు డనుకొన్నను, అతడు కృష్ణదేవరాయల యాస్థానమునందలి కవుల నాక్షేపించె నన్న కథలన్నియు నసత్యకల్పనములనుట స్పష్టము. అయినను మన మీకవులకాలమునుగూర్చి యింకను విచారింపవలసి యున్నది.
ఈరామకృష్ణకవి యాజ్ఞవల్క్య బ్రాహ్మణుడు; కౌండిన్యసగోత్రుడు; తండ్రి రామయ్య; తల్లి లక్ష్మమ్మ. తాను తెనాల్యగ్రహారనిర్ణేత యయినట్టును, ఆశుకవిత్వాదులయందు మేటియైనట్టును, కృతిపతి తన్నుద్దేశించి పలికినట్టుగా కవియే పాండురంగమహాత్మ్యమునం దీక్రింది పద్యములతో జెప్పుకొనియున్నాడు.


క. నను రామకృష్ణకవి గవి
జనసహకారావళీవసంతోత్సవసూ
క్తినిధి బిలిపించి యర్హా
సనమున గూర్చుండ బనిచి చతురత ననియెన్.


సీ. నలుదెఱంగులకావ్యనవసుధాధారలఘనుడనాశువునందుగరముమేటి
వఖిలభూమీపాలకాస్థానకమలాకరోచ్చయతరుణసూర్యోదయుడవు శైవవైష్ణవపురాణావళి నానార్థరచనాపటిష్ఠైకరమ్యమతివి
లౌకికవైదికలక్షణచాతుర్యధైర్యప్రభారూడకార్యచణుడ
వాంధ్రభూమీకుచాగ్రహారభ మైన
శ్రీతెనాల్యగ్రహారనిర్నేత వగ్ర
శాఖికాకోకిలమ వీవు సరసకవివి
రమ్యగుణకృష్ణ రామయరామకృష్ణ


క. కౌండిన్యసగోత్రుడ వా
ఖండలగురునిభుడ వఖిలకావ్యరససుధా
మండనకుండలుడవు భూ
మండలవినుతుడవు లక్ష్మమావరతనయా.


క. యశము గలిగించు నీమృదు
విశదోక్తుల బౌండరీకవిభుచరిత జతు
ర్దశభువనవినుతముగ శుభ
వశగతి నాపేర నుడువు వరత త్త్వనిధీ.


ఉ. స్కందపురాణనీరనిధికౌస్తుభమై ప్రభవించుదేవకీ
నందనుసత్కథోద్యమము నవ్యకవిత్వకళాకలాపమున్
కుందనమున్ ఘటించి కడుగ్రొత్తగు సొమ్మొనరించి విష్ణుసే
వం దిలకించునప్పరమవైష్ణవకోటి నలంకరింపుమా.


మ. ఉదయం బస్తనగంబు సేతువు హిమవ్యూహంబునుం జుట్టిరా
విదితంబైనమహిన్మహాంధ్రకవితావిద్యాబలప్రౌడి నీ
కెదు రేరీ సరసార్థబోధఘటనాహేలాపరిష్కార శా
రద నీరూపము రామకృష్ణకవిచంద్రా సాంద్రకీర్తీశ్వరా!

ఆంధ్ర కవుల చరిత్రము నుండి…

———–

You may also like...