పేరు (ఆంగ్లం) | Potlapalli Ramarao |
పేరు (తెలుగు) | పొట్లపల్లి రామారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | చెల్లమ్మ |
తండ్రి పేరు | పొట్లపల్లి శ్రీనివాసరావు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1917 |
మరణం | 9/10/2001 |
పుట్టిన ఊరు | వరంగల్ జిల్లా, తాటికాయల గ్రామం |
విద్యార్హతలు | 7వ తరగతి |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాష |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | పొట్లపల్లి రామారావు సాహిత్యం,చుక్కలు కవితా సంపుటి, జైలు కథాసంపుటి. (1934-45), ఆచార్యుల వారి కథలు, ఏనుగ చొప్ప, పాదధూళి (నాటిక), సర్‌బారాహి (నాటిక), పగ (నాటిక), న్యాయం (నాటిక) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పొట్లపల్లి రామారావు |
సంగ్రహ నమూనా రచన | – |
పొట్లపల్లి రామారావు
కాళోజి రామేశ్వరరావు సమకాలికుడు. తెలుగు, ఉర్దూ రెండింటిలోనూ మంచి కవిత్వం రాశాడు. వట్టికోట ఆళ్వారుస్వామితో కలసి గద్వాలమొదలయిన సంస్థానాలలో అధిక పన్నుల గురించి, రైతాంగం మీద జరుగుతున్న దౌర్జన్యాల గురించి నివేదిక రాశారు. దాసి సినిమా హీరో భూపాల్ పొట్లపల్లి మీద ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్‌డి చేశారు. పొట్లపల్లి సాహిత్య సర్వస్వము తీసుకరావటం కాళోజి కోరిక. ఈయన కథల్లో ఎక్కువ ప్రాచుర్యం పొందింది ఏనుగ చొప్ప.
తెలంగాణ రచయితలు రచయితలుగా బతుకరు. మనుషులుగా బతుకుతారు. అట్లాంటి మనుషుల్లో మహామనిషి పొట్లపల్లి రామారావు (1917-2001). వరంగల్ ప్రాంతానికి చెందిన రామారావు ప్రచార ఆర్భాటాలకు దూరంగా, సాహిత్యానికి దగ్గరగా బతికిన రచయిత. వారు గేయ కవిత్వం, వచన కవిత్వం, నాటికలు, కథానికలు, స్కెచ్‌లు, నవల (అసంపూర్ణం) లేఖాసాహిత్యం-వంటివి సృష్టించినా, భూపాల్ పరిశోధన చేసి పీహెచ్‌డీ పొందిన తర్వాత యావదాంధ్రదేశానికి కొద్దిపాటి పరిచయడం ఏర్పడింది. అంతకుముందు వారిని గూర్చి-దేవరాజు మహారాజు మంచి వ్యాసాలు రాయగా, వరవరరావు చాలా సభల్లో మాట్లాడారు. 1945-55 మధ్య కాలంలో, రామారావు రాసిన కథానికలను బి. నరసింగరావు 2012లో ‘తెలంగాణ ప్రచురణ’ల పక్షాన ప్రచురించగా, ‘పొట్లపల్లి ప్రచురణలు ( సంస్థ వారు వారి రచనలను రెండు సంపుటాలుగా 2012లో తెచ్చారు.పొట్టపల్లి రామారావు రాసింది తక్కువకాకపోయినా, రాసినదానికన్నా చదివింది చాలా ఎక్కువ. రామారావు రచించిన కొన్ని చిన్నకథలు విశ్వవిఖ్యాత రచయిత టాల్‌స్టాయ్ కథలను గుర్తుకు తెస్తాయి. టాల్‌స్టాయ్ లాగే వీరూ ఒక రైతులాగా నిరాడంబరంగా జీవించారు. ఇట్లా జీవించిన మళయాళీ మహారచయిత, ‘చెమ్మీన్’ నవలావూసష్ట తగళిశివ శంకరపిళ్లై. టాల్‌స్టాయ్ కొన్నిరోజులు సైన్యంలో పనిచేశారు. రామారావు స్వాతంత్య్ర సమరంలో పాల్గొని జైలుకెళ్లారు. టాల్‌స్టాయ్ కథల్లోని తాత్వికకోణం, గ్రామీణ జీవన చిత్రణ, ప్రకృతి పట్ల ఆరాధనల మూలంగా వారి రచనలు గాంభీర్యాన్ని సంతరించుకున్నాయని విమర్శకులు భావిస్తున్నారు.
‘ఊరు-అడవి’ అన్ని చిన్న కథను చూడండి. బ్రహ్మాండమైన ఎండలు. తీవ్రమైన దాహానికి లోనైన వ్యక్తి కొత్తవూళ్లో ఒక ఇంటి తలుపుతట్టి నీళ్ళడుగుతాడు. ఇంటి యజమాని నీళ్ళివ్వకుండా ‘ఏ ఊరు మీది’? అని ప్రశ్నిస్తాడు. మరో ఇంటికిపోయి అడిగితే ‘ఎవరు మీరు’? అని ప్రశ్నిస్తారు. ఇంకో ఇంటికి పోయి అడిగితే ‘మీ పేరేమిటి’? అని ప్రశ్నించారే తప్ప నీళ్ళివ్వలేదు. పైమూడు సందర్భాల్లో ప్రశ్నలు వేరువేరుగా వుండవచ్చు గాని ఫలితాంశం ఒక్కటే. అది దాహార్తునికి నీళ్ళు దొరకకపోవడం. ఎదురైన ప్రతి కొత్తవాడు అస్పృశ్యుడేమో అన్న దుష్ట ఆలోచన వాళ్ళలో వుంది. దప్పిగొన్నవాడు కూడా మొండివాడే. ప్రాణాలుపోయినా పర్వాలేదు, తన గుర్తింపును వెల్లడిచేయదలచలేదు. ఇది ఆయన వ్యక్తిత్వం. ప్రాణాధికంగా భావించే విశ్వాసానికి సంబంధించిన అంశం అనిపిస్తుంది. న్యాయమైన అభ్యర్థన దాహార్తుడిది కాగా, అమానుషమైన ప్రవర్తన అవతలివాళ్ళది. ఘర్షణ పాత్రల మధ్యమావూతమే కాదు, దాహార్తుడి-జీవితానికి మృత్యువును మధ్య కూడా.ఊరుదాటి అడవిలోనికి ప్రవేశించాడు. అడవిలో నీళ్ళేమోగాని, మృగాల దాహానికి బలయ్యే అవకాశమే ఎక్కువ. ఇంతలో హఠాత్తు గా ఒక చిన్నవాగు ఎదురైంది. ఒడ్డున చెలిమె! కడుపునిండా నీళ్ళు తాగి నిలబడ్డాడు. చెలిమె దప్పితీర్చడమే తన ఏకైక కర్తవ్యమైనట్టు ఉండిపోయిందే తప్ప, కులమత ప్రాంతాలకు సంబంధించిన ప్రశ్నలేమీ అడకపోవడంతో అతడు మహదానందానికి గురయ్యాడు!1950 ప్రాంతపు కఠిన సామాజిక వాస్తవం ఆధారంగా అల్లిన కథ ఇది. దాహం మానవ సహజమైంది. వివక్ష అమానుషమైంది. ఈ పోరాటంలో ప్రకృతి మనిషి దిక్కు నిలబడింది. తల్లి తన బిడ్డకు పాలు కుడిపినట్టగా చేపిన నీళ్ళతో దాహం తీర్చింది. ఒక రచనకు సంబంధించిన శీర్షిక కూడా శిల్పంలో భాగమే. ఈ కథ పేరు ‘ఊరు-అడవి’. ఇంతకూ ఊళ్ళో ఉండవలసిన వాళ్ళెవరు? అడవిలో ఉండవలసిన వాళ్ళెవరు? అసలు ఊరును జనారణ్యంగా మార్చిందెవరు? ఈ ప్రశ్నలు లేవనెత్తేది రామారావే. నర్మగర్భంగా జవాబు చెప్పేది రామారావే. ఇది వారి రచనా విధానం.‘ముత్యాల బేరం’ కథానిక చూడండి. దీన్ని టాల్‌స్టాయ్ చదివి ఉంటే, ‘పొట్లపల్లి రామారా నేను రాయవలసిన కథ రాశాడు?’ అని అనుకొని ఉండేవాడు. చెప్పులు కట్టే వృత్తిలో ఉన్న వెంకడి దగ్గరకు ముత్యాలు అమ్ముకునే వర్తకుడు వచ్చాడు. ముత్యాల కోవలు ప్రదర్శించి కొనుక్కోమన్నాడు. సహజంగా వెంకడు ఆసక్తి చూపలేదు. ‘సమువూదంలో నుంచి తీసినవి’ అన్నాడు వర్తకుడు. ‘కావచ్చు’ అన్నాడు. ‘ముత్యాల కోసం మునిగి తేవటంలో ప్రాణాలు కూడా పోతాయి’ అన్నప్పుడు ‘మరి పెళ్ళాము, పిల్లలు?’ అడిగాడు. ‘ఏమి చేస్తారు మరి. కాసిని కన్నీళ్ళు కారుస్తారు’ అంటూ తన సంచి భుజాన వేసుకుని బయలుదేరాడు. అప్పుడు ‘…నాకా ముత్యాలు యిచ్చిపో’ అడిగాడు వెంకడు.‘ఇంతలోనే మనసు మళ్ళిందేమి?’ అన్నాడు వర్తకుడు. ‘నీవు తెచ్చినవి ముత్యాలకోవలన్నావు గాని కన్నీటికోవలనలేదుగా’ అన్నాడు వెంకడు. వర్తకుడు నవ్వుతూ ‘వెపూరివాడు’ అంటూ వెళ్ళిపోయాడు. ఇదీ కథ.
వర్తకుడు లాభాపేక్షతో వ్యాపారం చేసే దళారీ. అతనికి ముత్యాలు ఒక సరుకు మాత్రమే. వెంకడికి ముత్యాలు జీవితావసరం కాదు. వాటితో కలిగే ప్రయోజనం ఆయన ఆలోచనా పరిధికి అందనిది. జీవనశైలికి పరాయిది. ఎప్పుడైతే ముత్యాలను ఘనీభవించిన కన్నీళ్ళని తెలుసుకోగలిగాడో, వాటి వెనుక తనలాంటి సామాన్యుల ఉనికిని పసిగట్టగలిగాడు. తెలుపు తళుకుల వెనుక ఉన్న మానవదుఃఖం అవగతమైంది. సాటి మనిషి తోడ్పాటు కోసం చేయగలిగిందేమైనా ఉందా?అన్న ప్రశ్న-జవాబు-స్పందన ఏకకాలంలో వ్యక్తమయ్యా యి. పేదవాడికి పేదవాడే ఆసరా కాక తప్పదు. నిజానికి వెంకడి దగ్గర అందుకు సరిపడా డబ్బు ఉందా? అన్న ప్రశ్న ముఖ్యం కాదు. ఒక కింది వర్గానికి చెందిన నిరక్షరాస్యుడు ఆ సన్నివేశంలో ప్రదర్శించిన మానవ సన్నద్ధత ముఖ్యమైంది. విలువైంది. ముత్యాల వర్తకుని దృష్టిలో వెంకడు ‘వెపూరివాడు’ కావడమే సరైనది. ఎందుకంటే రచయిత దృష్టిలో వర్తకుడే ‘వెపూరివాడు’ కనుక. ఒక విలువను వైరుధ్యాల్లో చెప్పడం వల్ల రాపిడికి గురై మరింత ప్రకాశమానమవుతుంది.‘సమాధి స్థలము’ కథానిక ధనికబీద వర్గాల అంతరాన్ని ఎవరు ఊహించని కోణం నుంచి చెప్తుంది. ఉత్తమ పురుష కథనంలో ఒక తాత్విక జిజ్ఞాసతో, అదీ ఒక స్మశాసనంలో కథ మొదలవుతుంది. అంతలో ఒక బీదరాలు తన మృత శిశువును ఎత్తుకుని కథలోని జీవితంలోకి ప్రవేశిస్తుంది. తోడు ఎవరూ ఉండరు. తాను ఎందుకు సాయపడరాదని అనుకున్న కథకుడు ఆమెతో పాటు నడుస్తూ శిశువు మృతికి కారణం తెలుసుకుంటాడు. తన కొడుక్కు కుడుపవలసిన పాలను ధనవంతుడి కొడుక్కు ఇవ్వవలసిన నిర్బంధం వల్ల రోజుల వయసులోనే నూరేండ్లు నిండిపోయాయి. ఆమె సత్యహరిశ్చంవూదలోని చంద్రమతిని గుర్తుకు తెస్తుంది. అంతపెద్ద స్మశానవాటికలో శిశువుకు జానెడు జాగా దొరక్కపోతుందాఅని ఇద్దరూ వెతుకుతారు. కాని, ధనవంతులు అవసరమైన ఆరడుగుల జాగా కన్నా చాలా ఎక్కువగా దురాక్షికమించుకుని అట్టహాసంగా సమాధులను నిర్మించుకోవడంతో ఎక్కడా జాగ దొరకదు. ఇది ఆ పేదరాలికి మరో దుఃఖం. చేసేది లేక స్మశాన వాటికను వదిలేసి బయటి ప్రపంచంలోకి బయలుదేరుతారు. బయట ఖననం చేయడం చట్టవిరుద్ధం అంటాడు అక్కడున్న కాపలాదారు! కాని చట్టాన్ని ఉల్లంఘించే ఆ బాలుణ్ణి ఒక నిర్జన ప్రదేశంలో పూడ్చేసి నిట్టూర్పు విడుస్తారు!
పుట్టిన బిడ్డకు తల్లిమీద, తల్లి పాల మీద సహజాత సంబంధమైన హక్కు ఉంటుంది. ధనవంతుడు స్వార్థంతో ఈ హక్కును కాలరాయడం ద్వారా బీదరాలి కొడుక్కు మరణశాసనం రాయడమే విలక్షణమైన వర్గనీతి. (మహాశ్వేతాదేవి చాలా కాలం క్రితం రాసిన ఒక కథలో ధనవంతుడి పిల్లలకు చనుపాలను కుడిపి పేదరాలు తన సంతానాన్ని పోషించుకుంటుంది. కాని జబ్బుపడి మరణిస్తుంది) అంతస్తుకు, హోదాకు సంబంధించిన అహంకారం మరణంతో అంతమవుతుందని, శ్మశానం సర్వసమానత్వం బోధిస్తుందని వేదాంతాలు చెప్తుంటారు. పొట్లపల్లి రామారావు మాత్రం-ధనికవర్గపు వికృతతత్వం వల్ల కబరిస్తాన్‌ను కబ్జాస్తాన్‌లు అవుతాయని అంటున్నారు. ఇది జీవిత సత్యం. కాదంటే మృత్యుసత్యం. స్థిరపడ్డ తాత్వికత జాగా లో కొత్త సత్యాన్ని నిలపడం సామాన్యమైనది కాదు. మొగల్ సామ్రాజ్యపు చివరి చక్రవర్తి బహదూర్ షా జఫర్ తనను పూడ్చడానికి తన రాజ్యంలో రెండు గజాల జాగా కూడా దొరకలేదంటూ విశాదగీతం రాశాడు (‘దో గజ్ జమీన్ భీ న మిలా…’) శ్మశానంలో జాగా దొరకని తల్లి తన మృతశిశువును తీసుకుని తిరిగి సమాజంలోకి ప్రవేశించడంతో సమాజంలోకి శ్మశానం విస్తరించింది. ఇప్పుడు శ్మశానం అదా? ఇదా? అన్న మీమాంస కలుగుతుంది.తాత్విక గాంభీర్యమూ, ప్రకృతి నేపథ్యమూ, సంవేదనాశీలమైన జీవన సందర్భాలు ఉన్న పొట్లపల్లి రామారావు కథలు టాల్‌స్టాయ్ రాసిన ‘మనిషికెంత నేల కావాలి’, ‘చెప్పులు కుట్టేవాడు’ వంటి కథానికలను గుర్తు చేస్తాయి. అవి గాఢమైన పోలికలు.ఒక మహా రచయితను గుర్తుకు తెచ్చే పోలికలు.ఐ. ప్రొడోవ్ అన్న తత్వశాస్త్ర నింఘటుకర్త ‘తాత్వికుడిగా, మానవతావాదిగా టాల్‌స్టాయ్ సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటును సమర్థించాడు’ అంటున్నాడు. అసమానత, అణచివేతల మీద పొట్లపల్లి రామారావుకు తీవ్రమైన అసహనం ఉంది. ఇది వారి కథల్లో కళాత్మకంగా వ్యక్తమైంది.
———–