కె.వి. కూర్మనాథ్ (K.V.Kurmanath)

Share
పేరు (ఆంగ్లం)K.V.Kurmanath
పేరు (తెలుగు)కె.వి. కూర్మనాథ్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఎర్రగౌను పిల్ల, కుక్కబతుకు, క్షుద్రక్రీడ
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకె.వి. కూర్మనాథ్
సంగ్రహ నమూనా రచనరన్…రన్…రన్…
వగరుస్తూ పరిగెడుతున్నాను. ఎసైన్మెంట్ మిస్సయితే తిట్లూ శాపనార్థాలు తప్పవు. మిస్సవకపోయినా తప్పవు. ఏదో ఒకందుకు తిట్లు తప్పవు.
రన్…రన్…రన్…
ఈ రోజుకిది నాలుగో ఎసైన్మెంట్. తిండీతిప్పలు లేకుండా పగలూ రాత్రి ఎండల్లో వానల్లో వార్తలకోసం దేబిరించాలి. ‘‘మ్యూజికల్ ఛైర్స కవర్చేయాలి. కల్చర్ రమణ ఈ రోజు రావడంలేదట. ఎడిటర్ మస్ట. సిటీ ఎడిషన్కిస్తే చాలు’’ బ్యూరో చీఫ్ ఆర్డరు.
ఎడిటర్ మస్ట అంటే వున్నది లేనట్టూ, లేనిది వున్నట్టూ రాయాలి. గెలిచినవాడి కళ్ళు చారడేసి అని రాయాలి.

కె.వి. కూర్మనాథ్
క్షుద్రక్రీడ

రన్…రన్…రన్…
వగరుస్తూ పరిగెడుతున్నాను. ఎసైన్మెంట్ మిస్సయితే తిట్లూ శాపనార్థాలు తప్పవు. మిస్సవకపోయినా తప్పవు. ఏదో ఒకందుకు తిట్లు తప్పవు.
రన్…రన్…రన్…
ఈ రోజుకిది నాలుగో ఎసైన్మెంట్. తిండీతిప్పలు లేకుండా పగలూ రాత్రి ఎండల్లో వానల్లో వార్తలకోసం దేబిరించాలి. ‘‘మ్యూజికల్ ఛైర్స కవర్చేయాలి. కల్చర్ రమణ ఈ రోజు రావడంలేదట. ఎడిటర్ మస్ట. సిటీ ఎడిషన్కిస్తే చాలు’’ బ్యూరో చీఫ్ ఆర్డరు.
ఎడిటర్ మస్ట అంటే వున్నది లేనట్టూ, లేనిది వున్నట్టూ రాయాలి. గెలిచినవాడి కళ్ళు చారడేసి అని రాయాలి.
రన్…. రన్…. రన్….
ఉదయం నుంచి చాయి కూడా తాగలేదు. ఎంబసీలో చాయ్, నాలుగు ఉస్మానియా బిస్కట్లు చదప్పరిస్తే బాగుణ్ణు. ఒకటే దాహం, ఆకలి. రోజుకిన్ని ఎసైన్మెంట్లు వేస్తే ఎలా చస్తామనుకుంటారో. స్పోర్ట్స్ రిపోర్టర్ని పంపిచొచ్చుకదా.
రన్…. రన్….రన్…
అదేమిటీ, కూలిపోయి వుందేమిటి.
ఫ్లై ఓవర్ కడ్తారంట సార్. షాపు కూలగొట్టిండ్రు.
రన్…. రన్….రన్…
అధ్యక్షోపన్యాయం మిస్సయితే తిట్లు తప్పవు.
క్విక్ పరిగెత్తు, త్వరగా రన్.
ఆల్ ఇండియా మ్యూజికల్ ఛైర్స్ కాంపిటిషన్. వెల్ కం టు పార్టీసిపెంట్స్ అండ్ వ్యూయర్స్ నియాన్ బిల్బోర్డు స్టేడియం గేటు దగ్గర మెరుస్తోంది.
‘‘మోర్గావ్ అండ్ మోర్గాన్ ఈజ్ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ ద గాలా ఫంక్షన్’’ మరో బిల్బోర్డు.
అప్పటికే స్టేడియం అంతా నిండిపోయింది. ఫ్లడ్ లైట్ల వెలుతుర్లో జనాలు పూనకం వచ్చిన వారిలా వూగుతున్నారు.
ఆట మొదలైపోయినట్టుంది…
రన్…. రన్….రన్… అంటూ ముక్తకంఠంతో అరుస్తున్నారు. ముందుకు వెళ్ళేందుకు కాస్తచోటు దొరికతే బావుణ్ణు.
‘‘నన్ను ముందుకు వెళ్ళనీయండిరా బాబూ. మిస్సయితే రేప్పొద్దున్న మీకు న్యసుండదురా బాబూ కాస్త తోవివ్వండి ప్లీజ్. ఉద్యోగం పోతుందిరా బాబూ నాలుగు ముక్కలు విననియ్యండి అమ్మల్లారా’’ నా మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదు.
‘జర హఠోబాయ్’ అని అనబోతుండగానే వెనుకనుంచి ఎవరో తోశారు. ‘‘అంత ముఖ్యమైతే కాస్త ముందు ఏడవచ్చుకదా’’
వచ్చివుండేవాణ్ణిరా బాబూ, మధ్యాహ్నం పూట తిని కాసేపు పడుకునే వీలుంటే ముందుగానే వచ్చుండేవాడినేరా బాబూ.
ఎవరిమీదో పడ్డాను.
‘ఎందుకురా బాయ్ గట్ల గూకుతవ్’’ ఎవరో మళ్ళీ తోశారు. తూలి పడబోయేంతలో ఎవరో భుజం పట్టుకున్నారు. రన్…. రన్….రన్… జనాలు అరుస్తూనేవున్నారు.
‘‘సిగ్గులేదు ఎదవలకి’’ గొణిగాడు నన్ను పట్టుకుని ఆపిన అబ్బాయి. కళ్ళు ఎర్రగా వున్నాయి. కోపంగా వున్నాడు.
రన్…. రన్….రన్…
అతనొక్కడే అరవడంలేదు. ‘‘దొంగలు, దొంగలు’’ అని నసుగుతున్నాడు. అప్పడు చూశాను. అతని ఎవరిని తిడుతున్నాడో అని అప్పుడు చూశాను. స్టేడియం మధ్యలో స్టేజి వుంది. బంగారు పళ్ళెంలా మెరుస్తూంది. విశాలంగా వుంది. ఫేషన్షోలప్పటి స్టేజీలాగుంది. మధ్యలో ఒక కుర్చీ, ఒక్కటే కుర్చీ, దానిచుట్టూ ఆరుగురు పరిగెడుతున్నారు.
రన్…. రన్….రన్…
స్టేజీకీ ఒకమూల మోర్గాన్ అండ్ మోర్గాన్ బెవరేజెస్ స్టాల్ వుంది.
ఆ ప్రక్కనే గ్లాస్ ఎంక్లోజర్లో టేబుల్, దానిమీద వడ్డించిన బోయినం ప్లేటు. కుర్చీ గెలిచిన వారికి దక్కే బోయినం
రన్…. రన్….రన్…
కుర్చీ చుట్టూ పరిగెడుతున్నారు ఆరుగురు.
అది దక్కేది ఒక్కరికే, ఒక్కరే కూర్చుంటూరందులో
బోయినం ఒక్కరికే
రన్…. రన్….రన్… జనం అరుపులతో స్టేడియం హోరెత్తుతోంది.
ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు ద షో విల్ కంటిన్యూ ఆఫ్టర్ ద బ్రేక్’ యాంకర్ అంది తల ఎగరేసి జుత్తు సవరించుకుంటూ….
‘‘మోర్గాన్ సాఫ్ట్ డ్రింక్స తాగి కాసేపు సేదతీరండి’’ మళ్ళీ తనే. ఆట హడావుడిలో దాహాన్ని మర్చిపోయాను. నాకో లెమన్ ఫ్లేవర్డ్ డ్రింక్ చల్లగా, పుల్లగా డ్రింగ్ కడుపులో దిగేసరికి ప్రాణం లేచివచ్చింది. ‘బానిసకొక బానిసకొక బానిస’ అని నా ప్రక్కబ్బాయి గొణుగుతున్నాడు. ఎవరిని అంటున్నాడు? నన్నా, జనాలనా, కుర్చీ చుట్టూ తిరిగేవారినా. డ్రింక్స్ అమ్మకాలయ్యాక స్టేడియంలో కరెంట్ పోయింది.
‘‘సారీ ఫర్ ది ఇన్ కన్వీనియన్స్. మోర్గాన్ వారి యు.పి.ఎస్. సిస్టమ్స వాడండి, చీకట్లను తరిమికొట్టండి’’ యాంకర్ అంది తియ్యగా. యాకంర్ చేతిలోని మైక్ ఇంకా పూర్తిగా రని ఫ్లడ్లైట్ల వెలుగులో చిత్రంగా మెరుస్తోంది. యాంకర్ ప్రకటన ముగిసిన వెంటనే మళ్ళీ లైట్లు వెలిగాయి.
ఇన్నాళ్ళూ కుర్చీ మీద కూచున్నవాడివల్లే ఈ చీకట్లు. బోయినం టేబుల్ నాకివ్వండి. మీకు దీపపు బుడ్డిసాతను. మీ జీవితాల్లో వెలుగులు నింపుతాను. ఆరుగుర్లో ఒకడు అరిచాడు. ‘‘గెద్దలు కూడా వీడి శవం ముట్టవు. మొన్నటిదాకా వీడు వాడిచంకే నాకేవాడు. బోయింనంలో వాటా దొరకలేదని ఇప్పుడిలా వాగుతున్నాడు’’ ఎర్రకళ్ళబ్బాయి కాస్త గట్టిగానే అన్నాడు. నాలుగడుగుల ముందున్న డిప్పకటింగ్ చెవిడొప్ప మావైపు తిరిగింది.
రన్…. రన్….రన్…
కుర్చీ చుట్టూ మళ్ళీ పరుగు మొదలైంది. అన్ని వేలనోళ్లు ఒక్క్సారి అరవడంతో ఆ రాత్రి ఎవ్వరో బ్రహ్మ రాక్షసుడు కేకపెడుతున్నట్లుగా వుంది. దెయ్యాల జావళికి తీతువులు కోరస్ అందిస్తున్నట్లుగా వుంది. నన్నెందుకో భయం చుట్టుకుంది. అప్పుడు చూశాను మొదటిసారి జవాల ముఖాల్లోకి. చాలామంది ఎందుకో భయపడుతున్నట్లుగా వుంద. కొంతమంద నిస్త్రాణగా వున్నారు. ఎవ్వరినో చూసి బెదిరిపోతున్నట్లుగా వున్నారు. కడుపులో తిప్పుతున్నట్లుంది. మోర్గాన్ లెమన్ ప్లేవర్డ్ డ్రింక్ ఇమడటంలేదు. ఆట త్వరగా పూర్తయితే బావుణ్ణు. సిటీ డెడ్ లైన్ దగ్గర పడుతుంది.
రన్…. రన్….రన్…
‘‘సిగ్గులేదు, ఎదవనాయాళ్ళకి, ఎన్నిసార్లు గమికీలు తిన్నా బుద్ధిరాదు గాడిదలకి’’ ఎర్ర కళ్ళబ్బాయి ఇంకాస్త గట్టిగా అన్నాడు. కొంతమంది ఇటుచూడటం మొదలుపెట్టారు. తాము ఈ డిసెంటర్ వంక చూస్తున్నట్లుగా ఎవరికీ తెలియకూడదన్నట్లుగా చూస్తున్నారు.
దాడిచేసేముందు శబ్దం చేకుండా అడుగులు వేసే నక్కలాగా, డిప్పకటింగ్ వస్తున్నాడు. వస్తూ జనంలో అక్కడా అక్కడా వన్న నక్కలు మరిరెండికి సిగ్నల్ ఇచ్చాడు. ‘వేట’ దొరికినప్పుడు నక్కలు ఇచ్చకునే సిగ్నల్ అది. ‘వాచ్ డాగ్’ని కదా నక్కల కదలికలని ఆమాత్రం కనిపెట్టకలను. ‘ఎందుకురా బాబు అట్లా అరుస్తావు? ఖరుసైపోతావు. ఏమైనా కడుపుమంట వుంటే నారూమ్కి రారాబాబూ మాట సాయం చేస్తాను. రుకోరా నాయనా’’ అని ఎర్రకళ్ళబ్బాయితో చెబ్దామనిపించింది. అప్పటికే డిప్పకటింగ్లు అతడిని కమ్మేశాయి.
రన్…. రన్….రన్…జవాబు అరుస్తూనే వున్నారు.
‘‘కుర్చీ నాకిస్తే నేను భోయినం చేయగా మిగిలింది మీకిస్తాను’’
‘‘కుర్చీ మాకిస్తే పాటలు పాడిస్తాం, నేర్పిస్తాం’’
‘‘కుర్చీ మాకిస్తే సిసింద్రీలు కట్టిస్తాం’’
‘‘ఇదివరకు మేం కుర్చీలో వున్నప్పుడు బోయినం సరిగా తిననేలేదు. అందుచేత ఈసారి కూడా కుర్చీ మాకిస్తే పూర్తిగా తిని రబేవ్ మనిపిస్తాం.
‘‘పాటలు కాదురా నాయనలారా సిసింద్రీలు కాదురా వెధవల్లరా ఉల్లిబద్ధకావాల్రా బాబూ ఉప్పుగడ్డ కావాల్రా నాయనా’’ ఎర్రకళ్ళబ్బాయి అరుస్తున్నాడు.
నా చుట్టూ కలకలం మొదలైంది. నా భయం మరింతగా పెరిగింది.
‘ఐ షల్ జస్ట్ బి ఎన్ ఆన్లుకర్. ఐ కౌంట్ బి ఇన్ ద ఐ ఆఫ్ స్టార్మ్.
రిపోర్టర్ ఈజ్ ఏ పాసివ్ ఆన్లుకర్ టుద హేపనింగ్స్ తప్పుకో ప్రక్కకి తప్పుకో.
‘‘పాటలు కాదురా గొర్రెల్లారా, భోజనం ముఖ్యంరా గాడిదల్లారా. ఆ భోజనం టేబుల్ కోసం కోట్లాడండిరా లారా’’
‘‘ఎవడ్రా అది పాట ముఖ్యమా, వెధవ భోజనం ముఖ్యమా’’
‘‘సిసింద్రీ ముఖ్యమా తుచ్ఛమైన బోజనం ముఖ్యమా’’
కొట్టండ్రా వాడ్ని.
రన్…. రన్….రన్…ఆట నడుస్తూనే వుంది.
బాబ్బాబు వేళ్ళు నొప్పెడుతున్నాయి. ఇన్నాళ్ళు నుంచునే వున్నాను. ఒక్కసారి కూడా భోయినం చేయలేదు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్. సీటు దగ్గరకు నేను వచ్చుప్పటికి స్టాప్ చెప్పండి ప్లీజ్’’ కుర్చీ చుట్టూ పరిగెత్తే వారిలో ఒకాయన అరుస్తున్నాడు.
‘‘మీరు ఎవడ్ని ఎక్కించినా ఆడ్ని తోసేసి నే ఎక్కెస్తా. లేదా వాడి కాలుపట్టి లాగేస్తా. అదీ కుదరకపోతే వాడి పంచనే చేరతా. ఎందుకురా నాయనా అలాటి చెడ్డ పనులు నా చేత చేయిస్తారు. నాకు కుర్చీలు యివ్వండిరా బాబూ’’ ఇంకొకడు రొప్పుతూ జనాల్ని బతిమాలుతున్నాడు.
రన్…. రన్….రన్…
తెగిన పేగు కోసం ఏడుస్తున్న తల్లిలా అరుస్తున్నారు జనం.
రన్…. రన్….రన్…
‘‘అరుపులు ఆపండిరా గొర్రెల్లారా. ఆట ఆపండిరా బాబూ పాట ఆపండిరా. రన్…. రన్….రన్… అని వాళ్ళు కాళ్ళకు బుద్ధి చెప్పేలా ఆ గాడిదలకు బడితపూజ చెయ్యండిరా నాయనలారా అమ్మల్లారా ఉల్లిపాయలను బొక్కిన వాళ్ళను రాళ్ళతో కొట్టండమ్మా. మీ ఇళ్ళను కూల్చిన వాళ్ళని, విత్తనాలు యివ్వని విత్తనాలను అమ్మే వాళ్ళని, వాళ్ళని చేరదీసే వాళ్ళని చంపండిరా బాబూ’’ ఎర్ర కళ్ళబ్బాయి కోపంతో వూగిపోతూ అరుస్తున్నాడు క్రోధంతో పిట్లుతున్నాడు.
అతను ఏదో నిజం చెబుతున్నాడని కొందరికి అనిపించింది. బయటికి చెప్పుకోలేని తమ అందరి ఆక్రోశాన్ని అతడు వెళ్ళగక్కుతున్నందుకు మరికొందరికి హాయిగా అనిపించింది. మరికొన్ని విషయాలు అతనెందుకు మరిచిపోయాడని మరికొందరనుకున్నారు. కానీ అక్కడక్కడా నిలుచున్న డిప్పకటింగ్ వాళ్ళని చూసి ఆటే బాగుందని నిర్ణయించుకున్నారు.
ఈ లోపల ‘‘ఆర్డర్ ఆర్డర్’’ అని మధ్యలోంచి ఎవ్వడో లేచి అరిచాడు.
‘‘లెట్ ద రూల్ ఆఫ్ దగేమ్ బి ప్రివైల్డ’’ అని కూడా అరిచాడు.
‘‘ఎవ్వరి ఆటరా ఇది ఈ ఆ ట రూల్స్ ఎవ్వరు గీశారు? ఎవ్వరి ఆట ఎవ్వరు ఆడుతున్నారు? వుయార్ ప్లేయింగ్ దైర్ గేమ్’’
ఎర్రకళ్ళబ్బాయి యింకా పూర్తి చెయ్యలేదు. అప్పటికే ఆ అభ్బాయిని కమ్మేసిన డిప్పకటింగ్లు ఆ అబ్బాయిని యీడ్చుకుపోతున్నారు. నాతోపాటు చాలా మంది చూస్తూనే వున్నారు. చూడనట్టుగా వున్నారు. ‘‘చూడనట్టుగా వుంటే మాకు నచ్చుతుందని తెలుసుకుని నడుచుకుంటున్నందుకు’’తృప్తిపడి డిప్పకటింగ్లు మాయమయ్యాయి.
‘‘ఎవ్వరైనా వాళ్ళని ఆపితే బాగుణ్ను. ఎందుకు అతడ్ని తీసుకుపోతున్నారని ఎవ్వరైనా అడిగితే బాగుణ్ను.’’ అని ప్రతివాడూ అనుకుంటున్నాడు.
కానీ అందరూ అరుస్తూనే వున్నారు. రన్…. రన్….రన్…
మందలోకి చొరబడి దూడ నెత్తుకుపోయిన నక్కలనెవరూ అడ్డుకోనందుకు అందరికీ కోపంగా వుంది. నోరువిప్పి యిదేమిటీ ఘోరం అని అడగకుండా అడ్డుకుంటున్న అదృష్య బంధనాలను తిట్టుకుంటున్నారు.
రన్…. రన్….రన్…
రన్…. రన్….రన్…
కుపితులై, భయవిహ్వాలురై అరుస్తునే వున్నారు.
ఆట క్లైమాక్స్ కి చేరుకుంది.
‘‘స్టాప్’’ అందరూ ఒక్కసారే అరిచారు, యాంకర్ దగ్గర నుండి సంకేతం రాగానే. ఎలాగోలా కుర్చీ ఎక్కి తీరుతాననేవాడికే దక్కింది కుర్చీ.
వాడిదే కుర్చీ.
బోయినం వాడిదే
వాడు బోయినం మొదెలెడుతుండగా ఫ్లడ్లైటొకటి వాడిమీదే ఫోకస్ అయింది. మిగతా లైట్లనీ డిసాల్ట అయ్యాయి. మిగతా స్టేడియం అంతే చీకటి. కటిక చీకటి.
రన్…. రన్….రన్…
సిటీ ఎడిషన్ కి యింకా అరగంటే టైముంది.
డెడ్లైన్. మృత్యురేఖ.
రోజా చావే.
ఎ టార్సో మీటింగ్ ద డెడ్ లైన్ ఎవ్రీడే
రన్…. రన్….రన్…
‘‘ఇప్పటిదాకా చేస్తే ఎలాగండి పావుగంటే వుంది. త్వరగా యివ్వండి. క్విక్ సింగిల్ కాలం యివ్వండి’’ డెస్క్ ఇంఛార్జి.
హ్యూమన్ ఎగొనీ ఇన్ ఎ సింగిల్ కాలమ్.
క్రైమ్ నారాయణ ఫోన్లో వింటూ బరాబరా రాస్తున్నాడు. ఏం రాస్తాడు? ఈ రోజు నగరం ఇరుసులో ఎందరు నలిగివుంటారని
ఈ రొజెందరు గురూ?
‘‘ఎక్సిడెంట్లు మూడు. వరకట్నం మూడు. ఆత్మహత్యలు రెండు. ఎన్కౌంటర్ ఒకటి.’’
సరే. సింగిల్ కాలం వాడి మహమీమద కొడితే ఈ పూటకి సరి.
రేపుదయం మళ్ళీ మామూలే.
(ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, డిసెంబర్ 12, ఇక్కడి లాల్బహుదూర్ స్టేడియంలో అత్యంత ఉత్కంఠభరాతంగా సాగిన ఆల్ ఇండియా మ్యూజికల్ ఛైర్స్ కాంపిటేషన్లో రమేష్ కుమార్ అద్భుతమైన ప్రతిభకనబరిచి ప్రథమ బహుమతి గెలుపాందారు. బోయినం తాను చెయ్యడమే కాకుండా, పాటలు కట్టేవారికి సిసింద్రీలు చేసేవారికి కూడా బోయినం చెయ్యడంలో సహాయపడతానని ఆయన హామీ ఇచ్చారు. ఒక వేళ వారికి మిగలకపోతే బయటి నుండి అప్పు అడిగి అయినా బోయినం పెడతానని కూడా యన మాటయిచాచరు. There are no free meals (కష్టపడితే బోయినం) అన్న ఇంగ్లీషు వాడి మాటను పాటించి బాగా కష్టపడాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజలు తమ పనులను తామే చేసుకుంటే బోయినం చెయ్యడానికి తనకు మరింత వెసులుబాటు వుంటుందని ఆయన అన్నారు.
అమ్మయ్య రోజుకి ఒక చావొదిలింది. రేపు ఉదయం మళ్ళీ మామూలే. గానుగెద్దు జీవితం. ఏన్ అనెండింగ్ జర్నీ ఫ్రమ్ ఒన్ ఆర్డియన్ టు ఎనెదర్.
ఇదుగోరా బాబూ నీ సింగిల్ కాలమ్.
నారాయణా గుడ్నైట్ ఇంకా కాలేదా నీ శవ విచారణ?
‘‘గురూ… గురూ ఈ ఒక్క ఐటమ్ చూసి పెట్టుగురూ’’ అంటూ వెళ్తున్న నన్ను ఆపాడు నారాయణ.
‘‘అలిసిపోయా నారాయణా సంపిచెద్దూ.’’
‘‘ప్లీజ్ గురూ ఒక్క లుక్కేద్దూ’’
‘‘సర్లే యిటివ్వు’’
క్రైం రిపోర్టర్
హైదరాబాద్, డిసెంబరు 12 : నగర శివార్లలో నేటి అర్థరాత్రి జరిగిన ఎన్ కౌంటర్లో ఒక గుర్తు తెలియని తీవ్రవాది మరణించాడని ఫోలీసు వర్గాలు తెలిపాయి. మేడ్చల్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక యువకుడ్ని ప్రశ్నిస్తుండగా అతడు తమపై కాల్పులు మొదలు పెట్టడాని, ఆత్మరక్షణ కోసం తాము జరిపిన కాల్పుల్లో ఆ యవకుడు అక్కడికక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు.

 

———–

You may also like...