పేరు (ఆంగ్లం) | Tatineni Venkata Narasimharao |
పేరు (తెలుగు) | తాతినేని వెంకట నరసింహారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అమ్మ, కడుపు నిండింది, కోకిలగా కలకాలం, గాలివాన |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | తాతినేని వెంకట నరసింహారావు |
సంగ్రహ నమూనా రచన | ఇంకా తెల్లవారలేదు. గోడగడియారం నాలుగు కొట్టింది. ‘‘అమ్మగోరూ… అమ్మగోరూ…’’ సరస్వతమ్మ ఉలిక్కిపడి లేచింది. కళ్లు నులుపుకుంటూ వెళ్లి తలుపు తీసింది. పనిమనిషి బద్ధకంగా వొళ్లు విరుచుకుంటోంది. మర్నాడు పెందలకడే పనిలోకి రమ్మన్న సంగతి గుర్తొచ్చి తన మాట మన్నించిన పనిమనిషి స్వామి భక్తకి ఆశ్చర్యం వేసింది. ‘‘పనిలోకి రానేదండమ్మగోరూ.. పండక్కని అల్లుడోడూ, కూతురూవొచ్చిన్రు. ఇయ్యాల ఇంటిపట్టునే వుండిపోవాల ఆ కబురు సెప్పిపోదామని పారొచ్చినా…’’కబురు చల్లగా చెప్పింది. |
తాతినేని వెంకట నరసింహారావు
కడుపునిండింది
ఇంకా తెల్లవారలేదు. గోడగడియారం నాలుగు కొట్టింది.
‘‘అమ్మగోరూ… అమ్మగోరూ…’’
సరస్వతమ్మ ఉలిక్కిపడి లేచింది. కళ్లు నులుపుకుంటూ వెళ్లి తలుపు తీసింది. పనిమనిషి బద్ధకంగా వొళ్లు విరుచుకుంటోంది.
మర్నాడు పెందలకడే పనిలోకి రమ్మన్న సంగతి గుర్తొచ్చి తన మాట మన్నించిన పనిమనిషి స్వామి భక్తకి ఆశ్చర్యం వేసింది.
‘‘పనిలోకి రానేదండమ్మగోరూ.. పండక్కని అల్లుడోడూ, కూతురూవొచ్చిన్రు. ఇయ్యాల ఇంటిపట్టునే వుండిపోవాల ఆ కబురు సెప్పిపోదామని పారొచ్చినా…’’కబురు చల్లగా చెప్పింది.
మరో రోజయితే సరస్వతమ్మ శాపనార్ధాలు పెట్టివుండేదే ఈ పని మనుషుల విశావస ఘాతుకత్వాన్ని దుయ్యబట్టి వుండేదే కాని నిన్నటి నుండీ ఆమె మారిన మనిషి. ప్రపంచం నిండా ఎక్కడ చూసినా మంచే కనిపిస్తోంది. కారణం?
ఎప్పుడూ బావురు మంటూ వుండేయిల్లు పిల్లా జెల్లాతో కళకళ లాడుతుండటం, తన వాళ్ళందరూ తన చుట్టూతా వుండటం.
‘‘సరేలే నువ్వుమాత్రం ఏంజేస్తావ్? నీకూ పండుగే వీలుంటే సాయంత్రం వోసారి కనిపించు. మిగిలినవి పట్టుకుపోదువుగాని’’ వీధి తలుపు గడియ వేసి తిన్నగా భర్త మంచం వద్ద కొచ్చింది. ఇంత వయసొచ్చనా పసిపాపలా నిద్రపోగల ఆయన అదృష్టానికి నవ్వుకుంది. పండుగ పనులు మనసులో మెదిలేసరికి భయం వేసింది.
‘‘మిమ్మల్నే…. లేవండీ….’’
‘‘ఎందుకూ?’’ ముసుగు తొలగించి బద్ధకంగా అన్నాడు దశరధరామయ్య.
‘‘పనిమనిషి రాదు… పండుగ రోజు… బోలెడు పనలు.’’
‘‘ఉంటే నేనేం చెయ్యనూ?’’
‘‘అయ్యోరామా ఏదయినా చెయ్యొచ్చు. లేని కొంచెం బాయిలర్ అంటించండి. తరువాత నీళ్ళు పట్టండి. కోళాయి ఆగిపోతుంది. ఈలోపు నేను మిగతా పనులు చూసుకుంటాను.’’
దశరధరామయ్య నిద్రమత్తు వొదిలిపోయింది. తనకు దమ్మిడీ పని చెప్పని భార్య ఈ రోజీ పనులన్నీ పురమాయించడం లోని అవుసరాన్ని గుర్తించాడు. వెంటనే లెచి కూర్చున్నాడు.
నిజానికి దశరధరామయ్య యిలాంటి యింటిపనులెన్నడూ చేసి ఎరుగడు. గెజిటెడ్ ఆఫీసరుగా పింఛను పుచ్చకుంటున్నాడు. ముక్కుకు సూటిగా నడిచి, నిజాయితీ గల ఆఫీసరుగా పేరు పొందాడు. అందువల్ల ఉద్యోగంలో కొంత నష్టపోయినా పిల్లలు నలుగురూ పైకొచ్చారు. ముగ్గురు కొడుకులూ, ఒక కూతురూనూ. ఒక్కరూ ప్రస్తుతం వెయ్యి మైళ్లకు తక్కవ దూరంలో లేరు. పెద్ద కొడుకు ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆపీసరు. ప్రస్తుతం సిమ్లాలో వుంటున్నాడు. రెండోవాడు కోయంబత్తూరు ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. మూడో వాడు ఎయిర్ ఫోర్స్ లో ఫ్లయిట్ లెఫ్టినెంట్. జాగ్వార్ విమానాల ప్రత్యేక ట్రయినింగ్ కోసం ప్రస్తుతం ఇంగ్లండులో వున్నాడు. ఇంకా వివాహం కాలేదు. అల్లుడు తుంబారాకెట్ కేంద్రంలో ఇంజనీరు. ధశరధ రామయ్యకు విశాఖపట్నంలో స్వంత ఇల్లుంది. ఎవ్వరిమీదా ఆధారపడనవుసరం లేనంత రాబడి వుంది. ఏ చీకూ చింతా లేదు. కాని ఇంకా బోలెడు వయసు మిగిలివుంది. అందుకే జీవితం ఏదో వెలితిగా చప్పగా వుంది.
దశరథరామయ్య విశాఖపట్నంలో స్థిరపడటం ఒక పథకంతోనే చేశాడు. తన పిల్లలు వుద్యోగరీత్యా దేశంలో ఎక్కడెక్కడ తిరిగినా వాళ్ల పిల్లల్ని తన దగ్గరుంచుకుని చదివించానలి కోరిక.
‘‘ఇక్కడ మంచి స్కూళ్లున్నాయర్రా యూనివర్సిటీ వుంది. బ్రహ్మాండమైన స్టీల్ సిటీ కాబోతోంది. మీరెక్కడైనా తిరగండి, మీ పిల్లలినక్కడ నిశ్చింతగా వొదిలేసిపొండి. వాళ్ల చదువు బాధ్యత నాది…’’ అని వీలయినప్పుడల్లా చిన్నసైజు లెక్చెరిస్తుంటాడు. ఈ రకంగానయినా తన పిల్లలు తన దగ్గర లేని వెలితి తీరుతుందని ఆశ. అయినా ఒక్కరూ తమ పిల్లల్ని వొదిలేసి వెళ్లడానికి ముందుకు రాలేదు. కారణాలు అనేకం. తల్లి దండ్రులు వాళ్లమీద సరైన శ్రదద్ధ తీసుకోరని మాత్రం కాదు. అందుకే కారణం వెదకడానికి సోషియాలజీ డిపార్ట్మెంటువారు ఒక స్టడీ చెయ్యాలి.
జనరేషన్ గేప్ అనో, ఫేమిలీ సిస్టమ్ ఇంకా ఇంకా కంపార్ట్ మెంటలైజు కాబోతోందనో ఎట్సట్రా సిద్ధాంతీకరిస్తారు.
చివరికో ఏర్పాటు కుదిరింది. అదొక జంటిల్ మెన్ అగ్రిమెంటు లాంటిది. దేశం నలుమూలలా వున్న పిల్లలందరూ తమ పిల్లాజెల్లాతోసహా సంవత్సరినికొకసారి అందరూ ఒకేసారి తమవద్ద గడపాలి. ఇది తూ… చా… తప్పకుండా అందరూ పాటించవలసిన నిర్ణయం. ఎవరికీ అభ్యంతరం లేని నియమం. అయిదేళ్లుగా అమలులో వున్న పద్ధతి. సంక్రాంతి పండుక్కి అందరూ కలవాలి.
ఎన్నడూ కాగితం మీద కలం పెట్ట సాహసించని సరస్వతమ్మసంక్రాంతి ముందు మాత్రం తనే స్వయంగా అందరికీ వుత్తరాలు రాసుకుంటుంది. తల్లి ఆరాటం అర్థమవుతుంది గాబోలు, ఎన్ని యిబ్బందులున్నా ఈ పండక్కి రావలసిందే. ఈ పద్ధతి గుడ్డిలో మెల్ల అని సరిపెట్టుకుంది సరస్వతమ్మ.
బారెడు ప్రొద్దెక్కినా తలంట్ల పనిపూర్తిగాక పోవటం సరస్వతమ్మ పని తెమలక పోవడం మాత్రం కాదు. పిల్లలు సహాకరించక పోవటమే.
ఇదివర్లోఇంట్లో ఒక కట్టుబాటుండేది. పండుగ రోజు తెల్లారేసరికల్లా స్నానాలు అయిపోవాలంటే అయిపోయేవి. పిలల్ని చదవండీ అంటే చదివేవారు. భోజనానికి రండిరా అంటే అందరూ వచ్చేశావారు. మారుమాటుండేది గాదు. ఇంట్లో సరస్వతమ్మ నాయకత్వాన్ని అందరూ మన్నించేవారు. ఇప్పుడెవరి దారి వాళ్లది. క్రొత్త అలవాట్లూ, కొత్త పద్దతులూ కనిపిస్తున్నవి. ఇల్లొక మీనియేచర్ ఇండియాలా వుంది. ఒక మనవడు తెలుగూ హిందీ కలిపి మాట్లాడితే మరో మనుమడు అరవంలో తెలుగు కలుపుతాడు. ఒక మనుమరాలు ఇంగ్లీషు తప్ప మరో భాష మాట్లాడదు ఒకడికి బ్రెడ్డూ ఆమ్లెట్ కావాలి. మరొకడికి ఇడ్లీ సాంబార్. ఇంకొకడికి రసగుల్లాలు కావాలిట. ఇహ తన గోంగూర పచ్చడేం కాను? సరే వీల్లంతా ఎక్కడెక్కడో పెరుగుతన్నారు. కొంతవరకూ అర్థం చేసుకోవచ్చు.కాని తన స్వంతపిల్లలు, వీళ్లూ మారిపోవడమేమిటి? వీళ్లు చిన్న తనంలో ఇలా వుండేవారా? పాచి మోఖాలతో కాఫీ త్రాగటమే? ఈ దిక్కుమాలిన సంకరం అలవాట్లు అప్పుడుండేవా? అసలు వీల్లు తన పిల్లలేనా? అని అనిపించేంతగా మారిపోయారు.
మొత్తంమీద స్నానాలు పూర్తయి ఫలహారాలయ్యేసరికి పదిన్నరయింది. ‘హమ్మయ్య’ ఒక ఘట్టం పూర్తయినందుకు సరస్వతమ్మ వూపిరి పీల్చుకుంది. కోడళ్లు లాంఛనంగా వెళ్లి అత్తగారికి వంటలో సాయం చెయ్యడానికి సిద్ధమయ్యారు.
‘‘మీరేమీ చెయ్యక్కర్లేదు. మీ పనులు మీరు చేసుకోండి. అంతేచాలు అవుసరమయితే పిలుస్తాను’’ అంది సరస్వతమ్మ. అలా అంటుందని వాళ్ళకు ముందే తెలుసు. అత్తగారు మతని అతిథులుగానే చూసుకుంటుంది గాని తమతో పనులు చేయించి అత్తరికం చెలాయించే మనిషి కాదని వాళ్లకు తెలుసు. అందుకే సరస్వతమ్మ అంటే కోడళ్లకు గౌరవం. ఆమె మాటకు విలువ. అలాగని సరస్వతమ్మ కూడా తన అభిప్రాయాలను వాళ్లమీద ఎన్నడూ రుద్దలేదు. వాళ్ల సంసారాల్లో వాల్లకుపూర్తి స్వేచ్ఛనిచ్చింది.
సరస్వతమ్మ ఒక్కతే వంటింట్లో అష్టావధానం చేస్తోంది. కోడళ్లూ, కూతురూ కలిసి ఒకచోటచేరి స్త్రీల సమస్యలు చర్చించుకుంటున్నారు. మగవాళ్లంతా ముందు వరండాలో చేరి రాజకీయాలు చర్చిస్తున్నారు. ఇరాన్లో అమెరికన్ బందీలు మొదలు పంచదార కేజీ పదిరూపాయల వరకూ విషయాలు దొర్లిపోతున్నాయి. పిల్లజనం ఇల్లు పీకి పందిరేస్తున్నారు.
‘‘ఇంద కాఫీ…’’ అంటూ సరస్వతమ్మ కాఫీగ్లాసు భర్తకందించింది. దశరధరామయ్య ఆవ్చర్యపోయాడు. ఇంత తల మునక పనిలో కూడా తన పదకొండు గంటల కాఫీ సంగతామెకు గుర్తున్నందుకు. ఉద్యోగం వదిలినా అలవాట్లు మాత్రం పోలేదు.
‘‘మీ మామగార్కి కాఫీమీదే వుంటుంది నాయనా ప్రాణం’’ అంటూ అల్లుడికి వివరించింది.
‘‘సిక్సర్… సిక్సర్…’’ అంటూ ప్రవేశించాడొక మనవడు, ట్రాన్సిస్టరు భుజానవేసుకుని.
‘‘ఏమిట్రా అది?’’
‘‘కపిల్‌దేవ్ సిక్సర్ కొట్టాడు తాతయ్యా’’
‘‘గుడ్ లెంగ్త్ బాల్… ఎండ్…ఎండ్… బ్యూటీఫుల్లీ డ్రివెన్ బై కపిల్‌దేవ్ టు ఆన్ సైడ్ బౌండరీ ఫర్ ఎనదర్ ఫోర్…’’ కామెంటేటర్ గోల పెట్టేస్తున్నాడు. సముద్ర ఘోషలా వుంది కామెంటరీ.
‘‘బయటకిపోయి వినరా’’ కొడుకుని గదమాయించాడు జ్యేష్టుడు. ట్రాన్సిస్టర్ బయటకు వెల్లిపోయింది.
‘‘క్యా దేఖుతే హో… సూరజ్ తుమ్హారీ…’’ మరో మనవడు మరో ట్రాన్సిష్టర్ తో ప్రవేశం.
‘‘బాబూ సునీల… మీ నాయనమ్మకీ మోతలు పడవురా బయటకు పోయి విను’’ దశరథరామయ్యకు భార్య గుండెదడ గుర్తొచ్చింది. ఈ ధ్వనులు తనకే వుక్కిరిబిక్కిరిగా వున్నవి. వెంటనే వంటగదివైపు నడిచాడు.
సరస్వతమ్మ చెవులు గట్టిగా మూసుకుని గోడకు చేరబడి కూర్చుంది.
‘‘అమ్మాయిని పిలవలేక పోయావా?‘‘
‘‘ఒద్దులెండి… మీరు కూర్చోండి…’’ దశరథరామ్మ పీటవేసుకుని కూర్చున్నాడు. భార్యవంక ఆశ్చరంగా చూశాడు. ఎప్పుడూ ముక్కుతూ మూల్గుతూ మరోసారి కాఫీ అడిగితే గునిసే మనిషికింత వోపికెలా గొచ్చిందో? వెంటనే భార్యమీద జాలికలిగింది.
‘‘దడగా వుందా?….’’
‘‘లేదు.’’
‘‘నువ్వు మర్యాద చెయ్యలేదని ఎవ్వరూ అనుకోబోరు గాని, వూరికే వొళ్లు హూనం చేసుకోకు.’’
‘‘మీరు మరీనండీ…’’ నవ్వింది సరస్వతమ్మ నీరసంగా.
నిజానికి సరస్వతమ్మకు గుండెదడ విపరీతంగా వుంది. ఉక్కిరి బిక్కిరిగా భయంగా వుంది. అయినా వోపిక తెచ్చకుని పనులన్నీ చేసుకుపోతోంది. తన పిల్లకు తను వయంగా చేసిపెట్టుకుంటేనే ఆమెకుతృప్తి.
భోజనాలుపూర్తికావడంతో రెండోఘట్టం పూర్తయిందని సరస్వతమ్మ మరోసారి ‘హమ్మయ్య’ అనుకుంది. ఒళ్లంతా పులిసిపోయింది అయిష్టంగానే భోజనం ముగించినడుం వాల్చింది.
‘‘బావగారూ రమ్మీ ఆడదాం రండి. ప్రతిసారీ పండుక్కొచ్చి క్రొత్త బట్టలు తీసుకుపోవడం కాదు. ఈసారి మీ దగ్గర వసూలు చెయ్యందే వదల్ను…’’ అంటూ రెండోవాడు పేకదస్తాలు తీసుకొచ్చి ముందు పడేశాడు.
‘‘ఉరేయ్ చిన్నన్నా ఆయనకీ మధ్య క్లబ్బులో రమ్మీ ‘విజర్డ్’ అని బిరుదిచ్చి సత్కరించారు. గెలుచుకోబోయి పోగొట్టుకునేవుగాక’’ హెచ్చరించింది చెల్లెలు.
‘‘సరే చూద్దాం … అన్నయ్యా రా…. నాన్నగారూ మీరూ ఒక చెయ్యి….’’
‘‘స్టేక్ ఎంతోయ్?’’
‘‘మీ యిష్టం బావగారూ ఆ ఛాయిస్ మీది.’’
‘‘పది పైసలు. అంటే కవుంట్ పది రూపాయలు. డ్రాప్ రెండు రూపాయలు. మిడిల్ డ్రాప్ నాలుగు…’’
‘‘సరే…’’
‘‘క్యాష్ డవున్ ప్లీజ్… అరువుల్లేవు.’’ హెచ్చరించాడు రెండొవాడు అందర్నీ.
‘‘ఒక ప్రతిపాదన’’ ఇంటి ఆడబడుచు వంక అంతా చూశారు.
‘‘ఎవరు గెలిచినా డబ్బు నాకు రావాలి.’’
‘‘ఇదెక్కడి న్యాయం తల్లీ’’ కోడళ్లిద్దరూమా.
‘‘చెబుతాను, కొంచెం ఓపికపట్టండిమరి.’’
‘‘చెప్పు ఎలాగైనా మీ ఆయన ఓడిపోతాడని భయమా?’’
‘‘అలాంటి భయం లేదుగాని వదినలూ వినండి. సస్పెన్సెందుకుగాని ఆ గెలిచిన డబ్బుతో అందర్నీ సినిమాకు తీసుకెడతాను.’’
మధ్యాహ్నం అంతా రమ్మీ జోరుగా సాగింది. ఎవరి భర్త దగ్గర కూర్చుని వాల్లు ఆడిస్తున్నారు పట్టుదలతో సరస్వతమ్మకూ అక్కడ కూర్చోవాలనే వుంది. కాని సాయంత్రం టిఫిన్లు?
మొత్తం మీద రమ్మీవిజర్డ్ అల్లుడిగారి డవున్గా వుంది. కాఫీ, టిఫీన్లు పేకాటవద్దకే చేరాయి. అంతా హుషారు, నవ్వులు కేరింతలు.
‘‘పోస్ట…’’
దశరథరామయ్య సంతకంచేసి అందుకున్నాడు. ఇంగ్లండు నుండి కేబుల్ అది. మూడోవాడు అందరికీ గ్రీటింగ్స్ పంపించాడు. సంతోసతో నోటమాట లేదు సరస్వతమ్మకు. వాడులేని వెలితిని కేబుల్ కొంతవరకూ తీర్చింది.
మరో అరగంట పేకాట సాగింది.
‘‘స్టాప్ ప్లీజ్…’’ అంటూ అందరూ పోగొట్టుకున్న ఫూల్డ్ డబ్బుని లెక్కచూసింది ఆడబడుచు. ఎనభై అయిదు రూపాయల చిల్లర తేలింది.
‘‘పధ్నాలుగు సినిమాటిక్కెట్లుకీ, పధ్నాలుగు థమ్సప్కీ, పధ్నాలుగు పాప్కారన్కీ సరిపోతుంది. ఇక లేవండి ప్లీజ్. అందరూ అరగంటలో తయారవ్వాలి. ఆనక సినిమా టిక్కెట్లు దొరకవు’’ అంటూ ఆడబడుచు పేకదస్తాలు తీసుకుంది.
‘‘పధ్నాలుగురా? మైగాడ్…’’ అంటూ హెడ్స్కవుంట్ మొదలుపెట్టాడొకమనవడు.
‘‘కరెక్ట్ తాతయ్యా నానమ్మలతో పధ్నాలుగురే’’ ధృవపరచిందొక మనవరాలు.
పదినిముషాల్లో అందరూ తయారయ్యారు. వృద్ధ దంపతులు మాత్రం ఇంటిపట్టునే వుండిపోయారు. వరసగా మెట్లు దిగుతున్న తన బలగాన్ని చూసుకుని మురిసిసపోయారు. తిరిగొచ్చాక వాళ్లందరికీ దిష్టి తియ్యాలనుకుంది సరస్వతమ్మ.
సరస్వతమ్మ రాత్రి వంట ప్రయత్నంతో వుంది. భర్త వంటింట్లో తోడుగా వుంటే ఎంతపనైనా సులువుగా చేసుకుపోగలదు.
‘‘సింపుల్‌గా కానిచ్చెయ్యి…’’
‘‘మీరూరుకోండి, నేనేంకష్టపడిపోవటం లేదు. సంవత్సరానికి నాలుగైదు రోజుల భాగ్యం. తరువాత మీరూ నేనేగా మిగిలేది. పూర్తి విశ్రాంతేగా?’’
‘‘నువ్వొఠ్ఠి పిచ్చిమొద్దువి. పిల్లలతో చెప్పి చేయించుకోవడం చేతగాదు. నలుగురికీ నాలుగు పనులు పూరమాయిస్తే తేలిగ్గా అయిపోతుందిగా?’’
‘‘వాళ్లంతా సరదాగా గడపడానికొచ్చారు. వాల్లకు పనులు పురమాయించనా? చాల్లే వూరుకోండి…’’
‘‘వాళ్లతో చేయించుకోవడం ఇష్టం లేకపోతే నువ్వు చెయ్యగలిగినంతే చెయ్యి….’’
‘‘నా తృప్తి కోసం అని వూరుకుందురూ. వూరికే సతాయించక.’’
‘‘ఏమిటో నీ పిచ్చి నీ కానందం’’
‘‘నాది పిచ్చేగాని… ఏమండీ వాళ్లంతా వచ్చాక మీరు కూడా చిన్నమెత్తు పనిముట్టరు. బోలెడు అభిమానం. అందుకే ఆ మంచాలూ గట్రా యిప్పుడే వాల్చగూడదూ? నక ఆపనీ నామీద వెయ్యకపోతే?’’
‘‘నిసమే సుమా’’ అనిపించింది దశరథరామయ్యకు. వెంటనే ఆ పని అందుకున్నాడు.
పనులన్నీ పూర్తయేసరికి రాత్రి తొమ్మిదయింది. పిల్లల రాకకోపం ఎదురుచూస్తూ వరండాలో కూర్చున్నారు దంపతులిద్దరూ.
ఆవురావురుమంటూ వచ్చారు అందరూ. వెళ్లేప్పుడున్న సరదా ముఖాల్లో ఇప్పుడు కనిపించడం లేదు. బట్టుల మార్చి భోజనాలకు సిద్దమయ్యారు. సరస్వతమ్మ వడ్డన ప్రారంభించింది.
‘‘సినిమా ఎలాగుందిరా సీనూ?’’ ఒక మనవణ్ణడిగాడు.
‘‘గొప్ప బోర్’’ తాతయ్యా సినిమా అంతా లవ్వే’’ అంతా నవ్వేశారు.
‘‘అయితే సినిమా ఎలాగుండాలంటావ్.’’
‘‘ఫైటింగ్… డిషుం… డిషుం…’’
‘‘వాడికో ధర్మసందేహం నాన్నా’’ అంది కూతురు.
‘‘యన్.టి. రామారావూ, అమితాబ్‌బచన్ ఫైటింగ్ చేస్తే ఎవరు గెలుస్తారని?’’ అంతా మరోసారి నవ్వేశారు. సరస్వతమ్మ కూడా హాయిగా నవ్వుతూ వడ్డిస్తోంది.
‘‘బావగారూ తినండి… తినండి… మళ్లీ సంవత్సరం వరకూ ఇలాంటి పులావ్ దొరకదు’’ అన్నాడు రెండోవాడు. చెల్లెల్ని ఆటపట్టించడం అతని మాబీ.
‘‘ఇన్సల్ట్ రా చిన్నన్నా అంటే నాకేం చేతగాదనేగా?’’
‘‘అలా అన్నానా? కాని బావగారు న్నటి నుండీ ఆవురావురు మంటూ తినడమే నీ పాక పాండిత్యానికి ఋజువు.’’
‘‘కరెక్ట్…’’ అంగీకరించాడు అల్లుడు మరికొంచెం పులావు వేయించుకుంటూ.
‘‘బావగారూ మీరేమీ అనుకోనంటే ఒక విషయం అడుగుతాను.’’
‘‘అడగవోయ్… అడుగు… సందేహం దేనికి?’’
‘‘మీరు చదువుతున్న రోజుల్లో కాలేజి హాస్టల్లో ఈటింగ్ పోటీల్లో ప్రథమ బహుమతి మీదేనని విన్నాను? ఈ మధ్యనే తెలిసిందిలెండి….’’
‘‘అంతేనా నీకు తెలిసింది?’’
‘‘అంత బొత్తిగా కొట్టిపారెయ్యకండి మరి అందులో నాకూ అంతో యింతో ఘనత లేకపోలేదు.’’
‘‘అయితే నాతో పోటీ కొస్తావా?’’
‘‘ఎంత పందెం?’’
‘‘రేపు సినిమా ఖర్చు.’’
‘‘ఒకే వడ్డించమ్మా అందరూ హార్టీగా నవ్వుకున్నారు. పిన్నలూ పెద్దలూ పందేలు వేసుకుని మరీ తిన్నారు. పులావు గిన్నె ఖాళీ. పెరుగు ఆవడలు ఖతమ్. సేమ్యాపాయసం నిండుకుంది. కూరలు, అన్నం, సాంబారు, రసం అన్నీ ఖాళీ.
‘‘బావగారూ నేనోడిపోయాను.’’
‘‘హురే హిప్…. హిప్… హిప్…. హుర్రే…’’
పిల్లలంతా గంతులేశారు. అంతా నవ్వులు, ఆనందం, కేరింతలు, భుకాతయాసం.
అంతా బయట వరండాలో కూర్చుని తాంబూలాలు వేసుకుంటున్నారు. పిల్లలు బాత్రూం ఖాళీకోసం పోటీలు పడుతున్నారు. సరస్వతమ్మ వంటిల్లు సర్దటంలో మునిగిపోయింది.
గడియారం పదకొండు కొట్టింది.
ఇల్లంతా నిశ్శబ్దం. ఎవరిగదుల్లో వాళ్లు సర్దుకున్నారు. దశరధరామయ్య ఒక్కడూ వరండాలో కూర్చున్నాడు. ఎందుకో మనసు చికాగ్గా వుంది. చుట్టూరా ఆనందం పరవళ్లు త్రొక్కుతున్నపుడు ఈ అపశ్రుతేమిటి? ఆయన గుండెల్ని ఎవరో పట్టి పిండినట్లుగా వుంది. వంటింట్లోకి నడిచాడు. ఫ్రిజ్ తెరచి చూశాడు. ఖాళీగా వుంది.
సరస్వతమ్మ వంటిల్లు సర్దటం పూర్తిచేసి రెండు గ్లాసులు మంచినీళ్లు తృప్తిగా త్రాగింది.
‘‘మీరింకా పడుకోలేదూ?’’
‘‘చూడు పిచ్చిమొద్దూ పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహారదీక్షతరువాత గాని చచ్చిపోలేదు. ఒక్కపూట భోజనం మానేసి నంత మాత్రాన మనుషులు చచ్చిపోరనీ నాకు తెలుసు. అయినా ఇంత బలగం వుండి నువ్వు తిన్నావా? లేదా? అని ఎవరికీ అనిపించకపోవటమే నాకు అర్థంకాని విషయం….’’
‘‘ఏమిటండీ? మీరనేది?’’
‘‘ఏమీలేదు. నువ్వుతినడానికేమీ మిగల్లేదు. ఇప్పుడు చేసుకునే వోపికా లేదు. అయినా నీ కడుపు నిండుగా వుంది కదూ….?’’
’’అయ్యో నేను భోంచెయ్యక పోవడమేమిటి?’’
‘‘అబద్ధం చెప్పకు…’’
‘‘అయ్యోరామా?….’’
‘‘ఆ ఫ్లాస్కు ఇలాతే.. హోటలుకుపోయి ఓ బన్నురొట్టి, పాలూ తెస్తాను.’’
‘‘ఈ వేళప్పుడెందుకండీ ఇవన్నీనూ? నా కడుపు నిండుగా వుంది….’’
‘‘అవును కడుపు నిండింది’’ అంటూ ఫ్లాస్కు తీసుకుని విసురుగా బయటికి నడిచాడు దశరధరామయ్య.
———–