అంపేరాయని వెంకటచంద్రశేఖరరావు (Amperayani Venkata Chandrashekhararao)

Share
పేరు (ఆంగ్లం)Amperayani Venkata Chandrashekhararao
పేరు (తెలుగు)అంపేరాయని వెంకటచంద్రశేఖరరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుచంద్రోదయం, దీక్షాఫలితం, పెళ్లిపిలుపు, మావఁయ్య జందెం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅంపేరాయని వెంకటచంద్రశేఖరరావు
సంగ్రహ నమూనా రచనధీర్ఘకాలంగా పంజరంలో బంధింపబడిన పక్షి దైవానుకూల్యంవలన బయటపడి, రెక్కలు విదుల్చుకుని స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకుంటూ ఒక్కసారిగా పైకెగిరిపోయినపుడు ఎంత ఆనందం పొందతుందో అంత ఆనందం పొందుతోంది సుందరమ్మ.
ఎదురుగావున్న అద్దంలో ఏ ప్రతిబింబం చూసి అసహ్యించుకుందో, విసుగుతో ఛీదరించుకుందో ఆ ప్రతిబింబాన్ని చూసే ఇపుడు సంతోషంతో మురిసిపోతోంది.
ఇన్నాళ్ళూ తన ఉనికినే ఒక బరువుగా భావించిన సుందరమ్మ ఈనాడు తన్ను చూచి తానే గర్వపడుతోంది.

అంపేరాయని వెంకటచంద్రశేఖరరావు
చంద్రోదయం

దీర్ఘకాలంగా పంజరంలో  బంధింపబడిన పక్షి దైవానుకూల్యంవలన బయటపడి, రెక్కలు విదుల్చుకుని స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకుంటూ ఒక్కసారిగా పైకెగిరిపోయినపుడు ఎంత ఆనందం పొందతుందో అంత ఆనందం పొందుతోంది సుందరమ్మ.

ఎదురుగావున్న అద్దంలో ఏ ప్రతిబింబం చూసి అసహ్యించుకుందో, విసుగుతో ఛీదరించుకుందో ఆ ప్రతిబింబాన్ని చూసే ఇపుడు సంతోషంతో మురిసిపోతోంది.

ఇన్నాళ్ళూ తన ఉనికినే ఒక బరువుగా భావించిన సుందరమ్మ ఈనాడు తన్ను చూచి తానే గర్వపడుతోంది.

అసంతృప్తితో, నిస్పృహతో నిట్టూర్పులు విడిచిన సుందరమ్మ ఈనాడు హాయిగా గాలి పీలుస్తోంది.

మెల్లిగా పాడుకుంటూ మెడచుట్టూ వేళ్ళు పోనిచ్చి మంగళసూత్రం సరిచేసుకుంది విలాసంగా మందహాసంతో తన ప్రతిబింబానొనకసారి చూచుకుంది పరీక్షగా.

పరాగ సంపర్కం చెంది పుష్పంలా వింతా ఛాయసు పులుముకున్న శరీరం, పౌర్ణమి నాటి చంద్రబింబంలావున్న ముఖకాంతి, మబ్బు వీడిన వినీలా కాశంలో నిర్మలంగా వున్న మనస్సు, తన ప్రత్యవయవములోనూ ఏవో నూత్న పరిణామాలు గత మూడు మాసాలుగా జరిగిపోతున్నాయి.

దీనికంతా కారనం?

చెప్పినపుడు నారాయణ ఏమన్నాడు?

‘సుందరం నీకింకా ఈ పిచ్చి వదల్లా. ముప్పయ్యేళ్ళుదాటి ముసిలోళ్ళం అవ్వోత్తాంటే మనకింకాపిలలేంటే ఎర్రమొగవా?’ అన్నాడు పైకండువా దులిపి బుజాన వేసుకుని పొలం వెడుతూ

సుందరమ్మ మనసు చివుక్కుమంది కనుబొమలు కిందికి జారాయి ముఖం నల్లపడింది.

కాని వెంటనే ‘చెంచమ్మ పిన్ని’ అన్నమాటలు గుర్తువచాచయి.

‘అల్లుడి మాటలకేం లేయే ఆడికెప్పుడూ నువంటే పరాచికాలేగా ఎవరునూశారు? ‘గోడడ్డుమోతు గొడ్డుమోత’ని ఊర్లోవొల్లంతా తిట్టిపోసిన అవదానిగారి భార్య నలభై యేళ్ళొచ్చాక కనలా, అట్టాగే ఆ బగమంతుడి దయొల్ల నీ కడుపూ పండకూడదూ’

కళకళలాడుతూన్న నవ్వు ముఖంతో కానీ వెడలుప బోట్టు పెట్టుకుని, వొదులుగా వున్న కొప్పు సరిచేసుకుంటూ చెంచమ్మ పిన్న ఆ మాట లంటూంటే నిజంగా ఆకనక దుర్గమ్మె బెజవాడకొండ దిగివొచ్చి తనని దీవిస్తున్నట్లుగా తోచింది సుందరమ్మకి.

సుందరమ్మ పరమానందభరితురాలైంది.

నిజమే. తను తల్లికాబోతూంది. ఏ స్థానం చేరుకోవాలని ఇన్నాళ్ళూ తను తహతహ లాడిందో ఆ స్థానం చేరుకోబోతూంది ఇహనుంచీ తను ‘గొడ్రాలు’ కాదు ‘బిడ్డరాలు కాబోతూంది.’

ఒకనాడు కరణం గారింటికి పేరంటానికి వెళ్ళినపుడు తిన్న ‘గొడ్డుమోత‘ని పరిహసించిన షావుకారు వెంకటరత్నం భార్య జానకమ్మ ముఖం  ఈ విషయం తెలిస్తే ఎలా తయారవుతుంది?

అప్పటికి పొద్దువాలి పోతూంది సుందరమ్మ గర్వంతో లేచి చీర సవరించుకొంటూ పంచలోకి నడిచి వీధిలోకి చూచింది, భర్త వొస్తున్నాడేమోనని కాని సుందరమ్మకు కనపడింది నారాయణకాదు, ఆమె విరోధి జానకమ్మ.

బిందె బుజాన పెట్టుకుని ఊరి వెలపటి బావినుంచి మంచినీళ్లు తెస్తూంది జానకమ్మ వొళ్ళొంతా తెగవూపేసుకుంటూ

ఇంకో సమయంలో ఐతే జానకమ్మ కనిపించగానే సుందరమ్మ లోపలికి వచ్చేసేదే కాని ఆమెకు ఈ రోజు ‘‘నే నెందుకు కదలాలి’’ అనిపించింది. తనకేసి నడిచి వొస్తూన్న జానకమ్మను చూస్తూ అలాగే పంచలో నిలబడింది సుందరమ్మ.

సమీపానికి రాగానే తలపైకెత్తి సుందరమ్మను చూసి మూతి మూడు వంకలుగా తప్పి ముందుకు నడిచింది జానకమ్మ.

సుందరమ్మేం సామాన్యురాలా? జానమ్మ మూడు వంకలుగా మూతి తిప్పితే, తను పదమారు వంకలుగా తప్పి విసవిసా లోపలికి నడిచింది గర్వంగా.

‘ఏషేవ్ ఇదిన్నవావా, సుందరమ్మ నీలోసుకుందంట’

‘అదెప్పుడేవ్ నే యినలేదే.’

‘అదేంటే అలాగంటావ్ మీనాచ్చీ. నీ కింకా తెలవదూ’.

‘అబ్బే నీవే ఒట్టుబెడితే ఆ ఒట్టు కనకమ్మొదినా నా కసలు తెలవనే తెలవదు. ఎన్నాలయిందేంటి?

‘ఇంకా ఎన్నాలయిందంటా వేంటే. ఇది నాలుగోనెలంట.’

‘ఓసెమామ ఇంతగావుందే’

‘ఇంతగాదంటే మరి ముప్పయ్యేళ్ళు దాటి ముసిల్దవ్వొత్తాంటే దానిక్కడుపేంటే నాశారం’

‘మరే సీతమతనాతో ఈ మాటన్నపురుమానుకు మల్లే అయిపోయావంటే నమ్ము’

‘అవరంటేమరీ, యిసిత్రాలు జరుగుతాంటేనూ’

‘కల్యుగవేఁకల్యుగం ఇసిత్రాలు జరగవంటేమరి’

ఒకరోజు సాయంకాలం, ఆవూరి అమ్మలక్కలు కొంతమంది ఊరి వెలపటి నుంచి నీళ్ళ బావిద్దగరచేరి ఈ విధంగా అనుకుంటున్నారు.

ఆసమయానికే అటువైపునుంచి పోతూన్న అవధాని గారి భార్య వీల్ళని పలకరించి ‘ఏవిటే ఆవిచిత్రతం సీతాలూ’ అని అడిగింది దూరంగా ఉండే.

‘ఏవీలేదు అన్నపూర్ణమ్మగోరూ సుందరమ్మ కడుపుతో వుండాదంట అదే అనుకుంటున్నాం.’ అంది బావిలోంచి నీళ్లు తొడుతూనే సీతాలు.

ఆమాటలు వినటంతోటే అవధానిగారి భార్య కనుగుడు బైటపడేలా చూస్తూ ‘ఏవింషీ’ ఏవిఁషీ దానిక్కడుపు బంగారం కానూ. సుందరమ్మ కడుపుతో వుందిషే ఉండువుండు అయితే ఇప్పుడేవెళ్లి విచారించి వొస్తాను అంటూ చరచరా ముందుకు నడిచింది.

‘ఎక్కడికి అవధాని గారి భార్య మాదూకుడుగాపోతున్నాది ’ అంటూ ఎక్కణ్నుంచో వూడిపడింది జానకమ్మ.

‘ఇంకా నీదాకా రాలేదా జానకమ్మా నారాయణపెళ్ళాం కడుపుతో వుందంట’ అని తను తెలుసుకున్న వియం చెప్పింది ఒక పడుచుపిల్ల.

‘ఓసినీ, ఇది నమ్మేమాటేనంటే’ జానకమ్మ తెచ్చినబిందె కిందపెట్టి, రెండు చేతుల్తోనూ నడుంపట్టుకు నిలబడి.’

‘కావాలంటే అల్లదుగో చెంగమషిన్ని వొత్తాందిగా అడగరాదూ’ అంది దూరం నించి గడ్డిమోపు నేత్తిన పెట్టుకుని నడిచివోస్తూన్న చెంచమ్మని చూపించి.

‘ఏం చెంచమ్మా మీసుందరమ్మ నీలోసుకున్న మాట నిజవేఁనా?’ అని అడిగింది జానకమ్మ చెంచమ్మ దగ్గరికిరాగానే.

‘అది నాకేం తెలుసూ దానికీ ఆ బగమంతుడికీ తెలవాని ఆ సంగతి’ అందిచెంచమ్మ నడుస్తూనే.

‘వోయిసు మల్ళిన ఈడులో ఇదేం విడ్డూరం చెంచమ్మా అది గడ్డాబిడ్డా’ అది జానకమ్మ అక్కసుపట్టలేక

‘జానకమ్మోవ్ పిల్లలుగలదానివి మంచీ సెడూ లేకండా మాటాడమాక. సుబవాఁ అది కడుపుతోంటే నీకేవొచ్చిందీ కష్టం. అంటూ నాలుగు చీవాట్లూ పెట్టి ఇంటిదారి పట్టింది చెంచమ్మ.

‘అబ్బో దాన్నటే ఎక్కడలేని రోషం దీనికొచ్చిపడిందే’ అంటూ జానకమ్మ చెంచమ్మ వెనకాల మెటికలు విరిచింది.

ఆ రోజు సుందరమ్మ ఆవార్లుగారి భార్య పంపిన పులిహోర అవధాని గారి భార్య ఇచిచన దధ్యోదనం, మునసుగారి భార్య తెచ్చియిచిచన ముంతమామిడిపళ్లూ అన్నీకోరిక తీరతిన్నది.

దొడ్డొకాసిన దానిమ్మపండు గింజలు ఒక్కొక్కటే నోట్టో వేసుకుంటూ, తాతలనాటి వాలుకుర్చీలో కూచుని ఆ మధ్యహ్న సమయంలో ఏదో అల్లకంపని చేసుకుంటోంది అనుకోనట్లుగా ఆమెదృష్టి పెరట్లో వున్న పనసచెట్టుపైన పడింది సుందరమ్మకు పనస తొనలపైన గాలి మళ్ళింది. కనపడేది ఇంకా చిన్నచెట్టే దానిమీద ఆశపెట్టుకుని ప్రయోజనం లేదు.

‘ఆయన్ని బస్తీకిపంపి పనసతోనలు తెప్పించుకోవాలి,’ అనుకుంది మనసులో

‘ఏ వేం మేలుకొనే వుందా? నేనింకా నిదరపోయావనుకుంటుండా’ అంటూ ఒక పళ్లెంలో మినపసున్ని వుండలు పెట్టుకుని వీధి గుమ్మంలోంచి ప్రత్యక్షమైంది పక్కంటి చెంచమ్మ.

‘నాకు సారె తెస్తావాపిన్నీ’ అంటూ కుర్చీలోంచి లేచి ఎదురువెళ్ళి పళ్ళెం అందుకుంటూ’ పోనీలే నాకు పుట్టింటోళ్లు లేరనుకోకుండా నీవైనా వున్నావు,’ అని చీరకొంగుతో కళ్లువొత్తుకుంది సుందరమ్మ గత జీవిత స్మృతులు జ్ఞప్తికిరాగా.

‘అట్టా గుక్క పోమాకే పిచ్చిపిల్లా దేవుడులాంటి బర్తవున్నాడు. తింటానికి ఇంత కూడుంది నీకేం తక్కువే ఇంక కొన్నాలుపోతే అబ్బాయినో అమ్మాయినో ఎత్తుకుని తిరుగుదూ గాని దయిర్యంగా వుండు’ అని సుందరమ్మని ఊరుకోబెట్టి ఓతానే కూతురా అవతల నన్నూడ్చుకోపోయే అంత పనుంది’ అంటూ అప్పటికప్పుడే అక్కణ్నుంచి మాయమైంది చెంచమ్మ.

పళ్లెంచేత పుచ్చుకుని వంటింటి వేపు నడిచింది సుందరమ్మ.

‘చెంచమ్మతా చెంచమ్మతా’ అని కేక వేస్తూ పక్కింటికి పరిగెత్తాడు ఆరోజు అర్థరాత్రి సమయంలో నారాయణ.

‘ఏవిఁట్రా అల్లుడా ఏవైంది’ అంటూ ఆదిరిపడి లేచింది చెంచమ్మ నిద్ర మంచం మీదనుంచి

‘దానిక్కడుపులో నెప్పంట గోలపెడుతాంది నిన్ను పిలుసుకురమ్మంది’, అన్నాడు నారాయణ.

‘సరే పద,’ అంటూ వున్నపాళంగా నారాయణవెంట నడిచిం చెంచమ్మ.

ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు సుందరమ్మ పక్కమీద పడుకుని బాధ పడుతోంది చెంచమ్మ మారుమాట్లాడకుండా లోపలికి నడిచీ నిప్పుచేసి, అప్పటికప్పుడు పొయిమీద ఏవిఁటో కాచి ఇచిచంది.

‘ఆయి ఇయీ తిందిగదంట్రా దానికే ఈ కడుపులో నెప్పి, కూసేపట్లో అంతా తగ్గిపోద్దిలే’ అని ధైర్యం చెబుతూ ఆ రాత్రంతా అక్కడే గడిపింది చెంచమ్మ.

కాని ఆ కడుపులో నొప్పి మరుసటి రోజు కూడ వొచ్చింది అదే విడవకుండా వారం రోజులు వొచ్చింది. చెంచమ్మ తనకి తెలిసిన వైద్యాలన్నీ చేసింది కాని ప్రయోజనం కనపడలేదు నొప్పి రోజురోజు ఎక్కువైంది.

చెంచమ్మ విసిగి మాదిగపాలెంలో వున్న మునెమ్మను తీసుకొచిచ చూపించింది.

మునెమ్మ నర్సు పరీక్ష ప్యాసైంది. ఆమె సుందరమ్మను పరీక్షించి ‘ఇది బిడ్డకాదు, కడుపులో బల్లకట్టింది టౌనుకు తీసికెళ్ళి హాస్పిటల్లో మందిప్పించండి అని సలహా ఇచ్చింది.

చెంచమ్మ నిర్విణ్ణురాలయింది.

నారాయణ బరువుగా తలదించుకున్నాడు.

నే సచ్చినా బస్తీతో మందు పుచ్చుకోను. నా కడుపులోది బల్లకుద బిడ్డే ఆపాడుమందులుతిని నా బిడ్డను పోగొట్టుకోను. అంటూ సుందరమ్మ మంకు పట్టు పట్టింది.

నారాయణ బతిమాలాడు

చెంచమ్మ ఎన్నో విధాల చెప్పి చూసింది

‘ఛస్తే నేచష్తాను మీకెందుకు పొండి, అంటూ ఏడవిడం మొదలెట్టింది సుందరమ్మ

‘సరే ఏంచేదాం అల్లుడా దాని గెహచారం ఎట్టాగుంటె అట్టా అవుద్ది, అంది చెంగమ్మ విసిగిపోయి.

కాని ఆ చెంచమ్మే వొచ్చి నొప్పి వొచ్చి నప్పుడల్లా సుందరమ్మకి పరిచర్యలు చేసేది

అలా రోజులు దొర్లుకుపోయాయి.

’పిన్నావాఁ పొద్దుటాలనించీ నారాయణగారింటికాడ సిన్నకారు వొచ్చుంది, యాడదే’

‘అదా బస్తినించి వొచ్చింది లేవే, సుందరమ్మ పెసవిత్తాందంట’

‘యమ్మావ్ అదెంటే అటాగంటావ్ మాశన్మూ పిన్నీ పొద్దుటాలమించీ పెసవిత్తానే వుందా సుందరమ్మ’

కాదే కనపొద్దులయి కష్టపడతావుంటే బస్తినించి పిలిపించారంట దొరసానమ్మని’

‘అయితే గంగమ్మా అది కడుపేనంటావంటే’

‘ఏదోనమ్మ నాకేం తెలుసూ మునిమ్మ సెప్పనే సెప్పిందంట కడుపులోది బిడ్డకాదు బల్లని’

‘అయినా ఈ రోజుల్లో మడుసులుకీ మడుసులు పుడతన్నారంటే ఈడమ్మ ఆడాణ్ణో ఒక ఊరో ఎవరో నీలాడితే తాంబేలు మాదిరిగా పుట్టిందట ఏంటో మొన్న మా పెద్దోడు పేపర్లలో సదువుతోంటేయిన్నా.

‘పలక్కండావుందే పిన్నవావా. మనకెందుకు ఎవుళ్లన్నా ఇన్నా యిరుసుకుపడతారు.’

‘అవున్లే అమ్మాయా లేనిపోని గొడవలు నాకెందుకూ’

‘ఇంతెందుకే తెలారేయాలకి బయటపడిదంటే ఆ బండారం ఏంటో’

‘పడితే నాకెం పడకపోతే నాకేవేఁ ఇంటికాడనన్ను కట్టుకుపోయినంత పనుంది వొస్తా’

‘నీకొక్కదానికేనా పనుంది పెద్దమ్మా మేవుఁకూడ వస్తన్నాం, పద’

‘ఆరోజు మునిమాపువేళ మొదలైన సభ  ఆ విధంగా ముగిసింది. లోకం ఎన్నిరీతులుగా అనుకున్నా ప్రకృతి తన పనితను నిర్వర్తించింది.

ఆరోజు చంద్రోదయంతోపాటే సుందరమ్మకి శిశూదయం కూడ అయింది.

నర్సువొచ్చి ఈ వార్త అందజేసినపుడు నారాయణ సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతూ పక్కింటికి పరిగెత్తాడు చెంచెమ్మ తో ఆవిషయం చెప్పటానికి.

చెంచమ్మ నారాయణ చెప్పిందంతావిని ‘అట్టాగా నారాయణా దాని బుద్ధి గడ్డకట్టి మునిమ్మకూడ కడుపులో బల్లనే కాదంట్రా చెప్పింది ఎవరెట్టా అనుకుంటేయేం అది సుకంగా నీలాడింది అంతా ఆ ఎంకటేశరసామి దయరా అల్లుడూ మనదేవుంది’ అంటూ నారాయణ వెంట నడిచి సుందరమ్మ వున్న గదిలోకి వొచ్చింది.

అలసివున్న శరీరంతో ఆచేతనంగా మంచంపైన పడుకునుంది సుందరమ్మ.

చెంతనే వున్న సుందరమ్మపడక సమీపించి పొత్తిళ్ళలో వున్న బిడ్డ చిబుకంపుణికి నీ కడుపు చల్లగా గుమ్మడిపండులాంటి మగబిడ్డను కన్నావే నా తల్లి. అంటూ రెండు చేతుల్తో సుందరమ్మ చెంపలు నిమిరి తన కణతల దగ్గర చిటపట లాడించింది చెంచమ్మ.

బరువుగా ఒకసారి కళ్ళు తెరిచి చూసి నవ్వి వెంటనే కళ్ళు మూసేసుకుంది సుందరమ్మ.

బయట ఆకాశంలో చంద్రుడు చల్లని వెన్నెల కాంతలు లోకంపైన చల్లుతున్నాడు.

———–

You may also like...