పేరు (ఆంగ్లం) | Bukkapatnam Tirumala Ramanujam |
పేరు (తెలుగు) | బుక్కపట్నం తిరుమల రామానుజం |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అమ్మ, అరుణ, కల్చర్, ఘాటెక్కే గంధకథూమం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బుక్కపట్నం తిరుమల రామానుజం |
సంగ్రహ నమూనా రచన | ప్రకాశాన్ని మూడ్రోజుల నుంచి జ్వరం శనిదేవతలా పట్టి పీడిస్తోంది. అతని కిలాంటి జ్వరాలు రావడం అలవాటులేదు. ఎప్పుడయినా జ్వరం వచ్చినా పట్టించుకోకుండా వూరు మీద తిరిగేవాడు. యీ జ్వరం మామూలుదిగా వున్నట్లు లేదు. అందుచేతనే అతను మంచానికి అంటుకొని వుండాల్పి వస్తోంది. ‘‘అమ్మా’’ అని పిలిచాడు ప్రకాశం. గొయ్యిలోంచి వచ్చిన అరుపులా అతని గొంతులోంచి ఆ మాటలు వచ్చాయి. |
బి.టి. రామానుజం
(బుక్కపట్నం తిరుమల రామానుజం)
అమ్మ
ప్రకాశాన్ని మూడ్రోజుల నుంచి జ్వరం శనిదేవతలా పట్టి పీడిస్తోంది. అతని కిలాంటి జ్వరాలు రావడం అలవాటులేదు. ఎప్పుడయినా జ్వరం వచ్చినా పట్టించుకోకుండా వూరు మీద తిరిగేవాడు. యీ జ్వరం మామూలుదిగా వున్నట్లు లేదు. అందుచేతనే అతను మంచానికి అంటుకొని వుండాల్పి వస్తోంది.
‘‘అమ్మా’’ అని పిలిచాడు ప్రకాశం. గొయ్యిలోంచి వచ్చిన అరుపులా అతని గొంతులోంచి ఆ మాటలు వచ్చాయి.
అమ్మ సాధారణంగా నవ్వదు. ఆవిడ ముఖంలో ఎప్పుడో తప్ప జీవకళ కనబడదు. వంటింట్లో శబ్దం మాత్రం వినబడుతూ వుంటుంది.
అమ్మ గొంతు అతనికి వినబడలేదు.
మళ్ళీ ‘‘అమ్మా’’ అని పిల్చాడు.
పూర్తిగా చీకటీ రాలేదు, పూర్తిగా వెలుగూ పోలేదు ప్రకాశంకి మాత్రం యిల్లు చీకటిగా వున్నట్లు కన్పిస్తోంది. యిల్లంతా చీకటి. లైట్లు వెయ్యరేం? వెయ్యడానికి ఎవరున్నారు? అక్కయ్యా వాళ్ళు ఎవరింటికో వెళ్ళారు. అన్నయ్య యింకా రాలేదు. నాన్న యింకో గంటవరకు రాడు.
వున్నది నిశ్శబ్దంగానే అయినా ప్రకాశంకి నిశ్శబ్దంలోంచి ఏవో రొదలు వినబడుతున్నాయి. రొదలు కొంచెం కొంచెం పెద్దవి అవుతున్నాయి. గుండెల మీద ఏదో బరువు పెట్టినట్లుగా వుంది. ఆ బరువు క్షణక్షణానికీ ఎక్కువ అవుతోంది.
‘‘అమ్మా’’
ప్రకాశానికి భయంగా వుంది. అతన్ని భయంనుంచి రక్షించడానికి అమ్మ రాలేదు. భయం ఎక్కువ అవుతోంది. గుండెల మీద బరువు ఎక్కువయి పోతోంది. తన ఆ బరువు క్రింద పడి నలిగిపోతున్నాడు. ఏదో శబ్దం వినబడుతోంది. గుఱ్ఱం డెక్కల చప్పుడు లావుంది. వుహు తన గుండెల చప్పుడా?
ప్రకాశం ముఖాన లైటు పడింది.
పాలరంగు కాంతి గదినంతటినీ ఆక్రమించుకొంది. కాంతిని భరించలేక ప్రకాశం ఒక్క క్షణం కళ్ళు మూసుకొన్నాడు. మళ్ళీ చప్పుడు.
‘‘డామ్ డర్టీ గూస్…’’
మళ్ళీ చప్పుడు. ప్రకాశం కళ్ళు తెరిచాడు. శశికళా, రాధారాణీ యిద్దరూ హైహీలుస చప్పుడు ఆపేశారు. చెప్పులు తీసేసారు. ప్రకాశం వాళ్ళవంక నీరసంగా చూశాడు.
‘‘ఎలా వుంది?’’ అంది శశి.
‘‘వాడికేం? బాగానే వుంటుంది. యిరవైనాలుగ్గంటలూ వూరిమీద తిరిగే వాళ్ళకు పడుకోవడమే కష్టం’’ అంద రాధ.
‘‘తలనొప్పి’’ అన్నాడు ప్రకాశం.
‘‘అమ్మను పిలుస్తాను’’ రాధ లోపలకు వెళ్ళబోయింది.
‘‘అమ్మ వద్దులే…’’
‘‘మరి?’’ శశి అంది.
‘‘తల నొక్కు…’’
‘‘అందుకే అమ్మను పిలుస్తానంది… బట్టలు మార్చుకోవాలి’’ శశి విసురుగా లోపలకు వెళ్ళింది. ఒక్కసారి సిల్కు చీరలు పాలరంగు కాంతిలో ఆఖరుసారిగా మెరిసి మాయమైపోయాయి. ప్రకాశం కళ్ళు మూసుకున్నాడు.
‘‘వూ… తల నొక్కాలా? గుడ్డ కట్టేస్తాను’’ రాధ గుడ్డ ఏదో తెచ్చింది.
‘‘వద్దు. అమ్మను పిలువ్….’’
‘‘మళ్లీ అమ్మ… అమ్మ పప్పు రుబ్బుతోంది. ఇప్పుడు అమ్మ తల నొక్కడానికి వస్తే నేను పప్పు రుబ్బాలి. ఎవరు రుబ్బుతారు బాబూ…’’ తలకి గుడ్డ బిగిస్తూ అంది రాధ.
‘‘ఇవాళ వాళ్ళింట్లో గొప్ప ఫన్‌గా వుందికదూ?’’ శశి లోపల్నుంచి వచ్చింది.
‘‘ఎక్కడ కెళ్ళారు’’ అన్నాడు ప్రకాశం.
‘‘రావుగారింటికి వెళ్ళాం. రావ్గారి వైఫ్ భర్త్ డే’’ రాధ నవ్వింది.
‘‘సేయ్ నీకేం చెప్పాను. వచ్చి పప్పు రుబ్బమన్నానా లేదా?’’ అమ్మ గొంతు వినబడింది. అమ్మ నిలబడలేనట్లు నీరసంగా వుంది. మాసిన చీర తడిసింది.
‘‘అబ్బ వీడికి తల నొక్కాలిట.’’
‘‘ఏడవలేక పోయావులే తలకి గుడ్డ కట్టి వెళ్ళి రుబ్బు.’’
‘‘అబ్బ నాకు ఒళ్ళంతా నొప్పులుగా వునానయి. నే రుబ్బలేను తల్లీ.’’
‘‘కూర్చుని తినగలవూ?’’
అమ్మ లొపలికి వెళ్ళిపోయింది.
‘‘రావుగారి భార్య వుత్త అమాయకు రాలే కదూ?’’ అంది శశి.
‘‘వూ. ఆవిడ నెవరూ ఖాతరు చెయ్యరు. అదేం ఖర్మో’’ అంది రాధ.
‘‘అది సరే రావ్గారు ఆవిడని కొడతర్ట కూడాను…’’
‘‘నిజమే. ఆయనకి తాగటం ఓ ఫాషన్ట. సరదాలో కొంచెం చెయ్యి చేసుకుంటాడు’’ రాధ నవ్వింది. ‘‘ఆవిడ యిరవై నాలుగ్గంటలూ ఏడుపే ఎలా భరిస్తోందో.’’
‘‘అదే నాకూ విచారంగా వుంది అలాంటి వాళ్ళను దేవుడెందుకు పుట్టిస్తాడో’’
‘‘క్రితం జన్మలో మిగిలిపోయింది ఏం చేస్తాం.’’
లోపల్నుంచి అమ్మ గొంతు వినబడింది.
‘‘ఒసేయ్ రాధా, ఓసారిలా తగలడవే.’’
‘‘అబ్బబ్బ ఒకటే హెల్…’’ రాధ విసుక్కొంటూ లోపలికి వెళ్ళిపోయింది.
‘‘ఒక్క రవ్వ కూర చూసి చావకూడదూ? ఎంత నేసూ ఆ కబుర్లు కాకపోతే.’’
‘‘శశికి చెప్పకూడ దేమిటి?’’
‘‘ఆ మహా తల్లకి చదువుతోనే తెల్లవారి పోతుందిగా దిక్కుమాలిన చదువులు వంట చెయ్యడానికి కూడా పనికిరావు.’’
‘‘అమ్మా‘‘ శశి అరిచింది. ‘‘అంత దిక్కుమాలిన చదువుతైతే చదివించడం మానీ లేకపోయారూ? మళ్ళీ అనవసరంగా మాటలు కూడా దేనికి?’’
‘‘అనవసరంగా నేనే మాటలు అనేస్తున్నాను. మీరంతా పడలేక చస్తున్నారు.’’
‘‘అవును మరి లేకపోతే ఏమిటి?’’
ప్రకాశంకి తల భారం ఎక్కువవుతోంది. రోజూ యిదే గొడవ. ఛీఛీ. తలపోటు.
‘‘అక్కా….’’
‘‘మళ్ళీ ఏం వచ్చింది’’ రాధ.
‘‘తల నొక్కవే…’’
‘‘అవతల తిన్న తిట్లు విన్పించలేదేమిటి? దాన్ని నొక్కమను.’’ విసురుగా వెళ్ళిపోయింది.
‘‘నే చదువుకోవాలి’’ శశి పుస్తకాలు తెరిచింది.
‘వెధవ బియ్యేలు తగలెడుతున్నారులే.’ అన్పించింది ప్రకాశానికి. కళ్ళు మూసుకు పడుకున్నాడు. అప్పటి దాకా నిశ్శబ్దంగా వున్న గోడగడియారం అర్థగంట కొట్టింది.
‘‘డామ్ సెవెన్ థర్టీ అయింది,’’ అంది శశి గొణుకొకంటున్నట్లు.
‘‘అదిగో వచ్చేశాడు,’’ అంది గుమ్మం వంక చూస్తూ. సైకిలు లోపలకు తెస్తున్నాడు శాస్త్రి.
‘‘తెచ్చావా?’’ అంది శశి.
‘‘వూ. లేకపోతే చంపుకు తింటున్నావుగా.’’ శాస్త్రి కొనుక్కొచ్చిన జూకాలు తీసి యిచ్చాడు.
‘‘వెరీగుడ్. విమెన్స్ కాలేజీ న్యూ ఫాషన్స్ లో మనం జాయినవుతున్నామన్న మాట’’
‘‘క్రొతత్త ఫాషనా తల్లీ ప్రజల్ని చంపుకు తినడానికి?’’ శాస్త్రి ఎప్పుడూ నవ్వుతుంటాడు. అలానే కనబడుతాడు అందరికీ.
‘‘నువ్వు మహా చూసి మూర్ఛపోతున్నట్లు మాట్లాడుతావు.’’
‘‘వీడి కెలా వుంది? ద్రాక్షపళ్ళు తేవడం మర్చిపోయాను,’’ ప్రకాశం వంక చూస్తూ. ప్రకాశం అటువేపు ముఖం పెట్టి పడుకొని వున్నాడు.
‘‘వూ. వీడిక్కూడా జ్వరం.’’ తమ్ముడి పరిస్థితికి నిట్టూర్చాడు.
‘‘జ్వరాలు మానవులకు రాక’’ అనబోయింది శశి.
‘‘రాధ దీ…’’
‘‘విడ యివాళ వంటిల్లు పావనం చేస్తోంది.’’
‘‘రాధా…’’ శాస్త్రి పిల్చాడు.
రాధ వచ్చింది.
‘‘ఓహూ, యివాళ వంటిల్లు పావనం అయిపోతోందిట’’
‘‘అమ్మకి చెయ్యి వీలులేదుట.’’
‘‘కూర మాడిపోతోంది సే రాధా ఎక్కడే…’’
‘‘అమ్మా’’ శాస్త్రి పిల్చాడు.
‘‘ఏమిట్రా సెయ్ నువ్విక్కడ కబుర్లాడుతూ కూర్చో. అవతల కూర మాడిచచ్చింది.’’
‘‘ఏమిటమ్మా ఆ మాటలు? కొంచెం సౌమ్యంగా మాట్లాడకూడదూ?’’
‘‘కూర్చుని కబుర్లు చెప్పండి సౌమ్యంగా మాట్లాడుతారు.’’
‘‘వెధవ కొంప ఎప్పుడూ తిట్లే…’’ అమ్మ ఒణికి పోతోంది.
‘‘అవున్రా యిరవై నాలుగ్గంటలూ కాళ్ళూ చేతులూ తన్నుకొని చచ్చి చెడి యిల్లు గడుపుకొస్తూంటే వెధవ కొంపే అవుతుంది.’’
‘‘ఆ వెధవ గొడవే వద్దనేది. ప్రపంచంలో నువొక్కత్తివే వంటచేస్తున్నట్లు. ఎప్పుడూ ఏదో ఒక హైరాన.’’
‘‘అవును, అన్నింటికి నేనే.’’ అమ్మ కళ్ళు తుడుచుకొంటోంది.
ప్రకాశంకి బాధనిపించింది. అన్నయ్య ప్రతీదానికీ ఏదో హటి అంటూనే వుంటాడు. కాసేపటి కతనికి ఏ గొడవా వినబడలేదు. గడియారం ఎనిమిది గంటలు కొట్టడం అతనికి వినబడింది.
‘‘వెధవ కొంప ఎనిమిదవుతోంది. అవతల సినిమాకి వస్తానని చెప్పి వచ్చాను. యివతల తిండి తయారయి చావలేదు. నాకు అట్టూ వద్దూ, గాడిద గుడ్డూ వద్దు గాని, అన్నం పెట్టెయ్.’’
‘‘అయినా యిది అన్నంగా వుందా? వెధవది, ముద్దయి చచ్చింది. యీ కూరమాడి చచ్చింది ఒక్కదానికి లేదుకదా యింట్లో…’’
ఎనిమిదిన్నదర అవుతూ శాస్త్రి ధుమ ధుమ లాడుతూ యింట్లోంచి వెళ్ళి పోయాడు. శాస్త్రి అలా వెళ్తూనే సుబ్బరామయ్యగారిలా యింట్లోకి వచ్చారు. కొడుకును చూస్తూ.
‘‘ఒరేయ్ ప్రకాశం,’’ అన్నాడాయన.
‘‘ఊ’’
‘‘ఆస్పత్రికి వెళ్ళావూ?’’
‘‘లేదు, నాన్నా…’’
‘‘ఏం?’’
‘‘అమ్మ తీసుకెళ్ళలేదింకా. తీసుకెళ్తుందేమో అడుగు.’’
‘‘ఒసే…’’
అమ్మ వచ్చింది.
‘‘వీణ్ణింకా ఆస్ప్తత్రికి తీసుకెళ్ళలేదూ?’’
‘‘ఎక్కడ యీ యింట్లో గొదవల్తో తెమిలి చావడంలేదు. ఇప్పటికి తెమిలింది.’’
‘‘గొప్ప పనయింది. ఆ డాక్టరుండడు కాసేపటికి. మనిషన్న తర్వాత యింతజ్ఞానం వుండి చావాలి.’’
‘‘యిదిగో మీ కొడుకు యప్పటిదాకా నానా అరుపులూ అరిచి వెళ్ళాడు. మీ పుత్రికా రత్నాలకు కూర చూడడానికి చదువులు అడ్డం వస్తాయి.’’
‘‘ఏడిశావులే చెప్పే విధానం తెల్సి చస్తేకదా? అయినా కన్నావు అలాంటి మొహాల్ని, యింకా సిగ్గులేక ఎందుకేడుపు.’’
‘‘యిప్పుడు హాస్పిటల్‌కి తీసుకువెళ్ళనా?’’
‘‘యింకేం తీసుకు వెళ్తావు? తొమ్మిదవస్తోంది టైం. నాకు అన్నం పెట్టెయ్.’’ వంటింట్లో మళ్ళీ చప్పుడు.
‘‘అయినా ఒకర్నని ఏం లాభం? నా ఖర్మ కూర మాడి చచ్చింది. అన్నం ముద్ద. కొంపకాదిది. శ్మశానం.’’ కంచం చప్పుడు.
ప్రకాశంకి తలపోటు ఎక్కువ అవుతోంది. యింకా యింట్లో ఏమేం చప్పుళ్లూ గొణుక్కోవడాలూ వినాలో అతనికి తెలియరావడం లేదు కాసేపటికి యింట్లో కరెంటు పోయింది.
ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది.
ప్రకాశంకి దాహంగా వుంది. నిద్ర ఒక్కరవ తేలింది. యింట్లో చీకటి. లైట్లు రాలేదు.
ప్రకాశం అటుప్రక్కకి తిరిగి చూశాడు. గదంతా ఖాళీ అమ్మ మాత్రం నేలమీద చాపపర్చుకొని పడుకొని వుంది. శశీ, రాధా వాళ్ళంతా యింకో గదిలో మంచాల మీద పడుకొంటారు. లాంతరు చీకటిని పారద్రోల లేకపోయినా గుడ్డి వెల్తుర్ని మాత్రం యిస్తోంది. ప్రకాశం చిన్నగా మూల్గు వినబడుతోంది.
‘‘అమ్మా…’’
అమ్మ ఉలిక్కిపడింది. లేచింది.
‘‘మంచినీళ్ళమ్మా…’’ అమ్మ కంట్లో నీళ్ళు ప్రకాశంకి లాంతరు వెలుగులో కూడా కనబడ్డాయి.
అమ్మ నీళ్ళు తెచ్చింది.
‘‘అన్నయ్యింకా రాలేదామ్మా?’’
‘‘లేదురా….’’
అమ్మ గొంతు తడిగావుంది.
అమ్మను చూస్తుంటే ప్రకాశానికి ఏడుపు వస్తోంది. అమ్మ. అవును అమ్మే. యీ ప్రపంచంలో ఎవరికీ పనికిరాని వస్తువు అమ్మ. అమ్మ చెప్పిన పని అక్కయ్యలు చెయ్యరు. వాళ్ళకి రావ్గారి భార్య మీద ఎంతయినా సానుభూతి వుంటుంది గాని అమ్మ గుర్తు రాదు.
అన్నయ్య సినిమాల్లాంటి చిన్నవాటికి హైరాన పడతాడుగాని యింత యింటిని నెట్టుకు రావడానికి అమ్మకి హైరాన వుండకూడదు.
‘‘ఇప్పటిదాకా తల నొక్కుతూనే వున్నాను. మూల్గుతున్నావు.’’
అక్కయ్యనీ, అన్నయ్యనీ కన్నందుకు అమ్మ మాత్రం సిగ్గుపడాలి. నాన్నకి వాటాలేదు. మరి తను? తను మాత్రం అమ్మగురించి ఎప్పుడు ఆలోచించాడు? యివాళ జ్వరం వచ్చి…
‘‘అమ్మా నాకు ఏడుపు వస్తోందే…’’
‘‘కళ్ళు మూసుకొని పడుకో. నిద్రవస్తుంది’’ అమ్మ తల నొక్కుతూ అంది.
ప్రకాశంకి ఏడ్పువస్తోంది.
———–