పేరు (ఆంగ్లం) | Bulusu Venkata Kameswararao |
పేరు (తెలుగు) | బులుసు వెంకట కామేశ్వరరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ఇది కథ కాదు, ఇది పెళ్లంటారా…, కొత్త దేవుడు, చిల్లర మనిషి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బులుసు వెంకట కామేశ్వరరావు |
సంగ్రహ నమూనా రచన | ‘‘తాతయ్యగారూ యీ వర్త విన్నారా చదువుతాను వినండి’’ అంటూ ఆచారిగారి వంక ఓసారి చూసి పేపర్లోకి తల దూర్చాడు రాఘవ. ఆచారిగారింట్లో అద్దెకుంటూ ‘తాతయ్యగారూ’ తాతయ్యగారూ అంటూ కలివిడిగా కలిసిపోయిన వ్యక్తి రాఘవ. చదువు డిగ్రీ వరకూ చదివినా వుద్యోగం రాలేదు అలాగని నిరుత్సాహపడకుండా యేదో ప్రవేట్ జాబ్ చేసుకుంటూ సాయంత్రం పూటగా పదిమందికి ట్యూషన్లు చెప్పుకుంటూ దిగుల్లేకుండా కాలాన్ని గడిపేస్తున్నాడు. రాఘవ చదవటం మొదలెట్టాడు. |
బులుసు వెంకట కామేశ్వరరావు
ఇది కథకాదు
‘‘తాతయ్యగారూ యీ వర్త విన్నారా చదువుతాను వినండి’’ అంటూ ఆచారిగారి వంక ఓసారి చూసి పేపర్లోకి తల దూర్చాడు రాఘవ.
ఆచారిగారింట్లో అద్దెకుంటూ ‘తాతయ్యగారూ’ తాతయ్యగారూ అంటూ కలివిడిగా కలిసిపోయిన వ్యక్తి రాఘవ. చదువు డిగ్రీ వరకూ చదివినా వుద్యోగం రాలేదు అలాగని నిరుత్సాహపడకుండా యేదో ప్రవేట్ జాబ్ చేసుకుంటూ సాయంత్రం పూటగా పదిమందికి ట్యూషన్లు చెప్పుకుంటూ దిగుల్లేకుండా కాలాన్ని గడిపేస్తున్నాడు.
రాఘవ చదవటం మొదలెట్టాడు.
‘‘కర్నూల్లో వరకట్నానికి బలైన ఓ యువతి గాథ కట్నం యివ్వలేదని గత కొద్ది నెలలుగా వేధిస్తూ, ఆఖరికి భార్యను చంపటానికి కూడా సిద్ధపడిన భర్తని నిన్న అరెస్టు చేయటం జరిగింది నవీన్ మరియు రామమ్మకి రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది అయితే యివ్వవలసిన కట్నానికి గాను పిల్ల తండ్రి యింకా అయిదువేలు వివాహం జరిగే సమయానికి పెళ్ళికొడుక్కి యివ్వవలసి వుంది. అయితే ఆర్థిక యిబ్బందులవల్ల పిల్ల తండ్రి వెంటనే యివ్వలేక వివాహం జరిగిన ఆరునెలలకి కొద్ది కొద్దిగా పెళ్ళికొడుక్కి ముట్టజెప్పడం జరిగింది అయినా తర్వాత కూడా ఆ భర్త యింకా కట్నం కావాలని భార్యని వేదించుకు తింటూంటే ఆ పిల్ల తండ్రి మరో అయిదువేలు తన పొలం అమ్మి అల్లుడికి అప్పజెప్పటం జరిగింది. అయితే ఆ పెళ్ళి కొడుక్కి డబ్బులు యింకా గుంజాలనే తపనతో భార్యని వేధించుకు తింటూంటే రెండు రోజుల క్రితం రామమ్మ భర్త కోరికను మన్నించి తండ్రిని డబ్బు అడక్కుండా ఎదురు తిరిగింది. దానికి యిద్దరి మధ్యా ఘర్షణ జరిగి అదేరోజు రాత్రి నవీన్ భార్యని కిరోసిన్పోసి తగలెయ్యటానికి ప్రయత్నించగా రామమ్మ అరిచిన అరుపులకు చుట్టు ప్రక్కల వాళ్ళులేచి రామమ్మను రక్షించటానికి చేసిన ప్రయత్నంలో రామమ్మ మితిమీరిన కాలిన గాయాలతో హాస్పిటల్లో జేర్చబడింది. అప్పుడు రంగంలోకి పోలీసులుదిగి భర్త నవీన్ని అరెస్టు చేశారు. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవటం ఆపాడు రాఘవ ఆచారిగారు వంక చూశాడు ఆయన కళ్ళలో నీళ్ళు తిరిగాయి రాఘవకి యన పరిస్థితి చూస్తే కళ్ళ నీళ్ళు పర్వంతమయింది.
‘‘తాతయ్యగారూ యీ వర్త వింటే బాధగా వుంది కదూ’’
అవున్నాయనా మనం బాద పడగలమేగాని యేం చేయగలం ప్రతీ వంద యింట్లోనో యిటువంటివి ఓ పదిశాతం వుండక పోతాయా అయినా కట్నాలు పూర్త్తిగా యిచ్చిన వాళ్ళకి కూడా కొంతమందికి సుఖంలేదు అయినా పూర్వజన్మ సుకృతం కూడా వుండాలి. ఈ రోజుల్లో మంచి అల్లుళ్ళు. అందులోనూ కట్నాలు లేకుండా చేసుకునే వాళ్ళు చాలా అరుదు ఆడది యెదురు తిరగనంత కాలం యీ కట్నాల జులుం సాగుతూనే వుంటుంది పోనీ యెదురు తిరిగి భర్తని వదలి బయటకువస్తే మనమే కాకుల్లా పొడుస్తూ సూటీ పోటీ మాటలతో ఆడది యెదురు తిరగాలంటే ఆత్మస్థైర్యం యెక్కువ వుండాలి అంటూ పడక్కుర్చీలోంచి లేచి లోపలికి వెళ్ళాడు రాఘవ. అక్కడే కూర్చుని పేపరు చదువుకుంటున్నాడు ఆ రోజు ఆఫీసుకి సెలవు పెట్టాడు రాఘవ కొంచెం వంట్లో నలతగా అనిపించింది.
ఆచారిగారు వరండాలోంచి లోపలిగదిలోకి వెళ్ళి మంచం మీద నడుం వాల్చారు ఆచారిగార్కి యిద్దరే అమ్మాయిలు. పెద్దమ్మాయికి పెళ్ళయ్యి నాలుగేళ్ళయ్యింది ఓ బాబు రెండో అమ్మాయి సునీతకు పెళ్ళి జరగాల్సి వుంది ఆ రోజు వుదయం లేచిందగ్గర్నుంచి కంగారుగా వున్నారు ఆచారిగారు దానిక్కారణం అంతక్రితం రోజు వచ్చిన వుత్తరం అది పెద్దమ్మాయి సుజాత దగ్గర్నుంచి వచ్చింది ఉత్తరం చదివాక ఆచారిగార్కి విషయం అర్థం అయ్యింది ఇప్పుడు ఆయనకు డబ్బులు కావాలి ఎలా తన దగ్గర ఒక్క పైసా కూడా లేదు స్కూల్లో టీచర్ క్రింద రిటైర్ అయ్యాక వచ్చిందే కొంచెం ఆ మొత్తంలో సుజాత పెళ్ళి చేశాడు తన అదృష్టమానుకుంటూ రెండో పిల్ల సునీతకు గవర్నమెంటు ఆఫీసులో వుద్యోగం వచ్చింది దాంతో కొంతవరకూ వూపిరి పీల్చుకో గల్గాడు యెప్పుడో తాతలు మిగిల్చిన పెంకుటిల్లు. అందులోనే ఒకగది రాఘవకి అద్దెకిచ్చాడు.
ఆచారిగారు మంచం మీద పడుకునే వున్నారు కాని వళ్ళంతా చెమట పడ్తూంది పెద్దమ్మాయికి మళ్ళీ డబ్బులిచ్చి పంపాలేమోనని అంతక్రితం ఓ రెండుసార్లు అలాగే వచ్చిన వుత్తరానికి తను డబ్బులిచ్చారు సారి కూడా ఆ ఉత్తరం చూస్తూంటే అదే అనుమానం కల్గుతూంది. ఆచారిగార్కి అందుకే ప్రొద్దున్న ఆఫీసుకెళ్తున్న రెండో కూతుర్తోఅన్నాడు.
‘‘అమ్మా యీ రోజు మీ అక్కయ్య వస్తుంది.’’
‘‘ఉత్తరం చూశానుగా తెలుసునాన్నా’’
‘‘అది కాదమ్మా మళ్ళీ తనకి డబ్బులు అవసరం’’ ఆగిపోయాడు ఆచారిగారు
కూతురు కూడా ఓ క్షణం మాట్లాడలేదు.
‘‘రాసీంది నాన్నా మనం యేదో వూహించుకుని బెంబేలు పడిపోవటం యెందుకు వచ్చాక యెలాగు తెలుస్తుందిగా డబ్బులైతే మనం యివ్వాలి అనుకుంటే యెక్కడైనా అప్పైనా తీసుకురావాలి.
అమ్మ సునీతా నువ్వ అంత తేలిగ్గా డబ్బులు గురించి చెప్పావుగాని డబ్బులు సర్దటం అంత సులబంకాదు.
సరే అక్కయ్యని రానీండి ఆలోచిద్దాం. సునీత వెళ్ళిపోయింది.
అప్పట్నుంచి మనసు అంతా వొకటే దిగులు చేసుకుంది ఆచారిగార్కి. అలా ఆలోచిస్తూ వరండాలో కూర్చుంటే ఆ రాఘవ పేపర్లో వార్త అంటూ అదేదో చదివాడు. ఆ బాధని చదివితేనే మనం అంత బాధపడ్డాము కదూ మరి నిత్యం వాటి గురించి పోట్లాడుకునే జంటల సంగతేంటి. అందులో తన కూతురు కూడా ఒక్కరెత. మొదటిసారి అల్లుడు డబ్బు అడిగినప్పుడు కట్నం తాలూకు డబ్బులన్నీ పెళ్ళిలోనే యిచ్చేశాంకదా మళ్లీ యెందుకడిగాడు అని అనుమానించాడు. కాని యే స్కూటరో కొందామని సరదాపడి వుంటాడు అని తను మారుమాట్లాడకుండా అడిగిన డబ్బు యిచ్చేశాడు. కాని రెండు నెలలతిరగకుండా మళ్లీ కూతురు వుత్తరం వచ్చింది అప్పుడూ డబ్బులు ప్రస్తావనే అప్పుడు తనికి అనుమానం వచ్చింది. అల్లుడు విషయోం అంచనా తప్పు అయినందుకు కాని చూస్తూ చూస్తూ కూతురి కాపురం నాశనం చేయలేడు. ఆ ధైర్యంతోనే అల్లుడు కూడా ఆచారిగార్ని అడుగుతున్నాడు. భార్యని అడ్డం పెట్టుకుని ప్రస్తుతం తను డబ్బులు యిస్తే నాల్గోసారి అవుతుంది. ఇప్పటికి మూడుసార్లు మూడు అయిదులు యిచ్చాడు. ఇప్పుడు యెంత అడుగుతాడో.
వరండాలో అలికిడి అయ్యేసరికి గోడగడియారం వంక చూశాడు ఆచారిగారు. టైం పన్నెండు అయ్యింది. కూతురే వచ్చి వుంటుందని మంచం మీద నుంచి లేచి వరండాలోకి వచ్చాడు. అప్పుడే చారిగారి పెద్ద కూతురు రిక్షా దిగుతూంది. ఆచారిగారి మనమడు తప్పటడుగులు వేసుకుంటూ మెట్లు యెక్కటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆచారిగారు గబగబా వెళ్ళి మనవడ్ని యెత్తుకుని ముద్దాడాడు. కూతురు సుజాత రిక్షావాడికి డబ్బులిచ్చి పంపిలోపలికి నడిచింది.
‘‘ఏవమ్మా బాగున్నావా అల్లుడు కులాసానా’’
‘‘ఆ కులాసానే నాన్నా మామూలుగానే సమాధానం చెప్పింది సుజాత.
‘‘ఇన్నిసార్లు నువ్వొంటరిగానే వస్తున్నావు. ఒక్కసారి కూడా అల్లుడిగార్ని తీసుకురాలేదు. నేను ఇన్నిసార్లు వుత్తరం రాశాను కదా యీ సారైనా తీసుకు రావలసింది.’’
‘‘ఆయనా రావాలనే అనుకున్నారు. కాని ఆఫీసుపనిలోకుదరలేదు’’ పెట్టెను గదిలో ఓ మూల పెడ్తూ లోపలికి వెళ్ళింది సుజాత.
అదే సమాధానం కూతుర్నుంచి వస్తుంది అని తనకి తెలుసు అంత క్రితం కూడా అదే సమాదానం చెప్పింది కూడా కాని అల్లుడ్ని గురించి ఓ మాట కూడా అడక్కపోతే తను చిన్న చూపుచూస్తున్నానేమోనన్న బావం కూతురికి కలగచ్చు బేదం కలగకుండా వుండటానికి తాను అడిగాడు ఎంతైనా మనసులో వున్న చిన్న చూపుని బయటకు ప్రకటించలేడు కదా తను. ఎంతకయినా తన రక్తాన్ని పంచుకుపుట్టిన కూతురు. కాని వివాహం అయిన తర్వాత భర్త చెంత వుండవలసిందే భర్తకి విలువనివ్వవలసిందే. ఆ భర్తకి యెవరు విలువనివ్వలేదని తెలిసినా అది మె మనసులో వారి మీద కించెత్తె రెస్పెక్టు తగ్గుతుంది వాళ్ళ తండ్రిగాని, తల్లిగాని మరేతోడబుట్టినవాళ్లుకాని ఆచారిగారు ఆ పూటంతా మనవడి కబుర్లతో గడిపేశారు, సుజాత ప్రయాణ బడలికలో అలసిపోయిందేమో భోజనం చేసి కొడుక్కి కొంచెం అన్నం పెట్టి పడుకుంది.
మనవడు ఆడిఆడి ఆచారిగారి దగ్గరే నిద్రపోయాడు. కూతురింకా నోరు విప్పలేదు విప్పితేయే తుఫాను రేగుతుందా అని ఆసక్తికంటే భయంగా కూతుర్నుంచి వచ్చే మాట గురించి యెదరు చూస్తున్నాడు ఆచారిగారు.
సాయంత్రం ఆరున్నర అయింది టైం రాఘవ అరుగు మీద కూర్చుని పిల్లలకి ట్యూషన్స్ చెప్తున్నాడు. సునీత అప్పటికి వచ్చి గంటపైనే దాటింది. కుశల ప్రశ్నలయ్యాక అక్కా చెల్లెళ్లు కబుర్లల్లోపడ్డారు. ఆచారిగారు మనవడ్ని తీసుకుని అలాషికారుకు బయల్దేరాడు.
యేమే సునా ఆ బ్రహ్మచారికి యిళ్లిచ్చారు చూడు ఆ పిల్లలతో యెంతగొడవ చేస్తున్నాడో ఆ ప్రవేటు పిల్లల్ని పెట్టుకుని.
‘‘ఏదో పొట్టకక్కుర్తి అతను తింటూ వాళ్ళ అమ్మకి కొద్దో గొప్పొ పంపించాలి. మనిషి మంచివాడులే. ఎప్పుడైనా సహాయం కావాలంటే హనుమతుడిలా సేవలు చేస్తాడు. నాన్నకి కూడా ఆ అబ్బాయితో కాలక్షేపం అవుతూంది.’’
కాలక్షేపం మాటటుంచి ఆ పిల్లాడి ప్రవర్తన నాకేం నచ్చలేదు. మాటి మాటికి ఆ నిలువు గుడ్డేసుకుని యెలా యిటే చూస్తునానడు. జాగ్రతత్తగా వుండు నువ్వు.
‘‘నీకు యెవర్ని చూసినా అనుమానమే అక్కా అవునూ నేను అడగం మర్చిపోయాను బావ అలవాటు మార్చుకున్నాడా’’
సునీత అడిగినదానికి సుజాతకి ఓ క్షణం యేం అర్థం కాలేదు. సునీత మాట్లాడేదాంట్లో రెండర్థాలు వుండేట్టుగా ఓసారి మట్లాడుతుంది. సునీత యెందుకు అలా అడిగిందో తనకు తెలుసు. పెళ్ళి అయిన కొత్తలో సునీత తన యింటికొచ్చినప్పుడు తన బజార్లోపనివుండి బయటకెళ్ళింది అప్పుడు సునీత ఒక్కర్తే వుంది. తను వెళ్ళగానే ఆయన రావటం. సునీత ఒక్కర్తే వుందనీ వెనక నుంచి వాటేసుకోవటం. సునీత గట్టగా అరవటం. అప్పుడే తను రావటంతో ఆ సీన్ అక్కడితో కట్ అయ్యింది. లేకపోతే భర్త తన చెల్లెల్ని యేం చేసేవాడో యీ రోజుకి వూహకందటంలేదు. కాని ఆ రోజు రాత్రంతా సునీత తన దగ్గరే పడుకుని ఒకటే యేడుపు. తను యెంత వోదార్చినాతన యేడుపు మానలేదు. ఆఖరికి తను కూడా యేడ్చేసింది. అలా యిద్దరూ యెంత సేపు యేడ్చారో తమకేతెలియదు. ఆ మర్నాడు మాట వరసకి భర్త ముందు ‘‘యేమే మీ బావగారు నీతో చిన్న సరసానికి పోతే అంత గట్టిగా అరవాలా’’ అని అంది. కాని చెల్లెలు అప్పుడు యేం మాట్లాడలేదు. భర్త కూడా ఆ రోజంతా తప్పు సినవాడిలా తలయెత్తలేదు. ఆ రోజే సునీత బయల్దేరి వచ్చేసింది. కనీసం స్టేషన్ కి కూడా రాలేదు. తన భర్త.
‘‘ఏం అలవాటే’’ బియ్యం కడుగుతున్నదల్లా ఒక్కసారి గతం గుర్తుకువచ్చి చెల్లెల్ని అడిగింది సుజాత.
‘‘అదే ఆ మధ్య సిగరెట్లు మానేస్తున్నారు అని చెప్పావుకదా… మానేసారా లేదాని అడుగుతున్నాను.’’
ఎంతకైనా చెల్లెలు అంత త్వరగా మాట్లాడిన విషయం గురించి బయటపడదు. ఏదైనా క్లిష్టమైందిగా అడిగేటప్పుడు యెదుటి వాళ్ళ వూహకి రెండోజాబు తనదగ్గర వుంచుకుంటుంది. అది చిన్నప్పట్నుంచి దానికలవాటు. మనసులో మెచ్చుకున్నా అసలు సంగతి చెప్పనందుకు నొచ్చుకుంది సుజాత.
అలా ఆ రాత్రి వరకూ కులాసాగా గడిచింది యింట్లో. రాత్రి భోజనాలప్పుడు
‘‘నాన్నా ఆయన మళ్ళీ ఓ పది అడిగి తీసుకురమ్మన్నారు’’ సుజాత మెల్లగా గొణిగింది. అన్నం అసలు యెక్కటంలేదు తనకి అలాగే మెతుకులు కెలుకుతూంది.
ఆచారిగారు ఒక్కసారి ఆశ్చర్యపోలేదు. తను వూహించేదే జరిగింది. కాకపోతే తను అయిదనుకున్నాడు. కూతురు పదడుగుతోంది. సునీత ముద్ద పెట్టుకోబోతున్నదల్లా ముద్ద మింగుడు పడక అక్క మాటకి పాలపోయింది. సుజాత చెల్లెలి నెత్తిన మెల్లిగా మీటింది.
ఆచారిగారు యేం సమాధానం చెప్పలేదు. ఒక రూపాయా? అయిదు రూపాయలా? పదివేలు. ఇవ్వకపోతే ఓ గొడవ. ఇస్తే మళ్ళీ తనకేగొడవ యేం అర్థం కావటం లేదు. అన్నం సయించటంలేదు అలానే మెతుకులు కతికిలేచాడు.
‘‘నా దగ్గరా యేం లేవమ్మా ఎక్కడైనా ప్రయత్నిస్తా’’ అన్నాడు నెమ్మదిగా
ఆ మాటకి సుజాతకి కళ్ళవెంట నీళ్ళు ఆగలేదు. యేడుపు ఆపుకోవటానికన్నట్లు చీరకొంగు అడ్డుపెట్టుకుంది చెల్లెలు ఓదారుస్తూంది.
‘‘నాన్నా నేను యీ సంఘర్షణని భరించలేను. నాకు విడాకులు యేర్పాటు చెయ్యండి నాన్నా’’ సుజాత వెక్కి వెక్కి యేడుస్తూంది. సునీత చేయి కడుక్కుని అక్కని పొదివి పట్టకుంది. ఆచారిగారు కూడా కూతుర్ని ఓదార్చటాని కన్నట్లు దగ్గిర వచ్చారు. తండ్రి గుండెల మీద పడి బావురుమంటూ యేడ్చింది. ఆచారిగార్కి కూడా కళ్ళ నీళ్ళు ఆగలేదు. తను యేం చేయలేని స్థితి. అసహాయస్థితి.
‘‘బాధపడకమ్మా ఏదోలా చేద్దాంలే. బాధపడకు. డబ్బులు యెలాగో అలాగ సర్థి పంపిస్తాను నువ్వు సుకంగా వుండటమే నేను చూడాల్సింది. ఇప్పుడేమయింది అంత యెడుస్తున్నావు. మా వంట్లో రక్తం వున్నత వరకూ మా సహాయం మీకుంటుంది. దిగులుపడకు.’’
‘‘అవునక్కా భయంలేదు. డబ్బులు యిచ్చేపూచి నాది’’ చెల్లెలు సునీత కూడా అక్కకి ధైర్యం చెప్పింది.
సుజాత అలా వెక్కిళ్ళ మధ్య యెంతసేపు యేడ్చిందో తనకే తెలియదు.
‘‘అమ్మా సునీతా డబ్బులు ప్రయత్నం యేమన్నా ఫలించిందా’’ అడిగాడు ఆచారిగారు.
‘లేదు నాన్నా’’ నాలుగువేలే దొరికాయి.
‘‘మరి యెలా’’ ఆ మాటలో కూతురి సంసారం పాడయిపోతుందనో లేక పేపర్లో యేవార్త తను చదవకూడదో అదే తన కూతురి గురించి చదువుతానని భయమో ఆ వొక్క ప్రశ్న పదిప్రశ్నల్లా అనిపించింది సునీతకి.
‘‘ఏం చెయ్యలేం నాన్నా ప్రస్తత పరిస్థితుల్లో ఆ నాలుగువేలూ నా మెడలో వున్న మూడు తులాల గొలుసు యిచ్చేస్తాను.
‘‘గొలుసు యిచ్చేస్తావా’’ అని మరొ సమయంలో అడిగేవారు. అది తన భార్యది తను పంచిన నగలలో అది చిన్నమ్మాయికి వచ్చింది. కాని అది యీ రోజు పెద్దమ్మాయికే చెందుతుంది క సునీత మెడ బోసిగానే వుంటుంది. తను చూసి భరించాలి. ఏం చెయ్యలేడు. భగవాన్ యిటువంటి కష్టం యెవరికీ రాకూడదు. మనసులో మూగగా రోదించాడు.
‘‘సరే నీ యిష్టం’’ అని పైకి మాత్రం అన్నాడు. అంతకంటే తను యేం అనగలడు వయసయిపోయింది. ఇంకొకరి మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. పెళ్ళి చెయ్యాల్సిన కూతుర్నుంచి తను భుక్తి పొందుతున్నాడు. ఎంత విచిత్రం. అదే కూతురు తన అక్క మొగుడి కోర్కెను తీరుస్తుంది. అమ్మా సుజాతా యిది గొప్పతనం కాదమ్మా అది యేవన్నా వుంటే మీ చెల్లెల్ది. దానికి మనం చిన్నదైపా దణ్ణంపెట్టాలి’’ మనసులో అనుకుంటున్నట్లుగా గొణుక్కున్నాడు ఆచారిగారు.
ఆ రోజు రాత్రి ఆచారిగార్కి, యింట్లో యెవరికీ నిద్రపట్టలేదు. తెల్లారితే ఆదివారం. సుజాత ప్రొద్దున ట్రైన్ కు బయల్దేరుతానంది. ఆచారిగారు కాదనలేదు. కూతురు సుఖంగా వుండటమే తనక్కావాలి.
ప్రొద్దున్న –
‘‘అక్కయ్యా యిదిగో డబ్బు’’ అంటూ సునీత కొంత డబ్బుని, గొలుసుని అక్కయ్య చేతికందించింది.
సుజాతకి అర్థం అయ్యింది. డబ్బులు అందుబాటుకు రాలేదని. అవును యెక్కడ తీసుకొస్తారు వాళ్లు మాత్రం. తన సంసారం నిలబెట్టడం గురించి తన చెల్లెలు తన గొలుసుని కూడా యిచ్చేసింది. యింత దుర్భరస్థితి యే స్త్రీకి వద్దు. తీసుకోలేక తీసుకుంటున్నట్లు పెదవుల మధ్య యేడునుపు ఆపుకుంటూ పెట్లో పెట్టుకుంది సుజాత.
ట్రైన్ బయల్దేరి వెళ్లే వరకూ అందరికీ భారంగా గడిచాయి క్షణాలు. నిమిషాలు.
సుజాత మర్నాడే తిరిగి తండ్రి దగ్గరకు వచ్చేసింది.
‘‘ఏమ్మా డబ్బులు చాలలేదా’’ అడిగారు.
సుజాత మాట్లాడలేదు. ‘‘ఏమయింది అక్కయ్యా’’అడిగింది సునీత.
సుజాత సమాధానం చెప్లేదు. సునీత అక్క చేతిలో బాబుని తీసుకుని ఎత్తుకుంది. ఆచారి గార్కి కంగారుగా వుంది.
‘‘ఏమయ్యింది చెప్పమ్మా’’ వణుకుతున్న కంఠంతో అడిగారు.
సుజాత పెట్టె తీసి డబ్బులు, నగ తీసి తండ్రికిచ్చేసింది.
‘‘నాన్నా అసలు యన దగ్గరకే వెళ్ళలేదు. నేను ఆయన్ని వదిలేయాలని అనుకుంటున్నా నేను తీసుకున్న నిర్ణయం యిది. మీకు అభ్యంతరం అయితే చెప్పండి నేను యిక్కణ్నుంచి వెళ్ళిపోతాను. నా పొట్ట నేను పోషించుకుంటూ నా కొడుకును చదివించుకోగలను మనిషి మనసుంచుకుని మాటమాటకి చచ్చేకంటే ఒకసారి మనసును చంపుకోవటం వుత్తమం. మీరు విడాకులకు యేర్పాటు చేయండి’’ అంటూ లోపలికి వెళ్ళిపోయింది.
ఆచారిగారు, సునీత ఓ క్షణం అలాగే వుండిపోయారు. ఏడ్వాలో, సంబరపడాలో తెలియని పరిస్థతి.
పశ్చిమాన ఎర్రటి సూర్యుడు నవ్వుతూన్నట్లుగా క్రిందికు దిగుతున్నాడు. అప్పుడే వచ్చిన రాఘవ వరండాలో లైటు వేశాడు.
‘‘ఇలా చీకట్లో నించుండిపోయారే’’
‘‘లేదు నువ్వు లైటు వెయ్యకముందే వెలుగొచ్చింది యింటికి’’ అన్నారు ఆచారిగారు.
రాఘవకి ఆ మాటలో అర్థం గోచరించలేదు.
———–