పేరు (ఆంగ్లం) | Boddu Bapiraju |
పేరు (తెలుగు) | బొడ్డు బాపిరాజు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | బొడ్డు వేంకట వేంకటసుబ్బారాయుడు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1912 |
మరణం | – |
పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శ్రీ చందనాలు (ఖండకావ్యము), కలిక (కథా సంపుటి), విపంచి (ఖండకావ్యము), కాత్యాయిని (బాల గేయసంపుటి), కాక విలాసము (పద్యకృతి) కథలు: ఆదెమ్మపిన్ని గేదె, ఏకోదరులు, కలసిన సంబంధం, గాలివాలు, గురువాక్యము, దయ్యాన్ని… ధనమూలమ్ |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బొడ్డు బాపిరాజు |
సంగ్రహ నమూనా రచన | చల్లని వెన్నెల కురుస్తున్న చందమామని కారు మబ్బు కబళించినట్లయింది. మహేంద్రకు మాలతి మాటలు వినగానే ఆనందం చిందులాడుతూ వున్న ముఖాన చీకట్లు ముసిరాయి. మాలతని మొదటిసారి చూచినప్పుడే యిన్నాళ్లూ తను వెదుకుతున్నదీ తీవకోసమే అనుకున్నాడు. పాణిగ్రహణంతో అనురాగ ద్వరాలు తెరుచుకొన్న అతని హృదయమందిరంలో అడుగుపెట్టిన ఆనంద కిరణాలు అదృశ్యమయిపోయాయి మాలతి మాటతో. వచ్చిం దనుకొన్న వసంతాన్ని అకాల శిశిరం ఆక్రమించినట్లయింది. కానిపని కల్ల ముందు జరిగిపోతూ వున్నట్టు మహేంద్ర మనస్సులోనే మధనపడిపోతూ వున్నాడు. |
బొడ్డు బాపిరాజు
పన్నీటి ఊట కన్నీటిబాట
చల్లని వెన్నెల కురుస్తున్న చందమామని కారు మబ్బు కబళించినట్లయింది. మహేంద్రకు మాలతి మాటలు వినగానే ఆనందం చిందులాడుతూ వున్న ముఖాన చీకట్లు ముసిరాయి.
మాలతని మొదటిసారి చూచినప్పుడే యిన్నాళ్లూ తను వెదుకుతున్నదీ తీవకోసమే అనుకున్నాడు. పాణిగ్రహణంతో అనురాగ ద్వరాలు తెరుచుకొన్న అతని హృదయమందిరంలో అడుగుపెట్టిన ఆనంద కిరణాలు అదృశ్యమయిపోయాయి మాలతి మాటతో. వచ్చిం దనుకొన్న వసంతాన్ని అకాల శిశిరం ఆక్రమించినట్లయింది. కానిపని కల్ల ముందు జరిగిపోతూ వున్నట్టు మహేంద్ర మనస్సులోనే మధనపడిపోతూ వున్నాడు.
‘అబ్బా’ అంటూ బాధతో భర్త నోటినుంచి వేలు లొక్కుని పడిన గాటమీద నోటితో వూదుకొంటూ
‘ఏమి టా మోటు సరసం’ అనబోయి భర్త మొగం వేపు చూచిన మాలతికి మాట పెగల్లేదు. ఎంతో సిగ్గుతో చెప్పలేకచెప్పిన తన మటకు ఎంత హంగామా చేస్తారో అనుకొన్నదే కాని యిలా కళ తప్పిన మొగంతో భర్త కళవళపడడం ఆ ముగ్ద హృదయానికర్థం కాలేదు.
ఏమిటలా అయిపోయారు? ఏదన్నా బాధగా వుందా అండి?’ పొంగి వస్తున్న దుఃఖాన్ని మ్రింగుకుంటూ మాలతి అడిగే మాటలు వినిపించుకొనే స్తిమితంలో లేడు మహేంద్ర.
పూసిన పుచ్చతోటలా ఆకాశం అలుముకున్న తెల్లని వెన్నెట్లో పడక కుర్చీలో పవళించి, ఈ ఆషాఢం అన్నాళ్లూ తన కోసం ఎంత తపించిపోయింది తనెన్నిసార్లు కలల్లో కనిపించి కవ్వించిందీ కమ్మగా కబుర్లు చెబుతూ వున్న భర్త ప్రక్కన పేము కుర్చీలో కూర్చుని ముసిముసి నవ్వుల్తో వింటూ, వక్కపొడి అందించి కవటాకులేరి సున్నం రాసి నెలు తీసి తమలపాకు చిలకలు చుట్టి నోటి కందిస్తున్న మాలతి చెప్పనావద్దా అనుకోవడంలో ఎరుపెక్కిన చెక్కిళ్లూ విచ్చుకుంటూ వున్న పెదవులు చూస్తూ అడగవే అడిగాడు మహేంద్ర.
‘ఏమిటోయ్ ఆదేఁహాస్యం? ఈ దాసుని చెవిన కూడా పడనీయి. నీకే పుణ్యముంటుంది.’
మాలతి వస్తూ వున్ననవ్వును పెదవుల్లోనే బిగించి ‘ఏమీ లేదు లేదండీ’ అంటూనే పవడంలా పండిన నోరు పెనిమిట చెవిదగ్గర పెట్టి మంద్రంలో సరిగమలు పలికినట్లు మీకు అబ్బాయ్ కావాలా? అమ్మాయ్ కవాలా? అంటూ మాట ముగించకుండానే సిగ్గులో మునిగిపోయింది.
అంతే వినరాని మట విన్నట్లు కంగారు పడిపోయి మడుపు లందిస్తూ వున్న మాలతి వేలు కసిక్కిన కొరికాడు మహేంద్ర.
మహేంద్ర మంచివాడే. ఆలోచనకన్నా ఆవేశం పాలెక్కువ. ఇష్టానిష్టాల్ని మనసు ఏ భూతద్దంతో చూస్తుందో మరి. అందరికీ అతి సామాన్యమయిన విషయమే అతనికి వింధ్య పర్వతంలా పెరిగిపోతుంది. అతని అభిరుచుల్ని మెచ్చకున్నా బలహీనతల్ని హర్షించలేం. రచయిత కాలేదు కాని అతి భావుకుడు. వూహా శిఖరాగ్రాల్లో ఉయ్యాలలూగే సౌందర్య ప్రియుడు. కనుక కాబోయే పెళ్లిని గురించి, రాబోయే ఇల్లాలని గురించి, సాగించే ప్రణయ జీవితాన్ని గురించి, వేగించి విరహరాత్రుల్ని గురించి రంగు రంగుల చిత్రాలెప్పట్నించో వూహాఫలకాల మీద చిత్రించుకుంటూ వస్తున్నాడు. ఆ చిత్రంలో ఏ రేఖ మారినా ఏ రంగు చెదరినా అడెంతో దురదృష్టంగా తల్లడిల్లిపోయే తత్వ మతనిది. ఇవన్నీ ఆంతరంగిక విషయాలు. బహిరంగ విషయం, దమైనవాడు పట్టభద్రుడు అవసరం కన్నా అధికంగా గడించిపోయిన పితృపితామహుల ఆస్తకి ఏకైక వారసుడు.
బంగారు పంజరంలోని ఆ గోరువంక పెండ్లీడుకెదిగిన రామచిలుకల కన్న తండ్రుల కెందరికో కన్నులూరించింది. చాకచక్యంగా పట్టుదారాల్తో ఉచ్చులు పన్నారు. ఏ గాలానికి చిక్కలేదా బంగారు చేప.
‘ఇక మనవాడికీ జన్మలో పెళ్లికాదు. భూమండలంలో వాడికంటికి నచ్చే పిల్ల యింకా పుట్టలేదు. బ్రహ్మదేవుడు వాడి కోసం ప్రత్యేకంగా ఓ పుత్తడిబొమ్మను సృష్టిస్తున్నాడంటూ మహేంద్రను గురించి చెప్పుకుని నవ్వుకుంటూవుండే లోగానే బంధుమిత్రులందరికీ సకుటుంబ సపరివారంగా విచ్చేసి నవదంపతుల నాశీర్వదించ వలసిందిగా శుభలేఖ లందాయి.
పెండ్లిపీటల మీద మాలతిని మహేంద్రను చూచిన బంధుమిత్రులంతా ‘నిజంగా దేవకన్యే దిగి వచ్చిం’దనుకున్నారు. అందరి కన్నా మహేంద్ర అక్క సుభద్ర మరదల్ని చూస్తూ మురిసి ముప్పందుమయింది. ఈ శుభం చూడకుండానే దాటిపోయిన తండ్రిని తలుచుకుని ఉబికిన కన్నీళ్లెవరూ చూడకుండా చెంగుతో అద్దుకుంది.
మనుగుడుపుల్లో ఆకాస్త అడ్డు తీరిందనిపించారు. ఫలప్రదానా లందుకుని మంగళారతి అద్ది అఓతలుంచిన పెద్ద ముత్తయిదువ ‘అష్టయిశ్వర్యాల్తో – అయిదువతనంతో కడిపెడు బిడ్డల్నికని కలకాలం సుఖించం’డని దీవిస్తున్నప్పుడు మహేంద్ర కపశకునం ఎదురువస్తున్నట్లనిపించింది.
మెరుపుతీగలా మెరిసిపోతూ మల్లెపూలజడతో మత్తెక్కిస్తున్న సౌరభంతో పరిగంచు చీరతో క్షీరసముద్రంనుంచి బయలుదేరివచ్చిన శ్రీదేవిలావున్న మాలతిని చేత్తల్తో చుట్టివేస్తూ ‘మరో రెండు చేతులుంటే బాగుండు’ ననుకున్నాడు. ఆ అందాన్ని తనివితీరా చూడ్డానికి ‘వెయ్యి కళ్ళున్నా చాల’వనుకున్నాడు మహేంద్ర. చంద్రకిరణం చెంగలువతో మంతనాలాడినట్లు, మహేంద్ర తియ్యగా చెపుతూవుంటే, మాలతి పారవశ్యంతో వింటూవుంటే, వాళ్ల కళ్లలోని రుపుజీరలు తూరుపు కొండ కొసల్ని వెలిగించాయి.
మాలతికి మనస్సిచ్చివచ్చిన మహేంద్ర తనయింట ఒకకాలు అత్తవారింట ఒక కాలుగా ఆమూణ్ణెల్లూ ఎల్లాగడిపాడో రైల్వేవాళ్లకే తెలియాలి. వచ్చినప్పుడల్లా వెయ్యి కలల్ని వినిపిస్తూ మొయ్యలేనంత విరహం మూటకట్టుకు వెళ్లేవాడు.
ఆషాఢం అతని ప్రాణానికి ఆడకత్తెరలా దాపురించింది. ఆ నెల్లాళ్లూ ముత్యాలు ముగ్గులు పెట్టినట్టు మాలతికి వ్రాసిన ఉత్తరాలకన్నా నచ్చక చించివేసినవే ఎక్కువ. అంతకన్నా వ్రాయాల్సి నీ మనస్సులో మిగిలిపోయినవీ మరీ ఎక్కువ. ఆతని విరహతాపాన్ని తీర్చే చల్లని చినుకుల్తో, నీలిమబ్బుల మేలిముసుగు సవరించుకుంటూ శ్రావణం రానేవచ్చింది. ‘ఈసారి తనతో మాలతిని ఎలా అయినా తీసుకువెళ్ళా’లన్న సిరసంకల్పంతో అత్తవారింటికి వచ్చి వ్రాలాడు మహేంద్ర.
కొండంత కోరికల రెక్కలు గట్టుకు వచ్చిన మహేంద్రకు మాలతిమాట వజ్రాయుధంకన్నా వాడిగా తగిలింది. అప్పుడే తండ్రి అనిపించుకోవడమేకాదు అసలు తండ్రినిపించుకోవడమే అతనికిష్టం లేదు క్రొత్త తీవలకు మొగ్గులు తొడిగే ప్రకృతి ధర్మం అతని యిష్టానిష్టాలన్ని పాటించే బాధ్యత కాని, కనికరం కాని వహించలేదు పాపం.
సున్నీ పసుపుతో ఇల్లు నిండిన సారె సామానుతో నిండుగా వచ్చిన మరదల్ని చూస్తూనే తన కొడుక్కప్పుడే పెళ్లాం వచ్చినట్లు ఉబ్బిపోయింది సుభద్ర. ‘ఓయ్ మరదల మాణీక్యం మీ అల్లుడు పెళ్ కావాలంటున్నా డమ్మాయ్. ’పట్టి నిస్తాపాడావు నిస్తా’నని పెళ్లిలో బొమ్మనప్పగించావ్ గుర్తుందా’ అన్న వదినగారికి మాలతి ముసి ముసి నవ్వులే సమాధానాలయాయి. ‘ఎవరయితే నేమిలే అమ్మా ఆ చెంబురు నీళ్లూ చల్లగా పడితే చాలు ‘తొలిచూలు కొడుకూ, తొలికాపు పంటాఅంటా’రంటూ పక్కింటి పిన్నిగారన్నమాట ‘కంతే నండమ్మగారు’ అన్న చాకలి ముత్తయిదువు బియ్యం కొబ్బరి కాయా ఎఱ్రనీళ్లు మాలతికీ దిగదుడిచి దిష్టితీశాక కుడికాలు లోపల పెట్టింది క్రొత్తకోడలు.
కోడలు అడుగు పెట్టడంతో ఇంటికి క్రొత్త కళ వచ్చిందంటే వచ్చిందన్నారు నలుగురూ. మహేంద్ర మనస్సులో ముల్లుగ్రుచ్చుకున్న విషయమెవరికీ పట్టలేదు.
‘అదృష్టవంతురాలిని నీ కడుపున మీ మామాగానే వెలుస్తార్లె. వయసులో కన్నకొడుకూ, వయసులో గడించిన ధనం తండ్రి కదున్లో అక్కరకొస్తా’యంటూ ఎందరెంత ముచ్చటపడ్డా, భర్త ముభావం మాత్రం మాలతి గుండెలో కెలుకుతూనే వుంది. ఆయన స్వభావం అంతేలే’ అని సరిపెట్టుకోలేక పోతూవుంది. తనంటే వున్న ఆ మమతలూ ఆప్యాయతలూ అన్నీ వట్టి నటనలే అనుకోలేకపోతూవుంది. నలుగురూ ఆనందించే వియంలో ఉభయుల మధ్యా జరిగిన తెర ఎణ్నాళ్లకు లేస్తుందో మరి? అయినా తన తప్పేమిటి? అన్న ఆలోచనల్లో మల్లగుల్లాలు పడుతూ మాలతి ఎంతగా అడిగినా మహేంద్ర సూటిగా తన మనస్సు విప్పలేకా చెప్పలేకా నలిగిపోతున్నాడు.
మల్లెపూవులన్నా మామిడిపళ్లన్నా అసహ్యపడే వాళ్టెందరులేరు. ‘ఆ అసహ్యం ఎందు’కని ప్రశ్నిస్తే కారణం వాళ్లే చెప్పలేకపోవచ్చు. కాని, కారనంలేని కార్యం అంట వుండదన్నది యథార్థం.
మహేంద్రకు పిల్లలమీద అసహ్యమే కాదు, అక్కసు కూడాను. వాళ్లు తల్లి ఆరోగ్యాన్ని, అందాన్ని బలి తీసుకంటారనీ, తండ్రి సుఖశాంతుల్ని దూరం చేసాతరనీ, విషబీజా లతనికి తెలియకుండానే హృదయంలో మొలకలెత్తాయి. సృష్టికి ఫుల్ స్టాఫ్ పెట్టే భావం లోకకళ్యాణానికి వేరుపురుగన్నది తెలయిని అవివేకాన్ని ఎవరు హర్షిస్తారు? బాబిగాడు పుట్టినప్పుడక్కయ్యతో అంటే, ‘పోరా పిచ్చిమాలోకం ఇప్పుడు కాదు రేపు నీకు పుట్టినప్పుడు తెలుసుతందాతీపి’ అని తేలిగ్గా నవ్వేసింది.
తొమ్మిది నెలలు ఆహారంలో ఆహారం, తన రక్తంలో రక్తం పంచిస్తూ పడరాని పాట్లుపడుతూ ఏ మెప్పూ కోరకుండా అన్ని నొప్పులూ సహించి ఆ పసినోటికి వెచ్చని రొమ్ము అందించి వాత్సల్యాన్నంతా పాలుగా పట్టించే క్షమాస్వరూపిణి మాతృమూర్తి ఆ ఆనందంకోసం ఎన్ని తపస్సుల నన్నా ధారపోస్తుందని ఊమించగల హృదయం ఎందరి తండ్రుల కుంటుంది? కడుపున పుట్టిన బిడ్డలకే అది తీర్చలేని రుణం అన్నది గుర్తుఁడదే.
మహేంద్రకు సుభద్రక్క అంటే అమ్మకన్నా ఎక్కువే. అసలమ్మరూపం మనస్సులో అచ్చుపడీ పడకముందే ఆ యమ్మ కన్నుమూసింది తల్లి పోయేనాటికి మహేంద్రదకు ఏడాది వెళ్లింది. సుభద్రకు పదకొండేళ్లు వచ్చాయి. పాపం ఆ పిల్లే ఇంటిదీపం ఆరిపోయి దిగజారిన తండ్రికి ఆసరాగా, తమ్ముణి, ప్రాణమొకెత్తుగా పెంచి పెద్ద చేస్తూవచ్చింది. ప్రక్కలో వేసుకొని పడుకొనేదాకా పాటలుపాడి నిద్రబుచ్చింది. గుజ్జు ముద్దలూ గోరుముద్దలూ చందమామను రమ్మంటూ వెల్లిస్తూ తినిపించింది. పాఠాలు చదివించింది. బడికి పంపించింది. ఒక్కనాడూ పల్లెత్తుమాటనకుండా అమ్మ వాత్సల్యం తన సౌభ్రాత్రం కలబోసి ఇంతవాణ్ణి అంత వాణ్ణి చేసింది. ఆ తమ్ముణ్ణి చూసుకుని మురిసిపోయింది. ఆ అక్కతమ్ముళ్ల ఆత్మీయత చూచి తండ్రి తృప్తిగా గాలిపీల్చాడు. తమ్ముడికి అక్కచూపు సుగ్రీవాజ్ఞ. అక్కమాట వేదాక్షారం. అక్కంటే ఆరోప్రాణం.
సిరీ సంపదా వున్న కుటుంబంలో బుద్దిమంతుడైన కుర్రవాణ్ణి తెచ్చి సుభద్రకు మూడు ముళ్లూ వేయించి ‘తలమీద బరువు దించుకున్నా’ ననుకొనే అంతలో బ్రహ్మదేవుడు ఆ తండ్రి ఆకుకాస్తా చించివేశాడు.
తండ్రి పోయినప్పట్నించి ఆ అక్కా బావలనే యింటికి కప్పులా కంటికి రెప్పలా కాపాడారతణ్ణి. బావగారి యాజమాన్యంలో భూమిపుట్రా డబ్బూ దస్త్రం, అక్కయ్య అజమాయిషీలో చదువూ సౌజన్యం పెరిగి మనిషయ్యాడు.
అక్కయ్యకు నెల తప్పిందంటే మహేంద్ర తనూ సంతోషించాడు. కాని మూడో నెలలోనే అక్క తిన్నది ఆలస్యంగా వెళ్లబోసుకుంటూ వేవిళ్లతో బాధపడుతూవుంటే, ఆ కడుపులో శిశువుమీద అతనికేదో కోపంగా వుండేది. అక్కయ్య యిదివరకుమాదిరి తిరగలేకపోయినా, అంతనడుం నొచ్చినా, ఇంత నీరసం హెచ్చినా, తల నొప్పికీ తగని బద్ధకానికీ అన్నింటికీ ఆ కడుపులో వాడిమీదే కక్షగా వుండేది. దానికి తోడు సుభద్ర కాన్పుకూడా కష్టమే అయింది హాస్పిటల్లో చేర్చారు. పెద్ద ప్రాణం కూడా దక్కదేమో అన్నంత పనయింది. ఏ దేవుడో మ్రొక్కిన మ్రొక్కులు విని చక్రం అడ్డు వేశాడు. తల్లీ పిల్లడు నెల తిరక్కుండానే సలక్షణంగా ఇంటికి చేరుకున్నారు. అక్కయ్య ప్రాణాల్తో దాగుడుమూతలాడిన ఆ పిల్లడంటే అసహ్యం వేసేది. అక్క పిల్చి ‘ఎలా నవ్వుతున్నాడో చూడు మహీ అచ్చు నీ పోలికే మేనమామ పోలికా మేనత్తచాలికా అంటూ రూరికేపోదు’ అంటె ‘ఇదో క్రొత్త న్యూసెన్సు’ అనుకుంటూ మంచంకేసి మొగమన్నా త్రిప్పకుండా వెళ్లిపోయేవాడు. ఇంట్లో వుచ్చమడుగులు చూచినా, దొడ్లారవేసిన బాబు గుడ్డల్ని చూచినా ఏవగించుకొనేవాడు. పసివాడు పోరు పెట్టి ఏడుస్తుంటే ‘ఇదెక్కడి తద్దినంరా భగవంతుడా’ అనుకొన్నా అక్కయ్యతో మాత్రం ఏమీ అనలేకపోయేవాడు. ముదం కంపుతో అక్కయ్యను చూస్తే కడుపులో దేవేది. కాని అతని అసహ్యాన్ని అక్కయ్యంటే వున్న అభిమానం అంకుశంలాగా అదుపులో పెట్టేది.
ఆ నెలల పిల్లాడికి ఉగ్గూ పాలూ ఏదీ క్షణం ఆలస్యంకాకుండా వాడు ‘కుంయ్’ మంటే ‘వస్తున్నారా చిట్టి తండ్రీ’ అంటూ మాజర్ సేవలు చేస్తూ బావగారి అవసరాల్ని అశ్రద్ధచేస్తూవుంటే అక్కయ్యమీద జాలీ కోపం కలిగేవి మహేంద్రకు.
ప్రసవించాక అక్కయ్య రూపే మారిపోయింది. బారెడు పొడుగూ పట్టుకుంటే పట్టెడుండే ఆ జుట్టు ఏమయిపోయిందో చిక్కి చిక్కి చివరకు ఎలుకతోకలా తయారయింది. పసిడి శిలాకలా వుండే లావణ్యం లావెక్కి మనిషి మంధరగిరిలా అవుతూ వుంది. తను చదువుకుంటూవుంటె విశ్రాంతిగా వచిచ అదీ ఇదీ మాట్లాడే అలవాటు వాడి పుట్టకతో బందైపోయింది తను వద్దంటూవున్నా రాత్రిళ్లు పాలు తెచ్చి త్రాగందే వదిలిపెట్టని ఆ అక్కయ్యే ‘మహీ పాలు త్రాగి పడుకో బాబేడుస్తునానడురా, మర్చిపోవద్దు’ అంటూవున్నదీ రోజున.
ప్రతి అల్పవిషయం ఇంత ఆజ్యం పోస్తూ రోజుకు రోజు కతని ద్వేషాన్ని రాజుకునేట్టు చేసింది. అప్పట్నించీ మహేంద్ర మనస్సులో పిల్లలంటే ఆరని వైరం తీరని కసీ గూడు కట్టుకున్నాయి.
మహేంద్ర మాలతితో మనస్సలో మాట చెప్పలేకపోతున్నాడు. ‘ఎందుకూ ఈ పిల్లాపీచు అప్పుడేమన’ కంటూ విసుక్కుంటాడు చిరాగ్గా. ‘దేవుడిచిచందానికి మనమేం చేస్తాంచెప్పండి. ప్పుడు వద్దనుకుని కావాలన్నప్పుడు కొనితెచ్చుకోవడానికిదేమన్నా బజారుసరుకా అండి మా శాంతక్క పిల్లలకోసం చెయ్యని వ్రతం మ్రొక్కని దేవుడూ లేడు’ అంటుంది మాలతి.
ఇంటి డాక్టర్తో ఎబార్షన్ కోసం సలహాసంప్రతింపులు చేశాడు. ‘ఈ పిచ్చిపనుల్తో ఏ టెటానెస్సన్నావస్తే అసలు ప్రాణానికే మోసం తెలుసా’ అంటూ మెత్తగా మందలించి పంపాడు. నా వాళ్లనుకున్నవాళ్లతో ఆలోచనడిగితే ‘ఎందరున్నారనిరా తొలిబిడ్డకే అంతలా అఘోరిస్తావెందు’కని చనువుగానే ‘పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకో’కని కొరడా ఝళిపించారు. డబ్బకు కానిపని వుండదులే అనుకొని తన అభిప్రాయం మాలతితో చెప్పాడు వుండబట్టలేక. నిప్పులు త్రొకికనట్లు అదిరిపోయి అతని మొగం చూస్తూ ఏడ్పు ప్రారంభించింది. రెణ్ణాళ్లు అన్నం నీళ్లూ ముట్టకుండా అటమటించే మరదల్ని ఆరాతీసి సుభ్రద తమ్ముణ్ణి తలవాచేటట్లు చివీట్లు పెట్టి నయభయాల నచ్చచెప్పి మళ్లా అటువంటి ప్రస్తావన తేకని తమ్మడితో ఒట్టు పెట్టించిమరీ వదిలింది.
కలిగిన వారింటి ఆడబడుచు కడుపుతో వున్నదంటే ఎన్నో అచ్చటూల ముచ్చట్లూ వుంటాయి. సీమతంతమేకాదు పూలముడుపూ సూడిదలు ఏవి జరపాలన్నా అటు అత్తవారితో ఇటు అక్కయ్యతో వద్దంటే వద్దని భీష్మించాడు. ‘ఆయన కంత యిష్టంలేనప్పుడెందుకు లెండీ’ అని మాలతే సర్దిచెప్పింది. నెలకు నెల పైబడుతున్నకొద్దీ పచ్చని గన్నేరుపూల చెండులా బంగినపల్లి మామిడి పండులా కంటికి నిండా కనిపించే మాలతిలో ఏవేవో దుర్ఘటనలూ దుశ్శంకలూ ఊమించుకుంటూ క్రుంగిపోయేవాడు మహేంద్ర.
మాలతి తల్లి వచ్చి శాస్ర్తానికింత చలిమిడి వొళ్లో పెట్టి పురిటికి పుట్టింటికి తీసుకెళ్లేరోజు, వెడుతున్నట్టు చెప్పి వెళ్లడానికి గదిలోకివచ్చిన మాలతి రెండు చేతుల్లో మొగం దాచుకొని పసిపిల్లవాడిలా ఏడ్చేభర్త నెలా ఓదార్చాలో తెలియక తికమకపడుతూ కంటినిండా నీళ్లు తెచ్చుకుని ‘ఆనీళ్లు కాస్తా పడ్డాక నెల తిరక్కుండా వస్తే సరికదా’ అంటూ అతని కన్నీళ్లు తుడిచి నెన్నుదురు ముద్దుపెట్టుకుని ‘ఏం మనిషో ఏదొచ్చినా విపరీతమే’ అన్న స్వగతాన్నే ప్రశాంతంగా అంటూ విడవలేక విడవలేక విడిచిపెట్టే, పెనిమిటి కౌగిలి నెమ్మదిగా విడిపించుకొని వెళ్ళే మాలతిని మళ్లీ కళ్లారా చూస్తానా అంటూ కలవరం, ఏదో తెలియని భయం పట్టుకుంది మహేంద్రను.
ఒక చల్లవేళ మాలతి తేలిగ్గా ప్రసవించినట్టు తల్లీ పిల్లడు కులాసాగా వున్నట్టు టెలిగ్రాం వచ్చింది; అతనూ హించుకున్న ఆశుభాల్నీ అనర్థాల్నీ అన్నిట్నీ అపహాస్యంచేస్తూ. ఒకసారి వెళ్లి చూచి రమ్మని సుభద్ర ఎంతచెప్పినా వెళ్లనంటే వెళ్లనన్నాడు. వెడితే మాలతి ‘ఏ ఆకారంలో కనిపిస్తుందో’ అని ఏరీకోరీ తెచ్చుకున్న ఆ అందాలన్నింటికీ ఆఖరి అంకం వచ్చిందిలే’ అనుకున్నవాడెలా వెళ్లగలడు. వచ్చి బారసాల చేసుకోవలసిందని వ్రాసిన మామగారికి మా ఇంటానవాయి తీలేదని వ్రాశాడు.
మాలతి అన్నప్రకారం నెలలోగానే తిరిగి అత్తవారింట అడుగు పెట్టింది పసి వాణ్ణెత్తుకుని. భ్రూమధ్య విభూతిరేకా, కొసతీర్చిన కస్తూరీ తిలకం, కండ్లకు కాటుకా చెవిలో దూదీ తాంబూలంతో ఎరుపెక్కిన పెదవులూ నడికట్టూ మనిషికి మాతృగౌరవాన్ని కలిగిస్తు పాలిండ్లూ అన్నిటకన్నా ఆకళ్లలో తల్లి నయానన్నతృప్తీ వీటితో ‘చక్కనమ్మచిక్కినా అందమే’ అన్నట్లున్న మాలతి నయన చంద్రికలా వుంది మబ్బును చూచిన మయూరంలా తాండవించి పోయాడు మహేంద్ర అతని కళ్లలో ఆనంద జ్యోతుల పురివిప్పాయి. చేతులువాచి మాలతిని దగ్గరక చేర్చుకుంటూ ‘మాలతీ’ అన్నాడు చెవిలో ఏమి చెప్పేవాడోమరి అంతలోనే గదిలోవేసిన పట్టె మంచంమీద పొత్తిళ్లలో బాబు సన్నగా సంగీతం సాగించాడు. ‘బాబులేచాడు వస్తానంటూ మాలతి భర్తచేతులు విడిపించుకుని వెళ్లింది. మహేంద్ర హృదయముడికిపోయిం తిరిగి చూడకుండా గదిలో నించి దూసుకుపోయాడు.
ఆ మర్నాడు బాబు మంచం గదిలోనించి మారిపోయిం వచ్చి పదిరోజులయినా పన్నెత్తి పల్కరించనూ లేదు కన్నెత్తి చూడనూలేదు. బాబుకు పాలుపట్టి నిద్ర బుచ్చి మాలతి వచ్చేవరకు అలా గుమ్మానికి కళ్లప్పగించి కనిపెట్టుకుని వుండడం నిత్యకంటకంగా వుంది అక్కడికీ భర్త పరిచర్యల కడ్డురాకుండా బాబు పనులు సర్దుకుపోయినా ఆ నోరూచేయిలేని వాడు ఎప్పుడేపని పెడతాడో ఎలా తెలుస్తుంది. ఎప్పుడేకొంచెం బాబు తనమీద డుస్తున్నాడన్నట్టూ బాధపడేవాడు మహేంద్ర.
ఒకరోజు మాలతి వద్దంటున్నా వినకుండా పట్టు బలవంతాన బాబును తెచ్చి తినడానికే కూర్చోపెట్టింది. ఆ పసివాడు బట్ట తడిపి డుపు కోపగించుకున్నాడు. ఎక్కడ ఎత్తి పడేస్తాడో ఆ చిరాకు మనిసంటూ సుభద్ర హడలిపోయి బాబుతు తీసుకుంది.
బాబు నెత్తుకువచ్చిన క్రొత్తలో ఇరుగమ్మా పొరుగమ్మా పనసలతొనలావున్న బాబునుచూచి ఎంత ముచ్చడటపడ్డా, అసలైన కన్నతండ్రి ఆదరింపు లేకపోయాక ఏం ప్రయోజనమనుకొనేది. కొడుకుమీద ద్వేషం అయిష్టం ఎందుకో అర్థం అయేదికాదు. తలవల్ల తప్పేదన్నా వున్నదంటే అదీ కన్పడదు. బాబును కనడమే తప్పనుకుంటే తనేం చేయగలదు? ఒంటరిగా తనతో గంటలతరబడి కబుర్లు చెప్పుకుపోయే మనిషి బాబు చకంలో వుంటే చాలు తప్పించుకుపోతాడు. ఆపసికందుచేసిన పాపమేమిటో ఆయన కంత పలకరించరాని అపకారం చేశాడావాడు. ఇలా ఆలోచనల్తో వేగిపోయేది మాలతి.
రోజులు గడుస్తున్నాయి. ఆగర్భ శత్రువుల్లా వున్న ఆ తండ్రీ కొడుకుల మధ్య ఆడకత్తెరరో పోకచెక్కలా వున్నది మాలతి పని. నోరులేని ఆ కన్నవాణ్ణి నీళ్లూపాలూ చూడకుండా విడిచిపెట్టి వూరుకోనూ లేదు. తనంటే ప్రాణమిస్తున్న పెనిమిటిని ఒప్పించనూలేదు, నొప్పించనూలేదు. ‘ఆయన మనస్తత్వం అంతే’ అని పరిపుచ్చకున్నా కన్నపుత్రుని ఎత్తుకుని ముద్దులాడి మురిసిపోయే ఏ జనకుని చూచినా, కొడుకు చెయ్యి పుచ్చుకుని తప్పటడుగులు వేయిస్తూ తన్మయుడై పోయే ఏ కన్నతండ్రికనిపించినా, పసి బిడ్డణ్ణి ప్రక్కనే పడుకోబెట్టుకుని చేతిలో వెన్నముద్ద చెంగల్వ పూదండ చెప్పి అనిపిస్తూ ఆ తొకుక పలుకులుకానందించే ఏ అయ్యను చూచినా తన కొడుక్కు అటువంటి అదృష్టం లేదుకదా అని ఆతల్లి ప్రాణం ఆక్రోశించిపోయేది.
‘బాబును మీ అమ్మదగ్గిర వదిలి రాకూడదు’ అన్న మహేంద్ర ప్రతిపాదన ‘నేను వాణ్ణి వదలి వుండలేనండి’ అంటూ మాలతి కన్నీళ్లు పెట్టుకోవడంతో వీగిపోయింది. తను వచ్చే వేళకు గదిలో పడుకుని కేరింతలు కొడుతూ వున్న కొడుకుని చూచి మురిసిపోతూవున్నా, చిన్ని గులాబీ రేకుల్లాంటి చేతివ్రేళ్లతో రొమ్ములు తడుముకుంటూ లక్కపిడతలాంటి ఆ నోటితో వెచ్చగాపాలుత్రాగే పసివాణ్ణి వదిలిపెట్టి పిలవగానే రాలేకపోయినా, మహేంద్ర తన హక్కునీ, అధికారాన్ని ఎవరో లాక్కున్నట్టు నీళ్లు కారిపోయేవాడు. పాము చుట్టం పడగ విరోధి అన్నట్టుందతని వ్యవహారం.
బాబును ప్రక్కనే పడుకోబెట్టుకుని మాలతి సాయంరతం కాఫీకి స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టింది. ఇంతలో ప్రక్కటిం పిన్నిగారు పిలిస్తే వెళ్లింది. ఇప్పుడిప్పుడే ప్రాకడం నేర్చుకుంటున్న బాబు స్టవ్ మోతా పువ్వులావిరిసిన మంటా వింతగా చూస్తూ అటు నెమ్మదిగా స్టవ్ దగ్గరకు ప్రాకి చెయి చాస్తున్నాడు. అందడం తరువాయిగా వుంది. అప్పుడే దాసీ దది చూచి గాభరాగా ‘బాబు లోయ్ బబులో’ యంటూ పరిగెత్తి బాబును చంకనెత్తుకుని ‘ఏటి బాబూ బుడత డల్లా అగ్గిదగ్గిర పారాడుతుంటే తమాషా చూస్తరా? ఇయ్యాళ లేచినేళ మంచిది. మాలతమ్మ కడుపు సల్లగా బిడ్డను సంపాయించుకున్నట్టే’ అంటూ గుమ్మం దగ్గిరి నిల్చుని అపాయానికందుబాటులో వున్న బాబును తియ్యాలన్న భావమే లేని మహేంద్రను చీదరించుకుంటూ మాలతికి విశేషణాల్తో వినిపించింది.
బాబుకు జ్వరం, విరోచనాలు, ఏ పూటకా పూట తగ్గిపోతాయంటూ వాళ్లూ వీళ్లు చెప్పిన గచ్చాకు వుచ్చాకు వైద్యాలేవో చేస్తూ వచ్చింది. మూడు రోజుల్లో బాబు నీరసించిపోయాడు నీళ్ల విరోచనాల్తో, మహేంద్రతో మందు తెమ్మనీ డాక్టర్ని పిలవమనీ రోజూ చెపుతూనే వున్నా ఔననకా కాదనకా వినిపించుకోకుండా వుంటే మరో మూడు రోజులయేటప్పటికి బాబు మరీ డీలాపడిపోయాడు. ‘ఎంత యిష్టం లేకపోయినా బిడ్డకు మందన్నా యిప్పించరా’ అనుకుంది. ఆ నిర్దాక్షిణ్యాల్ని చూచి వీది గుమ్మం దాటి యెరగని తనే బాబును డాక్టరింటికి తీసుకువెళ్లి చూపించి మందు తెచ్చకుంది.
ఇటువంటి భర్త చేష్టలు చూస్తూ ‘బాబుకు కీడు కోరుకుంటున్నారేమో అనుకొన్న మాలతి మహేంద్ర మానవత్వాన్నే అనుమానించింది.
ఏ ముద్దూముచ్చటకు నోచుకోని బాబుకు మంచి రోజు చూచి తనే మామగారి పేరు పెట్టి పిలుచుకుంది మాలతి. ఇంటా బయటా అదే పేరయింది. అదీ మహేంద్ర కిష్టంలేదు. పుణ్యాత్ముడైన తన తండ్రి పేరుకు వీడు తగడని. ఆ తాత చేసిన పుణ్యం ఈ మనుమడు చేసిన పాపం తూయడాని కతని వివేకమనే త్రాసేనాడో చెడిపోయింది.
తన అంచనాలు తలక్రిందులై, పడిన అనుమానాలు నిరాధారాలని తేలిపోయాయి మహేంద్రకు. మాలతి కాన్పు కష్టం కాలేదు. ఆ అందంలో మార్పు రాలేదు. అదనపు ఆకర్షణే వచ్చింది. తనంటే వున్న శ్రద్దా భక్తి తగ్గలేదు. తనసేవలో లోటు చేయలేదు అయినా, బాబంటే అయిష్టత అలానే వుంది. దేనికైనా రోజురావి.
ఆ యింటికప్పుక్రిందనే అలానే ఒకిర నీడ ఒకరిపై పడకుండా ఒకటి తరువాత ఒకటిగా ఈతువులు మారిపోయాయి. వచ్చినవే మళ్లీ వచ్చాయి. మనిషి పెరిగాడు, మనస్సు పెరగలేదు.
మహేంద్ర వస్తూనే ఒల్లంతా నలక్కొట్టినట్టుందని మంచంమీద వ్రాలిపోయాడు. మాలతి నుదురు మీద చెయివేసి చూస్తే పెనంలా కాలిపోతూవుంది కళ్లు జోతుల్లా వున్నాయి. మాలతి కంగారు పడుతూ డాక్టర్కు కబురుచేసింది డాక్టర్ వచ్చి యింజెక్షనిచ్చి ‘రేపటికి తగ్గిపోతుందమ్మా’ అంటూ ధైర్యం చెప్పి వెళ్లాడు. ఆ రాత్రి మాలతి కంటిమీద కునుకులేదు. ఇక్కడ భర్తను చూస్తూవుంటే అక్కడ బాబు లేచేవాడు. అక్కడ బాబును జోకొడుతూ వుంటే ఆయన కెలా వుందో అని ప్రాణాలు పీకేవి. అటూ యిటూ తిరగడంలోనే కోడికీ మాలతికీ తెల్లవారింది.
ఆ మర్నాటికే మరీ నీరసించిపోయాడు మహేంద్ర. మూడు నాలుగు రోజులామందనీ యీ మందనీ మార్చి చూశాడు డాక్టర్. మందుబలంకన్నా రోగబలం ఎక్కవయింది. మహేంద్ర మగత మగతగా జ్వర తీవ్రతలో మూలగడం తప్ప మరోమాటా పలుకులేకుండా పడున్నాడు. మూలుగు వింటుంటే మాలతి గుండె గుబగుబలాడిపోయేది. ఏ పూట కాపూట రోగం ఒక మెట్ట పై కెక్కుతూవుంటే, మాలతి ధైర్యం ఒక మెట్టు దిగజారుతూవుంది. అటు పిల్లణ్ణీ ఇటు పెనిమిటినీ సంబాళించుకోలేక ఆసరాగా వుంటారని తల్లికీ, అత్తవారింటికి వెళ్లిన సుభద్ర వదినగారికీ అర్జంటుగా రమ్మని ఉత్తరాలు వ్రాసింది.
డాక్టర్ చివరకు టైఫాయ్డని తేల్చిక్లోరాం ఫెనికాల్ వాడుతూవున్నాడు. తల్లీ వదినగార్లు వచ్చాక పిల్లాణ్ణి ఒడిలో వేసుకుని టయింప్రకారం మందూ బార్లీ నీళ్లూ బత్తాయిరసం భర్త కందిస్తూ ఆ మంచం వదిలిపెట్టలేదు మాలతి. తల్లి బలవంతాన వెళ్లి కంచందగ్గిర కూర్చుని మ్రొక్కు చెల్లించుకునివచ్చేది. బాబు తండ్రివంకే చూస్తూ వచ్చీరాని మాటల్తో ‘నాన్న ఆయి’ అంటూ జాలిగా మొగంపెట్టి చెబుతూవుంటే తల్లి ప్రాణం తరుక్కుపోయేది. అమ్మ కాళ్లు రాస్తూవుంటే లేత చేతుల్తో తానూ రాయబోయేవాడు. మందు త్రాగిస్తూవుంటే చూస్తూ నిలబడేవాడు. మేనల్లుణ్ణి చూస్తూవుంటే సుభద్రకు ప్రాత జ్ఞాపకాల్తో కన్నళ్లు తిరిగేవి. కన్నే తెరవని ఆ తండ్రికి కన్నకొడుకు సేవలు తెలియవు. ఆ భార్యా బిడ్డల అదృష్టం బాగుండి ఆతని సుస్తీ త్వరగా తగ్గాలనేవారు పరామర్శలకు వచ్చిన బంధువులు. అదీ నిజమే చెట్టు నాధారంగా గూళ్లు కట్టుకొన్న పక్షుల అదృష్టం తిన్నగా వున్నప్పుడే తుఫానూ ఆ చెట్టు నేమీ చెయ్యలేదు.
‘నాన్నకు ఆయి నయంకావాలని దణ్ణం పెట్టుబాబూ’ అని మేనత్త పెట్టిస్తూ వుంటే హాల్లో వెంకటేశ్వరస్వామిపటానికి చిన్ని చేతులు జోడించేవాడు. ఆ పటం కనిపిస్తే చాలు ఆ పసిచేతులు రెండొకటయ్యేవి. కల్మషం అంటని ఆ పసివాడి ప్రార్థనలు ఫలించాయి. మహేంద్ర ఆరోగ్యం మందులకే తల వంచిందో, మాలతి సేవాశుశ్రూషలకే లొంగిపోయిందో తిరుగు ముఖం పట్టింది.
మనిషికి కలిమిలోకన్నా లేమిలో, సుఖంలో కన్నా కష్టంలో ఆరోగ్యంలోకన్నా వ్యాధిలో ఆత్మవికాసం ఏర్పడుతుంద. చేసిన దుష్కృతాలు మనస్సును పీడిస్తాయి. మంచితనం చోటు చేసుకుంటుంది. తనకన్నాపైనొక భగవంతుడున్నాడన్న విశ్వాసం అంకురిస్తుంది. అప్పుడే పశ్చాత్తాపాగ్నిలో పరిశుద్ధమైన మనస్సులొ సత్యస్వరూపం గోచరిస్తుంది.
రేపు పథ్యం పెడతారన్న మాటతో అందరి హృదయాల్లో బరువూ దించుకొన్నట్లయింది. గదిలో మహేంద్రద కనుమూసీ మూయనట్లు గది బయట అత్త గారితో సుభద్రదక్కయ్యచెపుతున్న మాటలు వింటున్నాడు.
‘అమ్మా నాన్నా వేలెడంత మగ నలుసు కోసం కలవరించి కలవరించి నిరాశలు చేసుకున్నాకు నా తరువాత పదేళ్లకు పుట్టాడు మహేంద్ర. కుల ముద్ధరించే కొడుకు పుట్టాడని ఆనందపడుతూ అరచేతిలో పెట్టుకుని పెంచుతూవున్న అమ్మను చూచి కాలానికి కన్నుకుట్టింది. అమ్మ పోయినప్పుడు మహి ఈ బాబంత వయసులోనే వున్నాడు. అమ్మపోయిన విచారంలో నాన్నకు చాలా పెద్ద సుస్తీయే చేసింది. మళ్లీ బతికి బట్ట కడతాడనుకోలేదు. మహీ ఇప్పుడు మన బాబుమాదిరే మంచం ప్రక్కనే నా పరికిని పట్టుకుని నాన్నను చూస్తూ అక్కా అయ్య అనేవాడు. ఏ పటాన్ని చూసినా బాబులానే ‘నాన్న అయ్పోయ్ అంటూ దణ్ణం పెట్టేవాడు. ఇప్పుడు మీ బాబును చూస్తుంటే అంతా ఆ తండ్రిపోలికే కనిపిస్తూవుంది. నాన్న నన్నూ మహినీ చూస్తూ కన్నీళ్లు పెట్టుకొనేవాడు నా పెళ్లి చెయ్యలేకపోయానని కొడుకు మంచీ చెడ్డా చూడకుండానే చచ్చిపోతానేమో అన్నదే ఆయన భయం మా మేనమామ లెంత ధైర్యం చెబుతున్నా అసలే దెబ్బతిని వున్నవాడేమో మరీ దిగులు పడిపోయేవాడు అత్తయ్యగారూ అంత మంచి మనిషికి చూడలేదు ఆస్తిని చూసే అనుకోండి. అమ్మ చివదారాలన్నా కాకమునపే మా పిల్లనిస్తాం మా పిల్లనిస్తాం అంటూ కుకల్లా మూగేవారు. ఎన్ని సంబంధాలు వచ్చిన ఎందరయిన వాళ్లూ కానివాళ్లూ బలవంతం చేసినా నాన్న మెత్తపడలేదు ‘నా పిల్లలే నా రెండు కళ్లూను. నా సుఖంకోపం ఆ కళ్లను పొడుచుకోలేను. లోకంలో సవతి తల్లులు తమందిని చూడ్డంలేదు. నా బిడ్డలకే సవితిపోరూ పొక్కూవద్దండి బాబులా అంటూ అందర్నీ కాదని ప్రాణమొకెత్తుగా మమ్మల్ని పెంచుకొచ్చాడా మహానుభావుడు ఏ లోకానున్నాడో.
ఇప్పటివాళ్లవే చెప్పాలి. చంకలో పిల్లాణ్ణలా పడేసి షర్టుకు గుండీ పెట్టమంటూ పెళ్లాన్ని అముల్దుముల్ చేయమంటే చేస్తారు. ఉచ్చలూ పీతులూ నీ వంతు,ముద్దూ ముచ్చటా నావంతుఅనేవాళ్లే యిప్పుడందరూ…
సుభద్ర యింకా చెపుతూనేవుంది పాత విషయాలు వింటూవున్న మహేంద్రదకు క్రొత్త కన్నేదో తెరుచుకున్నట్టయింది. అలల్లాగా ఆలోచనలేవో వస్తునానయి. తన ప్పులేవో పుస్తకం పుటలు తెరిచినట్లు గోచరిస్తున్నాయి. తన అపోహల్ని భయాల్ని వట్టి భ్రమలంటూ కాలం మేలుకొల్పినా తనింకా ముసుగు తన్ని నిరదపోతున్నాడు. కళ్లముందు తండ్రే కనిపిస్తున్నాడు. తన తల్లి దండ్రులు ’వంశం ఎలా నిలుస్తుందా’ అని తను పుట్టేదాకా తపించిపోయారట. తన లాగా వంశాంకురమె వద్దు అనుకోలేదు. తన మేలుకోరి తన బరువూ బాధ్యతలు స్వీకరించడంకోసం శారీరక సుఖాన్ని తుచ్ఛంగా భావించి మళ్లీ పెళ్లి తలపెట్టుకుండా భీస్మిచాండు తన తండ్రి. తనో తన కొడుకుని తన ముఖం కొల్లగొట్టటానికి వచ్చని పగవాణ్ణిగా చూశాడు. ఆ అమృతోపమానమైన వాత్సల్యాన్ని త్రాగి పెరిగిన తాను బాబంటే ద్వేషపాషాన్ని వెళ్లక్రక్కాడు. అతి పవిత్రము, భగవ్రత్పసాదితమైన పుత్రప్రేమను అప్పవాంఛలకు బలిచేసుకుంటూవున్న బలహీనుడు తాను. ప్రక్కనున్న చల్లని కోనేటిని కాదనిఎండమావుల్లో దప్పిక తీర్చుకోవాలని యిన్నాళ్లూ పరిగెత్తుతున్న అవివేకి తను.
మనిషి మనస్సు విచిత్రమయింది. తన సంకల్పాన్ని బుద్ధిబలంతో వాదించి వుననిపించనూ కలదు. ఆ సంకల్పాన్ని అదే బుద్ది బలంతో ప్రతికూల సాక్ష్యాలు సమకూర్చి కాదనిపించనూ కలదు. రెండు వేపులా పదునున్న ఆ కత్తిని కన్ను చెదరకుండా కాలుజారకుండా వాడుకోగల వాళ్లు ఏ కొద్ది మందో.
అనుమానపు పాషాణాలడ్డుకున్న మహేంద్ర వాత్సల్యవాహిని రెట్టించిన వేగంతో నిరాటంకంగా ఎగచిమ్మింది. మబ్బు విడిచిన ఎండలా అతని మనస్సు తేజస్సుతో అతిస్వచ్ఛంగా వెలుగుతూంది.
‘మాలతీ’ అన్న పిలుపుకు ‘ఏమండీ’ అంటూ గదిలో కలుపెట్టి ‘బత్తాయి రసం తెమ్మంటారా?’ అన్న భార్యమాట వినిపించుకోకుండానే ‘బాబేం చేస్తున్నాడు’ అన్న భర్త ప్రశ్న వినడం విన్నా అర్థం స్ఫురించనట్టు అతనికేసి చూస్తూ వుండిపోయింది. పుట్టిన యిన్నాళ్లకు ఆయన నోట ‘బాబు’ అన్న ఆ రెండక్షరాల మాట వింటుంటే ఏమర్థమవుతుంది? ‘మన బాబేం చేస్తున్నాడు మాలతీ’ అన్నాడు మళ్లీ, మహేంద్ర.
అప్పుడు వచ్చిన సుభద్ర ‘బాబిప్పుడే నిద్రలేచాడు. ప్రక్కింటి పార్వతి తీసుకువెళ్లినట్టుంది’ అంటే అక్కయ్యను వెళ్లి తీసుకురమ్మని ఆ అక్కవెళ్లి తీసుకువచ్చేలోగానే మహేంద్ర తహతహలాడిపోయాడు క్షణం యుగంలాగా.
సుభద్ర గగ్గోలుగా ఏడుస్తూ వచ్చింది, చేతుల్లో చంటివాణ్ణెత్తుకుని. మాంసం ముద్దలా వున్నాడు బాబు. ఒళ్లూ ముకం అంతా నెత్తురుమయంగావుంది. బాబును చూస్తూ ఏమయిందిరా తండ్రి అంటూ అరుస్తూ మొదలు నరికిన చెట్టులా మాలతి స్పృహలేకుండా పడిపోయింది. మాలతి తల్లి పరిగెత్తుకుంటూవచ్చి కూతురు తల ఒళ్లోపెట్టుకుని దాసీది తెచ్చిన నీళ్లు ముకం మీద చిలకరిస్తూవుంది.
దాసీది చెప్పింది. బాబును తీసుకువెళ్లిన పార్వతి వాళ్ల మేడమెట్లేక్కుతూ పై మెట్టుమీద కాలు మెలికపడి బాబుతో సహా పైనించి డొల్లుకుంటూ క్రిందకు పడిపోయింది. ఆ పడ్డంలో బాబు తల మెట్ల ప్రక్క స్తంభానికి తగిలి పచ్చడయింది. అక్కడంతా రక్తకొల్లేరయింది. పార్వతమ్మ కాలు ఎముక విరిగిందనుకుంటున్నారు.
బాబు శరీరం చన్నీళ్ల కడవలా వుంది. ఆ పసివాడి బొందెలో చిలకెప్పుడో ఎగిరిపోయింది. సుభద్ర మతిపోయి ఏం చేస్తూవుందో తెలియకుండానే ఆ ప్రాణంలేని కట్టెను మహేంద్ర ప్రక్కలోవేసింది.
మహేంద్ర అలా నిలువుగ్రుడ్లతో మాట పలుకులేకుండా చూస్తుండిపోయాడు. గట్టిగా ఏడ్చే ఓపిక కూడా లేదు. చేతికందినపండు జారిపడి చితికి పోయింది. నోటిదగ్గిరకు వచ్చిన ముద్దను గ్రద్ద తన్నుకుపోయింది. చలనంలేని బాబును చిక్కిపోయిన చేతుల్లోకి తీసుకుని అక్కున చేర్చుకున్నాడు. అదుముకున్నాడు. నిర్జీవమైన ఆ శరీరాన్ని ఆపాదమస్తకం ముద్దుల్తో నింపివేశాడు. వాడిన తామర తూళ్లులా వ్రేలాడిపోతున్న ఆ చిన్ని చేతుల్తో మొగం కప్పుకుని లోలోన కుమిలిపోయాడు. మంచుముక్కలావున్న బాబు దేహాన్ని భుజాన వేసుకుని వీపుమీద చిచ్చికొడుతూ మమానందాన్ననుభవిస్తున్నాడు. అణుచుకోలేని శోకభారమతణ్ణి పిచ్చివాణ్ణి చేస్తూవుంది. ఆ మృత శిశుస్పర్శకే అతని సర్వశరీరం పులకించి పోతూవుంది. అది సుఖమో దుఃఖమో తెలియలలేని మనస్థితిలో వున్నాడతను. ఏ స్వార్థపంకం, వాంఛామాలిన్యం, వ్యామోహబంధంలేని శూన్యాకాశంలాగా వుందతని మనస్సు. కన్నీళ్లు కారిపోతున్నాయి అనుమానాలు ఆక్రోశాలు కోపాలు, తాపాలు, ఆవలు అనుబంధాలు అన్నీ కరిగి ప్రవహిస్తున్నాయి. సమస్త మలినక్షాళితమైన మహేంద్ర మనస్సులో నిక్షిప్తంగావున్న వాత్సల్య సింధువులు ఆశ్రుబిందువులుగా ఆ పాలిపోయిన చెక్కిళ్ల మీద పులుకడిగిన ముత్యాల్లా మిలమిలా మెరిసిపోతూ జారి బాబు తలమీదపడి చిట్లిపోతున్నాయి.
కాలమల్లే సాలిగూటిలో చిక్కుబడక తప్పదే పాణికైనా ఎంత గింజుకున్నా గిజగిజలాడినా ప్రయోజనం శూన్యం. తలుపు తెరిచిన కథ మలుపు తిరిగింది. పాపం మహేంద్రలో అనురాగం తొలకిరించింది. కాని అతణ్ణి అదృష్టం కనికరించలేదు. మనసు పన్నీటి ఊట అయిన మరుకణంలో బ్రదుకు కన్నీటిబాట అయింది.
———–