పేరు (ఆంగ్లం) | Ravinutala Sriramulu |
పేరు (తెలుగు) | రావినూతల శ్రీరాములు |
కలం పేరు | శ్యామప్రియ |
తల్లిపేరు | అనసూయమ్మ |
తండ్రి పేరు | రావినూతల సత్యనారాయణ |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 10/12/1936 |
మరణం | – |
పుట్టిన ఊరు | ప్రకాశం జిల్లాపమిడిపాడు |
విద్యార్హతలు | బి.ఎ. |
వృత్తి | సబ్-రిజిస్ట్రారు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మహాత్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య జీవితచరిత్ర,పేదలపెన్నిది (గుత్తి కేశవపిళ్ళై జీవితగాథ), ప్రజలమనిషి ప్రకాశం, ఆంధ్రకేసరి ప్రకాశం, ధ్రువతార (పొట్టిశ్రీరాములు జీవితగాథ), అరుణగిరి యోగులు, దాక్షిణాత్య భక్తులు, దక్షిణాది భక్తపారిజాతాలు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | రావినూతల శ్రీరాములు బహుగ్రంథకర్త, ప్రముఖ వ్యాసరచయిత |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | రావినూతల శ్రీరాములు |
సంగ్రహ నమూనా రచన | చిన్నతనమునుండి పత్రికారచనలో ఆరితేరి కొన్నేండ్లు ఆంధ్ర పత్రికా విలేఖరిగా పనిచేసి, నేడు పత్రికా రచయితగా పేరుదెచ్చుకొన్న శ్రీరావినూతల శ్రీరాములవారి నెరుగని పాఠకులుండరు. వేటపాలెంలో టీచర్స్ ట్రైనింగ్ చదువు చున్నప్పుడే కథక చక్రవర్తి శ్రీ మునిమాణిక్యం నరసింహారావుగారు వీరికి గురువులైరి, |
రావినూతల శ్రీరాములు
చిన్నతనమునుండి పత్రికారచనలో ఆరితేరి కొన్నేండ్లు ఆంధ్ర పత్రికా విలేఖరిగా పనిచేసి, నేడు పత్రికా రచయితగా పేరుదెచ్చుకొన్న శ్రీరావినూతల శ్రీరాములవారి నెరుగని పాఠకులుండరు. వేటపాలెంలో టీచర్స్ ట్రైనింగ్ చదువు చున్నప్పుడే కథక చక్రవర్తి శ్రీ మునిమాణిక్యం నరసింహారావుగారు వీరికి గురువులైరి, చరిత్ర ఆంగ్ల, ఆంధ్ర సాహితాయభిమానులై 1968 లో ప్రైవేటుగా బి.ఏ. పట్టమును ఆంధ్ర విశ్వవిద్యాలయమునుండి స్వీకరించిరి. ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి ఎల్.ఎల్.బి. పట్టము పొందిరి. రిజిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగిగా తొలుత చిత్తూరులో చేరి 1977 నుండి సబ్ రిజిష్ట్రారుగా రాయలసీమ మండలములలో నియమితులై రాయలసీమలో స్థిరనివాసులైరి.
చారిత్రాత్మిక స్థల పరిశోధనలపై అభినివేశముగల శ్రీరాములుగారు ఉద్యోగరీత్యా తామున్న ప్రాంతములను, పరిసరములను పరిశీలించి, పరిశోధనాత్మక వ్యాసములు వ్రాసి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వారపత్రిక, ఆంధ్రప్రదేశ్ పత్రికలలో ప్రకటించిరి. ప్రముఖవ్యక్తుల జీవితచరిత్రలను వీరు వ్యాసములుగా వ్రాసి ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ – ‘ఆంధ్రపత్రిక’ మున్నగు పత్రికలకు ప్రతివారము పంపి ప్రచురింపజేసిరి. రాయలసీమకు వచ్చిన తరువాత పద్మశ్రీ కల్లూరు సుబాబరావు, పువ్వూరు రామాచార్యులు, పుట్టపర్తి నారాయణాచార్యులు, బెళ్లూరి శ్రీనివాసమూర్తి, తూముకుంట భీమసేనరావు, రేవూరి అనంతపద్మనాభరావు, గుత్తి కేశవపిళ్ళే మున్నగు ప్రముఖులపై వ్యాసములు వ్రాసి మరుగుపడిన రాయలసీమ వ్యక్తులను, పత్రికాముఖముగా కొనియాడిరి. వీరి ఈ కృషి ప్రశంసింపదగినది.
వీరు వ్యాసకర్తలేకాదు నాటక కర్తలు కూడ. అస్పృశ్యతా సమస్యపై వీరి నాటకము ‘ఇన్ దికోర్టు ఆప్ యమ’ హైదరాబాదు ఆకాశవాణి కేంద్రము నుండి, ‘పునానమ నరకం’ నాటిక కడపరేడియో కేంద్రమునుండి ప్రసారము కాబడినవి. వీరి సోదరులు శ్రీనాథరాయకవి రచించిన హిరణ్య హృదయ మను పేర హైదరాబాదు నుండి ప్రసారము గావించిరి. వీరి కథలు ‘నోలిమిటేషన్’ ‘క్రొవ్వొత్తి’ కడపరేడియో కేంద్రము నుండి ప్రసారమైనవి.
1977వ సం. కేంధ్రప్రభుత్వము విద్యాశాఖ వీరి రచన ‘మంచిని పెంచుదాం’ (నూతన చదువరులకు) ఉత్తమ మైనదిగా ఎన్నికచేసి వేయి రూపాయల బహుమతి నందించిరి. ఇది హిందీ, తమిళ, కన్నడ భాషల లోనికి కూడ అనువదింపబడుట ఒక విశేషము. సరళమైన భాషలో బాలలకు వయోజనులకు ఉపకరించే విధముగా వీరు రచించిన ‘జాతీయపతాకం – గీతం’ ‘తరతరాల భారతం’ ‘జాతిపురోగమనం’ ‘ప్రకాశం జీవిత చరిత్ర’ మున్నగునవి ముద్రణలో కలవు.
ప్రస్తుతము వీరు రమణమహర్షి పట్ల ఆకర్షితులై వారి జయంత్యుత్సవములు నిర్వహించుటలోను, వారి సందేశములను వివరించు రచనలు చేయుటలోను నిమగ్నులైనారు. వృత్తి రీత్యా ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ ఎల్లవేళలందు సాహితీ మిత్రులతో కాలక్షేపము చేయుచు, ప్రముఖుల పరిచయములతో, వారి ఆశీస్సులతోను పైకి రావలెననెడి కుతూహలముగల్గి, దానికి తోడు తగిన కృషిచేయగల నవయువకులు శ్రీరాములుగారు. వీరి పత్రికారచన కృషి రాయలసీమవాసులకొక వర ప్రసాదమైనదునటలో అతిశయోక్తి లేదు. పెద్దలయెడ భక్తిభావములుగల యిట్టి యువకులు భవిష్యత్తులో మంచిని పెంచగలరను దృఢ విశ్వాసమెల్లరకు కలదు. వీరికి భగవంతుడు ఆయురారోగ్యభాగ్యము లిచ్చి కాపాడుగాత.
రాయలసీమ రచయితల నుండి……
———–