పేరు (ఆంగ్లం) | Panyam Narasaramayya |
పేరు (తెలుగు) | పాణ్యం నరసరామయ్య |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | ‘‘వీరకంకణము’’ అను పేర విశ్వనాథనాయక చరిత్రను పద్యకావ్యము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పాణ్యం నరసరామయ్య |
సంగ్రహ నమూనా రచన | ఉ. ఏ జగజెట్టియైననుసరే చనుదెంచి, రణాంగణంబునన్ దేజము దెంపుజూపి జననిందితు నాగమనీని బట్టి మా యోజన బెంచువానికి, సముజ్జ్వల సాహసమూర్తికిన్, యశో భాజన ‘వీరకంకణ’ ముపాయన మియ్యది; భోగ్యమయ్యెడున్ |
పాణ్యం నరసరామయ్య
పాణ్యం నరసరామయ్య, చిన్నప్పటి నుండి కావ్యములల్లు నలవాటు గల వాడగుటచే, నేదైనా కావ్యము వ్రాయవలెననెడి యాతని అభిప్రాయమునకు శివధారత కర్తలైన, శ్రీ గడియారం వేంకటశేష శాస్త్రి గారొకపరి, ఏదేని ఒక చిన్న యితివృత్తమును, గ్రహించి రచన సాగించి, అద్యాసపాటవమున ఫలసిద్ధి, పొందవిలసినదిగా నుపదేశించిరి. ఆ యుపదేశముతో, అతడు వారికి ఏకలవ్యశిష్యుడై ‘‘వీరకంకణము’’ అను పేర విశ్వనాథనాయక చరిత్రను పద్యకావ్యముగా రచించిరి.
వీరకంకణమొక చారిత్రాత్మిక పద్యకావ్యము. ఇది శ్రీ కృష్ణదేవరాయల కాలమున జరిగిన కథ. చోళరాజు, పాండ్య రాజును పారద్రోలి ఆతనిభార్యను చెరబట్టిన విషయము రాయల వారికి తెలియగా, ఆయన తనకు విశ్వాసపాత్రుడైన, నాగమ నాయకుని నైన్యముతో చోళరాజుపైకి యుద్ధమునకు పంపెను. నాగమనాయకుడు చోళరాజును జయించి, ఆ రాజ్యమును మరలా పాండ్యరాజున కివ్వక, తానే స్వతంత్రించి రాజుగా ప్రకటించు కొనెను. ఇది తెలిసిన కృష్ణరాయలు. ఉగ్రులై సభలో యిట్లు ప్రకటించిరి.
ఉ. ఏ జగజెట్టియైననుసరే చనుదెంచి, రణాంగణంబునన్
దేజము దెంపుజూపి జననిందితు నాగమనీని బట్టి మా
యోజన బెంచువానికి, సముజ్జ్వల సాహసమూర్తికిన్, యశో
భాజన ‘వీరకంకణ’ ముపాయన మియ్యది; భోగ్యమయ్యెడున్
ఆ ప్రకటన విన్నంతనే ‘‘లేత జవ్వనమున నూనూగు మీసములు వచ్చిన వీరరసంబునాగ, నజ్జనపతి ముందటన్నిలిచి సాగిలి మ్రొక్కి, నొకండు దీర్ణుడై’’
మ. అతడే వీరమ నాయకుండ హిత బామాగర్వ నిర్వాహణో
దద్ధత నిర్వక్ర పరాక్రమక్రముడు, ప్రోద్యద్ధర్మ దీక్షా సమం
చిత, పుణ్యోదయమూర్తి, నాగమ మహాసేనానికిన్ బుత్రకుం
డతిలోక ప్రభుభక్తి తత్పరత దృష్టాంతంబు; లోకంబునన్.
అతడు అంజలి ఘటించి తండ్రిపై యుద్ధము ప్రకటించినాడు. యుద్ధమునకు, ముందు తండ్రీ కొడుకులకు నడుమ జరిగిన వీరోచిత సంభాషణమును కవిగారు అతి చక్కగా, గంభీరత చెడనట్లుగా మఱి మఱి పఠించి యానందింపదగినదిగా రచించినారు.
ఇయ్యది వీరరస ప్రధానమైన కావ్యము. ప్రతి పద్యము వదలక చదువ వలసినదేకాని, విడిచి ముందుకు సాగలేము.
‘‘వీరి కవిత వలచి వచ్చినదిగాని, బలాదాకృష్యమాణగాదు. ఇందారంభమునుండి, కొసవఱకు జక్కని పదజాలముతో సావధావికమగు నడకలతో, బద్యములు హృద్యములై కవియొక్క సరళత్వమును బ్రదర్శించుచున్నవి. అనవసరములగు వర్ణనల, జోలికిబోక తగిన రీతిగా నడుపబడిన, ఈ కవిత యెంతయు గొనియాడదగియున్నది. కావ్య లక్షణము లొక్కింతయు, సడలనీక యిందు బొందు పఱచుట హర్షింపదగిన విషయము’’ ఇయ్యది శ్రీ జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ గారు కావ్యముపై వెలువరించిన సదభిప్రాయము.
వీరి రెండవ కావ్యము ‘‘స్వాతంత్ర్యవీరుడు’’. ఇది కర్నూలు జిల్లాకు చెందిన య్యాలవాడ గ్రావాసియైన శ్రీ నరసింహారెడ్డి చరిత్ర. అతడు ఆంగ్లేయులపాలన నంతమొందింప నెంచిన సాహసి. జానపదులాతని ‘‘రెడ్డికాదు బంగారుకడ్డీ’’ అని కీర్తించిరి. ఆతని సాహస మంతా యింతా కాదు. ఏటేటా ప్రభుత్వమిచ్చు ‘‘తవర్జీ’’ అను భరణము రకై రెడ్డి ఎవరినో ఒకరిని తహసీలుదారు కడకు పంపుచుండిరి. కానీ కోవెలకుంట్ల తహసీలుదారునకు, రెడ్డికి నేదో ఒక సందర్భమున వాగ్వాదము జరిగి వుండుటచే, ‘‘దాసరి క్రిందకూడ, నొకదాసరియా’’ యని యీసడించి ‘‘ఆ దాసరివచ్చి మమ్మడిగి ద్రవ్యముగైకొనవచ్చు’’ నని దురుసుగా మాట్లాడిరి. దానితో రెడ్డి రెచ్చిపోయినాడు. వాని ‘‘తల తీయక విడుతునా’’ యని ప్రతిజ్ఞ పట్టి దండుతో తాలూకాఫీసు మీదికి దాడి జరిపినాడు. రెడ్డి దండు చూడగానే రక్షకభటులు తుపాకులు వదలి పరుగెత్తినారు. రెడ్డి ఉగ్రనరసింహుని రూపము దాల్చి
కఱ కఱ పండ్లునూరి, రెడుగా యిటురమ్మని, పట్టి ఈడ్చి ని
ర్భరమగు, నక్కసమ్ముమెయి, వాని శిరమ్మును నేలదన్ను చుఁ
గఱకు కటారు గేలకొని గ్రక్కునవైన, శిరంబు మొండెముం
ధరణి పయింబడెన్ రుధిర ధారలు మందిరమెల్ల జిమ్ముచున్.
ఇట్లాతని చంపి ఆంగ్లేయులపై కక్షగట్టిన క్షాత్రవతంసుడతడు.
ఇట్టి సాహసవీరుని స్వగ్రామమగు ఉయ్యాలవాడ యందు బుట్టిన మన నరసరామయ్యగారు సాహసించి, ఈ వీరుని కథను జానపద పదములకే పరిణితిబెట్టక, కావ్యరూపము నిచ్చి రాయల సీమకు కీర్తి తెచ్చిరి.
నరసరామయ్యగారి రెండు కృతులు, చరిత్రకు సంబంధించినవే యైనను, వీర కంకణ కృతి శైలికిని, యిందు జూపిన శైలికిన, భిన్నత్వము స్పష్టముగా గోచరించును. రెడ్డి చరిత్ర పండిత పామర జనానందకరమై యొప్పుచున్నది. ఈ రెండు కావ్యములవల్ల ఈ కవి సంస్కృతాంధ్రములలో పుష్కలమైన పాండిత్యము, కవితలో నిండైన ప్రావీణ్యము, కలవారని తేటతెల్లమగుచున్నది. ఈ కవిగారు రెడ్డి చరిత్రను అసమగ్రముగా ప్రచురించిరి. ఇది పాఠకులకు కొంత అసంతృప్తిని కలిగించినదని చెప్పవచ్చను. దీని రెండవ భాగము ప్రచురించి, నరసింహారెడ్డి చరిత్రకు సంపూర్ణత చేకూర్చి కవివరేణ్యులు ధన్యులగుదురు గాత.
———–