పేరు (ఆంగ్లం) | Dr. S.Gangappa |
పేరు (తెలుగు) | డా. ఎస్. గంగప్ప |
కలం పేరు | – |
తల్లిపేరు | కృష్ణమ్మ |
తండ్రి పేరు | వెంకటప్ప |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/8/1936 |
మరణం | 2022 అక్టోబరు 7 |
పుట్టిన ఊరు | నల్లగొండ్రాయని పల్లి, పెనుకొండ తా. అనంతపురం జిల్లా. |
విద్యార్హతలు | – |
వృత్తి | అధ్యాపకుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | కళాశాల అధ్యాపక వృత్తి కొనసాగించుచూ ప్రైవేటుగా పరిశోధన విద్యార్థిగా ‘‘శ్రీ కోలా చలం శ్రీనివాసరావు – నాటక సాహిత్య సమాలోచనము’’ అను అంశముపై పరిశోధన గావించి ‘‘డాక్టరేట్’’ సంపాదించిరి. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | డా. ఎస్. గంగప్ప |
సంగ్రహ నమూనా రచన | జనపదములో పుట్టిపెరిగిన గంగప్ప గారికి బాల్యము నుండియే జానపద గీతములపై ఒక ప్రత్యేకమైన అభిమానమేర్పడినది. అందునా రాయలసీమ రైతుల, కూలీల కష్టనష్టములను బాగుగా తెలుసుకొన్న సామాన్య రైతు కుటుంబీకుడు గంగప్ప. పెనుకొండ చుట్టుముట్టుగల పల్లెలలో జానపదులు పాడుకొను కపిల పాటలను, విసర్రాయి పాటలను, వడ్లు దంచుపాటలను, కలుపులు, కోతలప్పుడు పాడు పాటలను చిన్నతనము నుండియే ఆసక్తిగా వింటూ సేకరించు ఉత్సాహమును కలిగి వుండిరి. |
డా. ఎస్. గంగప్ప
జనపదములో పుట్టిపెరిగిన గంగప్ప గారికి బాల్యము నుండియే జానపద గీతములపై ఒక ప్రత్యేకమైన అభిమానమేర్పడినది. అందునా రాయలసీమ రైతుల, కూలీల కష్టనష్టములను బాగుగా తెలుసుకొన్న సామాన్య రైతు కుటుంబీకుడు గంగప్ప. పెనుకొండ చుట్టుముట్టుగల పల్లెలలో జానపదులు పాడుకొను కపిల పాటలను, విసర్రాయి పాటలను, వడ్లు దంచుపాటలను, కలుపులు, కోతలప్పుడు పాడు పాటలను చిన్నతనము నుండియే ఆసక్తిగా వింటూ సేకరించు ఉత్సాహమును కలిగి వుండిరి. ఈ జానపద విజ్ఞాన మొక అపారమైన ఖని యని భావించి త్రవ్వితీయ ప్రయత్నములో మునిగితేలిన శ్రామికులు వీరు. ‘‘కష్టేఫలీ అని నమ్మ రుగాలమూ పాటుపడుతున్న కృషి పండితు డీతడు’’.
గంగప్పగారి ప్రాథమిక విద్య సోమందేపల్లి లోను, ఉన్నతపాఠశాల విద్యాధ్యాసము పెనుకొండలోను, ముగించి తదుపరి అనంతపురం ప్రభుత్వ కళాశాలలో బి.ఏ ఆనర్సు; ఆంధ్ర విశ్వకళా పరిషత్తు, వాల్తేరులో ఎం.ఏ., పూర్తి గావించిరి. ఆనర్సులో వీరి అభిమాన విషయము భాషాశాస్త్రము. పూనా వేసవి పాఠశాలలో భాషా శాస్త్రాధ్యయన ప్రొఫెసర్ లీలిస్కర్ వంటి మహా విద్వాంసుల సన్నిధిలో భాషాద్యయనము గావించారు. కాని వీరికి సాహిత్యము పైననే అభిమానము మెండు. అందులోనే అధికకృషి గావించిరి. కళాశాల అధ్యాపక వృత్తి కొనసాగించుచూ ప్రైవేటుగా పరిశోధన విద్యార్థిగా ‘‘శ్రీ కోలా చలం శ్రీనివాసరావు – నాటక సాహిత్య సమాలోచనము’’ అను అంశముపై పరిశోధన గావించి ‘‘డాక్టరేట్’’ సంపాదించిరి.
తదుపరి వీరి మరియొక పరిశోధనా గ్రంథము ‘‘క్షేత్రయ్య పద సాహిత్యము’’. దీనికి ఆం.ప్ర. సాహిత్య అకాడమీ వారి అవార్డు కూడా లభించినది. ‘‘పదకవితా సమీక్షాక్షేత్రంలో చాలకాలంగా పరిశ్రమిస్తున్న వ్యవసాయికులలో డాక్టర్ ఎన్. గంగప్ప మొదటి మునుముకు చెందిన వ్యకిత’’ గా అచార్య తూమాటి దొణప్పగారు అభివర్ణించిరి. క్షేత్రయ్య తరువాత ‘వీరు సారంగ పాణి పదసాహిత్యము’’ను వెలుగులోనికి దెచ్చరి. ప్రసిద్ధిగాంచిన వాగ్గేయకారులలో సారంగపాణి కూడా ఒకడు. ఇతడు చిత్తూరు జిల్లాకు చెందిన కార్వేటినగర సంస్థానమున నుండినవాడు. అన్నమయ్య, క్షేత్రయ్యల వలె జగమెరిగినవాడు కాడు. ఒక అజ్ఞాత వాగ్గేయకారు డతడు. కార్వేటి నగరములోని ఒక సాహితీ సంస్థ ఆ వాగ్గేయకారుని పదసాహిత్యమును వ్యాప్తిలోనికి దెచ్చుటకు పూనుకొన్నది. ఆ సమయములోనే గంగప్ప గారి క్షత్రయ్య పదసాహిత్య గ్రంథము వెలువడుట జరిగినది. ఈ విషయం తెలుసుకొనిన శ్రీ విశ్వనాథ అరుణాచలం గారు గంగప్పగారి నీ విషయముగా ప్రస్తావించిరి. గంగప్పగారు పట్టిన పట్టు విడువక సారంగపాణి పదసాహిత్యమును పరిశోధన గావించి ఒక గ్రంథముగా వెలువరించిర. ఆయన కృషి ఫలితముగా ‘‘సారంగపాణి పదసాహిత్యము’’ వెలుగు చూచు భాగ్యమబ్బినది.
పై రెండు పదసాహిత్యముల కృషి ఫలితముగా భారత ప్రభుత్వ – కేంధ్ర సాంస్కృతిక వ్యవహారాలశాక వీరికి ‘‘సీనియర్ ఫెలోషిప్’’ ఇచ్చి ‘‘అన్నమాచార్యులు – ఇతర ప్రముఖ వాగ్గేయ కారులు – తులనాత్మక అధ్యయనం’’ అను అంశముపై పరిశోధన గావించుటకు ఏర్పాటు చేయబడిన 15 మంది భారతీయ పరిశోధకులలో వీరికి మూడవస్థాన మిచ్చిరి. ఈ గ్రంథము వెలువడిన ఒక అమూల్య గ్రంథముగా పరిగణింపబడగలదు.
ఈ ముగ్గురు వాగ్గేయకారుల పదసాహిత్యమును పరిశోధన గావించిన అనుభవజ్ఞులగుటచే వీరు ‘‘తెలుగులో పద కవిత’’ అనబడు గ్రంథమును రచించి 1980-81 లో ఆం.ప్ర. సాహిత్య అకాడమీ అవార్డు పొందిరి. ఇందు వివిధ భారతీయ భాషలలో పద కవిత ఆవిర్భావము – వికాసము; పదకవుల చరిత్ర – పద కవితావైభవం – పదకవితలోని భాషా విశేషాలు – పదకవితలో శృంగార, భక్తి నీతి వైరాగ్యములు, మున్నగు అనేక విషయములను గూర్చి విపులముగా చర్చించిన గ్రంథమిది. తెలుగు సాహిత్యములో ఈ పరిశోధనా గ్రంథమునకు ఒక ఉన్నత స్థానము లభించగలదు.
పదసాహిత్యము తరువాత వీరి జానపద సాహిత్యకృషి మెచ్చదగిన అంశము. వీరు సేకరించిన ‘‘తెలుగు దేశపు జానపద గీతాల’’ను ఆం.ప్ర. సమాచార పౌర సంబంధశాఖవారు ప్రచురణ గావించిరి. తదుపరి జానపదులు పాడుకొనే రామాయణ సంబంధ గేయముల నన్నింటిని సేకరించి ‘‘జానపద గేయ రామాయణ’’ముగా ముద్రించిరి. జానపద సాహిత్యముపై వీరు పెక్కు వ్యాసములు వ్రాసి ‘‘జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యం’’ పేర పుస్తక రూపములో ముద్రించిరి.
పద-జానపద సాహిత్యకృషి తరువాత తెలుగు ప్రబంధ, ఆధునిక భాషా సాహిత్యములపై పెక్కు విమర్శనాత్మకమైన వ్యాసనములను రచించిరి. వాటిని కొన్ని వ్యాస సంపుటములుగా ముద్రించిరి. ఆ వ్యాస సంపుటము లివి – సాహిత్యసుధ, ఉన్నవ లక్ష్మీనారాయణ సాహిత్య జీవితం, సాహిత్యోపన్యాసములు, భాషా వ్యాసాలు; తెలుగు నాటకం – ఆరంభం నుండి అబ్సర్డు నాటకాల దాక. విశ్వనాథవారి వేయి పడగలు – విశ్లేషణాత్మక విమర్శ – శ్రీ విశ్వనాథవారి నాటకాలు – విశ్లేషణ. ఈ విమర్శనాత్మక వ్యాసావళులేకాక చిన్న కథలు, కవితలు, నాటికలు, బాలసాహిత్యము, 8, 9, 10 తరగతులకు తెలుగు ఉపవాచకములు, నవలలు, వయోజనవిద్య పుస్తకములు మిక్కుటముగా ప్రచురించిరి. వీరు తెలుగు సామిత్యములో చేపట్టని ప్రక్రియలేదు. ఈయన విరామ మెరుగ విరచయిత. ఈయన చేపట్టినది సాహిత్యవ్రతం. ‘‘తన ప్రతి రచన వెలుగులోనికి రావాలని బలాటపడే స్వభావం వీరిది’’.
‘‘ఒక రకంగా చూస్తే మన గంగప్పకూడా వ్యసనపరుడని చెప్పక తప్పదు. నిరంతర గవేషణా ప్రియత్వము. సత్యతత్త్వా విష్కరణ తత్పరత్వము, సద్గ్రంథ ప్రచురణ చణత్వము డా. గంగప్పను ముప్పేటగా ముసురుకొన్న వ్యసనాలు. ఇవి ఎవరికీ హాని చేకూర్చక పోవడమేగాక ఒక జాతి సంస్కృతి ప్రగతికి కొంతలో కొంత దోహదం చేస్తాయి కాబట్టి వీటిని సద్వ్యసనాల క్రింద జమకట్టుకోక తీరదు’’ అని శ్రీ తూమాటి దొణప్పగారు వక్కాణించారు.
ప్రస్తుతము స్. గంగప్పగారు, గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో తెలుగు రీడర్గా పనిచేయుచున్నారు. వీరు రాష్ట్రంలోను; జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయ స్థాయిలోను జరిగిన పెక్కు సదస్సులు, గోష్ఠులు, చర్చలలో అనేక పర్యాయములు ప్రభుత్వపక్షాన, విశ్వవిద్యాలయం పక్షాన పాల్గొని అనేక అంశములు చర్చలు జరిపి; పండిత ప్రశంసలకు పాత్రులైరి.
డా. గంగప్పగారు తమ ఐదుపదుల వయస్సుకె ఎనలేని సాహిత్యకృషి గావించి; ఆంధ్రదేశమున వాసికెక్కరి. వీరింకనూ శతాధిక గ్రంథకర్తలై సహ్రసాధిక పరిశోధనా విద్యార్థులు వీరి చేతిమీదుగా తయారు కాగలరని ఆశింతముగాక.
———–