చొక్కపు నారాయణస్వామి (Chokkapu Narayanaswamy)

Share
పేరు (ఆంగ్లం)Chokkapu Narayanaswamy
పేరు (తెలుగు)చొక్కపు నారాయణస్వామి
కలం పేరు
తల్లిపేరుబలాంబ
తండ్రి పేరుకంబయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ4/4/1939
మరణం
పుట్టిన ఊరుయు. కొత్తపల్లి డోన్ తా. కర్నూలు జిల్లా.
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికచొక్కపు నారాయణస్వామి
సంగ్రహ నమూనా రచనఅది 1956వ సంవత్సరం. అనంతపురం కళాశాలకు శ్రీ శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు క్రొత్తగా ప్రిన్సిపాల్ గా నియమితులైరి. వారు సైన్సులో డాక్టరేట్ పొందినను, పల్లె పదాలు మొదలు పరమాణువు వరకు క్షుణ్ణంగా విషయ పరిజ్ఞానముగల వ్యక్తి. ఆయనగారు ఆ సంవత్సరం కళాశాల మ్యాగజైనుకు విద్యార్థులనుండి వ్యాసములు సేకరించి, వచ్చిన వ్యాసములను పరిశీలించిరి. అందులో ఒక విద్యార్థి జానపద సాహిత్యమును గూర్చి వ్రాసిన వ్యాసము అమితంగా ఆయన్ని ఆకర్షించింది.

చొక్కపు నారాయణస్వామి

అది 1956వ సంవత్సరం. అనంతపురం కళాశాలకు శ్రీ శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు క్రొత్తగా ప్రిన్సిపాల్ గా నియమితులైరి. వారు సైన్సులో డాక్టరేట్ పొందినను, పల్లె పదాలు మొదలు పరమాణువు వరకు క్షుణ్ణంగా విషయ పరిజ్ఞానముగల వ్యక్తి. ఆయనగారు ఆ సంవత్సరం కళాశాల మ్యాగజైనుకు విద్యార్థులనుండి వ్యాసములు సేకరించి, వచ్చిన వ్యాసములను పరిశీలించిరి. అందులో ఒక విద్యార్థి జానపద సాహిత్యమును గూర్చి వ్రాసిన వ్యాసము అమితంగా ఆయన్ని ఆకర్షించింది. ఆ విద్యార్థి ని పిలిచి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఆ విద్యార్థికి జానపద సాహిత్యంపై గల మక్కువను గ్రహించి, జానపద పాటలను సేకరింపు మని ప్రోత్సహించిరి. ఆనాటినుండి వారిరువురు సాహితీ మిత్రులైరి. ప్రతిదినం ఆ విద్యార్థి ప్రిన్సిపాల్గారి ఇంటివద్దకు వెళ్ళి జానపద గేయాలను గూర్చి, లేపాక్షి, తాడిపత్రి దేవాలయముల శిల్పములను గూర్చి చర్చించుకొనేవారు. ఇంతకూ ఆ విద్యార్థి ఎవరు? ఎవరూ కాదు. ఆ విద్యార్థి చొక్కపు నారాయణస్వామే నని వేరుగా జెప్ప పనిలేదు.
పూవు పుట్టగనే పరిమళించునన్నట్లు నారాయణస్వామి చొక్కపు వంశములో పుట్టిన నాటినుండే సాహితీ పరీమళములు గుభాళించినవి. ప్రాథమిక విద్యాభ్యాసమును స్వగ్రామములో ముగించి, ఉన్నత విద్యను టోన్లో జరుపుతున్నప్పుడు వీరు వీరి మామగారైన అలాసుంకన్నగారి సమక్షములో ఉండడం జరిగింది. అక్కడి సాధు సాంగత్యము, వేదాంత చర్చలు, వీరిని ఆధ్యాత్మిక దృష్టిలోనికి మరల్చింది. అప్పుడే ప్రాచీన తాళపత్ర గ్రంథ సేకరణపై విశేషమైన అభిరుచి ఏర్పడింది. దొరికిన ప్రతి తాళపత్ర గ్రంథమును, వ్రాతప్రతులను సేకరించి భద్రపరచడం మొదలుపెట్టిరి. రాను రాను వారి నిలయం ‘‘సరస్వతీ నిలయం’’గా మారింది.
వీరి తాళపత్ర గ్రంథసేకరణ కృషినిగూర్చి కీ.శే. కళాప్రపూర్ణ నిడదవోలు వేంకటరావుగారి వంటి పరిశోధన కర్తలు తమ అమూల్యాభిప్రాయముల నిట్లు తెలిపిరి. ‘‘శ్రీ నారాయణ స్వామి గారై దువందలకుపైగా నమూల్యములగు తెలుగు తాళ పత్రములను, వ్రాత ప్రతులను సేకరించిరి. వారి గ్రంథ సంచయమున నెట్టి యద్భుతపు కబ్బములున్నచో తెలుపుటకు ఒక ఉదాహరణము చూపుచున్నాను. ఇప్పటికి నాల్గేండ్ల క్రిందట 1950లో మద్రాసు విశ్వవిద్యాలయ పక్షమున తెలుగు కవుల చరిత్ర అను గ్రంథమును ప్రకటించినారు. అందు ‘‘విష్ణువర్థన మంత్రి – బృహజ్జాతకము’’ అను ప్రథమ తెలుగు వచన కృతిని గూర్చి ప్రస్తావించితిని. ఇంతవరకు సాహిత్యలోక మెరుగని ఈ కృతికి ప్రత్యంతరము లభింపగలదను నాశయును నాకు లేకపోయినది. ఇట్లుండ ఆంధ్ర ప్రభుత్వమువారి ఆర్షశాఖ వారిచే నియమితుడనై మహబూబ్ నగరమున శ్రీ నారాయణస్వామి తాళపత్ర గ్రంథములు పరిశీలించుచుండగా ‘‘విష్ణువర్ధనమంత్రి – బృహజ్జాతకము’’ అన్న గ్రంథమును జూచి నేనత్యంతాశ్చర్య భరితుడైనాను. దీనికి ప్రత్యంతరము ఒక తంజావూరు పుస్తక భాండాగారములో తప్ప వేరొకచోట చూడలేదు. అదియును అసమగ్రము. నారాయణ స్వామిగారు ఇప్పటికనేక గ్రంథములను పరిష్కరించియున్నారు.
వాఙ్మయ పరిశోధకులకు తో యుపయోగకరముగా నుండునట్లుగా నొక సూచిక తయారుచేయుచున్నారు. ఇది సంపూర్ణముగా సిద్ధమైనచో నాంధ్రదేశమున విశ్వ విద్యాలయ పరిశొధకులకు సాహితీ వేత్తలకు వాఙ్మయ చరిత్రకారులకు నత్యంత ఉపయుక్తమగును. ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారమువారు, సామిత్య పరిశోధక సంస్థలు. విశ్వవిదాయలయములు చేయవలసిన పనిని శ్రీ నారాయణస్వామిగారు అందును సాహిత్యేతరోద్యోగమున నున్నవారు చేయుట ఎంతో యభినందనీయము.’’
శ్రీ నారాయణస్వామి పరిష్కరించిన, ప్రచురించిన తాళ పత్ర గ్రంథములు వరుసగా యివి. 1) బ్రహ్మాండ వచనము : దీని కర్త మాచనామాత్యుడు. చతుర్వేదములను, అష్టాదశ పురాణములను పరిశీలించి సారంబును తీసి ఈ బ్రహ్మాండ వచనము చేసెను. ఇదొక సంక్షిప్త విజ్ఞాన సర్వస్వము. మానవుని సందేహ నివృత్తికోశము. ఈ వచన కృతిని పరిష్కరించుటకు నారాయణస్వామి మద్రాసు, తిరుపతి, తంజావూరు ప్రాచ్యలిఖిత తాళపత్ర భాండాగారముల అధిపతులతో సంప్రదించి ఆ గ్రంథములను క్షుణ్ణముగా పరిశీలించి, ఒక తీరుకు తెచ్చిన విషయము సర్వదా శ్లాఘనీయము. ఇందు వీరు చక్కటి పీఠికను కూడా వ్రాసిరి.
తరువాత 2) శఠకోప విన్నపములు – వీరు తాళపత్రముల నుండి పరిష్కరించిన గ్రంథము. శఠకోపముని ఆళ్వార్లలో కడు ప్రసిద్ధుడు. ఆతని విన్నపములివి. తరువాతి గ్రంథము 3) సభాపతి వచనములు. శ్రీ నారాయణసవ్మి సంకలనము చేసిన గ్రంథములలో ‘‘ఆంధ్ర వచన మణిభూషణము’’ ఒకటి. ఇది ఆంధ్ర సాహిత్య లోకమునకే నూతనమైనది. ఈ గ్రంథము ప్రజలను ఆధ్యాత్మిక దృష్టి వైపుకు మరల్చును.
ఇంకను వారి అముద్రిత రచనలు కొన్ని గలవు. 1. శ్రీ లక్ష్మీనారాయణ నానార్థ నిఘంటువు 2) పాలమూరి మండల రాజకవులు 3) వర్థమానపురం 4) వైద్యశతశ్లోకి 5) నారాయణస్వామి గేయాలు 6) నిత్యాను సంధానము 7) విష్ణు వర్ధనమంత్రి రచించిన ‘‘బృహజ్జాతకము’’ను పరిష్కరించిటీకతో ప్రచురించనున్నారు. ఒకవైపు తాళపత్ర గ్రంథ పరిశోధను మరోవైపు జానపద గేయముల సేకరణ రెండునూ అడ్డులేక చొక్కపువారు సాగించినారు. వీరు వెలువరించిన జానపద గేయసంకలనము ‘‘తేనెసోనలు’’, ఇందు 23 గేయములు కలవు. అన్నియు వివిధ వైవిధ్యములుగల జానపద గేయములే. ఈ కృతి అపాత మధురోద్యమానికి నాంది. 1966లో ఈ గేయములను ముద్రింపదలచి, ప్రెస్సువారికి డబ్బుకూడా చెల్లించిన సమయములో శ్రీ అనంతాచారి అను ఒక కవి మిత్రుడు కోరిక మేరకు ఆయన వ్రాసిన ‘‘శ్రీ వేంకటేశ్వర శతకము’’ను పై కృతికి మారుగా ముద్రించుట జరిగినదని వ్రాసుకొన్నారు. ఈ చొక్కపు వారు కృతికర్తలే కాదు. కృతిభర్తలు కూడనని నిరూపించుకొన్నారు. అట్లే డా. వల్లపురెడ్డి బుచ్చారెడ్డిగారి ‘‘ముక్తగీతికల’’ను కూడా వీరు 1972లో ముద్రించి కవిపోషకులైరి. ఆగిపోయిన వీరి తేనెసోనలు 1974లో వెలుగులోనికి వచ్చినది.
జీవిత భీమా సంస్థలో వీరు విస్తరణాధికారిగా పనిచేయుచూ ఆ సంస్థకు కూడ తమ సాహిత్య సేవను నాటకముల ద్వారా అందించిరి. జీవితభీమా కథ; పరివర్తన. నాటికలు జీవితభీమా అంశముపై వ్రాయబడిన రచనలే. నాటకములలో నటించు టకూడా వీరికి చిన్నతనము నుండి వున్నఅభిరుచి. ధ్రువోపాఖ్యానములో వీరు ‘‘సురుచి’’ స్త్రీపాత్రను, శ్రీకృష్ణ రాయబారములో శ్రీ కృష్ణుని పాత్రను, కనువిప్పు, యోగక్షేమం మొదలగు సాంఘిక నాటకములలో నాయక పాత్రలను వేసిరి.
ఇక వీరి సామిత్య, సాంస్కృతిక, విద్య, వైద్య, గ్రంథాలయ, దేవాలయ మొదలగు వివిధ సంస్థల నిర్వహణా కార్యక్రమములను గూర్చి విపులీకరించుటకు వేయినాల్కల ఆదిశేషునికైనను వీలుకాదు. 1957-61 సం. మధ్య ద్రోణాచలంలో ఒక ఉచిత హోమియోపతి వైద్యశాలను స్థాపించి బీదలకు సేవచేసిరి. 1964లో మహబూబ్ నగరమునందు ‘‘వివేకానంద విద్యాకేంద్రము’’ను స్థాపించి విద్యావ్యాప్తిని, మహబూబ్నగర్ తాలూకాలోగల రామకొండలో దేవాలయ నిర్మాణము, 1976లో వరంగల్ సాహితీ సమితి స్థాపన, ‘‘చొక్కపువారి సరస్వతీ నిలయం’’ (గ్రంథాలయం) భారత సేవక సమాజ్ కన్వీనర్గా, జీవ కారుణ్య సంఘమునకు గౌరవ కార్యదర్శిగా, వక్తగా, బహుముఖ కార్యకర్తలుగా వ్యవహరించుచున్నారు.
మంచి వ్యక్తిత్వము, మూర్తిత్వము, సహృదయతలకు వీరు పెట్టినది పేరు. అందుకే నిడదవోలువారు వీరిని గూర్చి యిట్లు ప్రస్తుతించిరి.
చొక్కపు రూపురేఖలును, చొక్మమునైన మనంబు మాటయున్
చొక్కపు చేతలెల్లకడు, చొక్కపు వర్తనమెంచి చూడగా
చొక్కమువై జనంబులను సొక్కగ జేయుటచేత నీతడున్
చొక్కపు వంగడంబునను శోభిలె గాదె యమోఘధీభ్యుడై
ఇంతటి యశోవంతులైన శ్రీ చొక్కపువారు జీవితభీమా సంస్థలో కూడా మంచిపేరును సంపాదించుకొని, సాహితీసేవను వదలక, నిర్వహించుచూ, భార్యాపుత్ర సమేతులై ప్రస్తుతము కర్నూలునందు నివసించుచున్నారు. వీరికి భగవంతుడు ఆయురారోగ్య భాగ్యములనిచ్చి వీరిచేత జీవితాంతము బహు విధములైన సాహిత్య సేవలను చేయించుగాక.

———–

You may also like...