దుత్తలూరి రామారావు (Duttaluri Ramarao)

Share
పేరు (ఆంగ్లం)Duttaluri Ramarao
పేరు (తెలుగు)దుత్తలూరి రామారావు
కలం పేరు
తల్లిపేరులక్ష్మీదేవమ్మ
తండ్రి పేరుదుత్తలూరి చలపతిరావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుమందలపల్లి – మడకశిరా తా. అనంతపురం జిల్లా.
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికదుత్తలూరి రామారావు
సంగ్రహ నమూనా రచనసీ. జాబిల్లి కంటెను జక్కనౌ వదనంబు
నల్లని ముంగురుల్ నటనమాడు
కనుబొమల్ ధనువులై కన్పించు వేయేల
మెఱుపుకంటె ధనువు మేల్మి యగును
ఆకాశరాజున కనుగుకూతురు పేరు
‘‘పద్మావతీ’’యన బరగుచుండు
రమణి నిజమ్ముగా లక్ష్మిదేవిని బోలు
పున్నెమ్ము బండె; నా పొలతి చూచి

దుత్తలూరి రామారావు

అనంతపురం జిల్లా, మడకశిరా తాలూకా, అమరాపురం హైస్కూలులో 4వ పాఠము చదువుతున్న ఒక విద్యార్థి తనకున్న సహజశక్తితో పద్యములు పాటులు వ్రాయుచూ, హరికథలను కూడా, గానము చేయుచుండుట చూచి ఆ పాఠశాలలోని ఆంధ్ర పండితులైన విద్వాన్ శ్రీ రూపావతారం నారాయణశర్మ గారు, మిగుల ఆశ్చర్యమంది ఆనందాతిశయముతో ఒకవైపు ఆ విద్యార్థియొక్క విద్యాభివృద్ధిని కాంక్షించుచూ, ‘‘పెద్దవాడైన తరువాత వ్రాయవచ్చులే’’ అని సలహాయిచ్చిరి. ఆ విద్యార్థి దురదృష్టమేమో చదువు సక్రమముగా సాగినదికాదు. పూజ్యనీయులైన పద్మశ్రీ కల్లూరి సుబ్బరావుగారి ప్రేరణతో ఆ విద్యార్థి హైదరాబాదు నగరమునకు వెళ్ళి ‘‘తెలుగు విశారద’’ పరీక్షలకు చదువునారంభించెను. అప్పుడే ఆ విద్యర్థి శ్రీ దివాకర్ల వెంకటావధాని గారి దృష్టిలో కూడ పడినాడు. నాటినుండి వారిరువురి పరిచయము దినదినాభివృద్ధి చెందినది. ఆవిద్యార్థియే దుత్తలూరు రామారావు.
శ్రీ దుత్తలూరు రామారావు 1960 నుంచి 1970 వరకు, వివిధ ఉన్నత పాఠశాలలో, తెలుగు పండితులుగా పనిచేసిరి. వీరి ఇష్టదైవము శ్రీ వేంకటేశ్వరుడు. తన్ను నడిపించు దైవమాతడేయని నమ్మిన భక్తకవి రామారావు. వీరి కృతులన్నియు దైవసంబంధమైనవే. అందులోను శ్రీ వేంకటేశ్వరునిపై అల్లిన కవనమే అధికము. శ్రీ రాఘవేంద్రస్వామివారి చరిత్ర, శని మహాత్మ్యము లేక విక్రమార్క గర్వభంగము వీరి రచనలు. వీరికృతులలో, ‘‘నిర్వచన పద్మావతీ శ్రీనివాస కల్యాణము’’ ఒక రసవత్తర కావ్యము. ఇందలి పద్యములన్నియు, శ్రీ తిరుమలేశుని తోమాల సేవకు వినియోగించు వివిధ సుగంధ రమణీయ పుష్పములే.
‘‘ఈ కావ్యము సరళమై సర్వ సుబోధకరమై రచింపబడినది. పద్యములన్నియు, ధారాశుద్ధి శోభితములై, నిరర్గళముగ సాగిపోవుచున్నవి. అందుకు కారణము, శ్రీ వేంకటేశ్వరుని యెడ కవికిగల భక్తి విశేషమే. ఎడనెడ వారు తెలుగు జాతీయములైన, నుడికారముల జక్కగా ప్రయోగించి యున్నారు. ఈ కావ్యమంతయు, సాధారణ వృత్తపద్యములలోనే వ్రాయబడినది. అక్కడక్కడ, మత్తకోకిలలు కనుపించు చున్నవి. వృత్త, గీత, సీస, కందములలో వేనిని వ్రాసినను కవిగారు కావ్యమునంతను సహజధారతో సాగించియున్నారు. చదువుట కారంభించినవారు, ముగియువరకు చదువక విడువరు. ఈ కావ్యమునందలి శైలీ మాధుర్యము, కథా రమణీయతయే ఇందుకు తార్కాణము’’ అని శ్రీ దివాకర్ల వేంకటావధానిగారు తమ అమూల్యాభిప్రాయము తెల్పిరి.
శ్రీ వేంకటేశ్వరుడు పద్మావతిని చూచినప్పటినుండి ఆతని మనసు పరవశమైనది. ఆమెను పెండాలడదలచినాడు. తల్లి వకుళాదేవి కుమారుని ఊరడించి, మనోవ్యథకు కారణమడిగినది. అప్పుడు శ్రీ వేంకటేశ్వరుడు తల్లితో చెప్పిన విదమును కవిగారిట్లు వ్రాసిరి.
సీ. జాబిల్లి కంటెను జక్కనౌ వదనంబు
నల్లని ముంగురుల్ నటనమాడు
కనుబొమల్ ధనువులై కన్పించు వేయేల
మెఱుపుకంటె ధనువు మేల్మి యగును
ఆకాశరాజున కనుగుకూతురు పేరు
‘‘పద్మావతీ’’యన బరగుచుండు
రమణి నిజమ్ముగా లక్ష్మిదేవిని బోలు
పున్నెమ్ము బండె; నా పొలతి చూచి
గీ. ఆమె బొందని జన్మ నిరర్థకంబు
కోమలాంగి జేబట్టుటే కోటిసుఖము
వివరముగ నా విరహబాధ విన్నవించి
శీఘ్రముగ, వాంఛితముదీర జేయుమమ్మ.
ఇందలి పద్యములిట్లు సరళముగా, తీగ సాగిన రీతిగా సాగిపోవుచుండును. ఇట్టి పద్యము లిందనేకములు. తదుపరి వీరి ‘‘శ్రీ వేంకటేశ్వర గానామృతలహరి’’ యందు. 101 భక్తి కీర్తనలు ఎల్లరూ సులువుగా పాడుకొనుటకు వీలుగా రచించిరి. ఈ పాటలు భక్తిరస భరితములు, అమృతలహరులు. ఇందు, వేంకటేశ్వరుని లీలలన్నియు వర్ణింపబడినవి. ఈ పాటలలో కొన్నిచోట్ల తత్వము, కొన్ని చోట్ల భక్తి, మరికొన్న చోట్ల వైరాగ్యము చోటు చేసుకొన్నవి. భక్తుడైన ఈ కవి తన స్వామిని నిలదీసి యిట్లడుగుచున్నాడు.
నిన్నేమి – అనరాదు, నీ – కిదియు – సరిగాదు
కన్నయ్య – నాకిన్ని కడగండ్ల నిడరాదు

సర్వకాలములందు – సర్వవేళయందు
సర్వనామములందు – సంస్మరించుచు నుంటి
నాయార్తి నాలించి నన్నేలు కొమ్మంటి
సర్వమంగళవేష – సరేవశ జగదీశ

తనువెల్ల సొమ్ములను – తగిలించుకొని తిరుగ
అంతమోజా నీకు శ్రీనాథ గోవిందా

ఇన్ని బరువులమోయు నాచిన్ని కన్నయ్య
ననుబ్రోచు భారమ్ము – నీకు భారమె? తండ్రి.
ఈ కృతికి ప్రేరకుడు – కారకుడు – ప్రకాశకుడు, ఆ కలియుగ వేంకటేశ్వరుడే యని కవిగారు చెప్పుకొన్నారు. ఇక ‘‘శ్రీ తాళ్ళపాక అన్నమయ్యచరిత్ర’’, ‘‘శ్రీ సత్యనారాయణ పూజా మహాత్మ్యము’’, ‘‘కలియుగ వైపరీత్యము’’, భిక్ష్టనాధీశ్వర శతకము’’, ‘‘పాంచజన్యము’’, ‘‘అమృతాభిషేకము‘‘ వీరి అముద్రిత కృతులు.
శ్రీ రామారావుగారు కవులేకాక, చలనచిత్ర నటులుగా కూడ పేరు తెచ్చుకొన్నారు. మడకశిరాలో జరిగిన, సాహిత్య సభలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కీ.శే. పద్మశ్రీ చిత్తూరు నాగయ్యగారు రామారావుగారిని, సినీరంగ ప్రవేశము చేయుటకు ప్రోత్సహించిరి. రామారావు మద్రాసుకు వెళ్ళి కొన్ని ఏండ్లు గడిపి శ్రమకోర్చి చిన్న చిన్న పాత్రతలను పోషించిరి. ఇప్పుడు కూడ అవకాశము కొరకు ఎదురుచూచు చుందురు. ప్రస్తుతము వీరు అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణమందు స్వంత ఇంటిలో సుఖముగా కాలము గడుపుచున్నారు. వీరికి శ్రీ వేంకటేశ్వరుడు ఆయురారోగ్య భాగ్యములనిచ్చి కాపాడుగాత.

———–

You may also like...