పేరు (ఆంగ్లం) | Dr. Sarraju Lakshmi Narasimharao |
పేరు (తెలుగు) | డా. సఱ్ఱాజు లక్ష్మీ నరసింహరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | లక్ష్మీనరసమ్మ |
తండ్రి పేరు | సఱ్ఱాజు కృష్ణయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | కావలి, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | – |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | డా. సఱ్ఱాజు లక్ష్మీ నరసింహరావు |
సంగ్రహ నమూనా రచన | శ్రీ సఱ్ఱాజు లక్ష్మీనరసింహరావు సాధారణ మధ్యతరగతి కుటుంబములో జన్మించి, బాల్యము నుండియు సత్సంప్రదాయములో పెరిగిన గుణశీలురు. వీరిలో సాహిత్యాభిరుచిని చిగురింప జేసినవారు శ్రీరాం వేంకట భుజంగరాయశర్మగారు. అభినివేశంతో ఆంధ్ర సాహిత్యమును అభ్యసించినారు. ప్రస్తుతము వీరు హిందూపురం పట్టణ మందలి యస్.డి.జి.యస్. కళాశాలలో ప్రధానాంధ్రోపన్యాసకులుగా పనిచేయుచున్నారు. |
డా. సఱ్ఱాజు లక్ష్మీ నరసింహరావు
శ్రీ సఱ్ఱాజు లక్ష్మీనరసింహరావు సాధారణ మధ్యతరగతి కుటుంబములో జన్మించి, బాల్యము నుండియు సత్సంప్రదాయములో పెరిగిన గుణశీలురు. వీరిలో సాహిత్యాభిరుచిని చిగురింప జేసినవారు శ్రీరాం వేంకట భుజంగరాయశర్మగారు. అభినివేశంతో ఆంధ్ర సాహిత్యమును అభ్యసించినారు. ప్రస్తుతము వీరు హిందూపురం పట్టణ మందలి యస్.డి.జి.యస్. కళాశాలలో ప్రధానాంధ్రోపన్యాసకులుగా పనిచేయుచున్నారు.
నరసింహరావుగారు రచనలలోగల కథ, కవిత, వ్యాస, నవల, నాటిక మున్నగు వివిధ ప్రక్రియల నన్నింటిని చేబట్టి తనదైన వ్యక్తిత్వంతో ధాసింపజేసినవారు. వీరు మంచివక్తలు.
శ్రీ నరసింహరావు బహు గ్రంథకర్తలు కాకపోయినా, బృహద్గ్రంథకర్తలు. వీరిని సామాన్యులుగా లెక్కించుటకు వీలులేదు. మహాసముద్రముల నీదగలిగిన గజ తగాడేకాదు. అందలి అనర్ఘరత్నముల నేరి రాశిగా పోయగలిగిన అన్వేషి. కవిత్రయ మహాభారతము ఒక మహాసముద్రమే కదా. అందలి అలంకారముల నేరి వాటిని గూర్చి సమ్రగ పరిశోధన గావించి వాటిని వెలికిదెచ్చి ప్రకాశింపజేసిన ఘనులు. ‘‘ఆంధ్ర మహాభారతము అలంకారసమీక్ష’’ను శ్రీరావుగారు అనంతపురం పి.జి. సెంటర్ ద్వారా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయమునకు తెలుగులో డాక్టరేట్ పట్టా కోసం ఈ పరివోధన గ్రంథాన్ని సమర్పించారు. వీరి గురువులు శ్రీ కోరాడ మహదేవశాస్త్రిగారు వీరి కీవిషయమై కుతూహలము కలిగించిరి. వారి సలహా మేరకు రావుగారు ‘‘ప్రయోగ సౌందర్య సమీక్ష’’ చేయుటకు పరిమితము చేసుకొనిరి.
ఈ పరిశోధన వ్యాసము రెండు అధ్యాయములుగా విభజింపబడినది. అందులో మొదటి అధ్యాయయమున అలంకారాన్ని కేంద్ర బిందువుగా తీసుకొని సముచిత విషయ విస్తరం చేసుకొంటూ అలంకార ముఖ్య సిద్ధాంతాలనన్నింటిని కూలంకషంగా చర్చించిరి. ‘‘అలంకార ప్రశస్తి’’లో వేద వేదాంగాలనుండి మంత్రాలను ఉదాహరిస్తూ అలంకారం పుట్టు పూర్వోత్తరాలను శ్రీరావుగారు చక్కగా నిరూపించారు. ఇందు అలంకార స్థానాన్ని నిర్థారించి, అలంకార శిల్పాన్ని విశ్లేషిష్తూ చేసిన సమీక్ష ఎంతో ప్రామాణికంగా లాక్షణిక హృదయావర్ణంగాను ఉన్నది.
కవిత్రయం ఏయే ప్రయోజనాన్ని అపేక్షించి ఎక్కడ ఏయే అలంకారాలను ఎలా ప్రయోగించారో, ఎలా పెంచారో కూడ స్పష్టం చేయబడింది. ఈ విధానాన్ని విశ్లేషించి చెప్పడం రావుగారి నిశిత పరీక్షకు నిదర్శనం. తిక్కన, ఎఱ్ఱాప్రెగడల అనువాద భాగాల్లోనుండి ప్రతి అలంకారానికి ఎన్నో ఉదాహరణలను ప్రదర్శించి, పరిశోధనను ఎంతో ప్రామాణికంగా శ్రీరావుగారు సాగించారు. ప్రధానాలంకారాలైన ఉపమ, రూపక, ఉత్ర్పేక్షలను మూలానువాద సాదృశ్యపరిశీలన పద్ధతిలో పరిశీలించి, ఇతర ముఖ్యాలంకారాలను ఎనభై మూడింటిని ఎంతో సంగ్రహంగా, సవిమర్శంగా, సముచితంగా ప్రతిపాదించిరి.
ఈ పరిశోధన వ్యాసము ఆంధ్ర మహాభారతముపై అలంకార సమీక్ష చేయడానికి వ్రాసిందైనా అలంకారంపై సంస్కృత లాక్షణికుల సిద్ధాంతాలకు కూడా ఒక చక్కని ఆదర్శంగా కనబడుతూంది. అలంకార స్వరూపాన్ని అవగాహన చేసుకోవాలనుకొనే సహృదయులైన రసహృదయులకు ఈ గ్రంథము ఒక చక్కని కరదీపిక వంటిది. ప్రామాణికంగా ఔచిత్య భాసురంగా ఇంత చక్కని పరిశోధన చేసి ఆంధ్ర సాహితీ లోకంపై తీరని ఋణభారాన్ని మోపారు. డా. సఱ్ఱాజు లక్ష్మీనరసింహరావుగారు.
శ్రీ రావు పై ప్రామాణిక పరిశోధనా గ్రంథాన్నేకాక ‘‘భువనవిజయము’’, ‘‘మగువ మనసు’’ అనబడు కథల సంపుటిని రచించి ముద్రించిరి. కాలేజి విద్యార్థుల ప్రోత్సాహముతో వారి ప్రదర్శన నిమిత్తమై వీరు వ్రాసిన ‘‘భువనవిజయము’’ అటు ప్రదర్శనకు ఇటు చదువుటకు యోగ్యముగా నున్నది.
నరసింహరావు గారికి కథారచన చిన్నతనమునుండే అలవడినది. రానురాను వారి ఆసక్తి యినుమడించినది. తనతో బాటు ఉత్సాహవంతులైన నలుగురిని కథారచనలో సిద్ధహస్తులను చేయవలెననెడి సంకల్పము వారిది. అందుకే వుద్యోగ రీత్యా హిందూపురమునకు వచ్చి చేరిన నరసింహారావుగారు స్థానిక కథా రచయితల నందరినొక్క చోట చేర్చి వారిలోని సృజనాత్మక శక్తిని పెంపొందించుటలో కృషి సల్పి సత్ఫలితము పొందిరి. రావుగారిది కథారచనలో అందెవేసిన చేయి. వీరి అనేక కథలు సుప్రసిద్ధ తెలుగు వారపత్రిక లన్నింటిలో ప్రచురింపబడినవి.
వీరి ‘‘మగువ మనసు’’ సంపుటిలోని కథలన్నీ పుష్టిని, తుష్టిని కలిగి మనస్తత్వ పరిశీలనకు చోటివ్వబడినవి. వీరి కథల్లోని వర్ణనలు, అలంకారాలు చదువరి దృష్టికి వేగనిరోధకాలనిపించినా, ఆ వర్ణనలు, అలంకారాలు అతన్ని కొంత తడవు ఆలోచింపచేస్తాయి. మగువమనసు కథలో ‘‘సంతానంలేని స్త్రీ లోపమంతా మగాడిదే నన్నట్లు సులభంగా తప్పుదార్లలో పడుతుంది. పరులకోసం ప్రాకులాడుతుంది’’ అన్న దురభిప్రాయాన్ని రచయిత ఇందులో కాదని పూర్ణమ్మ పాత్రచేత లోకానికి తెలియజేసారు.
‘‘మంచిమనిషి’’ అనే మరో కథలో రైళ్ళల్లో అవి యివి ప్యాసింజర్లకు అమ్ముకొంటూ జీవించే ఓ వెండర్‌ను రచయిత ఓ దొంగగా భావిస్తాడు. అతడెంతటి కళాకారుడో? అతని సహృదయత ఎంతటిదో? అతడెంతటి హస్తకళానైపుణ్యం గలవాడో తుదకు తెలుసుకొని ఆనాటి రైలు ప్రయాణములోనే అతడు తన కుడిచేతిని పోగొట్టుకోవడం చూచిన తాను (రచయిత) ఎంతగా కుమిలిపోయింది. చక్కగా చిత్రీకరించినట్లు కథను వ్రాసారు. వీరి ఈ కథల సంపుటి త్వరలోనే వెలువడుతున్నది.
శ్రీ నరసింహరావు మంచి రచయితలు, వక్తలేకాదు, కళాసాహిత్య సేవా సంస్థలందు కార్యకర్తలై బహుముఖ సేవలందించిరి. ఇట్టి వీరికి భగవంతుడు ఆయురారోగ్య భాగ్యముల నిచ్చి సర్వదా కాపాడుగాత.
———–