మల్లాది సుబ్బమ్మ (Malladi Subbamma)

Share
పేరు (ఆంగ్లం)Malladi Subbamma
పేరు (తెలుగు)మల్లాది సుబ్బమ్మ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరుఎం.వి.రామమూర్తి
పుట్టినతేదీ08/02/1924
మరణం05/15/2014
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పోతార్లంక
విద్యార్హతలుపి.యు.సి., బి.ఎ.,
వృత్తిస్త్రీవాద రచయిత్రి, హేతువాది
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం, ఆంగ్లం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువివాహం-నేడు-రేపు, వైవాహిక కుటుంబ సలహా, మాతృత్వానికి మరో ముడి, ప్రేమ + సెక్స్, ఏది అశ్లీలం, బానిస కాదు – దేవత కాదు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుస్త్రీవాద రచయిత్రి, హేతువాది మరియు స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. అరవైకి పైగా రచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మహిళోద్యమం- మహిళా సంఘాలు 1960-1993 అనే పుస్తకం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథం అవార్డు పొందింది. సంఘసేవకు గాను ఎమ్.ఎ.థావుస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డుపొందారు. మల్లాది సుబ్బమ్మ మహిళా ఒకేషనల్ జూనియర్ కళాశాల ను 2000లో ప్రారంభించారు. ఆమె తన యావదాస్తిని ‘మల్లాది సుబ్బమ్మ ట్రస్టు’కి రిజిస్టరు చేసారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమల్లాది సుబ్బమ్మ
సంగ్రహ నమూనా రచన

మల్లాది సుబ్బమ్మ

నిర్వహిస్తున్న సంస్థలు
మహిళాభ్యుదయ సంస్థ : దీనిని 1980లో స్థాపించారు. మిగిలిన సంస్థలు దీనికి అనుబంధంగా పనిచేస్తాయి. దీనికి 100 మందికి పైగా సభ్యులు, హితుల సహాయంతో మంచి గ్రంథాలయాన్ని కూడా స్థాపించి నడిపిస్తున్నారు.
అభ్యుదయ వివాహవేదిక : దీనిని 1981లో స్థాపించి ప్రేమ, కులాంతర, మతాంతర, భాషాంతర, దేశాంతర, వరకట్నరహిత మరియు విధవా వివాహాలను జరిపించి చట్ట ప్రకారం రిజిష్టరు చేస్తున్నారు.
కుటుంబ సలహా కేంద్రం : దీనిని 1980లో స్థాపించారు. కుటుంబ కలహాలతో సతమతమౌతున్న భార్యాభర్తలను కలపడం, వీలుకాని పరిస్థితులలో విడాకులు ఇప్పించడం, భత్యాన్ని ఏర్పాటుచేయడం, హింసాత్మకంగా మారిన వారికి చట్టపరంగా శిక్షించడం చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నది.
శ్రామిక మహిళా సేవ : దీనిని బాదం రామస్వామి గారి ఆర్థిక సాయంతో 1989లో నెలకొల్పారు. దీని ద్వారా వడ్డీ లేకుండా శ్రామిక మహిళలకు చిన్న వ్యాపారాలు చేసుకొనడానికి ఆర్థిక సహాయం అందజేసి నెలకు 50 రూపాయల చొప్పున తిరిగి చెల్లించే విధంగా ఏర్పాటుచేశారు.
స్త్రీ విమోచన శిక్షణ కేంద్రం : దీనిని 1987లో స్థాపించి స్త్రీలకు శిక్షణ శిబిరాలను నిర్వహించి వారి హక్కులు, కుటుంబ నియంత్రణ, ఓటుహక్కు, ఇతర స్త్రీల సమస్యల మీద అవగాహన కల్గించారు.
స్త్రీల హక్కుల పరిరక్షణ కేంద్రం : దీనిని 1989లో నార్వే వారి ఆర్థిక సహాయంతో వివిధ ప్రాంతాలలోని స్త్రీలకు వారి హక్కులు గురించి చైతన్యవంతుల్ని చేయడం కోసం స్థాపించారు.
సుబ్బమ్మ షెల్టర్ : వివిధ సమయాలలో బాధిత స్త్రీలకు తాత్కాలికంగా ఆశ్రయం కల్పించి కొంతకాలం తర్వాత ప్రభుత్వ సంస్థలకు అప్పగించడానికోసం 1990లో స్థాపించారు.
వృద్ధ మహిళాశ్రమం : దీనిని 1992 సంవత్సరం నార్సింగి గ్రామంలో నెలకొల్పి బాదం సరోజాదేవితో కలిసి దిక్కులేని వృద్ధ మహిళలకు ఆశ్రయం కల్పించి పోషిస్తున్నారు.
కుటుంబ నియంత్రణ సంస్థ : రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ వారి ఆర్థిక సహాయంతో కొద్దిమంది సహాయంతో కుటుంబ సంక్షేమం, జనాభా నియంత్రణ మొదలైన విషయాలను తెలియజేసి శస్త్రచికిత్స కోసం పంపిస్తారు.
వరకట్న హింసల దర్యాప్తు సంఘం : వరకట్నం తీసుకోవడం నేరమని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వీరికి తెలియజేస్తే ఈ సంస్థ ద్వారా కేసును నడిపిస్తారు.
వికాస కుట్టు మరియు టైపింగ్ సెంటర్ : దీని ద్వారా మహిళలకు జీవనోపాధి కలిగించడం ఉద్దేశం.
వయోజన విద్యా కేంద్రం : అక్షరాస్యతను వృద్ధి చేయడంలో భాగంగా దత్తాత్రేయ కాలనీలో ఈ కేంద్రాన్ని స్థాపించి కొందరు స్వయం సేవకుల సహాయంతో వయోజనులను విద్యావంతుల్ని చేస్తున్నారు.

నిత్య చైతన్యశీలి మల్లాది సుబ్బమ్మ

నేను1975లో ఒక కుగ్రామం నుంచి బయలుదేరి మహానగరంలో అడుగు పెట్టిన తొలిరోజులు. మా పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులు కూడా దాటి ఎరగని నేను హైదరాబాదులో గుబులు గుబులుగా గడుపుతున్న కాలం. ఎమర్జన్సీ చీకటి కమ్ముకున్న రోజులు. అంతర్జాతీయ మహిళా సంవత్సరం ప్రకటింపబడిన సంవత్సరంలోనే నేను నగరానికి వచ్చిపడ్డాను. పుస్తకాల పరిచయం తప్ప వ్యక్తులెవ్వరూ తెలియదు.1979లో పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌లో ఉద్యోగం రావడంతో నా ఇరుకుదారులు వెడల్పయ్యాయి. ఆఫీస్‌ అయిపోయాక సాహిత్య సమావేశాలకి వెళ్ళడం అలవాటయ్యింది. చదువుకున్నది సంస్కృతం, ఆంగ్లం, తెలుగు బాషలవ్వడంవల్ల సాహిత్యం మీద వల్లమాలిన ప్రేమ. పుస్తకాలంటే… అవే అప్పటి ఆత్మీయ నేస్తాలు. పుస్తకావిష్కరణ సభలకి, సమావేశాలకి వెళ్లడమే అప్పటి ఇష్టకార్యక్రమం. అలాంటి ఒకానొక మీటింగ్‌లో మల్లాది సుబ్బమ్మగారి అనర్ఘళ ప్రసంగం విన్నాను. నదురు బెదురు లేకుండా, కంచు కంఠంతో మాట్లాడుతున్న ఆవిడను నిర్ఘాంతపోయి చూసాను. అప్పటికి నాకు స్టేజంటే చచ్చే భయం. తొలి రోజుల్లో స్టేజిమీద కాళ్ళు గడగడ వొణికేవి. అప్పుడు ఆవిడ ప్రసంగించిన తీరు నా మీద గొప్ప ముద్రవేసింది. ఆవిడ వెలిబుచ్చిన భావాలు చాలా నచ్చాయి. నేను కూడా నా అస్తిత్వం కోసం వెతుక్కుంటున్న రోజులు. నా జీవితాన్ని ఏ మలుపులోకి తిప్పాలి…. నా జీవిత లక్ష్యం ఏమిటి అని అన్వేషించుకుంటున్న సందర్భం. కొత్త భావాల వెంట పరుగులు తీసే వయస్సు. అలా సుబ్బమ్మ గారి మహిళాభ్యుదయ సంస్థల్లోకి నా తొలి అడుగు పడింది. మలి అడు మాత్రం అన్వేషిలో పడి స్థిరపడింది.
మల్లాది సుబ్బమ్మ ఒక వ్యక్తి కాదు మహా సంస్థ. దాదాపు 80 పుస్తకాలపైనే రచించారు. మొదట్లో హేతువాది, సహచరుడు అయిన రామ్మూర్తి గారితో కలిసి, ‘వికాసం’ అనే పత్రికను తర్వాత స్త్రీల కోసం ‘స్త్రీ స్వేచ్ఛ’ అనే పత్రికను నడిపారు. 1924 ఆగస్టు 2న గుంటూరు జిల్లా రేపల్లెలో ఆవిడ జన్మించారు. బాపట్లకు చెందిన మల్లాది వెంకట రామ్మూర్తిని పెళ్ళి చేసుకున్నారు. పెళ్లినాటికి మెట్రిక్‌లేషన్‌ కూడా పూర్తి చెయ్యని సుబ్బమ్మ, తన చదువు కోసం అత్తమామలనెదిరించి డిగ్రీ వరకు చదువుకున్నారు. స్త్రీల కోసం అనేక కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే అనేక అంశాల మీద కథలు, నవలలు, వ్యాసాలు రాసారు. ”పాతివ్రత్యం నుంచి ఫెమినిజం దాకా” పేరుతో ఆత్మకథను రాసారు మల్లాది సుబ్బమ్మ.
సుబ్బమ్మగారి సాహిత్య జీవితం, స్త్రీల అభివృద్ధి కోసం చేసిన కృషి ఒక కోణమైతే, తెలుగునాట మహోగ్రంగా నడిచిన సారా వ్యతిరేక పోరాటంలో ఆవిడ పాత్ర మరో కోణాన్ని ఆవిష్కరిస్తుంది. 1992లో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమానికి మల్లాది సుబ్బమ్మ, సూర్యదేవర రాజ్యలక్ష్మి లాంటి వారు వెన్నుదన్నుగా నిలిచారు సుబ్బమ్మగారు. వివాహం-నేడు-రేపు, వ్యభిచారం ఎవరి నేరం, ఏది అశ్లీలం, బానిసకాదు దేవత కాదు, బంగారు సంకెళ్ళు, స్త్రీ విమోచన, స్త్రీ విముక్తి లాంటి అనేక పుస్తకాలు రాసారు. ఆ పుస్తకాలు అందరూ చదవాలనే ఉద్దేశ్యంతో ప్రతి మీటింగ్‌లోను వాటిని పంచేవారు సుబ్బమ్మగారు. ”ఆంధ్రప్రదేశ్‌ మహిళా ఉద్యమం – మహిళా సంఘాలు” అనే పుస్తకాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంధంగా గుర్తించి అవార్డు నిచ్చి సత్కరించింది. సుబ్బమ్మ తన నివాసంలోనే స్త్రీల కోసం ఎన్నో సంస్థల్ని నెలకొల్పి నడిపారు. స్త్రీ విమోచన శిక్షణ కేంద్రం, శ్రామిక మహిళా సేవ, వరకట్నం హింసల దర్యాప్తు సంఘం, మహిళాభ్యుదయ గ్రంధాలయం లాంటి సంస్థల్ని స్థాపించారు. అలాగే కుల, మత ప్రసక్తి లేని వివాహాలను ప్రోత్సహించడానికి 1981లో అభ్యుదయం వివాహ వేదికను స్థాపించారు.
సుబ్బమ్మగారిని వ్యక్తిగతంగా నేను తలచుకోవలసిన మరో సందర్భం ఈ అభ్యుదయ వివాహవేదిక. 1981లో నేను కుల ప్రసక్తి, మత ప్రసక్తి లేని నాస్తిక వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు సుబ్బమ్మగారు నాకు అండగా నిలిచారు. 1980లో నేను విజయవాడ నాస్తిక కేంద్రంలో నిప్పుల గుండంలో నడిచినప్పుడు (నిప్పుల గుండం ఎవరైనా తొక్కొచ్చు. దీనికి మాయలు, మంత్రాలు అవసరం లేదని నాస్తిక కేంద్రం వాళ్ళు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసారు. నేను పాల్గొని నిప్పుల్లో నడిచాను) నాకు పరిచయమైన వ్యక్తితో కులం, మతం, ప్రాంతం ప్రసక్తి లేకుండా సహజీవనం చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. అప్పుడు మల్లాది సుబ్బమ్మ దంపతులు, లవణం గారు మాకు అండగా నిలబడ్డారు. మా పెళ్ళిని రిజిస్టర్‌ చేసినపుడు మాతో ఉన్నారు. సుబ్బమ్మగారు స్థాపించిన అభ్యుదయ వివాహ వేదికలో నేను జాయింట్‌ సెక్రటరీగా వుండే దాన్ని. ఆ సంస్థ కింద జరిగిన తొలి కులాతీత, మతాతీత, నాస్తిక రీతి పెళ్ళి వేడుక మాదే అని సగర్వంగా చెప్పగలను. సుబ్బమ్మగారు, రామ్మూర్తి గారు, లవణంగారు మేమిచ్చిన తేనీటి విందులో పాల్గొన్నారు. (ఖర్చు 29 రూపాయలు) మా పెళ్ళిని వ్యతిరేకించిన మా అత్తమామలకు ఎంతో నచ్చచెప్పి వారిని వొప్పించారు. (ఆ వ్యతిరేకత కూడా చాలా కొద్దిరోజులే. తర్వాత నేను వాళ్ళకి చాలా ఇష్టురాలిని అయ్యాను.)
మల్లాది సుబ్బమ్మ గారి మరణం నాలో ఇన్ని ఆలోచనలను రేపింది. ఆమెతో నాకున్న అనుబంధాన్ని గుర్తు చేసింది. ఆవిడ ఎంతో ముందు చూపుతో ”మల్లాది సుబ్బమ్మ ట్రస్ట్‌”ని ఏర్పాటు చేసి తన యావదాస్తుల్ని తన సంతానానికి కాకుండా, సమాజాభ్యుదయం కోసం సమాజ సేవ కోసం శ్రమపడేవారికి చేరే విధంగా ఏర్పాటు చేసారు. జీవితాంతం హేతువాదిగా జీవించిన మల్లాది సుబ్బమ్మ తన మరణానంతరం కూడా ఎలాంటి క్రతువుల నీడ పడకుండా తన పార్ధివ శరీరాన్ని గాంధీ ఆసుపత్రికి దానం చేసారు.
తను నమ్మిన దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించి, తన సేవల ద్వారా చరిత్రలో నిలిచిపోయారు మల్లాది సుబ్బమ్మ గారు. ఆవిడ స్మృతికి భూమిక నివాళి ఇది.
-భూమిక సంపాదకురాలు

నిరంతర చైతన్యశీలి
సనాతన సంప్రదాయ కుటుంబంలో 1924లో పుట్టి, పదకొండేళ్ళకు పెళ్ళి చేసుకుని, ఐదుగురు పిల్లల్ని కనిపెంచిన ఒక స్త్రీ, ఒక సామాజిక ఉద్యమకారిణిగా, స్త్రీవాదిగా మారిన క్రమమే మల్లాది సుబ్బమ్మగారి జీవితం. ఈ జీవితం ఆమె స్వయంగా నిర్మించుకున్నది. తన నిర్ణయాల ప్రకారం తన జీవితాన్ని నిన్నటి వరకూ కొనసాగించిన మల్లాది సుబ్బమ్మగారు ఇవాళ లేరు. తన జీవితంలో సగం కాలం తన చుట్టూ అల్లుకున్న ఆచారాలు సంప్రదాయాలనే ముళ్ళ పొదలను నరకటంలోనే వృథా అయిపోయిందనీ, కొంతవరకు మాత్రమే సమాజానికి ఉపయోగపడిందనీ ఆమె చెప్పుకునేవారు.
చిన్నతనంలోనే కనుపర్తి వరలక్ష్మమ్మ గారు నడిపించిన స్త్రీ వితైషిణీ మండలి ప్రభావం సుబ్బమ్మ మీద ఉంది. ఆ సంఘంలో పనిచేసిన అనుభవం తర్వాతి రోజుల్లో అనేక సంఘాలు పెట్టి నడపటానికి ఆమెకు ఉపయోగపడింది. 1972లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో పాల్గొనటంతో ఆమె సాంఘిక ఉద్యమాలలోకి అడుగుపెట్టారు. ‘ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. పగిలిన అద్దం ఎంత అతికించినా అతుకు అతుకే తప్ప సహజం కాలేదు. అందువల్ల విడిపోతే తప్ప పరిస్థితి చక్కబడదు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇచ్చి తీరాలి’ అని ఆమె ఆనాడు చీరాల సభలో మాట్లాడారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన సంగతి తెలిసి కొంతకాలంగా అస్వస్థతలో ఉన్న ఆమె ఏమనుకున్నారో! ఆ తర్వాత జయప్రకాశ్ నారాయణ్ ప్రారంభించిన ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమరె ్జన్సీలో భర్త రామ్మూర్తి గారు అరెస్టయి జైలులో ఉంటే, ఆ కాలమంతా ఎమర్జెన్సీ వ్యతిరేక భావాల ప్రచారం ఏదో ఒక రూపంలో చేస్తూనే వచ్చారు. 1979లో అభ్యుదయ మహిళా సమాఖ్యకు అధ్యక్షురాలై అనేక కార్యక్రమాలు చేపట్టారు. కూరగాయల ఎగుమతి వల్ల ఇక్కడ వాటి ధరలు పెరగటాన్ని గమనించి ఎగుమతిని నిషేధించాలని కోరుతూ జంటనగరాల మహిళా సంఘాలన్నీ కలసి చేసిన ఆందోళనలో సుబ్బమ్మ ముందు నిలచి పనిచేశారు. ఆ రోజు ఉల్లిపాయల ధర రూపాయి నుంచి మూడు రూపాయలకు పెరిగిందని ఆందోళన చెయ్యాలని పిలుపు ఇస్తే స్వచ్ఛందంగా వెయ్యిమందికి పైగా స్త్రీలు వచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు. అలాంటి చైతన్యవంతమైన కాలంలో ఆ కాలాన్ని సద్వినియోగం చేస్తూ జీవించారు మల్లాది సుబ్బమ్మ.
కుల నిర్మూలనోద్యమంలో కూడా ఆమె చాలా కృషి చేశారు. కులనిర్మూలన సంఘంలో చేరి, సభలలో మాట్లాడటం, వ్యాసాలు రాయటం, ఆ సంఘం చేసే కులాంతర వివాహాలను ప్రోత్సహించి సహాయపడటం వంటి పనులెన్నో చేశారు. 1983లో కుల, మత ప్రసక్తిలేని వివాహాలను ప్రోత్సహించటానికి ‘అభ్యుదయ వివాహ వేదిక’ని స్థాపించి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ కూడా కులాంతర, మతాంతర వివాహాలు జరిపిస్తూ వచ్చారు. హేతువాద ఉద్యమంలో భాగమై ఆ చైతన్య వ్యాప్తికి దోహదం చేశారు. 1988లో రాజస్థాన్ హైకోర్టు ఆవరణలో ఆరు అడుగుల మనువు విగ్రహాన్ని ప్రతిష్ఠించారని విని సుబ్బమ్మగారు అంబేద్కర్ సంఘం వారి మీటింగులో దుష్ట మేధావి మనువు అంటూ మనుధర్మ శాస్త్రాన్ని తూర్పార బట్టారు. రాడికల్ హ్యూమనిస్టుగానూ ఆమె పనిచేశారు.
స్త్రీల సమస్యల మీద అనేక వ్యాసాలు, కథలు, నవలలు రాశారు. చాలా రాడికల్ భావాలతో ఆమె కథలు సాగేవి. వికాస కేంద్ర స్థాపన తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టమని సుబ్బమ్మ గారు చెప్పేవారు. సమస్యలలో ఉన్న స్త్రీలు ఎవరైనా అక్కడికి రావచ్చుననే ధైర్యం కలిగించే ప్రయత్నం చేశారు. ‘నేను ఫెమినిస్టుని కాదు’ అని సామాజిక ఉద్యమాలలో సేవలో, రచనలో ఉన్న చాలామంది స్త్రీలు చెప్పుకుంటున్న రోజుల్లో ‘నేను ఫెమినిస్టుని, హ్యూమనిస్టు ఫెమినిస్టుని’ అని చె ప్పుకున్న సాహసవంతురాలు సుబ్బమ్మగారు. ఆమె ఆత్మకథ శీర్షిక కూడా ‘పాతివ్రత్యం నుంచి ఫెమినిజం దాకా’. ఆంధ్రప్రదేశ్‌లో సారా వ్యతిరేకోద్యమం పెద్ద ఎత్తున సాగిన నాటికి సుబ్బమ్మ గారికి 68 సంవత్సరాలు. అయినా సారా వ్యతిరేకోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రదర్శనల్లో, ప్రభుత్వంతో జరిపే చర్చలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సభలలో తన వాగ్ధాటితో సారాపై విరుచుకు పడ్డారు.
‘మల్లాది సుబ్బమ్మ ట్రస్టు’ అని పెట్టి తన స్థిర చరాస్తులను పిల్లలకు కాకుండా ట్రస్టు ద్వారా సామాజిక సేవకు అందేలా చేయటం సుబ్బమ్మగారి ప్రత్యేకత. ఒకప్పుడు ఆమె నివసించిన ఇంట్లో ఇప్పుడు బాలికలకు వృత్తి శిక్షణ కళాశాల నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం అక్కడ సుబ్బమ్మగారు తన విగ్రహాన్ని ప్రతిష్టించారు. జీవించి ఉండగానే ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే-మరణించిన తర్వాత మన గురించి ఎవరు పట్టించుకుంటారు? మనం చేసిన పనులను మనమే గౌరవించుకుంటే తప్పేంటి అని అన్నారు. అప్పుడు నవ్వేశాం గానీ మన దేశ చరిత్ర నిర్మించిన స్త్రీల గురించి మనకి తెలిసినదెంత?
వారు తమ గురించి తాము కొంత శ్రద్ధ తీసుకుని ఉంటే స్త్రీల చరిత్ర ఎంత సంపన్నవంతంగా ఉండేది అనిపించినపుడు సుబ్బమ్మగారు చేసిన పని అర్థవంతమైనదేనేమో అనిపిస్తుంది. ఈ పురుష ప్రపంచంలో స్త్రీలు పని చేసుకుంటూ పోవటమే కాక తమ గురించి తాము చెప్పుకోవాలి. లేకపోతే ఇంత ఆధునిక కాలంలోను వారిని తేలికగా మర్చిపోతారు.
భోళాగా కనిపిస్తూ, గలగలా మాట్లాడుతూ, విశ్రాంతి లేకుండా పనిచేస్తూ, నమ్మినదాన్ని నిక్కచ్చిగా చెప్తూ, దానిని ఆచరిస్తూ ఎంతటి అధికారులనైనా నిర్భయంగా నిలదీస్తూ తనకున్న అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకున్న మల్లాది సుబ్బమ్మగారు తన సేవల ద్వారా, చరిత్రలో చిరకాలం జీవిస్తారు.
-ఓల్గా

———–

You may also like...