ముసలమ్మమరణము |
క. | శ్రీలాలిత వసుధా నా రీ లలిత లలాట తిలక రీతిని ధన ధా న్యాలిఁ బొలుచు నొక పల్లియ చాలంగా బుక్కరాయసంద్రం బనఁగ\న్. | 17 |
సీ. | చెఱకుఁ దోఁటలఁ జొచ్చి కొఱికి పాడొనరించి – దొరలట్లఁ బోవు పందుల గణంబు, నెండ్రకాయల కొఱ కేతెంచి గుంటిపై – మెక్కి కూసెడు గుంట నక్క గములు, బడుగు బక్కలు గాక కడుపారఁ దిని పంది – గున్నలతో రాయు గొఱియ పిండుఁ, బొలముల లేఁ బచ్చికల మేసి చియ్యచే – నిగనిగ లాడు గో నికరములునుఁ, | |
తే. | గలకలారావములు మీరఁ గలిసి జొన్న – చేలపైవ్రాలు గువ్వల చెలువుఁ, గలిగి పైరు పచ్చల నొప్పు నా పల్లె, చెఱువు – నిండి నీరంబు లొసఁగుచు నుండ నెపుడు. | 18 |
వ. | ఆ యూరి చేరువ | 19 |
మ. | చలదుత్తుంగ మహోగ్రభంగపటలీ సంఘట్టనారావ, ము జ్జ్వల కూలాగ్రనటత్తరంగవ, మంచన్మధ్యభాగ్భూమి భృ త్కులసంపాతి మహోర్మికానికర నిర్ఘోషంబునుం, గూడఁగా నలరు\న్ ఘోరసరస్సు దిగ్విదళన వ్యాపార పారీణమై | 20 |
చ. | కడవల ముంచి వంచిన ప్రకారము, మన్నును, మిన్ను నేక మ య్యెడు గతి, రేవగళ్లు నొకటే విధమొప్పఁగ, నాకసంబు తూఁ టిడెనొ యనంగ, బల్పిడుగు లెక్కడఁజూచిన రాలుచుండఁగా సుడిగొని గాలియు\న్ విసర, ౙోరని వాన లొకప్డు వచ్చిన\న్ | 21 |
శా. | ఆ లాగుంగని రెడ్లు రైతులును దా మాలోచనల్ చేసి “యే కాలం బందును నిట్టి వానల వినం గానంగ లేదెవ్వరు\న్ ఏలాగో మన మేమి చేయఁగల” మం చెంతేని భక్తి\న్ వడిం “బోలేరమ్మకుఁ బొంగలో” యనుచు సమ్మోదించి చాటించిన\న్ | 22 |
క. | నల్లని కోళ్లను బొట్టే ళ్ళెల్లరుఁ గొని మగలఁగూడి యే తెంచిరి యా పల్లియ కొమ్మలు మిక్కిలి జిల్లను నా గాలి తనులు చిలచిల వడఁక\న్ | 23 |
క. | పొంగళ్లు దిగిన తోడనె రంగుగ బలులిచ్చి, పళ్ళెరమ్ముల తళియల్ వొంగారఁగఁ, బూజారు ల నంగారిశుభాంగి వర్ణనల్ చేసిరొగి\న్ | 24 |
క. | కరిముఖ విశాఖ చండీ శ్వరభైరవ వీరభద్ర భవ్య కిరీట స్ఫుర దురు మణిగణ తేజో భరభాసిత దివ్యపాదపద్మా! కాళీ! | 25 |
గీ. | తల్లి! నీకుఁ గోటి దండంబు లర్పించి భక్తి విన్నవించు వార మమ్మ యాలకించి వేగ నాదరింపుము మమ్ము జాగు సేయుట కిది సమయ మౌనె? | 26 |
ఉ. | ఇంతకొ యింకఁ గొంతకొ యహీనతరంగ భుజాగ్ర దర్పదు ర్దాంతతఁ గట్టఁ ద్రెంచి, పటుదంత విఘర్షణపీడ మానసా క్రాంతమహోగ్రకోపశిఖి గల్గు నురుంగు మొగంబు నిండఁగా, సంతత సింహనాదము విశాల వికార శరీరముం దగ\న్ | 27 |
గీ. | రక్కసుని మాడ్కి మమ్మెల్ల నొక్క గ్రుక్క గొనఁగ మారి మసంగి నట్లెనసివచ్చు నీ చెఱువు బారినుండి మమ్మెల్ల నెట్లు శుభముగా నేలుకొందువో చూడవలయు | 28 |
క. | అమ్మా! నేఁటివఱకు మము ముమ్మరమగు కూర్మిఁ బెనిచి మురిపెంబఱ నేఁ డిమ్మాడ్కిఁ జెఱువు వాతం జిమ్మఁగ మనసెట్లు వచ్చుఁ జెప్పుము తల్లీ! | 29 |
వ. | అనునంత నాకాశవాణి | 30 |
క. | బసిరెడ్డికిఁ గడ కోడలు ముసలమ్మ యనంగనొప్పు పుణ్యాంగన తా వెస బలిగాఁ బోయిన మీ కిసుమంతయుఁ గష్టమెన్నఁడేలా కలుగు\న్? | 31 |
క. | అని తెగ నాడిన మాటలు విని విస్మయశోకతాపభృత భావముతో మనములఁ బొంగిన దుఃఖము కనుల వెడలె ననఁగ నశ్రుకణము లొలుకఁగా\న్ | 32 |
క. | మన మొండు తలఁప దైవం బున కామోదంబు లేక పోయెనుగద! బా విని ద్రవ్వఁ బోవ లేచెం బెను భూతం బనెడు మాట విశదం బయ్యె\న్ | 33 |
క. | సుదతీమణి, కడుమెత్తని హృదయంబును గలది, పసిది, యేమియెఱుఁగ, దా పదలం బడ దెన్నండును, హృదయేశుని విడిచిపోవ నెట్లోపునొకో | 34 |
వ. | అనుచు వగచు జనంబులతోఁ గొందఱు గద్గద కంఠంబున నిట్లనిరి. | 35 |
క. | హృదయముల వగలు నెగయఁగ నిది యేమిటి? వెఱ్ఱికూఁత లేలాకూయ\న్? మది నుబ్బి నీరి కుఱకక పదివేల విధాలఁజెప్ప బాల నిలుచునే! | 36 |
చ. | గుడిసెల మూఁటిఁ బీఁకికొని కొండొక చోటికిఁబోదమన్న “నీ యెడ విడనాడమీకుఁదగునే” యని పల్కదెయాపె? యయ్యయో చెడెఁజెడెఁ గార్య; మూరఁగలచెల్వము మాసెను; ముల్లుదీసి కొ ఱ్ఱడిచెను గాదె దేవి? యిఁక నయ్యెడు శోకము చెప్పఁదీరునే! | 37 |
సీ. | లేఁగ మై నాకుచు లీలమై మెడ మలం – చిన గోవుఁబిండెడు వనరుహాక్షి బొండుమల్లెలతోఁటఁ బువ్వులు గోయుచు – వనలక్ష్మి యననొప్పు వనజగంధి బీదసాదలనెల్ల నాదరించుచుఁ గూడు – గడుపారఁ బెట్టెడు కన్నతల్లి వ్యాధిబాధల నెవరైన నడల ఱెప్ప – వేయక కాచెడు వినుతచరిత | |
గీ. | బిడ్డలెల్లరుఁ దమవారి విడిచిచేరఁ – జంక నిడికొని ముద్దాడు సదయహృదయ అమ్మ! నీకిట్లు వ్రాయంగనౌనె బ్రహ్మ – కనుచు నూరివారందఱు నడలియడిలి. | 38 |
సీ. | అత్తమ్మకొంగు నన్వహము బట్టికొని తా – తిరుగుచుండును బిడ్డకరణి బాల తనవారు పెఱవార లను భేదమేలేదు – హృదయ మన్ననో యప్పుడెత్తువెన్న యేవేళఁ జూచిన నెలనవ్వులేకాని – చిడిమిడి పడ దెంత యుడుకు లున్నఁ దనముద్దుమోముఁ జూచినఁజాలు హృదయ తా – పంబెల్ల నప్పుడె పాఱిపోవు | |
తే. | నహహ! మామపైఁగలభక్తి, యాత్మవిభుని – మీదిఁ మక్కువ, మఱఁదుల మీఁదికూర్మి, ప్రజలమీఁది వాత్సల్యంబు, బ్రహ్మకైనఁ – జూప శక్యమే వేఱొక్క సుదతియందు. | 39 |
చ. | అదియును గాక ఈమె మగఁడాత్మ సహోదరుఁడట్ల మమ్ముఁజూ చు; దినముతప్పె నేనియును సువ్రతనెన్నఁడు బాయఁ; డాతఁడిం కఁదనమనంబు శోకశిఖి కాఱియ వెట్టఁగ గుండె చీలఁగా మదికొకటైనఁ దోఁప కతిమౌనముతో నొకమూలఁజేరఁడే? | 40 |
చ. | అహరహము\న్ దదుజ్జ్వల కరాబ్జకృతాఖిల సౌఖ్యపాలికా సహితుఁడు, తన్మనోవిభుఁడు, చంద్రముఖి\న్ గులకాంతఁబాసి దు స్సహతర దుఃఖ హవ్యవహ చండతరోగ్ర శిఖాపరంపరం బహువిధబాధలం బొరల, వానిఁ గనుంగొను టెట్లొ యీశ్వరా! | 41 |
వ. | అనుచు సమస్త జనంబులుఁ బురపురఁ బొక్కు సమయంబున | 42 |
గీ. | తనకుఁ గడుఁగూర్చు ప్రజలకై తాను వేగఁ బ్రాణముల్ వీడ సంతసపడియు బాల మగని నత్తను మామను మఱఁదుల మఱిఁ గలజనమ్ముల విడిచిపోఁ గాళ్లురాక, | 43 |
క. | లేనగవును గన్నీళ్ళును గా, నెద తటతటయనంగఁ గాంతుని యెదుట\న్ వానయు నెండయుఁ గలసెడు చో నొప్పెడు నభమనంగ, సుందరి నిలిచె\న్. | 44 |
వ. | నిలిచిన నతండు వచ్చిన కార్యమేమని యడుగుటయు, | 45 |
చ. | అసమచరిత్ర! భూమి, జలమందును, నగ్నిని, గాలిలోన, నా కసమున, మీకు గోచరము కానివిలే; వయిన\న్ మదీయమా నసమును నేన చెప్పఁగ వినం గడు వేడుకపుట్టెనొక్కొ మీ కు? సతుల మాటల న్వినఁగఁ గోరుట భర్తల రీతియే గదా! | 46 |
క. | అని, పూస గ్రుచ్చినట్లుగ వనితామణి దెలిపె దేవి వార్తలరీతి\న్, జనముల కష్టము చందము\న్ దన పూన్కి తెఱంగు, వినయ తత్పరమతియై. | 47 |
వ. | పిట్ట పిడుగున్నట్టుండి శ్రవణరంధ్రంబుల విదారించిన వడువునఁ గర్ణకఠోరంబులై, నిజమృదులతర హృదయ పుటవిభేదనకారణంబులగు మార్గణంబులై, వీతెంచిన యాయోషామణి భాషణంబులచేఁ దన మనంబు తామరపాకునందలి జలబిందువుం బలె నల్లలనాడ, నుల్లంబు జల్లన, మూర్ఛవోయి, కళదేఱి, యన్నిటికి నీశ్వరుండు గలండని ధృతివహించి, దీర్ఘనిశ్వాసపూరిత ముఖుండయ్యును, చలింపని యెలుంగేర్పడ నతండిట్లనియె. | 48 |
గీ. | ఎంతమంచి మాటలు పల్కితేమిచెప్ప! యింత కఠినచిత్తము నీకు నెట్లుకలిగె? తెలిసి తెలిసి నన్నిట్టులు పలుకఁ దగునె? పడఁతి! నీవు లేకున్న నే బ్రతుకఁ గలనె? | 49 |
క. | నినుమాని నిముస మేనియు వనజానన! యుండఁగలనె? ప్రతిన నెఱపఁగ\న్ జనఁదలఁచితేని, నన్ను\న్ గొనిపో నీవెంట, నిపుడ గోరిక వత్తు\న్. | 50 |
క. | అది గాని నాఁడు, సేమ మ్మొదవఁగ నీయూరు విడిచి యొండొక యెడకే గుద మది మేలుగదా మన కుఁదగ\న్ గాఁపులను గూడి గొబ్బునఁ దరుణీ! | 51 |
గీ. | నోరునొవ్వఁ బల్కఁగనేల? సారసాక్షి వినుము ననుఁ జంపినను నీకు ననువుగాఁగ నాజ్ఞయొసఁగ నేనొసఁగ; నీవలుగ వలవ దింతి నాముద్దు చెల్లింపవేని విడువ. | 52 |
వ. | అనిన నయ్యింతి చింతాక్రాంతయై, “కట్టా! యెట్టిమాటల విననయ్యెఁ! బ్రాణేశ్వరుని పలుకులు వినవిన బాలసూర్యోదయమ్మున విఱుగుమంచువోలె మన్మనోనిశ్చయము కరుగుచున్నది. ఇక నీశ్వరుఁడే నా హృదయమున ధృతినూరఁ జేయుచుండవలయు” నని చింతించి, ధైర్యం బవలంబించి, యా శుకవాణి తిన్నని యెలుంగేర్పడ నించుక కఠినంబుగా నిట్లు మందలించె. | 53 |
గీ. | ఎఱిఁగి యెఱిఁగి మీర లీరీతి వాక్రువ్వ సంతసించితిరి ప్రశస్తభంగి! మిమ్ముఁ జెప్పనేల? మీఱి నేనొడిఁ గట్టి కొన్న పాపఫలముఁ గుడువకగునె? | 54 |
ఉ. | పెద్దలనాఁటినుండి కడు వేడ్కవసించిన యిండ్లవీడుటల్ వృద్ధులఁ దల్లిదండ్రులను వీధినిడించి చనంగఁ జూచుటల్ ముద్దుల సోదరుల్ వగవ మోదముతో సతిఁగూడి పోవుటల్ గద్దఱికంబొ కాదొ మదిఁ గాంచుఁడు వేఱుగఁ జెప్ప నేటికిన్. | 55 |
శా. | హేయంబైన ప్రపంచసౌఖ్యములు మిమ్మేలాగునంగట్టె? నా థా! యత్యద్భుతమయ్యె; సంతతము నేదైవంబుగాఁ గొల్చు మీ రే యిట్లాడిన నేమిచెప్పనగు? నన్నీసారికిం “బోయిరా వే” యంచుందయఁ బంపవే; గుణనిధీ! యేనిన్నుఁ బ్రార్థించెద\న్. | 56 |
వ. | అని వెడవెడ శంకవొడమ వెండియు నిట్లనియె. | 57 |
క. | ఇది తగు నిది తగదని మీ కుఁ దెలుప రాలేదు నేను గ్రొవ్వి మహాత్మా! మది మీకుఁ గోపమయ్యెడు నదియైన నెఱుంగఁ జేయుఁ డణఁగెద నింత\న్. | 58 |
క. | అనినం జిఱునవ్వానన మున మొల కెత్తంగ నతఁడు పోలునె నీకి ట్లనఁ బల్లంతైనను నిను వనజానన! యెన్నఁడైన వారించితినే? | 59 |
వ. | అని సకరుణంబుగాఁ బలికిన నబ్బాలయుఁ బ్రత్యుత్తరంబునకొక లేనవ్వుఁ బ్రచురించి యిట్లనియె. తాతముత్తాతలనుండి తర తరంబుగ వచ్చిన యిండ్లు వాకిండ్లు విడువఁబాడికాదు. అట్లు కాదని విడిచిపోయినను మేలులేదు. | 60 |
గీ. | తిండియెట్టులు? నీళ్లెట్లు? తిరిపమునకు నమ్మరో యని యిల్లిల్లు నరుగఁ గలరె? ఎవ్వరిత్తురు నేల? మీకెట్టు లిండ్లు? చావరే పసిబిడ్డ లీసంకటముల? | 61 |
క. | నిలిచిన వారును దుఃఖం బుల మునుఁగరే? యాకలముల భుజియింతురే? వా రల కేలా యీ యిడుములు లలితంబుగఁ బంపుఁడునను లాభము కలుగు\న్. | 62 |
క. | కుడువను గట్టను దొరకక కడు వగలం బొగలు జనులఁ గాంచెదవా? యీ పుడమికి భారంబగు న న్విడనాడఁ దలంతువా? వివేకనిధానా! | 63 |
వ. | మఱియు దేవా! భవత్కృత పద్యంబులు కొన్నిగలవు. అవధరింపవలయు. | 64 |
గీ. | తనకు దేవుఁ డిచ్చిన శక్తికనుగుణముగ నన్నదమ్ములు నాఁదగు నఖిలజనుల కలఁక నేనాఁడు దీర్పంగఁ దలఁపఁడేని పుట్టనేల నరుఁడు మఱి గిట్టనేల? | 65 |
క. | జనులకు మేలొనరింపని తనువేలా? కాల్పఁదగదొ? తానొక్కండై తన వార లడల నేలా గునఁ దలయెత్తికొని తిరుఁగ గూడు నరునకు\న్? | 66 |
వ. | అని మఱియు. | 67 |
గీ. | మీరు కన్నారఁ జూచుచు గారవింపఁ గన్ను మూసికొనుట నాకు ఘనము కాదొ? తమకుఁ దమభార్య యిటుచేసెఁదగుఁదగునని యెల్ల వారును వర్ణింప నింపుకాదొ? | 68 |
వ. | కావున నాథా! ప్రసాద బుద్ధిం దేఱిచూడవేయని విన్నవించిన నా సన్నుతాంగిఁ గాంచి యతండిట్లనియె. | 69 |
క. | జనకుల నన్నల విడువం జనదనియును, నూరు విడువఁ జనదనియును, నా కెనయం దెల్పితివి గదా వనజానన! సతిని విడువ వచ్చునె చెపుమా. | 70 |
వ. | అని యుల్లసమాడి యొక్కింత చింతించి యిట్లనియె. | 71 |
గీ. | నీవు చెప్పినదెల్లను నిక్కువంబ యయిన మనమున కారాట మయ్యెఁ దరుణి యింతయే కాని యచ్చెరు వింతలేదు మున్ను తలఁచినదే నేఁడు మొనసెఁ గాన. | 72 |
క. | విను ఇచ్చకంబులాడను; జను లెల్లరు నాడుకొనెడు సంగతి; మాకం టెను నీవు నూఱు మడుఁగులు ఘనతరవని బుద్ధి భక్తిఁ గారుణ్యముల\న్. | 73 |
క. | తెలియును నాకునునీవ న్యులఁబోల వనియును, గొప్ప యొప్పిదములకు\న్ నెలవ వనియు, నే నీకుం జలజానన తగననియును సత్యము గాఁగ\న్. | 74 |
సీ. | అరుణోదయ చ్ఛాయ లాకాశ పథమున – నంభోధరముల వేటాడువేళ మార్తాండ చండాత పార్తికి ననిలముల్ – పొదరిండ్ల గుసగుసల్ వోవువేళ సాయాహ్నలక్ష్మి కసూయ కలుగు భూమి – తళుకు విరుల చీరఁ దాల్చువేళఁ బండువెన్నెల ఱేఁడు కొండపైజలజల – మని పాఱు నది తాన మాడువేళఁ | |
తే. | గల మనోహరాకృతులెల్లఁ గాంచి నీవు – చొక్కి మ్రొక్కు నిక్కుం గాంచి “యొక్కనాఁడు మమ్ము మోసపుత్తు” వటంచు మదికి నప్పు – డపుడు దోఁచు; నయ్యది నిజ మయ్యెనేఁడు. | 75 |
వ. | అనుచుఁ జెప్పుచుఁ బోవుచుండు బ్రాణకాంతునిఁ గాంచి, యయ్యో నేఁడెట్టి వియోగంబు కల్పింపఁబడె నని చింతించి, మనసున గట్టి పఱచుకొని, లేని కోపంబు మొగంబున మెఱుంగుఁదీఁగవలె వచ్చుచుఁ బోవుచుండ మందహాసకందళితసుందరవదనార విందయై యా సుందరి యిట్లని మందలించె. | 76 |
గీ. | చిఱుతనుండి మిమ్ము సేవించుటయకాని నోరు తెఱచి యడుగ నేరనెద్ది “యేమి యడుగ” వనుచు నెన్నియోమార్లు మీ రలుకఁ గొంటి; రిప్పు డడుగ, నీరు. | 77 |
గీ. | అనుచుఁ జిఱునవ్వు నవ్వి, యాతని కరంబు గేలఁ గీలించి, పెదవికి లీలనెత్తి, “పలు పలుకులేక నేఁబోయి వత్తు” ననిన మౌనముగనుండె నాతండు మాఱులేక. | 78 |
వ. | అంత నక్కాంతయు నయ్యది యాజ్ఞగాఁగొని, యంతకుఁ బూర్వమే యచ్చోటికి వచ్చి ప్రతిమలవలె నిలచి వినుచున్న యత్తమామ లకు మ్రొక్కి, మీ కుమారుని వచనంబులు వింటిరిగాదె మీ చేత ననుజ్ఞాతనైకదా పోయిరావలయును? ననినఁ గుములుచుండిన శోకాగ్ని గుప్పున ప్రజ్వరిల్ల వార లిట్లనిరి. | 79 |
శా. | కట్టా! యక్కటికంబు లేక మముఁ జక్కంజేయ మాప్రాణమౌ పట్టిం గట్టిఁడి రీతి బాల్యముననే పాపఁ బ్రయత్నించితీ వెట్టూ? యేఁట నొసంగు పొంగళుల నీ వేలాగున\న్ మ్రింగితీ? వెట్టూ నేఁటికి నెత్తిఱాయి వయితీ? వేమందుమో దైవమా! | 80 |
వ. | అని తమ కోడలి నుద్దేశించి. | 81 |
గీ. | చీకు ముసలి వారి చేయి విడనాడ నీ కెట్లు మనసు వచ్చె? నేమి చెప్ప భక్తి మాకు నింకఁ బరిచర్య సేయు వా రెవరు? చెప్పు మాకు నేది గతియొ? | 82 |
గీ. | కనులు లేని మాకుఁ గన్నును నూఁతకో లయును నీవ మా తనయులకంటెఁ గూర్తు మాకు ముద్దుకోడలా! నీవు లే నట్టి యిల్లునిల్లె? యడవిగాక. | 83 |
వ. | అనుచు. | 84 |
చ. | వెడవెడబాష్పముల్ గురియు వృద్ధజనంబులఁ గాంచి యెల్లరుం గడుపున గంపెఁ డగ్నిపడి గాసి యొనర్చినభంగి నేడ్వఁగాఁ దడఁబడ మానసంబు వనితామణిదైవమ యేమి చేయుదు\న్ గడుఁబసినాఁటఁగోలె ననుఁ గాచిన వీరిని నెట్లు వీడుదున్. | 85 |
క. | పుట్టియుఁ బుట్టక మున్నే కట్టిఁడి గతి జనని జనకుఁ గ్రమమున దైవం బట్టే మ్రింగినఁ దమ సుత నట్టుల ననుఁ బెంచిరి గద యగునే విడువన్. | 86 |
గీ. | అయిన నాచేయు కార్య మీ యఖిలమైన వారికిని, వీరికిని, శుభం బారఁజేయు వీరికై విడువక మేను పెంచి పెంచి యేమి చేయంగఁ బ్రొయిలోన నిడనెయంచు. | 87 |
వ. | తలపోసి, తిన్నని యెలుంగేర్పడ నయ్యిందువదన యిట్లని విన్నవించె. | 88 |
గీ. | కొడుకులెల్లరు రాములు, పుడమి తనయ లెల్ల కోడండ్రుఁ, దక్కువ యేమి మీకు? ఱెప్ప లక్షులఁబోలె మిమ్మెప్పగిదిని అహరహమ్మును సేవింతు; రడల నేల? | 89 |
వ. | అని వెండియు. | 90 |
ఉ. | తల్లియుఁ దండ్రియున్ గురువు దైవము లెల్లరు మీర; మీరలే చెల్లఁగనియ్యరేని యిఁకఁ జెల్లునెనాదగు పూన్కి యెచ్చట\న్? గల్లయొ సత్యమో యెఱుఁగ; గణ్యతఁదత్త్వముఁ దెల్పువేళమే నెల్లఁ బరోపకారమునకే యనిపల్కితి; రట్లు చేసెద\న్. | 91 |
సీ. | అనవిని మామ యిట్లను నమ్మ నిను దూఱ – నెంచిన వాఁడఁ గా నేను వినుము నీ వెఱుంగని దేది నే నెఱుంగుదునమ్మ – నీ యిచ్చ వచ్చినట్లే యొనర్పు మనుచు దుఃఖమ్మున నాననమ్మును వాంచి – యొండు వలను చూచుచుండెనంత నత్తగా రడలుచు నల్లన ముద్దిడి – పోయిరమ్మని పల్కఁబువ్వుఁబోణి | |
తే. | హృదయమున నగ్గలంబగు ప్రీతి మెఱయఁ – దనదు చిన్నారి పొన్నారి తనయుఁ దేరఁ బనిచి కన్నుల నొక క్రొత్త ప్రభ సెలంగఁ – జంక నిడికొని ముద్దాడి, జాలిదోఁప. | 92 |
గీ. | అన్న పోర; నీకు నమ్మ యెక్కడిదింక? తండ్రిగారిఁ గూడి తనరు మయ్య; నన్నుఁ దలఁచి తలఁచి నాయనా యడలంగ వలదు; పోయివత్తుఁబంపు తండ్రి! | 93 |
మ. | అనుచు\న్ బిడ్డనిఁ గౌఁగిలించి తమి మూర్ధాఘ్రాణముం జేసి, యొ య్యన, భద్రంబని ప్రాణనాథునికిఁ దానర్పించి యర్పించుచోఁ దనకుం బట్టక వచ్చు బాష్పముల నాతం డేడలక్షించియే డ్చునొయంచానన మొండుదిక్కునకు నాశోభాంగిచేర్చెన్వడి\న్. | 94 |
వ. | అంత మర్యాద తోఁపఁ గొంత దవ్వుల నున్న జన సంఘమ్ము నుపలక్షించి. | 95 |
గీ. | అన్నలార! మిమ్ము నడిగెద నొక చిన్న వరముఁ దప్పకుండఁ బడయఁ గోరి, కాదు గీదటంచు వాదుసేయక, గొప్ప బుద్ధిచేసి యిచ్చి ప్రోవరయ్య. | 96 |
క. | నను గాఢంబగు రాగం బునఁ, గాంచిన బిడ్డఁబోలెఁ బ్రోచిన మీకు\న్ పెనుకష్టము వచ్చెను, మీ ఋణమిప్పుడు తీర్ప బుద్ధి కెంతయుఁ దోఁచె\న్. | 97 |
చ. | అని మఱుమాటలాడక నిజానన ముర్వికి వంచి, మానసం బున శివునెంచి, దేవ! శుభమూర్తి! భవత్కృప నాయఘంబు లె ల్లనుమటుమాయమయ్యెఁ బ్రజల\న్ దయఁ జూడుము పార్వతీపతీ చనువున నన్ను నేలుమని స్నానము సేయఁగనేగె గ్రక్కున\న్. | 98 |
క. | లలనా శిరోలలామం బలరుచుఁ బసుపునను జలకమాడి తలిర్చె\న్ దలమీఁది చెట్లు కురిసిన లలితసుమ పరాగమున వెలయు లతికయన\న్. | 99 |
మ. | ఉరు హారిద్రపుఁజీరసాంధ్యరుచిగా నొప్పార, నానందవి స్ఫురితంబైన మొగంబు రక్తమయమై సూర్యప్రభంబోల, శో క రసాధీనజనాళి పుల్గుల క్రియం గాంక్ష\న్ మొఱల్ వెట్టఁ దా సరసీరాజమహాబ్ధికై చనియె విస్ఫారీభవన్మూర్తియై. | 100 |
గీ. | అశ్వపాలుండు గొనిపోవ నల్లబాఱు నదినిగాంచి, మనోహర నాట్యమొప్ప మెల్లమెల్ల నొయారంబు మీఱఁ గదియు బాల హరి లీల జనులతోఁ బడఁతియరిగె. | 101 |
వ. | అంత నంతరంగ ధ్యానాధిక్యంబునం జేసి. | 102 |
మ. | తన దేహంబును, భూమియు\న్, దివము, మార్తాండుండు, నాశాచయం బును, వృక్షమ్ములుఁ, బక్షులుం, బ్రజలునుం, భూధ్రంబులు\న్, సర్వ ము\న్ దనకుం దోఁపవ; యెందుఁ జూచిన నుదాత్తంబైన తద్భక్తికా రణమైయొప్పఁగఁదోఁచు శంకరజలప్రాయాంగసాంద్రద్యుతుల్. | 103 |
సీ. | కన్నెఱ్ఱవారిన ఖరకరోదయకాల – మల్లనమ్రింగు జాబిల్లియనఁగ జ్వలదగ్ని శిఖలపై నెలనవ్వుతోఁ బోవు – ధాత్రీ మహాదేవి తనయ యనఁగ కెందామరలబారు సుందరమగు లీల – నల్లనల్లనఁ జొచ్చు నంచ యనఁగ కాల మహాస్వర్ణ కారకుం డగ్నిలోఁ – గరఁగించు బంగారు కణికయనఁగ | |
గీ. | ప్రళయ కాలానల ప్రభాభాసురోగ్ర – రంగ దుత్తుంగ భంగ సంవ్రాతములకుఁ గలఁక నొందక, దరహాస మలర, మంద – మందగతిఁ బోయి, చొచ్చె నమ్మగువ నీట. | 104 |
గీ. | ఇచట నస్తమించి యినుఁడు పశ్చిమగోళ మందు వెలుఁగు గాదె> యట్టెదేవ భువనముననుఁ బొలుచు ముసలమ్మ యాంధ్రభా షాభిరంజనిం దయఁగనుఁ గాత. | 105 |
మ. | శివమై, చిన్మయమై, యఖండమయి, యర్చిష్మంతమై, నిత్యమై, భవపాథోనిధినావయై, మునిజనప్రాణంబునై, యద్భుతా ర్ణవమై, నామవికారరూపరహిత ప్రాశస్త్యమై, వెల్గు వి ష్ణు విరించీశ్వరనాథతత్త్వము మమున్ శోభిల్లఁగాఁ జేయుత\న్. | 106 |
మ. | ఇది కట్మంచి నివాసుఁ, డార్యజన మైత్రీచ్ఛాభిరాముండు, ధ ర్మదయాశోభిత పాకనాటికుల సుబ్రహ్మణ్య పుత్త్రుండు, దు ర్మదదూరుండును, ప్రీతబంధుఁడవు రామస్వామికి\న్ స్వీకృతుం, డుదితామోదముమై రచించె విహితప్రోత్సాహ సాహాయ్యుఁడై. | 107 |