పేరు (ఆంగ్లం) | Suddala Hanumantu |
పేరు (తెలుగు) | సుద్దాల హనుమంతు |
కలం పేరు | – |
తల్లిపేరు | లక్ష్మీనరసమ్మ |
తండ్రి పేరు | బుచ్చిరాములు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 12/10/1910 |
మరణం | 10/10/1982 |
పుట్టిన ఊరు | నల్లగొండ జిల్లా మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | హనుమంతు పాటల్లో యతిప్రాసలు అచేతనంగా పడేవి. పల్లెటూరి పిల్లగాడ (మాభూమి), రణభేరి మ్రోగింది తెలుగోడ, వేయ్ వేయ్ దెబ్బ, ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, కన్నులో భగా భగా కడ్పుల్లో ధడా ధడా, భళిరె తెలంగాణ వహరె తెలంగాణ ఇలా ఎన్నో పాటలు ఆయనకు పేరు తెచ్చాయి. హనుమంతు రాసిన 22 పాటల పుస్తకం సాహితీ సర్కిల్ వారు ప్రచురించారు. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | సుద్దాల హనుమంతు ఒక సుప్రసిద్ధ ప్రజాకవి. కవిగా, కళాకారుడిగా, అంతకుమించి క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టుగా జీవితమంతా కష్టజీవుల కోసం, కమ్యూనిస్టు ఉద్యమం కోసం అంకితం చేసిన వ్యక్తి. తెలంగాణ జాతి యావత్తుని తన కవితలతో మేల్కొలిపిన మహా కవి సుద్దాల హనుమంతు. ఆయన కవితలో ఆవేశం ఉంటుంది. ఆ అర్థాల్లో ఆలోచన ఉంటుంది. ఆ భావాల్లో సామాజిక స్పృహ ఉంటుంది. సామాజిక స్పృహతో ఆవేశంగా అర్థవంతంగా చేసే ఆలోచనే సుద్దాల కవిత. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | సుద్దాల హనుమంతు |
సంగ్రహ నమూనా రచన | – |
సుద్దాల హనుమంతు
నిజాం కాలంలో వెట్టిచాకిరీ చేయిస్తున్న రోజులవి. ఒక రోజు బరువంతుల మనిషి కోసం మాదిగ వాడలోకి నిజాం జవాన్లు వచ్చారు. ఆ గుర్రపు డెక్క ల చప్పుడు ఒక గుడిసె ముందు ఆగింది. ఆ గుడిసె పాపయ్యది. తోలు కప్పుకున్న అస్థిపంజరం వంటి ఆ వ్యక్తి బయటికి వచ్చి ‘దొరా నాకు జ్వరం. కాలు మొక్కుతా నీ బాంచన్. ఒలశన్ని రోజులాయె ఇంత గంజి తాగి’ అంటూ డొక్క చూపి ఆ జవాను పాదాలపై పడితే నిర్దాక్షిణ్యంగా తన్ని..‘అరే బద్మాష్, ఆరం జాదే నఖ్రే కర్తా’ అంటూ తన్నుకుంటూ వీధు ల్లో ఈడ్చుకుంటూ ఆ మనిషిని వెట్టికి తీసుకెల్తుంటే అక్కడే గుంపులో ఉన్న ఒక వ్యక్తి కండ్లు ఎర్రబడ్డయి. పండ్లు పటపటమన్నయ్..
‘వెట్టి చాకిరీ విధానమో రైతన్నా
ఎంత జెప్పిన తీరదు కూలన్నా
మాదిగన్న మంగలన్న మాలన్న చాకలన్న
వడ్రంగి వడ్డెరన్న వసి మాలిన బేగరన్న
కుమ్మరన్న కమ్మరన్న కూలన్న రైతన్న
అన్ని పనులు వాళ్ళతో దొర
లందరు చేయించుకొనెడి /
అంటూ ప్రజల దీన గాథలను వివరిస్తూ ప్రజల్లోకి ఒక గొంతుక చొచ్చుకొచ్చింది. ఆ గొంతుకే పల్లెటూరి పిల్లగానిది. సుద్దాల హనుమంతుది. సుద్దాల హనుమంతుది ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా రామన్న పేట తాలూకా పాలడుగు గ్రామం. తండ్రిపేరు గుర్రం బుచ్చిరాములు. తల్లి లక్ష్మీ నరసమ్మ. వీరికి ఆరుగురు సంతానం. నలుగురు మగ, ఇద్దరు ఆడ పిల్లలు. అందరిలో చిన్నవాడు హనుమంతు.
1944వ సంవత్సరంలో పదకొండవ ఆంధ్ర మహాసభ భువనగిరిలో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగినపుడు వాలంటీర్‌గా ఉన్న హనుమం తు ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీలో కళారంగ బాధ్యతలు తీసుకున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా తన కలానికి, గళానికి పని చెప్పాడు.
చాలీ చాలని చింపులంగి
సగము ఖాళీ చల్లగాలి
గోనె చింపు కొప్పెర బెట్టావా
ఓ పాల బుగ్గల జీతగాడా
దానికి చిల్లుపూన్నో లెక్క బెట్టావా..
అంటూ పల్లెటూరి పిల్లగాని ఆర్ద్రత, ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష ఇందులో దర్శనమిస్తాయి.
ఎన్నికలొచ్చిన సందడి వింటే
ఎత్తరుగులపై పెత్తందారులు
అన్ని విధంబుల ప్రజల దోచుకొని
అందలమెక్కిన మహానుభావులు
తరతరాలుగా సాగుతు వచ్చిన
తమ దోపిడీకిక తావే లేదని
కరణం మునసబుగారలు చేతి
కర్రలు దించి అర్రలు చాచి
తమ తొత్తులతో బోర్డుల నింపాలని
తంటాపూన్నో పడుతున్నారు
జాగరుతోయ్ జాగరత
హెచ్చరికోయ్ హెచ్చరిక
ఓ… కార్మిక కర్షక సోదరులారా
జాగరతోయ్ జాగరత..
అంటూ కర్తవ్య బోధ చేసినాడు హనుమంతు తన సాహిత్యంలో.
ఎన్నో ఆశలతో చమటోడ్చి
దున్నుకున్న బంజరు భూమి
కన్ను గట్టి మాయలు బన్ని
తన్ని గుంజుకునే భూస్వామి
అన్నా నీవు కన్న కలలు
అన్ని వ్యర్థమాయ గదో వ్యవసాయ కూలీ //రావోయి //
ప్రజల దుస్థితికి కారణం ఆనాటి నిజాం ప్రభుత్వంలో భాగస్వామ్యమైన జమీందార్,జాగీర్దార్ వ్యవస్థే. అందుకే ఆ వ్యవస్థ పైనే తన ఆట, పాటల ద్వారా విల్లు ఎక్కు పెట్టినాడు.
పలు విధంబుల కుట్రపూన్నో
పన్ని ప్రజల నోళ్ళు కొట్టి
కౌలుదారుల చేసి రైతుల
పొలమునంతా బుక్క పెడ్తిరి
ఓట్ల కొరకై నోట్లు పంచి
వసుధ ప్రజలను మోసగించి
సీట్ల కొరకై సిగ్గు విడిచి
సిగలు సిగలు పట్టుకుంటిరి
ఔనంటారా ఇది
కాదంటారా ఇది
ఏమంటారోయ్
చిందొరా పెద్దొరా ?
అంటూ ప్రశ్నించినాడు సుద్దాల హనుమంతు.
భూమికై, భుక్తికై, బానిస ప్రజా విముక్తికై సమసమాజ స్థాపనకై స్వాతంత్య్ర సముపార్జనకై విజయ ఢంకా ధ్వానమై మోగిన స్వేచ్ఛాగ్ని వీణా రుద్రగానం తెలంగాణ సాయుధ పోరాటం. ఈ మహోద్యమానికి బాటలు వేసింది ప్రజా గొంతుక సుద్దాల హనుమంతు.
ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం
ప్రజా ప్రభుత్వం సాధిస్తాం
నిజాములో ప్రతి బజారులో మా
ధ్వజం ఎర్రనిది ఎగరేస్తాం
అంటూ నిజాం ప్రభువుపై తన పాటల ఈటెను గురిపెట్టిన తెలంగాణ తొలి ప్రజా కవి సుద్దాల హనుమంతు. సుదీర్ఘకాలం ప్రజల పోరాటాన్ని గానం చేసిన ఈ గొంతు 1982 అక్టోబర్ పదవ తేదీన క్యాన్సర్ బారిన పడి మూగ బోయింది.
-కందుల శివకృష్ణ
———–