పేరు (ఆంగ్లం) | Kosaraju Raghavayya Chowdary |
పేరు (తెలుగు) | కొసరాజు రాఘవయ్య చౌదరి |
కలం పేరు | – |
తల్లిపేరు | లక్ష్మమ్మ |
తండ్రి పేరు | సుబ్బయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 09/03/1905 |
మరణం | 10/27/1986 |
పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా, బాపట్లదగ్గర అప్పికట్ల |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | “సరదా సరదా సిగరెట్టు” , “అయయో చేతులొ డబ్బులు పోయెనే, అయయో జేబులు ఖాళీ ఆయెనే”, “భలే ఛాన్సులే భలే ఛాన్సులే ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే”, “చవటాయను నేను వట్ఠి చవటాయను నేను” |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | జానపద కవి సార్వభౌమ, కవిరత్న |
ఇతర వివరాలు | పేరు కొసరాజు, తెలుగంటే పెద్దమోజు అని స్వయంగా ప్రకటించుకున్నాడు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు తొలిసారిగా కొసరాజు మద్రాసు చేరుకొని కమ్మవారి చరిత్ర పరిశోధన చేపట్టారు. 1938లో గూడవల్లి రామబ్రహ్మం రైతుబిడ్డ సినిమా లో కొసరాజు కొన్ని పాటలు రాయడమేకాక నటించారు యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళపాటలు, గంగిరెద్దుల గీతాలు ఎన్నో రాశారు. తెలుగుభాషకి జరుగుతున్న అన్యాయాన్ని గురించి సంస్కృతము కొరకు చలపట్టునొక్కండు, హిందియనుచు గంతులిడు నొకండు, తెలుగు కొరకు నేడ్చు ధీరుండు కరువయ్యె…’ అన్నారు |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కొసరాజు రాఘవయ్య చౌదరి |
సంగ్రహ నమూనా రచన | – |
కొసరాజు రాఘవయ్య చౌదరి
అచ్చ తెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెటూరి భాషలోని చమత్కారాలు, విరుపులు రాఘవయ్య పాటలలో జాలువారుతాయి. మూడున్నర దశాబ్దాల కాలం ఆయన రాసిన పాటలు తెలుగు సినిమా ప్రేక్షకుల మనసుల్ని దోచాయి.
సినీ రంగంలో ‘కొసరాజు’గా ప్రసిద్ధి చెందిన తెలుగు సినిమా పాటల రచయిత స్వర్గీయ కొసరాజు రాఘవయ్య చౌదరి గుంటూరు జిల్లా, బాపట్ల తాలూకా (ప్రస్తుతం కర్లపాలెం మండలం) చింతాయపాలెం గ్రామంలో సుబ్బయ్య, లక్ష్మమ్మ పుణ్య దంపతులకు 1905, జూనలో మాతామహుల ఇంట జన్మించారు. వీరి స్వగ్రామం అప్పికట్ల. ఆ గ్రామంలో నాలుగో తరగతి వరకు మాత్రమే చిన్న వీధి బడి ఉండేది. ఆ వీధి బడిలో నాల్గవ తరగతిలో ఉత్తీర్ణుడై, చేసేదేమీ లేక తిరిగి నాల్గవ తరగతిలోనే చేరాడు. రాఘవయ్య చిన్న వయస్సులోనే సాహిత్యాన్ని వంటపట్టించుకున్నాడు.
తన తల్లి మేనమామగారైన వెంకటప్పయ్య గొప్ప పండితులు. ఆ వంశంలో ఉన్న సాహితీ రక్తం రాఘవయ్యగారిలోను ప్రవహించి ఆయన రచనా వ్యాసంగానికి గట్టి పునాది వేసింది. వీధి బడిలో ఉండగానే ఆయన ‘బాల రామాయణం’, ‘ఆంధ్రనామ సంగ్రహం’ వంటి గ్రంథాలు క్షుణ్ణంగా చదివి ఆ సారాంశాన్ని అర్థం చేసుకున్నాడు. అదే గ్రామంలో నివసిస్తున్న పండితుడు, విమర్శకుడు అయిన కొండముది నరసింహం ప్రోత్సాహంతో ఆయన భజన పద్ధతిలో రాసిన రామాయణం ప్రదర్శనలో కొసరాజు రాముడి పాత్ర ధరించి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. కొసరాజు కంఠం చాలా శ్రావ్యంగా ఉన్నందున, నరసింహం ఆయనకు మాటా, పాటా నేర్పాడు. పొలాలగట్ల మీద కొసరాజును కూర్చోబెట్టి సంస్కృతాంధ్ర భాషలు నేర్పడమే కాకుండా, సాహిత్య సభలకూ తిప్పాడు. ఈ సాహిత్య సాంగత్యం మూలంగా తన 12వ ఏటనే కొసరాజు అష్టావధానాలు చెయ్యడం ఆరంభించి, బాలకవిగా బిరుదు పొంది, ఆనాటి ‘రైతు’ పత్రికలో సహాయ సంపాదకునిగా చేరారు. ఆయనకు స్కూలు, కళాశాల చదువులు లేక పోయినా, అవి ఉద్యోగానికి ఏమాత్రం అడ్డం రాలేదు. తెలుగు సాహిత్యం, పురాణాలు, కావ్యాలపై పట్టు సాధించి, తనకు వరుసకు పెదనాన్న అయిన త్రిపురనేని రామస్వామి చౌదరి వద్ద అచ్చ తెలుగు నుడికారం, తర్కవితర్కాలు, తెలుగు భాష సౌందర్యం తెలుసుకున్నాడు.
నరసింహం పంతులు, రామస్వామి చౌదరిల సాంగత్యంతో తన భాషా పటిమకు మెరుగులు పెట్టాడు. అదే సమయంలో రైతు బిడ్డగా తమ పొలం పనులలో నిమగ్నమై జానపదుల తెలుగులోని సొగసులు, చమత్కారాలు తెలుసుకున్నాడు.
1950లో జమీన్ రైతు ఉద్యమం మొదలైన తరువాత కొసరాజు రైతును సమర్థిస్తూ ఎన్నో పాటలూ, పద్యాలు రాసి సభల్లో పాడి రైతుల మన్ననలు పొందాడు. అదే సమయంలో ఆయన ‘కడగండ్లు’ అనే పుస్తకాన్ని రాసి ఆ పుస్తకానికి పీఠిక రాయమని ఎందరో సాహితీ వేత్తలను, రాజకీయ వేత్తలను అర్థించినా, బహుశా జమీందార్లకు భయపడి ఎవరూ ముందుకు రాలేదట. చివరకు ప్రముఖ పత్రికాధిపతులైన కాశీనాథుని నాగేశ్వరరావు ఆ పుస్తకానికి ఉపోద్ఘాతం రాశారు. అచ్చయిన తరువాత ఆ పుస్తకం అందరి ప్రశంసలు పొందటమే కాకుండా ఆయనకు ‘కవిరత్న’ అనే బిరుదును సాధించిపెట్టింది.
సాహితీ పోషకులు, కళా ప్రియులు ఆనాటి గుంటూరు జిల్లా బోర్డు అధ్యక్షులు జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి సలహా మేరకు మద్రాసు చేరుకుని, వారు అందించిన ఆర్థిక సహాయంతో కమ్మవారి చరిత్ర రాయటానికి తమిళనాట అనేక వూళ్ళు తిరిగి ఎంతో సమాచారాన్ని సేకరించారు. కొసరాజు గారు యక్షగానాలు, వీధి బాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు భజన గీతాలు, పగటి వేషగాళ్ళ పాటలు, పాములోళ్ళ పాటలు, గంగిరెద్దుల గీతాలు మొదలైన రచనలెన్నో చేశారు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి ద్వారా కొసరాజుకి సినిమా రంగానికి చెందిన గూడవల్లి రామబ్రహ్మం, సముద్రాల రాఘవాచార్యుల గార్లతో ఏర్పడిన పరిచయం ఆయన చిత్రసీమలో అడుగుబెట్టటానికి కారణమైంది. అప్పటికే రైతు ఉద్యమం మీద పాటలు రాసి, ఆంధ్ర రాష్ట్ర రైతాంగాన్ని ఒక ఊపు ఊపుతున్న కొసరాజు చేత రామబ్రహ్మం సినిమాలకు పాటలు రాయించసాగారు. తాపీ ధర్మారావు, త్రిపురనేని గోపీచంద్ మాటలు రాయగా కొసరాజు పాటలు రాశారు.
కొసరాజు తొలుత 1939లో కథానాయకునిగా రైతుబిడ్డ అనే చిత్రంలో నటించాడు. రైతు బిడ్డ చిత్రం విజయవంతం కాక నిర్మాతకు నష్టాన్నే మిగిల్చింది. రైతుబిడ్డ చిత్రం తరువాత కొసరాజు తన స్వస్థలం వెళ్ళిపోయి వ్యవసాయంతో పాటు సాహితీ వ్యవసాయం చేయటం మొదలు పెట్టాడు. మళ్ళీ పదమూడేళ్ళ తరువాత డి.వి.నరసరాజు సూచనతో, ప్రముఖ నిర్మాత కె.వి.రెడ్డి వీరిని తాను నిర్మించబోయే పెద్ద మనుషులు చిత్రానికి పాటలు రాయటానికి మద్రాసు పిలిపించారు. 1954లో విడుదలైన పెద్దమనుషులు చిత్రానికి కొసరాజు రాసిన పాటలు ఆంధ్రదేశ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
తెలుగు సినిమా పాటల రచయితగా కొసరాజుది ప్రత్యేక శైలిగా వుండేది. ఆ రోజుల్లో చాలా చిత్రాలు కొసరాజు ముద్రను బాగా వాడుకున్నాయి. వ్యంగ్యం, హాస్యం మేళవించిన పాట ఒకటైనా తమ సినిమాలో వుండాలని ఎందరో దర్శకులు కోరుకునేవారట. అది రాఘవయ్య చౌదరిగారే రాయాలి అని ఆనాటి సినిమా వారికి ఒక సూత్రం వుండేదట. ఆ సూత్రానికి తగినట్లుగానే కొసరాజు వందలాది గీతాసుమాల్ని గుచ్చి ప్రకాశ పరిమళ భరితం చేశారు. జానపద గీతాలలోని లాలిత్యాన్ని, ఆ పొగరూ, వగరూ ఏ మాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది. రోజులు మారాయి చిత్రంలో ఆయన రాసిన ఏరువాకా సాగాలో రన్నో చిన్నన్నా నీ కష్టమంతా తీరునులే అన్నా, చిన్నన్నా అంటూ వ్యవసాయ దారులకు ఉత్సాహం నింపుతూ, వారికి ధైర్యం నూరిపోసిన పాట ప్రతివూరిలోను మార్మోగి రాఘవయ్య పేరు ప్రతిష్టలను ఇనుమడింప చేసింది.
అచ్చ తెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెటూరి భాషలోని చమత్కారాలు, విరుపులు రాఘవయ్య పాటలలో జాలువారుతాయి. మూడున్నర దశాబ్దాల కాలం ఆయన రాసిన పాటలు తెలుగు సినిమా ప్రేక్షకుల మనసుల్ని దోచాయి. తెల్లటి ఖద్దరు బట్టలతో నిజమైన రైతు బిడ్డ సౌమ్య భాషణతో అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. ఆయనకు జానపద వరసలు తెలుసుగనుక అలాంటి వరసల్లోనే పాటలురాసి తన వరసలోనే పాడితే, కొందరు సంగీత దర్శకులు ఆ వరసల్నే తీసుకుని, మెరుగులు దిద్దేవారట, మొత్తం మీద తన పాటల్లో ఒక వంక సున్నితమైన హాస్యాన్ని రుచిచూపిస్తూ మరో వంక దురాచారాల్ని, దురలవాట్లని చమత్కారం, అవహేళన మేళవించి ఎత్తి చూపించాడు. కొసరాజు సినీ గీతాలేకాక ‘గండికోట యుద్ధము’ అనే ద్విపద కావ్యం, ‘కడగండ్లు’ అనుపద్య సంకలనం రాశాడు. ‘గండికోట యుద్ధము’ అనే ద్విపదకావ్యంలో ఆ కోటను 300 సంవత్సరాలు విజయనగర సామ్రాజ్యపు సామంతులుగా పరిపాలించిన పెమ్మసాని వారి వంశాన్ని, వారి ఔదార్యాన్ని, వీరత్వాన్ని, పెమ్మసాని వారికి సాయపడిన ఇతర 65 కమ్మవంశాలను ప్రస్తావించారు. కొసరాజు రాఘవయ్య చౌదరి అనేక అవార్డులు, రివార్డులు బహుమతులు అందుకున్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం అత్యంత గౌరవ పురస్కారమైన రఘుపతి వెంకయ్యనాయుడు పురస్కారాన్ని వీరు తెలుగు సినిమాకు చేసిన సేవలకు 1984లో ప్రదానం చేసింది. ఈయనను తెలుగు ప్రజానీకం ‘జానపద కవి సార్వభౌమ’ ‘కవిరత్న’ అనే బిరుదులతో సత్కరించింది.
———–